ఆషాఢపు గాలి కొండపూల పరిమళంలో
దూరి అక్కడ మంచు శిలలుగా గడ్డకట్టింది.
దక్షిణం నుంచి వీచిన నిర్బంధపవనాల
సవ్వడి శిలలను పొలమార్చింది.
ఇక ఆ కొండల నేల
వికృత రుతువుల్ని కలగంటుంది.
ఈసారి ఆ దారులన్నీ మరింత ముళ్లబారవచ్చు
ఈసారి ఆ గాలి మరింత దట్టమవవచ్చు
గంధకపు కేకలు యిమిడి యిమిడి గాలి కూడా
నిరసనల పొగబారవచ్చు.
ఇక ఆ నేలతలం చదునుగా కాదు
గరుకుగా కాదు
బాయ్నెట్ లా నిలబడవచ్చు.
ఆ నేల కొమ్మ రూపం మారి
చురకత్తి అంచుగానో తుపాకీగానో
రక్తం రుచిమరిగిన సైనిక హైనా గానో మారిన
మనిషి భావాల్ని పరకాయప్రవేశం చేస్తుంది.
పండ్లన్నీ రక్తం అంటిన
పావురపు దేహంగా మారిపోతాయి.
ఆ కొండల నేల అణువణువూ
అంతర్జ్వలన రూపమెత్తుతుంది
ఘర్షణ బయట గాదు లోపలికి పోటెత్తే
క్రతువొకటి శీఘ్రమవుతుంది.
ఇక అక్కడ నేల రాలే యిసుకరేణువులు
పెల్లెట్లై మైదానంలో పడతాయి
ఒక అధ్భతం జరిగి చేపలవాన కురిసినట్టు
కత్తులకొసలు కురుస్తాయి.
ఇదంతా వాస్తవం కాకపోవచ్చు
జరగక పోయినంత మాత్రాన
వూహకు చోటులేకుండా పోదు.
ఒక నిశ్శబ్ద శాపం జలగల వానలా
మీద పడకుండా పోదు.
ఇంకా ఆ అరణ్యకాల్లో యేం రాసుందంటే!
ఇక ఆ కొండల మీద కురిసే వాన
నేరుగా మన ముంగిటే నట.
వాన కురవడమంటే
తడిచినుకుల జడిలా కాదు
ఇంత వరకు మనం చూపిన
పొడి ప్రతిస్పందనల రావడిలా.
తలుపులు మూసి మనమిచ్చిన తీర్పు
మన మీదే పునరావృతం అయ్యేలా.
నీమీద యేదైనా కురవడమంటే
నువ్వు యితరులకు యిచ్చిందే
అని అర్థం కదా!?
*
painting: pathan mastan khan
నీమీద యేదైనా కురవడమంటే
నువ్వు యితరులకు యిచ్చిందే
అని అర్థం – బాగుంది సర్