జంగిలి కాపు

నువ్వెప్పుడైనా బర్రెలు కాచావా
కట్టుగొయ్యల్ని విప్పి
చెరువు కట్ల మీదగా చేను గట్ల మీదగా
పర పొలాల్లోకో
పరాయి నేల పొలిమేరల్లోకో తోలుకపోయావా
జంగలి గొడ్ల జాతర
నువ్వేప్పుడైనా
ఆ దినమంతా దగ్గరుండి చూశావా
ఒక గేదె
పోయేది పోయేట్టు పోదు
తాటి కరలో తచ్చట్టాడుతుంది
ఇంకో గేదే
పసి మొక్కల పంట చేలోకి దిగిపోయి,
కాసిని తిట్లూ కాసిని చీవాట్లు సమర్పింపజేస్తుంది
మరొక గేదే ముళ్ల కొమ్మల్ని
ఒళ్లంతా గీరుకుంటూ గీక్కుంటూ
వచ్చే పోయే బళ్లకీ
బరువులు మోసే వాహనాలకీ
అడ్డంగొడుతూ
‘పొలో ‘మంటూ పరిగెత్తుతుంది
ఇక దున్న – అది కాడి మోయని
ఖాళీ సమయం గావటాన
కొవ్వెక్కి , కాలుదువ్వి
రెండో దున్నపైకి తలపడుతుంది
కాదంటే –
కాల్వలోకి దూకి
బంక బురద పులుంకోని,
మట్టి గట్టుకి మొండితల మోపుజేస్తుంది
ముకురుగా మూర్ఖంగా యుద్ధం ప్రకటించుకుంటుంది
దూడ పెయ్యలు, కుర్ర దూడలు,
తరిపి పడ్డలు,
తొలిచూలు పడ్డలు నడుస్తుండేవి
జాగ్రత్తగా జాగరూకతగా !
పోయి,పోయి
పర పొలాల్లో పెరిగిన తుంగా
పచ్చగడ్డీ ,పచ్చి గరికీ మేసి,మేసి
పొద్దు – నడి నెత్తిన గుద్దే సమయానికి
నక్కేరు , నేరేడు చెట్ల కిందకో
మర్రి మాను కిందకో చేరిపోయి,
నీడల్ని నడి వీపులపై అన్నీ కప్పుకుంటాయి
బుడ్డోళ్లు,పెద్ద జీతగాళ్లు
గొర్రెల కాపరులు – అంతా సందడి సందడి –
నేల మీదే నడుం వాల్చే రైతు, రైతుకూలి జనం
పిట్టలు రాల్పే
పసరు కాయలు,పండ్లూ,పుల్లాపుడకలు
అక్కడే
అందరూ విప్పేవాళ్లు
పేగూ పొట్టా చల్లబరిచే సద్ది మూటలు
ఆహా ! ఆ రోటి తొక్కుడు పచ్చడి రుచి పసందూ
పులిసిన మజ్జిగా, పచ్చి మిరపకాయ పచి పసందూ !
లేస్తే –
ఇక , గుళ్లకమ్మ రేపులోకే !
ఒక గేదే
అవతలి ఒడ్డెక్కుతుంది
ఇంకో గేదె
నీటి సుడి లోతులో
రెప్పలూ చెవులూ ఆడించుకుంటూ
పిలిచినా గదిమినా పైకిలేవదెంతటికీ –
మరో గేదె పొరుగూరు తీరంలోని గట్టెక్కి,
మోరెత్తుకోని
అటూ ఇటూ
అపర మేధావిలా చూస్తుంది
ఇక – దున్న
‘నేనిక రాను – నువ్వు పో ‘ – అంటూ
గొంతు లోతు నీళ్లలో అంకేసినట్టు
గమ్మున కూసోని
కళ్లు మూతలేసుకుంటుంది –
చచ్చీ చెడి
తిరిగి వెళ్లేటప్పుడు
గుదె బండ కాదు కదా
గొంతుకీ గిట్టకీ తాడేసి కట్టినా
ఆ ఉసికీ,ఉరవడికీ
సాంతం చేతులెత్తేసి చూడిల్సిందే
మొకం,కాళ్లూ చేతులూ కాసింత కడిగి,
అలా అలా మెల్లగా
జమ్మిచెట్టు వైపు జవసత్తవల్తో
కాటిసీను పద్యంతో కదిలిపోవాల్సిందే
అలా జంగిలి కాపు
ఆ దినం దిగ్విజయమయ్యేది –
ఎప్పుడో జోరువానలో  తప్ప
ఎల్లప్పుడూ ‘ఎహైయ్’ , ‘ఏయ్ ఏయ్’ – పండగే ఇది !
వాడు పశువు , వింత పశువు – అని
మనుషుల్ని మనుషులు తిడుతుంటారు గానీ
నిజానికి
పోయే దారీ , వచ్చే దారీ
కట్టుమట్టూ, కొట్టం చోటూ
ఆ మూగ జీవాలకి చానా బాగానే తెలుసు
ఈ మాటల ప్రాణికే
అసలు దారీ అరమరికల్లేని తెన్నూ తెలియట్లేదు
ఏ తావులో ఏది పెంచాలో ఏది తుంచాలో తెలియట్లేదు
నడుస్తూ నడుస్తూ – నడకలోనే
‘శతపూర్తి’మహోత్సవమై
నిండు నూరేళ్లని ఢీకొట్టి పోవచ్చని ఇంకా తెలియట్లేదు
ఈ గొడ్లూ గోవులే మనుషుల్ని
సగం కాస్తున్నాయనే సంగతి తెలియట్లేదు
*

రవి నన్నపనేని

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు