‘చెయ్యాల్సిన పని’ సూటిగా చెప్పిన కథ

మంచి-చెడు, ప్రేమ-ద్వేషం, కోపం-ఓరిమి..

మనిషి వైరుధ్యాల పుట్ట. కానీ వీటిల్లోంచి ఏదో ఒకదాన్ని ఎంచుకుని, అంచనాకట్టేసుకుంటాం. కంటికి కనిపించేది కవచం మాత్రమే. దాని వెనుక పేరుకుని ఉన్న పొరల్లోకి పెద్దగా చూపు సారించం.  అందుకే మన సాహిత్యంలోనూ, సినిమాల్లోనూ హీరోలూ, విలన్లూ మాత్రమే ఎక్కువగా ఉంటారు. ఈతరం కథకులు సాహిత్య అధ్యయన ప్రపంచాన్ని మరింత విశాలం చేసుకుంటూనే మనుషులనీ, ప్రవర్తననీ కూడా వారి బహుముఖాల్లోంచి చూస్తున్నారు. సమ్మిశ్రమ స్వభావాన్ని యధాతధంగా చూపుతున్నారు.  పాణిని జన్నాభట్ల రాసిన ‘చెయ్యాల్సిన పని’ కథ కూడా ఇటువంటిదే. ఆదివారం ఆంధ్రజ్యోతిలో అచ్చయిన ఈ కథ-సాఫ్ట్‌వేర్‌ తరం రచనాశైలిని ప్రతిబింబిస్తుంది.

అరచేతిలోకి ఫోన్ వచ్చిన తర్వాత మనుషులు కలిసి మాట్లాడుకోవడానికి అంత విలువా, ప్రాధాన్యం లేవు. ఫోన్ లోనూ గొంతును  టెక్స్ట్‌ మెసేజ్‌లు నొక్కేశాయి. కర్త, కర్మ, క్రియలతో కూడిన సుదీర్ఘ వాక్యాలకు సమయం లేదు. కొత్త పదాలు పుడుతున్నాయి. వాక్యాల వ్యాకరణం మారుతోంది. సరికొత్త రచనా శైలి రూపుదిద్దుకుంటోంది. లాప్‌టాప్‌, మొబైల్‌ స్ర్కీన్ ల మీద నుంచి సాహిత్యంలోకీ ఇది ప్రవేశించింది. సాంకేతిక మార్పులతోపాటూ ఇదొక అనివార్య పరిణామం. ఆహ్వానించాల్సిందే తప్ప, లబోదిబోమనడానికి ఏమీ లేదు. నిజానికి ఈ శైలి నిదానంగా పదునెక్కుతోంది. క్లుప్తత మాత్రమేకాదు, సూటిదనం, స్పష్టత దీని ప్రత్యేకత. ఈ కొత్తతరం జీవభాషను తెలుగు కథకు కొత్త చేర్పుగానే స్వీకరించాలి.

పాణిని జన్నాభట్ల రాసిన ‘చెయ్యాల్సిన పని’ కథానిర్మాణం సాఫ్ట్‌వేర్‌ శైలిలో సాగినా, సంభాషణల్లో గుంటూరు జిల్లా గ్రామీణ మాండలికం అద్భుతంగా పలికింది. ఈ రెండింటి కలయిక, కథను సరళంగా చదివిస్తుంది.

భార్య వదిలేసిన ఒక ప్రయివేటు ఉద్యోగి, తను చెయ్యాల్సిన పనుల గురించి చెప్పుకుంటూ వెళ్లడమే ఈ కథ. 12 గంటల కాలంలో ఒక రోజు జరిగిన పరిణామాలను దృశ్యదృశ్యాలుగా ఆ ఉద్యోగి కోణంలోంచి చిత్రించాడు రచయిత.

కథలోని ‘నేను’ బహుశా అంతర్ముఖుడు. భార్య అతనితో కలిసి జీవించలేనని తేల్చుకుని తెగేసి చెప్పి, కూతురిని తీసుకుని వెళ్లిపోయింది.  తను పనిచేసే కంపెనీకి పది కోట్ల టాక్స్‌ సేవ్‌ చేసిన అతనికి, ఇప్పుడా ఉద్యోగం కూడా ముళ్లకుర్చీలా మారింది. అతను చెడ్డవాడు కాదు. భార్యను కష్టపెట్టనూ లేదు. కాకపోతే ఎక్కువ సుఖపెట్టనూ లేదు. ‘సుఖపెట్టకపోవడమే కష్టపెట్టడమేమో’ అనే విచికిత్సలో పడిపోయాడు అతను. కానీ, అక్కడ అతని కూతురుంది. ఆ కూతురితో తెంచుకోలేని బంధముంది. నిమ్మళంగా ఉండలేని స్థితి అది. అతను సాధించి పెట్టుకున్న గుడ్‌విల్‌ ఆఫీసులో ఆవిరైపోయింది. బాస్‌కింకరుడితో ప్రతిరోజూ నరకం అనుభవిస్తున్నాడు. ఊపిరాడని ఊబిలో కూరుకుపోతున్నట్టుగా ఉంది అతనికి. అమ్మలేదు. తనను నిరంతరం వేలెత్తి చూపే తాగుబోతు తండ్రి మీద ద్వేషం పేరుకుపోతోంది. అనకొండ వంటి పాము ఏదో తనను మెలికలు చుట్టేసుకుంటూ ఉన్నట్టు.. ఆపెనుగులాటలో శక్తి సన్నగిల్లి ఓడిపోతున్నట్టు..

అటువంటి స్థితిలో చిటికెడు ఓదార్పు – లత. తనను ఫోన్ లో పలకరించే లత. తనకు పెళ్లయిందనీ, పాప ఉందనీ తెలిసీ తన వెంటబడే లత. ఏం కావాలి ఈ లతకి? ఏముంది తనలో? ‘ఒకసారి రచయితల గురించి  ఆవేశంగా మాట్లాడానని, కొంపదీసి తనను సమాజం పట్టించుకోని ఇంటలెక్చువల్‌ అనుకుంటోందా?’ లేక తన భార్యే తన మీద ప్రయోగిస్తోందా అని అనుమానం, అసహనం, చికాకు..ఈ అభద్రజీవికి. అయినా తనను తనకన్నా ఎక్కువగా పట్టించుకునే లత పట్ల, తనమీద అధికారం ప్రదర్శించే లత పట్ల, తనలోని అగాథాలను వెతుకుతున్నట్టు ఉండే ఆమె కళ్ల పట్ల.. ఇబ్బందితో కూడిన ఇంకేదో అతనిలో పెరుగుతోంది. అది ఆమెకు దూరంగా పారిపోవాలన్నంత చికాకును అతనికి కలిగిస్తోంది.

ఇటువంటి అసందిగ్ధ మానసిక ప్రపంచంలో తనతో తాను యుద్ధం చేస్తూ, తన కూతురు పుట్టిన రోజున అతను తన దినచర్యను ఇలా నిర్దేశించుకున్నాడు.

ఉదయం 9.00- విన్నీ పాపకి ‘ప్రిన్సెస్‌’ కేక్‌ ఆర్డర్‌ చెయ్యాలి

12.00- అకౌంట్స్‌ ట్యాలీ చేసి బాస్‌కి ఈమెయిల్‌ చేయ్యాలి.

1.00- శాన్ భాగ్‌లో లంచ్ కి కలిసినప్పుడు లతకి ముందే ‘సారీ’ చెప్పాలి.

2.30- హోండా డీలర్‌తో జాబ్‌ ఇంటర్వ్యూ అటెండ్‌ అవ్వాలి.

4.30- ఛాయ్‌ కాకా అమౌంట్‌ క్లియర్‌ చెయ్యాలి.

రాత్రి 8.00- ధనంజయ్‌ని బార్‌కి తీస్కెళ్లి వచ్చేదార్లో చంపాలి.

9.00-?

అతని జీవితంలో ఏది సవ్యంగా ఉందనీ.. ఈ దినచర్య మాత్రం  యధాతధంగా జరగడానికి!

తన బిడ్డ కోరుకున్న ‘ప్రిన్సెస్‌’ కేక్‌ ఎక్కడా దొరకలేదు. పైగా కూతురుకి హ్యాపీ బర్త్‌డే చెప్పడానికి ఫోన్ చేసి ‘ ఏ మొహం బెట్టుకోని ఈ బుజ్జిదాన్ని మచ్చికజేస్తన్నా’ అని అత్తతో తిట్లు తిన్నాడు. కేక్‌ కోసం వెతుకులాటలో ఆలస్యంగా ఆఫీసుకు వెళ్లి న అతనికి  అకౌంట్స్‌ ట్యాలీ చేసి బాస్‌కి ఇచ్చే అవసరం రాకుండానే ఉద్యోగం ఊడిపోయింది.  తన కోసం లంచ్  తీసుకువచ్చిన లత ముందు నోటినీ, గుండెనీ కూడా జార్చి, కోపావేశంతో ఆమె తనను అసహ్యంగా చూసి వెళ్లిపోతూ ఉంటే ఎప్పటికీ ఈమెకు ‘సారీ’ చెప్పలేనని తేల్చేసుకున్నాడు. అరగంట ఆలస్యం అయ్యిందని ఇంకో ఉద్యోగానికి ఇంటర్వ్యూ చేజారిపోయింది. చేయాల్సిన పనులు ఒక్కటొక్కటీ విఫలమైపోయి.. ‘ప్రపంచం అట్టడుగు పొరల్లో దాక్కొని ఎవరికీ దొరక్కపోతే బావుణ్ణు’ అనుకుంటున్న వేళ.. అతను సమర్ధంగా చేయగలిగిన ఒకే ఒక్క పని ఛాయ్‌ కాకా బాకీ క్లియర్‌ చేయడం ఒక్కటే. ఆ తర్వాత ఆరోజుటికి మిగిలిన ఆఖరి పని ధనంజయ్‌ని చంపడం.

ధనంజయ్‌ అతని తండ్రి. తండ్రిని చంపడమా? ఎందుకు? ఎందుకంటే భార్యని చంపలేడు కాబట్టి, పుట్టినరోజున కూతురితో మాట్లాడుతూ ఉంటే ఫోన్ లాగేసుకున్న అత్తను చంపలేడు కాబట్టి. ఎంత చేసినా తనను నమ్మని బాస్‌నూ, ఎగతాళి మాటలు విసిరే సహోద్యోగులనూ ఎప్పటికీ చంపలేడు కాబట్టి. ఎందుకంటే.. తన ఆశ్రయంలో ఉంటూ, గ్యారేజ్‌లో పనిచేస్తూ, రోజూ తాగి తూగి వాగే తండ్రిని మాత్రమే చంపగలడు కాబట్టి. అనుకున్నట్టే, మత్తు తలకెక్కి ఒళ్లు తెలియని తండ్రిని పట్టాల మీదుగా నడిపించి ఇంటికి తీసుకువెళ్తూ, ‘ తలమీద మణితో మెరుస్తున్న నాగుపాములా మెల్లగా దూసుకొస్తున్న’ రైలుకు  బలిచ్చే క్షణాన.. ధనంజయ్‌ అన్న మాట అతన్ని ‘వెయ్యివోల్టుల షాక్‌’కి గురిచేసింది. ఆ షాక్‌ ట్రీట్‌మెంట్‌ అతనిలోని మనిషికి ఛెళ్లున తగిలి ఉలికిపడి లేచేలా చేసింది. రైలు కింద పడబోతున్న  తండ్రిని ఒక్క తోపుతో అవతలికి నెట్టేలా చేసింది. తండ్రికీ, కొడుక్కీ మధ్యనుంచి హోరున రొదచేసుకుంటూ దూసుకుపోయింది రైలు. ఆ మరుక్షణపు నిశ్శబ్దాన్ని భరించలేక చీకట్లోకి పారిపోతుండగా వినిపించింది తండ్రి పెట్టిన పొలికేక..‘ చెత్తనా కొడకా! సంపీ..సచ్చీ గాదురా..నూ సాదించేది. అదేదో బతికి.., దైర్యంగా బతికి సాదించు’. అదిఅరుపు కాదు, అతన్ని వెనక్కి లాగిన పిలుపు. ఆ తటపటాయింపు సమయంలోనే విన్నీ నుంచి ఫోన్ వచ్చింది, ‘థాంక్స్‌ డాడీ, ప్రిన్సెస్‌ కేక్‌ చాలా బాగుంది. లతా ఆంటీ తెచ్చింది’ అని.

వెయ్యి ఏనుగుల బలం. వెయ్యి చేతుల ఆసరా. వెయ్యి వోల్టుల వెలుగు.

చీకటిని వదిలి వెనక్కి తిరిగి నడిచాడు అతను… తన తండ్రి దగ్గరకు. తనను వద్దనుకున్నదనుకున్న సమాజం దగ్గరకు.

ప్రేమరాహిత్యం దుర్బరమైనది, క్రూరమైనది. ప్రేమ ఎన్నటికీ తరిగిపోదు, తరలివెళ్లిపోదు. గుర్తుపట్టలేని గుడ్డితనంతో  ప్రేమను కోల్పోయామనుకుంటారు. అసూయతో, అనుమానంతో, ఆవేశంతో, ద్వేషంతో, పగతో, హింసతో ప్రేమను పొందలేరు. ప్రేమ ఒక జీవనశక్తి. అమృతపాత్ర. అది ప్రహ్లాదుడికి కనిపించే విష్ణువులా అన్నితావుల్లోనూ ఉంటుంది. హృదయంతో చూసి స్వీకరించడమే చేయాల్సిన పని అని పాణిని జన్నాభట్ల కథగా చెప్పారు.

*

చెయ్యాల్సిన పని

 

మొబైల్ తీసి చూశాను పొద్దున ఆఫీసుకెళ్ళబోతూ. ఆ రోజు చెయ్యాల్సిన పనుల లిస్ట్ ఇంకోసారి చెక్ చెయ్యడానికి –

9:00 – విన్నీ పాపకి ‘ప్రిన్సెస్’ కేక్ ఆర్డర్ చెయ్యాలి.

12:00 – అకౌంట్స్ ట్యాలీ చేసి బాస్ కి ఈమెయిల్ చెయ్యాలి.

1:00 – శ్యాన్ భాగ్ లో లంచ్ కి కలిసినప్పుడు లత కి ముందే ‘సారీ’ చెప్పాలి.

2:30 – హోండా డీలర్ తో జాబ్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి.

4:30 – చాయ్ కాకా అమౌంట్ క్లియర్ చెయ్యాలి.

8:00 – ధనంజయ్ ని బార్ కి తీస్కెళ్లి వచ్చే దార్లో చంపాలి.

9:00 – ?

ఎక్కడా తేడా లేదు. మొబైల్ ని పాకెట్లో తోసి బైకెక్కాను.

***

బేకరీ దగ్గర ఆగాను. ‘ప్రిన్సెస్’ కేక్ ఈ మధ్య చెయ్యట్లేదన్నాడు వాడు. ఇంకో రెండు మూడూ చోట్ల తిరిగినా అలాంటివి లేవన్నారు. ఏమైంది ఉన్నట్టుండి వీళ్ళందరికీ? ఆఫీసుకి లేటవుతోంది. విన్నీకే ఫోన్ చేసి వేరే ఆప్షన్స్ అడిగితే? దాన్ని సర్ప్రైస్ చేద్దామనుకున్నా, కానీ వేరే కేక్ పంపి, అది నచ్చకపోతే…?

ఇబ్బందిగానే కాల్ చేశాను. రెండు రింగుల్లోనే ఎత్తింది. “హలో…” అన్నా అటెవరూ మాట్లాడట్లేదు. వెనకాల రకరకాల శబ్దాలూ, నవ్వులూ. మెల్లగా తలుపేసిన శబ్దం. నాకర్థమైంది.

“హాయ్ డాడీ…” రహస్యం చెప్తున్నట్టు అంది.

“హాయ్ బుడ్డీ, హ్యాపీ బర్త్ డే రా!”

“థాంక్స్…ఇప్పుడా చెప్పేది. రాత్రంతా వైట్ చేశాను.”

“సారీ రా…నువ్వు నిద్ర పోయావనుకున్నా. ఫోన్ అమ్మ లిఫ్ట్ లేస్తే మళ్ళీ గొడవ అని చెయ్యలేదు.”

“నువ్వు మమ్మల్ని మర్చిపోయావంట? అమ్మా, అమ్మమ్మా చెప్పారు చాలా సార్లు నాతో.”

ప్రశ్న లాంటి నింద.

“ఛ ఛ, నిన్ను మర్చిపోడం ఏంట్రా! పోయిన వారం కాల్ చేశా కదా?”

మధ్యలో చాలాసార్లు చేసినా మీ అమ్మ కట్ చేసిందని చెప్పలేకపోయాను.

“లాస్ట్ బర్త్ డే గుర్తుందా డాడీ? మనింటి దగ్గర ఫ్రెండ్సందరూ వచ్చారు. మెర్మైడ్ కేక్ తెచ్చావ్. చాలా ఆడుకున్నాం. ఇక్కడ అమ్మమ్మా వాళ్ళింటి దగ్గరసలు ఫ్రెండ్సే లేరు. నువ్వొచ్చి తీస్కెల్లు డాడీ వెంటనే మనింటికి…”

అది బాధగా, కోపంగా కళ్ళు తిప్పుతూ చెబుతున్నట్టు ఊహించుకున్నా. ఏ మాటకి ఎలాంటి ఎక్స్ ప్రెషనిస్తుందో ఏడేళ్ళగా చూస్తున్నా.

“తీస్కెళ్తాలే గానీ, ఫస్ట్ నువ్విది చెప్పు. ఏం కేక్ కావాలి నా బుడ్డీకివాళ?”

“లాస్ట్ వీకే చెప్పాగా డాడీ, ప్రిన్సెస్ కేక్ అని…నీకు ఫొటో కూడా పంపా వాట్సాప్ లో?”

“అవును కానీ అలాంటిదిక్కడ లేదే. పోనీ క్యాసిల్ కేక్ తీస్కోనా…”

“వద్దు, అస్సలొద్దు.”

అరగంట లేటైంది అప్పటికే ఆఫీసుకి.

“స్నో మ్యాన్ కేక్ బావుందే! చాలా ఫన్నీగా ఉంది.”

“స్నో మ్యానా…! ఆ…”

ఉన్నట్టుండి వెనకాల ఎవరో అరుస్తున్నట్టు వినిపిస్తోంది.

“తలుపులేసుకోని ఈడేం జేస్తన్నావే?…”

“నా డ్రెస్సు కోసమొచ్చాలే”

“ఏందీ దాస్తన్నా ఎనకమాల? ఫోనా?…”

“ఇటీవే…” లాక్కున్నట్టు గాజుల శబ్దం.

ఏవో శబ్దాలూ, అరుపులూ, ఏడుపులూ.

“ఓసేయ్, నీ కుతురు ఆడితో మాట్టాడ్డం ఇంగా ఆపలేదే!”

కలుక్కుమంది మనసు. అనవసరంగా ఫోన్ చేసి దాన్ని ఏడిపిస్తున్నాను పొద్దున్నే.

“ఏయ్యా, మమ్మల్నిన్నేళ్ళూ ఏడిపించింది చాల్లా? నీతో పడరాని కష్టాలు పడింది నా పిల్ల. దాని జాతకం, నీ లాంటి పాపిష్టోడితో ఏగాల్సొచ్చింది. మొన్న మా ఇంటిమీద బడి మీ నాన చేసిన చండాలపు గొడవ తర్వాత ఏ మొకం‌ బెట్టుకోని ఈ బుజ్జిదాన్ని మచ్చికజేస్తన్నా?

మళ్ళా మా విషయాల్లో కలగజేస్కుంటే బాగుండదు నీకు.”

ఫోన్ కట్ అయిన శబ్దం.

ఒళ్ళంతా మండిపోతోంది. ఆవిడ తిట్టలేదు నన్ను, కాల్చింది. ఆమెకి నోరే తప్ప, చెవులూ, బుర్రా పని చెయ్యడం మానేసి చాలా ఏళ్ళయ్యింది!

“అనుపమని నేనేం కష్టపెట్టలేదు. అవును, ఎక్కువ సుఖపెట్టలేకపోయాను. సుఖపెట్టకపోవడమే కష్టపెట్టడమేమో!”

“సార్…సెలెక్ట్ చేస్కున్నారా?” అడిగాడు బేకరీ అతను చిరాగ్గా చూస్తూ.

“లేదు…థాంక్స్.” కేక్ బుక్ తిరిగిచ్చేసాను. మొబైల్ తీసి లిస్ట్ ఓపెన్ చేశాను.

కేక్ పంపి మళ్ళీ దాన్ని ఏడిపించలేను.

9:00 – విన్నీ పాపకిప్రిన్సెస్కేక్ ఆర్డర్ చెయ్యాలి.

***

బైక్ పార్క్ చేసి పరిగెత్తుతూ ఆఫీస్ లో మా అకౌంట్స్ సెక్షన్ చేరేటప్పటికి పది దాటింది. చుట్టుపక్క జనాలు నా వైపే కోపంగా చూస్తున్న ఫీలింగ్. సిస్టంలో చూస్తే అప్పటికే బాస్ ఈమెయిల్ – పన్నెండింటి కల్లా ఆ‌ మంత్ అకౌంట్స్ క్లోస్ చేసి ఆడిటర్‌కి పంపమని.

మా‌ బాస్ కి నేనెందుకో నచ్చలేదు. నా వర్క్ నచ్చకపోవటం వల్ల నేను నచ్చలేదో, నేను నచ్చకపోవడం వల్ల నా వర్క్ నచ్చదో తెలీదు. “నువ్వు బాస్ కి నచ్చాల్సిన అవసరమేంటి? నీ పని నువ్వు చెయ్యి, చాలు.” అంటుంది లత. తనది అమాయకత్వమో, అజ్ఞానమో అర్థం కాదు.

రెండు గంటలు కూర్చున్నా బిల్స్ అన్నీ దొరకలేదు ట్యాలీ చెయ్యడానికి. అయినంతవరకూ పంపాను. వెంటనే రూం లోకి రమ్మని కాలొచ్చింది.

“లెక్కల్లో పది లక్షల దాకా తేడా ఉంది. ఏం చెక్ చేశావ్?” పేపర్లు టేబుల్ మీదకి విసిరేశాడు.

“హార్డ్ వేర్ బిల్స్ ఎన్నిసార్లడిగినా, ఆ డిపార్ట్మెంట్ నుండి రావట్లేదు సార్. లేవంటున్నారు. మళ్ళీ ఆడిటర్ కి ఇవ్వడం లేటౌతుందనీ…” నసిగాను.

“ఇలా ఇస్తే ఆడిటర్ నానా బూతులూ తిడతాడు నన్ను. నీకేం, ఏదో గుడ్ విల్ మీద నెట్టుకొస్తున్నావ్. వెళ్ళు, నేను ఆడిటర్ కి వెయిట్ చెయ్యమని చెప్తాను, బిల్స్ అన్నీ తెచ్చి ట్యాలీ చేసి పంపు ఎలాగైనా.”

రెండేళ్ళ కిందట కంపెనీకి నేను పది కోట్లు టాక్స్ సేవ్ చేసినప్పుడు కలిగిందా ‘గుడ్ విల్’ మా కంపెనీ ఓనర్ కి. దాని ఎక్స్పైరీ డేట్ దగ్గరికొచ్చేసింది. ఎక్కువ రోజులు కాపాడలేదు.

నీరసంగా బైటికొచ్చాను.

ఓ కొలీగ్ కామెంట్ – “డల్లవ్వకు బ్రదర్, ఎన్ని తినలేదు ఇలాంటి తిట్లు నువ్వు.”

“గుడ్ విల్ తో తొక్కెయ్ అందర్నీ! ఎలా చేసినా నిన్ను టచ్ చేసేవాడే లేడు.” పక్కోడి మీద పడి ఏడ్చే ఇంకోడి జోక్.

మధ్యాహ్నం ఒకటి దాటింది. లత నుండి మెసేజ్ “వస్తున్నావా?” అని.

“ఇవాళ రాలేను. వర్క్ లో ఇరుక్కుపోయాను.” ఈ మూడ్ లో ఎలాగూ తనతో సరిగ్గా మాట్లాడలేను. కలవకపోవడమే బెటర్.

“సరే, మీ ఆఫీస్ లో క్యాఫిటేరియా ఉందా?”

“ఉంది.‌ చిన్నదే, శాండ్ విచ్ లూ అవీ ఉంటాయి. ఇవాళ్టికిక్కడే నేను…”

తనేమీ రిప్లై ఇవ్వలేదు. అంతటితో వదిలేసినందుకు ఊపిరి పీల్చుకున్నాను.

మళ్ళీ బిల్స్ గురించి ఫోన్లు చేశాను. ఆ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగాను. అరగంట కూర్చోబెట్టి “మీ బాస్ కి ఆల్రెడీ ఈమెయిల్లో డీటెయిల్స్ పంపించామే.” అన్నారు వాళ్ళు ఆశ్చర్యబోతూ. వెనక్కొచ్చి హడావిడిగా బాస్ రూంలోకెళ్ళబోతుంటే “నీ వర్క్ నన్ను టేకోవర్ చెయ్యమన్నాడు బాస్. ఐ విల్‌ కంప్లీట్ ఇట్. లైట్ తీస్కో.” అన్నాడో కొలీగ్.

మండింది. చచ్ఛినా ఈ జన్మలో బాస్ ని సాటిస్ఫై చెయ్యలేను.

12:00 – లెక్కలు ట్యాలీ చేసి బాస్ కి ఈమెయిల్ చెయ్యాలి.

***

“సర్ మీ గురించెవరో మేడం వచ్చారు.” అన్న రిసెప్షనిస్ట్ మాటతో సిస్టం లోంచి తలెత్తాను. టైం రెండు దాటింది. చుట్టుపక్కల కొలీగ్సందరూ లంచ్ కెళ్ళారు. వాళ్ళతో వెళ్ళి ఇబ్బంది పడటంకంటే, వెళ్ళకుండా ఉండటాన్నే అలవాటు చేసుకున్నాను.

రిసెప్షనిస్టు వెనకాలే వెళ్ళాను‌ సందేహంగా. బైట చూస్తే లత!

చేతిలో ఓ ప్లాస్టిక్ కవర్, లంచ్ పార్సిళ్ళు తెచ్చినట్టుంది. ఓ క్షణం అలా చూస్తూ నిలబడిపోయాను. “ఈ అమ్మాయికసలేం కావాలి నా నుండి? విడాకుల గొడవల్లో ఉన్నానని తెలుసు, నాకో పాప అనీ తెలుసు. నా దగ్గర డబ్బూ, తెలివీ రెండూ లేవని నేనే చాలా సార్లు చెప్పాను. నేనో పెద్ద అందగాణ్ణి కాదని నా మొహం మీదే కనబడుతోంది. అయినా నా వెంటే తిరుగుతుంది. ఎందుకో అర్థం కాదు. అప్పుడెప్పుడో కొన్ని పుస్తకాలిచ్చాను, కొంతమంది రచయితల గురించి ఆవేశంగా మాట్లాడాను. కొంపదీసి నన్ను సమాజం పట్టించుకోని ఇంటలెక్చువల్ అనుకుంటోందా?!”

తనే నవ్వింది, మొహం మీద చెయ్యి ఊపుతూ. పార్సెల్ చూపించి “వెళ్దామా” అంది ‘క్యాఫిటేరియా’ అని ఉన్న బోర్డ్ వైపు చూపిస్తూ. వెనకే నడిచాను. ఓ మూల సెటిలయ్యాక అన్నాను “నేనిక్కడే తినేస్తానన్నానుగా, నీకెందుకంత టైం వేస్ట్?”. తను పట్టించుకోకుండా మెల్లగా తీసి సర్దుతోంది.

“మా ఆఫీస్ లోపలికి రానిచ్చారా వీళ్ళు నిన్ను?” మాటమార్చాను నవ్వుతూ.

“ఇదేమన్నా పెద్ద ఐటీ కంపెనీనా, మా వారికి లంచ్ తెచ్చానంటే రిసెప్షనిస్టే నన్ను లోపలికి తెచ్చింది.” అంది కళ్ళార్పుతూ.

ఇవే నన్ను ఇబ్బంది పెట్టేవి. ఆ మొహం ఎందుకంత ఎక్స్ ప్రెసివ్ గా ఉండాలి? ఆ కళ్ళెందుకు నా అగాధాలు వెతుకుతున్నట్టు చూడాలి? నన్ను నాకన్నా తనే ఎందుకు ఎక్కువ పట్టించుకోవాలి? నా మీద పూర్తి అధికారమున్నట్లు ఎందుకు మాట్లాడాలి? అన్నిటికీ మించి, ఈ ఇబ్బందులన్నీ నాకు హాయిగా ఎందుకు తోచాలి!

“ఏంటి సర్, ఇవాళ రెప్పవాల్చకుండా చూస్తున్నారు? బాగున్నానా?”

సిగ్గుపడ్డాను.

“అబ్బ, బ్లషింగ్! నీకు సూటవ్వుదులే కానీ, ఏంటి మ్యాటర్?”

“నీకన్నీ తెలుసుగా, అంతా మామూలే.”

“విష్ చేశావా మరి విన్నీని.”

తింటున్నవాణ్ణి చటుక్కున తలెత్తాను.

“విష్ చేశాను, తిట్లూ తిన్నాను.”

“మీ అత్త గురించి నీకు తెలుసుగా, కొత్తేముంది.”

“విన్నీ ముందే, అదీ దాని బర్త్ డే రోజే తిట్టి, అంతా చెత్త చేసిందా ముసల్ది.”

“దానికి బుద్ధి లేదు. విన్నీ ఇవన్నీ గుర్తుపెట్టుకోదులే. చిన్నపిల్లే కదా.”

“అదే కాదు, ఆఫీస్ లో కూడా తిట్లు పడ్డాయ్.” చుట్టూ చూస్తూ అన్నాను మెల్లగా.

“మీ బాస్ పెద్ద ఎదవని అందరికీ తెలుసు. వాణ్ణి పట్టించుకోకు.” కొంచెం పెద్దగానే అంది తను.

నన్ను సంతోష పెట్టడానికి ఎంతవరకైనా వెళ్తుందనుకుంటా.

“నీ కర్థంకావివన్నీ, నా ప్లేస్ లో ఉంటే తెలుస్తుంది. సొంత కూతురి పుట్టినరోజుకి అడిగింది ఇవ్వలేకపోయాను, బాస్ కింద మూడేళ్ళగా చేస్తున్నా తనకి నచ్చినట్టు పని చెయ్యలేకపోతున్నాను, వద్దని తెలుస్తున్నా నిన్ను దూరం పెట్టలేకపోతున్నాను…”

అనగూడదు. అనేసాను. తనకి నా జీవితంలో స్థానం ఇవ్వలేను. ఇది తనకి తెలియాలి. ఛ, నేనిచ్చేదేంటి, తన జీవితంలో నేనే స్థానం తీసుకోలేను. ఎంత నచ్చినా, ఎంత ప్రేమించినా!

తనలా చూస్తూ ఉందో క్షణం. నవ్వింది తర్వాత.

“విన్నీతో నేను మాట్లాడతాలే రేపు.”

“విన్నీ తెలుసా నీకు?”

“గుర్తులేదా, నా మ్యూసిక్ క్లాస్ లోనే పరిచయం చేసింది నిన్ను నాకు.”

ఆశ పుట్టింది. విన్నీని చేరే ఇంకో మార్గం దొరికినందుకు.

“అయితే అనుపమ కూడా తెలుసా బాగా నీకు?”

“తెలుసు. విన్నీని క్లాసులో దించినప్పుడు, అప్పుడప్పుడూ మాట్లాడుతుంది. నీ ఎక్స్…”

నాకేదో కొత్తగా అనిపించింది, అనవసరమైన జ్ఞానోదయం లాంటిది.

“తనే ఎంకరేజ్ చేస్తోందా నిన్ను నా వెనక తిరగమని…”

“వాట్…!”

“అదే, నా ఏడుపులూ, ఫ్రస్టేషన్సూ అన్నీ దగ్గరుండి చూసిరమ్మని నా మీదకి పంపిస్తోందా?”

అసహ్యంగా చూసింది నన్ను. తన కళ్ళల్లో నీళ్ళు తెరలు తెరలాగా కదులుతున్నాయి. అవి కిందకి జారకుండా అటూ, ఇటూ చూస్తోంది.

“తిట్టెయ్, నేనో పెద్ద ఇడియెట్ ని. నాకు సైకియాట్రిస్టు అవసరం ఉంది.” మౌనంగా అన్నాను.

ఉన్నట్టుండి నా మొహం మీద చెయ్యి చూపిస్తూ “నీకసలు బుద్ధి…” అని మధ్యలో ఆగిపోయింది. బలంగా నోటితో ఊపిరొదుల్తూ, హఠాత్తుగా లేచి బైటికెళ్ళిపోయింది. చెంపలమీద తుడుచుకుంటున్నట్టు తెలుస్తోంది.

వెనక్కి ఒరిగాను మెల్లగా. క్యాంటీన్ కౌంటర్లో ఉన్నతను నన్ను అదోలా చూస్తున్నాడు.

క్షమించగలిగే ‘సారీ’ ఎప్పటికీ చెప్పలేను లతకి.

1:00 – శ్యాన్ భాగ్ లో లంచ్ కి కలిసినప్పుడు లత కి ముందేసారీచెప్పాలి.

***

ఏ పనీ చెయ్యకుండా సిస్టం లో మౌస్ తిప్పుతున్నాను. మొబైల్ మోగింది. హోండా డీలర్ షిప్ నుండి. తలపట్టుకుని గబగబా బైటికి నడిచాను.

“సారీ అండీ, వెరీ వెరీ సారీ!” ముందే చెప్పేశాను.

“ఇప్పుడు టైం ఎంతైంది సార్?”

“మూడు దాటిందండీ! లేదు, ఆఫీస్ లో కొంచెం…”

“ఏంటి సార్, మీరు తెగ రిక్వెస్ట్ చేస్తే మా ఎండీ ని బతిమిలాడి మరీ ఇంటర్వ్యూ పెట్టిచ్చాను. తీరా మీరు ఇందాక జాయినవ్వలేదంట కాల్?! ఆయన నా మీద అరిచాడు.” కోపంతో మొదలయ్యి, బాధలోకి దిగిందా అవతలి గొంతు.

ఏడాది నుండి ట్రై చేస్తున్న జాబ్, ఈ ఆఫీసు నుండి వెళ్ళగొట్టక ముందే మారిపోదామని చేస్తున్న ప్రయత్నం.

“నాదే మిస్టేకేనండీ, ముందే చెప్పవలసింది మీకు. ఇంకో రోజు పెట్టించగలరా ప్లీజ్…?”

“మీ ఇష్టం వచ్చినప్పుడు అన్నీ కుదరవు సార్. అయినా మీకంత ఇంట్రెస్ట్ లేనట్టుంది. మీ జాబ్ గురించి మాత్రం మళ్ళీ నా వెంట పడకండి ప్లీజ్.”

కట్ చేశాడు. కాదు కట్ అయిపోయింది ఉన్న ఒక్క ఛాన్స్ కూడా.

2:30 – హోండా డీలర్ తో జాబ్ ఇంటర్వ్యూ.

***

ఈ రోజెందుకో బాలేదు నాకు.

దేనికారోజే బాగుండదు కానీ, ఇవాళ కొంచెం ఎక్కువ బాలేదనిపిస్తోంది.

ఒక్కరోజు, ఒకే ఒక్కరోజు నన్నందరూ మర్చిపోతే బావుణ్ణు.

ప్రపంచపు అట్టడుగు పొరల్లో దాక్కొని నేనెవరికీ దొరక్కపోతే బావుణ్ణు.

ఈ వైఫల్యాలు నా దాకా చేరలేక అలుపొచ్చి మధ్యలోనే ఆగిపోతే బావుణ్ణు.

చుట్టుపక్కల అందరూ చాయ్ తాగి తిరిగొస్తున్నారు. పర్సు తీసుకుని‌ బైటికి నడిచాను. కొట్లోనే ఉన్నాడు కాకా కిళ్ళీలు చుడుతూ. నవ్వాడు.

“చిన్నా, సాబ్ కి ఆధా చాయ్ దేవ్.” అరిచాడు.

కాకాకి నామీదెందుకో తెలియని అభిమానం. నన్ను నిజంగా అర్థం చేసుకునే బాబాయొకడు నాకుంటే ఇలానే ఉండేవాడేమో!

“ఫుల్ ఇవ్వు కాకా ఈ రోజు.”

ఆశ్చర్యంగా చూసి “పూరా భరోరే.” అన్నాడు

“నీకు ఖాతా క్లియర్ చెయ్యాలి కాకా, ఓ సారి చూసి చెప్పు ఎంతైందో?” అన్నాను.

తలుపు‌ పైకి తీసుకోని షాప్ లోంచి బైటికొచ్చాడు మెల్లగా.

“సాబ్, నువ్వెమనుకోనంటే ఓ బాత్ జెప్తా.”

“ఊ, చెప్పు కాకా.”

“నువ్వీడ పన్జెయ్యకు సాబ్, జల్దీ సే జల్దీ నికల్జానా యహాసే!”

ఎన్నాళ్ళనుంచో అదిమిపెట్టుకున్న బాధని బైటపెడుతున్నట్టు అన్నాడు.

ఓ క్షణం అయోమయంగా తయారైంది నా మొహం.

టీ తాగే టైంలో అందరూ నన్ను ఎగతాళి చేయడం గమనించుంటాడా కాకా?

వాళ్ళకి కౌంటర్లు ఇవ్వలేక తడబడుతున్న నా మొహాన్ని చూసి జాలి పడుంటాడా?

వాళ్ళ మధ్యలోంచి నేను హడావిడిగా ఆఫీస్ లోకి పారిపోయినప్పుడు నా చేతకానితనాన్ని చూసి కోప్పడుంటాడా?

నేను వెళ్ళిపోయాక కొలీగ్స్ నా గురించి మాట్లాడినవి విని బాధ పడుంటాడా?

“పర్లేదు తీస్కో కాకా, మళ్ళెప్పుడిస్తానో…” డబ్బులతో బలవంతంగా టాపిక్ ని డైవర్ట్ చేద్దామని ప్రయత్నించాను.

“నువ్వు మస్తు పైసలిచ్చినవ్ సాబ్ ఇప్పట్కే! ఆళ్ళ పైసల్గూడా నువ్విచ్చెటోడివి.” అన్నాడు అయిష్టంగానే తీస్కుంటూ.

“జ్యాదా దేర్ నయీ ఠైర్నా యహాపే!” అన్నాడు మళ్ళీ నా మొహాన్నే దీక్షగా చూస్తూ.

మా అమ్మా, విన్నీ, లతా, బాసూ, చివరికీ అనుపమా, అందరూ చూసిన చూపు లాంటిదే అది.

సమాధానమేదీ చెప్పలేదు నేను. నిరాశగా లోపలికెళ్ళిపోయాడు.

కాకాకి కావలసింది నా అమౌంట్ కాదు.

4:30 – చాయ్ కాకా అమౌంట్ అంతా క్లియర్ చెయ్యాలి.

***

“ఏందీ నన్నేం తిట్టట్లా ఇయాల నువ్వు?”‌ అన్నాడు ధనంజయ్ బార్ లోంచి బైటికొస్తున్నప్పుడా రోజు రాత్రి. అతడ్ని ‘నాన్న’ అనడం ఎప్పుడో మానేసాను.

అతనితో పాటే బార్ వాసనల్ని కూడా  మోసుకొస్తున్నాడు.

“సర్లేగానీ, గారేజ్ కాడకి రామాక నువ్వు రేపట్నుంచీ, నేనే ఈడకొచ్చేస్తా.”

“రేపటికి నువ్వుంటేకదా.”

“ఏందీ?”

“ఏం లేదు. రాన్లే.”

“నాకు తెల్సు నువ్వు తిట్టుకుంటన్నావని. ఏం జేసేది, మీ అమ్మ పోయిన కాణ్ణించీ ఇదలవాటైంది. నాకింకెవరున్నారు జెప్పు.”

“ఊ”

“నీకు ముందే జెప్పా. మళ్ళీ జెప్తన్నా, నీ పెళ్ళాం నిన్నొదిలి పోయిందని చానా బాదగా ఉంది నాగ్గూడా. విన్నీ పాప ఎంత ముద్దుగుండేదో! ఆ మాతల్లి నన్నెప్పుడూ బిడ్డ దగ్గరికి రానీలేదు గానీ…” తూలుతున్నాడిప్పుడు.

“అప్పటికీ నేంజెప్పా సిలక్కి జెప్పినట్టు. ఆ పిల్ల నీకు సరిపోదురా, మన మస్తాన్ కూతుర్ని జేస్కో అని. నీకూ, నీ అమ్మకీ సిన్నప్పట్నించీ యాడికో ఎగరాలని. తిరిగి తిరిగి కిందేగా బడ్డది ఇద్దరూ.” ఎగతాళిగా అన్నాడు.

నేను వాచ్ చూస్కున్నాను. తొమ్మిది దాటింది. ట్రైన్ వచ్చే టైమే.

“ఈ పక్కనుంచి పోదాందా, రైలొచ్చేముందే పట్టాలు దాటచ్చు.” రెక్క పట్టుకొని నడిపిస్తున్నా.

“ఏరా, ఈ మద్య పట్టాల మీదగా తీస్కెల్తన్నా, కొంపదీసి రైలు కింద తోస్తావా ఏంది గబుక్కున.” నవ్వాడు.

నేనోనిమిషం బిత్తరపోయి నిల్చుండిపోయాను.

“మా మెకానిక్కొకడు వాగతన్నాడు. ఎవతో కొత్తమ్మాయితో తిరగతన్నావంట నువ్వీ మద్య? అవ్వ, అప్పుడే అంత యావేందిరా నీకు.” తనలో తను మాట్లాడుకుంటున్నాడు.

రక్తం మరుగుతోంది.

“తను పన్లో తెలుసు.‌ అంతే ఇంకేం గాదు.”

“ఐనా నీకేదీ కలిసిరాలా, ఇట్టాగే గాలికి కొట్టుకుపోయే యవ్వారం చిన్నప్పట్నించీ.”

“ప్రతీదానికీ భయపెట్టి, నేను పారిపోయేలా జేసింది నువ్వేగా!” గొణుక్కున్నాను పళ్ళ‌ మధ్య.

పట్టాల‌కి దగ్గరయ్యాం. దూరంగా రైలు వినపడుతోంది. తలమీద మణితో మెరుస్తున్న నాగుపాములా మెల్లగా మా వైపుకోస్తోంది.

“ఐనా నీ రాతని మేవేడ కన్నాం! అది జాతకం బట్టీ ఉండిద్ది.”

ట్రైన్‌ కూత దగ్గరగా వస్తోందిప్పుడు.‌

మొబైల్ టార్చ్ లో మెల్లగా ధనంజయ్ ని పట్టాల మీదకెక్కించి నేను పక్కగా నడుస్తున్నాను.

“ఎటొచ్చీ మీ అమ్మకే గంపెడాశ. నువ్వేదోరోజు గొప్పోడౌతవనేది…పిచ్చి తల్లి!” అంటూ హఠాత్తుగా తలెత్తి మీదకొస్తున్న ట్రైన్ ని చూస్తూ వణికిపోయాడు. నేను చేతులొదిలేసాను. తూలి ముందుకు పడబోయాడు.

“నూ బతకలేక నన్ను‌ సంపేస్తన్నావారా…?” మూలిగాడు.

వెయ్యివోల్టుల షాక్ కొట్టిందా మాటకి. ఒక్క ఉదుటన వాడ్ని బలంగా పక్కకి నెట్టేశాను. ఆ దెబ్బకి ఇద్దరం రెండువైపులా కింద పడిపోయాం. దూసుకుపోయింది రైలు మా మధ్య నుండీ. అటువైపు వాడు తలబాదుకుంటున్నట్టు కనిపిస్తోంది.

ఓ నిమిషం తర్వాత అంతా నిశ్శబ్దం. చల్లటి గాలి, చెమటతో నిండిన నా ముఖాన్ని తడుతోంది. లేచాను. ధనంజయ్ కి నా మొహం చూపించలేను. పరిగెత్తడం మొదలుపెట్టాను. చీకటిలో ఎటుపోతున్నానో తెలీదు.

8:00 – ధనంజయ్ ని బార్ కి తీస్కెళ్లి వచ్చే దార్లో చంపాలి.

“చెత్త నా కొడకా! సంపీ, సచ్చీ గాదురా నూ సాదించేది. అదేదో బతికి, దైర్యంగా బతికి సాదించు.” వెనక నుంచి ఏడుపులాంటి అరుపు.

అది ధనంజయ్ అరుపులా లేదు. జీవితాంతం నేను నిరాశపరచిన వ్యక్తుల మూకుమ్మడి ఆర్తనాదంలా ఉంది. పరిగెత్తి పరిగెత్తి అలుపొస్తోంది. ఆగిపోయాను.

విన్నీ నుండి కాల్ “థాంక్స్ డాడీ, ప్రిన్సెస్ కేక్ చాలబాగుంది. లతా ఆంటీ తెచ్చింది!”

హఠాత్తుగా నా చుట్టూ కొన్ని గొంతులు పరుచుకుంటూ పోయాయి. కొన్ని సంతోషంగా అరుస్తున్నాయి నా వైపు. కొన్ని కోపంగా, కొన్ని దీనంగా, ఇంకొన్ని అధికారంగా…

నన్ను గెలిచి, వాటిని గెలిపించమనే అవన్నీ అర్థిస్తున్నట్టనిపిస్తోంది.

వెనక్కి తిరిగి మెల్లగా ధనంజయ్ వైపు నడుస్తున్నాను.

నన్ను కావాలనుకునే వ్యక్తుల వైపు తిరిగి నడుస్తున్నాను.

నన్ను వద్దనుకునే సమాజం వైపు తిరిగి  నడుస్తున్నాను.

*

ఆర్‌.ఎం. ఉమామహేశ్వరరావు

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కథ ఆంధ్రజ్యోతి లో చదివినప్పుడే అనుకున్నా, మంచి కథ అని. మీ సమీక్ష బాగుంది. లోతుగా వుంది. పాణిని జన్నాభట్ల గారికి, మీకు అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు