1.
నా యింటి పక్కనున్న నీటి కొలనులో
రెండు మూడు బండరాళ్లు
కదలవు
మెదలవు
కరగనైనా కరగవు
నా యింటి పక్కనే ఉన్న తేట నీటి కొలనులో
రాత్రీపగలు మెరుస్తూ
రెండు మూడు మోయలేని బండరాళ్లు
2.
ఎప్పుడో ఒకసారి కాదు
ఎన్నోసార్లు చెప్పుకున్నాను
గుసగుసగా
లోయల గుండెల్లోకి కొన్ని క్షమాపణలు
క్షణకాలం దిక్కుల్లో ప్రతిధ్వనించి తేలిపోతాయిగానీ,
యింటికొచ్చాక అంతా మామూలే!
3.
నా యింటి నాలుగు గోడల మీద
నల్లని నీడలు
చెరగవు
చెదరవు
కరగనైనా కరగవు
ఎన్ని రాత్రులకు
ఎన్ని కనిపించని కన్నీటి చుక్కలిచ్చినా
నిద్రలేస్తూనే,
తెల్లటి నా యింటి గోడల మీద
మళ్ళీ మళ్ళీ అవే బరువైన నీడలు.
*
Add comment