బడికాడనుంచి ఇంటికొచ్చి కూచ్చున్యా.
మాయమ్మ జొన్నరొట్టె, పప్పు తినమన్యాది.
గబక్కన దొడ్లో కాళ్లు కడుక్కోని పొప్పులో రొట్టె నానేసుకోని తిన్యా.
‘గబ్బునూనె పోయిచ్చకరాపో స్టోరు కాడ ఈ పొద్దు’ అన్యాది మాయమ్మ.
అవునా? ‘టప్పెట ఏసినారామా?’ అంటి.
‘నిన్ననే టప్పెటేసినారు. ఇన్యా. ఈ పొద్దు, రేపే ఇచ్చేది’ అన్యాది.
గూట్లోని గబ్బునూనె టిన్ను తీసుకోని, స్టోరుబుక్కు తీసుకున్యా. మాయమ్మ ఐదురూపాయలు లెక్క ఇచ్చినాది. పరిగెత్త టిన్ను వాంచుకుంటా పోయినా. మహేశ్వరరెడ్డి ఇంటికాడికి పోయి లైన్లో నిలబడుకున్యా. పనిచేసే ఆయప్ప గబ్బునూనెను డ్రమ్ములోంచి రెండు లీటర్ల డబ్బాతో తీసుకున్యాడు. మా పచ్చ టిన్నులో లొడిగపెట్టి గబ్బునూనె పోచ్చానాడు. ‘ఎవురికొడుకువిప్పా?’ అన్యాడు ఆయప్ప. ‘మాబూ కొడుకును’ అన్యా. గబ్బునూనె పోచ్చాంటే.. పుటుక్కు పుటుక్కుమంటా తొలికినట్లు చిన్నశబ్ధం వచ్చినాది. గబగబా టిన్ను మూత బిగిచ్చుకోన్యా. బరువు ఉండే గబ్బునూనె టిన్నును ఒకపారి కుడిచేత్తో, ఇంకోపారి ఎడమచేత్తో మార్చుకుంటా మెల్లగా ఇంటిదావ పట్నా. కుండకాడ రాళ్లమింద మెల్లగా నడిచి ఎల్లవారి ఇంటికొచ్చినా. మైటాల పూట కోళ్లు ఇంటికొచ్చి జొన్నలు తింటా పొడుచుకుంటానాయి. సూర్యుడు బడితిక్కు ఆకాశంలోపలికి జారుకుంటానాడు. సూచ్చాండంగానే మబ్బు అయినాది.
బయట అరుగులమింద కూచ్చోని యవారాలు సేచ్చానారు పెద్దోళ్లు.
‘కొట్రీ ఇంట్లోకి పోయి బుడ్డి ముట్టిపో’ అన్యాది మాయమ్మ. నేకేమో కొట్రీ అంటే భయ్యం. ‘నేను పోనుపోమా’ అన్యా. మాయమ్మ గుడ్లురిమి చూసినాది. పరిగిత్త కొట్రీ లోపలికి పోయి ఎడమ పంచ అరుగు పక్కన బియ్యం మూట కాడ ఉండే బుడ్డి సీసా తీసుకున్యా. ‘మా గబ్బునూనె లేదు’ అని గట్టిగా అర్చినా. ‘పొయ్’ అన్యాది మాయమ్మ. గబ్బునూనె గూటికాడికిపోయి తెల్లలొడిగ సీసాలోకి పెట్టి మెల్లగా గబ్బునూనె పోసినా. సీసా పైన మూతలోంచి వచ్చిన వొత్తి గట్టిగా పైకి పెరికి.. గబ్బునూనె అంటిన బొటనవేలు, పక్కవేలుతో అట్ల సాదినా. అగ్గిపిట్ట గీకి బుడ్డి ముట్టిచ్చినా. అంతలోకే మాయమ్మ దేవుని గూటికాడికొచ్చి దీపారాజన చేసినాది. పైట చెరుగు తలకాయమీద కప్పుకోని.. ‘సోమీ గూగూడు కులాయసోమి’ అంటా ఒక ఊతకట్టి దేవునికాడ, రెండో ఊతకడ్డీ కొట్రీ వాకిలిమింద బొరకలో పెట్టి వాకిలి గడపకు ముక్కున్యాది.
అరుగుమిం కూచ్చుందామని బయటికొచ్చినా. మా జేజీ వాళ్ల ఇంటితిక్కు చూసినా.
మా జేజీ వాళ్ల ఇంట్లో బుడ్డి వెలుగుతాంది. ‘మా జేజి ఏమన్నా సేచ్చాందా?’ అన్యా.
‘ఆయిమ ఏం చేసినా మీకు పెట్టదురా. తాడిపిత్తిరి కాన్నుంచి మీ దచ్చిగిరమ్మ అక్కవాళ్లు వచ్చినారు. సూసినా ఇప్పుడే’ అన్యాది మాయమ్మ. ‘చపాతి సేచ్చాందిమో వాసనొచ్చాంది’ అంటి. రోంతసేపు ఉండు బువ్వ పెడతా అన్యాది. అరుగుమింద కూచ్చోని మా పెదనాయిన కూతురు దస్తగిరమ్మ అక్కను చూసినా. నల్లని బట్ట కప్పుకున్యాది. ఇంట్లోకి పరిగిత్త పోయినా. ‘ఏందిమా అక్క కప్పుకున్యాది నల్లచీర’ అన్యా. మాయమ్మ నగినాది. ‘అది బురఖాలే’ అన్యాది.
‘అంటే ఏందీ?’ అని అడిగినా.
“ఆ ఏం లేదు. తాడిపిత్రి తిక్కు మన దూదేకులోళ్లు బురఖా ఏసుకుంటారు. మగోళ్లు టోపీ పెట్టి గడ్డం పెంచుతారు. నమాజుకు పోతారు” అంట అన్యాది మాయమ్మ.
‘అదేందిమా.. వాళ్లు తురుకోళ్లా?’ అంటి.
“అట్ల మనోళ్లు మారతానారు.. ఏం కాలమో.. ఏం కతో.. ఏం పత్తికట్టో.. ఉండేదంతా ఊర్సకపోతాంది సంప్రదాయం అన్యాది” మాయమ్మ. ఆ రాత్రి సీసా బుడ్డి ఎలుగులో బువ్వ తింటాంటే నాకంతా ఏదో కొత్తగా అనిపిచ్చినాది. ఆ పొద్దు రాత్తిరి మంచం మింద పడుకోని చుక్కలను సూచ్చా ఏందేందో ఆలోచించినా. అది నాకే తెల్దు.
పద్దన్నే లేచినాక దూరంనుంచి మా దచ్చిగిరమ్మ అక్క మొగుడ్ని చూసినా. టోపీ గీపీ పెట్నాడు. గడ్డం చూసినా. వాయమ్మో అనుకున్యా. నాకంతా కొత్తగా అనిపిచ్చినాది. తురుకోళ్లు అట్ల ఉంటారు కానీ మనోళ్లు అట్టకూడా ఉంటారా? అని ఆశ్చర్యపోయినా.
సింహాద్రిపురంకు ఎప్పుడైనా పోతే దూదేకలోళ్లకు, తురుకోళ్లకు తేడానే తెల్దు అని పెద్దోళ్లు మాట్లాడుకుంటాండిరి. అట్ల తాడిపిత్రి, అనంతపురం, కడప, కర్నూలు పోతే ఎవురు ఎవురో కనుక్కోలేరంట. హైదరాబాద్‌లో అయితే అందురూ ఒకటేనంట అని ఒకరిద్దురు అంటాంటే నా గుండె జల్లుమంటాన్యాది. అంత దూరం ఏంటికిలే గానీ.. పులిందల్లో మా రహినాబి చిన్మమ్మ కూతురు మస్తానమ్మ ఉన్యాది. అరబిక్ నేర్చుకున్యాది. ఖురాన్ బుక్కు ఎనకలనుంచి చదువుతాంటే బిత్తరపోయినా. ఆడిపిల్లోలు నమాజు, ముసుగులు చూసినాక.. , మొగోళ్ల గడ్డాలు పెంచుకోని చేత్తో దువ్వుతా.. క్యా భాయ్.. క్యా కర్తా హై.. అంటే నా కర్తలు పగిలిపోతాండ్య. నాది చిన్న వొయిసే కానీ మా క్యాస్టోళ్లందరూ అట్ల దెంకోనిపోతాండారే అని బాధపడ్తాంటి. నేనేం చేసేది. ఆ బాధ ఎట్లొచ్చినాదో మా ఇంటిదేవుడు గూగూడు కుళ్లాయసోమికి కూడా తెల్దు.
పల్లెల్లో పనీపాట చేసుకోని బతికే మేం రంజాన్ పండగ, బక్రీద్ వచ్చినాదంటే మాయమ్మ, నాయినా పండగ సేచ్చాండ్రి. మాకంటే ముందు మాపక్కన ఇండ్లల్లో ఉండే వాళ్ల పొటుకు ఎక్కువగా ఉంటాండ్య. ‘రంజాన్ పండగ.. ఆరో తేదీ అంటనే’ అంటా వాళ్లే అంటాండిరి. ఈ రంజాన్, బక్రీద్ వచ్చే మసీదలకు పోతారు. ఇది మన కత కాదే.. అని నాకేమో ఒకటే బాధ. ఎవురు పోయినా నేను మసీదు తిక్కు మగం తిప్పక పోతాంటి. సంక్రాంతి, ఉగాది, ఇనాకుమయ్య పండగ, దీపావళి పండగలు నాకు చలాటకంగా ఉంటాండ్య. ఆ పండగలు మాయి కాకున్యా అదో ఆనందం. అట్లనే రంజాన్, బక్రీదులు మాయి అయితాయా? అసలు మా పండగేదీ? మా దేవుడేంటీ ఇట్ల. దూదేకులోళ్ల బతుకు ఏంటీ? అని ఆలోసించి తిక్కపడతాండ్య. ఓపారి మాయమ్మని అడిగితే.. “బ్రహ్మంగారి శిష్యుడు సిద్ధయ్య కులం మనది. మనం అట్ల కాదు.. ఇట్ల కాదు.. నట్ట నడింగల ఇరక్కపోయినాం. పోంగ పోంగ ఎట్లాంటి పోయే కాలం వచ్చాదో.. దూదేకుల కులం పోతాదేమో” అంటాండ్య మాయమ్మ చానా బాధతో. ఒక్క పీర్ల పండగ మాది. అయితే అది మా ఊర్లో జరక్కపోయేది. మా నాయినను ఎన్ని సార్లు అడిగినా.. మనూర్లో చేయం. పెద్దోళ్లు పోయినాక మేం అనుకోల. కాపోళ్లతో కొట్లాట, పీర్లచావిడి పాడుబడినాది. పీర్లు ఎవురో దెంకపోయినారు. మనూర్లో పీర్ల పండగ చేయరు. మర్చిపోవాల అంటాండ్య. నాకు అర్థమయ్యేది కాదు.
రాజావలి.. అనే పేరు ఇంటానే.. ‘మీరు దూదేకలోళ్లు కదా.. మీరు మాకు తెల్చులే. మీరు మా పండగలు సేచ్చారు’ అని కొందరు మాట్లాడతాంటే “ఊ..” అని ఊకొడ్తాంటి. అమీరుపేటలో ఓపారి బ్యాంకు ఎగ్జామ్ ఇన్ స్టిట్యూట్‌కు పోతే ఒక పాతబస్తీ ఆయిబ్బి తగిలినాడు. హిందీలో మాట్లాడినాడు. ‘హిందీ నై మాలూం’ అన్యా. నా పేరు మళ్లీ అడిగాడు. “నూర్ భాషా?” అని అన్యాడు. ‘నూర్ భాషా అంటే ముస్లిమే’ అన్యాడు తెలుగులో. ‘గర్వంగా చెప్పాల మల్ల’ అన్యాడు. అట్లనే రహమత్ నగర్‌లో ఉండే అమీర్ అనే అన్న మసీదుకు తీసకపోయి ‘నమాజు చేసుకో భయ్యా’ అన్యాడు. కొన్నాళ్లు పోయినాక.. నేను హిందూ కాకపోతిని.. ఈ ముస్లిం ఆచారాల్లోకి ఎందుకు పోవాల్ల? అని మసీదుకు పోడం మానేసినా. అమీరన్నకు ఫోన్ చేయల. ఎత్తల్యా.
“దూదేకలోళ్లకు గర్వం ఎక్కువ. సాటి కులపోళ్లను పట్టించుకోరు. లెక్క సంపాయిచ్చుకుంటే ముస్లింలల్లోకి కల్చకపోతారు. మన కులమోళ్లు రాజకీయనాయకులు లేరు, రౌడీలు లేరు. ఎవురూ చదువుకోల.. ఏంటికి బాగుపడతాం?” అనేది మాయమ్మ. “స్టయిల్‌గా ముస్లిం అని చెప్పుకుంటారు. కావాల్చింటే పేర్లు మార్చుకుంటారు కొందరు” అన్యాది మాయమ్మ నా పిల్లప్పుడే. ఆ ఇషయం హైదరాబాద్ కు వచ్చినాక ఇంకా బాగా అర్థమైనాది.
ఓ పారి మా కులాయప్ప అన్న దగ్గరికి చింతల్ కు పోయినా. ఇట్లనే కులం గురించి మాట్లాడుకున్యాం. అప్పుడు కులాయప్ప అన్న ఇట్ల బాధపడినాడు. ‘రాజావలీ.. మా చెల్లెలు భర్త ఉన్నాడు. ఆయప్ప గడ్డం పెంచుతాడు. నమాజు ఐదుపూట్ల సేచ్చాడు. పొద్దుటూరులో ఉంటారు. డిట్టో తురుకోళ్లే’ అని నగినాడు.
‘అదేందిన్నా?’ అన్యా.
”మా చెల్లెలు పెండ్లి అయినాక.. వాళ్లల్లోకే కలిపినారు. బురఖా వేసుకోకుండా బయటికి రాదు. పిల్లోల్ల పేర్లన్నీ అరబ్బీ పేర్లే”.
‘అవునా’ అన్యా.
“నీకు ఇంకో విషయం చెప్పాల. మేం యాటికిపోయినా వాళ్లు గుళ్ల దగ్గరకు రారు. పసాదం తీసుకోరు. ఓ పారి మా బావ మా ఇంటికొచ్చి ఇంట్లో దేవుని పటాలు అన్నీతీసేయ్యండి అని అర్సినాడు. సుద్దరోళ్ల మాదిరి ఇదేందీ అన్యాడు. మా అందరినీ మీరు అల్లాను నమ్ముకోండి” అన్యాడు. క్లాసు పీకినాడు. సరేలే అన్యాం. ‘అయినా మనకు అది అయితాదా. మనకు పుట్టుకతో రాల కదా’ అన్యాడు.
నిజమా..? అన్యట్లు చూసినా. ‘ఇదేందిన్నా ఇంతనా?’ అన్యా.
“ఇదేందిలే.. నలుగురు పిల్లోళ్లు. ఆపరేషన్ వద్దంట. ముస్లిం రూల్ పకారం వొప్పుకోరంట” అన్యాడు.
‘అదేం లేదున్నా.. నేను రోంత చదివినా.. ప్రవక్త అట్టాంటియేమీ చెప్పలేదు అన్యా. పెద్ద తెల్చినోళ్ల మాద్దిరి.’
‘ఏందో రాజావలీ’ అన్యాడు మా కుళాయప్పన్న.
‘ఏందోలేన్నా..’ అంటూ చెయ్యి తిప్పతా నేను ఒగిరిచ్చి!
మీడియాలో రోంత కల్లగిచ్చే కొందరు ఆర్టిస్టులు, రచయితలు దూదేకలోళ్లు అని తెల్చినా. పైన రంగేసుకున్యారు.. ముస్లింలుగా చలామణి అవుతాండారని తెల్చింది. కొందరు పేర్లు మార్చుకోని కవితలు రాచ్చానారు. ఏందో ఈ కత అనుకున్యా. రంగులు ఏసుకుంటే ఎప్పటికైనా ఎల్చుతాది అనుకున్యా. అట్ల ఎందుకుంటారో అనుకున్యా. ఓపారి మాయమ్మకు ఫోను చేసి అడిగితే.. “ఇలవ నాయినా ఇలవ” అన్యాది.
ఓ రోజు రాత్రి దూదేకలోళ్లు ఎవరుండారని.. గూగుల్‌లో వెతికినా. చానామంది రంగులేసుకున్యారు అని అర్థమైనాది. వేళ్లమింద లెక్కబెట్టేవాళ్లు కనపచ్చినారు. రాజకీయనాయకులు కనపల్లేదు. ఆ పొద్దు సైరుపొద్దు అయినా నిద్దర రాలేదు..
ఏందీ కత. ఒక్క రాజకీయనాయకుడు కూడా ఎందుకు లేరు?
అసలు ఐకమత్యమే లేని కులమిది.
పేరు తెచ్చుకుండేవాళ్లందరూ కులం గురించి ఆలోచించల.
ఇట్ల బీసీ-బీలో తరంగాని రిజర్వేషన్ కేటగిరి. ‘హిందూ దూదేకుల’ అని రాసుకుంటే.. దూదేకుల వాళ్లే ఫోన్ చేసి “ముస్లిం దూదేకుల” అని ఉండాలికదా అంటారు. అలానే రాయిచ్చుకో అంటారు. అసలు మేం హిందువులమా? ముస్లింలమా? నాకేదీ అర్థం కాలేదు. బుర్ర బద్ధలైపోయింది. ఏదీ కాకున్యా.. ఎలచ్చన్లకు ఓటర్లమే అని అర్థమైనాది. హిందువుల్లోకి చెల్లం. ముస్లిం వక్ఫు బోర్డులు, మక్కాయాత్రలు, ఖాజీసాబులకు పనికిరాం. “ఖచ్చితంగా అంతరించిపోతాం” అనే భయం నన్ను పట్టుకున్యాది.
ఆ సైరుపొద్దు దాట్నాక..
“చెల్లని రూక” అనే మాయమ్మ మాట మతికొచ్చి.. చెవుల్లో మోగినాది. భయపడినా. గొంతు ఆరకపోయినాది. ఎంగిలి ల్యాక నాలిక పిడచకట్టకపోయినాది.
*
దూదేకుల జీవన విధానము
————————————–
——డా షేక్ ఇబ్రహీం షా
దూది నుండి విత్తనాన్ని వేరు చేసి, దూదిని శుభ్రపరిచి, దూదిని ఏకి, ఆ దూదితో పరుపులు, దిండ్లు తయారు చేసి బతుకు జీవనాన్ని కొనసాగించే వారు దూదేకులు. భారతదేశమంతటా కూడా ఈ దూదేకులు రకరకాల పేర్లతో మనకు కనబడుతుంటారు. దూదేకులను మన తెలుగు రాష్ట్రాలలో నూర్ బాషీయులనీ, పింజారిలనీ, లద్దాఫ్ లనీ, దూదేకులనీ పిలుస్తారు. మిగతా రాష్ట్రాలైనా కర్నాటకలో పింజారిలనీ, నద్దాపులనీ, తమిళనాడులో పాంజికొట్టులనీ, పంజారిలనీ, గుజరాత్‌లో పాయిజారీలనీ, మధ్యప్రదేశ్‌లో నద్దాపులనీ, కాశ్మీర్‌లో దున్ లనీ, బెంగాల్‌లో మన్సూరీలనీ, బీహర్ లో ధునియాలనీ, మోమీన్ లనీ, ఉత్తరప్రదేశ్‌లో బెహనస్ లనీ, అన్సర్ లనీ, మోమీన్ లనీ, ఒరిస్సాలో పంజిరాలనీ దూదేకులను పిలుస్తారు. ఇలా వివిధ రాష్ట్రాలలో ఏ పేరుతో పిలువబడినప్పటికీ దాని అర్థం దూదిని ఏకే దూదేకులనే అర్థం. వృత్తులు మాయమైనా
కుల వాసనలు దూదేకులకు నీడలా నేటికి వెంటాడుతున్నాయి. ఒక్క దూదేకులకు మాత్రమే కాదు యావత్తు అన్ని మతాలలో అణగారిన కులాలపై ఈ వివక్షపు నీడలు వెంటాడుతునే ఉన్నాయి. ద్రావిడ జాతికి, సంస్కృతికి కేంద్ర బిందువుగా ఉన్న సింధూ నాగరికత పతనం తర్వాత అనేక మతాలు మన భారతదేశంలోకి వచ్చాయి. వాటిలో మెజారిటీ సాధించిన మతం హిందూ మతం. ప్రతీ మతంలోను కులాల విభజన జరిగింది. అయితే ఆ నాడు హిందూ మతంలోని కుల వివక్ష వలన, కుల విభజన వలన అణగారి కులాలు బడికి, గుడికి దూరమై అంటరానివారుగా మిగిలిపోయారు. వారిని హిందూ మతంలోని కొన్ని ఉన్నత కులాలు మాకు సేవ చేయడం కోసమే మీరున్నారు అని బదులిచ్చేవారు. ఈ వివక్ష, వెట్టిచాకిరి నుండి బయటపడడానికి అణగారిన కులాలైన ఎస్.సి, ఎస్.టి, బి.సి మొదలగువారు నిరీక్షించారు. కాలక్రమేణా పర్షియా దేశం నుంచి సూఫీ గురువులు భారతదేశంలోకి వచ్చారు. వారు వస్తూ వస్తూనే అమూల్యమైన మానవీయ విలువలతో వచ్చారు. ఎక్కడెక్కడ అయితే వివక్షకు గురికాబడిన కులాల వారు ఉంటారో అక్కడికి వెళ్లి వారికి ఒక భరోసాను కల్పించారు. వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకున్నారు. సూఫీ గురువులు ఏర్పాటు చేసిన ప్రార్థన మందిరాల్లో కూడా వారికి స్థానం కల్పించి భుజానికి భుజానికి జత చేసి ప్రార్థనలు వారితో కలిసి చేసి సూఫీ గురువులు వారి హృదయాలతో అలాయి బలాయి తీసుకున్నారు. చివరికి వివక్షకు గురి కాబడిన వ్యక్తులకు కాలికి దెబ్బ తగిలి పురుగులు పాకుతున్న సరే ఆ కాలిని సూఫీ గురువులు వారి ఒడిలోకి తీసుకుని శుభ్రం చేసి ఆ గాయానికి మందులు పూసేవారు. ఇటువంటి మానవీయ గుణాలు, సూఫీ గురువుల బోధనలు వారు పడుతున్న వివక్షను కాలరాల్చాయి. దీనితో కుల వివక్షకు గురికాబడిన అనేక మంది సూఫీ గురువుల అమూల్యమైన మానవీయ విలువలకు ఫిదా అయ్యి ఇస్లాం మతాన్ని స్వీకరించారు. అయితే భారతదేశంలో ఉన్న ముస్లింలలో నూటికి తొంబై శాతం ఒకప్పటి ఎస్.సి, ఎస్.టి, బహుజనులే మతం మారినారు. అందుకే మతం మారినా వీరి జీవన విధానం, మూలాలు మారలేదు.
ప్రతీ మతంలోను కుల విభజన ఉన్నట్లే, ఇస్లాం మతాన్ని స్వీకరించిన వారిలోను కుల వివక్ష లేకపోలేదు. వీరిలో షేక్, సయ్యద్, మహమ్మద్, పఠాన్, ఖాన్, మహమ్మద్ అనే కులపు వర్గాలున్నాయి. ఈ కులపు వ్యక్తుల్లో చాలా అరుదుగా మాత్రమే మనస్పర్థలు ఉంటాయి. అయితే షేక్, సయ్యద్, మహమ్మద్, పఠాన్, ఖాన్ మొదలగు వర్గాల వారికి దూదేకులు అంటే చులకన భావన, చిన్న చూపు. ఏదో వారే మనుషులు అన్నట్లుగా.! కానీ ఇస్లాం మతం సర్వ మానవాళి పట్ల సమానత్వాన్ని ప్రదర్శించాలి గానీ, అసమానతను, వివక్షను చూపరాదని నొక్కి చెప్పింది. ఒకవేళ ఎవరైనా అలా ప్రవర్తిస్తే వారు మనుషులే కాదని కూడా ఇస్లాం చెప్పింది. అయినప్పటికీ కొంతమంది మత ఛాందసవాదులు ఈ వివక్షను చూపుతునే ఉంటారు. పైకేమో అంతా ఒక్కటే అనే భావన. అంతర్గతంగా ఎవరికి కనబడకుండా వివక్షను చూపుతుంటారు. కొన్ని చోట్ల బాహటంగానే దూదేకులపై ముస్లింలు వివక్షను కనబరుస్తుంటారు. కొన్ని వందల సంవత్సరాల క్రితమే వివక్ష నుండి విముక్తి కోరుతూ ఇస్లాం మతాన్ని స్వీకరించినప్పటికీ ఆ వివక్ష నుండి దూదేకులు బయటపడలేదు. సంతోషంతో తొలిరోజుల్లో సూఫీ గురువులు గుండె గుండెలకు జతచేసి అలాయి బలాయి ఇచ్చినప్పుడు కలిగిన సంతోషం ఎక్కువ కాలం పాటు ఆ అనవాలు మిగిలలేదనే ఆవేదనతో బరువెక్కిన దూదేకుల హృదయాలు ఎన్నో ఎనెన్నో.! అయితే వారిలో కొద్దిమంది మతం కన్నా మనిషి ముఖ్యం, మనిషి బంధం ముఖ్యమని విశ్వసించే ముస్లింలు దూదేకులను వారితో సమానులుగా చూసిన వారు లేకపోలేదు. ఇటువంటివారు చాలా అరుదుగా మనకు ముస్లిం సమాజంలో కన్పిస్తుంటారు. అయితే ఎక్కువభాగం దూదేకులపై వివక్షను చూపే వారే.
ముఖ్యంగా దూదేకులకు, ముస్లింలకు భాష పరంగా, సంస్కృతి పరంగా, సంప్రదాయాల పరంగా, ఇచ్చి పుచ్చుకోవడాల్లో కూడా బేధాభిప్రాయాలున్నాయి. అంతేగాక వక్స్ బోర్డు మరియు మసీదులకు సంబంధించిన ఆర్ధిక పరమైన విషయాల్లో కావొచ్చు, పదవుల్లో కావొచ్చు బేధాభిప్రాయాలున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపుగా ముస్లింలు అందరూ ఉర్దూను మాట్లాడగలరేమో గానీ, కనీసం 30% అయినా ఉర్దూను రాసేవారు ఉండరు. అంతేందుకు తెలుగు రాష్ట్రాల్లో ఉండే సగం మంది ముస్లింలకు స్వచ్ఛమైన ఉర్దూను కూడా మాట్లాడేవారు లేరు. కానీ.! ఈ విషయంలో ముస్లింలు దూదేకులను మీకు భాష సరిగా మాట్లాడటం రాదని, చదవటం రాదని చులకన భావనతో వివక్షను చూపిస్తూ ఉంటారు. నేటికి కూడా ఈ వ్యత్యాసాన్ని మనం ముస్లిం సమాజంలో చూడవచ్చును. నమాజ్ చదవడానికి మసీదుకు కూడా సరిగారారనే వివక్ష కూడా దూదేకులపై ఉంది. నిజానికి దూదేకుల్లో కూడా పాండిత్యం మేళవించిన వారు లేకపోలేదు. ముస్లింలలో ఉన్న ఖాజీలు, ముల్లాలు, మౌల్వీలు కన్నా గొప్ప పాండిత్యాన్ని అభ్యసించిన దూదేకులు కూడా ఉన్నారు. ముస్లింల కన్నా గొప్పగా సంస్కృతి సంప్రదాయాల పాటించే దూదేకులు కూడా ఉన్నారు. అయితే మసీదులకు సంబంధించిన ఆర్ధిక లావాదేవీల్లో కూడా దూదేకులకుపై వివక్ష చూపడం జరుగుతున్నది. ఎక్కడోకచోట దూదేకులపై కాస్త మానవత దృక్పథంతో ఆర్ధిక లావాదేవిల్లో చోటిచ్చే సంఘటనలు చాలా అరుదు. వక్స్ బోర్డు లాంటి విషయాల్లో ఇకా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇకా పెళ్లిళ్ల విషయాల్లో అయితే దూదేకుల పిల్లలకు ముస్లిం పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేసే సంప్రదాయం అస్సలు ఉండదు. ఇకా ఎవరైనా దూదేకుల్లో బాగా చదివి మంచి ఉద్యోగం చేస్తున్నా లేదా ఇస్లాం పాండిత్యాన్ని బాగా చదివిన వారువుంటే అప్పుడు వారిపట్ల కాస్త ఆలోచించి ముస్లింలు దూదేకులకు పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేయడానికి ప్రస్తుతం కాస్త ముందడుగు వేస్తున్నారు. అది కూడా చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమేనని చెప్పవచ్చును. కానీ నిజ జీవితంలో భారతీయ ముస్లిం సమాజంలో ఎటువంటి వివక్షలు, అసమానతలు ఉండవని మిగతా సమాజాలు, మిగతా మతాలు అపోహపడుతుంటాయి. నిజ జీవితం వీటికి భిన్నంగా ఉంది. ఇస్లాం మత సంప్రదాయ ప్రకారం పురుషునికైనా, స్త్రీ కైనా మరియు ఇస్లాం మతంలోని అన్ని వర్గాల్లోను అసమానతలు ఉండకూడదు. అలా ఎవరైనా అసమానతలు చూపిస్తే వారు అసలు ముస్లిమే కాదని ఇస్లాం చెబుతుంది. కానీ దూదేకులు ముస్లింలలోనే కలిసిపోయి ఉన్నప్పటికి వారిపై వివక్షను చూపించడమనేది బాధాకారమైన సంఘటన. ఈ వివక్ష కూడా ఎక్కువభాగం మిగతా మతాలు గుర్తించని విధంగా ముస్లింలు దూదేకులపై అంతర్గతంగా వివక్షను కనబరుస్తుంటారు. కొన్ని చోట్ల బహిర్గతంగానే ఈ వివక్ష కనబడుతుంది. అయితే దూదేకులు పూర్వం ఇస్లాం మతాన్ని స్వీకరించనప్పుడు అప్పటి ఇస్లాం మతాన్ని స్వీకరించిన ముస్లింలు కావొచ్చు, సూఫీ గురువులు కావొచ్చు దూదేకులపై చూపించినంత ప్రేమ, అప్యాయత, అనురాగాలు, మానవీయ గుణం ఎక్కువకాలం మిగలలేదు. అనతికాలంలోనే సూపీ గురువుల కాలం చెల్లిన తర్వాత ఈ ఆదరణ స్వార్థంతో మటుమాయమై దూదేకులను తీవ్రమైన దిగ్భ్రాంతిలో పడేసింది.
నేటికి కూడా మనం పల్లె ప్రాంతాల్లో నివాసముంటున్న దూదేకుల జీవన విధానాన్ని పరిశీలిస్తే వారు కొన్ని దశాబ్దాల నుండి భిన్నమైన సంస్కృతి, భిన్నమైన సంప్రదాయాలు వారితో పెనవేసుకున్నట్లు మనకు స్పష్టంగా కన్పిస్తుంది. దూదేకులు మతం మారినప్పటికి వీరి జీవన విధానం, మూలాలు మారలేదు. అందుకే వీరి రోజువారి జీవన విధానంలో భిన్నత్వంతో కూడిన హిందూ, ముస్లిం సంస్కృతి మిళితమైన భిన్నత్వం మనకు కన్పిస్తుంది. దూదేకుల్లో ఈ సంస్కృతి ఎక్కువగా మనకు గ్రామీణ ప్రాంతాలలో ఉండే వారిలోనే కన్పిస్తుంది. బహుశా ఈ సందర్భంగానే వీరు ఇరు మతాల హిందూ,ముస్లిం సంస్కృతులకు దగ్గరై సగం తురకోడు, సగం సాయిబు, సగం తెలుగోడు అని హేళనగా ఇరు మతాల చులకనకు గురవుతున్నారు. దూదేకులు కొన్ని తరాలుగా ఈ బాధను, దుఃఖాన్ని దిగమింగుకుని జీవనవిధానాన్ని కొనసాగిస్తున్నారు. ఏది ఎమైనా హిందూ మతాన్ని ఆచరించే తెలుగు వారు కావొచ్చు, ఇస్లాం మతాన్ని ఆచరించే ముస్లింలు కావొచ్చు దూదేకుల భిన్నత్వాన్ని, మిళితమైన సంస్కృతి చూసి సగర్వంగా గర్వపడాలి. కానీ.! చులకన చేయరాదు. ఎందుకంటే భారతదేశంలోని ఏ వ్యక్తులైన సరే ఇతర మతాలను, ఇరు మతాల సంస్కృతిని గౌరవిస్తారు. కానీ.! పాటించరు. ఏక కాలంలో ఇరు మతాల ఆచారాలను, సంస్కృతిని గౌరవించడం, ఆదరించడం మాత్రమేగాక, ఆ మతాల సంస్కృతిని, ఆచారాలను కట్టుదిట్టంగా పాటిస్తూ మన దేశంలో జీవనం కొనసాగిస్తున్నవారు దూదేకులు మాత్రమేనని చెప్పవచ్చును. ఈ ఒక్క సంఘటన చాలు దూదేకులు మన భారతీయ లౌకికతకు నిలువుటద్దమని చెప్పడానికి. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని పల్లె ప్రాంతాలలో నివసించే దూదేకుల్లో ఈ భిన్నత్వం, లౌకికత మనకు నేటికి కనబడుతుంది.
దూదేకుల గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయాలు వీరు ఇస్లాం మత పండుగలైనా రంజాన్, బక్రీద్, మిలాదున్ నబీ పండుగలతో పాటు, హిందువుల పండుగలైనా వినాయక చవితి, సంక్రాంతి, ఉగాది, శ్రీరామనవమి మొదలగు పండుగలతో పాటు, ఇరు మతాల సంస్కృతికి నిలయమైన మొహర్రంను కూడా సంతోషంగా జరుపుకుంటారు. దాదాపుగా పల్లె ప్రాంతాల్లో నివసించే దూదేకులు శుభ కార్యక్రమాల్లో కావొచ్చు, వివాహ కార్యక్రమాల్లో కావొచ్చు, గృహ ప్రవేశంలో కావొచ్చు పక్కగా ఇరుమతాల సంస్కృతులను పాటిస్తారు. దూదేకులు హిందూ మతంలో భాగమైన మూఢనమ్మకాలు, శకునాలు, ఈ రోజు మంచి రోజునా కాదా? రాహుకాలం ఏమైనా ఉందా.? అమావాస్యనా.? అని క్యాలెండర్‌ని తుచతప్పకుండా పాటించడం లాంటి విషయాలను నేటికి కూడా మనం చూడవచ్చును. అయితే పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారు దాదాపుగా ఇస్లాం సంస్కృతికికి అనుగుణంగానే నడుచుకుంటున్నారు. ఏదీ ఏమైనా దూదేకుల వారు గర్వాన్ని ప్రదర్శించాలి. ఎందుకంటే ఇరు మతాల సంస్కృతిని పాటిస్తూ భారతీయ లౌకికతకు ప్రతీకగా ఉన్నారు కాబట్టి. కానీ.! ఇతరుల చూపే చులకన భావాన్ని పట్టించుకోకూడదు. నిజానికి చులకనకు గురికావాల్సింది చులకన చేసినవారే. మనిషికి మంచితనం, చేయూత ఇచ్చే మానవీయ గుణాన్ని కలిగి ఉండాలి. అదే మనిషికి కొలమానం అవ్వాలి. ఆ సామాజిక స్పృహ, గుణం లేనివారు అసలు మనుషులే కాదు.
దూదేకుల ఆర్ధిక జీవితానికి సంబంధించిన విషయానికొస్తే వీరు అధికంగా గ్రామీణ ప్రాంతాలలోనే నివసించడం వలన కులవృత్తినే నమ్ముకుని వెనుకబడిపోయారు. అందువలన దాదాపుగా వీరు శారీరక శ్రమ పైనే ఆధారపడటం వలన వచ్చే ఆదాయంతో కుటుంబం గడవడమే కష్టమైన పరిస్థితులలో కరుకుపోయారు. బహుశా దీని కారణంగానే వీరి పిల్లలు కూడా చదువుకు దూరమై శారీరక శ్రమకు అల్లుకుపోయారు. పూర్వం నుంచి నేటి ఆధునికయుగం వరకు కూడా వీరు పత్తి నుండి విత్తనాల్ని వేరుచేసి దూదిని శుభ్రపరిచి, ఆ దూదిని ఏకి పరుపులు, దిండ్లు తయారు చేసేవారు. అయితే గత రెండు, మూడు దశాబ్దాల నుండి ప్రపంచమంతా ఆధునికమై ఒక కుగ్రామంలా మార్పు చెందడం వలన దూదేకుల జీవన విధానంలో భాగమైన కుల వృత్తిలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రపంచం ఆధునిక వెలుగులో హంగులతో ప్రపంచీకరణను ఆహ్వానించడం వలన దూదేకుల కులవృత్తిని ఆధునిక యంత్రాంగం, పరిశ్రమలు ధ్వంసం చేశాయి. ప్రపంచీకరణలో భాగంగా వచ్చిన ఈ పరిశ్రమలు, యాంత్రీకరణ వీరి కుటుంబాలను రోడ్డున పడేసింది. ఇటువంటి వాతావరణంలో దూదేకులు బతుకు భారాన్ని కొనసాగించడానికి వివిధ రకాల వృత్తును, వివిధ రకాల పనులను ఎన్నుకున్నారు. ఎక్కడో మారుమూల గ్రామాలలో ఎక్కడన్నా కొన్నిచోట్ల నేటికి ఇంటి దగ్గరికి వెళ్ళి పరుపులు, దిండ్లు కుట్టి జీవనాధారం కొనసాగించే దూదేకులు లేకపోలేదు. అయితే నేడు దాదాపుగా పల్లె ప్రాంతాలలో కూడా ప్రపంచీకరణ కోరలు చాచడం వలన అవి కూడా కొనేవారు కరువయ్యారు.
ప్రపంచీకరణలో భాగంగా వచ్చిన ఆధునిక యంత్రాంగం దూదేకుల జీవనాన్ని బలంగా దెబ్బ కొట్టినది. వందమంది ఒక రోజులో చేసే పనిని జిన్నింగు మిల్లులు ఒక గంటలో చేసేవి. ఈ జిన్నింగు మిల్లుల వలన అనేకమంది దూదేకులు దూది ఏకే వృత్తికి దూరమై రోడ్డున పడ్డారు. దూది ఏకే వృత్తి గల్లంతు అవ్వడంతో కొంతమంది దూది ఏకేవృత్తికి స్వస్తి పలికి టైలరింగ్ పనులు, ఎంబ్రాయిడింగ్ పనులు, గోళీ సోడాలు తయారు చేయడం, రోజువారి దినసరి కూలీ పనులతో కుటుంబ భారాన్ని నెట్టుకొచ్చేవారు. అయితే ఈ పనులను చేసే దూదేకుల జీవితాలపై కూడా ఆధునిక యంత్రాలు కోలుకొని దెబ్బకొట్టాయి. రెడీమేడ్ వ్యవస్థ టైలరింగ్ పనులు, ఎంబ్రాయిడింగ్ పనులు చేసే వారి జీవతాలను చిన్నాభిన్నం చేసింది. తోపుడు బండ్లపై గోళీ సోడాలు అమ్ముకునే దూదేకుల జీవితాలపై మిషనరీ సోడా యంత్రాంగం రావడం వలన వీరి జీవితాలు మళ్లీ ప్రశ్నార్థకంలో పడ్డాయి. వ్యవసాయ పనుల్లోను ఆధునిక యంత్రాలు ప్రవేశించాయి. దీనితో దాదాపుగా వ్యవసాయ పనులు చేసే దినసరి కూలీల బతుకులు కూడా గందరగోళంలో పడ్డాయి. రిక్షాల తొక్కి జీవనధారం కొనసాగించే వారిపై కూడా ఆటోలు, CABలు గుదిబండలా మారాయి. మరికొంత మంది దూదేకులు మేస్త్రీలుగా, బెల్దారులుగా, డ్రైవర్లుగా, డబ్బున్నోళ్ల ఇళ్ల దగ్గర పరిశ్రమల దగ్గర సెక్యూరిటీ గార్డుల్లా, కార్ఖానాల్లో దినసరి కూలీలుగా బతుకు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇంకొంతమంది దూదేకులు రోడ్లపై చిన్న చిన్న చిల్లర షాపులు, మెకానిక్ షాపులు, టీ కొట్టులు, తోపుడు బండ్లపై కూరగాయాలు, పండ్లు, టిఫెన్ సెంటర్లు పెట్టుకుని కుటుంబ భారాన్ని మోసేవారున్నారు.
దూదేకులు జనాభా పరంగా అధికారిక లెక్కల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో మూడు, మూడు లక్షల చొప్పున 6లక్షల మంది దాకా ఉన్నారు. కానీ.! వీరి జనాభా నిజానికి 15లక్షలు పై మాటే.! వీరు కొంతమంది హిందూ మతానికి అనుగుణంగా రెవిన్యూశాఖ పరంగా ధృవ పత్రాలు తీసుకొవడం, మరికొంత మంది ఇస్లాం మతానికి అనుగుణంగా రెవిన్యూశాఖ నుంచి ధృవ పత్రాలు అందుకోవడం వలన వీరి జనాభాపై ప్రభుత్వాలకు స్పష్టత లేదు. అందువలన పక్కాగా దూదేకులు అనేవారి లిస్ట్ ఆధారంగానే వీరి జనాభా లెక్కలు ప్రభుత్వాల దగ్గర ఉన్నందు వలన ప్రభుత్వాల నుంచే అందే పథకాలు గానీ, రుణాలు గానీ, విద్య, వైద్య పరంగా అందే సదుపాయాలు పొందలేకపోతున్నారు. అయితే దూదేకులు ఎక్కువ భాగం దాదాపుగా 80% ముస్లింలు ఆచరించే సంప్రదాయాలతో పాటు వారి జీవనవిధానానికి అనుగుణంగా ఉండే సంప్రదాయాలను పాటిస్తుంటారు.
కళా రంగంలో భాగమైన నాదస్వరానికి పెట్టిన పేరు దూదేకులు. దాదాపుగా నాదస్వర విజ్ఞానంలో దేశం మెచ్చుకోదగిన వ్యక్తుల్లో వంద మందికి పైగా ఉన్నారు. అయితే వీరిలో చిన పీరు సాహెబ్, షేక్ ఆదం సాహెబ్, పద్మశ్రీ షేక్. చిన మౌలానా, చిన ఖాసీం.సాహెబ్, గోపవీడు హసన్ సాహెబ్ లాంటి వారు దేశంలోనే గాక ప్రపంచ వ్యాప్తంగా ఆదరణను పొందారు. దూదేకులు అని పేరు చెప్పగానే గుర్తుకొచ్చే ప్రముఖులు, దూదేకుల జాతి అణిముత్యాలు దూదేకుల సిద్దప్ప, కబీరు, దాదూ దయాల్, పద్మశ్రీ షేక్. నాజర్, పద్మశ్రీ షేక్. చిన మౌలానా, నాగూర్ బాబు, అలీ మొదలగువారని ఖరాఖండికగా చెప్పవచ్చును. సాహిత్య రంగంలో దిలావర్, ఖమ్రొద్దీన్, యాకూబ్, సయ్యద్ సలీం, ఖాజా, షాజహానా మొదలగు వారిని చెప్పవచ్చును. శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయంలో వన్నూరు బాషా అనే పరిశోధక విద్యార్థి దూదేకుల సాహిత్యంపై సమగ్రమైన పరిశోధన చేస్తున్నారు. త్వరలో రికార్డు రూపంలో తొలి సాహిత్య పరిశోధన గ్రంధంగా మనందరి ముందుకు రాబోతున్నది. దూదేకుల చరిత్రను రికార్డు చేయడంలో అబ్దుల్ సత్తార్, ఐ. దావూద్ మొదలగు వారిని చెప్పవచ్చును. అయితే తెలుగులో ఐ. దావూద్ గారు “నూర్ బాషీయులు చరిత్ర సంస్కృతి” అనే రచన దూదేకుల చరిత్రకు మచ్చుతునకగా చెప్పవచ్చును.
అయితే దూదేకుల అభ్యున్నతి గురించి చివరగా రెండు మాటలు ప్రస్తావించాలి. ఒకటి వీరు సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా, విద్య, వైద్య, ఉద్యోగ పరంగా వెనుకబడి ఉన్నారు. వీటిని అధిగమించేందుకు దూదేకులు, ప్రభుత్వాలు ప్రత్యామ్నాయంగా ఆలోచించి ముందడుగు వేయాలి. మరోక విషయం ఇరు మతాల నుంచి పడుతున్న వివక్షను పారదోలాలి. ముఖ్యంగా మరోక విషయం దూదేకుల సామజిక ఉద్యమకారులు, ఇతర సంస్థల వారు, సంఘాల వారు ముఖ్యంగా నేడు చేయవల్సింది ఒక్కొక్క జిల్లాలో వీరి జనాభా ఎంత ఉంది, ఎంత మంది నిరక్షరాస్యులున్నారు, ఎంతమంది ఉపాధి లేకుండా ఉన్నారు, ఎంతమంది చదువుకున్నా వారున్నారు, ఎంతమంది ఉద్యోగులున్నారు, ఎంతమంది సహాయం కోసం ఎదురుచూసే వారున్నారనే విషయాలపై దృష్టి సారిస్తే భవిష్యత్తులో వారి అభివృద్ధికి బంగారు బాటలు వేసినవారవుతారు.
— డా. షేక్ ఇబ్రహీం,
అసిస్టెంట్ ప్రొఫెసర్,
ఏ.పి ఐ.ఐ.ఐ.టి : ఒంగోలు.