చివర్లో వుంటుంది రహస్యం!

కొన్ని కథలు చివరి వాక్యం చదివే వరకూ పూర్తిగా అంతుబట్టవు. అప్పటివరకూ అర్ధమయ్యిందనుకున్నది కూడా  తిరిగి కొత్తగా భిన్నంగా అర్ధమౌతుంది. కథ ముగింపులో ప్రధాన పాత్రకు అయ్యే  ఆదాటు కనువిప్పునూ సన్నివేశపరంగా ఇతర పాత్రల పరంగా సంభవించే మెరుపు ఎరుకనూ, తటాలున కలిగే స్పృహనూ నిర్మించడం ద్వారా మొత్తం కథ నడక మీదా పాత్రల ప్రవర్తన మీదా అంతకుముందు ఏర్పడిన అభిప్రాయాలకు భిన్నమైన అభిప్రాయాలు పాఠకులకి కలగజేస్తారు కథకులు. అనుకోని ఈ జ్ఞానోదయాన్ని కలిగించటంలోనే ఈ నిర్మాణ విశిష్టత ఇమిడి ఉంది.

సొదుం జయరాం రాసిన ‘చెదపురుగు ‘ కథ అందరూ చదివే వుంటారు. ఇందులో మూడే మూడు పాత్రలు. కథకుడూ, పత్రికాధిపతి గోపాల రావు,వీటి మనిషి శేషమాంబ. గోపాలరావు విలాస జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ప్రభుత్వానికి వ్తత్తాసు పలికే రచనలనీ రిపోర్ట్స్ నీ తన పత్రికలో వేస్తూ ఘరానా పెద్దమనిషిగా వ్యవహరిస్తాడు. శేషమాంబ నాటకాలు ఆడుతూ , తన నివాసంలో మగవాళ్లకు పడకలు వేస్తూ బోళాగా బ్రతుకుతుంటుంది. గోపాల్రావులో లేని మానవత్వం, మంచితనం ఈమెలో కనిపిస్తాయి. ఇంతవరకూ బాగానే వుంది.

ఒక రోజు కథకుడు శేషమాంబ ఇంట్లో గోపాలరావు ఫోటో ఉండటం చూసి ఈ ఇద్దరి మధ్యా అక్రమ సంబంధం ఉందని అనుకుంటాడు.అక్కడ శేషమాంబ కథకుడికి  ఒక విషయం చెబుతుంది. “గోపాలరావు నాకు స్వయానా అన్నయ్య. అప్పుడప్పుడూ ఇక్కడికి వస్తూనే ఉంటాడు.నా మీద అభిమానంతోటి కాదనుకోండీ, నా డబ్బు కోసం”. శేషమాంబ చెప్పిన ఈ మాటతో  కథలోని పాత్రల స్వభావాలూ ,  ప్రవర్తనలూ ,మొత్తం కథ నడకా మనకు సరికొత్తగా అర్ధమౌతుతాయి. కధకుడితో పాటు మనకూ ఒక దిగ్భ్రమ కలుగుతుంది. గోపాలరావు చీకటి జీవితం, శేషమాంబ నిస్సహాయతా, అమాయకత్వం సరికొత్తగా మన ఎరుకలోకి ప్రవేశిస్తాయి. డబ్బు , వ్యాపార దృష్టీ మానవ సంబంధాలనీ, చివరికి రక్త సంబంధాల్ని కూడా ఎంతగా విధ్వంసీకరిస్తాయో తెలియజెప్పే ఈ కథ  ఈ తరహా నిర్మాణ వ్యూహం వల్ల ఇతివృత్తాన్ని బాగా హైలైట్ చేయగలిగింది.

సొదుం జయరాం రాసిందే మరొక కథ ‘కధకుడి కథ’

ఇందులో పైకి అభ్యుదయాలు చెబుతూ సంఘంలో అది లోపించిందని బాధపడుతూ తీరా తామే  ఆ అభ్యుదయాన్ని ఆచరించాల్సివచ్చే సమయానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తించే వాళ్ళ బోలుతనం బయటపడటం చూస్తాం.  కట్నం కారణంగా కూతురి పెళ్లి కుదరకపోవటాన్ని జీర్ణించుకోలేని ఒక కధకుడు కట్నాలకు బానిసలుగా మారిన యువకుల్ని విమర్శిస్తూ ఒక కథ రాయాలని పట్టుదలతో ఉంటాడు. అందులో అడపిల్లల్ని కన్న తల్లిదండ్రుల బాధలూ, ఆడపిల్ల అంతరాంతరాలూ సున్నితంగా కళ్ళకు కట్టినట్లు చిత్రించాలని అనుకుంటాడు. కూర్చుని కధా రచనకుపక్రమించే సమయానికి కూతురు సరళ వస్తుంది. తన ఆఫీసులో జాకబ్ అనే అబ్బాయీ తానూ ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెబుతుంది. అంతే. కధకుడి తల తిరిగిపోతుంది. కుల హీనుడికీ క్రిష్టియన్ కీ తన కూతుర్ని కట్టబెట్టడమా! అనుకుంటాడు. కోపం కట్టలు తెంచుకుంటుంది. సరళ ను చెంప మీద బలంగా కొడతాడు. అడ్డమొచ్చిన భార్యనూ అంతే బలంగా కొడతాడు. భయపడి ఏడుస్తున్న తల్లీ కూతుళ్ళను వొదిలి చర చరా బయటికి నడుస్తాడు. కథకుడి అభ్యుదయానికి చెందిన కనువిప్పు తల్లీ కూతుళ్ళతో పాటు పాఠకులకూ కలుగుతుంది.

ఇదే విధానంలో చాసో ‘వాయులీనం’ కథ రాశాడు. ఇందులో రాజ్యం , వెంకటప్పయ్యా భార్యాభర్తలు. రాజ్యంకు  సంగీతమంటే ఇష్టం.వెంకతప్పయ్య భార్య సుఖం కోసం ఎన్ని ఇబ్బందులైనా పడతాడు. ఆమెకు జబ్బుచేస్తే ఊపిరాడక విలపిస్తాడు.డబ్బులేని కష్ట సమయంలో ఆమె ఫిడేలు అమ్మి  వైద్యం చేయిస్తాడు. అందుకు పెద్ద తప్పు చేసినట్లు కుమిలిపోతాడు. సంగీతమంటే ఎంత ఇష్టమున్నా  తాను కాపురానికొచ్చినాక రాజ్యం ఏనాడూ పాడలేదు. భర్త కూడా ఏనాడూ పాడమనలేదు. మీరు ఏ తప్పూ చేయలేదు. ఏ సంసారైనా అదే చేస్తాడు అని భర్తను అనునయిస్తుంది. కానీ, ” నా నోరు ఏనాడో నొక్కుకు పోయింది. ఇహ నా ఫిడేలు ఉండి నన్ను రక్షిస్తుందా?– తల్లి వెళ్ళిపోయింది. వెళ్లిపోతూ నాకు ప్రాణం పోసింది” అని తన్నుకొచ్చేి ఏడుపును ఆపుకుంటుంది.  భర్త తనకోసం తెచ్చిన చీరకేసి చూడనైనా చూడదు.  చివర్లో రాజ్యం అన్న ఆ నాలుగు మాటలూ , చీర పట్ల ఆమె చూపిన  నిర్వికార ధోరణీ ఆ దంపతుల సంబంధం గురించి  కొత్త అంశాల్ని వెలికి తీస్తాయి. ఆ భార్యాభర్తల సంబంధానికి చెందిన సారాంశం పట్ల ఒక మెరుపు ఎరుక పాఠకులకు కలుగుతుంది.  వారి గురించి ఒక పునస్సమీక్ష జరుపుకునే స్థితికి పాఠకులు గురౌతారు.

చాసో  ముఖ్య కథలన్నీ ఈ నిర్మాణ పద్ధతిలోనే సాగుతాయి. ‘లేడీ కరుణాకరం’ అనే కథలో నీతికీ డబ్బుకూ మధ్య ఉన్న పరస్పరతను చిత్రిస్తాడు కధకుడు. ఇందులో శారద డబ్బున్న వాళ్లకు శరీర సుఖం ఇచ్చి  సంపాదించిన ధనంతోతన భర్తను బాగా చదివించి పెద్ద ఉద్యోగం వచ్చేటట్లు చేస్తుంది. భర్త కరుణాకరం కు నైట్ హుడ్ హోదా కూడా ఇప్పించి తన హోదాను ‘లేడీ కరుణాకరం’గా   మార్చుకుంటుంది. ఒక రోజు కరుణాకరం తన భార్య నాయుడితో అక్రమ సంబంధంలో వుండాటాన్ని ప్రశ్నిస్తాడు. అప్పుడు అంటుంది శారద , “నాయుడు డబ్బు పెట్టి చదువుకున్నావ్. అతనన్నమే తిని అతని బట్టే కడుతున్నావ్. నేనేం ద్రోహం చేశాను నీకు. వాణ్ణి దోచిపెడుతున్నాను. నాకే ద్రోహబుద్ది ఉంటే వాడితో లేచి పోనూ?” అని భర్తను ప్రశ్నిస్తుంది. ఇది విన్న భర్త తన భార్య మహా పతివ్రత అనే నిర్ణయానికి వస్తాడు.’ కుంతి పతివ్రతయితే శారదా పతివ్రతే’  కుంతి కొడుకులు పాండవులైతే శారద పిల్లలూ తన సంతానమే అనుకుని సమాధాన పడతాడు. ముగింపులోని ఈ సన్నివేశం ,సంభాషణ  ఈ రెండు పాత్రల మీదా పాఠకుల్లో  అంతకు ముందు కలగని ఎన్నో ఆలోచనల్ని రేకెత్తిస్తోంది. జీవితాన్నీ ,స్త్రీపురుష సంబంధాలనీ నిశితంగా విశ్లేషించుకునేట్లు  వారిని పురికొల్పుతాయి. శారదా, కరుణాకరంలు ఆడే నాటకానికి సంబంధించిన భ్రమలు తొలగుతాయి.

ఇట్లా ఒక ప్రత్యేక ముగింపు సన్నివేశమో సంభాషణో కలిగించే మెరుపు ఎరుకను కథ నిర్మాణ పద్ధతిగా స్థాపించి సాధనలో పెట్టిన కధకుడు James Joyce. పాత్రల దిగ్భ్రమనే చెప్పదలుచుకున్న విషయానికి వాహికగా వాడిన ఈ పద్ధతిని న్యూజిలాండ్ కధకురాలు  Katherine Mansfield  మరింత ముందుకు తీసుకెళ్లింది. ఈ తరహా నిర్మాణ కథని The Story of Revelation అని వ్యవహరిస్తున్నారు పాశ్చాత్య సాహితీవేత్తలు. ఈ పద్దతికి చెందిన ఇతర పార్శ్వాల్ని తరువాతి భాగంలో చర్చించుకుందాం.

*

గుంటూరు లక్ష్మి నర్సయ్య

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా బావుందండి. మంచి కధాలకు తొడయిన మంచి విశ్లేషణ .

  • లక్ష్మీ నర్సయ్య సార్ కి నమస్కారం.

    కథా కథనంలో ముగింపు లను వివరిస్తూ ఉదహరించిన ఆదర్శనీయంగా వుంది.

    కృతజ్ఞతలు.

  • వీలయితే కథలకు లింకుల నివ్వగలరా?

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు