జాగా కొంచెం, కథ ఏనుగంత!

క్లుప్తత దృశ్యం లో, ముక్తసరితనం సంభాషణలలో, పొదుపు పాత్రల సంఖ్యలో, బొత్తిగా లేని వర్ణనలు –ఇవీ హెమ్మింగ్వే రచనల ప్రస్ఫుట చిహ్నాలు. ఇలా కాస్త స్థలంలో ఏనుగంత కథా విషయాన్ని ఒదిగేట్టు చేసే కథకుడు మరి లేడనవచ్చు.

అందుకు ముఖ్యంగా ఆయనవి ఈ మూడు కథలు గొప్ప ఉదాహరణలు ‘A Cat in the Rain’, ‘Hills Like White Elephants’ ఇంకా ‘A Clean Well-Lighted Place’.

ఇప్పుడు ఆ మూడో కథ చూద్దాం.

 A Clean Well-Lighted Place – Ernest Hemingway

         – ‘‘What’s yours” బార్ లో అతను అడిగాడు.

“Nada(Nothing)” – కస్టమర్

“Otro loco mas” అని అంటూ  అటు వెళ్ళిపోయాడు బార్ లో వాడు.

‘Otro loco mas’ అంటే స్పానిష్ లో వెర్రిబాగులోడు. ఒక లికర్ బ్రాండ్ కూడా.

బార్ కు వచ్చినవాడిని నీకు ఏం కావాలి అంటే ఏ బ్రాండ్ పేరో చెప్పకుండా ‘శూన్యం‘ అంటే వేదాంతి లాగా!

(ఆ పేరు తో లికర్ ఉంది కాబట్టి ఇక్కడ pun పండింది.)

కానీ ఆ సర్వర్ ఏమన్నా పట్టించుకున్నాడా?

 పదహారు specifications తో హోటల్ లో ఆర్డర్ చెపితే, సర్వర్ ‘‘ఒక దోశె య్‘‘ అని  రెస్టారెంట్ కిచెన్ లోకి అరిచేవాడట, పాత పత్రికల్లో జోకు.

అలాగే వీడు కూడా అదొకమాటేదో అన్నాడు. ‘‘ఒక వెర్రోడొచ్చాడురా మళ్ళీ‘‘ అనో, ‘‘ఒక సాదా సారా ఒక సర్వ్‘‘ అనో.

అతను ఎంతమంది ఇలాంటి వాళ్ళను చూస్తాడో రోజూ. రాత్రి రెండున్నర కు సగం మత్తు సగం తెలివితో తాగడానికి వచ్చే జనాన్ని. వెళ్ళడానికి ఇళ్ళు, ఎదురు చూసేందుకు మనుషులు లేనివాళ్ళని.

– the light is very bright and pleasant but the bar is unpolished – the waiter said

“the barman looked at him but didn’t answer. it was too late at night for conversation”

ఈ మురికి బార్ లో వెయిటర్ జవాబుగా ఒక వాక్యం కాదు కదా ఒక మాట పలకడానికి కూడా బద్ధకించాడు.

సంభాషణకు అది మరీ పొద్దుపోయిన రాత్రిట!

ఈ సాదా బార్ కు వచ్చి ‘శూన్యం‘ ఆర్డర్ ఇచ్చినవాడు ఇంకొక ఖరీదైన బార్లో వెయిటర్. వయసు పైబడిన వాడు.

అక్కడికొక ముసలాయన రోజూ సాయంత్రం దాటిపోతుండగా వచ్చి తాగుతూ కూచుండిపోతాడు. రాత్రి రెండున్నర అయినా కదలడు.

అది అక్కడ పనిచేసే ఒక పడుచు వెయిటర్ కు ఒళ్ళు మంట. కొత్తగా పెళ్ళైంది. ఇంట్లో తనకోసం భార్య ఎదురు చూస్తుంటుంది. సమయం రాత్రి ఒంటిగంట కూడా దాటి పోయింది.ఆ పరిస్థితి లో ఉన్నవాడికి ఎవరికి మటుకు శాంతం ఉంటుంది! కోపం గాక.

కానీ మరో వెయిటర్, కాస్త వయసు లో పెద్దవాడి దృష్టి వేరే గా ఉంటుంది.

ఎందుకంటే తనదీ అదే సమస్య. ఒంటరితనం, వృద్ధాప్యం, ఇంటి దగ్గర ఎదురు చూసేవారు లేకపోవడం.

అందుకే ఆ ముసలాయన ను సమర్ధిస్తూ ఈ ముసలి వెయిటర్ అంటాడు, -ఇక్కడ దీపాల వెలుతురుంది, ఆకుల నీడలు ఉన్నాయి. బార్ శుభ్రం గా ఉంది. అందుకు కదూ ఆయన వచ్చేది!-

కానీ  పడుచు వెయిటర్ -వీడు తాగడం ముగించి వెళ్ళి పోతే మనం బార్ మూసి ఇంటికి వెళ్ళొచ్చు కనీసం ఇప్పుడైనా. My wife is waiting for me in bed- అని చికాకు పడుతున్నాడు.

ఇద్దరి అవస్థ కూ కారణం ఉంది.

ఈ కథ ఒంటరి మనుషులు, ముఖ్యం గా వృద్ధుల కథగా అనిపిస్తుంది మొదట్లో. అది నిజమే, కానీ కథలో విషాదం మరికాస్త లోతైనది.

ముందు ముందు మన కళ్ళ ముందు పరుచుకుంటుంది ఆ వాస్తవ విషాదం.

కథలో ఏవి ముఖ్యంగా సూచించదల్చుకున్నాడు రచయిత, వాటిని ఎలా ఎక్కడెక్కడ ప్రవేశపెట్టాడో చూద్దాం.

కథ కు శీర్షిక ‘శుభ్రమైన, మంచి వెలుతురు ఉన్న చోటు’.

కానీ ఆ చోటు ఒక ఉద్యానవనమో, పోనీ ఒక పార్కో, దైవసన్నిధి ఉండే పవిత్రమైన చోటో కాదు.

అది ఒక బార్. అక్కడ మద్యం అమ్ముతారు. తాగుబోతు వాళ్ళే వస్తారు. సత్సంగం జరగదు అక్కడ; చాలా సార్లు ఎవరి పాటికి వారు ఒంటరిగా కూచునే తాగేసి లేచి వెళ్ళిపోతారు. పై ముసలాయన కు త్రాగడం లో కూడా తోడు లేడు ఎవరూ.

కథలో కి ప్రవేశిస్తే :

“It was late and everyone had left the café except an old man who sat in the shadow the leaves of the tree made against the electric light.”  ఇదీ మొదటి వాక్యం.

టైటిల్ లో ఉన్న ‘light’ కంటే ముందు ‘shadow’ వచ్చింది కథలోకి. మరికాస్త కథ అయ్యాక ముసలి వెయిటర్ ‘‘This is a clean and pleasant café. It is well lighted. The light is very good and also, now, there are shadows of the leaves.” అందుకు వస్తాడు ఆ ముసలాయన ఇక్కడ కు అంటాడు.

రెండోసారి నీడల ప్రస్తావన.

వెలుతురు కావాలి సరే, నీడలు ఎందుకు ముసలాయన కు? తెలుగు ‘నీడ’ కు ఆంగ్లంలో రెండు అర్థాలు ఉన్నాయి; shadow, shade అని. ‘Shade’ రక్షణ, చల్లదనాలను స్ఫురింపజేస్తే ‘shadow’ అనే మాట ఎందుకనో ముందు నలుపును, మార్మికతను, భయాన్ని తలపిస్తుంది.

పైన వాక్యంలో shade లేదు. స్పష్టంగా shadows అనే అంటాడు.

నీడల ఉనికి సాయంత్రం అయ్యాకే ఎక్కువ గమనించబడుతుంది. నీడ పొడుగయ్యే కొద్దీ రోజు కురచ అవుతుంది. అది ఒక హెచ్చరిక ఇంక చీకటి పడబోతోందనడానికి, ఇక నీడలు కూడా ఉండవు అనటానికి.

నీడ పడిుతున్నంత సేపే వెలుగు ఉన్నదని భరోసా.

ఎలక్ట్రిక్ దీపాల కింద నీడలు తరగవూ, పెరగవు.

వేళ దాటిపోతోందనే బెంగ వెంబడించదు ఇక్కడైతే.

పైగా తాను ఒంటరిగానే కూచున్నా బార్ అద్దాల కిటికీలోంచి రోడ్ మీద జనసంచారం చూడవచ్చు, ప్రపంచం, జీవితం నడుస్తున్నాయి అనడానికి సంకేతం ఆ సంచారం. అందుకు కూడా ఆయన ఇక్కడకు వస్తాడు అనిపిస్తుంది.

రెండవది ఒక అవకరం, దానిని ఎలా చూపించాడో చూడండి: ముసలాయనకు చెవుడు. “…but at night the dew settled the dust and the oldman liked to sit late because he was deaf and now at night it was quiet and he felt the difference.”

వినికిడి జ్ఞానం లేని అతనికి ‘‘quiet” గా ఉంటే ఏంటి, శబ్దాలు ఉంటే ఏంటి?

చుట్టూ హడావుడి జరుగుతూ తనకు అది వినపడకపోతుంటే తనకు ఏదో దక్కడం లేదనే చింత ఉంటుంది మనిషి కి, ఈ లోకం నాకూ చెందుతుంది. ఈ ప్రపంచపు హడావుడి లో నాకూ భాగస్వామ్యం ఉంది కదా! అది అందుకోలేకపోతున్నాననే విచారం! తన అవకరం తనకు గుచ్చినట్లు తెలుస్తుంది అప్పుడు. ఏ చప్పుడూ అక్కడ లేనప్పుడు తనకు దొరకకుండా ఏదీ తప్పిపోవటం లేదులే అనే ఊరట ఉంటుంది ఆ వేళలో. అందుకు నిశ్శబ్దం ఇష్టం చెవిటి వానికి.

తర్వాత కథలో బయటపడేది, మాటల కరువు. అది మనుషులను చుట్టి ఉన్నది, చుట్టుకుని ఉన్నది.

తమంత తాము ఎవరూ మాట కలపడం లేదు మరొక మనిషి తో నాగరిక ప్రపంచంలో. ఒకవేళ ఎవరైనా ఏదైనా అడిగితే ముక్కలు ముక్కల మాటలు. ఆ వయసులో చిన్న వెయిటర్ ముసలాయన మరో డ్రింక్ అడిగితే ఎలా బదులు చెపుతున్నాడు!

‘‘finished” he said with that omission of syntax stupid people employ when talking to drunken people or foreigners”. ఈ సీన్లో కనిపించే ముగ్గురూ ఒక ఊరు ఒక భాష వారే. విదేశీయులు కాదు, కొత్త భాషా కాదు. తాగి ఉన్నాడని కూడా కాదు, ఆ చిన్న వెయిటర్ కి ముసలోళ్ళతో మాట్లాడటం లో మజా లేదు, పైగా సమయం వృధా, ఎనర్జీ వృధా అనుకుంటాడు.

ఇక్కడ మనిషి కి మనిషి పరదేశి. పక్కవాడు తన మాటను అర్థం చేసుకునే స్థితిలో లేడు లే అని నిర్లక్ష్యం.

ఎవరికీ ఎవరితో మాట్లాడే ఉత్సుకత కాదు కదా అసలు ఉద్దేశమే లేదు.

ఈ నిర్లిప్తత పోనీ మరో మనిషితో మటుకే నా?

మనిషి లోపల కూడా వాడి కి వాడు నిర్లిప్తుడే. వయసు మత్తో మద్యం మత్తో కమ్మేసినప్పడు తప్పితే మనిషికి ఈ జీవితం తో ఏం చేసుకోవాలో తెలీని తనం.

వయసైపోయాక ఎలాగూ ఏమీ చేయలేని తనం.

అప్పుడు వేదాంతం మాట్లాడుతారు. శూన్యవాదం వల్లె వేస్తారు.

తాగడానికి ఈ బార్ కు వచ్చిన ముసలాయన ఇక్కడ అలవాటుగా రోజూ వచ్చే కస్టమర్. ఆయన విషయాలు వెయిటర్ లకూ తెలుస్తుంటాయి.

ఇద్దరు వెయిటర్ ల మధ్య సంభాషణ, రాత్రి రెండు దాటినా ఇంకా తాగుతున్న ఆ ముసలాయనను చూస్తూ:

-He tried to commit suicide last week

– Why

– He was in despair

– What about?

– Nothing

ఈ‘‘Nothing” అనే మాట లో శ్లేష ను ఆసక్తికరంగా నడిపాడు కథకుడు.

పడుచు వెయిటర్ అన్న “Nothing” కు అర్థం ‘‘ఆ ముసలోడికి ఉరిపోసుకునేంత కారణాలు ఏమీ లేవు, బీదరికం కారణం కాదు , కావలిసినంత ఆస్తి ఉంది, మరింక చావవలసిన అగత్యం ఏంటి అని.

వాడికి డబ్బు ఉంటే ఏ సమస్యా లేనట్టే. అవును మరి! వయసులో ఉన్నాడు. పడుచు భార్య ఉంది. బోలెడంత జీవితం ఉంది ముందు. ప్రస్తుతం జీవితం హుషారు గా ఉంది.

కానీ మరో వెయిటర్, ముసలి వెయిటర్ కు ఆ “నథింగ్” లో వెంటనే మరో అర్థం స్ఫురిస్తుంది.

మాట ఒకటే అయినా వ్యక్తి పరిస్థితి ని బట్టి అది అర్థాలను విసిరేస్తుంది.

ఇతని ఈ “Nothing ‘‘, “it all was nada y peus nada y nada y peus nada ” లో ‘‘nada”- శూన్యం!

అందుకే ఈ శూన్యం, “It is this ‘nothing’ that the old man and the old waiter know well and feel.”   తమను కమ్ముకున్న శూన్యాన్ని ఒంటరితనం ఆవరించినపుడే వినగలరు మనుషులు. అప్పుడు గట్టిగా తగులుతుంది చుట్టూ ప్రపంచంలో, జీవితాల్లో మనుషులు బ్రతుకుతున్న విధంలో  కనపడుతున్న అర్థ రాహిత్యం, పరస్పర స్పృహ లేక అనుభూతి రాహిత్యం.

మాటలు లేవు.

వినికిడి లేదు.

వెలుగు లేదు.

ఇంటికి వెళ్ళే కారణం లేదు.

వెళ్ళాలనే కోరిక లేదు.

ఎవరి కోసం వెళ్ళాలి!

చస్తే ఏడవరు. పోనీ చద్దామంటే కూడా చావనీయరు.

కారణం ప్రేమా? పోనీ కనీసం జాలా?

-He tried to commit suicide last week.

-He hung himself

-Who cut him down

-His neice

-Why did they do it?

-Fear for his soul

బోలెడు ఆస్తి ఉండి భార్యా పిల్లలు లేని ముసలాయనను మేన కోడలు ఆయన మెడకు ఉరిపోసుకున్న తాడును తెంచి ఎందుకు చావకుండా ఆపిందిట?

” Fear for his soul” ఇది మరో కీలకమైన మాట ఈ  మాటల కరువు కథలో. బతికి ఉణ్ణంగ మనిషిని పట్టించుకోకపోతే ఏ దేవుడూ శిక్షించడు. మనిషి పోయాక మాత్రం వాడి ప్రేతాత్మ బంధువులను పీడిస్తుంది అనే భయం కుటుంబ సభ్యులకూ మిగతా చుట్టాలకు.

ఆ భయం కూడా లేకపోతే మనిషి ఈ మాత్రం కూడా ఉండేవాడు కాదేమో.

కాబట్టి బ్రతికి ఉండగానే మనిషి వాడి కోసం, పక్క వాళ్ళ శ్రేయస్సు కోసం కూడా తను చచ్చాక దెయ్యం అవకుండా ఉండటం కోసం పాటుపడాలి అని చెప్తున్నాడా హెమింగ్వే?

“Make meaning while the Sun shines” అంటున్నాడా పోనీ?

He was already seeing dead people walking the streets.

It is already late!

“It was late” కథ ఈ మాట తోనే ప్రారంభం అయింది.

“I had not thought death had undone so many” – మరోమాటు అరువు తెచ్చుకోదగ వాక్యం!

మానవులు ఎలా ఉండాలో చెప్పడం కాదు కథ లక్షణం.

ఎలా ఉన్నారో చెప్పడమే కథ లక్ష్యం.

*

పద్మజ సూరపరాజు

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కథను అనువదిస్తూ చదవడంలో మెలకువలు తెలియచెప్తూ మీ దృక్కోణాన్ని ఆవిష్కరించారు, పద్మజా.
    హెమింగ్వే చెయ్యి తిరిగిన కథా రచయిత. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద ఆయనని చదవడం చాలా బాగుంది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు