ఇంద్రధనస్సులో ఏడే రంగులని
ఎవరన్నారు?
ఇన్ని వందల రంగులు ఇలా విప్పారుతుంటే
ఇక్కడేదో కవితానాట్యసంగీత లాస్య కూజితాల
సమ్మేళనమేదో జరుగుతున్నట్లుంది
ఒక ఆల్చిప్పలో పూచేదొకటే ముత్యమని
ఎవరన్నారు?
ఇన్ని వేల స్వాతిముత్యాలు
ఇలా మిలమిలలై దొర్లుతుంటే
ఇక్కడేదో సంపెంగధారల జలపాతం
దివ్యశోభలు పోతున్నట్లుంది
భువి మీద దివి విరగబూయదని
ఎవరన్నారు?
ఆదితేయలోకాలన్నీ ఇక్కడికే దిగొచ్చినట్లు
పురి విప్పుకున్న ఇన్నిన్ని చిట్టి నెమళ్ల తిరునాళ్లలో
అన్నన్ని లేతలేత పాదాల దీవెనలతో
నేలనేలంతా చిదిమి దీపాలు పెట్టుకున్నట్లుంది
***
అడుగుపెడుతూనే కాళ్లకు, కళ్లకు
అంగుళమంగుళం అడ్డుపడుతున్న
సీతాకోకల రెక్కల్లోంచి వీస్తున్న ఈ గాలిని
పీలుస్తుంటే ప్రాణం లేచొచ్చినట్లుంది
కాస్త వడలినట్లున్నా ఈ పారిజాతాలు
కిలకిలల గలగలల సుగంధాల్ని విరజిమ్ముతుంటే
జలజలా పూలు రాలుతున్న చెట్టు కింద
పుప్పొడి స్నానాలు చేస్తున్నట్లుంది
పగటివేళలోనూ విరగకాస్తున్న పాలవెన్నెల్లో
బుడుంగున మునిగి తేలినట్లుంది
***
అప్పటిదాకా గుట్టుగా గుబురులో ఒదిగిన చిలుకలు
ఒక్కుదుటున చెట్టు మీంచి లేచి
ఎగిరిపోతున్నట్లున్న ఈ సవ్వడిలో
వేలవేల వీణలు, సితారులు
పెనవేసుకుని రాగాలు పొంగులెత్తుతున్నట్లు –
కేరింతల కెరటాలు ఉప్పొంగుతున్న
ఈ స్వరశాలలో ఎంతెంత తీయని ఉప్పెన
పొద్దునెప్పుడో దిగివచ్చిన
ఎవరెవరో చిట్టి దేవతలు
అప్పటిదాకా ఆ కాస్త యాగభూమిలో
వాణీహోమం జరిపి జరిపి
పంచకళ్యాణుల మీద తిరుగుపయనమై పోతూ
ఆశీర్వచనాలు పలుకుతున్నట్లు
గుప్పిళ్లకొద్దీ పంచుకుంటూపోతున్న
పులకింతల పొద్దుల నిండా
ఎంతెంత పన్నీటి వాన
***
పాపం, కాసేపట్లో ఈ చెట్టు
ప్రాణవాయువునెవరో తోడుకుపోయినట్లు
నిశ్చలమైపోతుంది
బిడ్డలనెవరో లాక్కుపోయిన తల్లిలా
తల్లడిల్లిపోతుంది
అయితేనేం –
ఇప్పటికిప్పుడు మాత్రం
బొమ్మలకొలువులోని బొమ్మలన్నీ ఊపిరిలూదుకుని
ఎక్కడెక్కడి సంరంభాన్ని ఎత్తుకొచ్చి
సభదీరుస్తుంటే
ఇప్పటిదాకా ఎరగని మురిపాల జలతారు మీద
లోకమంతా ఊరేగుతున్నట్లుంది!
ఈ సిరిమువ్వలు చిలికిచిలికి పోస్తున్న జీవనోత్సవంలో
భువనమంతా ఉబ్బితబ్బిబ్బైపోతున్నట్లుంది!
*
చిత్రం: పఠాన్ మస్తాన్ ఖాన్
|
మకరంద సముద్రం లో ఈదు తున్నట్టుంది !
ధన్యవాదాలు