జట్కా

పట్టణం పేరు బ…తో మొదలవుతుంది. గుర్రాల దళం వచ్చినప్పటి నుంచి అంతటా సందడిసందడిగా మారింది ఆ టవును. అప్పటిదాకా అదో విసుగు పుట్టించే చోటు. మీరు ఎప్పుడయినా అటు వెళితే, వద్దురా బాబు అన్నంతగా ఈసురోమంటూ కనిపించే గుయ్యారాల లాంటి మట్టి ఇళ్ళ బారులు తగులుతాయి మీ కళ్ళకే. దాని గురించి ఇంకా రాయాలంటే నా పెన్ను మొరాయిస్తోంది. ఆ వీధులను చూస్తే మనం ఏదో, ఏ పేకాటలోనో మన బాబు సొమ్మంతా పోగొట్టుకున్నామేమో అని మనకే అనిపిస్తుంది. లేదా ఏదో చేయరాని పాపం చేసే వుంటామేమో అనీ అనిపిస్తుంది, అక్కడ ఒక్కసారి అలా కలయతిరిగితే.

తరాల వానలో నానిపోయి మరకలు తేలిన సున్నాల ఇళ్ళు, అక్కడక్కడా జీర్ణమయి కూలిన మొండి గోడలూ కనిపిస్తాయి; అవి కూడా మచ్చలు తేలి, గీతలు, పొక్కులు గీక్కుని రాలిపోయి. ఇవేవీ కంటపడకుండా అన్నట్టు పాత రెల్లు సట్టలు కప్పేసి వుంటాయి ఆసరాగా దాదాపు ఆ ఇళ్ళనన్నింటినీ.

అప్పట్లో దక్షిణ రష్యాలో ఒక రూలు వుండేది. మరింత అందంగా కనిపించేందుకూ, చూపును ఆహ్లాదం చేసేందుకూ స్థానిక ఉద్యానవనాల్లోని చెట్లను అందుకు అనుగుణంగా కత్తిరింపచేసేవారు. ఈ పనిని పట్టణ పోలీసు అధికారి దగ్గరుండి తన సిబ్బందికి పురమాయించి పూర్తి చేసేవాడు.

ఈ పట్టణంలో ఒకరినొకరు కలుసుకోవడం గగనమే; మరీ ఏ కోడిపుంజో ఏ రోడ్డో దాటుతుంటే తప్ప. దిండుల్లాంటి పేరుకున్న దుమ్ము కొట్టుకుని వుంటాయి ఆ రోడ్లు. చినుకో, అరచినుకో పడితే చాలు వీధుల్లోని ఈ దుమ్ముదిండ్లు పందులు పారాడేందుకా అన్నట్టు చిక్కని బురదగా మారిపోతాయి.

బురద ముట్టెలు వేసుకుని ఆ పందుల మంద చేసే గుర్రుగుర్రులు విని తమతమ గుర్రాలను వీలయినంత చటుక్కున ఆ చోటును పక్కనుంచి దాటించేస్తారు ముక్కులు మూసుకుని పర్యాటకులు. ఇంకొన్నిసార్లు పక్క ఊర్ల నుంచి కొంతమంది ఆసాములు బండ్లు తోలుకుని వస్తుంటారు సంతకు. వారికి ఊడిగం చేసే పదిపన్నెండుమంది గాసగాళ్ళు కూడా వుంటారు. పైగా వాళ్ళు తోలుతున్నవి ఎడ్లబండీలా, లేక గుర్రపు జట్కాలా అని తేల్చుకోలేని ఓ విచిత్ర చక్రాల వాహనాలవి. పైగా అందులో మోపులేసుకుని వస్తుంటారు. అవి ఆడించిన పిండి బస్తాల మోపులే. ఆ బండ్లకి ఎలపట ఒక గోడిగ, దాపట దాని పిల్ల కట్టి వుంటాయి. వాటిని చెలకోలతో అదిలిస్తూ, పిల్ల గుర్రాన్ని తల్లి వైపుకు తోలుతూ పోతుంటారు ఆ గాసగాళ్ళు.

మా సంత ఒక సంతాప కేంద్రం. ఇక మా దర్జీ ఇల్లు ఇంకో విచిత్రం. చూపు ఎటోపెట్టి, తల ఇంకెటో పెట్టుకున్నట్టు ఎదురవుతుంది ఆ ఇల్లు. దాని ఎదురుగా ఓ రెండు కిటికీలు వున్న ఇంకో ఇల్లు. ఆ కిటికీలు గత పదైదేళ్ళ నుంచి కడుతూనే వున్నా పూర్తి కావటంలేదింకా. దాన్ని కూడా దాటితే మట్టి రంగు వెల్ల వేసిన ఓ చెక్క బంకు కనిపిస్తుంది. నిజానికి సంత అంతా ఇట్లాంటి బంకులే కట్టుకోవాలి అని మా టవును పోలీసు అధికారి యువకుడిగా వున్న రోజుల్లో దగ్గరుండి కట్టించిన నమూనా బంకే అది. ఇప్పుడు ఆయన ఎప్పుడు తిండి తిన్నా సరే కాసేపు కునుకు వేయాల్సిందే. పైగా రోజూ సాయంత్రం ఆరబెట్టిన ఒక రకం ఉసిరితో చేసిన కషాయం తాగాల్సిందే. ఇక తక్కిన మా సంత జరిగే చోటు చుట్టూతా గుంజెలు పాతిన ఓ కంచె కనిపిస్తుంది. ఆ గుంజెల కంచె మధ్యన కుదురుగా పేర్చిన గుండు బన్నుల పొట్లాలు, ఎర్రని డ్రస్సులో ఓ లావుపాటి మహిళ, బారు సబ్బులు, ఎండు బాదాము పప్పులు, సీసం, పత్తి…తోపాటు ఓ ఇద్దరు వ్యక్తులు పచ్చీసు ఆడుతూ ఎప్పటికీ కనిపిస్తారు.

అయితే ఏనాడయితే గుర్రాల సైనిక దళం టవునుకు వచ్చిందో ఆ నాటి నుంచి ఇదంతా మారిపోయింది. ఆ వీధులన్నీ గలభగా, సందడిగా మరోలా తయారయ్యాయి.

తరచూ ఓ పొడవాటి అధికారి నీటుగా తయారయ్యి, నెత్తిన కుచ్చుల టోపీ పెట్టుకుని అటుగా వెళ్ళడం ఈ టవును జనం ఇంట్లోంచే తొంగి చూస్తూ వుండిపోయేవారు, నిటారుగా నిలబడితే తలతగిలే ద్వారబంధాల దగ్గర కాస్త తమ నడ్డి వంచి. ఆ ఫలానా అధికారి బహుశా తన సహచరులను కలిసి తమతమ పదోన్నతుల తాలూకు కుచ్చీటప్పా కలపడానికో, లేదా కొత్తగా వచ్చిన పొగాకు సరుకు నాణ్యత గురించిన బేరీజు పిచ్చాపాటీ చేసేందుకో, లేదా ఆ రాత్రి ఆడే పేకాట చివరి అంకంలో తన బగ్గీని కూడా ఫణం పెట్టేదాకా ఆడేందుకో బయలుదేరేవాడేమో అనుకుంటా. అలా ఒక వేళ ఏ అధికారి అయినా తమ బగ్గీని కూడా జూదంలో ఓడిపోతే మాత్రం అది మొత్తానికి ఆ దళం ఓటమే అవుతుంది. ఎందుకంటే ఆ దళంలోని ఏ ఒక్కరిదీ కాదు కదా ఆ బగ్గీ, అది అందరిదీ కదా!

ఒకవేళ ఇవాళ ఆ బగ్గీపైన వచ్చేది సాక్షాత్తూ పట్టణ మేజరుగారే అనుకోండి, రేపు అదే బగ్గీ లెఫ్టినెంటుగారి క్యాంపు గుడారం ముందు కూడా కనిపించవచ్చు. ఓ వారం తర్వాత మేజరు గారి ఇంటి పనోడే ఆ పెరట్లో ఆ బగ్గీకి కందెన వేస్తూ కూడా కనిపించనూవచ్చు.

ఇంటికీ ఇంటికీ మధ్య వుండే పొడవాటి కంచెల గుంజెలపైన ఇప్పుడు సైనికుల తడి టోపీలు ఎండలో ఆరుతూ కనిపిస్తాయి. ఆ వాకిళ్ళకి అటో ఇటో సైనికుల సరంజామా వుండే బూడిదరంగు మూటలు వేలాడుతూవుంటాయి. బిరుసుగా, ములికీల్లాగా పొడుచుకుని వచ్చి బట్టలు ఉతికే బ్రష్షులాగా టవును వీధుల్లో ఎక్కడపడితే అక్కడ ఎదురుపడుతుంటాయి మిలటరీ మీసాలు. అన్నింటికన్నా ఎక్కువగా సంతలో వెచ్చాలు కొనుక్కునేందుకు ఎక్కడెక్కడినుంచో వచ్చిన పడచుల భుజాల మీంచి ఈ మీసాలు కలియతిరుగుతూ కనిపిస్తుంటాయి. అందుకే, సైనిక అధికారులు బ… టవును సమాజానికి గొప్ప సందడి తెచ్చారనే చెప్పాలి. అప్పటిదాకా టవునులో పెద్దమనుషులంటే ఇద్దరే: చిన్నఫాదరీగారి భార్యతో కలిసివుంటున్న జడ్జిగారు, మన పోలీసు అధికారి. ఇతను మంచివాడే కానీ పొదస్తమానం కునుకుతీస్తూ కనిపిస్తాడంతే.

ఇక రెజిమెంటు జనరల్ రాకతో బ… టవును సందండి రెండింతలయింది. ఈ సైనిక అధికారులను చూసేందుకు చుట్టుపక్కల ఊర్ల నుంచి ఆనాటి వరకు ఏనాడు చూసిన మొఖానపోని ముక్కూమొఖం తెలియని జనాలు కూడా ఏవేవో వంకలతో పొలోమని టవునుకు వచ్చేసేవాళ్ళు. కాలక్షేపానికి బ్యాంకు ఆట ఆడేవాళ్ళు. అప్పటివరకు అట్లాంటి ఆట ఒకటి వుందని వారికి తెలుసునేమో కానీ, అది ఎట్లా ఆడాలో అన్న విషయంకానీ, దాని నియమాలు కానీ కచ్చితంగా వారికి తెలియదని అంతే కచ్చితంగా చెప్పొచ్చు. అప్పటిదాకా వాళ్ళ వ్యాపకం అంతా కూడా వాళ్ళ పంటలు, లేదా వాళ్ళ పెళ్ళాలు చెప్పిన పనులు, లేదా కుందేళ్ళ వేటలు.

ఒక రోజు మిలటరీ జనరల్ అందరికీ పార్టీ ఇద్దామనుకున్నాడు. ఆ పార్టీకి కారణం మాత్రం నాకు ఎంత గింజుకున్నా గుర్తుకు రావడం లేదు ఇప్పుడు, మీరు క్షమించాలి.

పార్టీకి సన్నాహాలు అదిరిపోతున్నాయి. వంటింట్లో చాకుల మోత టవును గేటు దాకా క్లింగ్ మని వినిపించింది. మొత్తం టవును సంత అంతా పార్టీకోసం సంతర్పణగా ఊడ్చేసి పెట్టినట్టుంది. జడ్జిగారూ, అతను ప్రస్తుతం కలసివుంటున్న చిన్నఫాదరీ గారి భార్యా, సంతలో ఏమీ దొరక్క, దొరికినవేవో రొట్టెముక్కలు తిని ఆవాళ్టికి అలా తినేసాం అనిపించారు.
ఆ వేళ జనరల్ వుంటున్న ఇంటి ముందున్న చిన్నపాటి పెరటి నిండా వాహనాల రద్దీ. పార్టీలో అంతా మగవాళ్ళే, సైనిక అధికారులు, స్థానికులు. అందరిమాట అలా వుంచితే, టవునులోనే అతి పెద్ద ఆసామీ, అత్యంత ప్రముఖుడు, పేరూ ప్రతిష్టా చూరగొన్నవాడూ, అందరినోటా దర్పంగా నానేవాడూ, మాటలపుట్టా, పరిచయమే అక్కరలేని పెద్దమనిషి పైథాగరొస్ పైథాగొరావీచ్ థ్చెర్తొకౌట్స్కి కూడా ఆ పార్టీలో వుండటం గమనార్హం.

అతను కూడా సైన్యంలో పనిచేసిన పాతకాపే. పైగా పై అధికారిగా చేసిన బాపతే. తను పని చేసిన రోజుల్లో అతని పటాలం ఏచోట వున్నాసరే అక్కడ జరిగే అన్ని రకాల ప్రధాన విందువినోదాల్లో అతని హాజరీ తప్పనిసరి. తంబొఫ్, సింబిర్స్క్ జిల్లాలలోని యువతుల నోటివెంట వినాలి ఇతగాడి పరపతి.

“ఛీ..ఛీ… వీడూ… వీడి చెత్త యవ్వారాలు,” అని తక్కిన జిల్లాలు కూడా అనుకుని ఆ నోటా ఈ నోటా ఆ మాటలు అక్కడా ఇక్కడా పొక్కకముందే సర్వీసు నుంచి తానే మర్యాదగా తప్పుకోకపోయివుంటే ఇతని పరపతి మరిన్ని జిల్లాలు పాకి దాటేదేనేమో!

ఇంతకీ అతనే వదలేసాడా? పైవాళ్ళే తీసిపారేసారా ఉద్యోగం నుంచి? అంటే మాత్రం ఇదమిద్దంగా నాకు తెలియదు, కానీ తనే రాజీనామా చీటీ ఇచ్చేదాకా మాత్రం వాళ్ళు వదల్లేదని తర్వాత నిక్కచ్చిగా తెలిసింది.
అయితే ఇంతటి ప్రమాదకర ప్రహసనం కూడా అతని ఉద్యోగ విరమణ తర్వాతి ఇన్నాళ్ళ ప్రతిష్టకి ఎలాంటి భంగం కలిగించలేకపోయింది.

మరే, అతనే… థ్చెర్తొకౌట్స్కి. అతను ఎప్పుడు బయట కనిపించినా కోటులోనే. అదీ కూడా మిలటరీ కుట్టులోనే. కాళ్ళకు అశ్విక దళంలోని సైనికులు వేసుకునే అంచులకు లోహపు తొడుగు వుండే బూట్లతో, మెలితిప్పిన మీసాలతో కనిపించేవాడు ఎప్పుడూ. ఎందుకంటే అలా కాకపోతే తనను ఏ మామూలు సైనిక పటాలంలోనో పనిచేసినవాడని జనాలు అనుకుంటారని గాభరా. పైగా అతనికి సైనిక పటాలం గురించి బాగా చిన్నచూపు. వీలు చిక్కినప్పుడల్లా సైనిక పటాలాన్ని తన మాటల్లో తీసిపారేస్తుంటాడు, కొన్నిసార్లు బూతులు కూడా మాట్లాడి. అతను చాలా మేళాలకు వెళ్తాడు. ఇట్లాంటివాటికి మొత్తం దక్షిణ రష్యా జనాలంతా వచ్చేస్తుంటారనుకోండి. ఇంటిపనులు చేసుకునే పనిపిల్లలు, పొడుగు సుందరాంగులు, దిట్టంగా కనిపించే మగాళ్ళు ఇలాంటి మేళాలో తరచూ కనిపిస్తుంటారు. వాళ్ళు ఈ మేళాలకు వచ్చే వాహనాలు మాత్రం భలే చిత్రవిచిత్రంగా వుంటాయి; మనం అట్లాంటి వాహనాలను కలలో కూడా చూసి వుండమనుకోండి. కానీ ఎప్పుడయినా, ఎక్కడయినా అశ్వికదళం వచ్చిందని అనిపించిందా, ఇట్టే చిటికెలో పసిగట్టేస్తాడు థ్చెర్తొకౌట్స్కి. అట్లాంటి సందర్భాల్లో స్వయంగా వెళ్ళి ఆ అధికారులకు తనని పరిచయం చేసుకోకుండా ఎట్టిపరిస్తితుల్లోనూ ఆపుకోలేడు. అసలు వారిని చూసీచూడగానే తనే బగ్గీ దిగి వెళ్ళి చాలా హూందాగా పరిచయాలు చేసుకోకుండా అస్సలు వుండడు. పోయినసారి ఎన్నికలపుడు టవునులోని పెద్దమనుషులందరినీ ఆహ్వానించి ఆడంబరమైన విందు ఏర్పాటు చేసి ఈ సారి కనుక తనని మార్షల్ గా ఎన్నుకుంటే ‘సమర్థులకు సముచిత పదవులు దక్కుతాయని’ భారీ వాగ్దానమే చేసాడు. అతను కూడా తనను తాను ఓ పెద్దమనిషిగానే భావించుకుని అట్లానే నడుచుకుంటుంటాడు మరి. అతని భార్య చాలా అందగత్తె. కట్నంలో వేలాది రూబుల్స్ తో పాటు, రెండు వందల మంది గాసం ఇచ్చే పనిలేని పనివాళ్ళు వరకట్నం వాటా కింద వచ్చారు. ఆ కట్నం డబ్బులతోనే ఆరు మేలురకం గుర్రాలు, కొన్నిపూత బంగారు రాగి గిల్టు తాళాలు, ఒక పెంపుడు కోతినీ కొన్నాడు. ఇంట్లో వంట చేసేందుకు ఒక ఫ్రెంచి వంటమనిషిని గాసానికి పెట్టుకున్నాడు. భార్య తరపున వచ్చిన రెండు వందల మంది ఆ పనివాళ్ళు, తన దగ్గర అప్పటికే వున్న మరో రెండు వందల మంది అలాంటి పనివాళ్ళను బ్యాంకులో కుదువ పెట్టాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అందరిలాగే అతనూ ఓ పెద్దమనిషి, అంతే!

ఇప్పుడు జనరల్ ఆహ్వానించిన విందు జాబితాలో ఇతనిలాగే మరికొంతమంది పెద్దమనుషులు కూడా వున్నారు, కానీ వారి గురించి మాట్లాడుకోవడం మనకు అనవసరం. వచ్చిన సైనిక అధికారుల్లో కల్నల్, మేజర్ అత్యంత ప్రముఖులు అనే చెప్పాలి.

ఇక జనరల్ బాగా లావుపాటి మనిషి, మంచిమనిషి అని పేరు; అంటే, మనకేం తెలుసుకానీ, అతని కింది సిబ్బంది అనుకునే మాట అది. అతని గొంతు చాలా గంభీరం.

విందు పసందుగా వుండింది. టేబులు నిండా సముద్రపు దెయ్యం చేప, నది పొలస, దుబ్బ బట్టమేక పిట్టలు, తోటకూర, కౌజు పిట్టలు, కోలంకి పిట్టలు, పుట్టగొడుగులు.

ఈ వంటల ఘుమఘుమలు, ఆ అమోఘమైన రుచులు చూస్తుంటే వంటవాడు గత ఇరవైనాలుగు గంటలూ నిష్ఠగా ఏ మందూ కొట్టకుండా గరిటె తిప్పాడనేందుకు దాఖాలాగా వుంది అది. అతనికి సాయంగా నలుగురు సైనిక సిబ్బందిని ఇచ్చారు. మాంసాన్ని కూరగాయలతో కలిపి దమ్ చేసేందుకు, తీపి తినుభండారాలు చేసేందుకు రాత్రంతా కునుకుతీయకుండా కత్తులు, గరిటెలు పట్టారు ఆ నలుగురూ. లెక్కలేనన్ని పొడవాటి మెడలున్న సీసాలు, వాటి మధ్య అక్కడక్కడా చిన్నపాటి సీసాలు, వాటిల్లో ఎర్రని ఫ్రెంచి ద్రాక్ష సారా, ఆఫ్రికాలోని వాయువ్య కోస్తా నుంచి దిగుమతి అయిన తెల్ల ద్రాక్షసారా (మదైరా) బిరడాలు బిగించి వుంది. అది ఆహ్లాదమైన వేసవి పగలు, అవి విశాలమైన కిటికీలు, ఒద్దికగా ఒకదానిపై ఒకటి పేర్చిన ప్లేట్లు, ఐసు ముక్కలు, కాస్తే నలిగిన చొక్కాలు, ధిటంగా, గలాటాగా వినిపిస్తున్న సంభాషణలు, అప్పుడప్పుడు పొడుచుకువచ్చినట్టు వినిపించే జనరల్ గొంతు, షాంపేన్ టపీమని పొంగిన చప్పుడు… అంతా చక్కగా అమరినట్టు వుంది ఆ విందు.

తృప్తిగా తిన్న అతిథులు, చేతుల్లో కాఫీ కప్పులు అందుకుని, పొగాకు పైపులు వెలిగించి మెల్లిగా బయటికి వరండా వైపు నడిచారు.

“ఇక్కడి నుంచి కనిపిస్తుంది చూడండి!” అన్నాడు జనరల్.

“హేయ్, బాబు, ఆ కొత్త గుర్రం పిల్లని ఇటు తే!” తనకు సహాయకుడిగా నియమించబడ్డ ఆ యువ అధికారిని కేక వేసాడు.
“మీరే మీ కళ్ళారా చూడాలి దాన్ని,” గుమిగూడిన అతిథులకు చెప్పి, గాట్టిగా పైపు నుంచి పొగ పీల్చాడు.

“ఇంకా కోలుకోలేదు పిల్ల ముండది, అరే, ఏం పిచ్చి టవును ఇది? గుర్రాలకు ఒక్కటంటే ఒక్కటి సరైన శాల లేదు, చెత్త ఊరు. అయినా చూడండి, నా గుర్రం; చూడ్డానికి, ఫర్వాలేదు కదా, అందంగానే వుంది కదూ?”
‘ఉఫ్… ఉఫ్…’ అంటూ ఇంతదాకా లోపలే వుంచుకున్న పొగని ఒక్కసారిగా వదిలేసాడు ఆ మాటల తర్వాత జనరల్.
నశ్యం రంగులో వున్న గోడిగ (ఆడ గుర్రపు పిల్ల) అది.

“తమరు ఎప్పటి నుంచి ఈ గుర్రం కొనాలని అనుకుంటూ వుండినారో తెలుసుకోవచ్చా?” ఉఫ్… ఉఫ్… అని పొగ వదులుతూ థ్చెర్తొకౌట్స్కి వాకబు మొదలుపెట్టాడు.
“ఎంతో కాలం కాదు, రెండేళ్ళ క్రితం బ్రీడింగ్ సెంటరు నుంచి రప్పించాను.”
“మరి తర్ఫీదు అయిన తర్వాతే రప్పించారా? లేక, ఇక్కడే తర్ఫీదు ఇప్పిద్దామని తెచ్చారా తమరు?”
ఉఫ్… ఉఫ్… ఉఫ్… ఉఫ్…

“ఇక్కడా?”
అతను తన వాకబు కొనసాగిస్తుంటే ఒక పొగ మేఘం వెనక జనరల్ మాయమైపోయాడు.
అప్పుడు ఒక జవాను గుర్రపు శాల నుంచి దూకాడు. గిట్టల చప్పుడయ్యింది. గుబురు మీసాలతో, తెల్లని గౌను వేసుకున్న మరో జవాను పగ్గాలు పట్టుకుని హడలి బెంబేలెత్తిన ఆ గుర్రప్పిల్లని తోలుకుని వచ్చాడు. అది ఒక్కసారిగా తన కాళ్ళు ఎత్తి సకిలించింది.

“దా… దా… అగ్రఫెనా ఇవనోవ్నా!” అంటూ వరండావైపు దాన్ని నడిపించాడు.
అగ్రఫెనా ఇవనోవ్నా, అదీ… దాని పేరు. ధృడంగా, దిట్టంగా దక్షిణ సుందరిలా వుందది. అది ఉన్నట్టుండి కదలకుండా నిలబడిపోయింది. దాన్ని తదేకంగా చూస్తున్న జనరల్ కళ్ళలో తృప్తి కనిపించింది. అతను పొగ పీల్చడం ఆపేసాడు. కల్నల్ కూడా మెట్లు దిగి గుర్రం దగ్గరకి వెళ్ళి నిమిరాడు. మేజర్ కూడా దాన్ని కాళ్ళను తొడలదాకా తడిమి చూసాడు. దాంతో అందరూ దాని వైపు పొలోమని గుమిగూడారు. థ్చెర్తొకౌట్స్కి కూడా వరండా దాటి గుర్రం పక్కన నిలబడ్డాడు. గుర్రం చుట్టూ చేరిన అతిథులపైన ఓ కన్నేసి వుంచాడు పగ్గాలు పట్టుకున్న ఆ యువ జవాను.

“బాగుంది, బాగుంది, భలే వుంది,” అన్నాడు థ్చెర్తొకౌట్స్కి.
“ఎద కూడా బాగుంది, తమరిని ఒకటి అడగొచ్చా? దౌడు అదీ ఎలా వుందీ, అని!”
“చాలా… అంటే చాలా బాగుంది. ఆ వెధవ డాక్టరు ఏవో పిచ్చి గోళీలిచ్చి సచ్చాడు, దాంతో రెండు రోజుల నుంచి పిచ్చి పిల్లది తుమ్ముతోంది అంతే!“
“పుష్టిగా వుంది, తీరుగా. మరి తమరు దీన్ని దేనికి కడదామని అనుకుంటున్నారు?”
“దేనికా? అంటే, పగ్గాలున్నాయి కదా!”

“మరీ అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు తమరు, దీనికి తగిన బండి ఏదైనా రప్పించేందుకు ఆలోచిస్తున్నారా అని?”
“ఓహ్! అదా… లేదు, ఉన్నమాట చెప్పాలి కదా, కొంత కాలంగా బగ్గీ ఒకటి కొనాలని అనుకుంటున్నాను. ఈ మధ్యే తయారు చేసారట కదా. నాకు వాటి గురించి పెద్దగా తెలియదు. మా తమ్ముడికి ఉత్తరం రాసాను; వాడు సెయింట్ పీటర్స్బర్గ్ లో వుంటున్నాడు ఇప్పుడు. మరి నాకోసం తీరిక చేసుకుని ఒక బగ్గీ… పంపుతాడో లేదో.”
“నాకు తెలిసి, తమరు ఏమీ అనుకోకపోతే, వియన్నా బగ్గీలకన్నా మెరుగయినవి లేనే లేవు.” కల్నల్ తేల్చేసాడు తన వంతుగా.

“భలే మాట చెప్పారు, నా మాటా అదే.” ఉఫ్… ఉఫ్…
“నా దగ్గర అద్భుతమైన వియన్నా బగ్గీ వుంది మరి,” చెప్పుకొచ్చాడు మన థ్చెర్తొకౌట్స్కి.
“మీరు వచ్చింది అదేనా?”
“అయ్యో, లేదు, కాదు, తెచ్చింది, అది ఇక్కడ నన్ను మామూలుగా తిప్పడానికే, ఇంకోటి వుంది, ఇంటిదగ్గర, అదీ అద్భుతం అంటే. అది ఇలా కాదు, ఈక అంత అలితిగా వుంటుంది. పైగా మీరు అందులో కూర్చున్నారే అనుకోండి, మీ చిన్నప్పటి ఆయా మీ ఉయ్యాలని ఊపుతున్నట్టే వుంటుంది.”
“అబ్బా, అంటే భలే సౌకర్యం!”
“మరీ, అలాంటిలాంటి సౌకర్యమా, మెత్తని సీట్లు, అంతే తూగు ఇచ్చే స్ప్రింగులూ, ఒకటేమిటి అంతా బందోబస్తుగా వుంటుందనుకోండి.”
“ఓహో! మరింకేం? భలే!”

“పైగా, అందులో ఎంత లగేజీ పడుతుందనుకుంటున్నారు? తమరే కాదు, నేనూ ఊహించనంత. ఎక్కడా చూడలేదు, నేను కూడా అస్సలు అలాంటిది. నేను ఇంకా సర్వీసులో వున్న రోజుల్లో నన్ను ఎక్కించాక కూడా, ఇంకా పది సీసాల రమ్ము, ఇరవై పౌండ్ల పొగాకు, రెండు పొగాకు పీల్చే పైపులు, అంటే మీరు చూసి వుండరు అంత పెద్దవి… అవీ పట్టేసేవనుకోండి. ఇది కాక, బగ్గీకి వుండే ఇటుఅటు వుండే జోబుల్లోనయితే ఓ భారీ ఎద్దునే కుక్కేయచ్చనుకోండి హాయిగా.”
“అవునా, వినడానికే భలే వుందే!”
“ఇంతా చేసి దాని రేటు కేవలం నాలుగు వేల రూబుళ్ళు మాత్రమే, తమరు గమనించాలి.”
“మంచి రేటుకే వచ్చినట్లే మరి, మీరే కొన్నారా?”
“లేదు… లేదు… నా అదృష్టం కొద్దీ అది అలా దక్కింది అంతే. అంటే, నా పాత నేస్తుడిదే అది. వాడే కొన్నాడు. వాడు చాలా మంచివాడు. తమరు వాడిని కలిసినా ఇదే మాటే అంటారు. మేమిద్దరం చాలా దగ్గర; ఎంతగా అంటే, వాడిది ఏదయినా నాదే, నాది ఏదయినా వాడిదే అనేంతలా. వాడి దగ్గరి నుంచే నేను పేకాటలో దాన్ని గెలుచుకున్నాను. తమరు రేపటి రాత్రి భోజనం మా ఇంటి దగ్గర చేసే భాగ్యం మాకు కలిగించారే అనుకోండి, మీరు ఆ బగ్గీని స్వయంగా చూడొచ్చు మరి!”
“అవునా? నాకేమీ పాలుపోవడం లేదు; నేను ఒక్కడినే అయితే రాలేనేమో! నాతో పాటు మా అధికారులనూ అనుమతిస్తే ఆలోచిద్దాం…”

“అయ్యో, ఎంత మాట, వారు లేకుండానా? తమరంతా మా ఇంటికి రావడం అదృష్టం కాక మరేంటి?, తప్పకుండా.”
అలా అనగానే, కల్నల్, మేజర్ తో పాటు ఇతర అధికారులు కూడా మన థ్చెర్తొకౌట్స్కికి ధన్యవాదాలు తెలిపారు.
“తమరు ఏమీ అనుకోకపోతే ఒక మాట, మనం ఏదయినా కొన్నామే అనుకోండి అది పక్కాగా, బాగుండాలి, అంతే. లేకపోతే తీరా ఇంతా చేసింది దీని గురించా అని ఎవరూ అనుకోకూడదు కదా, మనతో పాటూ? తమరు రేపు పొద్దున వస్తున్నారని కొంచెం ముందే చెబితే మా ఎస్టేటులో నేను ప్రవేశపెట్టిన మార్పులు కూడా మీకు చూపించే వీలుంటుంది నాకు.”
అతనివైపు ఓ చూపు పారేసి ఓ తాజా పొగాకు మేఘాన్ని ఊదేసాడు.
థ్చెర్తొకౌట్స్కికి తన రేపటి ఆహ్వాన ఆలోచనే తనకి తెగ నచ్చేసింది.

రేపటి తన ఇంటిలో విందుకు ఏమేమి సరంజామా, సరుకులు, సదుపాయాలు, వంటలు, ఇతర వినోదానికి తగినవన్నీ, తక్కినవన్నీ ఎవరితో చేయించాలో, ఎవరెవరికి ఏమేమి పురమాయించాలో అనే ఆలోచనల్లో ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు కాసేపు.

తనవైపు చూసి కొనితెచ్చుకున్న దర్జాకోసం సర్దుకుంటున్నారనుకున్న ప్రతి అతిథిని గమనించి అతని వైపు తన నవ్వుముఖం పారేసుకున్నాడు మన థ్చెర్తొకౌట్స్కి.

అతను అలా గుంపులో నిలబడినపుడు ఒక భరోసా, అతని ప్రతి పలకరింపు ఒంపులో ఓ గొప్ప తృప్తి ప్రకాశించింది.
“తమరికి, మా ఆవిడని కూడా పరిచయం చేయాలనుకుంటున్నాను, మరి తమరు ఏమంటారో?”
“అయ్యో! అంతకంటేనా, తప్పకుండా,” మీసాలు మెలివేస్తూ బదులిచ్చాడు జనరల్.

ఆ మాట జనరల్ నోట వినీవినకుండానే తన ఇంట్లో అందుకు… అంటే అనుకున్న మరుసటి రోజు విందుకు తగిన ఏర్పాట్లలో మనసులో తక్షణం మునిగిపోయాడు ఆ క్షణానికి. తన టోపీ తీసేసుకున్నాడు, కానీ, ఇంకా కాసేపు అక్కడే, ఆ జనరల్ సాంగత్యంలోనే వుండాలని ఏదో తనలో లాగేస్తోంది. ఒక గదిలో నాలుగు చెరుగులా కూర్చుని అప్పటికే ‘విస్ట్’ అనే పేకాట ఆడుతున్నారు అతిథులు. గదికి దీపాలు తెచ్చి వెలిగించారు. ఆటకి ఎటు వైపు కుదురుకోవాలో తేల్చుకోలేదు థ్చెర్తొకౌట్స్కి. ఆ సైనిక అధికారులు పిలవనే పిలిచారు. ఇక వెళ్ళకపోతే మర్యాద కాదని తప్పనిసరిగా వెళ్ళి కూర్చున్నాడు ఆటకు. అతని మోచేతి కిందకు ఒక మందు గ్లాసు ఎట్లా వచ్చి చేరిందో నాకయితే తెలియదు మరి. ఏమీ ఆలోచించకుండా ఆ గ్లాసు లేపేసాడు. అప్పటికే రెండు రబ్బర్లు (ఒక రబ్బరు అంటే మూడు ఆటలు) ముగిసిన తర్వాత తన చేతికి అందుబాటులో మరో మందు గ్లాసు కనిపించింది. దాన్నీ గుటుక్కుమనిపించాడు.

కానీ, “అబ్బా! ఇంటికి వెళ్ళి పోవాలి, మిత్రమా!” అని అనడం మానలేదు.
మళ్ళీ తాజాగా మరో రబ్బరు ఆడటం మొదలుపెట్టాడు.

అయితే, ఆ గదిలోని సంభాషణలు మరోస్థాయికి చేరుకున్నాయి. ఆడేవాళ్ళు గమ్మున ఆడుతున్నారు, పక్కన చూస్తున్న వాళ్ళ అరుపులే టాపు లేస్తున్నాయి. ఇక ఒక కెప్టెన్ అయితే సోఫాలో చేరగిలపడి, నెత్తికింద దిండు పెట్టుకుని, ఒక మందను పోగేసుకుని తన రాసలీలలను కథలుకథలుగా చెప్పుకుంటూపోతున్నాడు. ఆ మందలో ఇంకో ఊబకాయం అయితే కెప్టెన్ కథలను చాలా ఆసక్తిగా చప్పరిస్తున్నాడు. అతని రెండు జబ్బలూ రెండు వేలాడే ఆలుగడ్డల్లా వున్నాయి. అతను మాటిమాటికీ తన కోటుకుండే రహస్య జేబునుంచి పొగాకు సంచీ లాగేందుకు తమాయించుకుంటున్నాడు. ఇంకో మూలన గుర్రాల సైనిక దళ విన్యాసాల గురించిన గంభీరమైన చర్చ జరుగుతోంది. అప్పటికే పేకాటలో జాకీ పైన కింగ్ రెండు సార్లు పారేసిన థ్చెర్తొకౌట్స్కి కూచున్నచోటి నుంచే అరిచాడు:

“మీరు చెప్పేది ఏ సంవత్సరం సంగతి? ఏ రెజిమెంట్ మాట?”
తన ప్రశ్న, లేదా తన మాట ఎవరైనా వింటున్నారా, లేదా? అన్న పట్టింపే అతనికి లేదు.

భోజనాలకు కొద్ది నిమిషాల ముందు పేకాట ముగింపుకొచ్చింది. థ్చెర్తొకౌట్స్కి బాగానే గెలిచాడు, అయితే గెలిచినవేవీ తీసుకోవాలనుకోనేలేదు. తీరా కాసేపటికి తమాయించుకుని లేచి మనిషిలా నిలబడిన తర్వాత తడుముకుంటే తన కోటులో చేతి రుమాలు లేదు. వాళ్ళంతా భోజనాలకు కూర్చున్నారు. చుట్టూ సీసాలున్నాయి, అందులో కావలసినంత ద్రాక్ష సారా వుంది; కాబట్టి, థ్చెర్తొకౌట్స్కి తన ప్రమేయం ఏమీ లేకుండానే గ్లాసు నింపుకున్నాడు. భోజనాల బల్ల దగ్గర సుదీర్ఘ సంభాషణ కొనసాగింది. అతిథులు ఎవరెవరు ఎవరెవరితో మాట్లాడుకుంటున్నారో పసిగట్టలేము. 1812లో ఎక్కడా జరగని ఒక సంగ్రామాన్ని గురించి ఒక కల్నల్ పూసగుచ్చినట్టు వివరిస్తున్నాడు గుంపుకి. అయితే, అలా తన మాటల మధ్యలో బిరడా తీసుకుని అతను భక్ష్యంలో ఎందుకు గుచ్చుతున్నాడో అనేది మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. ఎవరిదారిన వారు కదిలేటప్పటికి తెల్లవారు మూడు కొట్టింది. చాలామంది అతిథులను మూటల్లా ఎత్తుకుని తరలించారు జనరల్ తాలూకు పనివాళ్ళు. తన జమిందారీ పటాటోపం ఎక్కడికిపోయిందో ఏమో కానీ, థ్చెర్తొకౌట్స్కి అతిథులకు ఎంత సాదరంగా వంగి నమస్కారాలు పెట్టాడంటే, తన మీసాలలో ఇరుక్కున్న ముళ్ళ పల్లేరు కాయలు రెండు తనతోపాటే ఇంటికి తీసుకెళ్ళాడు. థ్చెర్తొకౌట్స్కిని ఇంటికి తోలుకునివచ్చిన జనరల్ తాలూకు పనిమనిషి అటూఇటూ చూసాడు, ఇంటి పనివారమంతా నిద్రపోతున్నట్టు గమనించాడు. అక్కడే పక్కనే నిద్రపోతూ కనిపించిన బండి తోలేవాడిని కనాకష్టంగా లేపాడు. అతను తన యజమానిని హాలు దాకా తీసుకునిపోయి అక్కడే వున్న మరో ఆడ పనిమనిషికి అప్పగించాడు. ఆమె వెంటరాగా నేరుగా పడకగదికి చేరాడు థ్చెర్తొకౌట్స్కి. దబాలున పడకమీద పడి ఒళ్ళు విరిచాడు. పక్కనే తన అందమైన పడుచు భార్య నిద్రిస్తోంది. ఆమె మంచులాంటి తెల్లని రాత్రి గౌనులో వుంది. తన భర్త అలా పడటంతో గాభరాగా టకీమని లేచింది. తను కూడా వళ్ళు విరుచుకుంది, కళ్ళు తెరిచి చూసింది, అంతే టకీమని మూసుకుని, ఆ తర్వాత విప్పార్చి చూసింది. ఆమె జుట్టు సగం చెదిరి వుంది. తన భర్త తనను కనీసం పట్టించుకోలేదని అటు తిరిగి, తన తాజా గులాబీ రంగు చెక్కిలిని తన చేతికి ఆన్చి మళ్ళీ నిద్రపోయింది. ఆ టవును ఆచారాలను బట్టి ఆమె ఆ రోజు ఆలస్యంగా లేచినట్టే లెక్క. భర్త మాత్రం ఎప్పుడూలేనంత విపరీతంగా గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. అతను తెల్లవారి నాలుగు గంటలకు ఇల్లుచేరాడన్న విషయం గుర్తుకు వచ్చింది ఆమెకే. అందుకే లేపాలనుకోలేదు. తను మాత్రమే లేచి తెల్లని పగటి గౌను వేసుకుంది. అది ఫౌంటేన్ నుంచి జారే జలగా వాలింది. ఆ తర్వాత చెప్పులు తొడుక్కుంది. సెయింట్ పీటర్ బర్గ్ నుంచి తన భర్త చాలా కాలం కింద తనకోసం పంపిన చెప్పులే అవి. అప్పుడు తన డ్రెస్సింగ్ రూంకి చేరుకుంది. ముఖం కడుక్కుంది, తనంత తాజాగా. టాయిలెట్ బల్ల దగ్గరికి వెళ్ళింది, అద్దంలో ముఖం చూసుకుంది. తను ఆ తెల్లవారు మరింత అందంగా తనకే తోచింది. ఆ అత్యంత అప్రధానమైన పరిసరమే ఆ అద్దం ముందు ఆమె మామూలుకన్నా రెండు గంటలు ఎక్కువగా గడపటానికి కారణం అయ్యింది. తన అభిరుచికి తగ్గట్టుగా దుస్తులు వేసుకుని తోట వైపు వెళ్ళింది. వాతావరణం చాలా ఆహ్లాదంగా వుండింది. ఆ వేసవిలోనే అత్యంత ఉల్లాసమైన రోజు అదే అనే చెప్పాలి. దాదాపు మిట్టమధ్యాహ్నానికి చేరుకున్న సూర్యుడు తన తీక్షణమైన కిరణాలను వంపుతున్నాడు. అయితే చెట్ల తోపున చల్లని పిల్లగాలి, ఎండ తాపానికి వాడిపోతోన్న పూలనుంచి అదోలాంటి పరిమళం ఆ గాలితో పాటు కలిసి వీస్తోంది. వీటి మధ్య ఆమెకి అది నడి మధ్యాహ్నం అనిగానీ, తన భర్త ఇంకా నిద్రలేవలేదన్న విషయం కానీ అస్సలు గుర్తుకే రాలేదు. అప్పటికే గుర్రపుశాలలోని ఇద్దరు జట్కా నడిపే వాళ్ళు, గుర్రాలకు శాదానం చేసే ఇంకో పనివాడూ పొట్టపగలా తినేసి కునుకుతీస్తున్న గురకలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె కూర్చున్న పొదరింటి నుంచి ఇంటి బయటి బాట స్పష్టంగా కనిపిస్తుంది. దూరంగా ఆ బాటలో దుమ్మురేగడం టకీమని తన కంటపడింది. కాసేపటికి ఆ దుమ్ములోంచి ఆమె ఒకటి వెంట మరొకటి ఏవో వాహనాలు వస్తున్నట్టు గమనించగలిగింది. ముందు రెండు సీట్లు వున్న ఒక గుర్రపు బగ్గీ వస్తోంది. అందులో తళతళలాడే సైనిక భుజకీర్తుల కోటులో జనరల్, అతని పక్కనే కల్నల్ వున్నారు. ఈ బగ్గీ వెనుక నాలుగు సీట్లు వున్న మరో బగ్గీ కనిపించింది. అందులో కెప్టెన్, లెఫ్టినెంట్లు, ఇతర పరివారం వున్నారు. దాని వెనక మేజరు బగ్గీ, దాని వెనుక మరో ఐదుమంది అధికారులతో కిక్కిరిసిన మరో బగ్గీ, అందులో ఒకతను ఇంకొకతని పైన కూర్చుని వస్తున్నాడు. ఆ ఊరేగింపు కొసన మరో మూడు జట్కాలు వున్నాయి కానీ, అందులో ఎంతమంది వున్నారు అనేది ఇదమిద్ధంగా తెలియడం లేదు.

“ఏంటి? వీళ్ళంతా మన ఇంటికేనా? వస్తోంది!” అనుకుంది అంతే దూరం నుంచి ఆమె.
“ఓరి దేవుడా! అవును, ఇటే తిరిగారే!” అరుచుకుంటూ, పూల దారుల వెంట నేరుగా పడకగది వైపు పరుగు తీసింది.
తన భర్త ఇంకా దిట్టంగా నిద్రపోతూనే వున్నాడు.
“లేవండి, లేవండి, తొరగా!” జబ్బ పట్టుకుని లాగింది.

“ఏం…టి? ఏమయ్యింది!” సణిగాడు థ్చెర్తొకౌట్స్కి కళ్ళు తెరవకుండా కాళ్ళు బార్లా జాపి వళ్ళు విరుస్తూ.
“అరే, లేవండంటే… అతిథులు విచ్చేస్తున్నారు, వినిపిస్తోందా? అతిథులు…”
“ఏం…టీ! అతిథులా! ఎవరి?” అనేసి, పాలు కుడుస్తున్న లేగ ఆబగా అరిచినట్టు ముద్దముద్దగా “ఉ…మ్మా… ముద్దు పెట్టుకోనా?” అంటూ బులిపించాడు.

“అబ్బా, లేవండి… అర్రే… తొందరగా, జనరల్ వచ్చినట్టున్నారు, ఆయనతో పాటు ఎవరో ఇంకా అధికారులుకూడా. అయ్యో! అందేటి, మీ మీసాల్లో పల్లేరు కాయలున్నాయి?”
“జనరలా! వచ్చేసారా? ఓరి దేవుడా, నన్ను ఎందుకు ఎవ్వరూ లేపలేదు. మరి భోజనాలు, వంటలు అయిపోయాయా?”
“ఏం వంటలు, ఏం భోజనాలు?”
“నేనేమీ చెప్పలేదా ఎవరికీ? ఇట్లా భోజనానికి పిలిచానని, నీకూ?”

“మీరు వచ్చిందే తెలవారుజామున నాలుగింటికి, పైగా పలికితేగా? ఒక్క మాట కూడా వినే పరిస్థితిలో లేరు. పొద్దుపోయి వచ్చారు కదా, పడుకోనిలే, అని నేనే లేపలేదు.”
నడినెత్తిమీద పిడుగు పడినవాడిలా కళ్ళు తేలేసాడు, కదలకుండా కాసేపు అలా నిలబడిపోయాడు థ్చెర్తొకౌట్స్కి. ఉన్నపళంగా పరుపు మీది నుంచి కిందికి వంటిమీదున్న చొక్కామీదే దూకేసాడు ఒక్క ఉదుటున.
“వెధవ నాయాలా!” కసిగా తలకొట్టుకున్నాడు; “చిట్టీ, నేనే పిలిచాను మన ఇంటకి, భోజనానికి వాళ్ళను, ఇప్పుడేం చెయ్యాలే? ఇంతకీ ఎంత దూరంలో వున్నారు వాళ్ళు?
“క్షణంలో గుమ్మం ముందు వుంటారు!”
“పదపదా, నువ్వు కూడా దాక్కో. అమ్మో వచ్చేసారు, అక్కడ, కాదు, ఇక్కడ, పిచ్చి నాయాలా, ఎందుకురా అంత భయం? వాళ్ళు వస్తే, నేను ఇంట్లో లేను, పొద్దున్నే బయటికి వెళ్ళాను, ఇవాళ ఇక రానని చెప్పవా! చిట్టీ, అర్థం అవుతోందా? పో, పోయి పనివాళ్ళకందరికీ ఇదే… అంటే ఇట్లానే చెప్పు. పద, వెళ్ళవే నా తల్లీ తొందరగా!”
ఇలా తత్తరగా మాట్లాడేసి తన గౌనే తట్టుకుని పడబోయాడు, తమాయించుకుని పరిగెత్తి పోయి బండ్లు వుంచే గదికి వెళ్ళి దాక్కున్నాడు. అదే అన్నింటకన్నా సురక్షితం అనుకున్నాడు. అయితే తాను నక్కిన చోట వాళ్ళకి కనిపించేస్తానేమో అనుకున్నాడు.
“ఇక్కడ దాక్కుంటే మంచిదనుకుంటా,” అనుకుని ఒక బండి మెట్ల పక్కన చేరి ముడుచుకున్నాడు. అదే అతను జనరల్ కి వివరించి చెప్పిన బగ్గీ. మళ్ళీ ఎందుకో ఆలోచించి అందులోకే దూరి తలుపులు మూసేసుకున్నాడు. మరింత జాగ్రత్తపడి పక్కనే కనిపించిన తోలుకోటు తన పైన కప్పుకుని సగానికి వంగి దాక్కున్నాడు.
సరిగ్గా అప్పుడే జనరల్ తాలూకు వాహనాలు ఇంటి వసారారాలో శబ్దాలుగా ఆగాయి. తన వాహనం నుంచి జనరల్ దిగి సర్దుకున్నాడు. ఆ తర్వాత కల్నల్ దిగి తన టోపీ తురాయిని సవరించుకున్నాడు. ఆ తర్వాత లావుపాటి మేజర్ దిగి తన చేతులు ఆడించుకునేలా ఖడ్గాన్ని అమర్చుకున్నాడు. ఆ తర్వాత లెఫ్టినెంట్లు, ఇతర అధికారులు ఒకరివెంట ఒకరు దిగి తయారీగా నిలబడ్డారు.

“అయ్యగారు ఇంట్లో లేరయ్యా,” మెట్లు దిగుతూ చెప్పాడు ఓ పనివాడు.
“లేరా! భోజనానికి వస్తుండొచ్చు కదా?”
“రారయ్యా, వస్తే… మళ్ళీ రేపు ఈ టయానికి వస్తారనుకుంటా.”
“ఛస్, మరి ఏర్పాట్లు!” పెదవి విరిచాడు జనరల్.
“ఏం తమాషా,” వెటకారంగా నవ్వాడు కల్నల్.

“ఇది పద్ధతి కానే కాదు! తనే లేనప్పుడు మనల్ని పిలవడం ఎందుకు మరి?” కోపగించుకున్నాడు జనరల్.
“అదే నాకూ అర్థం కావడం లేదు దొరగారూ, ఎవరైనా ఇట్లా ఎట్లా చేస్తారసలు?” ఒక యువ అధికారి చికాకు పడ్డాడు.
“ఏమంటున్నావ్!” అడిగాడు జనరల్.
విన్నదే తిరిగి వినేందుకు కెప్టెన్ స్థాయికి కింద వుండే ఒక అధికారిని అలా పురమాయించి వుంటాడు ఎన్నటికీ జనరల్.
“ఆశ్చర్యంగా వుంది, దొరా! ఎవరైనా ఇట్లా ఎట్లా చేస్తారసలు?”
“కదా! ఏదైనా చివరి నిమిషంలో మారితే మనతో ముందే చెప్పాలి కదా!”
“చెప్పేదేమీ లేదు, చేసేదేమీ లేదు, తమరు సరే అంటే, మనం తిరిగివెళ్ళిపోదాం, అంతే!” అనేసాడు కల్నల్.
“అంతే, అంతే, వెళిపోవాల్సిందే! అయితే, ఇంత దాకా వచ్చాం కదా, అతను లేకపోతేనేం, ఆ కొత్త బగ్గీ ఏదో చూసే పోదాం, ఏమంటారు? ఏయ్! బాబు, ఇటురా!”
“అయ్యా! పిలిచారా? చిత్తం, చెప్పండి దొరగారూ!”
“మీ అయ్యగారి బగ్గీ, కొత్తగా తీసుకువచ్చారే అది, ఎక్కడో చూపించు పదా!”
“ఓ, అయితే, బండ్లు పెట్టేది అక్కడ, తమరు ఇటు నడవండి.”
ఆ గదిలోకి జనరల్, అతనితో పాటు అతని పరివారం అంతా నడిచారు.
“కొంచెం ఇటు లాగనా, బాగా చీకటిగా వుంది, తమరు ఇబ్బంది పడకుండా,” అనుమతి కోసం అడిగాడు పనివాడు.
“అక్కర్లేదు!”
జనరల్, అతని పరివారం అంతా కూడా ఆ బగ్గీ చుట్టూ పరిశీలనగా తిరిగారు. దాని చక్రాలు, స్ప్రింగులు నిశితంగా చూసారు.
“ఏముంది ఇందులో, చస్! ఇదొక మామూలు జట్కా!” మిటకరించాడు జనరల్.
“అవును ఏమీ లేదు, తమరు ముందే ఇదే అన్నారు అనుకోండి!” వంత పాడాడు కల్నల్.
“ఇదా, ఆ… అది?… తమరు ఏమీ అనుకోకపోతే, దీనికి నాలుగు వేల రూబుల్లా!?” ఆ యువ అధికారి చొరవ చేసాడు.
“ఏమన్నావ్!”
“అదే, నాలుగు వేల రూబుల్లు దీనిపైన పెట్టడం…”
“నాలుగు వేలా! దీనికి రెండే ఎక్కువ. ఏమో! లోపల అదీ ఇదీ ఏమైనా చేపించారంటావా? తెరువు, ఆ ముచ్చటా తీరనీ.”
గౌనులోనే థ్చెర్తొకౌట్స్కి దర్శనమయ్యింది ఆ పరివారానికి.
“ఆహా! ఇక్కడున్నావా?” చకితుడయ్యాడు జనరల్.
తెరిచినదాన్ని తెరిచినట్టే ఆ జట్కా పరదాని మూసేసి కనీసం తన పరివారంతో కూడా మారుమాట మాట్లాడకుండా అక్కడినుంచి చకచకా వెళిపోయాడు జనరల్.

*

అనంతు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు