చూడండి బాబూ… చూడండి

ఈసారి ఏదైనా రాసేటప్పుడు ఈ ఆకస్మిక ఆద్యంతాలు అనే టెక్నిక్ వాడాలి అని నిర్ణయం తీసుకోని రాయడం మొదలుపెట్టండిఈసారి ఏదైనా రాసేటప్పుడు ఈ ఆకస్మిక ఆద్యంతాలు అనే టెక్నిక్ వాడాలి అని నిర్ణయం తీసుకోని రాయడం మొదలుపెట్టండి

త రెండు భాగాలుగా నేను “చెప్పద్దు! ప్రదర్శించండి” అనే విషయం మాట్లాడుతున్నాను. గత పక్షం కలిసినప్పుడు పాఠకులని గౌరవించడంలో ఇది కూడా ఇక భాగమని చెప్పాను. పాఠకులు ఏ పుస్తకమైనా, ఏ కథైనా, ఏ వాక్యమైనా తరువాత ఏమిటి అనే చిన్న ఉత్సుకతతో చదువుతారు. రచయిత నేరుగా కథలోకి దూకి చెప్పడం వల్ల పాఠకులు “తమంతట తామే తెలుసుకోవడం” అనే ఆనందాన్ని కోల్పోతారు. ఇది రచనని పేలవంగా మారుస్తుంది. రచయిత పైన గౌరవాన్ని తగ్గిస్తుంది. ఇదంతా చెప్పి ఈ పొరపాటుని అధిగమించడానికి ఆరు సూత్రాలు చెప్తానని చెప్పాను. అందులో మూడు గత భాగంలోనే చెప్పాను. వాటిని స్థూలంగా చెప్తూ ఈ భాగం మొదలుపెడుతున్నాను.

  1. పాఠకుడి మీద నమ్మకం ఉంచండి: ఒక రచయిత అలవరచుకోవాల్సిన ముఖ్యమైన లక్షణాలలో ఒకటి, పాఠకుల మీద నమ్మకం ఉంచడం.
  2. ఇంద్రియానుభవాలను వర్ణించడం: వాచ్యంగా చెప్పేటప్పుడు కేవలం మనసులో ఏముందో చెప్తాము. మనసుని వదిలిపెట్టి పంచేంద్రియాలకు కనిపించేది, వినిపించేది, అనిపించేది చెప్పడమే ప్రదర్శన.
  3. సంభాషణ, పాత్ర ప్రవర్తన ద్వారా భావోద్వేగం: పాత్ర అంతర్గత స్థితిని చూపించే ఒక ఎక్స్-రే లా సంభాషణను వాడచ్చు. అసంపూర్తిగా వదిలే వాక్యం కూడా సంభాషిస్తుంది. మాట్లలో చెప్పని ఆ సంభాషణ ఒక పేజీ వివరణ కంటే ఎక్కువ విషయాలను ప్రభావవంతంగా వెల్లడిస్తుంది.

ఇవీ గత పక్షం చెప్పిన మూడు సూత్రాలు. మిగిలిన మూడు సూత్రాలు చెప్పే ముందు ఒక చిన్న కథా భాగం.

అపశృతి

ఎవరో ఆమె పేరు గట్టిగా అరిచినట్లు అనిపించి తన గదిలో నుంచి బయటికి వచ్చింది భాను. పెళ్లి మేళాన్ని ఎవరో ఆపమనట్లు ఒకటి రెండు అపశృతులు పలికి ఆగిపోయింది. పట్టుబట్టలు గరగరలాడుతున్నా పట్టించుకోకుండా స్టేజ్ మీద ఉన్న పూల డెకరేషన్ పక్కగా ఉన్న పెళ్లికొడుకు గది వైపు పరుగెత్తింది. సగం తలుపు తెరిచి ఉన్న ఆ గదిలో నుంచే మాటలు వినిపిస్తున్నాయి.

తలుపు తీసుకోని లోపలికి వెళ్తూనే అవాక్కై అక్కడే నిలబడిపోయింది. లోపల, ఆమె తండ్రి శివరాం చేతులు ప్రవీణ్ కాలర్‌ బిగించి పట్టుకోని ఉన్నాయి.

“నా ఇంటికే వచ్చి అంత మాట అంటావా?” శివరామ్ ఇలా అరవటం భాను ఊహ తెలిసి వినలేదు.

“థూ! ఇంటికొచ్చిన వాళ్లని నువ్వు ఎలా చూసుకుంటున్నావో కనపడుతూనే ఉంది. నా ఫ్యామిలీనే అవమానిస్తావా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు…” అతని చేతిలో ఉన్న దీపపు సెమ్మ పైన అతని పిడికిళ్లు బిగుసుకున్నాయి.

ఎనిమిది సంవత్సరాల ప్రేమ! వద్దన్న వాళ్లందరినీ ఒప్పించి చేసుకునే పెళ్లి. ఈ స్పృహ లెకుండా ఎలా మాట్లాడుతున్నాడు. క్షణంలో ఆమె మనసులో పుట్టిన ఆలోచన కళ్లలో నుంచి బయటికి వచ్చింది.

“ఆపండి!” భాను తడబడుతూ లోపలికి రావడంతో మిగిలిన జనం పక్కకి తప్పుకున్నారు. ఆమె వెనకే వచ్చిన ఆమె కజిన్స్ గోడకు అతుక్కుని నిలబడ్డారు.

ఎవరో “ఇంకెందుకు. సామాన్లు సర్దేయండి. బయల్దేరదాం” అని గొణిగారు.

“మామయ్యా, ప్లీజ్” ఇంకెవరిదో గొంతు బలహీనంగా బ్రతిమాలింది.

“వాడు ఆ ఉద్దేశంతో అనలేదు.”

శివరామ్ టక్కున తల తిప్పి ఆ మాట అన్న వ్యక్తి వైపు చూశాడు. అతని కళ్లు నిప్పుల్లా ఉన్నాయి. “ఆ ఉద్దేశంతో అనలేదా? ఇంకే ఉద్దేశ్యంతో అన్నాడు…?” అతను తనను తాను ఆపుకునే ప్రయత్నంలో, మాటలు మధ్యలోనే ఆగాయి.

భాను వారిద్దరి మధ్యకు వచ్చింది. ఆమె మాట్లాడటానికి ప్రాణమంతా గొంతులోకి లాక్కుంది. “ఏం… ఏం జరిగింది?”

నిశబ్దం. గుసగుసలు పొగలా వ్యాపించాయి. ఆడవాళ్ల గాజులు గలగలమన్నాయి. ముఖానికి పమిట అడ్డంపెట్టుకుని ఏడుస్తున్న ప్రవీణ్ తల్లి లోగొంతులో సమాధానం చెప్పింది. “ఏదో జోక్‌గా అన్నాడంట”

“జోకా? కులం గురించి.” ఎవరో వెంటనే అన్నారు.

శివరామ్ భుజాలు వాలిపోయాయి. అతను అకస్మాత్తుగా వృద్ధుడిగా మారిపోయాడు. “నా రక్తాన్ని చూసి నవ్వేవాడు నా కూతురు చెయ్యి పట్టుకోడానికి నేను ఒప్పుకోను.” ఆ మాట అంటూనే ఆ గదిలో నుంచి బయటికి నడిచాడు.

పైన కథా భాగం చదివారు కదా? ఒకసారి జరిగిన సంఘటనలని కాలమానం (chronological) ప్రకారం పెడితే ఏమౌతుందో చూడండి.

  1. భాను – ప్రవీణ్‌ల ప్రేమ వివాహం.
  2. పెళ్లి మంటపంలో అందరూ పెళ్లికి సిద్ధమౌతున్నారు.
  3. ప్రవీణ్ శివరాం కులం గురించి ఒక మాట తూలాడు.
  4. మాట మాట పెరిగి ప్రవీణ్ శివరాం మధ్య పెద్ద గొడవైంది.
  5. శివరాం కాలర్ పట్టుకున్నాడు. ప్రవీణ్ ఆవేశంగా దీపపు సెమ్మ అందుకున్నాడు.
  6. కలకలం వినిపించి శృతి పరుగెత్తుకుంటూ ఆ గదిలోకి వచ్చింది. జరుగుతున్నది చూసి అవాక్కైంది.
  7. పెళ్లి రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు శివరాం.

ఇదీ వరుస. మొత్తం ఏడు పాయింత్లు ఉన్నాయి కదా? ఆ పాయింట్లలో ఉన్న విషయం పాఠకులకి ఏ వరుసలో అర్థమైందో చెప్పగలరా? ఒక కాగితం తీసుకోని పైన ఇచ్చిన కథా భాగం మళ్లీ చదువుతూ, ఈ ఏడు పాయింట్లు ఏ వరుసలో తెలుస్తున్నాయో చూడండి. మీ వరుస బహుశా ఇలా ఉండే అవకాశం ఉంది – 2, 1, 6, 5, 4, 3, 7

క్రోనలాజీ ప్రకారం కథ చెప్పట్లేదు అంటే ఇది నాన్‌లీనియర్ నరేషన్. (దాని గురించి మరెప్పుడైనా). కానీ ఇక్కడ చూడాల్సింది అది అది లీనియరా, నాన్‌లీనియరా అని కాదు. జరిగిన కథని నేరుగా ఒకటి నుంచి ఏడు అని చెప్పకుండా, ప్రదర్శించేందుకు వాడిన విధానం చెప్పుకోవాలి. దానికి నేను పెట్టుకున్న పేరు – ఆకస్మిక ఆద్యంతాలు

ఆకస్మిక ఆద్యంతాలు

అంటే ఏం లేదు. పాఠకులని ఒక సన్నివేశంలోకి అది జరుగుతుండగా తీసుకెళ్ళి, అది అయిపోకముందే తీసుకొచ్చేయడం.  మన జీవితంలో కూడా ఏదీ ఇంట్రడక్షన్‌తో మొదలై, అద్భుతమైన ముగింపుతో పూర్తికాదు. (పనికట్టుకుని చేసే పెళ్లి చూపులు, కార్పొరేట్ ఇండక్షన్లు లాంటివి మినహాయింపు. అక్కడ కూడా పెళ్లి కూతురు ఆకస్మికమే, కల్చర్ ఆకస్మికమే). ఆకస్మిక సంఘటనలతో నడిచే నిజ జీవితాన్ని కథలో ప్రతిబింబించాలి కదా? ఒక వేళ అది పెళ్ళి చూపులు సన్నివేశమైనా, పాఠకుడిని పెళ్ళి కొడుకుతో పాటే కార్ దింపి,  లోపలికి తీసుకెళ్లి ఇల్లంతా చూపించి, కూర్చీలో కూర్చోబెట్టి మొదలుపెట్టక్కర్లేదు. చెప్పదల్చుకున్న పాయింట్ ‘ఆ అమ్మాయి అబ్బాయి మధ్య కెమిస్ట్రీ కుదిరింది’ అని అయితే నేరుగా వాళ్లిద్దరూ మేడ మీద పిట్టగోడకి ఆనుకుని మాట్లాడుకుంటున్న సన్నివేశం దగ్గరకి పాఠకులని తీసుకెళ్లచ్చు.

పైన ఇచ్చిన కథా భాగంలో పాఠకులు భానుతో పాటే ఉన్నారు. పెళ్లి కొడుకుతో శివరాం గొడవ పడుతున్న విషయం భానుకి ఎలా తెలియదో అలాగే పాఠకులకి కూడా తెలియదు. గదిలోకి అడుగుపెట్టగానే ఆమె ఎలా అవాక్కైందో పాఠకులు కూడా అలాగే అవాక్కైయ్యారు. అసలు ఏం జరిగింది అనే ప్రశ్న పెళ్లి కూతురిలో మొదలైనప్పుడే పాఠకుల మనసులో కూడా ఉత్పన్నమైంది. ఆమె ఏం జరిగిందో తెలుసుకున్న వరుసలోనే పాఠకులు కూడా తెలుసుకున్నారు. ఇలా కాకుండా నేరుగా నేపథ్యాన్ని చెప్పేస్తూ, ఒకటి నుంచి ఏడు అని కథ చెప్తే అది పేలవంగా ఉండేది. పైన చెప్పిన విధానం ఉపన్యాసం లేకుండా సన్నివేశాన్ని పాఠకులకు పరిచయం చేసి, ఏదో సంఘర్షణ జరిగిందనే ఊహ ఊహగా మొదలై, క్రమంగా అది నిజమని నిర్థారణ అయ్యింది.

పాఠకులను ఒక సన్నివేశంలోకి అర్థాంతరంగా లాక్కొచ్చి నిలబెట్టడం, ఎలాంటి వివరణ లేకుండా సందర్భం తనంతట తానే వెల్లడి అయ్యే పరిస్థితిని కల్పిస్తుంది. అంతే అర్థాంతరంగా వాళ్లని వెనక్కి తీసుకురావటం వల్ల వాళ్లు సారాంశం చెప్పకుండా పర్యవసానాన్ని గ్రహిస్తారు. ఇలా మధ్యలో వెళ్లి మధ్యలో వచ్చేయడం రచనలోకి తీసుకొచ్చిన మరుక్షణం, చెప్పడం తగ్గి ప్రదర్శన మొదలౌతుంది.

ఇలా సన్నివేశం మధ్యలో ప్రవేశించడం వల్ల మరో ప్రయోజనం ఉంది. అది సంభాషణను పదునుగా ఉంచుతుంది. మీకు గుర్తుందా? గతంలో ఒక ఎపిసోడ్‌లో నేను కథలో పాత్రలు తమలో తాము మాట్లాడుకుంటున్నట్లు పాఠకులతో మాట్లాడటం గురించి చెప్పాను. సుదీర్ఘ పరిచయం ఉన్న పాత్రలు చరిత్రని మళ్ళీ మళ్లీ చెప్పుకోరు. “నీకు తెలుసు కదా సుందర్. మనబ్బాయి 10థ్ రెణ్డుసార్లు తప్పాడు.” అని భర్య భర్తతో చెప్పదు. ఎందుకంటే సదరు భర్త కూడా ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. కొడుకు టెంత్ పాసా, ఫెయిలా అన్నది ఆయనకి కూడా తెలుసే ఉంటుంది. ఈ సమస్యని అధిగమించడానికి కూడా ఈ ఆకస్మిక ఆద్యంతాలు టెక్నిక్ పని చేస్తుంది.

అయితే ఒక సమస్య ఉంది. సన్నివేశం మధ్యలోకి పాఠకులని తీసుకెళ్లినప్పుడు వాళ్లని మరీ అగమ్య గోచరంగా వదిలెయ్యకుండా అవసరమైన సూచనలను ఇస్తూ కథని నడపాలి. మాటలు, సంజ్ఞలు, నేపథ్యం మొదలైన వాటి ద్వారా, సూచనలు ఇస్తున్నామని తెలియకుండా, జాగ్రత్తగా ఇస్తూ ముందుకు తీసుకెళ్లాలి. అప్పుడే పాఠకులు డిటెక్టివ్‌లుగా మారి కథని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు.

ఇది ఎలా అలవాటు చేసుకోవాలి? ఈసారి ఏదైనా రాసేటప్పుడు ఈ ఆకస్మిక ఆద్యంతాలు అనే టెక్నిక్ వాడాలి అని నిర్ణయం తీసుకోని రాయడం మొదలుపెట్టండి. ఒక సన్నివేశం నిజంగా మొదలైన కొద్దిసేపటి తరువాత ఏం జరుగుతోందో రాయడం మొదలుపెట్టి ఆ సన్నివేశం ముగిసే లోపల బయటికి వచ్చేయండి. ఆ తరువాత ఆ రాసింది మళ్లీ చదివి వాచ్యంగా చెప్పిన వివరణలను ఏమైనా ఉంటే తీసెయ్యండి. ఇది ఇలా చెయ్యబోతున్నాను అని ముందే అనుకుని రాయడం మొదలుపెట్టారు కాబట్టి, పాఠకులకి కావాల్సిన సమాచారం అక్కడక్కడా ఇచ్చే ఉంటారు. ఒకవేళ అలా చేసి ఉండకపోతే పాఠకులకి ఏమేం తెలియాలో అవి నేరుగా కాకుండా పాత్రల మాటల ద్వారా, సంకేతాలు ద్వారా చెప్పే ప్రయంతం చెయ్యండి.

ఇలా రాయటం వల్ల కథలో వేగం, ఉత్కంఠ పెరుగుతాయి. పాఠకుల ఊహించే సామర్థ్యాన్ని ఈ ప్రక్రియ గౌరవిస్తుంది. దాని ఫలితంగా రచయితకు, రచనకు గౌరవం దక్కుతుంది.

ప్రదర్శనకి అనువైన ఇతర అవకాశాలు

ఇప్పటికే మీతో చర్చించిన నాలుగు విధానాలు కాకుండా మీ జానర్, సందర్భం, ఎంచుకున్న శైలీ శిల్పాలనుబట్టీ మీరు రాస్తున్నప్పుడు ప్రదర్శనకి చాలా అవకాశాలు వస్తాయి. అవన్నీ form కి సంబంధించినవి. ఇలాంటివి రాసేటప్పుడు కాకపోయినా మళ్లీ చదివి రివ్యూ చేస్తున్నప్పుడు కూడా గుర్తించి, ఆ మార్పులు చేసి సాధించవచ్చు.

“ఆ పరుగు ఆగలేదు. పడ్డాడు. లేచాడు. మళ్లీ పరుగెత్తాడు. సైరన్ చప్పుడు దగ్గరౌతోంది”

“విస్తారంగా పరుచుకుని ఉన్న పచ్చటి మైదానంలో, చల్లటి గాలి, సన్నటి వాన తుంపర మధ్య ఆమె వేసిన ఒక్కో అడుగు జ్ఞాపకాలలో ఒక్కొక్క పుటని తెరుస్తున్నాయి”

పై రెండు వాక్యాలలో tempo గమనించారా? పాత్ర మనోస్థితిని, సందర్భాన్ని/సన్నివేశాన్ని రచయిత వ్యాఖ్యానం అవసరం లేకుండానే పాఠకులకి అర్థమయ్యేలా చేసే ప్రదర్శన ఇది. ఇంకొకటి చూద్దాం –

 

ఒక టీ చెప్పి ఆమె కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను. రాలేదు.

సిగరెట్ తీసుకున్నాను. రాలేదు.

కాఫీ. రాలేదు.

క్రేన్ వక్కపొడి. రాలేదు.

ఇంకో సిగరెట్. రాలేదు. రాలేదు. రా.. లే.. దు.

 

ఇది చదువుతుంటే మీకేమనిపించింది. పాత్ర తాలూకు చిరాకు మీకు అందుతోందా? ఎలా? చెప్పిందే చెప్పడం. వాక్య నిర్మాణం. ఒక పేరగ్రాఫులా కూడా రాయదగ్గ కంటెంట్‌ని ఒక లైన్ కింద మరో లైన్ రాసిన విధానం. ఇవన్నీ పాఠకులకి కథ నేరుగా చెప్పని ఎన్నో విషయాలను ప్రదర్శిస్తాయి. ఇందులో ఒక rule breaking కూడా జరిగింది గమనించారా?

“రాలేదు” అనే పదాన్ని మళ్లీ మళ్లీ చెప్పడం. సామాన్యంగా ఇలా ఒకే పదాన్ని మళ్లీ మళ్లీ చెప్పడం సరైన పని కాదని (ముఖ్యంగా పద్య సాహిత్యంలో) శాస్త్రం చెప్తుంది. పునరుక్తి దోషం అని అంటారు. కానీ పాత్ర మనఃస్థితి పాఠకులకు తెలిసేలా చెయ్యడానికి శాస్త్రంలో ఈ సూత్రాన్ని బద్దలు కొట్టడమే రచయిత ఇక్కడ చేసిన తెలివైన పని. దీనిని ప్రత్యేకంగా చెప్పిన కారణం ఏమిటంటే రచన ఇలా చెయ్యాలి, అలా చెయ్యలి అని చాలా రూల్స్ ఉండచ్చు. కానీ అవేమిటో తెలిసుకున్న రచయిత, రచన అవసరాన్ని బట్టి, పాఠకులలో ప్రత్యేకమైన భావోద్వేగాన్ని కల్పించడానికి ఆ రూల్స్ తిరస్కరించినా తప్పులేదు. వ్యక్తిగతంగా, ఒక పాఠకుడిగా, నేను అలాంటి రచయితని గౌరవిస్తాను.

ఇప్పుడు చెప్పినవన్నీ రాసేటప్పుడే ఒక ఫ్ళో లో వచ్చేస్తాయని నేను చెప్పట్లేదు. రెండోసారి చదివేటప్పుడు నేను రాసిన వాక్యాల ద్వారా కథ చెప్తున్నానా? ప్రదర్శిస్తున్నానా? అని ప్రశ్న వేసుకుంటూ చదవండి. ఎక్కడైనా భావోద్వేగాలని పాఠకులకి ప్లేట్‌లో పెట్టి ఇస్తున్నానా అని చూసుకుంటూ వెళ్లండి. చాలాసార్లు చప్పగా ఉన్న భాగాలను గుర్తించడానికి, వాటిని మార్చడానికి ఈ పని ఉపయోగపడుతుంది. అలాంటి సందర్భాలు గుర్తించగలిగితే, “పాఠకులను అనుభూతి చెందేలా ఒక ఈ సన్నివేశాన్ని ఎలా చిత్రీకరించాలి?” అని ప్రశ్నించుకోండి. క్రమంగా ఈ ఆలోచన అలవాటైతే మొదటి ద్రాఫ్ట్‌లోనే ఈ జాగ్రత్తలు తీసుకోగలుగుతారు.

పాఠకులకి సవాల్!

చివరిగా ఒక ముఖ్యమైన విషయం. “చెప్పద్దు. ప్రదర్శించండి” అనేది చాలా కీలకమైన సూత్రం అయినప్పటికీ, పూర్తిగా ప్రదర్శనే చేస్తూ వెళ్తే కూడా సమస్యలు వస్తాయి. ఇంతకు ముందు నేను చెప్పినట్లు పాఠకులు అర్థం చేసుకోవడం, (ఏం జరిగిందో / జరగబోతోందో) కనిపెట్టడం లాంటి అనుభూతుల కోసం పుస్తకం చదువుతుంటే, పుస్తకం అంతా కనిపెట్టడం అనే పని మాత్రమే పాఠకులకి అప్పగిస్తే, వాళ్లు అలిసిపోయే ప్రమాదం ఉంది. ఎవరైనా పజిల్స్ పుస్తకం మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఒకే సిటింగ్‌లో చదవడం చూశారా? గాలిలో తేమ ఎంతుందో, అతని కళ్లలో ఎరుపు ఎంతుందో, కాఫీ కప్పు మీద ఎన్ని ఈగలు ఉన్నాయో చెప్తాను, అతను ఎంత బాధలో ఉన్నాడో కనుక్కో అని పాఠకుల మీదకి సవాలు విసరడం అనుకున్న ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. ఒక క్షణం క్లోజ్-అప్‌ చెప్పే కథలు కొన్ని ఉంటాయి, లాంగ్ షాట్ వైడ్ లెన్స్‌లో రెండు పాత్రలు నడుచుకుంటూ మాట్లాడుకునే కథలు కొన్ని ఉంటాయి. ఈ రెండిటికీ తేడా తెలుసుకుని – ఎక్కడ చెప్పాలో ఎక్కడ ప్రదర్శించాలో కనిపెట్టడంఏ రచయిత ప్రతిభ. కథ కదులుతూ ఉండాలి. పాఠకులు ఆ కథ చెయ్యిపట్టుకోని నడుస్తూ ఉండాలి. కథ పరుగెత్తి వెళ్లిపోయినా, నత్త నడక నడుస్తూ ముందుకు వెళ్లకపోయినా పాఠకులు చెయ్యి వదిలేస్తారు. ఈ రెండిటికీ తేడా అభ్యాసం ద్వారా నేర్చుకోవచ్చు. అభ్యాసం కన్నా బాగా పని చేసేది పఠనం.

***

మనం మళ్లీ కలిసినప్పుడు మాట్లాడుకోడానికి ఈ కథ చదవండి. మీకు ఎక్కడైనా ఏదైనా లోపం అనిపిస్తే చెప్పండి.

కాలయంత్రం

“నాన్నా టీవీ ఎప్పుడు కొంటావు నాన్నా!” జానకి అడిగింది వాళ్లనాన్నని

రేడియోలో అద్దంకి మన్నార్ చదువుతున్న వార్తలు వినే ధ్యాసలో వున్న చంద్రయ్య ఆ మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు.

“ఛీ నాన్న ఎప్పుడూ ఇంతే” అనుకుంటూ ఇంటి బయటకు నడిచింది. ఇల్లు దాటి నాలుగడులు వేస్తే పెద్ద వేప చెట్టు. అక్కడే చంద్రయ్య పెద్దబాడిస పెట్టుకోని ఊర్లో రైతులందరికీ నాగళ్లు చెక్కుతాడు. నాగలి చెక్కేటప్పుడు చెక్క కదలకుండా వుంచడానికి అడ్డంగా పాతిపెట్టిన చక్కను ధాటి అంటారు. వెళ్లి దాని మీద కూర్చుంది జానకి.

“ధాటి అంటే మనకు అన్నం పెట్టే దేవతే దాని మీద కూర్చోకు” అంటాడు చంద్రయ్య ఎప్పుడూ. ఇప్పుడు దాని మీద కూర్చోగానే ఆయన మాట ఎదిరించిన ఆనందం కలిగింది జానకికి.

అక్కడే కూర్చోని జానకి కాలేజీలో తనతో పాటు చదువుకునే శ్రీకాంత్ గురించి ఆలోచించింది. “భలే వుంటాడు” అనుకుంది. ముఖ్యంగా ఆ తెల్ల చొక్కా నీలం రంగు జీన్స్ వేసుకోని బైక్ మీద వస్తుంటే…

“జానకీ” చంద్రయ్య అరుపుకి ఉలిక్కిపడి చటుక్కున లేచి నిల్చుంది జానకి. “నీకు ఎన్నిసార్లు చెప్పాను. ధాటి మీద కూర్చోవద్దని? దిగు ముందు” ఆయన అరవడం పూర్తికాక ముందే జానకి కళ్లలో నీళ్లు తిరిగాయి. భోరుమంటూ ఏడుస్తూ లోపలికి పరుగెత్తింది.

చంద్రయ్యకి కూడా బాధేసింది. “అంత గట్టిగా అరవకుండా వుండాల్సింది. పిచ్చిపిల్ల కాలేజీకి వచ్చిందన్నమాటే కానీ ఇంకా పసిపిల్లలాగే ప్రవర్తిస్తుంది. ఎలాగైనా బాగా చదివించి ఇంజనీరుని చెయ్యాలి. ఏ అమ్రికానో ఇంకో దేశమో వెళ్లాలి నా కూతురు.” అనుకున్నాడు.

“కానీ ఎలా? పాపం అది ఒక టీవీ కొనివ్వమంటే కొనివ్వలేకపోతున్నాను. దాన్ని అంతంత చదువులు చదివించగలనా?” ఈ అనుమానం వేధిస్తుండగా వేప చెట్టు మొదట్లో కూర్చున్నాడు చంద్రయ్య.

*

అరిపిరాల సత్యప్రసాద్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు