చీకటిని వెలుగుగా మార్చుకున్న ఒక దీపం కథ!

సారూప్య అంతరంగాలు: ఆగస్టు 27 నంబూరి పరిపూర్ణ గారి 92 వ పుట్టిన రోజు ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

ట్టిలో ఉండి, నీటిని పీల్చి, సూర్యకాంతిని అందుకునే విత్తనం… మట్టిగా మారి పోతుందా? పోనీ నీటిగా? మరి కాంతిగా మారిపోతుందా? దేనిగానూ మారదు. ఈ మూడింటి సారాన్ని గ్రహించి, ‘తనదైన’ మొక్క పదార్థంగా మార్చుకుని మొలకెత్తు తుంది. అచ్చం విత్తనంలాగే… ఎటువంటి పరిస్థితులు చుట్టూ ఉన్నాసరే, వాటి నుండి ఎదుగుదలకి సానుకూలంగా ఉండే సారాన్నే గ్రహించి… మొలకెత్తి, మహావృక్షం అయింది.

మట్టి…

పడమట దిక్కున తొలి చుక్క పొడుస్తున్న వేళ… బండారిగూడెం నుండి రెండు ఒంటెద్దు బళ్లు బయలుదేరాయి. చీకటిపడేలోపు అవి కృష్ణవరం చేరుకోవాలి. వాటినిండా తెరలు, వాయిద్యాలు. వాటి వెనక నటులు, వంత పాటకులు నడుస్తున్నారు. వారి వెనక రహస్యంగా ఒక తుంటరిపిల్ల. ఆ పిల్ల తమని వెంబడిస్తోన్న విషయాన్ని కృష్ణవరం పొలిమేర దాకా కనిపెట్టలేకయింది ఆ నాటక బృందం. చిన్న పిల్ల… అదీ ఆడపిల్ల… ఒంటరిగా, అలా చెప్పాపెట్టకుండా చీకటివేళ… ఊరి వదిలి రావటం చూసి కోప మొచ్చింది వారికి. కానీ పాపం కని పెంచిన ప్రేమాయే. కోపం రెండు నిమిషాలు కూడా నిలవలేదు. ఏళ్ల తరబడి వాళ్లు సాధన చేసి నేర్చుకున్న పద్యాలు, పాటలన్నిటినీ నిండా ఏడేళ్లు లేని ఆ బుజ్జితల్లి పాడేయగలదు. ఆ వయసుకే అంతటి నేర్పు, అంతటి ధైర్యం. మరింకేం చేస్తారు? ఆ రాత్రి వేయబోతున్న ‘హరిశ్చంద్ర’ నాటకంలో లోహితుడిని చేశారు.

నక్షత్రాల పందిరి కింద నిలబడి ఆ రాత్రి… ‘అయ్యలారా, నేను ఆకులు కోయంగా పుట్టలోని పాము పట్టి కరిచె, విషము తలకెక్కే. నేను జీవించనయ్యా, కడకిదే మీకు నా నమస్కారమయ్యా!’ అని లోహితుడిగా నటించి, పాడిన ఆ చిట్టితల్లి మన తెలుగు సినిమా ఇండస్ట్రీ తొలితరం స్టార్‌.

నీరు

కొత్త చివుర్లు వేసే మార్చి నెల. పన్నెండేళ్ల పాప ఒక్కతే విజయవాడ నుండి మద్రాసు రైలెక్కింది. శతాబ్దాల క్రితం కాల్చిన శంఖు చక్రాలని భుజాల మీద ముద్రలుగా వేయించుకుని, వైష్ణవంలోకి మారిన సాంఫిుక, చారిత్రక మూలాలు ఉన్న కుటుంబం ఆ చిన్నారిది. అలాంటి పిల్ల ఆరోజు భుజాల మీద సుత్తి, కొడవలి గుర్తులుండే కమ్యూనిస్టు జండా ధరించి ఒంటరిగా ప్రయాణం చేస్తోంది, చదువు కోసం. జంకూగొంకూ లేదు, భవిష్యత్తు మీద ఆశ తప్ప. ఆ జండాను చూసే ఆమె మార్గదర్శి దర్శి చెంచయ్యగారు గుర్తుపట్టి, స్కూల్లో చేర్చాలి మరి.

చదువు కోసం ఊరు కాని ఊరిలో, వేరే భాష మాట్లాడేచోట హాస్టలులో చేరింది. మూడోరోజే అక్కడున్న అసమానతలని, కులభేదాలని ప్రశ్నించింది, పన్నెండేళ్లకే ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరేసిన ఈ చిన్నారి. టీనేజ్‌లోనే కమ్యూనిస్టు పార్టీలో చేరి, స్వేచ్చ కోసం, సమానత్వం కోసం… ఎన్నో పోరాటాలు చేసి, అరెస్టులని ఎదుర్కొన్న తొలితరాల దళిత బాలిక.

సూర్యకాంతి

‘అసలీ యుద్ధానికి కారకులెవరు? సోషలిస్టు రష్యాను దెబ్బతీయడానికి హిట్లరును గొప్ప హీరోగా రూపుదిద్ది, రెచ్చగొట్టి యుద్ధోన్మాదిగా మార్చిందెవరు? అమెరికా, బ్రిటన్‌లు కాదా? ఈ యుద్ధం వల్ల హిట్లర్‌ చేతిలో లక్షలాది యూదులు, కోట్లాది ప్రజలు మరణించడానికి కారణం వీళ్లు కాదా? మనబోటి దేశాల కోసం, ప్రజల కోసం ప్రారంభించారా ఈ యుద్ధాన్ని? ఇలాంటి దేశాల యుద్ధనిధికి మనమెందుకు సహాయం చేయాలి సార్‌?’ అని మహాకవి జాషువాతో వాదనకి దిగింది. అప్పటికి ఆమె వయసు పదమూడేళ్లు. ఆ మహాకవి ముచ్చటపడి, ‘ఈ వయసులో ఇవన్నీ ఎలా తెలసుకున్నావమ్మా?’ అని ఆశ్చర్యపోయారు. అమ్మ దగ్గర నుండి భారత, భాగవతంలాంటి పురాణాలు; చెంచయ్య గారింట్లో, మహీధర గారింట్లో ఉన్నప్పుడు కమ్యూనిస్టు సాహిత్యం, మార్క్స్‌, లెనిన్‌ల రచనలు, గురజాడ, చలం, జాషువా, విశ్వనాథ, బాలాంత్రపు రజనీ, కృష్ణశాస్త్రి లాంటి వారి లలితగీతాల సాహిత్యం, న్యూస్‌పేపర్‌తో సహా ఏదీ వదలకుండా చదవటం అలవాటు చేసుకున్న ఆమె… ఆత్మకథ రాయగల చరిత్ర ఉన్న, రాసిన గుప్పెడు మంది తెలుగు మహిళల్లో ఒకరు.

కుటుంబం నుండి నాటకం, పద్యం నేర్చుకున్నా ఆర్టిస్టుగా మిగిలిపోలేదు. పార్టీ నుండి, చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి పోరాటస్పూర్తిని అలవాటు చేసుకున్నా… కేవలం ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా మిగిలిపోలేదు. సాహిత్యం పట్ల అభిరుచి ఉన్నా.. రచయిత్రిగా మాత్రమే మిగలిపోలేదు. వీటన్నిటి నుండి సారాన్ని గ్రహించి, నేర్చుకుని.. వాటిని తనదైన ‘పరిపూర్ణత’గా మలచుకుంది.. నంబూరి పరిపూర్ణ. ముందే ఊహించి పేరు పెట్టారేమో అనిపిస్తుంది ఆమెని చూస్తే.

వ్యక్తిగతమంతా రాజకీయమే అని ఫెమినిస్టు స్టడీస్‌లో ఒక మాట ఉంటుంది. ఈ రాజకీయ అభిప్రాయాన్ని పక్కన పెట్టి చూసినా పరిపూర్ణగారి వ్యక్తిగత జీవితం, రాజకీయ జీవితం, సామాజిక జీవితం… అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఆమె పుట్టిన తర్వాతే మన దేశం పుట్టింది. ఈ దేశంలో జరిగిన ప్రతీ మార్పుకీ, ప్రతీ మంచికీ, ప్రతీ చెడుకీ ఆమె ఒక సజీవ సాక్షి. ఆమె స్వీయచరిత్ర వెలుగుదారులలో… ఇప్పటి రెండు తెలుగు రాష్ట్రాలు నడిచిన దారులే. సంగీతం, సాహిత్యం, సినిమా, ఉద్యోగం, అన్ని రకాల అసమానతల మీద పోరాటాలు,  ఉద్యోగాలు… అన్ని రంగాలలో వచ్చిన మార్పులకి ఆమె జీవితకథ ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌. ఆమె తర్వాత రెండు తరాలు వచ్చాయి.

ఈ దేశం పుట్టుక చూసిన మొదటి తరం పరిపూర్ణగారు, మూడోతరం అపర్ణ ఇద్దరితో మాట్లాడి పోల్చి చూసుకోటం… ఇప్పుడు ఒక నెసిసిటీ. ఎన్ని అంశాల్లో ముందుకెళ్లాం? ఎన్నిటిలో వెనక్కెళ్లాం? ఎన్ని అంశాల్లో ‘రింగా రింగా రోజెస్‌’ ఆడుతున్నట్టు అక్కడక్కడే తిరుగుతున్నాం? అనేది కొలుచుకోటానికి, చెక్‌ చేసుకోటానికి పనికొచ్చే స్కేల్‌. అందుకే పరిపూర్ణ, అపర్ణలని కలిపి ఇంటర్వ్యూ చేసింది. బయోగ్రఫీ రాయాల్సిన విషయాన్ని ఇంటర్వ్యూ చేయటం పిచ్చి పని, కానీ తప్పని పని. కుదిరినంత తక్కువలో, పరిపూర్ణగారిలా ‘సారాన్ని’ గ్రహించి, వాక్యాల్లో పెట్టిన ఆ ఇద్దరు నడిచొచ్చిన దారులు, వాటి గుర్తులు, అనుభవాలు ఇవి.

*   *   *

1953 నాటి పార్టీ సహచరులతో పరిపూర్ణ, నాగభూషణరావు,పిల్లలు శిరీష అమరేంద్ర

క్కులు, అవకాశాలు ఉన్నాయన్న ఎరుక కూడా లేని స్త్రీల జీవితాలు పరిపూర్ణగారి కథలని బాగా ఇన్‌ఫ్లుయెన్స్‌ చేసాయి. ఇష్యూస్‌ దాదాపుగా బ్లాక్‌ & వైట్‌ ఉన్న కాలం అది. బహుశా అందుకే కావచ్చు ఆమె రచనల్లో ఎక్కువ external conflict కనిపిస్తుంది. బయట నుండి ఎదుర్కొంటున్న సమస్యకి ఆ పర్టికులర్‌ కేరెక్టర్‌ ఎలా రియాక్టవుతుంది? ఎలా అవ్వాలి? అనే దిశగా నడిచే కథలు ఎక్కువ శాతం. మార్పుని, సానుకూల వైఖరినే సూచిస్తాయి ఆమె కథలు, కథల సంపుటల పేర్లు కూడా. ఉంటాయి మాకు ఉషస్సులు, శిఖరారోహణ ఆమె కథాసంపుటాల పేర్లు.

ఈ దేశం గ్లోబలైజేషన్‌కు తలుపులు తెరిచిన కాలాన్ని చూసిన వ్యక్తి శిరీష. ఆర్థిక, సామాజిక, మానవ సంబంధాలన్ని hair pin turn తీసుకుంటున్న కాలం అది. ఆ కాలాన్ని, ఆ మార్పులని, ఆ సందిగ్ధాలని, మనిషి ఎకోసిస్టవ్‌లోని గ్రే షేడ్స్‌ని పట్టుకునే ప్రయత్నం ఉంటుంది శిరీషగారి కథల్లో. ఆమె కేరెక్టర్‌లకి external conflict ఉంటుంది. internal conflict కూడా ఉంటుంది. ఈ రెండిటి మధ్య చిక్కుకున్న ఆ కేరెక్టర్‌ పడే సంఘర్షణ ఆమె నెరేషన్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె కథలు మనోవీధి, కొత్త స్వరాలు అనే రెండు సంపుటాల్లో వచ్చాయి.

ప్రపంచాన్ని అరచేతుల్లో చూసే అవకాశం వచ్చిన కాలం అపర్ణది. ఎక్స్‌పోజర్‌తో పాటుగా సంక్లిష్టత కూడా పెరిగిన కాలం ఇది. సమస్యలు కొత్తవి. సవాళ్లు కొత్తవి. కొన్ని విషయాలు సింపుల్‌గా కనిపిస్తాయి. ఆలోచిస్తే, కాంప్లెక్స్‌ అనిపిస్తుంది. కొన్ని విషయాలు కాంప్లెక్స్‌గా కనిపిస్తాయి. కానీ సింపుల్‌ అయి ఉండచ్చు కూడా. ఈ రెండిటి మధ్య గ్రెడియంట్‌ని, ఒక కేరెక్టర్‌ తనకుండే internal conflictతో external conflictని ‘డీల్‌’ చేసే విధానాన్ని అపర్ణ తన కథల్లో చిత్రిస్తుంది. వ్యక్తిగత విషయాలకీ, సామాజిక విషయాలకీ మధ్య ఉన్న పనికిమాలిన లంకె ఎంత బరువో చెప్పే కథలే ఎక్కువ రాసింది అపర్ణ. ఆ కథల సంపుటి ‘బోల్డ్‌ & బ్యూటిఫుల్‌’. అదేకాక, అతి చిన్న వయసులో ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్‌ను అధిరోహించిన ‘పూర్ణ’ సాహస ప్రయాణాన్ని పుస్తకంగా రాసింది అపర్ణ.

ఒకరి రచనలపై ఇంకొకరి అభిప్రాయాలు, ఎదుర్కొన్న సవాళ్లు, ఒకరిని ఇంకొకరు అర్థం చేసుకున్న తీరులో డైనమిక్స్‌ చాలా ఉత్సుకత కలిగిస్తాయి.

కథల వైపు ప్రయాణం… కథావస్తువు…

పరిపూర్ణ: నేను మొదట్లో వ్యాసాలు, రేడియో ప్రసంగాలు రాసేదాన్ని. దాదాపుగా రిటైరయ్యే దశ వరకూ అంతే. అప్పటికే శిరీష కథలు రాస్తోంది. ఆ కథలకి వస్తున్న స్పందన, వాటి మీద జరుగుతున్న చర్చ చూశాక… ఏ సమస్య కానీ, ఏ అంశం కానీ వ్యాసాల కంటే కథల రూపంలో ఉంటేనే ఆసక్తిగా చదువుతారు, సారాంశం సులువుగా మనసులకెక్కుతుంది అనిపించింది. గ్రామాల్లో లైజాన్‌ ఆఫీసరుగా పనిచేయటంవల్ల నేను చూసిన స్త్రీల జీవితాలని, యథార్థ సంఘటనలు, సమస్యలనే కథలుగా రాయాలని నిర్ణయించుకున్నాను, రాశాను.

అపర్ణ: నా చిన్నప్పటి నుండే ఇంట్లో సాహిత్య వాతావరణం ఉండేది. అమ్మ, అమ్మమ్మ, మావయ్య అందరూ రచయితలే. డెఫెనెట్‌గా నేను రాయాలని అనుకోవటం వెనక వాళ్ల ఇన్‌ఫ్లుయెన్స్‌ ఉంది. నేను అర్బన్‌ ఏరియాస్‌లోని సోషల్‌ వర్క్‌ ప్రాజెక్ట్స్‌లో పనిచేశాను. కీప్‌ యువర్‌ అయిస్‌ & ఇయర్స్‌ ఓపెన్‌ అని బాగా వాడేవారు సోషల్‌ వర్క్‌ ట్రయినింగ్‌ ప్రోగ్రాముల్లో. ఆ ఇన్‌ఫ్లుయెన్స్‌ కూడా ఉంది నామీద. నేను చాలావరకు నాన్‌ జడ్జ్‌మెంటల్‌గా ఉంటాను. అందుకే నాతో కొందరు లోపలి విషయాలు షేర్‌ చేసుకుంటారు. దానివల్ల నాకు భిన్నమైన పర్‌స్పెక్టివ్‌ ఏర్పడింది. నా కథల్లో అదే రిఫ్లెక్ట్‌ అవుతుంది.

కుటుంబంలోని రచయితల రచనలు…

పరిపూర్ణ: మా అమ్మాయి శిరీష, అబ్బాయి అమరేంద్ర ఇద్దరూ రచయితలే. ఇద్దరికీ కీర్తికాంక్ష లేదు. అదే ప్లస్‌ పాయింటు. అమరేంద్ర కథలు రాసినా, ఎక్కువగా పర్యాటక రచనలే చేశాడు. ఒక ప్రత్యేకమైన లక్షణముంటేనే తిరగగలరు, రాయగలరు. మనకి ఈ తరహా రచనలు తక్కువనే చెప్పాలి. తనకుండే సహజమైన జిఙ్ఞాస, ఇంటరెస్టు వల్ల, పురుషుడు అవటంతో ప్రయాణించే వెసులుబాటు కూడా కొంత ఉండటం వల్ల ప్రపంచంలో చాలా దేశాలు తిరిగాడు. శిరీష నవలలు, ఎక్కువగా కథలు రాసింది. ఆమెను చూసే కథలు రాయటం మొదలుపెట్టాను. బాధితులు, పేదవారు, స్త్రీలు… ఎదుర్కొనే సమస్యల పట్ల ఆమెకి చక్కటి అవగాహన ఉండేది. విషయాన్ని సున్నితంగా, అర్థమయ్యేలా, మనసుకి హత్తుకునేలా రాయగలుగుతుంది. ఇక అపర్ణ కథలు ఈ తరం స్త్రీలవి. ఆ స్త్రీలు చేసే    ఉద్యోగాలు… వారి సమస్యలు అవీ. నాకు అంతగా అర్థం కాలేదు. పూర్ణ జీవితచరిత్రను ఇంగ్లీషులో రాసింది చదివాను. అది నాకు చాలా నచ్చింది. అసలు ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కడానికి ఎన్ని బాధలు పడింది అనే దానితోపాటు ఎటువంటి శిక్షణ పొందింది, ఎటువంటి పరికరాలు వాడిందిలాంటి సూక్ష్మమైన విషయాలని కూడా చాలా చక్కగా రాసింది. అంత ఓపికతోటి, పరిశీలనతోటి రాయటం… నాకెంతగానో నచ్చింది.

అపర్ణ: నా ప్రొటాగనిస్టులు ఎప్పుడూ ఐడియల్‌గా ఉండరు. వాళ్ల బలహీనతలే వాళ్లని డ్రైవ్‌ చేస్తాయి. ‘వాళ్లు ఎస్టాబ్లిష్‌డ్‌ వాల్యూస్‌ని ఎందుకు పాటించలేపోయారు,’ అనే దాన్ని స్టార్క్‌గా రాసేదాన్ని మొదట్లో. అమ్మ తన ప్రొటాగనిస్టులు ఆ వాల్యూస్‌తో కాంప్రమైజ్‌ అవ్వడానికి వాళ్లకున్న కారణాలేంటే ఎంపతైజ్‌ చేస్తూ, కన్విన్స్‌ చేస్తూ రాస్తుంది. అమమ్మ దగ్గరకి వచ్చేసరికి అలా కాదు. ఆమె టైంలో ఉన్నట్టుండి రాడికల్‌గా మార్పులు జరిగాయి. మనుషులు మంచి, చెడు, పీడితులు, పీడకులు అని బ్లాక్‌ & వైట్‌లో ఉంటుంది. అసలు… ముగ్గురం ఒకరికొకరం పర్‌పెండికులర్‌గా రాశాము అనుకుంటా నేను.

రాయటానికి ఎదురైన సవాళ్లు…

పరిపూర్ణ: నేను రేడియో వ్యాసాలే మొదట్లో రాసేదాన్ని. స్త్రీ సంక్షేమశాఖలో పనిచేయటం వల్ల, వారి సాధక బాధకాలు, సమస్యలు, పరిష్కారాలు… రోజంతా ఇవే నేను వినేది, ఆలోచించేది. అందుకే స్త్రీల అంశాలని వ్యాస రూపంలో రాయటానికి పెద్దగా సమయం పట్టేది కాదు. తర్వాత తర్వాత కథలు రాసేప్పుడు చాలా సమయం వెచ్చించాల్సి వచ్చేది. అప్పటికే ఉద్యోగ బాధ్యతలు పూర్తి అవటం, మా పిల్లలు అప్పటికే రచయితలు అవ్వటం వల్ల.. నాకు ఆ వెసులుబాటు దొరికింది. స్వీయచరిత్ర రాశాను అంటే… రాసే వీలు, వాతావరణం కలిగించటానికి మా పిల్లలు, కుటుంబం బాగా సహకరిస్తారు. మా అబ్బాయి అమరేంద్ర ‘ఇది రాయి…’, ‘ఇది బాగుంది…’ అని ఎంకరేజ్‌ చేస్తాడు. ప్రూఫ్‌ రీడింగ్‌ చేసి పెడతాడు. ఇప్పుడు నవల రాసే పనిలో ఉన్నాను.

అపర్ణ: స్త్రీ- భావకురాలిగా, ఆర్టిస్గిగ్గా ఉండటం అనేది ‘లగ్జరీ’. క్రియేటివిటి ఈజ్‌ ప్రొడ్యూస్‌డ్‌ ఓన్లీ ఎట్‌ సబ్‌కాన్షస్‌ లెవెల్‌. ఆడవాళ్లు ఆ సబ్‌కాన్షస్‌ లెవల్‌ జోన్‌లో ఎంతసేపు ఉండగలరు? మగవాళ్లకంటే ‘భార్య’ ఉంటుంది. ఆడవాళ్లకి భార్య ఉండదుగా అన్ని చేసి పెట్టడానికి. ఇంటి పని, వంట పని, పిల్లల పనీ.. అన్ని చేసుకోవాలి. వీటన్నిటి మధ్యా రాయటానికి ‘స్పేస్‌’ ఉండటం కష్టం. అందుకే మా ముగ్గురిలో.. అమ్మే రాసే టైం పెట్టడానికి ఎక్కువ కష్టపడింది అనిపిస్తుంది. అమమ్మ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసింది, వ్యాసాలు రాసేది. లేటర్‌ స్టేజ్‌లో కథల వైపు వచ్చింది. మొదట్లో అమమ్మకి వాళ్ల అమ్మ ససోర్టు ఉంది. అమ్మకి అలా లేదు. మళ్లీ నా దగ్గరకి వచ్చేసరికి హెల్పర్స్‌ని పెట్టుకునే వెసులుబాటు, జాబ్‌కి వెళ్లటానికి ట్రాన్స్‌పోర్ట్‌ కొంత ఈజీ అయింది. మళ్లీ… ఇలాంటి వెసులుబాటు సిటిలో ఉండి, జాబ్‌ చేసుకుంటూ ఉండే ఆడవాళ్లకే. ఆడవాళ్లు రాసే టైం పెట్టగలగటం అనేది మల్టిపుల్‌ ఫాక్టర్స్‌ మీద డిపెండ్‌ అయి ఉంటుంది.

రాతలకు ఎదురైన సవాళ్లు

పరిపూర్ణ: నన్ను రాయమని ఎంతోమంది ఎంకరేజ్‌ చేసేవారు. రేడియోవారు, వివిధ పత్రికల ఎడిటర్లు.. ‘రాయండి, మీ అనుభవాలు రాయాలి…’ అని చెప్పేవాళ్లు. తర్వాత తర్వాత కథలు రాసేటైంకి మా పిల్లల వల్ల, కొత్త తరం రచయితలు, రచయిత్రులు కూడా పరిచయం అయ్యారు. వాళ్లు కూడా సపోర్ట్‌ చేసేవారు. నా టైంలో స్త్రీ రచయితలు ఎక్కువగా లేరు. వాసిరెడ్డి సీతాదేవిగారు, రంగనాయకమ్మగారు మాత్రం ఏదన్నా బాగా రాస్తే, బాగుంది, ఇలాంటివి రాస్తూ ఉండు, ఎక్కువగా రాయాలి… అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎవరూ నా కథలని పెద్దగా విమర్శించలేదు. స్వీయచరిత్ర మీద విమర్శ అనను కానీ… బాగా చర్చ జరిగింది. ఇంకా రాస్తే బాగుంటుంది అన్న వాళ్లే ఎక్కువ.

రెబెల్ రైటర్ అపర్ణతో………..

అపర్ణ: అమ్మ రాయటానికి ఎక్కువ ఛాలెంజెస్‌ ఎదుర్కోవాల్సి వస్తే, ‘రాస్తున్న వాటికి’ మా ముగ్గురిలో నేను ఛాలెంజెస్‌ ఎక్కువ ఎదుర్కోవాల్సి వచ్చింది. అమ్మకి రీడర్స్‌ స్పందన తెలిసేసరికి వారం పట్టేది. కథ ప్రింట్‌ అయి, దాన్ని చదివి, దాని మీద పాఠకులు తమ స్పందన రాసి, పోస్టు చేసి, పత్రికల వాళ్లు సెలెక్టడ్‌ ఉత్తరాలని ప్రింట్‌ చేసి… అమ్మ చదివే టైంకి చాలా విషయాలు ఎమోషనల్‌ లెవల్లో ఫిల్టర్‌ అయిపోయేవి. మనకి ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఉండేసరికి… నా కథలకి వచ్చే రెస్సాన్స్‌ వెరీ ఇన్‌స్టెంట్‌. చదివిన వెంటనే స్పందించేస్తారు. కొన్నిసార్లు చదవుతూ చదువుతూ మధ్యలో ఆపి పోస్టో, కామెంటో పెట్టేస్తారు. నచ్చినా, నచ్చకపోయినా… తీవ్రస్థాయిలో రియాక్షన్‌ వచ్చినవి కూడా ఉన్నాయి. రెండు రకాల రియాక్షన్స్‌ని నేను బెటర్‌గానే హ్యాండిల్‌ చేశాను అనుకుంటున్నా. రైటర్స్‌ మాటకి వస్తే… నేను కథలు ప్రింట్‌కి పంపే ముందు అవినేని భాస్కర్‌, రిషి శ్రీనివాస్‌ లాంటి కొందరు ఫ్రెండ్స్‌కి పంపుతా. కొంత డిస్కషన్‌ జరుగుతుంది. రాయమని ఎంకరేజ్‌ చేసే వాళ్లు చాలా ఎక్కువమందే ఉన్నారు.

*   *   *

కాంగ్రెసులో గాంధీ, కమ్యూనిస్టు పార్టీ, వీళ్ల కంటే భిన్నమైన స్టాండ్‌ తీసుకుని, సానుభూతి బేసిస్‌ మీద కాకుండా, హక్కుల బేసిస్‌ మీద ఒంటరి పోరాటం చేస్తున్న అంబేద్కర్‌… వీళ్లందరి ఇన్‌ఫ్లుయెన్స్‌ ఆనాటి అభ్యుదయవాదులందరి మీదా ఉంది. పరిపూర్ణగారి పరిచయస్తులు, చదువుకోటానికి సపోర్ట్‌ చేసినవాళ్లు, ఉద్యోగం, రచనల విషయంలో సహాయం చేసిన వాళ్లంతా అభ్యుదయవాదులే. దాదాపుగా అగ్రవర్ణాలవారే. ఆ కాలానికి సపోర్ట్‌ చేయగలిగిన స్థితిలో వారే ఉంటారు కదా. పరిపూర్ణగారు 1949లో ‘వర్ణాంతర వివాహం’ చేసుకున్నారు. పైగా ‘డెన్‌’లో. దండల మార్పిడి పెళ్లి అది. కట్నం ప్రసక్తి లేకుండా, కులం పట్టింపు లేకుండా, ఆడంబరం అన్న ఊసే రానీకుండా కొంతమంది కామ్రేడ్స్‌ మధ్య పెళ్లి చేసుకునే సాహసం అప్పట్లోనే చేశారు. పరిపూర్ణగారి పిల్లలు ముగ్గురివీ కూడా మళ్లీ కులాంతర, ఆదర్శ వివాహాలే. వారి పిల్లలవి కూడా… అంటే మూడో తరానివి కూడా అలాంటి పెళ్లిళ్లే. పరిపూర్ణగారి మాటల్లోనే చెప్పాలంటే, ‘కులాల కలగూరగంప’ ఆ కుటుంబం. కులనిర్మూలనకి కులాంతర వివాహాల ఆవశ్యకతను అంబేద్కర్‌ ‘కులనిర్మూలన’ పుస్తకంలో చెప్పారు. మరి మూడు తరాల పాటు కులాంతర వివాహాలు చేసుకున్న ఈ కుటుంబం, కుల వివక్షని ఎంత ఎదుర్కొంది? కులం కంపల్ని ఎంతవరకూ దాటగలిగిందనేది అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెన్ట్‌ ఫేక్టర్‌.

చదువుకునే చోట…

పరిపూర్ణ: 1943లో దర్శి చెంచయ్యగారు నన్ను సేవాసదనం హాస్టలులో చదువుకోసం జాయిన్‌ చేశారు. అక్కడ ధనిక, అగ్రవర్ణ విద్యార్థినులకి వేరే గదులుండేవి. మేము తరగతి గదుల్ని, ఆ పెయిడ్‌ విద్యార్థినుల గదుల్ని శుభ్రం చేయడం; మేము మెస్‌ దగ్గర ఉన్న ఖాళీ జాగాలో తిని, ఆ విద్యార్థినుల గదులకి కారియర్లు తీసుకెళ్లడంలాంటి పనులు చేయాల్సి వచ్చేది. మూడు రోజులపాటు ఈ వివక్షని సహించాను. తర్వాత ఇక ఇక్కడ ఉండేది లేదని చెంచయ్యగారికి చెప్పగానే, ఆయన సేవాసదనం యాజమాన్యాన్ని తిట్టి, నన్ను రామకృష్ణమిషన్‌ వారు నడిపే శారదా నికేతన్‌లో చేర్చారు. ఉండటమేమో చెంచయ్యగారింట్లోనే. అక్కడ వారికి నేను సొంత బిడ్డనే. శారదానికేతన్‌లో అప్పటికి చదువుకుంటున్న దళిత బాలికలు చాలా చాలా తక్కువ. వారి పట్ల కులవివక్ష ఉండేది. సినిమాలో ప్రహ్లాదుడిగా చేశాననీ, బాగా పాడగలననీ, బాగా చదువుతాననీ, చెంచయ్య గారింట్లో ఉంటున్నానని, ఆయన్ని నాన్నగారు అని పిలుస్తానని.. ఇవన్నీ అక్కడి టీచర్లకి తెలిసి ఉండటంవల్ల, అవి కొంత ప్లస్‌ అవటంవల్ల… కులం వల్ల నేను మిగిలిన బాలికల పడినంతటి ఇబ్బంది పడలేదనుకోవచ్చు.

అపర్ణ: నేను కులవివక్ష ఎదుర్కోలేదనే చెప్పాలి. మా గ్రాడ్యుయేషన్‌ కాలేజ్‌లో హెచ్‌.ఒ.డి నాతో చాలా ప్రేమగా ఉండేవారు. ఫైనల్‌ ఎగ్జావ్స్‌ు అయ్యాక, పిజికి అప్లై చేయటానికి సర్టిఫికెట్స్‌ ఎటెస్టేషన్‌ కోసం వెళ్లాను ఆయన దగ్గరకి. ఆయన సంతకం పెట్టాలి. నా దగ్గర అప్పటికి కాస్ట్‌ సర్టిఫికెట్‌ లేదు. టెంపరరీ కాస్ట్‌ సర్టిఫికెట్‌ కూడా ఆ డాక్యుమెంట్స్‌లో ఉంది. ఒకోటి సంతకం చేస్తూ… కరెక్టుగా కాస్ట్‌ సర్టిఫికెట్‌ దగ్గరకి వచ్చేసరికి ఆయన తలెత్తి నన్ను చాలా కోపంగా చూశారు. స్టిల్‌ ఐ రిమెంబర్‌ దట్‌. అసలెందుకలా చూశారో కూడా నాకర్థం కాలేదు. తర్వాతెప్పుడో రెండు మూడేళ్ల తర్వాత అర్థమయింది. నేను చదువుకుంది సోషియాలజి, వర్క్‌ చేసింది ఎన్‌జిఓల్లో కాబట్టి… నా చుట్టూ ఉండేవాళ్లకి కులం విషయంలో చాలా అవగాహన ఉండేది. సెన్సిటివ్‌గా ఉండేవారు.

విజయవాడలో నా ఇంటర్‌ టైంలో ఘంటసాల మ్యూజిక్‌ కాలేజ్‌లో సంగీతం కోర్స్‌ చేశాను. జాయిన్‌ అవటానికి నేను, మా నాన్న వెళ్లాం. ఫావ్‌ు ఫిల్‌ చేస్తున్నప్పుడు, అక్కడ ప్రిన్సిపల్‌ మా నాన్న ఫ్రెండ్‌. ఆయన బ్రాహ్మిన్‌. తెలిసిన మనిషే. అయినా నా కేస్ట్‌ అడిగారు. మా నాన్న ఠక్కున చౌదరి అని చెప్పారు. ఆ ప్రిన్సిపల్‌కి మా నాన్న ఎన్నో ఏళ్ల నుంచే తెలుసు. నిజమా! అని అడిగారాయన. అవును అని మా నాన్న మళ్లీ అబద్ధం చెప్పారు. ఆయనకు నిజం తెలుసు అని నాకు, మా నాన్నకి, ఆయనకి ముగ్గురికీ తెలుసు. నేను చాలా ఇన్‌సల్టెడ్‌గా ఫీల్‌ అయ్యా. కోపం వచ్చింది. బైటకి రాగానే, ‘ఎందుకలా అబద్ధం చెప్పారు?’ అని అడిగా. ‘నీకు తెలీదు, ఇక్కడంతా ఇలానే ఉంటుంది… అలా చెప్తే ఏం కాదు’ అన్నారు. అంత కంపల్సివ్‌గా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఎందుకొచ్చిందో నాకు అప్పటికి అర్థం కాలేదు. రెండో రోజే… మా మ్యూజిక్‌ టీచర్‌కి చెప్పేశా, మేము ఎస్‌.సి అని. ఆ టీచర్‌ ఏమీ డిఫరెన్స్‌ చూపించలేదు. నేను చదువుకునే చోట ఎదుర్కొంది అంటే… ఇవే అని చెప్పచ్చు.

కుటుంబాల్లో… స్నేహాల్లో…

పరిపూర్ణ: చిన్నతనంలో తెలీని ఊరు, తెలీని భాష మాట్లాడే మద్రాసు వెళ్లినప్పుడు నన్ను ఇంట్లో ఉంచుకుని చూసిన నటి వరలక్ష్మి అక్క, హాస్య నటులు రేలంగిగారు, రేడియోలో పాడటానికి అవకాశాలు ఇచ్చిన బాలాంత్రపుగారు, ఉద్యోగం పొందటానికి సూచనలు చేసిన బాలకృష్ణ అన్నయ్య, నన్ను ఆదరించి, చదివించి, నేను ఇలా ఎదగటానికి తోడ్పడిన మహీధరగారి కుటుంబం… అగ్రవర్ణాల వారే. కానీ, వారి ప్రేమాభిమానాలకి నా కులం అడ్డుకాలేదు. కమ్యునిస్టు అయిన దాసరి నాగభూషణంగారిని వర్ణాంతర వివాహం చేసుకున్నాను. ఇద్దరివైపు నుండి కూడా ఆ రోజుల్లో అది పెద్ద సాహసం.

కానీ వివాహ జీవితంలో మాత్రం కులం నీడ నామీద పడింది. దాసరిగారితో నా వివాహం ఏ పరిస్థితుల్లో జరిగిందీ, తర్వాత కాలంలో నేను పడ్డ బాధ గురించి రాశాను స్వీయచరిత్రలో. ఆయన నన్ను ఉద్యోగం చేయవద్దని చెప్పినప్పుడు, మా అమ్మ చేయనిమ్మంటే… ఆమెని కొట్టటానికి వెళ్లాడు. నేను అడ్డుపడ్డాను. తన కులపు అత్తగారే అయితే, అంత పని చేసేవాడా అనిపించింది. పిల్లలతో ఆయన వ్యవహరించే తీరు చూస్తే… తన కులానికి చెందిన అమ్మాయిని చేసుకుని ఉంటే, ఆమెకి పుట్టిన పిల్లలతో ఇలాగే ఉండేవాడా అనిపించేది.

అపర్ణ: ఇంట్లో అందరం ఇంటర్‌కేస్ట్‌ కాబట్టి, కులం అనేది అసలు నాకు చాలాకాలం వరకు తెలీదు. తర్వాత ఇప్పుడు మాత్రం ఎవరన్నా, ‘నీ కాస్ట్‌ ఏంటి’ అని అడిగితే ఎస్‌.సి అనే చెబుతాను. నా దళిత స్నేహితులు ఆ విషయాన్ని యాక్సెప్ట్‌ చేయరు. వాళ్లు అలా అనుకోటం కరక్టే అనిపిస్తుంది. ఫస్ట్‌ జనరేషన్‌ దళిత్‌కి ఉండే ఛాలెంజెస్‌ నాకు లేవు. నా దళిత్‌ ఫెమినిస్టు స్నేహితులని చూసినప్పుడు… వాళ్లు ఊపిరి కోసం ఇంకా కొట్టుకుంటున్నారనే అనిపిస్తుంది. నాతోపాటుగా, నా అంతగా చదువుకున్న ఫస్ట్‌ జనరేషన్‌ దళిత్‌ అమ్మాయి అవకాశాల పరంగా, యాక్సెప్టెన్స్‌ పరంగా అమమ్మ చేసిన ఫైట్‌ చేయాలి. క్వాలిఫికేషన్స్‌లో నాతో సమానం అయిన ఫస్ట్‌ జనరేషన్‌ అమ్మాయి, అవకాశాల్లో అమమ్మ జనరేషన్‌తో సమానం. నేను ఆ రకంగా ప్రివిలేజ్డ్‌. నా ఫైట్‌ దాదాపుగా ఒక సవర్ణ స్త్రీ ఫైట్‌లాంటిదే. నాకా అవగాహన ఉంది. ‘కులం’ ఉన్నంత కాలం వివక్ష ఉంటుంది. ‘కులం’ అడిగినంత కాలం నేను ఎస్‌.సి అనే చెప్పుకుంటాను.

‘కులం’ ఎప్పుడు పోవచ్చంటే…

పరిపూర్ణ: కులం పోవటం అనేది చాలా కష్టం. అసాధ్యం అని అయితే అనుకోను. కానీ చాలా కష్టం. వర్ణాంతర, కులాంతర వివాహాల సంఖ్య చాలా పెరగాలి. ఈ తరహా వివాహాలు జరిగినకొద్దీ కులం బలహీన పడుతుంది. అయితే, ఈ వివాహాల్లో సమస్యలు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కొనేందుకు సాహసించాలి. వీటితో పాటు అంబేద్కర్‌గారు ఇచ్చిన రిజర్వేషన్లని చక్కగా ఉపయోగించుకుని చదువులో, ఉద్యోగాల్లో ఉన్నతంగా ఎదగాలి. ముఖ్యంగా అంబేద్కర్‌గారి సాహిత్యాన్ని చదవాలి, అవగాహన పెంచుకోవాలి. వాటితో పోల్చుకుని సమాజంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలి, పట్టించుకోవాలి, వివక్ష పోయే విధానాల కోసం పనిచేయాలి.

అపర్ణ: అన్ని సెక్టార్స్‌లో అప్రసెడ్‌ సెక్షన్స్‌కి యాక్సెస్‌ ఉండాలి. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దళితులు ఉన్నారు? ఎంతమంది దళితులు లార్జ్‌ స్కేల్‌, మీడియం స్కేల్‌ ఇండస్ట్రీలకి ఓనర్లు? అన్ని రంగాల్లో పవర్‌ పొజిషన్స్‌లోకి అప్రస్‌డ్‌ సెక్షన్స్‌ రాకుండా… ఇలాగే ఉంచి, కులాంతర వివాహాలు చేసుకున్నంత మాత్రాన కులం పోదు. మరింత కన్సాలిడేట్‌ అవుతుంది. ఇప్పుడు నిజానికి… అదే జరుగుతోంది. పవర్‌ పొజిషన్స్‌లోకి అప్రెస్‌డ్‌ సెక్షన్స్‌ రావటానికి నాకు తెలిసి ఇంకో రెండు జనరేషన్స్‌ పడుతుంది. ఆ తర్వాత తరానికి కులం అనేది కొంత తగ్గుతుందనుకుంటా.

*   *   *

రిపూర్ణగారి అన్నయ్యలు శ్రీనివాసరావుగారు కమ్యూనిస్టు. చిన్నన్నయ్య దుర్వాస మహర్షిగారు కాంగ్రెసువాది. ఇద్దరూ అభ్యుదయభావాలు ఉన్నవారు, సమాజం కోసం పోరాడిన వారు, జైళ్ల పాలయినవారే. అయితే, ఆమె మీద శ్రీనివాసరావుగారి ప్రభావమే ఎక్కువ. మార్గదర్శకులు దర్శి చెంచయ్యగారు, మహీధరగారు. వీళ్లందరి సాన్నిహిత్యం, చదివిన సాహిత్యం ఆమెని కమ్యూనిస్టు పార్టీ వైపు నడిపించాయి. హైస్కూలు దశ నుండే ఆమె విద్యార్థి సంఫూల్లో యాక్టివ్‌ మెంబర్‌. మహాసభలు నిర్వహించటం, సమ్మెలు కట్టడం, ఉపన్యాసాలు ఇవ్వటం, చందాలు వసూలు చేయటం… ఆమె కమిటెడ్‌, యాక్టివ్‌ మెంబర్‌. తెలంగాణ సాయుధ పోరాటానికి మద్దతుగా ఆంధ్రా ప్రాంతపు కమ్యూనిస్టు నాయకులు, సభ్యులు పోరాటం చేస్తున్న కాలంలో కరపత్రాలు అందచేయటం, సాయుధ పోరాటినికి కావాల్సిన నిధులు సేకరించి, పార్టీకి అందించటంలాంటి సాహసాలు చేసింది. పళనియప్పన్‌ అనే థర్డ్‌ డిగ్రీ స్పెషలిస్టుకి దొరికి, లాకప్‌లో పడేలోపు… కరపత్రాలని, మినిట్స్‌ని అందకుండా చేయగలిగిన చాకచక్యం ఆమెది. దాసరిగారు సాయుధ పోరాటం కాలంలో డెన్‌లో రహస్యంగా ఉన్నప్పుడు, వారి పెళ్లి జరిగింది. పార్టీ మీద నిషేధం ఎత్తివేశాక, సినిమా అవకాశాలని వదులుకుని, నెలల బిడ్డని చంకనేసుకుని, ప్రజానాట్యమండలి తరపున ఎన్నికల ప్రచారానికి తిరిగారు పరిపూర్ణ. 1972లో జరిగిన ప్రత్యేకాంధ్ర ఉద్యమాన్ని మొదట్లో వ్యక్తిగతంగా వ్యతిరేకించినప్పటికీ, తరవాత కాలంలో ఆ ఉద్యమాన్ని సమర్థించానని, దానికి కారణాన్ని స్వీయచరిత్రలో రాశారు పరిపూర్ణ. ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో పాలుపంచుకున్నారు. పిల్లల తల్లి అయిన తర్వాత, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఆమె ఉద్యమ జీవితం వదల్లేదు. దాసరిగారితో విడిపోయినా కూడా, వైవాహిక జీవితం గురించి కాకుండా… పార్టీ పనుల గురించి మాట్లాడుతున్నప్పుడు కమ్యూనిస్టుగా ‘దాసరి’గారి పట్ల ఏమాత్రం అగౌరవం చూపించదు ఆమె. ఈ బాలెన్స్‌ని ఆమె ఇప్పటిదాకా మెయిన్‌టెయిన్‌ చేస్తూనే ఉన్నారు. పార్టీపట్ల, దాని కోసం పని చేసిన వారిపట్ల ఆమెకి అభిమానం అలాంటిది.

పరిపూర్ణ: పార్టీ గురించి నేనేమని చెప్పాలి? నా జీవితమంతా దానిమీదే ఆధారపడి ఉంది. చదువుకునే అవకాశాలు పార్టీ సభ్యుల వల్లే వచ్చాయి. నా ఆలోచనాదృక్పథాన్ని విస్తృతం చేసి, నన్ను ఆత్మగౌరవం ఉన్న మనిషిగా తీర్చిదిద్దింది కమ్యూనిస్టు పార్టీనే. నా జీవిత భాగస్వామిని కూడా పార్టీ సభ్యుడు కాబట్టే, వర్ణాంతరమైనా, అభ్యుదయభావాలు ఉన్న నాయకులు అని ధైర్యంగా ఆమోదించాను. పార్టీ కార్యకర్తగా పనిచేసిన అనుభవమే స్త్రీ సంక్షేమ శాఖలో పనిచేస్తున్నప్పుడు, వారి పరిస్థితులని అర్థం చేసుకుని, వారికి దగ్గరయి, ధైర్యాన్ని నింపటానికి సహాయం చేసింది. నా పిల్లల్ని ఆదర్శంగా, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దాలనే కాంక్షని కలిగించింది. సమాజంలో ఉన్న వర్గభేదాలని, స్త్రీ పురుష భేదాలని అర్థం చేసుకోటానికి, రాయటానికి కమ్యూనిస్టు సిద్ధాంతమే నడిపిస్తోంది.

అపర్ణ: నాకు కమ్యూనిస్టు పార్టీతో అనుబంధమేం లేదు. కమ్యూనిస్టులున్న కుటుంబం అని తెలుసు. అమ్మ, మావయ్యల ఫ్రెండ్స్‌, అత్తయ్యవాళ్లు, ఇంకా చాలామంది ఫ్యామిలీ ఫ్రెండ్స్‌.. కమ్యూనిస్టు పార్టీలో పనిచేసినవారే. ఆ సాహిత్యం మా ఇంట్లో ఉండేది. నామీద పార్టీ ఇన్‌ఫ్లుయెన్స్‌ లేదు. నా స్నేహితుల కుటుంబాలని పోల్చి చూసుకుంటే మాత్రం, మా కుటుంబాల్లో పూజలు లేకపోవడం, జెండర్‌ వివక్ష లేకపోటం, డెమోక్రటిక్‌గా ఉండటంలో… కమ్యూనిస్టు పార్టీ ఇన్‌ఫ్లుయెన్స్‌ ఉంది అనే అనుకుంటాను.

పరిపూర్ణ: స్త్రీల పట్ల ఉండే వివక్ష గతం కంటే తగ్గిందనే అనుకుంటున్నా. వరకట్న హత్యలు విపరీతంగా ఉండేవి. వరకట్నం ఒక దురాచారం అనేది, అది నేరం అనేది అర్థం చేసుకుంటున్నారు. కానీ వరకట్న హత్యలు, వరుల గొంతెమ్మ కోర్కెల్లో రావాల్సినంతటి స్థాయిలో మార్పు రాలేదు. స్త్రీలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. సొంత కాళ్ల మీద నిలబడుతున్నారు. నా టైంలో నేను ముగ్గురు పిల్లలతో ఒంటరిగా విజయవాడలో ఉండాల్సి వచ్చినప్పుడు… కులం కారణంగా, ఒంటరి స్త్రీ మీద సహజంగా ఉండే చిన్నచూపు వల్ల ఇల్లు అద్దెకు దొరకలేదు. నేను దాసరిగారి పేరు, కులము చెప్పవలసి వచ్చింది. అదొక్కసారే నేను ఆయన పేరును ఉప యోగించుకుంది. కానీ ఇప్పుడు స్త్రీలు ఒంటరిగా ఉండాలన్నా అంతటి దుస్థితిలో లేరు. విద్య, ఉద్యోగాల్లో బాగా రాణిస్తున్నారు. ఆస్తి హక్కు వచ్చింది. చట్టపరంగా అనేక హక్కులు వచ్చాయి, అవకాశాలు వచ్చాయి.

పరిపూర్ణ గారితో చైతన్య పింగళి

అపర్ణ: చాలా మార్పులు జరిగాయి, నిజమే. హక్కుల్లోనూ, అవకాశాల్లోనూ చాలా ఇంప్రూమెంట్‌ ఉంది. సింగిల్‌ వుమన్‌ సంగతే తీసుకుందాం… అప్పటికంటే ఇప్పుడు నయమే కానీ, ఇళ్లు దొరకటం స్టిల్‌ కష్టమే. పెళ్లయి, భర్త చనిపోయో, విడిపోయో ఉన్న ఆడవాళ్లకి ఇల్లు దొరకచ్చేమో కానీ  సింగిల్‌గా ఉండే స్త్రీలకి అద్దెకు ఇల్లు దొరకటం ఇప్పటికీ సిటిలో కూడా కష్టమే. ఆస్తి హక్కు వచ్చింది. అయితే, దాన్ని ఎవైల్‌ చేసుకోటానికి ఎంతమంది స్త్రీలు కోర్టులు చుట్టూ తిరగ్గలరు? మన లీగల్‌ వ్యవస్థలు పూర్తిగా వుమన్‌ ఫ్రెండ్లీ అయినప్పుడే అది సాధ్యం. చదువు, ఉద్యోగంతో పాటు సొంత ఆస్తి అనేది కూడా భద్రత ఇచ్చేది… ఇవన్నీ లాంగ్‌ బ్యాటిల్స్‌. చాలా మారాయి, ఇంకా మారతాయి.

*   *   *

కొలుచుకుంటూ పోతే గజం కాస్తా బెత్తెడవ్వచ్చూ, బారెడవ్వచ్చు. కొలత ఎక్కడో తప్పుతాం. కొలవటం వదిలేసి, ఈ ఇద్దరు అనుకుంటున్న దాన్ని చూస్తే… కృష్ణశాస్త్రి అన్నట్టు ‘ముందున్నది ముందున్నది ముందున్నది మనదే…’ అనే ఆశ మాత్రం కలుగుతుంది. మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్చ, సమానత్వాల వెనక ఎంతమంది ఫైట్‌ ఉందో కదా అనిపిస్తుంది. ముందు తరాల భుజాల మీద నిలబడే కదా మనం ఇంత దూరం చూడగలుగుతున్నాం. థేరీగాథలు రాసిన బౌద్ధ భిక్షుణిల దగ్గర నుండి నంబూరి పరిపూర్ణ, దాసరి శిరీషల వరకూ… విభిన్న ప్రాంతాలు, ఆచారాలు, భాషలు, అణచివేతలు, కులాలు, మతాలు, జాతులకి చెందిన ఎంతమంది స్త్రీలు చేసిన పోరాట ఫలితాలనే కదా మనం అన్ని రంగాల్లోనూ ఈరోజు అనుభవిస్తోంది! ఇటువంటి ఒక నేషనల్‌ అసెట్‌ని కొవిడ్‌ కాలంలో కూడా జాగ్రత్తగా కాపాడిన ఆ కుటుంబానికి, we should be thankful.

పరిపూర్ణగారికి long term plans ఉన్నాయి. ఇప్పుడు రాస్తున్న నవలని పూర్తిచేయాలి, ఎక్కువగా రాస్తే చేతులు నొప్పులు పెడుతున్నాయి కనుక ఇది ముగించాక కథలూ, వ్యాసాలు రాయాలి అని. పరిపూర్ణగారిలోని ఈ సానుకూల దృక్పథాన్ని, జీవితం ఇచ్చే అవకాశాలని సద్వినియోగం చేసుకునే వైఖరినే మనం నేర్చుకోవాల్సింది; తర్వాత తరానికి అందించాల్సింది.

*

చైతన్య పింగళి

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • శిరీష గారు కూడా వుంటే బాగుండేది.
    ఒకే కుటుంబంలో మూడు తరాల స్త్రీల సాహిత్య ప్రస్తానము వాఋ అనుభవాలు, వారి మాటల్లో తెలుసుకోవడం బాగుండేది.
    బాగా ప్రెజెంట్ చేశావు చైతన్య.

  • చాలా మంచి interview Chaitanya. Thank you for this. You documented it very well. Prologue and epilogue are really good and makes the interview very interesting. And Of course it is about a legend. Congratulations to Aparna and Amarendra gaaru 💐💐

  • చాలా మంచి ఇంటర్వ్యూ చేశారు, చైతన్య గారు.
    పరిపూర్ణ గారి వెలుగుదారుల్లో పుస్తకం కూడా చదవాలనిపిస్తుంది.
    అపర్ణగారి కథలు మాత్రమే చదివాను. పరిపూర్ణ గారివి, శిరీష గారివి కథలింతవరకూ చదవలేదు,చదవాలి.

  • శిరీష గారు వుంటే బాగుండేది. అపర్ణ అన్నట్లు అప్పుడే అది జరిగి ఉండాల్సింది..
    ఒకే కుటుంబంలో మూడు తరాల స్త్రీల సాహిత్య అనుభవాలు సామాజిక పరిస్థితిని ప్రతిబింబించేవి. ఇప్పుడు పరిపూర్ణ గారు.. అపర్ణ మాటల్లో అది కనిపిస్తోంది.. శిరీష గారు మాటలూ ఉంటే.. మరింత పరిపూర్ణత వచ్చేది. మంచి ప్రయత్నం చేశావు చైతన్య.. బాగా ప్రెజెంట్ చేశావు కూడా.. నీకు ప్రేమపూర్వక ధన్యవాదాలు.. అమ్మమ్మ చెప్పడంలో చాలా బాలన్స్ గా ఉంది.. నిజంగా ఆ తరం నుండి అది నేర్చుకోవాలి..

  • Thank you Chaithanya for introducing 2 writers.

    I am inspired by your introduction of Paripurna Madam garu, the way you conceptualized her personality evolution – Soil, Water & Sunshine.

    I studied at Residential School Sarvail (Boys only) and never knew Cast of any student … 1972-80 …
    But when am reading a 13 year old experience at Seva Sadan, guess what ? … few tears rolled down my cheaks on my bed at 4am as I am reading your post at my Sydney home.

    However we missed a similar introduction how a ‘APARNA’ seed absorbed it’s water, sun & in which soil it grew up.
    May be not a rough soil but not on a ‘terrace garden too …

    But like to read it in Chaithanya words !!!

    I read Aparna posts, Amarendra posts, Chaithanya posts and many comments and posts in your network … Followed Chathanyas travelogue with her son recently …

    Spoke to Aparna once on the phone but now “listened” to her via your writing !!

    Apologies if anyone missed ‘garu’ in my above response…

    Good to
    Paripurna Madam garu
    Aparna Madam garu

    in

    Chaithanya Pingali gaari words.

    I read Pingali Dasharath Ram gari writings too.

    Dr Vinod Elete
    Sydney
    Australia
    4:50 AM
    7Aug 2022

  • చక్కని ఇంటర్వ్యూ చేశారు చైతన్య గారు. అపర్ణ కు అభినందనలు

  • చాలా బాగుంది మూడు తరాల మహిళల గురించి చదవడం. చైతన్య చాలా చక్కగా సమాచారం సేకరణ చేసి దాదాపు 70-80 ఏళ్ల ల్లో వచ్చిన మార్పులను వివరించారు. అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు