జమీల్యా మళ్లీ కొత్తగా ఎందుకంటే…!

ఈ పక్షం రోజుల్లో విడుదలైన పుస్తకాల పరిచయమూ ప్లస్ ముఖాముఖీ కోసం ఈ శీర్షిక!

రేష్కుమార్ సూఫీ తెలిసితెలిసీ కొన్ని సాహసాలు చేస్తాడు. కొన్ని సాహసాలు తెలియక కూడా చేస్తాడు. కానీ, తెలిసి చేసిన సాహసం చింగీజ్ ఐత్మతోవ్ నవల “జమీల్యా” అనువాదం. ఇంతకుముందే అనువాదమై బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ నవలని నరేష్ మళ్ళీ ఎందుకు చేశాడు?! ఈ అనువాదం వల్ల జమీల్యా మనకేమైనా కొత్తగా అర్థమవుతుందా?! ఏమో! నరేష్కుమార్ సూఫీ మాటల్లోనే చదువుదాం. 

జమీల్యా పుస్తకం గురించి మీరు మొదటిసారి ఎప్పుడు విన్నారు ?

నా ఇంటర్మీడియట్‌లో మా ఇంగ్లీష్ లెక్చరర్ సుధీర్‌కుమార్ పాఠం చెప్తూ జమీల్యా సినిమా గురించి చెప్పారు. అది పుస్తకం కూడా ఉంది అన్నారుగానీ అప్పటికి అది తెలుగులో ఉందని తెలియదు. కానీ ఆ పేరు మాత్రం గుర్తుండిపోయింది. 2013లో విజయవాడ బుక్‌ఫెయిర్‌లో పుస్తకం కనిపించినప్పుడు ఆయన చెప్పిన పుస్తకమేనా కాదా అనే ఆలోచనలోనే కొనుక్కున్నాను. ఆ తర్వాత జమీల్యా నన్ను వదలలేదు. ఆ రచనలోని వాతావరణం, లక్ష్మణరావుగారు వర్ణించిన తీరూ నన్నెంతగా ప్రభావితం చేశాయంటే, తరువాత నేను రాసుకున్న కాలియా అనే పొయెట్రీ సిరీస్‌లో నాకు తెలియకుండానే ఆ వాతావరణాన్నీ, ఆ భాషనీ వాడాను.

ఈ  పుస్తకానికి పాత అనువాదం ఉండగా కొత్తగా మళ్లీ ఎందుకు చేశారు?

ఎవరైనా “ఏవైనా మంచి బుక్స్ చెప్పు కొనుక్కుంటాను” అన్నప్పుడు నేను చెప్పే మొదటి మూడు పుస్తకాల్లో జమీల్యా కూడా ఉండేది. అయితే నా కన్న చిన్నవాళ్లు కొందరు మాత్రం చదవటానికి కష్టంగా ఉందని. ఇంకొన్ని పదాలైతే తామెప్పుడూ వినలేదనీ చెప్పారు. నిజానికి నావరకూ ఉప్పల లక్ష్మణరావుగారు చేసిన భాషే చాలా ఇష్టంగా ఉండేది.

రెండేళ్లకిందట ఒక యాప్‌కోసం ఆడియో బుక్ చేయిస్తున్నప్పుడు ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆ భాష చదవలేక పోగా “ఇదసలు తెలుగేనా? ఇదెవరో గూగుల్ ట్రాన్స్‌లేషన్‌లో కొట్టారు. మీరు తెచ్చారు” అన్నప్పుడు కోపం వచ్చింది. ‘అది ట్రాన్స్‌లేట్ అవుతున్నప్పుడు గూగుల్ అనేది ఒకటి వస్తుందని కూడా ఎవరికీ తెలియదమ్మా’ అని మనసులోనే అనుకున్నాను. అయితే ఆవిడ చేత ఆ పుస్తకం చదివించటానికి నానా తంటాలూ పడాల్సి వచ్చింది. కొన్ని పదాలను పలకలేకపోవటం, వాక్యం ఎక్కడ ఆపాలో తెలియక తికమక పడటం చూశాక ఈ తరానికి కొంత సులభమైన భాష ఉండాలేమో అని బలంగా అనిపించింది.  అప్పుడు అనుకున్నాం సమస్య… ఆ భాష నాకు అధ్బుతంగా ఉన్నా,  కొత్తవాళ్లకీ చదవటం అలవాటుగా లేని వాళ్లకి ఇబ్బందిగా ఉందని. అందుకే కొంచం సరళమైన భాషలోకి మారిస్తే ఎలా ఉంటుందా అని ప్రయత్నించాను.

 ఈ అనువాదం చెయ్యడంలో మీకు కలిగిన ఇబ్బందులు ఏమిటి ?

కొన్ని పదాలు తెలుగులో ఎలా చెప్పాలో కూడ అర్థం కాలేదు. లగాం బిగించటం, పూర్వరంగం, మనఃస్థితి, పంగలకర్ర లాంటి ఇంకెన్నో పదాలు తెలుగులో యథాతథంగా వాడటం కొత్తతరం చదువరులకు ఇబ్బంది కలిగిస్తోందని అర్థం అయ్యింది. వాటిని సులభంగా చెప్పటానికి కూడా మామూలు భాషలో సరైన పదాలు దొరకలేదు. అలాటి సందర్భాలలో ఛాయా మోహన్ బాబు హెల్ప్ చేసారు.
అయితే ఈ పుస్తకం చదివాక లక్ష్మణ రావుగారి పుస్తకాన్ని కూడా చదవటం మంచిదనే నా అభిప్రాయం. కనుమరుగవుతున్న పదాలు కూడా అవసరమే కదా. ఇది మామూలుగా అర్థం చేసుకోవటానికైతే, అది భాషని మరింత అర్థం చేసుకోవటానికీ ఉపయోగ పడొచ్చు.

మీరు చేసిన మొదటి అనువాదం ఇదే కదా.. అనువాదం చెయ్యడానికి, సొంతంగా రచన చెయ్యడానికి తేడా ఏమిటి?

ఒకటీ రెండు కవితలు తప్ప, ఇలా ఒక నవలని అనువాదం చేయటం ఇదే మొదటిసారి. అనువాదం చెయ్యడానికి, సొంతంగా రచన చెయ్యడానికి చాలా తేడా ఉంది. నా రచనలో పదం, వాక్యం ఎలా ఉండాలో దాన్ని ఎట్లా రాయాలో అన్నది పూర్తిగా నా స్వేఛ్చ. అనువాదంలో అది కుదరదు. వాక్య నిర్మాణం మారిపోతే పూర్తి అర్థమే మారిపోయే ప్రమాదం ఉంది. భాషనీ, వాక్య నిర్మాణాన్ని మార్చినా, అసలు మూలరచయిత చెప్పాలనుకున్న భావం సరిగ్గా చేరవేయలేకపోతే ప్రయత్నమంతా విఫలం అయినట్టే కదా. ఒకదగ్గర కొత్త పదం చేర్చితే (తెలుగులో) ఇంకా బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఇంకో చోట వర్ణన ఇంకోలా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఇలాంటి చోట మన స్వేఛ్చ పరిమితం. అనువాదం అంటే సరిహద్దులు దాటకుండా ఆడాల్సిన ఆట” అనిపించింది. ఇక ఈ పుస్తకం చింగీజ్ ఐత్‌మాతోవ్ రచన, లక్ష్మణ రావుగారి అనువాదం ఇప్పటికే ఉంది కూడా. అందుకే  ఒళ్లు దగ్గరపెట్టుకొని పని చేశాను.

చింఘీజ్ ఐత్‌మాతోవ్ రాసిన మిగిలిన పుస్తకాలు కూడా మళ్లీ అనువాదం చేస్తారా ?

కచ్చితంగా. ఎప్పుడైతే జమీల్యా చదివానో చింగీజ్ ఐత్‌మాతోవ్ నా అభిమాన రచయిత అయిపోయారు. “తల్లీ భూదేవి” పేరుతో వచ్చిన “మదర్ ఎర్థ్”, “తొలి ఉపాధ్యాయుడు” గా వచ్చిన “ద ఫస్ట్ టీచర్” నవలలని కూడా తెలుగులోకి తీసుకు రాబోతున్నాను.  కేవలం భాషా సమస్య వల్ల ఐత్‌మాతోవ్ రచనలని దూరం చేసుకోవటం ఆయన రచనలను అభిమానించే పాఠకుడిగా భాదించే విషయమే కదా. అందుకే ఆ రెండు రచనలని కూడా త్వరలో తీసుకురాబోతున్నాను.

*

శేషు కొర్లపాటి

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నాకు బాగానే అర్థమయ్యింది, పాత అనువాదం. మీది మళ్ళీ చదవడం ఎందుకంటారు?

    • అందుకే.. ఇంగ్లీష్ మీడియం చదివినా తెలుగును మాట్లాడగలిగే వారికోసం అన్నారు.

    • పాతది అర్థమయ్యాక… మిమ్మల్ని ఈ కొత్తది చదవమని ఎవరడిగారు?? 🙂

  • గ్రేట్ నరేష్.. లక్ష్మణరావు గారి అనువాదం పట్ల నీ గౌరవం నీ పట్ల మరింత అభిమానాన్ని పెంచింది. అలాగే, జమీల్యా అందరికీ అర్థమవ్వాలనే ఆకాంక్షతో చేసిన ఈ అనువాదం అభినందనీయం. చదివాక మాట్లాడుకుందాం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు