కొండ గాలి, కింద కొత్తగా వేసుకున్న ఆ వంద పాకల మీదుగా వెళుతోంది. అక్కడొకటి అక్కడొకటి ఇళ్ల మీద ఎర్రజెండా ఎగురుతోంది.గాలికి జెండా టప టపా కొట్టుకుంటోంది.
పైన నీలాకాశం, కింద కొండలు, పక్కన పాకలు, చాల కొన్ని డాబాలు,ఇంకా కొన్ని పెంకుటిల్లు.
సైకిల్ ఎదర హేండిల్ బార్ కి ఎర్ర జెండాలు తగిలించుకొని దిగిపోతున్నాడు ఒక మగ మనిషి.
ఇళ్ల దగ్గర టిఫిన్లు అమ్ముకుంటున్నారు పెద్దవయసు ఆడాళ్ళు. చుట్టూ పిల్లలు ,పెద్దవాళ్ళు గిన్నెలు పట్టుకొని మూగి వున్నారు.
అల్లికాయలు జేబీల్లో వేసుకొని గుంటలు నూకాలమ్మ గుడి దగ్గరకు వెళ్తున్నారు. కర్ర బిల్లా ఆట రోడ్డు మయంగా ఆడుతున్నారు కొంతమంది.
జనాలు కొంతమంది పోర్టు, డాక్ యార్డ్లలో రోజుకూలీ లేబర్ లా పనిచేయడానికి కేరేజీలు కట్టుకొని వైరు బేగుల్లో పట్టుకుపోతున్నారు.
* * *
జజ్జనకరి జనారే జనకు జనా జనారే
జజ్జనకరి.. జజ్జనకరి.. జజ్జనకరి జనారే ..
రారోరే రరారే .. జనకు జనా జనారే
గజ్జెల చప్పుడు, గజ్జె కట్టిన చప్పుడు.
డోలక్ చప్పుడు, కంజరి చప్పుడు
ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు
నాగులో నాగన్న ధరలిట్టా పెరగబట్టే
నాగులో నాగన్న.
ఊర్వశీ జంక్షన్ దగ్గర జనం అంతా వృత్తంలో ఉండగా తెల్ల బనీను, పంచె, చేతిలో ఎర్రజెండా తో పాటలు పాడుతున్నారు ప్రజా కళాకారులు.
చూసినంత సేపు చూసి తమ బస్సు రాగానే వెళ్లిపోతున్నారు పనిచేసుకునే జనాలు.
* * *
కూడూ గుడ్డా కావాలంటే పోరాటం … పోరాటం
విద్యా వైద్యం కావాలంటే పోరాటం.. పోరాటం.
మంచి నీళ్లు కావాలి,కావాలి.
వీధి కుళాయిలు ఏర్పాటు చేయాలి
నేషనల్ హయివే నెంబర్ 5 పక్కన టెంటు వేసి
బర్మా క్యాంపు లో వున్న పార్టీ సానుభూతిపరులు , పిల్లలతో కలిసి ధర్నా చేస్తున్నారు.
కొండల మీద ఇల్లు, ఎగుడు దిగుడు వూరు, పంతులమ్మ గారి కల్లాల నిండా అల్లూరి సీతారామరాజు నగర్ పేరుతో పార్టీ వాళ్ళు వేసిన పాకలు. తాగడానికి సరిగా నీళ్లు లేవు.
వాడకానికి కావాలంటే ఆ కొండ ప్రాంతంలో బోరింగు నుంచి నీళ్లు సరిగా రావు.
పిల్లలెక్కడో దూరంగా వున్న సెయింట్ పీటర్స్ స్కూల్ కో, కప్పరాడ కో, కంచరపాలెమో నడిచి వెళ్ళాలి. మరుగుదొడ్లు లేవు. కరెంటు అందరికీ లేదు.
* * *
” నా పేరు ముష్టేశ్వర్ రావ్ అండి, రోజూ ఇంటింటికి వెళ్లి ముష్టెత్తుతానండి , కానీ ఆదివారం మాత్రం వెళ్లనండి ”
” ఏమి ? పాపం ”
” ఎందుకంటే ఆదివారం నాడు టీవీలో రామాయణం వస్తుందండి, యెంత పిలిచినా ఎవలూ బయటకు రారండి. ఏ తల్లీ ఇంత అన్నం ముద్ద పడేయదండి ”
జనం అంతా ఘొల్లు మని నవ్వడం మొదలు పెట్టారు.
నవ్వించే ఆ చిన్న స్కిట్ అయిపోయాక ధరల మీద పాటలు, కర్షకుల మీద పాటలు, చివర్లో ఉపన్యాసాలు, తెల్లటి పేపర్ మీద ఎర్రటి అక్షరాలు. చివర్లో నాయకుల ఉపన్యాసాలు. బర్మా కేంపు నుంచి , తుమ్మడ పాలెం నుంచి, గొల్ల కంచరపాలెం నుంచి వొచ్చిన పార్టీ సానుభూతి పరులు, సభ్యులు, అక్కా , అన్న, పిన్ని, అత్తా చిన్నాన్న, మావయ్య అని ఒక కుటుంబ సభ్యుల్లా మాట్లాడుకుని వెళ్లిపోతున్నారు.
ఎవరికైనా ఆరోగ్యం బాగోక పొతే దగ్గరుండి చూసుకుంటున్నారు.
అల్లూరి సీతారామరాజు పాకల్లో వుండే ఒరియా బ్రాహ్మడు పాణిగ్రాహి ని చంపుతానని కేంప్ రౌడీలు బెదిరిస్తే పార్టీ అంతా అడ్డుకుంటోంది. “అమ్మో, వీళ్ళ జోలికి వెళ్ళకూడదు ” అని పైకే అనేశాడు కేంప్ రౌడీ నర్సింహమూర్తి
ప్రతి వేసవికి ఎవరో అంటిస్తే తగలాడిపోయి , గంటల్లారీలు వొచ్చే లోగా బుగ్గి బుగ్గి అయిపోయే కమ్మల పాకలను శక్తి మేర పార్టీలో పనిచేసే ఆడవాళ్లు ఆర్పుతున్నారు. ”
అందరికి తలో కొంత వండి పెడుతున్నారు. ఇళ్ల దగ్గర పులి హోరలు , కొబ్బరి అన్నాలు వండు కెళ్ళి ” తినండ మ్మా , బాధ పడకండి అంతా రెండురోజుల్లో సర్దుకుంటుంది ” అని చెబుతున్నారు.
” గ్రంధాలయం పెట్టి పుస్తకాల మీద చర్చలు చేస్తున్నారు, మూఢనమ్మకాలు వొద్దు – విజ్ఞానం ముద్దు అంటూ ప్రచారం చేస్తున్నారు.
అంతా ఒక కుటుంబం లాగ కలిసి కార్తీకం పికినిక్కులకు వెళుతున్నారు, పచ్చగడ్డి మీద కూర్చొని మళ్లీ వీధినాటికలు, పాటలు, ఆటలు, ఉపన్యాసాల పోటీలతో కోలాహలంగా గడుపుతున్నారు.
సిధార్థనగర్ లోను,కంచరపాలెం లోనూ, కేంప్ కింద పెద్ద స్టేజీ వేసి ఆదర్శ వివాహాలు చేయిస్తున్నారు.
” ఒకానొక పెళ్లిలోన ఒకానొక వింత జరిగినది సోదరి ” అని పాడి సాంప్రదాయ పెళ్ళిళ్ళను ఎద్దేవా చేస్తున్నారు.
ప్రమాణ పత్రాలు, దండలతో కులాంతర వివాహాలు చేసి, అభ్యుదయపు బుర్రకథలు పెట్టి జనానికి కొత్త విషయాలను పరిచయం చేస్తున్నారు.
ఎక్కడ చూసినా పార్టీ జనాలే, ఎర్ర పార్టీలోనే వేరే గ్రూపులైనా సరే ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు.
ఇచ్చాపురం, రాయగడ, శ్రీకాకుళం, విజయనగరం , పక్కనున్న గోదావరి జిల్లాల నుంచి పట్నం వొచ్చి బ్రతుకుదామనుకుంటున్న జనాలతో ప్రభుత్వ స్థలాలలో పాకలు వేయిస్తున్నారు. పిల్ల జెల్లాతో వొచ్చిన వాళ్లకు దారిచూపిస్తున్నారు, ప్రభుత్వంతో మాటాడి నీళ్లు , పట్టాలు వొచ్చే వరకు వొదలటం లేదు.
ఆ కమ్ముల పాకల మీద జెండాలు ఎగురుతున్నాయి, గౌరవంగా.
* * *
ప్రభుత్వ ఉద్యోగంలో కుదురుకున్న పార్టీ సానుభూతిపరుల కుటుంబాలు మెల్ల మెల్లగా బర్మా కేంప్ వొదిలేయడం ప్రారంభించారు. వూరికి దూరంగా వున్న కాలనీలకు కొంత మందీ, ఆఫీసులకు దగ్గరగా మరికొంత మందీ వెళ్ళిపోసాగారు.
“కేంప్” వలస వొస్తోన్న జనాలతో కిక్కిరిసిపోతోంది. జనం ఇళ్ళు కట్టుకోవడం కోసం కొండ ఎక్కేస్తున్నారు.
ఒకటి రెండు కుటుంబాలు తప్ప ఎక్కువ కుటుంబాలు ఆ గ్రామీణ మురికివాడను వొదిలి వెళ్లిపోయాయి,” కేంప్” లో జరుగుతున్న కొట్లాటలు, పిల్లల చదువులు వొంకతో దూరంగా జరిగిపోయాయి.
ఇలా వూర్లో ఎన్నో మురికి వాడల్లో జరగసాగింది, దగ్గరుండి అందరికి ఇళ్లు ఇప్పించిన పార్టీ జనాలు అక్కడ నుంచి కాలనీలకు మారిపోయారు.
వాడలు మరింత ఇరుకై పోయాయి. గొడవలు మరిన్ని పెరిగిపోయాయి, పాకలన్నీ పక్కా ఇళ్ళు అయిపోయాయి, స్తోమత గల బయట జనాలు ఆ ఇళ్ళు కొనుక్కొని మూడంతస్తుల మేడలు చేసి అద్దెలకు ఇవ్వడం మొదలు పెట్టారు.
కుల రహిత సమాజం కోసం పనిచేసిన జనాలు, కులంలో మూలాలు వెతుకులాట మొదలెట్టారు.
” కుటుంబం, వ్యక్తిగత ఆస్థి అక్కరలేదనుకున్న వాళ్లకు అవే ప్రధాన మయ్యాయి . శ్రామిక తరగతి నుంచి వొచ్చిన వాళ్ళు మధ్య తరగతి లో కలిసిపోయారు , భయస్తులై పోయారు ”
ఆఫీసుకు వెళ్లి సంతకం మాత్రమే పెట్టేసి బయట పడిన ఆ పండితులు ” శ్రమ, అదనపు విలువ గురించి పామర జనానికి గంటల గంటలు క్లాసులు తీసుకుంటున్నారు ”
ఒకప్పుడు బర్మా కేంప్ లో పామరుడి సైకిల్ హేండిల్ బార్ మీద , కమ్మలింటి మీద ఒంటరిగా ఎగిరిన జెండా, అన్ని పార్టీ జెండాలతో కలగా పులగంగా ఎగురుతోంది.
స్టడీ సర్కిళ్లు మూతేసేసారు, మనుషులంటే ప్రేమ బదులు వెటకారం పెరిగింది,
” జనం ,ఎలా బతుకుదుమురా దేవుడా ? మాకు పనేది ? సంపాదనేది ? మాకు ఈ ముష్టి ఏంది ? మా ఊరేది ? ఇది మా వూరు కాదే ? మా వూరు మాకు మిగిలేలా లేదే అని తూర్పునున్న సముద్రం వైపు చూసి లబోదిబో మంటున్నారు ”
” తమ పిల్లలు మధ్య తరగతిగా వుండి పోకూడదని ఎగువ తరగతికి వెళ్లాలని , ఒకప్పుడు బూర్జువా ,పెటీ బూర్జువా మంత్రాలు పఠించిన వారు కోరుకుంటున్నారు ”
కొర్పొరేట్ గెద్దలు మా ఊరి ఆకాశం మీదే తిరుగుతున్నాయి, మేము ఎన్నుకున్న నాయకులు ముడ్డి కిందకు వొంచి చిల్లర ఏరుకుంటున్నారు.
బర్మా కేంప్ మాత్రం ఎగుడు దిగుడు రోడ్డుతో, ఊరిమధ్య స్మశానంతో మిగిలిపోయింది.
*
జజ్జనకరి జనారె కధ మొత్తం చాలా ఆసక్తిగా సాగింది.చదువుతున్నంతసేపు సంఘటనలు కళ్ళ ముందు కదలాడాయి.”బర్మకాంప్ మాత్రం ఎగుడు దిగుడు రోడ్లుతో ఊరు మధ్య స్మశానంతో మిగిలిపోయింది” అని కధ ముగించడం చాలా బాగుంది.
జజ్జనకరి జనారే కధ మొత్తం ఆసక్తిగా సాగింది. రచయిత వర్ణించిన సంఘటనలు కద చదువుతున్నంతసేపు కళ్ళ ముందు కడలాడాయి.
కథ జజ్జనకరి జనారే! కథ చదువుతుంటే నాకు చదువుతున్నట్లు అనిపించలేదు. బర్మా క్యాంపులో తిరుగుతుా జరిగిన కథను చుాస్తున్నట్లనిపించింది.
బర్మా క్యాంప్ 17 వ కథ, మొదలు పెట్టినప్పటి నుండి, ఇప్పటి వరకూ వున్నాను, 40 ఏళ్ల చరిత్ర ఇది, కళ్ల ఎదురుగా పాత సాక్ష్యాలు వుండవు, అంత గా మారి పోయింది, ఒక బస్తీ మోడల్ గా ఐపోయింది, ఎక్కడా ఆ నాటి మంచి మానవత లు లేవు, కటిక పెదలుగా వున్నా, వచ్చిన కార్య కర్త కు కడుపు నిండా ఇంత అన్నం పెట్టే వారు. నాయకులు ఎప్పుడైతే పెద్ద పెద్ద కాలనీ ల లోకి వెళ్ళిపోయి, పిల్లల్ని కాన్వెంట్ లో చడివించు కుంటో, పెద్దలు గా మారిపోయారో, అప్పటి నుంచీ ప్రజలకు ప్రజా సంస్కృతి దూరమై పోయింది. ఇది అయా రాజకీయ పార్టీల ది మాత్రమే కాదు, పాలక వర్గాలు మనల్ని ఎవరికి వారు గా మాత్రమే ఆలోచించే విధంగా తయారు చేశాయి. దీనికి తిలా పాపం తలా కాస్త అన్నట్టు, కమ్యూనిస్టులు, హేతువాదులు… అందరూ తలోగ్గతమే కారణం.
ప్రస్తుత పరిస్తితి ఇదర్రా అని చెప్పే ఇటువంటి కథలే, నూతన తరాన్ని స్వాగతిస్తూ వున్నాయి, తన బాగు ఏదో తాను చూసుకుని, ముసుగు తన్నకుండా హరి వెంకట రమణ, పైసా ఆదాయం రాని సాహిత్యాన్ని తలకెత్తు కున్నాడు. ఇది చాలా త్యాగం. ఎంత పోగొట్టు కున్నామో తెలిసి నప్పుడే, ఎలా రాబట్టు కోవాలో తెలిసేది. పాత రోజులు మళ్ళా రాకపోవచ్చు, అందరమూ మనుషులమే కాబట్టి, కనీసం ఆ పిలుపులు ఆప్యాయతలు ఐనా ముందు ముందు చూడగలము అన్న ఆశాభావం కలుగుతో వుంది. అభి నందనలు…
ఎర్ర జెండా పార్టీ పరిణామ క్రమంలో ఆరోహణ, అవరోహణలు అవలోకనం జజ్జనకరి జనరే. నాయకులు మరియు ప్రజల ప్రాధాన్యతలు మారినప్పుడు పార్టీ పరాయిదయిపోవడం చక్కగా వివరించారు కథారచయిత. ప్రజలు విజ్ఞులై బూర్జువా పార్టీల చెర నుంచి విముక్తులై నింగి, నేల, నీరు, నిప్పు, నువ్వు, నేను అంతటా అందరం ఒక్కటే అని నినదించి సాధించడానికి పోరాటం…….. పోరాటం…….. అది చేసి చూపింది గతం, ఇప్పుడు అది కావాలి మనకు అవగతం అనేలా అన్యోపదేశం ఈ కథా కణిక.
‘కాల’చక్రం గుండ్రముగా తిరుగుతూ తిరిగి తన యధాస్థానం చేరుకోవడం ఎంత సహజమో ఇప్పటి అవ్యవస్థలను దాటుకుంటూ రాబోవు స్వేచ్ఛా సమాజపు సుగందలు శ్వాసించడానికి ఆది మరింత వేగవంతం అవ్వడానికి మనం చేయవలసిందల్లా ఇటువంటి నిబద్ధులయిన రచయితలతో నేను సైతం అంటూ కాళ్ళు కదిపి కధం తొక్కడమే…..
రచయితకు ఎర్ర ఎర్రని వందనాలు !!