అడవిలో మానుల్లో వొకానొక మానులాగా అప్పుడే మోవులు తొడిగిన లేత పచ్చ ఆకులాగా స్వచ్చంగా పెద్దగా మాట్లాడకుండా యితరుల్ని చూస్తే మొహమాటంగా, బిడియంగా కనిపించే రాతియుగపు మనిషికి నికార్సైన ప్రతినిధి చెంచు. చెంచులు ఆదిమ మానవ తెగలలో ద్రావిడ జాతికి చెందిన వొకానొక ఆటవిక తెగకి చెందిన వారు. ‘చెట్టు’, ‘చుంచు’ వంటి పదాల నుంచి ‘చెంచు’ అనే పదం వొచ్చిందని పరిశోధకులు అంటారు. తెలుగు రాష్ట్రాలలో గుర్తించబడిన 33 గిరిజన తెగలలో చెంచులు మిగతా వారందరికంటే మరింత మూలకి నెట్టబడిన వీరు యెక్కువగ కర్నూలు, ప్రకాశం, ప్రస్తుత తెలంగాణా రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలలో విస్తరించిన నల్లమల అడవులలోనూ కృష్ణా, గుంటూరు, కడప మొదలైన జిల్లాలలోని మైదాన ప్రాంతాలలో అరుదుగా నివసిస్తుంటారు.
చెంచులు ప్రధానంగా ఆటవిక జాతి వారే! పాల్కురికి సోమనాధుడు రాసిన ‘పండితారాధ్య చరిత్ర’ లో ఆయన చెంచుల గురించి పేర్కొన్నాడు. నల్లమల అడవిలో వున్న ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలానికి వొచ్చి పోయే భక్తులకు చెంచులు తమ సహకారాన్ని అందించారని, అడవి మార్గంలో నడవలేని వారిని కావిళ్ళతో మోసి వారికి తినడానికి తిండి, మంచినీరు సమకూర్చి సహాయ పడ్డారని చెబుతూ వారిని ‘ధర్మాత్ములు’ అని సోమనాధుడు పేర్కొన్నాడు. అది మధ్య యుగాల మాట. తర్వాత చెంచులను గురించి శ్రీశైలం కైఫియత్ ‘దారి దోపిడీ దొంగలు’ అని పేర్కొంది. అయితే విజయనగర రాజుల కాలంలోని పాలెగాళ్ళ వ్యవస్థలో చెంచులను అటవీ ప్రాంతానికి కావలిగాళ్ళ గా నియమించారని తెలుస్తుంది.
నల్లమల అడవిలో నివసించే చెంచులు యింకా రాతి యుగం నాటి వొస్తువులను వుపయోగిస్తూ వేట, ఆహార సేకరణలలో ఆదిమ కాలంనాటి పద్ధతులను అనుసరిస్తూ సజీవ చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నారు. నల్లమల అడవిలో సుమారు వందకి పైగా చెంచు గూడేలు వున్నాయి. వారి నివాసాలను ‘చెంచు పెంటలు’ అంటారు. ‘పెంట’ అంటే ‘గూడెం’, ‘పేట’ ని అర్ధం. వుదాహరణకు ‘సున్నిపెంట’, దోమలపెంట’, ‘యీగల పెంట’ మొదలైన పేర్లు వారి గ్రామాలకు యెక్కువగా వుంటాయి. వొక్కో చెంచు గ్రామంలో చాలా తక్కువ కుటుంబాలు నివశిస్తుంటాయి. కొన్ని గ్రామాలలో పది యిండ్ల కంటే యెక్కువగా వుండవు. యీ యిరవై వొకటో శతాబ్దంలో కూడా చెంచులు వేటాడి, అడవిలో దొరికే గడ్డలు(చెంచు గడ్డలు), కాయలు, తేనె వంటివి సేకరించి జీవించడం చూస్తాము. వారికి రేపటి గురించిన బెంగ వుండదు. తమదగ్గర వున్న వాటిని నిల్వ వుంచి దాచుకుని మళ్ళీ తామే వుపయోగించుకోవడమనే తెలివిలేని అమాయకపు మనుషులు. వేటాడగా దొరికిన జంతువుల మాంసాన్ని అందరూ సమానంగా పంచుకుని తింటారు. ఆదిమ దశలోని సామ్యవాదం(primitive communism) బహుశా! అదే కావచ్చు. చెంచులకు వ్యవసాయం అంటే గిట్టదని పరిశోధకులు అంటారు. అయితే వీరు అరుదుగా పోడు వ్యవసాయం చేసి జొన్నలు, సజ్జలు, కొర్రలు వంటి తృణ ధాన్యాలను పండిస్తుంటారు. వీరి జీవన ప్రమాణం చాలా తక్కువ. అడవిలో దొరికే కాయలు, గడ్డలు చాలా తక్కువ పోషక విలువలు కలిగి వుంటాయి. దాంతో వారికి రక్త హీనత అనేది సర్వ సాధారణంగా వుంటుంది. స్త్రీల విషయంలో యిది మరింత దారుణంగా వుంటుంది. వారి సగటు వయసు 38 సంవత్సరాలు మాత్రమేనంటే యెవరైనా వులిక్కి పడాల్సిందే! పురుషులలో కూడా యభై సంవత్సరాల వయసుండే వాళ్ళు కనబడరు. స్త్రీ పురుషులిద్దరూ పిల్లలతో సహా యిప్ప సారా కాచుకుని తాగుతారు. సరైన పోషకాహారం లేకపోగా నాటుసారా తాగడం వలన వారికి ప్రాణాంతకమైన వ్యాధులు వొస్తుంటాయి. దీనికి తోడు అడవి ప్రాంతంలో దోమలు, విష జంతువులు, అపరిశుభ్రమైన నీరు తాగడం వలన వారు తరచుగా రోగాల బారిన పడతారు.
ప్రభుత్వాలు యేర్పాటు చేసిన సమగ్ర గిరిజనాభివృద్ధి కేంద్రాల ద్వారా లభించే సదుపాయాలను అందిపుచ్చుకొనే జ్ఞానం వారికి లేదు. వారు నిర్మించి యిచ్చిన పక్కా యిళ్ళల్లోకి మేకలను తోలి చెంచులు తమ సంప్రదాయపు చుట్టు గుడిశెలోనే నివశిస్తుంటారు. చెంచుల యిల్లు గుండ్రంగా ‘చుట్టు గుడిశె’ మాదిరిగా వుంటుంది. వారు అడవి నుంచి సేకరించిన తేనె, కరక్కాయలు, చింతపండు, బంక వంటి వస్తువులను గిరిజన కార్పోరేషన్ వారి అంగట్లో వస్తు మార్పిడి పద్ధతి ప్రకారం యిచ్చి తమకు కావల్సిన బట్టలు, యితర వొస్తువులు కొనుగోలు చెయ్యడం ఆశ్చర్యం కలిగిస్తుంది. యితరులు చెంచులపై చేసే దౌర్జన్యాలకు, మోసాలకు అంతులేదు. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ అధికారులు, గిరిజన కార్పోరేషన్ వారి వరకు అందరూ చెంచులను మోసగించే వారే!. చెంచు పెంటలలో నిర్మించిన పాఠశాలలో టీచర్స్, అక్కడ యేర్పాటు చేసిన ప్రాధమిక వైద్యశాలలో డాక్టర్లు చూద్దామన్నా కనబడరు. వైద్యానికి వారెక్కువగా అడవిలో దొరికే మూలికల మీదే ఆధార పడతారు. పెద్దవారికి వైద్యానికి అవసరమైన మొక్కలేవో బాగా తెలుసు. కొన్నిసార్లు పరిస్థితి కష్టంగా వున్నప్పుడు కనీసపు ప్రాధమిక ఆరోగ్య సదుపాయం కోసం రోగులను కావిడికి కట్టుకుని మోసుకెళ్ళడం, దారిలోనే వారు మరణించడం చూస్తాం.
చెంచులకు బయటి ప్రపంచం పెద్దగా తెలియదు. యితరులను నమ్మరు. వారు తమ తెగ వారితో తప్ప యితరులతో మాట్లాడడానికి యిష్టపడరు. ఆ మాటకొస్తే వారిలో వారు కూడా పెద్దగా మాట్లాడుకోరు. చెంచులకు తమదైన భాష వుందంటారు కానీ వారు యెక్కువగా పాతకాలపు తెలుగులో మట్లాడతారు. అడవి చెంచులకు బయట ‘నాగరిక’ సమాజపు మర్యాదలు తెలియవు. యెవరినైనా ‘వాడు’, ‘వీడు’ అనే అంటారు. భాషలో వారు వుపయోగించే పదాలు చాలా పరిమితంగా వుంటాయి. దీనికి కారణం వారికి బయటి ప్రపంచంతో పరిచయాలు తక్కువగా వుండడమే కాకుండా వారికి యింకా వ్యవసాయం అబ్బకపోవడమే అని పరిశీలకులు భావిస్తున్నారు.
చెంచుల ఆచారాలు, సంప్రదాయాలు ప్రత్యేకంగా వారి ఆదిమ సంస్కృతికి చిహ్నంగా వుంటాయి. వారు ప్రకృతికి దగ్గరగా జీవించడం వలన వారి తెగ, మతాచారాలు కూడా ప్రకృతితో ముడిపడి వుంటాయి. పెళ్ళి, చావు వంటి సందర్భాలలో చెంచులు తమవైన తెగ ఆచారాలను పాటిస్తారు. సామాజిక అంశాలలో వారి ఆచారాలు మైదాన ప్రాంతాలలోని దళిత కులాల ఆచారాలవలే వుండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. నిర్ణీత వయసు రానిదే వారిలో పెళ్ళి వుండదు. బాల్య వివాహాల ప్రసక్తే లేదు. పెళ్ళి పూర్తిగా యువతీ యువకుల అంగీకారం ప్రకారమే జరుగుతుంది. వరకట్నం బదులు ఆడపిల్లకు ‘వోలి’ యిచ్చే ఆచారం యితర సంచార, ఆదిమ జాతులు, మైదాన ప్రాంతాల దళితుల మాదిరిగానే చెంచులలో కూడా చూస్తాము. పెళ్ళి తంతు సాదా సీదా గా జరుగుతుంది. యిరువైపుల పెద్దలకు ‘కులకట్నం’ కింద సారా తాగించి విందు చెయ్యడం పెళ్ళిలో ముఖ్యమైన కార్యక్రమమం. చెంచుల కుల పంచాయతి బలంగా వుంటుంది. సామాజిక జీవితానికి సంబంధించిన అన్ని విషయాలలో పెద్దల జోక్యం వుంటుంది. భార్యా భర్త మధ్య వచ్చే తగదాలను కుల పంచాయతి లో పెద్దలు సరిచేస్తారు. కుదరకపోతే విడాకులు యిప్పించి మారు మనువు చేసుకోమంటారు. స్త్రీ, పురుషులిద్దరికీ మారు మనువు చేసుకునే వీలు చెంచులకు వుంది. కులాచారాలను పాటించని వారికి జరిమానా విధించడం, కొన్ని సార్లు వెలివెయ్యడం కూడా వుంటుంది. చనిపోయిన వారికి దినం చేసే ఆచారం కూడా దళిత కులాల మాదిరి వారి వారి యింటిపేర్లను బట్టి వుంటుంది. మరణించిన వారిని పూడ్చి పెట్టడం, గర్బవతి అయిన స్త్రీ చనిపోతే బోర్లా పడుకోబెట్టి పూడ్చటం చెంచులలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. వేటలో క్రూర జంతువుల బారిన పడి చనిపోయిన వారిని దేవుడిగా, దేవతగా భావించి కొలుస్తారు. స్త్రీలు వేటలో పాల్గొనకుండా యితర ఆహారా పదార్ధాలను సేకరిస్తారు. పెళ్ళైన సోదరుడు చనిపోతే అతని భార్యను అతని తమ్ముడో, అన్నో పెళ్ళి చేసుకునే ఆచారం చెంచులలో వున్నందున వేటకు అన్నదమ్ములు కల్సి వెళ్ళరు. బహుశా! కుట్ర జరగవచ్చనే శంకతో కావచ్చు.
చెంచుల మతాచారాలు చాలా సరళంగా వుంటాయి. తమ కులదైవాలైన గారెల మైసమ్మ, యీదమ్మ, గురవయ్యలను వారు పూజించి వారికోసం జాతరలు నిర్వహిస్తారు. మైసమ్మ, యీదమ్మ వొకరే కావచ్చు. అయితే చెంచులే నల్లమల అడవుల్లో శివ లింగాన్ని కనిపెట్టి శ్రీశైలం లో ప్రతిష్టించారని, వారే మొదట శ్రీశైల దేవాలయ పూజారులుగా వుండేవారని అందువలన అక్కడి శివుడికి ‘చెంచు మల్లయ్య’ అనే పేరు వొచ్చిందని అంటారు. వారి ఆడపడుచును ఆ శివుడికిచ్చి పెళ్ళి చేశారని వొక కధ, అహోబిలంలోని లక్ష్మీ నరసింహ స్వామి ప్రేమించి పెళ్ళి చేసుకున్న చెంచులక్ష్మి కూడా చెంచుల ఆడ పడుచేనని మరో కధ ప్రచారంలోకి వచ్చాయి. బహుశా! యీ కధలు చెంచులను సంస్కృతీకరించడానికి కల్పించి వుండొచ్చు. శ్రీ కాళహస్తిలో కూడా చెంచు జాతికి చెందిన భక్త కన్నప్పను శివభక్తుడిగా చెప్పడం చూస్తే వీరశైవ మతం ముందుకు తీసుకొచ్చిన సామాజిక సమానత్వం అనే భావన కూడా కారణం కావచ్చు. మధ్య యుగాల నుంచి శ్రీశైల దేవస్థానానికి సంబంధించిన పనులలో అక్కడి చెంచులు శివుడి పూజలో వుపయోగించే మారేడు ఆకును అడవి నుంచి తీసుకు రావడం, వుత్సవాల సమయంలో దేవుడి రధం లాగడం, దివిటీలు మోయడం వంటి పనులను యాజమాన్యం అప్పగించి, వారికి కొంత పారితోషికం యిచ్చినట్టు చరిత్ర చెబుతుంది. అయితే క్రమంగా అక్కడ వారి వునికి లేకుండాపోయింది.
చెంచుల కుటుంబ వ్యవస్థలో మాతృస్వామిక లక్షణాలు కనిపిస్తాయి. పెళ్ళి విషయంలో ఆడపిల్ల యిష్టయిష్టాలతో ప్రమేయం వుండడం, బాల్య వివాహాలు లేకపోవడం, పరస్పరం పొసగని సందర్భంలో విడాకుల ద్వారా తమ వివాహ బంధం నుంచి బయటకొచ్చి మారు మనువు చేసుకోగలిగే స్వేచ్చ స్త్రీ, పురుషులిద్దరికీ సమానంగా వుండడం వంటి సామాజిక అంశాలన్నీ చెంచుల మాతృస్వామిక వ్యవస్థలో భాగమనే అనుకోవాలి. మైదాన ప్రాంతాలలోని యితర గిరిజన, సంచార జాతులు కొంత మేరకు యితరుల ఆచారాలను అనుకరిస్తున్నప్పటికీ చెంచులు బయట సమాజానికి దూరంగా వుండడం వలన యింకా తమ తెగ తాలూకు ఆచార సంప్రదాయాలనే పాటిస్తున్నారనవచ్చు.
మహబూబ్ నగర్, కర్నూలు, ప్రకాశం జిల్లాలలో విస్తరించిన నల్లమల అటవీ ప్రాంతంలో నివశిస్తున్న చెంచులు రకరకాల కారణాల వలన యిప్పుడు తమ వునికిని కోల్పోయి క్రమంగా అంతరించిపోయే పరిస్థితిలోకి నెట్టివేయబడుతున్నారు. అభివృద్ధి పేరుతో వారి వారి జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ప్రభుత్వాలు పర్యాటక శాఖ ద్వారా ఆదాయాన్ని పొందే క్రమంలో టూరిజం అభివృద్ధి కోసం అడవిలో అందమైన రిసార్టులు నిర్మించడం, యితరులు వారి పరిసరాలలోకి చొచ్చుకు రావడం, మైనింగ్ పేరుతో వారిని తమ ఆవాసాల నుంచి తరలించాలనే ప్రయత్నాలు చెంచుల వునికిని ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. చెంచులు ఆధునిక అభివృద్ధిలో తప్పిపోయిన మనుషులు. వారికి హక్కులన్నా అభివృద్ధి అన్నా తెలీదు, వారిలో అక్షరాస్యత చాలా తక్కువ. యిప్పటివరకు చెంచు జాతి నుంచి వొకే వొక్క డాక్టర్ వచ్చాడు. వారికోసం యేర్పాటు చేసిన స్కూల్స్ లో టీచర్స్, హాస్పటల్స్ లో డాక్టర్స్ లేకపోతే యెవరూ ఆరా తియ్యరు. వారికి మజ్జిగ పోసి దానికి ప్రతిఫలంగా వారి నుంచి భూముల్ని లాగేసుకున్న వారికి యే శిక్షా లేదు. టూరిస్టులు చెంచు స్త్రీలను పరాభవిస్తుంటే అడిగే నాధుడు లేడు.
పైగా వారిపై దొంగతనం వంటి కేసులు బనాయించి యేళ్ళతరబడి జైలులో నిర్బంధిస్తున్న పరిస్థితి వుంది. ఆశ్చర్యకరంగా యెటువంటి విచారణ, బెయిలు లేకుండా జైళ్ళలో మగ్గుతున్న అభాగ్యులలో చెంచు ‘ధర్మాత్ములు’ కూడా వున్నారు. దారిలో వెళ్ళే లారీ ఆపి డ్రైవర్ దగ్గర చిల్లర దొంగతనం చేసిన వొక చెంచు యువకుడు సంవత్సరాల నుంచి జైలులో కనీసపు విచారణ లేకుండా మగ్గుతుంటే అతని కోసం జామీను కాదు కదా, అతడు బతికి వున్నాడో లేడో కూడా తెలుసుకోలేని స్థితి ఆ కుటుంబానిది. యింత వెలలేని జీవితాలు చెంచులవి. ఆస్ట్రేలియా దేశం తన ఎబోజినల్స్ ని వృక్ష, జంతు జాలం కింద పరిగణిస్తే ఇండియా నేరస్తుల కింద పరిగణిస్తుంది. దేశం యేదైనా ఆదివాసుల దీనత్వం అంతటా వొక్కటే! చెంచులకు తమపై జరిగే దాష్టీకం గురించి యెవరిని అడగాలో తెలీదు. యితరులు వారిపై నిరాటంకంగా దోపిడీని కొనసాగిస్తుంటే యేమీ పాలుపోని చెంచు జాతి వొక అభద్రతా భావాన్ని చేతబట్టుకుని చౌరస్తాలో నిలబడి వుంది.
*
ధన్యవాదాలు చల్లపల్లి స్వరూప రాణి గారూ. ఎంత చక్కటి వ్యాసం. చాలా ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి నిమ్న జాతులు ఇంకా ఎన్ని ఉన్నాయో కదా. టచీగా రాశారు.
తాంక్యూ సర్. నేను శ్రీశైలం లో వున్నప్పుడు స్వయంగా observe చేసిన విషయాలే! అందువల్ల ఫ్రెష్ గా ఉందనుకుంటా
థాంక్యూ సర్. అంతా దగ్గరగా చూసిందే. అందువల్ల కొంత ఫ్రెష్ నెస్ వొచ్చిందనుకుంటా
స్వరూప రాణి గారూ! అభినందనలు. చెంచులు నాగరిక ప్రపంచానికి దూరంగా బ్రతుకుతున్నారని అనడం కంటే స్వచ్ఛంగా ప్రక్రుతి ఒడిలో ఏ కల్మషం లేకుండా వున్నాడు అనడం బాగుంటుంది. అడవి వారిది. ఆ నేల వారిది. దానిమీద పెత్తనం కూడా వారిదై ఉండాలి. వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా అందించకుండా నాగరికుడు అక్కడికి ప్రవేశించి ఇది నాది అని మైనింగ్ చెయ్యడం ”ఆటవికం”…… సారీ! ఈ పద అర్ధం ఇలా వాడడం నాకిష్టం లేదు. ”నాగరికం” ( అనాగరికం) పదం సరిపోతుందేమో . ఎనిమిది దశాబ్దాల స్వాతంత్య్రం వారికి ఇంత నీడనివ్వలేక పోయింది. ఐ టి డి ఏ లు , ప్రభుత్వ వ్యవస్థలు ఇన్నాళ్లుగా ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో ఆలోచించలేక పోవడం బాధాకరం. చెంచుల జీవితాలని ఇలా బయటి ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేసిన మీకు సారంగకు కృతఙ్ఞతలు, అభినందనలు.
తాంక్యూ సర్, వారిది ప్రకృతితో మమేకమయ్యే జీవితం
సరైన విశ్లేషణా త్మక వ్యాసం