జనమ జనమ కది మరీ తీయనవుతదీ…..

“నాకీ జన్మ రాహిత్యం వద్దు. మళ్ళీ జన్మలో  ఈ అమ్మానాన్నలకే నేను పుట్టాలి. నాకీ వరమివ్వు నాన్నా” అని వేడుకున్న కీ||  శే|| యస్పీ బాల సుబ్రమణ్యం  అనబడే ఈ సుమధుర గొంతయ్య కోరిక, గొంతెమ్మ కోరికేం కాదు.

కాబట్టి బాలు (డు ) ఈ పాటకి .. సారీ .. ఈ పాటికి ఎక్కడో పుట్టేసి వుంటాడని నా సిక్స్త్ సెన్స్, గట్టిగా నా చెవులు గింగురులెత్తేలా అరచి  మరీ చెప్తోంది. “మరి ఎక్కడా ” అని ఆలోచిస్తుంటే, తనకు దక్కవలసిన గౌరవాన్నివ్వక, తెలుగు భాష కోసం తాను పడ్డ తాపత్రయాన్ని ఏ ఒక్కరూ లెక్కచేయని    తెలుగు రాష్ట్రాల్లోనే మళ్ళీ పుట్టాలా? మళ్ళీ భంగపడాలా? తనని అత్యంత ఆప్తుడిగా అక్కున చేర్చుకుని,  తలపాగా పెట్టి తలకెక్కించుకుని, కన్నడిగుడిగా మార్చేసి గుడి కట్టిన కర్ణాటక రాష్ట్రంలోనో, తనని తమవాడుగా చేసేసుకుని, కొలవలేనంత గౌరవాన్నిచ్చి, పద్మ అవార్డులిప్పించి, పరమ పదించిన తమ ఆరాధ్య దైవానికి ప్రభుత్వ లాంఛనాలతో వీడ్కోలు పలికి, మరణానంతరం పద్మ విభూషణ్ కూడా బాలూ కి సాధించి పెట్టిన తమిళ నాడులోనో, పుట్టాలని నేను కోరుకోవడం లో తప్పేంలేదనుకుంటాను. మైసూర్ లోనో, హోసూరులోనో, శ్రావణ బెళగొళ లోనో, మద్రాస్ సిటీ లోనో మరో సింప్లిసిటీలోనో, ఎక్కడ పుడితే మనకేం ? ఈ దేశం  లోనే పుట్టాలన్న ఆశ.    అన్ని భాషలు తనవే అందరు శ్రోతలూ తన అభిమానులే. పుట్టగానే పరిమళిస్తాడని మాత్రం గట్టిగా నమ్మొచ్చు.

ఇప్పటికే ‘ ఉంగా … ఉంగా ‘ (నేను మీకు ప్రామిస్ చేసినట్టు – ఫిర్ సే ఆ  ‘ఉంగా’ ఔర్ గా ‘ఉంగా’  ) అని రాగ యుక్తంగా అంటూ వున్నాడెక్కడో మన స్వరంధాముడు.

దీనిక్కారణలు ఆయన నిష్క్రమణ అర్థాంతరం – ఇప్పటికీ ఆయన అభిమానులెవ్వరూ ఆ నిజాన్ని జీర్ణించుకోలేకపోవడం. నిజానికి, ఆయనకి మిగిలిపోయిన కార్యాలెన్నో వుండిపోయాయి. వేదిక మీద శాస్త్రీయ సంగీత కచేరీ చేసి, వాళ్ళ నాన్నగారిని  సంతృప్తి పరచాలనీ, సినిమాలకి దర్శకత్వం వహించాలని, తాను మిస్సైన ఎన్నో పుస్తకాలు చదివి ఔపోసన పట్టేసినంత పని చేయాలనీ, గోదాట్లో పడవమీద మినీ ఆర్కెస్ట్రా తో మిత్రులందరితో కలసి పాడుకుంటూ పాపికొండలదాకా వెళ్లి రావాలనీ. ఇంకా మనకు తెలియని, ఆయన మనసుకే తెలిసిన ఎన్నో కోరికలు మిగిలిపోయాయి.

మరో నాలుగైదేళ్లకంతా ‘చైల్డ్ ప్రాడిజీ’ గా ‘టైమ్’ మేగజైన్ కవర్ పేజీ మీద ఫోటో వచ్చినప్పుడు మనం గుర్తించగలగాలంతే.కొన్నేళ్ళకు బుడిబుడి నడకల బుడుగు దశ దాటి పొడుగుగా సాగి నూనూగు మీసాలొచ్చేసరికి గత స్మృతులు లీలగా (పీ. సుశీలగా) గుర్తొచ్చి, తను తీసిన ‘ఆదిత్య’ సినిమా లో లాగా టైమ్ మెషిన్ లో వెనుకటి రోజులకు వెళ్ళొస్తాడేమో. కాళహస్తి, అనంతపురం తిరిగేసాక నెల్లూరొచ్చి ట్రంక్ రోడ్డులో నడుస్తూ, ఆగి ఆగి మరీ ఆ అనుభవాలన్నిట్నీ  హాయిగా గుర్తుకు తెచ్చుకుంటాడు. “అరె! ఇక్కడేగా వైరైటీ కూల్ డ్రింక్స్ ఉండేది ? దీని బైట నుంచునేగా మిత్రులతో బాతాఖానీ, నాటకాల ప్లానింగులు. ఈ ప్రాంతంలోనే ఎక్కడో చంద్ర భవన్ ఉండేది. వన్ బై త్రి కాఫీ తాగుతూ, గంటకొకటి చొప్పున ఆర్డర్ఇస్తూ ఫాను కింద గంటలు గంటలు గడిపేసేవాళ్ళం! ఓహ్ ! టౌన్ హాల్. ఈ వేదిక మీద ఎన్ని పాటలు పాడేనో, ఎన్ని సంగీత విభావరులు నిర్వహించానో! ”  తిప్పరాజు వారి వీధిలో తన ఇంటిలోంచి బాలలు చేస్తున్న వేదాధ్యయనం వినిపించి ” అవును, స్వామీజీకి వేద పాఠశాలకోసం దీన్నప్పగించింది నేనేగా!”  ఇక మద్రాస్ వెళ్తే మాత్రం ఆ అనుభవాల పరంపర రాయడానికి ఈ చిన్న ఆర్టికల్ సరిపోదు.

మనలో కొంతమందికా అదృష్టం వుందేమోగాని మన మనవళ్లకూ మనవరాళ్ళకూ మాత్రం కాం’టెంపరరీ’ గా ఉంటూ వాళ్ళ గుండెల్లో మటుకు ‘పర్మనెంట్’ గా సెటిలైపోతాడని గ్యారంటీ.

మాలాంటి కొద్దిమంది మిత్రులతో ఎన్నో రాత్రులు రఫీ పాటలు  పాడుతూ అందర్నీ తన్మయత్వం లోకి తీసుకువెళ్లినట్లు, మన గ్రాండ్ చిల్డ్రన్ లో తన ఫ్రెండ్సయినవారికి ఇలా నైట్ సిట్టింగ్స్ లో యస్పీబీ పాటలు తెల్లవార్లూ వినిపించి ఆ గాయకుడి గానామృతాన్ని మరిన్ని భావితరాలకు పంచి పెడతాడేమో, అంతెందుకు, అసలు  బాల సుబ్రమణ్యం బయోపిక్ తీయగల సమర్ధుడతడేగా, మరి ?

అలనాటి ‘చందమామ’ రోజుల్నించి వున్న ‘బాలమిత్ర’ లలో ఒకడిగా – మా (యస్పీ బాల సుబ్ర) మణి (యం) డెబ్బై ఐదవ పుట్టిన రోజైన ఈ జూన్ నాలుగవ తేదీన, ఇదే నా నివాళి.

*

డాక్టర్ దివాకర్

16 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • 👌 ప్రత్యేకంగా బాగుంది, చాలా బాగుంది అనేకంటే… పుట్టినరోజు స్మారక వ్యాసంగా బాగానే ఉంది అంటున్నాను. ఎందుకంటే ఎంత రాసినా ఇంకా కొంత మిగిలే ఉండే బహు భాషా పాటగాడి గురించి ఇది! ఎంతని రాయగలము 🤷‍♀

  • Excellent narration. You infused hope and pleasant surprise in these dark days. Regards. Yes. He is our Balu…. Brought up with his very own voice.

  • హృద్యమైన నివాళి, డాక్టర్ దివాకర్ గారూ 🙏.

  • దివాకర్ గారు రాసిన నివాళి అత్యంత సందర్భోచితం!
    ప్రసాద్ MVS

  • బాలు గారు మరణిoచినప్పుడు మీరు ఎంతో గుర్తుకొచ్చారు. కాకినాడ సూర్యకళామందిరంలో మీరు బాలు గారితో కలిసి ప్రదర్శిoచిన మైమ్ గుర్తుకొచ్చిoది.
    పాడతా తీయగా ఫైనల్స్ కాకినాడ లో జరగడం గుర్తుకొచ్చిoది.. బాలు గారు పాటల పల్లకిలో ప్రయాణం మొదలు పెట్టిన కొత్తలో కాకినాడ దగ్గర రామచంద్రపురం అన్నపూర్ణ సినిమా హాలులో మూడుగంటల పాటు శ్రోతల్ని తన గానంతో మంత్రముగ్ధుల్ని చెయ్యడం గుర్తుకొచ్చిoది.

    బాలు గారికి నివాళి
    🙏🙏🙏
    🌺🌸🌹🌸🌺

  • సుస్వర వరాల బాలుడికి… బాల్య మిత్రు డిచ్చిన జ్ఞాపకాల పూల గుచ్ఛం. ఆ స్నేహం అజరామరం గా గుబాళిస్తూనే ఉంటుంది. జయహో

  • మీరూ బాలు గారూ చిన్నప్పటి నుంచీ స్నేహితులు. మీ దగ్గర జ్ఞాపకాల ఖజానా ఉంటుంది. మాతో పంచుకుంటే మేము కూడా సంతోషిస్తాంగా. వ్రాయండి.

  • దివాకర్ సార్…

    బాలూ గారి గురించి మీరు వ్రాసింది మనసుని తాకింది.
    పాటగా మా చెంతే ఉంటే మరువడం కుదరదు సార్ మా బాలూ గారిని. 💐💐🙏

  • చాలా బాగా వ్రాశారు, ఎంతో హృద్యంగా ఉంది. కానీ అన్ని ఇంగ్లీష్ మాటలు లేకుండా ఉంటే బావుండేది.

  • Divakar garu,
    Beautiful article.
    You are a very lucky person who had close friendship with Balu garu, and you are even luckier to have good memory and the talent to express your memories, sincere thoughts and hopes in these beautiful words.
    🙏
    Umabala

  • అవార్డులు కళాకారులకివ్వాలంటే కళాభిమానం వుండి ప్రతిభను గుర్తించగల ప్రభుత్వాలు నాయకులు వుండాలి. తెలుగురాష్ట్రాలకాభాగ్యం లేదు. అయితే, తెలుగు ప్రజలు బాలూని దండిగా అక్కున చేర్చుకున్నారు. సందేహం లేదు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు