చెదరిన మేఘాలు

                              ఒడియా మూలం : గౌర హరి దాస్

                               తెలుగు అనువాదం : వంశీకృష్ణ

మోనాలిసా  అలసటగా తన లాప్ టాప్  బ్యాగును బెడ్ రూమ్ లోని టేబుల్ మీద పడేసి కిటికీ తలుపు  తెరచింది . చల్లటి గాలి మొహాన్ని స్పర్శించి  సేద తీరుస్తుంది  అనుకుంటే ఆహారం పాసిపోయి వేసే దుర్వాసన ఆమెను ముంచెత్తింది . రెండు రోజుల క్రితం నరేంద్ర బాబు ఇంటి వెనుక  ఒక వివాహ వేడుక జరిగిన విషయం  ఆమెకి గుర్తుకొచ్చింది .  బహుశా  ఆ వేడుకలో మిగిలిపోయిన ఆహార పదార్ధాలు అన్నీ తన అపార్ట్మెంట్ పక్కన ఉన్న  ఖాళీ స్థలం లో డంప్ చేసి వుంటారు . ఆ ఏరియాలో వుండే వాళ్లంతా  ఆ ఖాళీ ప్రదేశాన్ని  చెత్త చెదారం వేయడానికి, మిగిలిపోయిన ఆహార పదార్ధాలు డంప్ చేయడానికి ఒక డస్ట్ బిన్  లాగా  ఉపయోగించుకుంటున్నారు.

అదంతా  తల్చుకుంటూ “ “ఏం  మనుషులో ! పెళ్ళికి లక్షలకు  లక్షలు  ఖర్చు చేస్తారు కానీ,వేడుక అనంతరం మిగిలిపోయిన గార్బేజ్ శుభ్రం  చేయించడానికి డబ్బులు లెక్కేసుకుంటారు?”  అనుకుంది ఉస్సురంటూ నిట్టూరుస్తూ. మునిసిపల్ పారిశుధ్య సిబ్బంది ఆ లొకాలిటీకి ఎప్పుడో కానీ రారు . కనుక అక్కడ ఆ చెత్త ఎంతలా  ఎన్నాళ్ళు మురుగుతూ , దుర్వాసన వెదజల్లుతూ ఉంటుందో ఎవరికీ తెలియదు .

ఆమె ఒక్కసారిగా అసహనానికి లోనయి  కిటికీ తలుపు మూసేసింది.

నాలుగువేల  చదరపు అడుగులు ఉండి  దీర్ఘ చతురస్రాకారం లో ఉన్న  ఆ ఖాళీ  ఇంటి స్థలం  యజమాని భార్య  చనిపోయిన తరువాత  కొడుకు దగ్గర ఉండటానికి అమెరికా వెళ్ళిపోయాడు . రాజధాని నగరం లోని చంద్రశేఖర పుర లోని ఆ ఖాళీ స్థలం చాలా విలువ అయినది . నాలుగేళ్ళ క్రితం మోనాలిసా , అభిషేక్  ఈ అపార్ట్మెంట్  లో  అద్దెకి దిగినప్పుడు  ఆ ఖాళీ  స్థలాన్ని చూసి యాభయి లక్షలు పైనే ఉంటుంది అనుకున్నారు . మోనాలిసా , అభిషేక్ లకు  రాజధాని నగరం లో ఒక్క గజం స్థలం కూడా లేదు . అందుకే   తమ పక్కనే ఉన్న  స్థలాన్ని అసూయగా చూస్తూండేవాళ్లు .  మంచి ప్రాంతం లో ఉన్న  ఆ స్థలం లో ఒక అందమైన భవంతి వెలుస్తుందని , ఆ భవంతి ముందు పచ్చటి లాన్ , కళ్ళకు ఆహ్లాదకరంగా ఉండే  పూల తోట ఆ భవనం అందాన్ని మరింత శోభయామానం చేస్తుందని  ఏవేవో ఊహల మాలలు అల్లారు . కానీ అదొక చెత్త డంపింగ్ యార్డ్ లాగా మారిపోయింది . మనుషులకు లాగే స్థలాలకి కూడా విధి రాత అంటూ ఒకటి ఉంటుందేమో ! చెరువులు , చెత్త డంపింగ్ యార్డ్ లో అందమైన భవనాలుగా  మారుతుంటే ఈ స్థలం మాత్రం  గార్బేజ్ కేంద్రంగా మారింది .

బెడ్ రూమ్ తలుపు అసహనంగా మూసేసిన  మోనాలిసా అపార్ట్మెంట్ రూఫ్ టాప్  మీద ఆరవేసిన చీరలు తెచ్చుకోవడానికి పైకి వెళ్ళింది . మోనాలీసాను చూసి ఆమె అత్తగారు ఒక్క క్షణం పాటు  ఆశ్చర్యపోయారు . మరుక్షణం లో తల వొంచుకుని కిందకు వెళ్ళిపోయింది . అత్తగారు అలా తలవొంచుకుని  కిందకు వెళుతున్నప్పటికీ ,ఆమె పెదవుల మీద మెరిసిన ఒక చిన్న చిరునవ్వు రేఖ ,  సిగ్గుతో తల  వంచుకున్న వైనం , మోనాలిసా చూపు నుండి తప్పించుకోలేక పోయింది. మోనాలిసా కొంత ఉత్సుకత తోనూ , మరికొంత విచారణా దృష్టితోనూ  అప్పటిదాకా అత్తగారు నిలబడి ఉన్న  వైపుకు నడిచింది . మోనాలిసా అపార్ట్మెంట్ తరువాత  పన్నెండు అడుగుల రోడ్డు దాటాక అటు వైపు చంద్రమా  అపార్ట్మెంట్ వుంది .

మోనాలిసా తేరి పార  చూసేసరికి చంద్రమా అపార్ట్మెంట్  మూడో ఫ్లోర్ లో ఒక చిన్న పిల్లవాడు తల్లిని సతాయిస్తున్న దృశ్యం కనిపించింది.

మోనాలిసా తన చీర తీసుకుని వెనక్కు తిరుగుతుండగా, జీన్స్ ప్యాంటు మీద టీ  షర్ట్  తొడుక్కున్న ఒక పెద్దాయన   ఆ మూడో ఫ్లోర్ బాల్కనీ లోకి రావడం కనిపించింది.

ఆయన్ని చూడగానే మోనాలిసా కి ఎక్కడో చూసినట్టు అనిపించింది . ఒక్క  క్షణం  పాటు  మెదడుకి పని పెట్టగానే , ఆ బాల్కనీ లోనే ఆ పెద్దాయన్ని రెండు మూడు సార్లు చూసిన విషయం  ఆమెలో తటిల్లత లాగా మెరిసింది . ఆ రెండు మూడు సార్లు కూడా ఆమె అత్తగారు కూడా ఇక్కడ ఈ బాల్కనీ లో కనిపించిన  విషయం  కూడా జ్ఞప్తికి వచ్చింది

మోనాలిసా గందరగోళం లో పడింది. ఆమె అత్తగారు చాలా సాంప్రదాయ వాది . అభిరుచి , ఆచరణ రెండింటిలోనూ. కానీ ఆ ఎదురింటి  టీ  షర్ట్ పెద్దాయన్ని చూసి అత్తగారు సిగ్గుపడటం ఆమెను దిగ్భ్రాంతికి గురిచేసింది. అత్తగారు అలా చేయడం ఆమెకు చాలా కంపరంగా వుంది. తన  కూతురు మీతి  ఈ విషయం  గమనిస్తే , అది ఆమె మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?

అభిషేక్ ఆ రోజు  ఇంటి వచ్చేసరికి రాత్రి ఎనిమిది అయింది. మోనాలిసా , అభిషేక్ ఇద్దరూ ఉద్యోగస్తులే . ఇద్దరూ కలిసి ఉదయం తొమ్మిది గంటలకు ఇంటి నుండి బయట పడితే , మళ్ళీ రాత్రి ఏ ఏడో  ఎనిమిదో అవుతుంది  ఇంటికి  వచ్చేసరికి . ఉదయం పూట  అభిషేక్  మొనాలిసాను  ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వెళితే ఆమె సాయంత్రం ఏ  ఆటో రిక్షానో పట్టుకుని ఇంటికి వస్తుంది . వాళ్ళిద్దరి ముద్దుల పాప మీతి  స్కూల్ కి, స్కూల్ బస్  లో వెళుతుంది . స్కూల్ నుండి ఇంటి కి వచ్చాక మీతి కి కావలసినవి  అన్నీ నాయనమ్మ సమకూరుస్తుంది.

ఆ  రాత్రి భోజనం అయ్యాక ” అభిషేక్ కాసేపు పైకి పద . నీతో కాస్త మాట్లాడాలి ” అన్నది మోనాలిసా . తమ అపార్ట్మెంట్ పైన  ఏకాంతంగా మాట్లాడుకోవడానికి  కావాల్సినంత స్థలం వున్నది అన్న విషయమే మరచిపోయిన  అభిషేక్ ఆమె వంక ఆశ్చర్యంగా చూశాడు, ఏమిటి సంగతి అన్నట్టు

” ఏమీ లేదు . నీతో కాస్త మాట్లాడాలి  ” అన్నది మోనాలిసా

” సరే ! నువ్వు పద . నేను రెండు నిమిషాలలో వస్తాను,” అన్నాడు అభిషేక్

రాత్రి తొమ్మిది దాటింది . అపార్ట్మెంట్ పైనుండి చూస్తుంటే నగరం పగటికంటే ఎక్కువ అందంగా కనిపిస్తోంది .. తూర్పు తీర  రైల్యే ప్రధాన కార్యాలయం దాదాపు పూర్తి అయింది . ప్రధాన రహదారికి రెండు వైపులా ఉన్న  స్వస్తి ప్రీమియం హోటల్ , జయదేవ్ విహార్ ఫ్లై ఓవర్  నియాన్ లైట్ల వెలుగులో  మెరిసి పోతున్నాయి . నగరం ఉదయం కంటే రాత్రి పూటే ఎక్కువగా మోహ పెడుతుందేమో .

” అటు వైపు చూడు ” అన్నది మోనాలిసా

” ఎటు వైపు ”

మోనాలిసా కి కోపంగా ఉంది . ఆ సాయంత్రం జరిగిన సంఘటన   తలచుకుంటే ఆమెకు సిగ్గుగా వుంది . ఎక్కడనుండి మొదలు పెట్టాలో ఆమెకు అర్ధం కావడం లేదు .

అభిషేక్ ఆమె అసౌకర్యాన్ని గమనించనట్టు ” ఆ చెట్టును చూడు . పోయినేడాది వచ్చిన తుఫాన్ కి సగం దాకా విరిగి పోయింది . కానీ ఇప్పుడు కొత్తగా పువ్వులు పూస్తోంది .  ఎంత ఆశ్చర్యం ?’ అన్నాడు

” మీ అమ్మ చేసినదానికంటే అదేమీ ఆశ్చర్యం కాదు ” మోనాలిసా ఠపీమని జవాబు ఇచ్చింది

అభిషేక్  ఒక్క సారిగా  తను  చూస్తున్న దృశ్యం లో నుండి  వాస్తవం లోకి వచ్చాడు . అతనిప్పుడు  పక్కనే వున్న గార్బేజ్ నుండి వస్తున్న

దుర్వాసన తో కూడిన గాలిని అనుభవం లోకి తెచ్చుకున్నాడు . ఆమె తన తల్లి పట్ల చేసిన పిర్యాదు పట్ల అతడికి ఆశ్చర్యంగా ఉంది . తన తల్లి కేవలం మనిషి కాదు . ఒక పని యంత్రం . ఉదయం ,సాయంత్రం తన పని తాను యంత్రం లా మౌనంగా చేసుకుపోవడం తప్పిస్తే పన్నెత్తి అనవసరంగా ఒక్క మాట కూడా మాట్లాడదు . అలాంటి  అమ్మ , మోనా ని ఏ విధంగా అప్సెట్ చేసి ఉంటుంది ?

రెండు నిమిషాల తరువాత ” ఏం  జరిగింది ?”  అన్నాడు అభిషేక్

” మనం ఈ అపార్ట్మెంట్ ఖాళీ చేసి వెళ్లి పోదాం . ఎంత త్వరగా అయితే అంత త్వరగా . ఇది ఇక ఎంత మాత్రమూ సేఫ్ కాదు ” అన్నది మోనాలిసా

” ఎందుకు ?”

” నేనేమీ చెప్పలేను ”

” ఏం  జరిగిందో చెప్పు . లేకపోతే నీకు మనశ్శాంతి ఉండదు . నాకు టెన్షన్ తప్పదు . అమ్మ ఏం  చేసింది ?”

మోనాలిసా మౌనంగా వుంది

అభిషేక్  మోనాలిసా భుజం చుట్టూ చేయి వేసాడు . ఆమె విదిలించి కొట్టి ” మీ అమ్మ ప్రేమ లో పడింది . ఈ వయసులో ! ఎంత సిగ్గుమాలిన తనం ?”

అప్పటిదాకా వీస్తున్న గాలి ఆగిపోయింది . దుర్వాసన మరింత బలంగా పరిసరాలను చుట్టుముట్టింది . అపార్ట్మెంట్ ముందున్న వీధి దీపం ఆరిపోయింది . చీకట్లో మోనాలిసా మొహం అతడికి ఒక హంతకుడి మొహం లాగా కనిపించింది.

“నన్ను అపార్ధం చేసుకోకు అభీ ! ఈ విషయాన్ని నేను చాలా రోజులుగా  గమనిస్తున్నాను . ఇంకా ఓపిక పట్టడం నావల్ల కాదు . ఆమెకి అన్ని విషయాల పట్లా ఆసక్తి పోయింది . నిమిష నిమిషానికి  ఆమె  రూఫ్ టాప్ పైకి వస్తున్నది ” మోనాలిసా  ఒక నిష్పక్ష పాతమైన  తీర్పు చెప్పిన న్యాయమూర్తిలాగా  కిందకు వెళ్ళిపోయింది.

అభిషేక్ గిల్టీ సమారిటన్  లాగా నిల్చుండి పోయాడు . చివరకు ఆమె తన తల్లి ఎవరితో ప్రేమలో ఉన్నదో  మోనాలిసా ద్వారానే తెలుసుకున్నాడు . అతడెవరో కాదు చంద్రమా అపార్ట్మెంట్ మూడో ఫ్లోర్ లోని 144 ఫ్లాట్ లో ఉండే  ఒక తమిళ విడోయర్ . ప్రభుత్వ సర్వీస్ నుండి రిటైరైన  ఇంజనీర్ . పొడవుగా , బక్కపలచగా ఉంటాడు . జుట్టు బూడిద రంగు లో ఉంటుంది కానీ ఫ్రెంచ్ కట్ గడ్డం  మాత్రం నల్లరంగులో ఉంటాయి , ఎప్పుడూ జీన్స్ , టీ  షర్ట్  మాత్రమే వేసుకుంటాడు . మోనాలిసా చెప్పినదాని ప్రకారం అతడొక  విలువలు లేని మనిషి .

ఆ రాత్రి అభిషేక్ నిద్రపోలేదు . భార్య చెప్పిన విషయం  అతడిని అమితంగా బాధించింది . తల్లికీ , ఆ జీన్స్ పెద్దాయనకి నడుమ సంబంధం ఉందా ? లేదా ? అనే సంశయం అతడిని తీవ్రంగా కలచివేసింది . మోనాలిసా ఏడ్పులకి అతడికి అకస్మాత్తుగా మెలకువ వచ్చింది . అతడు గబగబా మంచం దిగి వచ్చి-

” ఏమైంది ?” అని ప్రశ్నించాడు భార్యని

” మీ అమ్మ తన గదిలో లేదు “

అభిషేక్ కి ఆశ్చర్యం కలిగింది . వాచీ చూసుకుంటే ఆరు కూడా కాలేదు . ఇంత ఉదయమే అమ్మ ఎక్కడికి వెళ్లి ఉంటుంది ? రాత్రి తామిద్దరూ మాట్లాడుకున్న మాటలు కానీ విని వుంటుందా ? సిగ్గుపడి , మొహం చూపించలేక ఎక్కడికైనా వెళ్లి ఉంటుందా ?

” నువ్వేం కంగారు పడకు. మీతిని స్కూల్ కి  తయారు చేయి . నేను వెళ్లి చూస్తాను . బహుశా గుడికి కానీ వెళ్ళిందేమో ” అతడు త్వర త్వరగా దుస్తులు వేసుకుని బయలుదేరాడు . అతడి అంచనా నిజమే!

తమ అపార్ట్మెంట్ కి దగ్గరగా ఉన్న  గుళ్లో  స్థంభానికి అనుకుని కూర్చుని ఉంది  తల్లి. తను  రోజూ కట్టుకునే తెల్ల చీరనే  ఆమె కట్టుకుని వుంది . ఆ తెల్ల చీర ఆమె కి భర్త లేడు  అని లోకానికి చెప్పడానికి ఒక గుర్తు.

అభిషేక్ చిన్న పిల్లాడు గా ఉన్నప్పుడే , భర్త చనిపోయాడు ఆమెకి. అప్పటికి ఆమె కూడా చాలా చిన్నపిల్ల. అభిషేక్ తల్లిని మొదట్లో ఎప్పుడైనా రంగు రంగుల చీరలు కట్టుకోవచ్చుగా అని అడిగేవాడు. ఆమె నవ్వి ఊరుకునేది .

అభిషేక్ ఆమెని గుళ్లో చూసేసరికి ఆమె తన మొహం మీద చీర కొంగు కప్పుకుని ఉంది. బూడిద రంగు వెంట్రుకలు నుదురు మీద పడుతున్నాయి . ” అమ్మా ” అని అభిషేక్  పిలవబోతూ ఆమె పక్కన ఎవరో కూర్చుని ఉండటాన్ని గమనించాడు . అతడి పిలుపు గొంతు లోనే ఆగిపోయింది. తల్లి పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరో అతడికి సరిగ్గా కనపడలేదు. అతడు మెట్లు ఎక్కి  వాళ్లకు కనపడకుండా  వెనక్కి వెళ్ళాడు . తల్లి పక్కన కూర్చున్నది ఎవరో కాదు . రిటైర్డ్ ఇంజనీర్ . అతడు తల్లి చేతిని తన చేతితో పట్టుకుని ఉన్నాడు . ఒక ఉగ్ర , ఉష్ణ  సముద్ర కెరటం ఏదో  తన మొహం మీద కొట్టినట్టు ఫీలయ్యాడు అభిషేక్.

” నాకు పెళ్లి అయ్యేటప్పటికి ఇరవై . ఆయన వయసు నలభయి . అంత ఆశ్చర్య పడవలసింది ఏమీ లేదు . మేమిద్దరమూ బాబా  భక్తులం . మా అమ్మా నాన్న  నా పెళ్లి విషయం  బాబాకి వదిలివేసేసరికి  బాబా మా ఇద్దరికీ పెళ్లి చేసారు ” అమ్మ చెప్తోంది

” నీకు ఇష్టం లేకుండానే ?” ఆ జీన్స్ ఇంజనీర్ అడుగుతున్నాడు

” నాన్న పనిచేసే ఆఫీస్ లోనే ఒక అబ్బాయి నన్ను ఇష్టపడ్డాడు . ఆ విషయం  నాన్న కి తెలిసింది . ఏం  జరిగిందో దేవుడికే తెలుసు కానీ , నాన్న మాత్రం బాలాసోర్ నుండి కోరాపుట్ కి బదిలీ చేయించుకున్నారు  రెండంటే రెండే వారాలలో . కోరాపుట్ లో నా పెళ్లి అయింది . అభిషేక్ పుట్టేటప్పటికి   నా వయసు ఇరవైరెండు. ఆ తరువాత మూడేళ్లకే మా ఆయన చనిపోయాడు ”

” నువ్వు చాలా అందంగా వున్నావుకదా . మళ్ళీ పెళ్లి చేసుకోవలసింది . నిన్ను ప్రేమించిన ఆ అబ్బాయి ఎక్కడకు వెళ్ళాడు ?”

” ఏమో ! నాకు తెలియదు . మళ్ళీ నేను బాలాసోర్ కి వెళ్లలేదు ”

” సో… ఒంటరిగా వున్నావన్నమాట ”

” లేదు ! అభిషేక్ బాధ్యతలు పూర్తిగా తీసుకున్నాను. చిన్నప్పుడు అభిషేక్ చాలా అనారోగ్యం తో ఉండేవాడు . నిమిషానికోసారి హాస్పిటల్ చుట్టూ తిరగవలసి వచ్చేది . మా అత్తగారు వాడి అనారోగ్యానికి నేనే కారణం అన్నట్టు మాట్లాడేవారు . మా అబ్బాయిని చూశారా ? చాలా అందంగా ఉంటాడు. ఉంటాడు కదూ ”

” అవునవును . మీ అబ్బాయి చాలా అందగాడు ”

” మీకో విషయం  తెలుసా ? నేను చెయ్యకపోయినా, మా అబ్బాయి ప్రేమించి  పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయిది కలకత్తా . మేము ఒడియా బ్రాహ్మణులం . అమ్మాయి బెంగాలీ లో మరో కులానికి చెందినది . అభిషేక్  బాబాయిలు  అంతా వ్యతిరేకించినా నేను వాడికి అండగా నిలబడ్డాను . ఎవరు వచ్చినా రాక పోయినా నీ పెళ్ళికి నేను వచ్చి ఆశీర్వదిస్తాను . కలకత్తా వెళ్లి పెళ్లి చేసుకో అని చెప్పాను ”

” తరువాత? ”

” నా కోడలు చాలా మంచి పిల్ల . ఆమె ప్రవర్తన  చాలా పద్దతిగా డీసెంట్ గా ఉంటుంది . ఆమె నన్ను ఇంట్లో ఒక్క  పని కూడా చేయనివ్వదు ”

” నీ కంటే అందమైనదన్నమాట ”

” వృద్ధాప్యం లో అందానికి విలువేముంది ?’

వాళ్లిద్దరూ కొద్దీ సేపు మౌనంగా ఎవరి ఆలోచనలలో వాళ్ళుండిపోయారు . అభిషేక్ వాళ్ళ మాటలు వింటూ అక్కడే వుండిపోయాడు .అభిషేక్ తల్లికి యాభయి అయిదు . జీన్స్ ఇంజనీర్ కి అరవై . కానీ వాళ్లిద్దరూ ఇరవై ఏళ్ళ లో వున్న దంపతుల లాగా ప్రవర్తిస్తున్నారు .

” నీ చేతి మీద , మోచేతి కింద ఇన్ని మచ్చలు ఏమిటి ?” జీన్స్ ఇంజనీర్ అడుగుతున్నాడు

అమ్మ తన  చీర కొంగుతో   వేడి నూనె పడి  కలిగిన ఆ  మచ్చలని  దాచడానికి ప్రయత్నం చేస్తూ  ” ఈ మచ్చలు  వంటింట్లో  పడ్డాయిలే ! కొన్ని విషయాలు మీకు అర్ధం కావు ”

” నా క్కూడా వంట చేయడం వచ్చు . ఎప్పుడైనా అవకాశం దొరికితే నేను చేసే కోడిగుడ్డు కూర నీక్కూడా పెడతాను . కోడిగుడ్డు కూర   నేను చాలా  బాగా చేస్తాను ”

” నేను నాన్ -వెజ్ తినను ”

” మొదటి నుంచీనా ?”

” లేదు . నాభర్త చనిపోయినప్పటినుండి . మా దగ్గర వితంతువులు మాంసాహారం తినకూడదు . కానీ పెళ్లి కాక ముందు నాకు చేప లేకుండా  ముద్ద  దిగేది కాదు ”

ఆ మాట చెప్పి ఆమె టాపిక్ మార్చడానికి ప్రయత్నం చేసింది . ” నిరుడు  మా అబ్బాయి కేరళ వెళ్ళాడు . నాలుగేళ్ళ కి ఒకసారి మాత్రమే పుష్పించే అరుదైన పువ్వు ఒకటి అక్కడ ఉందట . అబ్బాయి చెప్పాడు . నువ్వలాంటివి నమ్ముతావా ? ” అంది అడిగింది

అతడు మెల్లగా ఆమె చేతిని తట్టి ” కేరళ నువ్వు వెళ్లలేదా ?’ అని అడిగాడు

” యువజంట సెలవులు హాయిగా గడపడానికి కేరళ వెళితే తగుదునమ్మా అంటూ నేనెందుకు ? వెళ్లి వాళ్ళ ఆనందాన్ని నేనెందుకు చెడగొట్టాలి ? వాళ్ళు ఎక్కడ వున్నా వాళ్ళు నా గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు . నన్నొక కంట గమనిస్తూనే వుంటారు ”

” అవును నువ్వు అమ్మవు కదా ”

ఆమె నిశ్వసించి  మౌనంగా వుంది . అతడు కల్పించుకుని ” ఏదో  ఒకటి మాట్లాడు ” అన్నాడు

” మా అబ్బాయి పెద్దవాడయ్యాడు . ఇక నేను లేకుండా అతడు తన కుటుంబాన్ని నిర్వహించగలడు ”

” భారతీయ స్త్రీలు అందరిదీ ఒకటే మాట . మీరెందుకు దేవతల్లాగా ఉండిపోవాలి అనుకుంటారు ”

” నాకు అర్ధం కాలేదు ‘

” సరేలే ! ఇక బయల్దేరుదాం . నీ మనవరాలు స్కూల్ కి వెళ్లే టైమ్  అయింది. మా అమ్మాయి కూడా నాకోసం ఎదురు చూస్తుంది ”

” మీ అమ్మాయి ఏం  చేస్తుంది ?’

”  యాక్సిస్ బ్యాంకు లో పనిచేస్తుంది . అల్లుడు బెంగళూరు లో పనిచేస్తూ అక్కడే  ఉంటాడు . ఇక్కడ నేను నా కూతురు ,మనవరాలితో  ఉంటున్నాను ”

వాళ్లిద్దరూ వెళ్లిపోవడానికి లేచారు . వాళ్ళు చూడకుండా దొంగతనంగా అభిషేక్ ఇంటికి వచ్చేసాడు .

” కనపడిందా ?’ అభిషేక్ ఇంటికి రావడాన్ని గమనించి మోనాలిసా గాభరాగా అడిగింది

” అమ్మ గుళ్లో ఉంది . వెనక వస్తోంది . ” ఆ మాట వినగానే మోనాలిసా ఒక పేపర్ అభిషేక్ చేతిలో పెట్టి ” ఇది చదువు ” అన్నది

అభిషేక్ ఆ పేపర్ తీసుకుని తన గదిలోకి వెళ్ళాడు . అది నీట్ గా రాసిన చిన్న వుత్తరం . ఇంగీష్ లో వుంది.

ఉత్తరం  కింద వెంకటరామన్  అన్న సంతకం వుంది.

అభిషేక్ కి చాలా ఆశ్చర్యం కలిగింది ఆ జీన్స్ ఇంజనీర్ కి వున్న ధైర్యం పట్ల . బహుశా అతడికి అమ్మకి  ఇంగ్లీష్  రాదని తెలియదేమో . ఆ తమిళ ఇంజనీర్  ఒడియా మాట్లాడగలడు కానీ రాయలేడు .  అందుకేనేమో ఈ ఇంగ్లీష్ ఉత్తరం . అభిషేక్ ఆ ఉత్తరం  చదవడం మొదలు పెట్టాడు

” చరిత్రలో ఏ రహస్య ప్రేమలేఖా ఎక్కువకాలం దాగిన దాఖలా లేదు . బహుశా  ఈ ప్రేమ లేఖ కూడా చిరిగి ముక్కలు అవుతుందో  లేక బూడిద గా మిగులుతుందో ! ఏదో  ఒకటి నీవే చేయవచ్చు కూడా . కానీ ఆ చిరిగిన ముక్కలనో , బూడిదనో  ఆ విశాల నీలాకాశం భద్రపరుస్తుంది . ఆకాశం వంక నువ్వు చూస్తే నేను రాయని ఆ ప్రేమలేఖని చదవొచ్చు . నిన్ను ఇంతకూ ముందే కలవనందుకు నాకు చాలా బాధగా ఉంది . ఇప్పుడు మనం తల్లితండ్రులం , తాతయ్యా అమమ్మలం . బహుశా మనం కూడా చాలాకాలం ఉండకపోవచ్చు ”

ఆ ఉత్తరం చదవగానే అభిషేక్ ఇరిటేషన్ అణుచుకోలేక పోయాడు . బాత్ రూమ్ లోకి దూరి రోజు కంటే ఎక్కువసేపు స్నానం చేసాడు. ఆఫీస్ కి వెళ్ళిపోయాడు.

ఆఫీస్ కి వెళ్తూఅతడొక ఆలోచనలో మునిగిపోయాడు.

అతడి ఆలోచన నిస్సహాయురాలైన ఇరవై ఐదేళ్ల వితంతు యువతీ చుట్టూ పరిభ్రమించింది . లొంగదీయలేని జీవితాన్ని తన నియంత్రణ లోకి ఆమె తన యవ్వనమంతా ధారపోసింది . రాజీ లేని పోరాటం చేసింది. ఆమె కలలని , ఆశలని , అభిరుచులని ముంచెత్తిన ఒక మహాశూన్యం ను ఆమె ఎదిరించలేక ఆ శూన్యం లో బందీ అయిపొయింది .  ఎడారిలో నిండిన మృత్యువు లాంటి నిశ్శబ్దం , ఎప్పటికప్పుడు నిరాశలోకి నెట్టేసే నిస్పృహ  ఆమెనొక మానవ  యంత్రంగా మార్చేశాయి . పని తప్పితే మరే  అనుభూతికీ  నోచని విఫల జీవితంగా మిగిల్చాయి.

అతడు వస్తూ , వస్తూ మాఫేయిర్  హోటల్ దగ్గర ఆగాడు. అక్కడ రెండు గులాబీ పువ్వులు కొన్నాడు . అతడా గులాబీ పువ్వులను తల్లికి కానుకగా ఇవ్వాలి అనుకున్నాడు . ఇంకో రెండు రోజులు పోతే పదిహేనవ తారీఖు నాడు నిండు పూర్ణిమ. పౌర్ణమి రోజు పుట్టింది అని అమ్మకి పూర్ణిమ అని పేరు పెట్టారు. ఇంతవరకూ ఆమె పుట్టినరోజును ఎవరూ జరపలేదు. అయితేనేం? ఇప్పుడు  తాను  జరుపుతాడు.

తాను  వెంకట రామన్  కూడా ఆ పుట్టిన రోజు వేడుకకి ఆహ్వానిస్తాడు.

ఆ రోజు అతడు రోజు కంటే ముందు ఇంటికి బయలుదేరాడు . చంద్రమా అపార్ట్మెంట్ దాటుతుండగా  ఒక ట్రక్  గృహోపకరణాలు సర్దటం అతడికి  కనిపించింది.

అతడు తన స్కూటర్ ను పక్కన పార్క్ చేసి అపార్ట్మెంట్ లోపలి పరుగెత్తాడు . ఫ్లాట్ నెంబర్ 144 ఖాళీగా ఉంది . మిగిలిన సోఫాను కూడా బయటకు తరలిస్తున్న ఒకరిని పిలిచి

” ఇది వెంకటరామన్ వుండే అపార్ట్ మెంటేనా ?” అని అడిగాడు .  సోఫా తరలిస్తున్న వ్యక్తి తనకు తెలియదు అనడం తో చుట్టూ చూస్తే పక్క ఫ్లాట్ ముందు నిలిచి ఉన్న  ఒక స్త్రీ కనిపించింది . ఆమెను అదే ప్రశ్న వేశాడు .

” మీరు రాజ్య లక్ష్మి తండ్రి గురించి మాట్లాడుతున్నారా ?” అన్నదామె

” అదేమో తెలియదు కానీ , అతడు మాత్రం జీన్స్ , టీ షర్ట్  వేసుకుంటాడు . ఫ్రెంచ్ కట్ గడ్డం ఉంటుంది ” అని తనకు  తెలిసిన  గుర్తులు చెప్పాడు .

” అవును అతడు రాజ్యలక్ష్మి వాళ్ళ నాన్న గారే !”

” అతనెక్కడ ?”

” రాజ్యలక్ష్మికి బెంగళూరు బదిలీ అయింది . వాళ్లంతా ఉదయమే ఫ్లయిట్  లో బెంగళూరు వెళ్లారు. సామానంతా ఇప్పుడు ట్రాస్పోర్ట్ లో వెళుతున్నది ”

అతడిని ఒక్కసారిగా నిరాశ ఆవహించింది . ఒక పెద్ద వాన కురియడానికి ఎక్కడెక్కడినుండో వచ్చి గుమి కూడిన మేఘాలన్నీ  చెల్లాచెదురు అయినట్టు అతడికి అనిపించింది

” ఫోన్ నెంబర్ ఏదైనా ఉందా ?’

” లేదు . వాళ్ళు దేనికో  కలత చెందినట్టున్నారు. హడావిడిగా వెళ్లిపోయారు.  బెంగళూరు వెళ్లి కుదురుకున్నాక ఫోన్ నెంబర్ ఇస్తామన్నారు. వాళ్ళు  మీకు కావలసిన వాళ్ళా  ?”

” లేదు . కానీ మీకు చాలా థాంక్స్ ”

అతడు వెనక్కితిరిగితే అక్కడ తన తల్లి కిటికీ దగ్గర ఒక మైనపు బొమ్మలాగా కూర్చుని ఉండటం కనిపించింది. అతడి చేతిలో రెండు గులాబీ పువ్వులు అలాగే వున్నాయి . వాటిని ఏమి చేయాలో అతడికి అర్ధం కాలేదు . వాటిని తల్లికి కానుకగా ఇవ్వాలా ? లేక బయట పారవేయాలా ?

అప్పుడే అతడికి మోనాలిసా ఎదురు వచ్చింది . ఆమెని చూసి ” నువ్విక బాధ పడాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు . ఆ జీన్స్ ఇంజనీర్ వెళ్ళిపోయాడు ”

ఆమె  వళ్ళంతా  తేలిక అయినట్టుగా ఊపిరి వదిలింది . ” ఎంత అదృష్టం . ఒక ప్రమాదం తప్పి పోయింది ” ఆమె మాటలలో ఒక రిలీఫ్

అభిషేక్ కి మొట్ట  మొదటి  సారి ఒకరి దుఃఖం మరొకరికి ఆనందం కావడం అనుభవం లోకి వచ్చింది. అతడికి జవాబు ఇవ్వాలి అనిపించలేదు. చేతిలో గులాబీ పువ్వులతో ఇంకా అతడు బయటకు చూస్తూనే ఉన్నాడు . అతడికి ఆకాశం లో రెండు తెల్లటి మేఘ శకలాలు మెల్లగా అటూ ఇటూ కదలాడటం కనిపించింది.

ఆ రెండు మేఘ శకలాలని ఇద్దరు స్త్రీ పురుషులుగా మలచి,  వాళ్ళకి ఆ గులాబీ పువ్వులను  కానుకగా  ఇస్తే ఎంత బావుంటుంది?  అనుకున్నాడు.

*

చిత్రం: చరణ్ పరిమి 

వంశీ కృష్ణ

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఆ పూలను కానుకగా ఇస్తే చాలా బావుండేది…. కధా రచయిత…. నిజంగా దేవుడు లాంటి వాడే…. నిరంకుశంగా ప్రవర్తిస్తాడు…. కన్నీళ్లు వచ్చాయి ముగింపు చదివాక…..
    ……..దాకరపు బాబూరావు, తిరువూరు

  • చాలా బావుంది.. కొడుకు కొత్త పరిస్థితి అర్ధం చేసుకుంటే ఆయన కూతురు భయ పడినట్టుంది.

  • గులాబీలు స్త్రీ జీవితంలో ముళ్ళకు సాక్షాలా?
    చాలా బాగుంది సర్ అనువాద కథ

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు