చెప్పులు

ముప్పై ఏళ్ల క్రితం..

“అమ్మీ! ఈ రోజు ఖచ్చితంగా చెప్పులు కావాలి. లేకుంటే రేపటి నుంచి బడికి వెళ్ళను” ఏడుపు గొంతుతో అన్నాడు రసూల్.

‘ఒంటిపూట బడులు అనవసరంగా ఇచ్చారు, ఈ వేసవి అనవసరంగా వచ్చింది. ఇంతకుముందు చెప్పుల కోసం ఇంత పేచీ పెట్టలేదు రసూల్’ అనుకుంది ఆలియా తన మనసులో.

“అమ్మీ! మా సార్లు కూడా అడుగుతున్నారు, ‘ఈ ఎండలో ఎలా వెళ్తావ్ బడి నుంచి ఇంటికి? మధ్యాహ్నం పూట చెప్పులు లేకుండా, తారురోడ్డు పైన నడుచుకుంటూ’ అని. మా తరగతిలో అందరూ చెప్పులు తొడుక్కొని వస్తున్నారు. నేను ఒక్కణ్నే చెప్పులు లేకుండా వెళ్తున్నా. అందరి ముందర బెహిసినంగా ఉంది” గొంతులో ఏడుపు కళ్ళల్లోకి వచ్చి నిలబడింది ఈసారి.

“నేను ఏం అడిగాను? పదిహేను రూపాయల చెప్పులే! హవాయి చెప్పులు. నాకు ఇంకేం కోరిక లేదు, కొత్త చెప్పులు వేసుకొని తిరగాలని అంతే! లేకపోతే ఎండ పెద్ద లెక్క కాదు నాకు. ఇదిగో అందరిముందర విలువ లేకుండా పోతోంది” ఈసారి కన్నీటి చుక్కలు కళ్లల్లో నుంచి జారాయి పటపటమంటూ.

“నేను నా తోటివాళ్ళలా సైకిల్ అడిగానా? చాలామంది సైకిల్ మీద వస్తున్నారు తెలుసా బడికి? ఎంత స్టైల్ కొడతారో వాళ్ళు” అంటూ చెప్పుకుంటూపోతున్నాడు రసూల్ అదే ఏడుపు గొంతుతో, కళ్ళల్లో నీళ్ళతో. 

నిజమే! ఏమని ఎనిమిదో తరగతికి వచ్చాడో, వీడి కోరికలు ఎక్కువ అయిపోతున్నాయి. బడికి యూనిఫారం కొత్తది కావాలన్నాడు. కొందాం అనుకుంటే, కాదు ప్యాంట్ కావాలి అన్నాడు. కాస్త కలిగిన బంధువులావిడను రమజాన్ నెల ముందుటి నుంచి బతిమాలుకొని, జకాత్‌లో బాబుకి యూనిఫాం కుట్టించమని అడిగింది ఆలియా. అడగంగా అడగంగా, రమజాన్ పండుగ వారం ఉంది అనంగా కొత్త తెల్ల షర్ట్, ఖాకీ ప్యాంట్ గుడ్డ కొనిచ్చింది. అది టైలర్‌కు ఇచ్చింది. ఎంతో కష్టపడితే కానీ, కుట్టు కూలి కోసం నలభై రూపాయలు సర్దలేకపోయింది. అవే పండుగ బట్టలయ్యాయి రసూల్‌కు.

మొదటి‌సారి ప్యాంట్ వేసుకొని మురిసిపోతున్న కొడుకును చూసి ఎంతో ఆనందపడింది ఆలియా. తనకే ఎంతో ముద్దువచ్చాడు. అచ్చం హీరోలా అనిపించాడు తన కొడుకు. రసూల్‌ది కూడా హీరో స్టైలే ఆ నాలుగు రోజులు, కొత్త ప్యాంట్ మోజు తీరే వరకు.

ఏ మూడు, నాలుగు రమజాన్‌లకో ఒకసారి ఆలియాకు కొత్త చీర వస్తుంది. అది కూడా జకాత్లు తమ బంధువుల్లోని శావుకార్లు, లేదా చుట్టుపక్కల ఉన్న శావుకార్లు దిల్‌దార్‌గా ఇస్తేనే! ఆలియా భర్తకు వాళ్ళ యజమాని ప్రతి రమజాన్‌కు ఒక జత తీయిస్తాడు.

ఆమె భర్తకు ఇవేమీ పట్టవు. సంపాదించడం, అందులో పదోవంతు వీరి మొఖాన కొట్టడం, మిగతాది తాగి తందనాలాడటం. ఇల్లు గడవడం చాలా కష్టం. ఎన్టీఆర్ కిలో రెండు రూపాయలకే బియ్యం చేశాడు. మద్యపాన నిషేధం కూడా ఉండే, కానీ వాళ్ళ అల్లుడు వచ్చి నిషేధం తీసేసాడు. నిషేధం ఉన్నన్నాళ్ళు వారానికో, పది రోజులకో ఒకసారి తాగి వచ్చేవాడు. ఇప్పుడు కథ మళ్ళీ మొదటికి వచ్చింది. రోజూ తాగుడే. ఇదంతా తన లోలోన అనుకుంది ఆలియా.

ఆలియా వాళ్ల కుటుంబానికి తెల్ల రేషన్‌కార్డు లేకపాయే. ఎంత కష్టపడ్డా, ఎన్నిసార్లు ఆఫీస్‌ల చుట్టూ తిరిగినా రాలేదు. ఇప్పుడు తెల్ల‌ రేషన్‌కార్డు ఉన్నవాళ్ళ దగ్గరే కేజీ మూడు రూపాయలకు కొంటుంది ఆలియా. వీధిలో కాస్త సంపాదన ఉన్నవాళ్ళెవరూ ఆ స్టోర్ బియ్యం తినరు. దోశలు, ఇడ్లీ కోసం వాడుకోవడమే. మిగిలిన బియ్యం ఇలా ఆలియాలాగా కార్డు లేని వాళ్లకు అమ్ముకోవడం.

ఆలియా మనసంతా బాధగా రోదిస్తోంది. ఒక్కగానొక్క కొడుకు కాళ్లకు చెప్పులు అడిగితే తీయించలేకున్నాం. రసూల్ గట్టిగా అన్నాడు, “అమ్మీ! రేపు గనుక నాకు చెప్పులు తీపించకుంటే, నేను బడికి వెళ్ళను. అంతే” అని విసురుగా బయటికి వెళ్లిపోతూ, కోపమంతా వీధితలుపు పైన చూపించాడు.

కట్టుకున్నవాడికి కొంచెం కూడా బాధ్యత లేదు. రోజుకు నలభై రూపాయల కూలీ, ఇంటి బాడుగ మూడు వందలు. మిగితా తొమ్మిది వందలు సక్రమంగా చేతికి ఇస్తే, తాము కూడా మంచి బియ్యం అన్నం తినొచ్చు. ఇంటికి సరుకులు తీసుకోవచ్చు. నెలలో కనీసం మూడు తూర్లు కోడికూర చేసుకోవచ్చు. రసూల్‌ను ఇంగ్లీష్ మీడియంలో చేర్పించొచ్చు. ఆ సంపాదించింది సరిపోక అక్కడాఇక్కడా అప్పులు చేయడం, అవి తీర్చడానికి ఐదు వందలో, వెయ్యో ఫైనాన్స్‌కు తీసుకోవడం, వారికి రోజూ పది రూపాయలు కట్టడం.. ఇలా సాగుతున్నాయి ఆలియా ఆలోచనలు.

వీధిలో నుంచి ముగ్గురు, నలుగురు పిల్లలు పైరోడ్డులోని ఇంగ్లీష్ మీడియంకు వెళుతుంటారు. ఎంత అబ్బురంగా అనిపిస్తుంది వాళ్ళు అలా మెళ్ళో టైలు, నడుముకు బెల్ట్‌లు, కాళ్లకు బూట్లతో వెళుతూ ఉంటే! తమ రసూల్‌ని కూడా అలా చూడాలని ఆలియాకు కోరిక. కానీ తీరదు అని తనకు తెలుసు.

ఈ ఇంటి బాడుగ కట్టడానికి ఎన్ని పాట్లు! ఎలాగోలా రోజూ తన భర్త కూలిలో నుంచి పదో, పరకో కూడబెట్టాలి. నెల మొదటికల్లా ఇంటి ఓనరుకు ఇవ్వాలి. నాలుగు రోజులు ఆలస్యమైనా వీధిలో నిలబడి నానామాటలంటాడు.

బాధపడుతూ కూర్చుంటే అవుతుందా అనుకుంటూ, మధ్యాహ్నం వంట మొదలుపెట్టింది ఆలియా. రసూల్ ఆకలికి తట్టుకోలేడని తెలుసు. వీధిలో అక్కడ ఇక్కడ తిరిగి, ఒక గంట తరువాత వచ్చాడు.

“అమ్మీ! సాయంత్రం నేను అబ్బూ బండి దగ్గరకు వెళ్తాను. చెప్పులు కొనిపించుకొని వస్తాను తనతో” అన్నాడు. 

కడప పాతబస్టాండులో రసూల్ వాళ్ల నాన్న తోపుడుబండిపై అరటిపళ్ళు పెట్టుకొని అమ్ముతుంటాడు. ఆ బండి, అందులోని అరటిపండ్లు అతనివి కావు. పేరుకు అది బండి, బస్టాండులో ఒక వారగా నిలబెట్టిన బండి. ఇప్పటివరకు ఆ స్థానంలోనుంచి అది కదలడం ఎవరూ చూడలేదు.

షావుకారుకు అలాంటివి పది బండ్లు ఉన్నాయి. కొన్నిచోట్ల కదలకుండా ఉంటాయవి. కొందరు కూలీలు మాత్రం వీధి వీధి తిరిగి అమ్ముకొని, ఆయనకు సరుకు ప్రకారం లెక్క అప్పజెప్పుతుంటారు. ఒక్కో బండికి ఒక కూలీ. రోజూ నలభై రూపాయల కూలీ. స్ట్రైకులు, బందులు, బాగా వర్షం పడి సరుకు అమ్ముడుపోని రోజులు తప్ప మిగితా రోజులన్నీ కూలీ ఠంచనుగా ఇచ్చేస్తాడు. ఆలియా భర్త ఆ కూలి డబ్బులు సరిగ్గా తీసుకొనిరాడు.  డబ్బులు తీసుకొని వచ్చినా, రాకున్నా రోజూ కనీసం నాలుగు అరటిపండ్లు మాత్రం తీసుకొని వస్తాడు.

తను ఆలోచనల్లో ఉండగానే, “అమ్మీ! వెళ్ళనా అబ్బూ దగ్గరికి” అని అడిగాడు రసూల్. “సరే! వెళ్దువులే. కాస్త తిని నిద్దురపో. చూడు! ఎండ ఎలా మండిపోతుందో? సాయంత్రం వెళ్దువులే” అంది ఆలియా.

వాళ్ల ఇంటి నుంచి పాత బస్టాండు ఓ మైలు దూరం ఉండొచ్చు. రసూల్ అప్పుడప్పుడూ వెళ్తూ ఉంటాడు వాళ్ల నాన్న బండి దగ్గరికి. ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి భోజనం తీసుకొని వెళ్తాడు నాన్నకు. స్కూల్‌కు సెలవు ఉన్నప్పుడల్లా వెళ్తుంటాడు. మిగతా రోజలు రసూల్ నాన్న అక్కడే దగ్గరలో ఉన్న హోటల్లో ఐదు రూపాయలిచ్చి రెండు సంగటి ముద్దలు తింటాడు. భోజనం తీసుకుని వెళ్ళినప్పుడల్లా రసూల్‌కు రూపాయో, అర్ధరూపాయో ఇచ్చి పంపిస్తుంటాడు వాళ్ల నాన్న.

రసూల్ పక్కనే చాప వేసుకొని పడుకుంది ఆలియా. నిద్రపట్టలేదు. రసూల్ అప్పటికే నిద్రపోయాడు. ఆలియాకు రసూల్ చెప్పుల తలంపే. ఆలియాతో అందరూ అంటూ ఉంటారు, “రసూల్‌కు నీ పోలికలే, నీ రంగు వచ్చింది. చేతులు, కాళ్ళు చాలా సుకుమారంగా ఉంటాయి” అని. రసూల్ కాళ్ల వైపు చూసింది. ఎర్రగా ఉన్న పాదాలు. కోమలంగా, తెల్లగా ఉన్న అరికాళ్ళు. నిజమే! ఈ కాళ్ళు చెప్పులు లేకుండా తిరగకూడదు. ఎంత నున్నగా ఉన్నాయి! ఎంత వేడి, మంట అనుభవిస్తున్నాడో ఉత్త కాళ్ళతో మండుటెండలో నడుస్తూ.

ఆలియా కళ్ళల్లో నీళ్ళు. రసూల్‌కు మెలకువ రాకుండా మెల్లగా అతని పాదాలు ముద్దాడింది.

సాయంత్రం ఆరుకు నిద్రలేచాడు రసూల్. “అమ్మీ! కాస్త ముందే లేపకూడదా?” అంటూ కోప్పడ్డాడు. “మంచి నిద్రలో ఉన్నావు, నువ్వే లేస్తావులే అనుకున్నా” అంది ఆలియా.

గబగబా సబ్బు ముక్కతో మొహం కడుక్కొని, తల దువ్వుకొని బయలుదేరాడు. ఆలియా చూపులు ఆ వెళుతున్న పాదాలపైనే ఉన్నాయి. తిరిగి వచ్చేటప్పుడు ఆ పాదాలకు చెప్పులు ఉండాలని గట్టిగా అల్లాను కోరుకుంది. 

గంట తరువాతో, ఇంకాస్త ఎక్కువకో వచ్చాడు రసూల్. ఉత్సాహంగానే ఉన్నాడు, కాళ్లకు మాత్రం చెప్పులు లేవు. 

“ఏమైంది?” అని అడిగింది.

“నేను వెళ్ళేసరికి షావుకారు వచ్చి ఈ రోజుటి కలెక్షన్ మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడంట. రాత్రి తొమ్మిదికి అబ్బూకు ఈ రోజుటి డబ్బులు ఇస్తాడంట. అక్కడికీ అబ్బూ, నేనూ ఎదురుచూశాం. నాలుగు డజన్లు అమ్ముడుపోతే నీ చెప్పుల డబ్బులొస్తాయి తీపిస్తాను అన్నాడు అబ్బూ. అరగంట చూశాం కానీ, ఒక్క బేరం కూడా రాలేదు. అబ్బూనే అన్నాడు, ‘ఎంతసేపు నిలబడతావు? ఇంటికి వెళ్లి చదువుకో, నేను రాత్రి వచ్చేటప్పుడు పట్టుకొని వస్తాను’ అని” అన్నాడు. 

ఆలియా మనసులో ఇన్షాఅల్లా అనుకుంది. 

అబ్బూ కోసం ఎదురుచూడ్డం మొదలుపెట్టాడు రసూల్. అతని చూపంతా వీధివైపే ఉంది. రాత్రి రెండో సినిమా మొదలువరకు బేరాలు వస్తూనే ఉంటాయి. పదికి మొత్తం కలెక్షన్ ఇచ్చి, తన కూలి పట్టుకొని వస్తాడు. సక్కగా వచ్చాడా పదిన్నరకు ఇంట్లో ఉంటాడు. పదిన్నర దాటిందా? ఇక ఆలియాకు గుడ్డి గుర్తు, తాగడానికి వెళ్లిపోయాడని. పదిన్నరలోపు వచ్చిన రోజులు చాలా తక్కువ.

పదికల్లా రసూల్ నిద్రపోతాడు. వాళ్ల అబ్బూ తాగి వచ్చేది, లేంది వాడికి అర్థం కాదు. కానీ నాన్నకు తాగుడు అలవాటు ఉందని మాత్రం తెలుసు.

“అమ్మీ! అబ్బూ వచ్చేవరకు నిద్దురపోను. నేను చెప్పులు చూసి నిద్రపోతాను” అన్నాడు రసూల్.

“సరే” అంది ఆలియా. తొమ్మిదిన్నర నుంచి ఆలియాకు గుబులు. భర్త పది తరువాత తిన్నగా చెప్పులు కొనుక్కొని ఇంటికి వస్తాడా, లేక తాగడానికి వెళ్లి, ఏ పన్నెండుకో ఇంటికొస్తాడా అని.

ఒక్కో నిమిషం యుగంలా గడుస్తోంది. రసూల్ వీధి చివర వరకు వెళ్లి వస్తున్నాడు నాన్న కోసం. పది దాటింది. తండ్రి జాడ లేదు. ఎందుకో ఆలియా ఎడుమకన్ను గట్టిగా రెండుసార్లు కొట్టుకుంది. పదిన్నర అయ్యింది. అల్లాను కోరుకుంది, ‘ఈ ఒక్క రోజు మా ఆయన్ను తొందరగా ఇంటికి పంపు. బాబును నిరుత్సాహపరచకు అల్లా! వాడు కోరుకున్నది చిన్న కోరిక, ఒక జత చెప్పులు. మా ఆయన చెప్పులతో వస్తే ఒక పూట నమాజ్ ఎక్కువ చదువుతాను’ అని మనసులోనే విన్నవించుకుంది.

పదకొండయ్యింది. ఇంకా రాలేదు. 

రసూల్ పడుకో పో! చాలా రాత్రయ్యింది” అంది.

“లేదు అమ్మీ! అబ్బూ ఖచ్చితంగా తెస్తానన్నాడు” అని మొండిగా ఎదురుచూస్తూ కూర్చున్నాడు.

‘మా ఆయన తాగి వస్తే రానీ, మా వాడి జత చెప్పులు తెచ్చేలా చూడు’ అని ఆలియా మళ్ళీ మౌనంగా అల్లాను వేడుకుంది.

అర్ధరాత్రి పన్నెండవుతోంది. వీధి మొదట్లో నిలకడ లేని అడుగులు వేసుకుంటూ వస్తున్నాడు ఆలియా భర్త. రసూల్ కళ్ళు నలుపుకుంటూ “అమ్మీ… అబ్బూ వస్తున్నాడు” అన్నాడు. కొడుకును దగ్గరికి తీసుకొని తలనిమిరింది ఆలియా. ఇద్దరి కళ్ళు అతని చేతులపైనే ఉన్నాయి. ఒక చెయ్యి ఖాళీగా ఉంది. ఇంకో చేతిలో ఒక కవర్. 

‘అందులో చెప్పులు ఉన్నాయి’ అనుకున్నాడు రసూల్. ‘చెప్పులే ఉండాలి’ అని కోరుకుంది ఆలియా.

రసూల్ అన్నాడు, “ఖచ్చితంగా చెప్పులే అవి” అని. తూలుతూ, తూగుతూ వస్తున్నాడు ఆలియా భర్త. ఒకచోట సంభాలించుకోలేక కింద పడబోయాడు. చేతిలోని చెప్పులు జాగ్రత్త అనుకుంది ఆలియా. పొరపాటున తను కింద పడి, చెప్పులు జారి కాలువలో పడితే, రసూల్ ఎంత బాధపడతాడు? ఇంటి వరకు వచ్చినవి కాళ్లకు లేకుండా పోతాయి అనుకుంది ఆలియా.

తూలుతూ వచ్చాడు రసూల్ నాన్న. అతని చేతిలోని కవర్లో అరటిపండ్లు. రసూల్ ఆ కవర్ అందుకొని, అందులో ఉన్నవి అరటిపండ్లు అని అర్థం అవుతూనే కవర్ విసిరికొట్టాడు.

రసూల్ కవర్ విసిరికొట్టడం, ఏడ్వడం ఏవీ కనబడటం లేదు అతని తండ్రికి. పరిచి ఉన్న బొంతపై మత్తుగా కళ్ళు మూసుకొని నిద్రపోయాడు.

రసూల్‌ను సముదాయించడం అలియా వల్ల కావట్లేదు. పెళ్లయినప్పటి నుంచి ఇలాంటి నిరాశలు మామూలే. రసూల్‌కు కూడా అలవాటే కానీ, ఈరోజు కాస్త ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు.

రసూల్ ఏడుస్తూనే ఉన్నాడు, చిన్నగా వెక్కిళ్లు కూడా పెడుతున్నాడు. రసూల్ వెక్కిళ్లు పెట్టినప్పుడల్లా ఆలియా గుండె ఎగిరెగిరిపడుతోంది బాధతో.

తల్లీకొడుక్కి ఎప్పటికోగానీ నిద్రపట్టలేదు. ఏమీ జరగనట్టు ఉదయం ఆలియా భర్త తన పనికి వెళ్లిపోయాడు. రసూల్ బడికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాడు. బడికి వెళ్ళమని చెప్పడానికి ఆలియాకు ధైర్యం చాలట్లేదు. 

పదయ్యింది. రసూల్ ముభావంగా ఇంట్లో ఒక వారన కూర్చొని ఉన్నాడు. ఆలియా తన పనుల్లో పడింది. ‘వీడి నాన్న ఈరోజు కొంటాడేమో చెప్పులు? రేపు పోతాడులే స్కూల్‌కి’ అనుకుంది.

వీధి తలుపుపైన చప్పుడు. చూస్తే తన తమ్ముడు.

“అరే షబ్బీర్ నువ్వా? రోజూ కడపకు వస్తున్నా, ఇన్ని రోజులకు గుర్తుకువచ్చిందా నీకు మా ఇల్లు?” అంది.

“అరే ఆపా! ఎందుకలా అంటావ్? పోయిన వారమే కదా వచ్చి వెళ్ళాను” అన్నాడు షబ్బీర్. అతని కళ్ళు రసూల్ మీద పడ్డాయి.

“అరే ఏంటి నువ్వు బడికి వెళ్ళలేదా? జ్వరం ఏమైనా వచ్చిందా” అన్నాడు కంగారుగా. ఉదయం నుంచి బిగపట్టుకున్న ఏడుపుతో మామను గట్టిగా పట్టుకొని బోరున ఏడ్చాడు రసూల్. ఒంటిపూట బడులు మొదలైనప్పటి నుంచి రసూల్ పెడుతున్న చెప్పుల పేచీ మొత్తం చెప్పింది ఆలియా. 

“అరే! చెప్పుల గురించి ఎవరైనా బడి మానేస్తారా? అంతా మన బోటి వాళ్ళే కదా అక్కడ ఉన్నది. వారి ముందర మనకేంటి నామోషీ?” అని కాస్త మందలించాడు షబ్బీర్.

“సరే పద, నేను కొనిపిస్తాను నీకు చెప్పులు” అని రసూల్‌ని తీసుకొని బయటికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. 

ఆలియా కల్పించుకుని, “మా ఇంట్లో ఎప్పుడూ ఉండే పంచాయతీలే లే! నీకెందుకు? ఇదిగో మజ్జిగ తాగి కాస్త చల్లబడు, ఎండన పడి వచ్చావు” అంది. 

“అరే! వీడు బడికి పోకుండా ఇంట్లోనే ఉంటే చెడిపోడా? నాకు చెప్పేవాళ్ళు లేకే ఇలా తయారయ్యా” అంటూ రసూల్ చెయ్యి పట్టుకొని బయలుదేరాడు షబ్బీర్.

షబ్బీర్‌కు, ఆలియాకు ఏడేళ్ల తేడా. చదువు మధ్యలోనే ఆపేశాడు. కడప-రాయచోటికి తిరిగే కమాండర్ ప్యాసింజర్ జీపులకు క్లీనర్‌గా వెళ్తున్నాడు. పాత బస్టాండ్‌లో జీపులను ఆపడం, “రాయచోటి.. రాయచోటి” అని గట్టిగా అరిచి ప్యాసింజర్లను ఎక్కించడం, వాళ్ల దగ్గర ఛార్జీ వసూలు చెయ్యడం షబ్బీర్ పని. జీప్ నిండితే షబ్బీర్‌కు నిలబడ్డానికి కూడా స్థలం ఉండదు. జీప్‌కు వేలాడుతూ వెళ్ళడమే. రోజుకు ఐదు నుంచి ఆరుసార్లు తిరుగుతుంది జీప్. మూడు, నాలుగు రోజులకు అక్క ఇంటికి భోజనానికి రావడం, ఒక పూట తిని అక్క చేతిలో ఇరవయ్యో, ముప్ఫైయ్యో పెట్టిపోవడం. నెలకు ఐదువందలు షబ్బీర్‌ జీతం. 

వెళుతూ వెళుతూ అన్నాడు, “ఆపా! నాకు కువైట్ వీజా రాబోతుంది. మన ఊర్లో ఉన్నాడు కదా మస్తాన్, అతను పంపిస్తున్నాడు వీజా. మొదటి నాలుగు నెలలు వీజాకు అయిన అప్పులు తీర్చేస్తా. నెలనెలా నాలుగు వేలు జీతం. నేను నీకు ప్రతినెలా నాలుగు వందలు పంపుతాను. రసూల్‌ను బాగా చదివించాలి” అంటూ రసూల్‌ను తీసుకొని రోడ్డెక్కాడు. 

వైవీ స్ట్రీట్‌లోని చెప్పుల అంగడిలో లెదర్ చెప్పులు తీయించాడు, ముప్ఫై ఐదు రూపాయలు పెట్టి. రసూల్ ఇంత పెద్దవి చేశాడు కళ్ళు. “వద్దు మామూ, నాకు ఇంత ధర ఉన్నవి. అమ్మీ అరుస్తుంది, నాకు హవాయి చెప్పులు చాలు” అన్నాడు.

“ఏం కాదులే! నేను సంపాదిస్తున్నా కదా! నువ్వు ఇలా రేపటి నుంచి బడికి వెళ్ళి బుద్ధిగా చదువుకోవాలి. సరే! నేను జీప్ దగ్గరికి వెళ్ళాలి, ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్లేసరికి ఆలస్యమవుతుంది. జీపు డ్రైవర్ నా మీద అరుస్తాడు. చిన్న రిపేర్ వచ్చి షెడ్‌లో ఉంది, ఈపాటికి రిపేర్ అయ్యుంటుంది. నేను వెళ్తున్నా. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు ఇంటికి” అని చెప్పి, షెడ్ దిక్కుకు వెళ్లిపోయాడు షబ్బీర్.

 రసూల్‌కు కాళ్ళు నిలవట్లేదు. ఆ లెదర్ చెప్పుల డబ్బా చేతిలో పట్టుకొని పరుగులాంటి నడకతో ఇంటివైపు పరుగెత్తాడు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అమ్మకు చూపించాలని హడావిడిలో ఉన్నాడు. ఎదురుగా వస్తున్న వాహనాలను లెక్కచెయ్యకుండా పరుగెత్తుతున్నాడు. మొదటిసారి లెదర్ చెప్పులు కొనడం, అమ్మతో ఆ ఆనందం పంచుకోవాలి. ఎదురుగా వస్తున్న టీవీఎస్50 దాదాపు గుద్దబోయింది రసూల్‌ను.

రొప్పుతూ, గసపెడుతూ ఇంటికి చేరుకున్నాడు. “అమ్మీ! చూడు మామూ ఏం తీపించాడో? లెదర్ చెప్పులు, ముప్ఫై అయిదు రూపాయలు వీటి ధర” అన్నాడు. ఆలియా ఆ చెప్పులు చూసి, ఆశ్చర్యపోయింది, ఆనందపడింది. తన తమ్ముడిపై ప్రేమ రెట్టింపయ్యింది. 

“వేసుకొని రాకుండా ఉత్తకాళ్ళతో చేతిలో పట్టుకొని వచ్చావేం?” అంది.

“నేను వేసుకొని వస్తే మాసిపోతాయి కదా! నీకు కొత్తగా ఉన్నవి చూపించాలని” అన్నాడు.

ఆలియా ఆ చెప్పులు చేతుల్లోకి తీసుకొని మురిపెంగా తాకింది. ‘అరె! ఎంత నాణ్యంగా ఉన్నాయి? ముప్పై ఐదు రూపాయలు పెట్టి ఈ చెప్పులు తాము ఎన్నటికీ ఇప్పించలేము రసూల్‌కు’ అనుకుంది. 

“ఒకసారి వేసుకొని చూపించు” అంది రసూల్‌తో. రసూల్ వేసుకొని చూపించాడు. “నాలుగు అడుగులు వేయి” అంది. “ఇక్కడ ఇంట్లోనా? ఇంట్లో చెప్పులతో నడవకూడదంటావే” అన్నాడు రసూల్.

“హా! పాత చెప్పులైతే నడవకూడదు. కొత్తవి కదా, నడవచ్చులే! వీధిలో, రోడ్డుపైన నడిస్తే వేరేవాళ్లు చూస్తారు, మరి నేనెలా చూడను?” అంది ఆలియా. సరేనని అటుఇటు నాలుగుసార్లు తిరిగాడు రసూల్. ఆలియా కళ్ళల్లో నీళ్ళు. 

“అమ్మీ! ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పులు వచ్చేశాయి కదా నాకు” అన్నాడు. ఏడ్వకు అంటూ సముదాయించబోయాడు. రసూల్‌కు తెలుసు, అవి బాధతో వచ్చిన కన్నీళ్ళు కాదని. కానీ అమ్మ కళ్ళల్లో నీళ్ళు చూడ్డం కష్టంగా ఉంది. మూడు, నాలుగు రోజులుగా చెప్పుల కోసం మారాం చేసి బాగా బాధపెట్టానన్న పశ్చాత్తాపం ఉంది అతనిలో.

కళ్ళు తుడుచుకుంటూ రసూల్ తలపై చేయి పెట్టి దీవించింది ఆలియా. “ఇప్పటి నుంచి ఇలాంటి లెదర్ చెప్పులు, బూట్లు మాత్రమే తొడగాలి నా బేటా, జీవితాంతం” అంది.

“సరే, ఈరోజు శుక్రవారం. చెప్పులకు బాధపడుతూ ఉంటే మన ఇంటికి లెదర్ చెప్పులు పంపించాడు అల్లా. జుమ్మా నమాజ్‌కు వెళ్ళు” అని కొడుకును నమాజ్‌కు తయారు చేసింది. 

స్నానం చేసి వచ్చిన కొడుక్కి జుబ్బా తొడిగింది. కళ్లకు సుర్మా పెట్టింది. తలకు టోపీ పెట్టి, నమాజ్‌కు వెళ్లి బాగా దువా చేసుకొని రా అని సాగనంపింది.

చెప్పులు వేసుకొని వీధిలో నడుస్తూ, ఎవరైనా తన చెప్పులను గమనిస్తున్నారా, లేదా అని చూట్టూ ఒక చూపు చూసుకుంటూ మసీదుకు చేరుకున్నాడు రసూల్.

నమాజ్ ఆనందంగా చదివాడు. నమాజ్‌లో కూడా చెప్పుల ఆలోచనే. సార్లు తప్ప తమ బడికి ఇలాంటి గొప్ప చెప్పులు వేసుకొని వచ్చేవాళ్ళే లేరు. రేపు తన స్నేహితులందరికీ ఈ లెదర్ చెప్పులు చూపించి గొప్పలు పోవాలి. 

ఈ ఆలోచనల్లో ఉండగానే నమాజ్ పూర్తయ్యింది. ఇంటికి బయలుదేరాడు. అదే ఆనందం, అదే ఉల్లాసం. సగం దూరం వచ్చాక గమనించాడు తన కాళ్ళకు చెప్పులు లేని సంగతి. ‘అయ్యో! అనందంలో చెప్పులు వేసుకొని రావడం మరిచిపోయానే’ అని అని తల్లడిల్లిపోయాడు. వదిలిపెట్టిన బాణంలా మసీదు వైపు పరిగెత్తాడు.

తన చెప్పులు కనబడలేదు. ఒకరిద్దరు పెద్దవాళ్ళు తప్ప మసీదులో ఎవరూ లేరు. బయట, లోపల ఉన్న పెద్దవాళ్ల చెప్పులు మాత్రం అక్కడున్నాయి. ఇంకో పాతబడిపోయిన, ఎవరూ వాడని పాత చెప్పులు ఉన్నాయి.

ఎంత వెతికినా తన చెప్పులు కనబడలేదు. మసీదు ఆవరణ మొత్తం వెతికాడు. ఉంటే కదా కనబడ్డానికి! ఎవరో మసీదుకు వచ్చిన వాళ్ళు తన కొత్త చెప్పులు దొంగిలించారు. వెతికినా లాభం లేదని అర్థమయ్యింది రసూల్‌కు.

కళ్ళు నేలకేసి చూస్తూ ఇంటిదారి పట్టాడు. ఇంటికి వెళ్లి అమ్మను చూస్తూనే బోరున ఏడ్చాడు. జరిగింది చెప్పాడు. “ఏడ్వకు. ఎవరైనా పొరపాటున తొడుక్కొనిపోయి ఉంటారు. నువ్వు సాయంత్రం అసర్ నమాజ్‌కు వెళ్ళు, నీ చెప్పులు ఉంటాయి” అంది ఆలియా.

అసర్ నమాజ్ సమయం వరకు ఏడుస్తూనే ఉన్నాడు రసూల్. 

అసర్ నమాజ్ కంటే పది నిమిషాల ముందే చేరుకున్నాడు మసీదుకు. ఒక్కొక్కరుగా వస్తున్న వారి కాళ్లవైపు చూస్తూ నిలుచున్నాడు. అంతా పెద్ద వాళ్ళే వస్తున్నారు. తన వయసువాళ్ళు ఒక్కరూ రావడం లేదు.

నమాజ్ పూర్తయ్యింది. బయటికి వచ్చి చూశాడు. చెప్పులు లేవు. ఉసూరుమంటూ ఇంటిదారి పట్టాడు.

మళ్ళీ మగ్రీబ్ నమాజ్‌కు వెళ్ళాడు. సాయంత్రం ఆరున్నరకూ అదే పరిస్థితి. తన వయసువాళ్ళు ఎవరూ రాలేదు.

రాత్రి చివరిపూట నమాజ్, ఇషాకు వెళ్ళాడు. ఆలియా అంటూనే ఉంది, “చీకట్లో వద్దులే బేటా” అని. అయినా రసూల్ వినిపించుకోకుండా వెళ్ళాడు రాత్రి ఎనిమిదిన్నరకు. అతనికి మళ్ళీ చుక్కెదురయ్యింది.

ఇంటికి వచ్చి ఆలియాతో అన్నాడు, “అబ్బూకు తెలియదు కదా, మామూ చెప్పులు తీపించాడని. అబ్బూ ఈరోజు చెప్పులు తెస్తాడేమో?”

“నీ పోయిన చెప్పులు మసీదులో దొరుకుతాయని ఆశ ఉంది కానీ, మీ అబ్బూ చెప్పులు తెస్తాడని నాకు నమ్మకం లేదు” అంది ఆలియా. అనుకున్నట్లే రాత్రి అతను తూలుతూ వట్టి చేతులతో వచ్చాడు.

ఉదయం ఐదవుతూనే రసూల్ నమాజ్‌కు బయలుదేరాడు. రసూల్ అలికిడికి ఆలియా లేచింది. మూడు నెలలకోసారి కూడా ఉదయం పూట నమాజ్‌కు వెళ్ళని కొడుకు, ఎవరూ నిద్ర లేపకుండానే ఫజర్ నమాజ్‌కు వెళ్తున్నాడని ఆనందపడింది.

‘ఇంత ఉదయం నమాజ్‌కు తన వయసువాళ్ళు ఎవరూ రారు’ అని అనుకుంటూనే రసూల్ వెళ్ళాడు. ఏదో ఆశ వదులుకోలేక వెళ్తున్నాడు తను.

నమాజ్ నుంచి వచ్చి ఎటువంటి పేచీ పెట్టకుండా బడికి బయలుదేరి వెళ్లిపోయాడు వట్టికాళ్ళతోటే.

కనీసం ఒక స్నేహితుడికి కూడా చూపించకుండానే తన చెప్పులు పోయాయి. “నేను చెప్పులు కొన్నాను, అవి కూడా లెదర్ చెప్పులు” అని చెప్పినా కూడా ఎవరూ నమ్మరు. 

రోజులు గడుస్తున్నాయి. రసూల్ తనకు వీలైనన్నిసార్లు నమాజ్‌కు వెళుతున్నాడు. రోజులో ఐదు పూటలు ఆచరించాలి నమాజ్. రసూల్ ఐదు పూటలా వెళుతున్నాడు. నమాజ్ అవుతూనే బయటికి వచ్చి తన చెప్పుల కోసం వెతుకుతున్నాడు. 

మళ్లీ జుమ్మా నమాజ్ వచ్చింది. ‘ఈ పూట నమాజ్‌కు కచ్చితంగా వచ్చి ఉంటారు నా చెప్పులు పొరపాటున తీసుకొని వెళ్లినవాళ్ళు’ అనుకున్నాడు రసూల్. తన వయసువాళ్ళు చాలామంది వచ్చారు నమాజ్‌కు. ఒంటిపూట బడులు కదా, నాలుగు వీధుల పిల్లలు వచ్చారు మసీదు‌కు. పిల్లల శబ్దం ఎక్కువగా ఉంది. నిశ్శబ్దంగా ఉండండని హజ్రత్ అరుస్తున్నారు.

నమాజ్ మొదలుకాకముందే ఒకసారి బయటికి వెళ్లి తన చెప్పుల కోసం వెతికాడు రసూల్. మళ్ళీ నిరాశే. నమాజ్ అయ్యాక మళ్ళీ చూసాడు. తన చెప్పులు కనబడలేదు.

ఏడ్పు కూడా రావడం లేదు రసూల్‌కు. వారం నుంచి ఏడ్చిఏడ్చి ఇక ఏడ్వడానికి ఏడ్పు కూడా రావట్లేదు. ఆ రోజు అలా ఎలా మర్చిపోయాడు తను? మూడు, నాలుగు నెలల ముందు చెప్పులు తెగిపోతే పారేశాడు. అప్పటి నుంచి అలవాటైపోయింది చెప్పులు లేకుండా తిరగడం. చెప్పులు కొని ఒక పూట కూడా గడవముందే నమాజ్‌కు వెళ్ళాడు. చెప్పులున్నాయన్న ఆలోచన లేకుండా అలవాటు ప్రకారం చెప్పులు లేకుండానే బయలుదేరాడు. కొత్త చెప్పుల మాట ఎత్తలేకున్నాడు ఇంట్లో. 

“ఏంటి? అమ్మాకొడుకులిద్దరూ చెప్పులు కావాలని అడగటం లేదు” అని రసూల్ నాన్న ఆశ్చర్యపోతున్నాడు. కానీ కొడుక్కి ఒక జత చెప్పులు కొనిద్దాం అని మాత్రం అనుకోవడం లేదు. 

మళ్ళీ నమాజ్‌కు వేళైంది. సాయంత్రం రసూల్ మసీదుకు బయలుదేరాడు. తన కొడుకు ప్రతిపూటా నమాజ్‌కు వెళ్తూ ఉంటే ఆలియాకు లోలోపల ఆనందం. ‘ఐదు పూటలా నమాజ్ చదివే అలవాటు కలిగినవాడు తన కొడుకై ఉండాలంటే ఎంత అదృష్టం ఉండాలి తల్లికి! అల్లా నాకు ఆ అదృష్టాన్ని ప్రసాదించాడు. ఇంత చిన్న వయసులో నిష్ఠగా నమాజ్ చదివే అలవాటు అలవడింది నా కొడుక్కు. పోతే పోయాయి వెధవ చెప్పులు’ అనుకుంది. తన భర్తను జుమ్మా నమాజ్ చదవమంటే, ఏ మూడు జుమ్మాలకో ఒకసారి నమాజ్‌కు వెళ్తాడు.

అక్కడ అరటిపళ్ల బండి దగ్గర రసూల్ నాన్న ‘ఈ రోజు రాత్రి ఎవరితోనూ వెళ్లకుండా, కూలి డబ్బులతో రసూల్‌కు కొత్త చెప్పులు కొనుక్కొని వెళ్ళాలి’ అని గట్టిగా అనుకుంటున్నాడు మనసులో. కానీ సావాసగాళ్ల గుంపును చూస్తూనే మనసు మందుపైకి మల్లుతోంది. 

రసూల్ నమాజ్‌కు వెళుతూ మనస్సులో అనుకుంటున్నాడు, ‘ఎవరో కావాలనే నా చెప్పులు దొంగలించారు మసీదులో. అందుకే మళ్లీ ఇటువైపు తిరిగి చూడటం లేదు. ఇక వస్తారన్న ఆశ కూడా లేదు. ఏదో తన ఆశ చావక ప్రతి పూట వచ్చి చూసుకొని వెళుతున్నాడు. ఇంకో రెండు పూటలు వస్తాను. చెప్పులు దొరకకుంటే ఇక ఇన్నిసార్లు నమాజ్‌కు రాలేను. ఇంకో రెండు పూటలే! అల్లా.. నా చెప్పులు దొరికేలా చూడు’ అని ప్రార్థించుకుంటూ మసీదు చేరుకున్నాడు.

*

అంతా హాయిగా, ఆనందంగా సాగిపోయే కథలు  రాయలేను

  • హాయ్ ఇమ్రాన్! మీ గురించి చెప్పండి.

హాయ్! మాది కడప పట్టణం. నేను పుట్టి పెరిగింది, చదివింది అంతా అక్కడే! బీఎస్సీ మైక్రోబయాలజీ చదివి, ఆ తర్వాత ఎంబీఏ పూర్తి చేశాను. కొన్నేళ్లు మార్కెటింగ్ జాబ్స్ చేశాను. ఆ తర్వాత బెంగళూరులో సొంతంగా కంపెనీ పెట్టి తొమ్మిదేళ్లు నడిపాను. నష్టం రావడంతో అది మూసేశాను. ఆరేళ్లుగా కడపలో మెడికల్ ఏజెన్సీ నడుపుతున్నాను.

  • సాహిత్యంతో మీ పరిచయం ఎలా మొదలైంది?

మా అమ్మానాన్నలు రీడర్స్. చిన్నప్పటి నుంచి మా ఇంటికి చందమామ, బాలమిత్ర, స్వాతి పత్రికలు వచ్చేవి. అవి చాలా శ్రద్ధగా చదివేవాణ్ని. మా అమ్మ స్వాతిలో సీరియల్స్ చదివి, ఇంటి చుట్టుపక్కలవాళ్ళతో వాటి గురించి మాట్లాడేది. ఆ రోజుల్ని ఇప్పుడు తలుచుకుంటే నోస్టాల్జియా అనిపిస్తుంది. అప్పట్లో పుస్తకాలు అద్దెకు ఇచ్చేవారు. పానుగంటి అనే రచయిత రాసిన ‘బుల్లెట్’ నవలలు చాలా ఇష్టంగా చదివాను. మా ఊళ్లో లైబ్రరీలో ఉండేది. అప్పుడప్పుడూ అక్కడ నాలుగైదు గంటలు కూర్చుని రకరకాల పేపర్లు చదివేవాణ్ని. ఇంటికొచ్చేసరికి మా కళ్లు, ముఖం పీక్కుపోయేది. మా క్లాసులో 40 మంది ఉంటే, అందులో నేనే ఎక్కువగా పుస్తకాలు చదివేవాణ్ని.

  • కథలు రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

2018-19 నుంచి ఫేస్‌బుక్‌లో వ్యాసాలు రాయడం మొదలుపెట్టాను. మెల్లగా నాకంటూ రీడర్స్ తయారయ్యారు. 2020 నుంచి నా రాతలు అందరి గమనింపులోకి వచ్చాయి. ఒకసారి మా అమ్మమ్మ గారి ఊరికి వెళ్లినప్పుడు అక్కడ ఒకావిడ రాత్రిపూట ఏడుస్తూ కనిపించింది. ఆమె కువైట్ వెళ్లి, అక్కడ మూడేళ్లు ఉండి వచ్చింది. అక్కడ సేట్ కొడుకును ఆమే ఎత్తుకుని పెంచింది. ఆ పిల్లాణ్ని మర్చిపోలేక బాధతో ఏడుస్తుందని అర్థమైంది‌. దీన్ని కథగా రాయాలని అనుకున్నాను. అలా ‘గల్ఫమ్మ’ అనే టైటిల్ పెట్టి మొదటి కథ రాసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాను. ఆ తర్వాత నా జీవితంలో అప్పటిదాకా జరిగిన సంఘటనలు గుర్తు తెచ్చుకుని, వాటిలో కథ రాసేందుకు అనువైన అంశాలను కథలుగా రాసి పోస్ట్ చేసేవాణ్ని. ఇప్పటివరకు 19 కథలు రాశాను.

  • మీకు ఎలాంటి కథలు రాయడం ఇష్టం?

నాకు విషాదం నిండిన కథలు రాయడం ఇష్టం. అంతా హాయిగా, ఆనందంగా సాగిపోయే కథలు నేను రాయలేను. విషాదం అయితే జనాల మనసుల్ని హత్తుకుంటుంది, ఎక్కువ కాలం గుర్తుంటుందని నా అభిప్రాయం.

  • ఎందుకలా?

ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఇద్దరు వ్యక్తులు బజార్లో నిలబడి, నవ్వుతూ ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అదే రెండు బండ్లు ఒకటినొకటి ఢీకొని వాళ్లకు గాయాలయ్యాయంటే అందరూ చుట్టూ నిలబడతారు, వాళ్లలో నలుగురు సాయం చేస్తారు. ఇంటికెళ్లాక కూడా ఆ విషయం వాళ్లకు గుర్తు ఉంటుంది. కథల్లో అలాంటి అంశాలుంటే ఎక్కువ కాలం గుర్తుంటాయి.

  • ఒక పాఠకుడిగా మీరు ఎలాంటి కథలు చదవడానికి ఇష్టపడతారు?

నేను చాలా ఏళ్లపాటు విపుల, చతుర, స్వాతి పత్రికలు చదివాను. ఆ పత్రికలు కొనేందుకు డబ్బు కూడబెట్టుకునేవాణ్ని. ఆ పత్రిక ముట్టుకోగానే చేతులు వణికేవి. అందులో ఏమేం కథలున్నాయా అని ఉత్కంఠగా ఉండేది. ఆ కథలు చదువుతూ ఉంటే చాలా బాగుండేది.  నా దృష్టిలో అవే కథలు. ఆ తర్వాత్తర్వాత వాటి స్థాయి, అందులో వేసే కథలు మారిపోయాయి. నాకు తిలక్ కథలంటే చాలా ఇష్టం. ఇప్పుడు వస్తున్న వాళ్ల కథలు నేను పెద్దగా చదవలేదు. వేంపల్లె షరీఫన్న రాసిన ‘ఆకుపచ్చ ముగ్గు’ కథ నాకు బాగా ఇష్టం‌. ఈ మధ్యకాలంలోనే దాన్ని డిగ్రీలో పాఠ్యాంశంగా చేర్చారు. ఇంటి ముందు ముగ్గు వేయాలన్న ఆశను తీర్చుకోలేని ఓ ముస్లిం అమ్మాయి తన చుట్టూ ఉన్నవాళ్ళ చేతులకు మెహందీ వేసి ఆ ఆశ తీర్చుకుంటుంది. ‘ఇంటి ముందు ముగ్గు వేస్తే హరామ్ అంటారు. చేతి మీద మెహందీ వేస్తే మాత్రం బాగుందంటారు’ అని ఆ కథలోని వాక్యం నాకు చాలా ఇష్టం. ఆ వాక్యం వల్లే ఆ కథ డిగ్రీ పాఠ్యాంశంగా మారిందని అనుకుంటాను.

  • ఇంకా ఏమేం రాయాలని ఉంది?

ఫేస్‌బుక్‌లో అప్పుడప్పుడూ వ్యాసాలు రాస్తున్నాను. రాయాలని అనిపించినప్పుడు కథలు కూడా రాస్తాను. ఇప్పటివరకూ నేను రాసిన కథలతో త్వరలో పుస్తకం వెలువరించబోతున్నాను.

*

ఇమ్రాన్ బేగ్

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Ee story enthabagundo cheppalenanta !
    Imran garu abhinandanalu .
    Me interview lo meru cheppinamaatalu achham naa aalochanalugaa vunnae .
    Me stories book raagaane tappakundaa chaduvutaanu .
    Mee saili adbhutam . meenunchi ennenno kathalu raavaali .
    All the best!
    Annapurna.
    writer .
    California.

  • చెప్పులు కథ బావుంది. ముగింపు ప్రశ్నార్థకం గా వదిలేయటమే సరైనది

  • ఎంత బాగా రాసావో ఇమ్రాన్.. నువ్వు గొప్ప కథకుడివి ఖచ్చితంగా అవుతావు.. నీ దృష్టి కోణం చాలా బాగుంది. నువ్వు రాసే పద్ధతి ఆసాంతం చదివిస్తుంది.. కాదు.. కళ్ళ ముందు కనిపించేలా చేస్తుంది.. నాకు బాగా నచ్చింది.. కన్నీరు తెప్పించింది..

  • అద్భుతం ఇమ్రాన్ అన్న .
    మనసుకు హత్తుకుంది. నా చిన్నప్పటి ముస్లిం దోస్తుల ఇళ్లల్లో ఇలాంటివే చూసా. ప్రతి పదం చాల ఉత్కంఠ రేపింది, నేనే రసూల్ లా ఫీల్ అయ్యా. ఇంతమంచి రచన చేసిన నీ చేతికి వందనం.

  • Imran Bhai,

    Excellent write up….
    Your writings are from the heart…
    Will be eagerly waiting for next story…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు