ఒక ఘటన, ఒక పరిణామం ఎంత సాధారణమో అంత అసాధారణం, ఎంత అసాధారణమో అంత సాధారణం అనే మాటలకు ఉదాహరణలు నిత్య జీవితంలో అనేకం కనబడుతున్నాయి. అసలు ఇది ఇలా జరుగుతుందా అని అబ్బుర పరిచేవి చాల మామూలుగా జరిగిపోతుండడం, చాల మామూలుగా జరిగిపోయినవే కాలక్రమంలో అసాధారణ ప్రాధాన్యత సంతరించుకోవడం జీవన వాస్తవికతలో అనివార్యమైన, అవిభాజ్యమైన అంశమేమో…
ఈ సారి ఈ సాధారణ – అసాధారణ ద్వంద్వానికి ఉదాహరణలుగా నా జీవిత గమనంలో పుస్తకాలకు సంబంధించిన విషయాలు చెప్పదలచాను.
వెతుకుతున్న పుస్తకమొకటి దొరకకపోవడం సాధారణమా అసాధారణమా?
ఇటీవల ఏదైనా రాద్దామని, దానికి రెఫరెన్సు ఇద్దామని పాత పుస్తకాల కోసం వెతుకుతున్నప్పుడు ఏ పుస్తకం కోసం వెతుకుతుంటానో అది లేదని తెలిసివస్తున్నది. నిజమే గదా, దేనికోసం వెతుకుతామో అదే ఉందో లేదో తెలుస్తుంది గాని, అసలు వెతకనే వెతకనిది ఉన్నదో లేదో ఎలా తెలుస్తుంది?
వెతుకుతున్నది దొరకకపోవడం కొందరికి సాధారణం కావచ్చు. మరి కొందరికి అసాధారణం కూడ కావచ్చు. నేను ఈ రెండూ కాని విచిత్రమైన స్థితిలో ఉన్నాను.
ఒక పుస్తకం కొన్నవారికి, రచయిత నుంచి పొందినవారికి కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పుస్తకం మాయమై పోవడం, ఎంత వెతికినా దొరకక పోవడం, ఎవరికి ఇచ్చామో, ఎవరు తీసుకుపోయారో గుర్తు రాకపోవడం సాధారణమే.
కానీ మీరే ఆ పుస్తకాన్ని అచ్చు వేయించినప్పుడు, మీ చేతుల మీదుగా వెయ్యి కాపీలో రెండు వేల కాపీలో చలామణీ అయినప్పుడు, కొన్ని సంవత్సరాలు గడిచి వాటిలో ఒక్క కాపీ కూడా మీదగ్గర లేకపోవడం, ఎంత వెతికినా దొరకకపోవడం, ఎవరిని అడిగినా లేదు లేదనే జవాబే రావడం అసాధారణం కాదూ?
మన సమాజంలో గ్రంథాలయ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల, ప్రచురణ వ్యవస్థ వ్యవస్థగా లేకపోవడం వల్ల కూడ అచ్చయి, చలామణీలోకి వచ్చిన వెయ్యి కాపీల్లో కొన్ని సంవత్సరాల తర్వాత ఒక్కటంటే ఒక్కటి కూడా దొరకని దుస్థితి ఏర్పడి ఉంది.
నిజంగా నాచేతి మీద వందల కాపీలు అమ్మిన పుస్తకాలున్నాయి. ప్రెస్ నుంచి వెయ్యి కాపీల కట్టలు మోసుకొచ్చిన పుస్తకాలున్నాయి. రచయితలు ఇచ్చినవీ, పత్రికల వాళ్లు సమీక్షకు ఇచ్చినవీ నాలుగైదు పుస్తకాలు చేరినవీ ఉన్నాయి. కానీ, ఇప్పుడేదీ, నిజంగా అవసరం వచ్చినప్పుడు, ఒక్కటీ దొరకదే?!
నాకు గుర్తున్నంతవరకు ఏడో తరగతి చివరిలో పుస్తకాలు అమ్మడం మొదలుపెట్టాను. విరసం ప్రచురణగా 1973 మార్చ్ లో వెలువడిన వెంపటాపు సత్యనారాయణ కవితలు, పాటల సంకలనం ‘శ్రీకాకుళ సత్యం’ ఆవిష్కరణ సభ మా హనుమకొండ జీవన్ లాల్ గ్రౌండ్స్ లో బహిరంగ సభగా జరిగింది. అప్పటికింకా నేను చదువుకు హనుమకొండకు రాలేదు గాని ఆ సభ రోజు అక్కడ ఉన్నట్టున్నాను. ఆవిష్కరణ, ఉపన్యాసాలు జరుగుతుండగానే ఆ పుస్తకాలు పది పది కట్టలు చేతుల్లో పట్టుకుని ఆ గ్రౌండ్స్ లో తిరిగి అమ్మిన నలుగురైదుగురు పిల్లల్లో నేనూ ఉన్నాను. తర్వాత నాలుగు నెలలకు హనుమకొండకు వచ్చి అప్పటి నుంచి దాదాపు ఇరవై ఏళ్లు రాష్ట్రంలో డజన్లకొద్దీ సభల్లో సమావేశాల్లో పుస్తకాలు అమ్మే పనిలో ఉన్నాను. వందలాది పుస్తకాల వేలాది కాపీలు అమ్మాను. అలా అమ్మిన పుస్తకాలలో ఒకటి రెండయినా నా సొంత లైబ్రరీలో పెట్టుకునేవాణ్ణి. ఇవాళ వాటిలో ఎక్కువభాగం కనబడడం లేదు.
ఇక మా వరంగల్ వేంకటరమణ ముద్రణాలయంలో, నవత ప్రింటింగ్ ప్రెస్ లో, వరంగల్ ప్రింటర్స్ లో, బెజవాడ నాగేంద్ర ప్రెస్ లో, హైదరాబాదు నాట్యకళలో, అటువంటి అనేక పాతకాలం ప్రెస్ లలో అక్షరాల బల్లల ముందర కంపోజిటర్లతో పాటు నిలబడి, గాలీ ప్రూఫులూ ఫైనల్ ప్రూఫులూ చూసి, నాలుగు నాలుగు పేజీల ఫారాలు అచ్చవుతుంటే ట్రెడిల్ పక్కన నిలబడి, బైండింగ్ జరుగుతుండగా పక్కన కూచుని ఏదో ఒక పనిలో సాయం చేసి, కొన్ని వందల కాపీలో, వెయ్యి కాపీలో, రెండు వేల కాపీలో వీపు మీదనో, రిక్షాలోనో, ఆటోలోనో వేసుకుని తీసుకువెళ్లి అమ్మాను, పుస్తకాల దుకాణాలకూ, వ్యక్తులకూ పంచాను. పోస్ట్ చేశాను. కాని అటువంటి వందలాది పుస్తకాల్లో ఎన్నో ఇప్పుడు ఒక్క కాపీ కూడా ఎక్కడా దొరకని స్థితిలో ఉన్నాను.
ఇది కాకపోతే మరేది అసాధారణం అవుతుంది?
తెలుగు జాతికి చరిత్ర పట్ల గౌరవం లేదనీ, చరిత్ర నమోదు చేయాలనే స్పృహ లేదనీ, చరిత్రను తొక్కుకుంటూ వెళ్లిపోయే జాతుల్లో అగ్రభాగాన నిలుస్తుందనీ ఎన్నోసార్లు చిన్నచూపు వ్యాఖ్యలు రాశాను. ఇప్పుడు నన్ను నేను చూసుకుంటుంటే ఆ వ్యాఖ్య అన్యాయమూ, అసందర్భమూ అనిపిస్తున్నది. మనకు చరిత్ర పట్ల ఎంత గౌరవం ఉన్నా, చరిత్రను నమోదు చేయాలనీ, నిక్షిప్తం చేయాలనీ ఎంత కోరికా వనరులూ ఉన్నా, చరిత్ర గమనానికి దానివైన సూత్రాలున్నాయి. అవి మన ఇష్టాయిష్టాలను లెక్క చేయవు. ఆ చరిత్ర గమనమే అతి సాధారణ సందర్భాలను అసాధారణ సందర్భాలుగా మలుస్తుంది. అసాధారణ సందర్భాలను కూడ అతి సాధారణంగా మార్చేసి తన కాల గర్భంలో (కాల అంటే సమయం అనే అర్థంలోనూ, కనిపించని నల్లని చీకటి గుయ్యారం అనే అర్థం లోనూ) కలిపేసుకుంటుంది. ఇవాళ మహాద్భుత మహత్తర ఘటనగా అనిపించేదాన్ని ఒక్కరికి కూడా గుర్తులేని అనామకత్వంలోకి నెడుతుంది. ఇవాళ ఎవరూ పట్టించుకోని ఘటనకు అపురూప ప్రాధాన్యత కలిగించి మహత్తర ఘటనగా మారుస్తుంది. అసాధారణమే అతి సాధారణం. అతి సాధారణమే అసాధారణం. అదే చరిత్ర గతితర్కం.
*
బావుంది
రహీమ్ పొన్నాడ్ మలయాళీ కవిత “భాష రద్దు” కు వీక్షణం వేణుగోపాల్ గారు చేసిన అనుసృజనను పెద్దలు శ్రీ రావెల్ల సోమయ్య గారి ఫేస్ బుక్కు పేజీ లో చూసి ఇక్కడ ప్రస్తావిస్తున్నాను ఉచితానుచితాలను, సారంగ పత్రిక కట్టుబాట్లను పట్టించుకోకుండా.
( ఇటీవలి భాషాధిపత్య ధోరణి మీద రహీమ్ పొన్నాడ్ రాసిన మలయాళీ కవితకు హిందీ అనువాదం సోషల్ మీడియా మీద చూసి తెలుగు చేయకుండా ఉండలేకపోయాను. చూడండి )
మలయాళీ కవిత
భాష రద్దు
రహీమ్ పొన్నాడ్
ఒకానొక అర్ధరాత్రి అతను భాషపై నిషేధం విధించాడు
‘ఇవాళ్టి నుంచి అందరికీ ఒకటే భాష
పాత భాషా పదాలు మీ దగ్గర ఉంటే
పోస్టాఫీసులో మార్చుకోవచ్చు’
అని గంభీర ప్రకటన వెలువడింది
సగం నిద్రలో ఉలిక్కిపడి లేచిన మనుషులు
అటూ ఇటూ పరుగెత్తడం మొదలెట్టారు
ప్రతిచోటా నిశ్శబ్దమే
తల్లులు బిడ్డల మూతులను అరచేతులతో మూసేశారు
ముసలివాళ్ల ముఖాల మీద గుడ్డలు కప్పేశారు
ఆలయాల్లో పాటలు ఆగిపోయాయి
మసీదులో అజాన్ కూడ వినబడలేదు
రేడియోలో వీణానాదం తప్ప మరేమీ లేదు
టీవీ తెరమీద సైగల భాషలో వార్తలు వస్తున్నాయి
పత్రికల పేరు మీద మార్కెట్లోకొచ్చినవి
ఎనిమిది కాలాల తెల్ల కాగితాలు
ప్రతి కీబోర్డూ మౌనం దాల్చింది
మొబైల్ స్క్రీన్ల మీద బొమ్మలు మాత్రమే మిగిలాయి
పోస్టాఫీసు ముందర నిశ్శబ్దంగా నిలబడిన పొడవాటి వరుస
రోజుకు తలా రెండు పదాలు మార్చుకోవడానికి మాత్రమే అనుమతి
కాని కొందరు బస్తాల నిండుగా శబ్దాలు పట్టుకొచ్చారు
టిఫిన్ బాక్సుల్లో స్కూలు బ్యాగుల్లో మాటలు నింపుకొచ్చిన
చిన్నారి పిల్లలు కూడ వరుసలో నిలబడ్డారు
‘అమ్మ’ అనే మాట ఇచ్చిన వారికి ‘మా’ అనే మాట దొరికింది
’నాన్న’ అనే మాటకు బదులు ‘బాప్’ అనే మాట
చాకలెట్, గేమ్ అనే మాటలు మార్చుకోవాలనుకున్న
పిల్లలను కౌంటర్ దగ్గరి నుంచి వెనక్కి పంపేశారు
ఇక్కడ భాష మాత్రమే మార్చుకోవచ్చునన్నారు
బదులు శబ్దాలు లేవనే కారణంతో
అసంతృప్తి అనే మాటనూ
శవవస్త్రం అనే మాటనూ వెనక్కి పంపేశారు
చురకత్తిని మార్చుకుందామని వచ్చినవాళ్లను తరిమేశారు
నల్లమందుకు బదులిమ్మంటే పోలీసులు పట్టుకున్నారు
క్యూలో నిలబడీ నిలబడీ అలసిసొలసిన ముసలివాళ్లు
మంచినీళ్లు అని అడిగితే
తుపాకి తూటాతో వాళ్ల నోరు మూసేశారు
ఇదంతా చూసి చూసి ఇంటికి తిరిగివస్తే
వాకిట్లో మాటల కుప్ప పోగుపడి ఉంది
కొత్తవీ పాతవీ లిపిలేనివీ
మార్చుకుని తీసుకురావాల్సిన పదాలన్నీ
కుప్పపోసి పెట్టారు ఇంట్లోవాళ్లు
నాన్న తన తల దిండులోనుంచి బైటికి తీసిన
శబ్దాలు నాకు అర్థమే కాలేదు
అమ్మ తన చీరచెంగు ఒడిలో నింపిన
పదాల్ని నేనెన్నడూ విననే లేదు
వంటగదిలోంచి మా ఆవిడ లాక్కొచ్చినవి చూస్తే
అన్ని మాటల మధ్యనే ఇన్నాళ్లూ ఆమె వంట సాగిందని తెలిసింది
నా కూతురి సంచీలో హోమ్ వర్క్ పదాలు
నా కొడుకు పెట్టెల్లో చెల్లా చెదురైన సరదా మాటలు
అన్నిటికీ బదులుగా వారికి రెండే రెండు మాటలు
దొరుకుతాయని ఎలా చెప్పను?
ఆ మాటల మూటలో చాల వెతికాను
ఎంతో కష్టపడ్డాక చిట్టచివరికి
ఒకటొకటిగా చాల బరువైన శబ్దాలు రెండు నా చేతికందాయి
బలమంతా ఉపయోగించి ఆ మాటలు బైటికి లాగాను
ఒకటి ప్రజాస్వామ్యం
మరొకటి బహుళత్వం
గబగబా పరుగెత్తి పోస్టాఫీసుకు చేరేవేళకు
మునిమాపు చీకటి వాలుతున్నది
నా చేతిలో మాటలు చూసి
కౌంటర్ దగ్గర కూచున్న ఉద్యోగులు
ఉలిక్కిపడి లేచి నిలబడ్డారు
నా చేతి నుంచి మాటలు జారిపడిపోయాయి
ఎందరో పరుగెత్తుకొచ్చి చుట్టుముడుతున్నట్టు
బూట్ల చప్పుడు వినబడింది
స్పృహ కోల్పోతూ పడిపోతున్న నాకు
రెండే మాటలు వినబడ్డాయి
’చంపి పారెయ్యండి’
’దేశద్రోహిని’
మలయాళం నుంచి హిందీకి ఎ ఆర్ సింధు, వీణా గుప్తా
హిందీ నుంచి తెలుగు: ఎన్ వేణుగోపాల్