చెమ్కీ దండలో కర్పూర పరిమళం!

స్వయంగా ఆయన అప్పదాసు. భోజన ప్రియులు. మిథునం గురించి కూడా అదే చెప్పారు. “సహజంగా నేను భోజన ప్రియుడినమ్మా, అలాటి వాళ్ళని చాలా మందిని చూసినవాడిని కూడా. అలా పుట్టిన వాడే అప్పదాసు ” అని-

తెల తెలవారుతుండగా చూశాను, శ్రీరమణ గారి ఫోన్ లో వాట్సప్ స్టేటస్ అప్డేట్. ఆయన స్టేటస్ లు అవీ పెట్టరు కాబట్టి, ఏమై ఉంటుందని కుతూహల పడితే, వారి అబ్బాయి చేరవేసిన చేదు కబురు..ఆయన మరిక లేరని.

దుఃఖం కట్టలు తెంచుకుని దూకలేదు గానీ, దిగులు మేఘం ఒకటి గుండె నిండా ఆవరించి అదిమి నొక్కి పెట్టింది.

ఆయన సున్నితమైన హాస్యం చదువుతూ పెరిగి పెద్దయిన వాళ్ళం, ఆయన పేరడీలకు  వీరాభిమానులుగా ఉండిన వాళ్ళం, ఆయనెలా ఉంటారో ఒకసారి చూడాలని బాల్యంలో తహ తహ లాడిన వాళ్ళం, అకస్మాత్తుగా ఆయన వీధి చివర్లో అదృశ్యమై పోతే, గడప ఇవతలే నిలబడి చేయి వూపుతున్నాం.

ఆయన ఏం రాశారు,  ఆయన సాహిత్య ప్రస్థానం, పాఠకురాలిగా నేనేం చదివాను?  అన్నది ఒకెత్తు అయితే, ఆయనతో నాకున్న వ్యక్తిగత అనుబంధం, స్నేహం చాలా విలువైనవి నాకు.

ఆయన ఆహార్యం చప్పున మా నాన్నగారిని గుర్తుకు తెస్తుంది. అందువల్ల, స్నేహం కంటే ఎక్కువైన ఇష్టం, ఇంకా చెప్పాలంటే ప్రేమ.

ఒకసారి – 2000 లో అనుకుంటాను.

ఆలిండియా రేడియో లో ఏదో ప్రోగ్రాం రికార్డింగ్ కోసమని వెళ్ళి వస్తుంటే, ఆయన ఏదో ప్రసంగానికి అని వచ్చారు కాబోలు బయట వెయిట్ చేస్తూ కనపడ్డారు. పలకరించాలంటే భయం వేసింది. “మీ కథలు బాగుంటాయి, నేను మీ అభిమానిని” వంటి రొటీన్ మాటలతో పరిచయం చేసుకోవడం ఇష్టం లేక అక్కడే నిలబడ్డాను.

నా సంకోచం గమనించి, ఆయనే మాట కలిపి పలకరించారు. నిగర్వి, అట్టహాసమంటే తెలియని మనిషి, ఆర్భాటాలకు అసలే దూరంగా ఉండే వ్యక్తి.

అప్పుడప్పుడూ మాట్లాడుతుండే దాన్ని.

తర్వాత వూళ్ళు తిరుగుతూ చాలా రోజులు మాట్లాడలేదు.

2013 లో షికాగోలో ఉన్నప్పుడు, జూన్ లో ఒక రోజు  “ఇండియా నుంచి శ్రీరమణ గారు వచ్చారు, మా ఇంట్లో ఉన్నారు, ఎక్కువ మందిని పిలవట్లేదు. మీరు రండి” అని జంపాల చౌదరి గారు ఫోన్ చేశారు. శ్రీరమణ గారు క్రౌడ్స్ ని అంతగా నచ్చరు.

నిజంగానే ఎవరూ లేరక్కడ. శ్రీరమణగారు, జయదేవ్ గారనే మరొక తెలుగు మిత్రులు తప్ప.

మామూలు పాంటూ షర్టు లో చొక్కా  చేతులు మడుచుకుంటూ లోపల నుంచి శ్రీ రమణ గారు వస్తుంటే, అనుకోకుండా కళ్ళలో నీళ్లు వచ్చేశాయి. అంతకు ముందే మే నెలలో నాన్నగారిని పోగొట్టుకుని ఉన్నానేమో, ఆయన్ని చూడగానే చప్పున నాన్నగారిలా తోచారు. (ఆ తర్వాత ఇండియా వచ్చేశాక కూడా నాన్నగారిని చూడాలనే వంకతో శ్రీరమణ గారి ఇంటికి వెళ్ళాను కూడా).

ఆ రోజు శ్రీరమణ గారి కోసం అప్పదాసు చెప్పిన ఘన పంచ శాకాల్లో ఒకటైన పనస పొట్టు ఆవ పెట్టిన కూరా, బెల్లంతో నేతి బొబ్బట్లూ చేసి పట్టుకెళ్ళాను. చాల సంతోష పడ్డారు.

ఆయనతో దగ్గర పరిచయం వున్న వారికి తెలుస్తుంది ఆయన ఎంతటి విజ్ఞాన ఖని అనే విషయం. కవులు, రచయితలు, సాహిత్యం, రాజకీయాలు, కావ్యాలు, గ్రంథాలు, వాటి పుట్టు పూర్వోత్తరాలు వీటన్నిటి గురించీ అలవోకగా ఏమీ ప్రయాస పడకుండా కనీసం గుర్తు తెచ్చుకుంటున్నట్టు కూడా అనిపించకుండా నెమ్మదిగా మాట్లాడుతుంటే, సమయమే తెలీకుండా కూచుని వింటూ ఉండిపోతామే తప్ప, కదలాలనీ, ఇంటికి పోవాలనీ కూడా గుర్తుకు రాదు.

ఇక మరో విషయం…స్వయంగా ఆయన అప్పదాసు. భోజన ప్రియులు. మిథునం గురించి కూడా అదే చెప్పారు. “సహజంగా నేను భోజన ప్రియుడినమ్మా, అలాటి వాళ్ళని చాలా మందిని చూసినవాడిని కూడా. అలా పుట్టిన వాడే అప్పదాసు ” అని-

డాలస్ లో ఉన్నపుడు, శ్రీరమణ గారు ఫోన్ చేశారు అంటే, మిగతా పనులన్నీ ఆ రోజుకి వాయిదా..అని చెప్పేసుకుని సిద్ధమై పోయే దాన్ని. ఎన్నెన్ని విషయాలు ఎంతెంత సేపు మాట్లాడేవారో. కాలం అలా గల గలమంటూ దొర్లిపోయేది. జాషువా నుంచి, తెనాలి లో వారి పెరటి మామిడి చెట్టు కాయల వరకూ, పురాణం సుబ్రహ్మణ్య శర్మ నీలి కథ నుంచీ, పుత్తూరు వక్క పొడి వరకూ, అసంఖ్యాకం మా కబుర్ల తాలూకు విషయాలు.

ఇండియా వచ్చేశాక , అత్తాపూర్, ఓమ్ నగర్  లో ఆయన ఉన్నప్పుడు వాళ్ళింటికి తరచూ వెళ్ళేదాన్ని.

మొదటి సారి వెళ్ళినపుడు,గుమ్మంలో అడుగు పెడుతుండగానే అల్లం పచ్చి మిర్చి తో ఉడుకుతున్న వంకాయ కూర, ధనియాలు జీలకర్ర తో మరుగుతున్న చారు గుబాళింపులు ఎదురయ్యాయి. అచ్చం మా అమ్మ వంటలో వచ్చే వాసనలే అవి.

పండిన తమలపాకు లాంటి జానకి అమ్మ బుల్లి స్టీలు గ్లాసులో ఫిల్టర్ కాఫీ కలిపి, “రామ్మా వంటింట్లోకి, కాఫీ తీసుకెళ్ళు” అని పిలిచారు. ఎర్రటి పట్టు చీర, తెల్లని జుట్టు ముడిలో తురుముకున్న మందార పువ్వు, ఆవిడ సాక్షాత్తూ బుచ్చి లక్ష్మే. వయసు మళ్ళిన గౌరీ దేవికి మల్లే.

శ్రీరమణ గారితో కబుర్లూ, మొదటి అంతస్తులో ఆయన విశాలమైన లైబ్రరీ, అన్నమయ్య గ్రంథాలయానికి ఆయన ఇచ్చిన వేల కొద్దీ పుస్తకాలూ వీటి కబుర్ల మధ్య జానకి అమ్మ చారులో పెడుతున్న పోపు గొప్ప విరామం.

“అన్నం తిని వెడుదువు గానీ ఆగమ్మా” అమ్మ అన్న  ఈ మాట కోసమే నిజంగా ఎదురు చూశానంటే అబద్ధం లేదు.

ఆ తర్వాత మరొక సారి నా బాల్కనీ లో కాసిన ఆనప కాయలు, చిక్కుడు కాయలు తీసుకెళ్ళాను. చిన్న బాల్కనీ లో అవి కాశాయని విని చాలా సంతోషించారు ఇద్దరూ. వచ్చేటపుడు వాళ్ళింట్లోని తోటకూర విత్తనాలు ఇచ్చారు జానకి గారు.

మిథునం పుస్తకాన్ని శ్రీరమణ గారు స్వయంగా సంతకం చేసి ఇచ్చి, నాలుగో ఎకరం పుస్తకం వచ్చాక, “కొనకండి మీరు, ఇంటికి వచ్చి తీసుకోండి మీ కాపీ” (మనం అయన కంటే ఎంత చిన్న  అయినా బహువచనంలోనే పిలుస్తారు) అని చెప్పారు.

ఆయన ఆరోగ్యం కొంత దెబ్బ తిన్నాక, తరచూ వెళ్ళడం తగ్గి పోయింది. ఇవాళ కాలం పుస్తకం మీద ఆయన చివరి సంతకం కూడా అయిపోయి నిష్క్రమించారు.

అప్పదాసు వెళ్ళిపోయాడు. బుచ్చి లక్ష్మి మిగిలి పోయింది.

ఆయన సాహిత్య ప్రస్థానం ఎంత ఘనమైనదో అందరికీ తెలుసు. దానికి అవతల.. ఆయనతో నా అనుబంధం…చెమికీ దండలో– హరించిపోయినా మిగిలిపోయే కర్పూర పరిమళం.

*

సుజాత వేల్పూరి

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా బాగా రాశారు. మనకు బాగా ఇష్టమైన వ్యక్తిని అక్షరాల్లో వ్యక్తం చేయడం హృదయం ఆర్ద్రమైనప్పుడే సాధ్యం.

  • బాగా రాసారు ..పెద్ద వాళ్ళు వెళ్ళిపోయి మనకి కొన్ని జ్ఞాపకాలు గుర్తుగా మిగుల్చుతారు

  • “కాలం పుస్తకం మీద చివరి సంతకం”. చాలా బావుంది ఆర్టికల్.

  • fb లో లా ఇక్కడ కూడా లైక్, లవ్ బటన్ లు ఉంటె బావుండును అనిపించింది ఇది చదివాక. మీ చమ్కీ దండలో కర్పూర పరిమళం కొంత మాకు అద్దినందుకు ఒక కృతజ్ఞతాభివందనం, రమణగారిని మరోసారి తలుచుకుంటూ రెండు కన్నీటి బొట్లు.

    – విజయ్

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు