చూస్తూ చూస్తూ వుండగానే, అతనొక జ్ఞాపకం!

ఇవాళ ఫేస్ బుక్ తెరవగానే మిత్రుడు కార్టూనిస్టు కంభాల శేఖర్ పుట్టిన రోజు అని, నేను తనకి అభినందనలు చెప్పాలని నోటిఫికేషన్ వచ్చింది. ఏం చెప్పాలి– చెప్పాపెట్టకుండా కనుమరుగైన మిత్రుడికి!

 

ముఖపుస్తకాలు లేని వొక అనగా అనగా కాలంలో స్నేహితులు వొకరి ముఖాలు వొకళ్ళు ఎలా చూసుకునే వారు? పొద్దూ పొద్దున్నే వొక చాయ్ తాగేసి, ఏ పొద్దుటి రైలో, ఫస్ట్ బస్సో అందుకొని దగ్గిరే వున్న స్నేహితుడి ముందు వాలిపోయే వాళ్ళు.

అవును, శేఖర్ – మేం “కంభా” అని పిలిచేవాళ్ళం- అలాగే వాలిపోయే వాడు వో ఆదివారం పొద్దున్న ఖమ్మంలో!

ట్విటర్లూ గట్రా లేని ఆ కాలంలో స్నేహితులు ఎలా పక్షి ముక్కుల్తో పొడుచుకునే వాళ్ళు? బహుశా, ఎక్కడో వొక పబ్లిక్ ఫోన్ పట్టుకొని, వొక పలకరింతో, ఇంకో తిట్టో రాల్చి వెళ్ళిపోయే వాళ్ళు.

అవును, కంభా అలాగే వున్నట్టుండి ఏ నెంబరూ లేని వొక ఫోన్లోంచి కొన్ని మాటలు మెల్లిగా రాల్చి తన వూళ్ళో తన మూలలో ఎక్కడో వొదిగి వుండి పోయే వాడు.

నెట్లూ మొబైల్ సెట్లూ లేని ఆ అనగా అనగా కాలంలోనే బహుశా మనుషులు ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళు. మాట కోసం ఎదురు చూస్తూ వుండే వాళ్ళు. మాట కోసం కలవరిస్తూ వుండే వాళ్ళు. నిద్రలో స్నేహితుల పేర్లు పలవరిస్తూ వుండే వాళ్ళు.

చాలా అమాయకంగా ముఖంమీద ఎలాంటి పేచీ లేని వొక విశాలమైన నవ్వుతో కంభా ఖమ్మంలో మా ఇంటికొచ్చే వాడు. “ఖంభా ఆయారే, బాబూ!” అంటూ మా అమ్మ నవ్వుకుంటూ లోపలికొచ్చి కబురు చెప్పేది. (ఆ రోజుల్లో నేను వంట గదిలో డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని రాసుకునే వాణ్ని, మధ్య మధ్యలో అమ్మతో కబుర్లు చెప్తూ) శేఖర్ ఇంటి పేరు అమ్మ దగ్గిరకి వచ్చేసరికి ఉర్దూ యాసలో “ఖంభా” – అంటే స్తంభం- అయిపోయేది.

javed

చిత్రం: జావేద్

2

అప్పుడు కార్టూన్ అంటే ఇంకా ఏమిటో కంభాకి పూర్తిగా తెలీదు. పుస్తకాలు విపరీతంగా చదివే వాడు. . కార్టూనిస్టులు ఆ కాలంలో సాహిత్యంతో సంబంధం లేని వేరే లోకంలో వుండే వాళ్ళు నిజానికి!

కాని, కార్టూనిస్టుల లోకంలో కూడా సాహిత్యమూ కవిత్వమూ వుంటాయని అప్పుడే నా మటుకు నాకు సురేంద్ర (ఇప్పుడు “హిందూ” సురేంద్ర) వల్ల అనుభవమైంది. అప్పుడే సురేంద్ర – తన పేరుని సురేన్ద్ర- అని రాయడం మొదలెట్టాడేమో! సురేంద్రలాగానే శేఖర్ కి కూడా సాహిత్యం వొక ప్రాణం! తన అసలు ప్రాణం కార్టూన్ లో వుందని కొంచెం ఆలశ్యంగా తెలిసి వచ్చింది శేఖర్ కి! కాని, ఆ ప్రాణం చిరునామా తెలిసాక వొక క్షణం వృధా చేయలేదు శేఖర్!

శేఖర్, శ్యాం మోహన్, సురేన్ద్ర…ఇలా ఇంకా ఈ తరం కార్టూనిస్టులు అక్షరంలోంచి కుంచెలోకి చేసిన ప్రయాణం చాలా విలువైనదని నాకు అనిపిస్తుంది. ఈ సాహిత్య సహవాసం వల్ల ముందు తరంలో ఏ కొద్ది మంది కార్టూనిస్టులకో పరిమితమైన కొత్త అందం వీళ్ళ కుంచెల్లోకి వచ్చి చేరింది.

శేఖర్ చివరి దాకా ఆ సాహిత్య సహవాసాన్ని నిలబెట్టుకుంటూ వెళ్ళాడు. బాగా గుర్తు- మహాశ్వేతా దేవి నవలల్ని చదివిన తాజా ఉద్వేగంలోంచి నడిచి వచ్చి, ఖమ్మంలో వొక ఆదివారం పొద్దున్న శేఖర్ అన్న మాటలన్నీ! “జీవితంలోని ఆ చిన్ని డీటెయిల్స్ మనం ఎందుకు పట్టుకోలేకపోతున్నాం?” అని ఆ రోజు అతను నన్ను అడిగాడు. శేఖర్ కి ఆ “చిన్ని డీటెయిల్స్” మీద విపరీతమైన పట్టింపు! సాహిత్య వ్యాసాల రచనతో మొదలైన శేఖర్ ప్రయాణం కార్టూన్ దగ్గిర స్థిర పడడంలోడీటైల్స్ మీది పట్టింపే కారణమని నాకు అనిపిస్తుంది. రోజువారీ జీవితాన్ని కార్టూనిస్టు చూసినంత దగ్గిరగా మరో కళాకారుడు చూడలేడు అని నేను ఖాయంగా చెప్పగలను. ఎందుకంటే, కార్టూనిస్టు daily basis మీద జీవితాన్ని బేరీజు వేసుకోవాలి. వాస్తవికతని చూస్తూనే దాన్ని ఆట పట్టించే క్రిటిక్ అతనిలో వుండాలి. అంత కంటే ఎక్కువగా ఆ వాస్తవికతని దాని అసలు రూపు చెడకుండా నవ్వు పుట్టించే కోణంలోంచి కూడా చూడాలి. కార్టూన్ వెనక వున్న ఈ ఫిలాసఫీ శేఖర్ కి అర్థమైంది. అందుకే, కార్టూన్ని వొక కళారూపంగా గుర్తించి తీరాలని మొండి పట్టుదల అతనికి!

ఇవాళ శేఖర్ మన ముందు లేని ఈ రోజున మీరు అతని కార్టూన్లన్నీ దగ్గిర పెట్టుకొని, వొక్కోటీ చూస్తూ వెళ్ళండి. ఈ కార్టూనిస్టు ఫిలాసఫీ గురించి నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది.

శేఖర్ చివరి గీత

శేఖర్ చివరి గీత

3

నిజమే, జీవితం చాలా వేగంగా దూసుకుపోతోంది. మన మధ్య ఎవరున్నారో ఎవరు లేరో కనుక్కునే వ్యవధి మనకెవ్వరికీ లేదు. చూస్తూ వుండగానే, మన కళ్ళ ముందు పెరిగి పెద్దదైన వొక కార్టూన్ గీత నిష్క్రమించింది. వొక చిర్నవ్వు నిశ్శబ్దంలోకి రాలిపోయింది. వొక స్నేహ హస్తం మన భుజమ్మీంచి బలహీనంగా కూలిపోయింది. బతికి వుండగా వొక మనిషి ఎన్ని పాత్రాలు పోషించ గలడో, ఆ పాత్రలన్నీ ధైర్యంగా వాటిల్లో ప్రాణం పొదివినంత పదిలంగా పోషించి వెళ్ళిపోయాడు శేఖర్!

“కలడు కలండు అను వాడు కలడో లేడో!” అన్న నిత్య సంశయంలోకి నేను వెళ్లదలచుకోలేదు కాని, వుంటే, ఇదిగో – ఖాలిద్ హుస్సేనీ నవల The Kite Runners లో వొక పాత్ర అడిగినట్టుగా ఇలా అడగాలని వుంది…

When you kill a man, you steal a life. You steal his wife’s right to a husband, rob his children of a father. When you tell a lie, you steal someone’s right to the truth. When you cheat, you steal the right to fairness. Do you see?

మన మధ్యలోంచి వెళ్ళిపోయింది కేవలం వొక వ్యక్తి మాత్రమే కాదు, వొక కుంచె మాత్రమే కాదు. వొక నిజాన్ని నిజాయితీగా పలికే స్వరం. నిజానికి వున్న అనేక రూపాల్లో వొక రూపం!!

2014 

*

అఫ్సర్

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మంచి వ్యక్తి ని కళాకారుల న్ని పరిచయం చేశారు, అఫ్సర్ గారూ.

  • అస్సలామలైకుమ్ సార్ 🙏 అద్భుతమైన భావుకత నింపుకున్న మీ జ్ఞాపకాల పుటలలో దాగిన ఆర్ద్రత కలిగించే స్నేహ మాధుర్యం మరపురానిది సార్ మీ అనిర్వచనీయ రచనా శైలి అత్యద్భుతంగా ఉంది హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు. మీ మిత్రుని ఆత్మ కు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ 💐🙏💐🙏 💐🙏💐🙏💐🙏

  • నేను టీనేజ్ లో ఉన్నప్పుడు ఆయన కార్టూన్లు చూసి గీత భలే ఉందే అనుకునే వాణ్ణి. నాకు కార్టూన్ మీద మంచి అవగాహన వచ్చేనాటికి ఆయన గీత మాయమయింది.

  • శేఖర్ అంటే స్నేహ పరిమళం, తను నాకు కార్టూన్ల పరంగా చేసిన సహాయం చాలా వుంది.

    సాహిత్యం చదువుకోవడం, బహుజనవాదం, ప్రాంతీయ అస్తిత్వ స్పృహ, ఉద్యమాల పట్ల ఒక కన్సర్న్ వీటన్నిటి మేళవింపే శేఖర్ కార్టూన్లు, శేఖర్ అర్ధాంతరంగా వెళ్లిపోవడం విషాదం, తను ఈ సంక్షుభిత సమయంలో వుండి ఉంటే ఆలోచింపజేసే మంచి కార్టూన్లు వేసి వుండేవారు.

  • “మన మధ్యలోంచి వెళ్ళిపోయింది కేవలం వొక వ్యక్తి మాత్రమే కాదు, వొక కుంచె మాత్రమే కాదు. వొక నిజాన్ని నిజాయితీగా పలికే స్వరం. నిజానికి వున్న అనేక రూపాల్లో వొక రూపం!!” ఇంత గొప్ప కళాకారుడు , మహాశ్వేతదేవిని చదివిన శేఖర్ గారి గురించి పరిచయం చేయసినందుకు అబినందనలు అఫ్సర్ సాబ్.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు