జలనామా

      మా పాత అయిదంకణాల పూరింటి ఉత్తరపు గోడ కటువైపున ముసలి చింతచెట్టు పైకెత్తుకున్న  వేళ్ళ సందుల్లొంచీ యేడాదికి మూడు నెలలపాటూ గున గునా పారే రెండు బారల చింతలేరు దేశానికి స్వాతంత్రం వచ్చి దశాబ్దమయ్యిందని గొణుగుతూ యింట్లోకి మూడు మీటర్ల వూటల్ని చాటేది .

నేలకుదిగిన యిరవయ్యేడులో యేడు పారిపొగా మిగిలిన యిరవై నక్షత్రాల్ల గుంపు లాగున్న మా గుడిసల పల్లెటూరికి పడమటి సరిహద్దులో చాకలి వుబకబానల జూకాల్ని తగిలించుకున్న అచ్చయ్య వంక* మునుపెప్పుడొ వరదల్లో  మోసు కెల్లిపోయిన వ్యక్తి పేరును తనదిగా  చేసుకున్నందుకు కప్పంగా ఆరునెలలపాటూ మా పాదాలను మోకాళ్ళదా కా కడిగేది.

మా అచ్చయ్య వంక నేలలోకి జొనిపిన  జలాంగుళీయాలు మా యిండ్ల బావుల్లోంచీ పొడుచుకొచ్చేవి.

అచ్చయ్యగారి యిద్దరు  పెళ్ళాల్లా అయన్ని వదలకుండా అనుసరించే  కాలవలు మూడు  చెరువుల్ని కని, బుజ్జగించి, మావూరిముందుపడుకోబెట్టి వొళ్ళు కనబడకుండా నీటిశాలువాలు కప్పేవి.

పడమటిచెరువు  కెదురుగా  శివుడిముందు సిద్దంగా నిలబడ్డ నందిలా కుంటలోపలో దబకలాడే  కీనేరుబావి మాకు యీతల అభిషేకం చేయాలని వువ్విల్లూరేది.

మైళ్ల దూరంలోని మాబడిని మరింతదూరం పారిపోనివ్వకుండా బంధించిన పొలాలు నడిచే పిల్లల గొంతులతో తమ కాలవల దాహాన్ని తీర్చేవి..

మధ్యాహ్నాల్లో బడిపక్కతోటల్లోని బావులన్నీ మా అమ్మలు కట్టిచ్చిన కారియర్లలోని అన్నాల పరిమళాల కోసం పైకెత్తిన జలహస్తాల్ని దించేవేకావు.

యేడుకొండలపాత్ర లోంచీ పొంగిన కపిలతీర్థం హాస్టలు పిల్లలతో ఆడుకోడంకోసం కాలవల్లో పరిగెత్తివస్తూనేవుండేది.

మాలవాడిని తనదాకా రానివ్వని అస్ప్రుస్యులపైన అలిగి యేడోకొండపైన్నుంచీ జలపాతమై గుండం*లోకి దూకేసిన  వెంకటేశ్వరుడు ఆరునెలలు  గడిచినా తిరిగెళ్లేవాడే కాడు.

కొండపైన దేవుడి పెళ్ళిలో యిచ్చిన జలసంబారాలను తన పల్లెస్నేహితులకు బంగాళాఖాతం వరకూ యేడాది  పొడవునా  కళ్యాణీ నది పంచిపెడుతూనేవుండేది.

కోనేటిరాయడు తన భూములు కబ్జా గాకుండా కాపలాకాయమని  కోనేళ్ళకు  జలఖడ్గాలనిచ్చి నిలబెట్టేవాడు.

  • *                      *

కొండకింద అచ్చయ్య వంకకు సిమెంటుతో చెరశాల కట్టేశారు.

చింతలేరు చింతనలోకి ఇవిరిపోయింది.

ఆచ్చెయ్య వంక సల్లేఖనం చేసేసింది.

బావులు భూమిలోపలికి పారిపోయాయి.

మావూళ్ళో యిప్పుడు మినరల్ వాటరు మొక్కల చుట్టూ మావాళ్ళు ప్రదక్షిణాలు చేస్తున్నారు.

కళ్యాణీ నదికి అడవిలో సిమెంటు సంకెల తగిలించారు. దాని పల్లెస్నేహితురాళ్ళను   పొలాలమొగుళ్లు గొడ్రాళ్ళని ముద్రేసి తరిమేశారు.

భూముల్నీ  కోనేర్లనూ పోగొట్టుకున్నాక   కోనెటిరాయడు తాను  పేరుమార్చుకున్నానని గెజెట్లో ప్రకటించుకున్నాడు.

*

  • అచ్చయ్య వంక :చిత్తూరు జిల్లాలో మా స్వగ్రామం దామల్ చెరువులో పారే యేరు పేరు
  • మాలాడి గుండం: తిరుపతిలో కపిలతీర్ఠానికి ఫర్లాంగు దూరంలో కొండపైన్నుంచీ దూకే జలపాతం పేరు. ఒకప్పుడు కొండలపైకి అనుమతిలేని దలితులు అక్కడ స్నానంచేసి వెళ్ళెవాళ్ళని అంటారు.

మధురాంతకం నరేంద్ర

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు