Say Yes (1985)
Tobias Wolff (19.06.1945 – )
అమెరికన్ రచయిత టొబయాస్ వుల్ఫ్ రాసిన ‘సే ఎస్’ కథని ఇక్కడ చదవవచ్చు:
తెలుగు:
ఈసారి తీసుకున్న కథ విమర్శల పరంగా కథని విశ్లేషించడానికి కాదు. జాతివివక్ష అనే సమకాలీన ఆందోళనల నేపథ్యంలో, అలాంటి మౌలికమైన అంశాన్ని కథలో ఇముడ్చుకొని, మానవసంబంధాల మీద వ్యాఖ్యానం చేసిన ఒక మంచికథ గురించి ఈ వ్యాసం.
జాతివివక్ష అనేది బయటకి ప్రస్ఫుటంగా కనిపించే ఈ కథ నిజానికి దానిగురించి కాదు. ఆ అంశం ఆధారంగా మానవసంబంధాలలోని బోలుతనాన్ని బహిర్గతపరచడం కథ తాలూకు లక్ష్యం. పైకి మామూలుగా కనిపించే సంబంధాలలో వైరుధ్యాల అంతర్వాహిని ఎలా ఉంటుందనేది రేఖామాత్రంగా చూపిస్తుందీ కథ.
హెమింగ్‌వే రాసిన ‘హిల్స్ లైక్ వైట్ ఎలిఫెంట్స్’ కథ చదివారా? మగపాత్ర సాధారణమైన విషయాలని గంభీరంగా, అక్కరతో చర్చిస్తున్నట్టు ఫీలవుతుంటే, స్త్రీపాత్ర ‘అయితే ఏంటిట’ లాంటి ప్రశ్నలతో ఆ గాంభీర్యాన్ని అడ్డుకోవడమే కాకుండా, తను స్థిరంగా నిలబడగలనని చూపిస్తుంది. ఈ కథ చదివినప్పుడు ఆ కథలోని పాత్రలు ఒకసారి కళ్లముందు మెరిసి మాయమవుతాయి.
రేమండ్ కార్వర్ తరహా మినిమలిజంతో రాసిన రచయితల్లో టొబయాస్ వుల్ఫ్ ఒకరు. అతను రాసిన అలాంటి చాలా కథలకి ఈ కథ ఒక మచ్చుతునక. మనలోపల అణగారిపోయి ఉన్న అస్పష్టమైన ఏవో భావనలకి కథలు ఒక రూపాన్నిస్తాయంటారు టొబయాస్ వుల్ఫ్. మామూలు మనుషులు, మామూలు నేపథ్యం, సాహిత్యభాషలో కాకుండా సన్నివేశానికీ ఘర్షణకీ తగిన భాషలో సంభాషించే పాత్రలు, పాత్రల గురించి సూచనప్రాయంగా తప్ప మనకు సమగ్రంగా తెలియకపోవడం- ఈ లక్షణాలన్నీ ఈ కథలోనూ చూడవచ్చు. కార్వర్ కథల్లో మాదిరిగానే, ఒక చిన్న సంభాషణ ఘర్షణకి దారితీసి, దాన్నుంచి విడివడి చూడవలసిన కొన్ని సూత్రాలని చూపీచూపనట్టు చూపించడం గమనించవచ్చు. జాతివివక్ష అనే అంశం మీద ప్రారంభమైన ఘర్షణ కేవలం ఒక సాకుగా మిగిలిపోయి- మనుషుల మధ్య, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అవగాహన మీద వెలుతురు ప్రసరింపజేయడం ఈ కథలోని విశేషం. అలాగని, జాతివివక్ష గురించి సామాన్యాభిప్రాయాలని కథ వెల్లడించదని కాదు. కథ ఫోకస్ వేరేచోట ఉండటమే అసలు సంగతి.
“ఆపేక్ష ఉందని చూపించడానికి ఒక మార్గంగా అంట్లు తోమడంలో సహాయం చేయడం అతను ఎంచుకున్న పద్ధతి.” – కథ మొదట్లోనే అతని డొల్లతనాన్ని బయటపెట్టే వాక్యం ఇది. అతనికి ఆపేక్ష ఉందో లేదో కానీ, దాన్ని “చూపడానికీ”, ప్రదర్శనకి పెట్టడానికీ సాధనాలున్నాయి. “ఇలాంటి వివాదంలోకి ఆమె తనని లాగేలా చేసినందుకు కొంచెం సిగ్గుగా అనిపించింది.”- ఈ వాక్యంలో అతని పశ్చాత్తాపం ఉన్నా, ఈ వివాదం ప్రారంభం కావడానికి ఆమే కారణం అన్న నిందకూడా ఉంది.
“వాళ్ల సంస్కృతినుంచి ఒక మనిషి, మన సంస్కృతినుంచి ఒక మనిషి ఒకళ్లని ఒకళ్లు నిజంగా తెలుసుకోవడం ఎప్పటికీ జరగదు.” అని భర్త అంటాడు. ఒకే సంస్కృతి అయితే మాత్రం, ఒకరికొకరు సంపూర్ణంగా అర్థమైపోతున్నారా? మరి ఒకే నేపథ్యం ఉన్న ఈ ఇద్దరి సంగతేమిటి? ఈ కథలోని ఐరనీ అదే. మనకు బాగా తెలుసనుకున్న మనుషులు కూడా మనకి తెలియనివారై ఉండవచ్చు. అంతదాకా కూడా ఎందుకు? “ఇప్పుడిక తనూ ఉదాసీనంగా ఉండటం తప్పించి మార్గాంతరం లేదు.” అని భర్త ఎప్పుడైతే అనుకుంటాడో, అప్పుడే అతనిగురించి అతనికే తెలియని కొన్ని అంశాలు ఉన్నాయని అర్థమవుతుంది. తమ మధ్య చాలా అవగాహన ఉందనే స్వాభిప్రాయంలో ఉన్న భర్త, ఒక చిన్న సమస్య ఎదురైతే దానికి ప్రతీకారం ఎలా తీర్చుకోవాలా అని ఆలోచిస్తున్నాడన్న విషయం అతనికి తట్టలేదు. ఆమె ఆఫ్రికన్-అమెరికన్ అయిన పక్షంలో పెళ్లిచేసుకుని ఉండను అని చెప్పడం ద్వారా అతనికి వ్యక్తిగా ఆమె ఏమాత్రం ముఖ్యమో మనకి అర్థమవుతుంది. ఉపరితల చర్మపురంగుని దాటి అతని ప్రేమ అసలు లోపలికి ప్రసరించిందా అన్న అనుమానం మనకి వస్తుంది కానీ, అలాంటి అనుమానం అతనికి వచ్చినట్టు కనిపించదు.
యాన్ మాత్రమే ‘ప్రేమ’ అనే పదాన్ని ఉపయోగిస్తుంది. “నేను నల్ల అమ్మాయిని, ఎవరితోనూ తిరగడం లేదు అనుకుందాం. మనం కలుసుకున్నాం, ప్రేమలో పడ్డాం.” అని అడగడంలో ఆమె ఉద్వేగాన్ని పట్టించుకోని అతను “నువ్వు నల్ల అమ్మాయివే అయితే, నువ్వు నువ్వు కాదు,” అంటాడు. అతనికి, తనకి తెలిసిన యాన్ అనే భావనే ముఖ్యం; ఆమెను ప్రేమించడం కాదు.
భార్య మొహంలో మారుతున్న భావాలని భర్త గమనించడమే కాకుండా, దాన్ని గుర్తుపడతాడు. ఇలాంటి పరిస్థితులు గతంలో ఉత్పన్నమయ్యాయనీ, ఇది కేవలం మరో పర్యాయమేననీ రచయిత గుంభనంగా చేసే సూచన అది. గమనించవలసినది ఏమిటంటే, భర్త ఆ మార్పుని గమనించినప్పటికీ తన ధోరణి ఏమాత్రం మార్చుకోడు. పైగా, “ఇంకా ఎక్కువ మాట్లాడటం మొదలుపెట్టాడు.”
అసలు, భార్యని ఆ భర్త సంపూర్ణంగా అర్థం చేసుకుని ఉన్నవాడయితే, ఆమె అపరిచితురాలు అన్న భావన అతనికి కలిగేది కాదు. అలా కలగడం అన్నది, అతను భార్యని ఏమాత్రం అర్థం చేసుకున్నాడో అన్యాపదేశంగా తెలియజేస్తుంది.
***
సర్వసాక్షి కథనంలా (పాత్రల అంతరంగ ఆవిష్కరణ చేయడం) కాకుండా, పరిమితమైన ప్రథమపురుష దృష్టికోణంలో సాగే ఈ కథ, భర్త పాత్రని ఎక్కువగా అనుసరిస్తుంటుంది. చాలా జాగ్రత్తగా రాసిన సంభాషణల వల్ల, ఆ భర్త పాత్రకి తనగురించి తనకి అర్థమయ్యేదానికంటే మనకే అతనిగురించి ఎక్కువగా అర్థమవుతున్నట్టు అనిపిస్తుంది. పాత్రల అంతరంగాలని విప్పిచెప్పడం ద్వారా పాత్రలని పరిచయం చేయడం టొబయాస్ వుల్ఫ్ పద్ధతి కాదు. వాళ్ల ఆత్మలని చూపించే దిశగా సంభాషణలు, చర్యలద్వారా ఒక కిటికీని మనకోసం ఏర్పాటు చేయడం వరకే రచయిత చేస్తాడు. మన శక్తిమేరకు మనం తొంగిచూడవచ్చు. కథని చెప్పడమా (telling), లేక చూపడమా (showing) అనే సంప్రదాయకమైన వివాదం ఒకటుంది. వాటిల్లో ఇది కథని “చూపే” పద్ధతి. రచయిత కథలోకి చొరబడి చేసుకునే జోక్యం దాదాపుగా ఉండదు. దీనివల్ల, కథలో పాఠకుడు పాలుపంచుకోవడం ఎక్కువగా అవసరం అవుతుంది.
***
ఈ కథలోని భర్త, భార్యనుంచే కాకుండా తననుంచికూడా తాను చాలా దూరంగా జరిగాడు. వ్యక్తి కాకుండా, వ్యక్తి రంగు ముఖ్యమని ఎప్పుడైతే అతనికీ, భార్యకీ, మనకీ స్పష్టమైందో- అప్పుడే అతను భార్యకి ఎంత దూరంలో ఉన్నాడో అర్థమవుతుంది. అంతే కాకుండా, అతను తననుంచి కూడా తను విడివడిపోయి బతుకుతున్నాడు. కథ చివర్లో అతనికి రెండు రకాల గుండెచప్పుళ్లు అనుభవంలోకి వస్తాయి. చీకటిగదిలో భార్య తిరుగుతున్నప్పుడు తొలిసారి భార్యని కలిసినప్పుడు కలిగిన అలజడి అతనికి మళ్లీ కలిగింది. అలానే, ఇంట్లో చీకట్లో ఎవరో అపరిచితుడు తచ్చాడుతున్నప్పుడు కలిగే అలజడి కూడా కలిగింది. వీటి అడుగున స్పష్టాస్పష్టంగా అతనిలో కలిగిన లైంగిక ఉద్రేకం. వీటన్నిటినీ కలిపిచూస్తే, అప్పటి భార్యే ఇప్పుడు అపరిచితురాలిగా మారి అతనిలో లైంగికత్వాన్ని ప్రేరేపించింది. అపరిచితంగా ఉండే దృశ్యాలనూ, అనుభవాలనూ రొమాంటిసైజ్ చేసి ఆలోచించే మానవ తత్వానికి ఈ సన్నివేశం మంచి ఉదాహరణ.
ఈ పునరుజ్జీవనం, కొత్త అనుభవం తాలూకు నూతనోత్సాహం – ఇవన్నీ సంబంధాలని పునశ్శక్తిమంతం చేసే ఉత్ప్రేరకంగానే పనిచేస్తాయా? ఇలా పునరావృతమయ్యే చిన్నచిన్న అవగాహనా లోపాలు మానవ సంబంధాలని అంతర్లీనంగా పునర్నిర్వచిస్తూ ఉండవా? నిజానికి, విషయం చిన్నదా కాదా అన్నది అసలు సమస్య కానేకాదు. అవతలి మనిషి ఏ మేరకు గాయపడ్డాడూ/పడిందీ, ఆ గాయాన్నీ ఎలా తీసుకున్నాడూ/తీసుకుందీ, ఆ గాయం నుంచి ఏ మేరకు కోలుకున్నాడూ/కోలుకుందీ అనేది ఈ సంబంధాల ఆరోగ్యాన్ని నిర్ణయించే వస్తువవుతుంది.
***
చెత్త పడేసిరావడానికి భర్త బయటకు వచ్చిన సన్నివేశంలో చెత్తకుప్ప దగ్గర రెండు కుక్కలు ఉంటాయి. “చెత్తతొట్టి దగ్గర రెండు వీధికుక్కలున్నాయి. ఒకటి నేలమీదపడి పొర్లుతోంది; రెండోదాని నోట్లో యేదో ఉంది.” అని అనువాదంలో ఉంటుంది.
కథని తొలిసారిగా ప్రచురించినపుడు, రచయిత ఆ కుక్కల గురించి రాసింది వేరు.
“చెత్తతొట్టి దగ్గర రెండు వీధికుక్కలున్నాయి. మగకుక్క వెల్లికిలా పడుకుని నేలమీద పొర్లుతోంది; ఆడకుక్క నోట్లో యేదో ఉంది. చిన్నగా మొరుగుతూ నోట్లో ఉన్నదాన్ని గాల్లోకి విసిరేసి, అంతలోనే ఎగిరి దాన్ని మళ్లీ అందుకుని, తలని అటూయిటూ విదిలించింది.”
కథని బాగా అర్థం చేయించాలన్న లౌల్యం వల్ల (బహుశా) కావొచ్చు- రచయిత ఇలా సమాంతరంగా ఒక సన్నివేశాన్నీ, అందులోనూ ఒక మగనీ ఒక ఆడనీ సృష్టించి, మానవపాత్రల భావోద్వేగాలని ఆ కుక్కల చర్యలమీదకి జుక్స్టాపోజ్ చేసారు. అనతికాలంలోనే బహుశా రచయిత ఇది అనవసరమని గుర్తించారు కాబోలు, ఆ కథని తరువాత సంపుటాల్లో ప్రచురించినప్పుడు అనువాదంలో ఉన్నంత వరకే ఉంచి మిగతా భాగాలని కత్తిరించేసారు.
గత ఆదివారం న్యూయార్క్ టైమ్స్ బుక్ రివ్యూలో వచ్చిన ఐరిష్ రచయిత రాడీ డాయిల్ ఇంటర్యూలో ఆయన రెండు మంచి విషయాలు చెప్పారు. “I suspect that writers reading are like mechanics looking over the shoulders of other mechanics. What moves me most is what another writer does with words — how they create an accent, put hair on a head, give a man a heart attack, give a woman twins, get a man to tell another man he loves him — with the right, surprising line of words.” అన్న రాడీ డాయిల్ “The really great books change as we get older.” అని కూడా అంటారు.
బహుశా అలా చదవడం, పరిశీలించడం వల్ల కొంత అవగాహనా నైశిత్యం టొబయాస్ వుల్ఫ్‌లో కూడా కాలక్రమేణా వచ్చిన కారణంగానే తన కథకి కావలసిన మార్పులు మరింత స్పష్టంగా చేయగలిగారు. “There is no right way to tell all the stories, only the right way to tell a particular story” అని పారిస్ రివ్యూ ఇంటర్వ్యూలో (Art of Fiction #183) చెప్పిన టొబయాస్ వుల్ఫ్ చెప్పని విషయం మరొకటుంది: ఆ సరైన పద్ధతికి కూడా కాలం గడిచేకొద్దీ చిత్రిక పెట్టడం అవసరమవుతుంది!
*
Ramana Murty garu,
The story is interesting but your analysis throws focus on how to read a story. Often readers’ interest stops with identifying themselves with one of the characters of the story or their concurrence or otherwise of the opinions expressed by the characters/ writer . I read somewhere about Rembrandt: His foreground would be excellent but he keeps the subject of his focus at some corner so that only a discerning critic could understand. When it comes to short story, you are “The one”. Congrats!
థాంక్స్ మూర్తిగారూ! కొన్ని కథలని మరింత బాగా అర్థం చేసుకోవడానికి విమర్శకుల సహాయం అవసరమవుతుంది. ఆ విమర్శలని సంక్షిప్తంగా ఇక్కడ చూపించాలని నా ఉద్దేశం. పై కథలో భర్త పాత్ర చెప్పినట్టు- I try!
కథ బాగుంది , మీ విశ్లేషణ కథను అర్దం చేసుకునే టుల్స్ గా ఉపకరిస్తు౦ది.కొత్తగా కథలు రాశేవారికి ఒక పాఠంలా ఎంతగానో ఉపయోగ పడుతుంది. సారంగ వేదిక నుంచి మీ ద్వారా మంచి కథలు చదవగలిగే అవకాశం లభిస్తుంది . సారంగ నిర్వహకులకు, మీకు కృతజ్ఞతలు.
మీకు నచ్చినందుకు సంతోషం, హనీఫ్ గారూ!