జాతర…….కవిత్వ కొమ్ముబూర

సరికొత్త కవిత్వ సంపుటాల గురించి మీ సమీక్షలు పంపించండి. editor@saarangabooks.com

ఓం పూర్ణమదః పూర్ణిమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే

పరిపూర్ణమైన కవిత్వం నుంచీ కవి ఎప్పటికప్పుడు సంపూర్ణమై ప్రకాశిస్తూ వుంటాడు, పరిపూర్ణత్వాన్ని సంతరించుకున్న కవి నుంచీ కవిత్వం ఎప్పుడూ సంపూర్ణ భావమై ఉబికి వచ్చేందుకు ఆరాటపడుతుంది. పూర్ణ కవిత్వం పూర్ణ కవిని అందించినా, పూర్ణ కవి పూర్ణ కవిత్వాన్ని లిఖించినా ఎప్పటికీ మిగిలేది పూర్ణమే, ఎప్పటికీ అంతరించనిదీ పూర్ణమే.

జాతర…. ఒక సంబరం, ఒక బాల్యం, ఒక యౌవన ఆరాటం, ఒక తాత్విక చింతనకు దృశ్య రూపం. రంగుల రాట్నాలు, కొమ్ము బూరల నాదాలు, అల్లనల్లన అగుపించే దుమ్ము ధూళి నిండిన జీవితాలు మాయమౌతున్న లోలోపలి మనిషిని వెతికి పట్టుకునే ఆనవాళ్లు.

అదే జాతర ఈ కవిత్వం నిండా, కవిత్వం నిండార నిండిన ఈ వాక్యాల నిండా.

శ్రీనివాస్ వాసుదేవ్ గారు కవిగా కొత్త పరిచయం అక్కరలేని పాతబడని వాక్యం, కొత్త పయనాన్ని నింపుకున్న కెరటం, నిఖార్సు కవిత్వం. బ్రతుకు పాటల కోరస్ టాగ్ లైన్ తో వచ్చిన వీరి రెండవ కవితా సంపుటి జాతర అచ్చంగా వాక్యాల జాతర, తరాజు కు తూగని బతుకు గెలుపోటముల జాతర.

వాక్యం ఆధునిక వలయంలో చిక్కుకుని సన్నబడిందా, ప్రాచీన పద గుంభనాల నుండి ఇంకా విడివడలేక అక్కడే కొట్టుమిట్టాడుతోందా అన్న విషయాన్ని పక్కన పెడితే పురా పునాదులపై నయా నాటకాన్ని రక్తి కట్టించడం ఇప్పటి కవులకు హానికరం కాని భవిష్యత్తు. రానురాను భాష పలచబడుతున్న చోటులోంచి కొత్త భావాలను పుట్టించడం , కొత్త తరహా వాక్య నిర్మాణాలను సృష్టించడం కొంత కష్టమైనా, ఏమి రాయాలో ఎరుక ఉన్న కవికి ఎలా రాయాలో ఎరుకలోనికి రాకుండా పోదు, ఎలాంటి భాషను తాను ఎంచుకోవాలో తెలియకుండా కలం కదలదు. వాసుదేవ్ గారు ఆంగ్లాంధ్ర కవి , ఆంధ్రాంగ్ల జమిలి కావడం చేత వాక్యం రెండు పొంతలు తొక్కి కొత్తదనాన్ని మరింతగా సంతరించుకుంటుంది. వాక్య వాక్యానికీ కవిత కొత్త కొత్త మెరుపులతో మనసును జిగేల్ మనిపిస్తుంది.

అగరొత్తుల మేఘంలాంటి ఎదురుపడిన పలకరింపులూ

చుట్టపొగమాటున దాగిన చుట్టరికాలూ

ఇవేమీ పట్టని ఆనందంలో అమాయకంగా

లేగదూడలూ, మేక పిల్లలూ

ఓ రంగు వెలసిన ముసుగులో మనుషులంతా ! ( జాతర)

 

గాయం గేయం అవ్వటానికి ఎన్ని స్పర్శలు కావాలో

ప్రతిస్పర్శా ఓ లేపనమైతే గాయం కాస్తా ఓ కావ్యమే

కొత్త పాళీ లో పాత సిరా ఒంపక తప్పదు

రోజూ అనుభవమొక అద్భుతమైతే

సీజ్ ద డే మిత్రమా !! ( కార్పేడియం)

రెండింటికి రెండు పాదాలూ తాత్వికతతో తలారా స్నానం చేసిన వాక్యాలను నింపుకుని వున్నా, ఏ పాదానికి ఆ పాదం భిన్న రీతుల వ్యక్తీకరణలతో ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్టు రాయడం కవిగా గెలవడమే కదా, అందుకే వాసుదేవ్ గారు కాలాన్ని గెలిచారు. భద్ర జీవితాన్ని కోరుకుంటూ , కొరుకుడు పడని అభిప్రాయాల గొంతు నొక్కి అవసరాల వారధి మీద నడవడం మనుషులకు కొత్తగా నేర్పాల్సిన అవసరం లేదు, కానీ మనిషిలోంచి విడివడి కవిగా పుట్టిన తర్వాత అటువంటి భద్ర జీవితాన్ని కోరుకునే వాక్యాలు రాయడం కూడని పని, అందుకే ఈ కవి తన భద్ర జీవితాన్ని పక్కకు పెట్టి ఏ బాధలు తనను కరిగించాయో, ఏ ఏ సమాజ వ్యధలు తనను కలవర పెట్టాయో రావడానికే సాహసించారు, రాయడం కోసమే కలం పట్టారు.

సానెట్స్ లో డార్క్ లేడినీ, రామాయణంలో మాయ లేడినీ

జెనడూ లో కుబ్లాఖాన్నీ , భారత్లో బారిష్టర్ గిరీశాలనీ

సృష్టించి మరీ దాక్కుంటావు ఎక్కడో పద విన్యాసంలో

నిన్ను నువ్వు ఇమ్మోర్టలైజ్ చేసుకుంటూనే వున్నావు

శృతవంతా!!

కవి పనితనాన్ని నాలుగు వాక్యాలలో కుదించిన గొప్పతనం

నిష్క్రియా పర్వాన

మోహావేశాల్లోని మందత్వం మరింత అర్ధమయ్యాక

రిక్త పదాల స్పర్శలో ఆవేశాలన్నీ ఆర్ద్రమయ్యాక

ఆశల ఆత్మహత్యలన్నీ అంతమయ్యాక

ఆఖరికి నిట్టూర్పు కూడా చిరునామా కోల్పోయాక

అస్సలేమీ వుండదు….

అన్న దిగులు నిండిన వచనం ద్వారా నిస్సార మౌతున్న బతుకును పరిచయించిన వైనం చదివితే కవి ఎప్పటికప్పుడు ట్రాన్స్ లోకి వెళ్ళక తప్పదని, వెళ్ళాక వచ్చే ఫలితమే ఆ దశలోని కవిత్వ దిశను నిర్ధారిస్తుందనీ కొత్తగా కాకున్నా చెప్పుకోక తప్పని విషయం.

ఈ జాతర లోని కవితలు వేటికవే విడివిడి పద్యాలు, అన్నీ కలిసి అనుభూతి మాలలు. కవి తనను తాను సమాజానికి అల్లుకుంటూ, తనని తాను సమాజం నుంచి విడిపించుకుని ఏకాంత వాసాన సేద తీరుతూ రాసుకున్న ధైర్య వైరాగ్య చరణాలు.

దేశ స్థితి గతులు, రాజకీయ, అరాచకీయ ప్రహసనాల దగ్గర నుంచీ ప్రపంచ దుఃఖ నదుల మీదుగా సాగి, విశ్వ వ్యాప్తమైన మనిషి సుఖ దుఃఖాల మూల హేతువు దగ్గర లిప్తకాలం ఆగి అక్కడ , అక్కడికక్కడ రాశులుగా పోసిన వాక్యాలూ, తానొచ్చిన తోవ లో తనకు పరిచయమైన ప్రతీ బంధానికి తిరుగు టపాలో కాసింత సాంత్వన, కాసింత భరోసా ఇచ్చేందుకు పడిన తపనే ఈ జాతర.

ఈ జాతర బాబా బ్లాక్ షీప్ ల వూల్ లు ఒలుస్తుంది, నాన్న లేని రోజుల్ని తలచుకుని చెమ్మెక్కిన గుండెను చిత్రీకరిస్తుంది, ఒళ్లంతా పూలు చేసుకున్న చెట్టు కహానీని కవిత్వీకరిస్తుంది, ‘ జీవితం చిన్నదే కానీ మరణం కంటే గొప్పద’ నే సత్యాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పగలుగుతుంది, ప్రవరాఖ్యుడెప్పుడో ఒకప్పుడు తడబడతాడనీ, దమయంతీ చీర కట్టు మర్చిపోతుందని అతి సాధారణ మనిషి తత్వాన్ని కళ్ళ ముందుకు తెచ్చి పెడుతుంది, నీ మరణం నినొక్క కాల్పవుడుని చేసిందా అన్న మృత్యు దుఃఖానికి గొంతు నిచ్చింది, నిర్మోహ మోహనాశం గురించో, నిర్వికార మోహం గురించో, మంచు తెమ్మెరలనీ రంగరించిన ఉన్మాదం గురించో మాట్లాడనీ… ఓ మాటవ్వనీ అని మాటలు మరస్తున్న మౌనాలను బద్దలుకొట్టే ప్రయత్నం చేస్తుంది, వీలైతే నీదొక పదునైన వాక్యం రాసుకో …. కవీ! నీకు తెలిసిందల్లా ఇలా నలిగిపోవడమే అంటూ ఇంకా ఇంకా నలిగితే కానీ కవి కవిగా బతకలేడని, కవిని కవిగానే మిగిలిపొమ్మని హుకుం జారీ చేస్తుంది.  కవయిత్రీ నీ గొంతుకతో నీవు పాడేదెప్పుడని అంటూ సాటి కవి సమూహం పట్ల, కవయిత్రుల నిస్సహాయతల పట్ల సహానుభూతిని కుమ్మరిస్తుంది, నువ్వొక రోజు ఈ కళ్లపై ముద్దు పెడతావు, అప్పుడే నీకొక ప్రేమ భాష అర్థమవుతుంది అంటూ ఇష్ట సఖి కి తానే కవనమై బహూకరించబడుతుంది, ఏతావాతా సమ్యక్ దృష్టి కలిగిన సజీవ వాక్యమై మనల్ని చలన విచలునలను చేసేస్తుంది, మరువక వెంటాడే అవ్యాజ వాక్యమై మన నిద్రను దోచుకుంటుంది, మనలోని మనల్ని నిద్ర లేపుతుంది.

ప్రతులకు:

ఛాయా రిసోర్స్ సెంటర్ , 103 , హరిత అపార్ట్ మెంట్స్, A-3 మధురానగర్, హైదరాబాద్–500038 ph: 7093165151

*

సుధా మురళి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ధన్యవాదాలు సుధామురళి గారు. మళ్ళీ నన్ను నాకు పరిచయం చేసారు.

  • మంచి విశ్లేషణ. అభినందనలు కవికి.సరైన ఆలోచనాత్మక విమర్శ చేసిన సుధా మురళీ గారికి అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు