వుందో లేదో తెలియని వ్యాధికి కీమో థెరపీల వంటి వేదనాభరితమైన ట్రీట్మెంట్ , జుట్టు వూడిపోయి మొహం మాడిపోయి చందమామను రాహువు మింగేసినట్టు విలవిలలాడే నా మనసును చందన లేపనంలా చల్లబరిచిన మనుషుల కధలే అడయార్ కధలు .
కీమో పూర్తయ్యింది . కానీ దాని ప్రభావం మాత్రం వదల్లేదు . నోరు చప్పపడిపోయి ఒకరకమైన చిరాకు , పైగా వికారం . ఆస్పత్రి బయట అమ్మే నాటు రేగిపళ్లు మాత్రం కాస్త తినబుద్దయ్యేది .
మామూలు తిండి మొక్కుబడిగా తినడమే .
బయటకి వెళ్లి వచ్చినప్పుడల్లా ఒక రేగిపళ్ల పొట్లం తెచ్చేవారు రాంబాబు .
రాంబాబుగారిది ఫిరంగిపురం . వాళ్ల బాబాయ్ కి తోడుగా ఆస్పత్రికి వచ్చారు .
వాళ్ల బాబాయ్ టీచర్ . ఆయన ఎక్కువ మాట్లాడేవారుకాదు .
ఆయన ముఖం ఎప్పుడూ బాధని అణుచుకుంటున్నట్టు ముడుచుకుని వుండేది .
” మా బాబాయ్ కి భయం ఎక్కువ దానితో బిగుసుకుపోతాడు ” అని రాంబాబు అన్నప్పుడల్లా నేను ఆయన్ని సమర్ధించేదాన్ని .
” ఆయన టీచర్ అన్నీ తెలిసిన వ్యక్తి … అందుకే భయం తెలుసు .
ఇదిగో ఈ సురేష్, ప్రకాష్ చినపిల్లలు, నేను మొండిదాన్ని అందుకే జబ్బుకి భయపడాల్సినంత భయపడం ” అనేదాన్ని .
నాకు రోజూ రాత్రి టిఫిన్ తెచ్చి ఇచ్చే బాధ్యత రాంబాబుది .
ఆయన ఠంచనుగా 7 గంటలకు కిటికీ దగ్గరికి వచ్చి ” అమ్మా ! ఇవ్వాళ ఏం తెమ్మంటావ్ ” అని అడిగే వారు . సాధారణంగా నేను ఆ టైంలో సురేష్ బెడ్ దగ్గర కూర్చుని కబుర్లు చెప్తుండేదాన్ని .
నేను లిస్ట్ మొదలెట్టేదాన్ని ” ఇడ్లీ కావాలి , కాదు దోసె తెండి , ఇవన్నీ వద్దుగానీ రోటీ పాలక్ తెచ్చెయ్యండి ” అనేదాన్ని .
రోజూ ఇదే తంతు అయినా ఆయన “ఏం తెమ్మంటావమ్మా ” అని అడగడం
మానేవారు కాదు .
ఇడ్లీ , దోసె కన్నా రోటీ పాలక్ రేటు చాలా ఎక్కువ.
అందుకే డబ్బు పొదుపుచేద్దామని మొదట ట్రై చేసి చివరకు నాకు ఇష్టమైనదే తెమ్మనేదాన్ని .
ఒక్కోసారి సురేష్ అందుకుని నేను చెప్పినట్టే … ఇడ్లీ ఆ …ఆ దోసె కాదు కాదు రోటీ పాలక్ అని చెప్పేసేవాడు .
రాంబాబు వాళ్ల బాబాయ్ ట్రేట్మెంట్ అయిపోయింది .
మళ్లీ ఏమన్నా సెకండరీస్ వస్తే తప్ప ఇక చెకప్ కి వస్తే చాలన్నారు .
రాంబాబు గారు వూరెళ్లే టైం వచ్చింది . గేటు వరకూ వెళ్లాం .
ఆటో ఎక్కబోయే ఆయన వెనక్కు వచ్చి 20 రూపాయల నోటు తీసి నా చేతిలో పెట్టి ” గాజులు కొనుక్కోమ్మా ” అంటూండగా ఆయన కళ్లు తడి అయ్యాయి .
నాకూ గొంతులో ఏదో అడ్డుపడినట్టయింది .
మాట్లాడకుండా ఆ డబ్బు తీసుకున్నాను . ఎందుకో ఆయన్ని అన్నయ్యా! అని పిలిస్తే బాగుండుననిపించింది కానీ అసలు వరసలు పెట్టి పిలవడం అలవాటు లేని నేను ఆటో కనిపించేవరకూ చేతులూపుతూ వుండిపోయాను .
రోజూ మా ఆయన శరత్ ఇంటినుంచి వస్తూ పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ తెచ్చి వుతికించిన బట్టలు తేవడం , మధ్యాన్నం భోజనం తెచ్చి ఇచ్చి వెళ్లిపోయి మళ్లీ మర్నాడు వుదయమే వచ్చేవారు .
శరత్ ఇంట్లో రోజూ సాయంత్రం ప్యారా కలిసే వాడు . ప్యారా శరత్ ఫ్రెండ్ . వీళ్లు ముగ్గురు కూర్చుని పెగ్గులేసే వారు . మందు బాటిల్ ఈయన కొంటే శరత్, ప్యారా సోడా , ఫుడ్ తెచ్చేవారు .
కొన్ని రోజులకి మా ఆయనకి ప్యారా మంచి దోస్తయ్యాడు .
ప్యారాది మార్వాడీ కుటుంబం . బొంబాయిలో కుటుంబాన్ని వుంచి మద్రాస్ లో ఏదో చిన్న వ్యాపారం చేసేవాడు .
అప్పుడప్పుడు ఈయనతో కలిసి ఆస్పత్రికి వస్తుండేవాడు .
మేం మద్రాస్ వచ్చి నెల రోజులైంది . మళ్లీ రెండో కీమో మొదలెయ్యే లోగా ఇంటిదగ్గర పనులు చూసుకుని రావాలని మా ఆయన వైజాగ్ వెళ్దామని నిర్ణయించుకున్నాడు . ఇక్కడ వుండడానికి ఎవరిని రమ్మందామా అని మాట్లాడుకుంటున్నాం .
అక్కడే వున్న ప్యారా ” ఈ పది రోజులూ నేను చూసుకుంటా , మీరు ఎవరినీ రమ్మనక్కరలేదని” అభయమిచ్చాడు .
” అయ్యో ! మీకు ఇబ్బంది ఎందుకు ” అన్నా వినిపించుకోకుండా ” ఏం పర్వాలేదు రాజూ ! నువ్వు వెళ్లు ” అనడం తో ఆయన వైజాగ్ వెళ్లాడు .
ఆ పది రోజులు ప్యారా పొద్దున్నే నాకు ఏం కావాలంటే అది తెచ్చి ఇచ్చి వెళ్లేవాడు . చివరికి నేను విడిచిన బట్టలు కూడా తీసుకెళ్లి శరత్ ఇంట్లో పనిమనిషితో వుతికించి మర్నాడు తెచ్చి ఇచ్చేవాడు . ఒక్క రోజు కూడా పరాయి వ్యక్తితో ఇలా చేయించుకోవాల్సి వచ్చిందే అని బాధపడకుండా స్వంత మనిషిలా ఆప్యాయత కురిపించేవాడు .
మేము మా ట్రీట్మెంట్ అయ్యి మళ్లీ తిరిగివెళ్లే వరకూ ఆ స్నేహబంధం అలాగే కొనసాగింది .
ఇప్పుడు ప్యారా ఎక్కడున్నాడో కూడా తెలియదు ఇది జరిగి 25 ఏళ్లయినా అతని ప్రేమ మరిచిపోలేదు .
మేము తిరిగి వెళ్లిపోయేటప్పుడు రైలు ఎక్కించడానికి వచ్చిన ప్యారా చిన్న పిల్లడిలాగా ఏడ్చేశాడు .
ఇందరు మనుషులు వారి జీవితంలో ఎంతో విలువైన సమయాన్ని మనకోసం కేటాయించింది కాక కన్నీళ్లు కూడా ఖర్చు చేశారా ?
ఆ కన్నీటికి విలువ కడితే … అది ఎంతంటే నా జీవితం అంత !
( వచ్చే సంచికలో సినిమా కష్టాలు , రెండోకీమో , ఇంకా ఎందరి గురించో …)
Add comment