చివరికి ఆమె ఒక కన్నీటి చుక్క!

తొలి గ్రామఫోన్ రికార్డు గాయని గౌహర్ జాన్ …

 తనని ఎంతో అభిమానించే రామ్ పూర్ నవాబ్  ఆశ్రయం కోరింది. ఆయన కూడా ఒకప్పటి తన వాగ్దానాన్ని మరిచిపోకుండా ఆహ్వానించి తన ఆస్థానంలో చోటిచ్చాడు. కానీ చాలా కొద్దికాలంలోనే ఆమెను అనుమానిస్తూ  చిన్నచూపు చూడసాగాడు. ఆయన చేసే అవమానాన్ని తట్టుకోలేని గౌహర్  అక్కడ నుండి బొంబాయి ప్రయాణమయ్యింది.(1928). బొంబాయి లోని ఒక ప్రసిధ్ధ వర్తకుడు,ఆమెను అత్యంత గౌరవించేవాడు. ఆమెకు గాఢమైన అభిమాని కూడా, ఆమెను అక్కా అని పిలిచేవాడు. ఆమె కోసం ఒక ఇల్లు తీసుకుని, ఆమె చేత కొన్ని కచేరీలు చేయించేటట్టు ఆరు నెలలకి అగ్రిమెంట్ రాయించుకున్నాడు.

అలాంటి ఒక కచేరీకి హాజరైన మైసూర్ యువరాజా కంఠీరవ నరసింహ రాజ వడయార్ ,ఆమె గానం విని ముగ్థుడయ్యాడు. ఆయన తన పెద్దన్న గారైన మైసూర్ మహారాజా కృష్ణరాజ వడయార్ కి ఆమెను ఆస్థాన గాయనిగా నియమించుకోమని సిఫారస్ చేశాడు. ఇక్కడ ఆమె జీవితం చివరి మలుపు తిరిగింది

మైసూర్ లో మహా ప్రస్థానం…..

మైసూర్ మహారాజా నుండీ ఆహ్వానం అందుకున్న గౌహర్ చాలా ఆనందించింది. పూర్వం తాను మైసూర్ లో కచేరీ చేసినప్పుడు తానందుకున్న గౌరవాలన్నీ గుర్తు తెచ్చుకుని పరవశించింది.

తనను ఇన్నాళ్లూ ఆదరించిన సేఠ్ కు ఈ ఆహ్వానం సంగతి చెప్పి ,ఇంటద్దె చెల్లించడానికి సిధ్ధమయింది. అతను వద్దని వారించి ,ఒక మంచి తమ్ముడిగా ఆనందంగా వీడ్కోలు చెపుతున్నానన్నాడు, సుఖంగా వుండమని శుభాకాంక్షలు పలికాడు. అంతా నిజమేనని నమ్మింది పిచ్చితల్లి.

మైసూర్ లో ఆగస్టు 1928 న ఆస్థాన గాయనిగా నెలకు 500  రూపాయల జీతానికి అడుగుపెట్టింది గౌహర్ జాన్.

ఆమె ఖర్చులన్నీ అందులోనే చూసుకోవాలి.ఆమె  వెంట ఒక పరిచారిక, ఒక పరిచారకుడూ అతని కుటుంబమూ కూడా మైసూర్ వచ్చాయి. వారి జీతాలూ,పోషణా అంతా ఆ అయిదొందల్లోనే.

పచ్చని కొండల మధ్య, చెట్లనీడల్లో చల్లగా వుండే చిన్న బంగళా “దిల్ కుష్ “మాత్రం ఆమె కు వసతి గృహంగా ఉచితంగా ఇచ్చారు. మానసికంగా,శారీరకంగా అలసిపోయిన గౌహర్ అక్కడ తానింక హాయిగా సేదతీరవచ్చు అని ఆశపడింది. అలా ఒక్కొక్క కచేరీకే వెయ్యిరూపాయలు తీసుకునే గౌహర్ నెలకు అయిదువందల రూపాయల మూల్యానికి అమ్ముడుపోయి విధికి తలవంచింది.

మొదటి నెల పారితోషికం అందుకున్న గౌహర్ హతాశురాలయ్యింది, ఎందుకంటే ఆ ఇచ్చే  ఐదువందలలోనే ఆదాయపు పన్ను పేరిట కొంత కోత విధించడం ఆమెను చాలా బాధించింది.

తనకిచ్చే జీతంలో కోత విధించవద్దనీ ,తన పనివారికి జీతం చెల్లించడానికీ,ఇతర ఖర్చులకీ డబ్బు చాలదనీ  దయచూడమనీ యెన్నో అర్జీలు పెట్టుకుంది. దేనికీ సమాధానం లేదు. మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు ,ఆ జీతానికి కూడా నోచుకోకుండా ,బొంబాయిలో ఆమెకు ఆశ్రయమిచ్చిన సేఠ్ ఆమె తనకు అద్దె చెల్లించకుండా ఎగ్గొట్టిందని కోర్టు నోటీసు పంపాడు.దానితో ఆమెకు రావలసిన జీతం ఆఫీసునుండీ సరాసరి అతనికి చెల్లించసాగారు. ఆమెసేఠ్ ని యెంత వేడుకున్నా లాభం లేకపోయింది. మైసూర్ సంస్థానం వారు ఈ కేసుతో తమకేమీ సంబంధం లేదనీ లాయర్ సలహా తీసుకోమనీ సూచించి చేతులు దులుపుకున్నారు. చివరికి  లీగల్ అడ్వయిజర్ ద్వారా ఆ కేసు పరిష్కారం చేసుకుంది. ఈ వ్యవహారంలో ఆమె ఆర్థికంగానూ,మానసికంగానూ చాలాకృంగిపోయింది.

ఈ లోగా ఆమె కంటి చూపు బాగా దెబ్బతినడంతో బెంగుళూరు వెళ్లి,కంటికి ఆపరేషన్ చేయించుకుంది. ఆమె మైసూర్ లో వున్న రెండు సంవత్సరాల కాలంలోనూ కేవలం మూడు కచేరీలకి మాత్రమే ఆమెకు ఆహ్వానం అందింది, వాటితాలూకు ఆమెకు ముట్టినది మొత్తం మూడువేల రూపాయల పారితోషికమూ ,మూడువందల రూపాయల నజరానాలూ అంతే!

ఔరా విధి యెంత క్రూరమైనది! పెంపుడు పిల్లి నీళ్లాడితేనే ఇరవై వేలు  ఖర్చుపెట్టి వైభవంగా జరిపిన  గౌహర్ జాన్ కేవలం నెలకు ఐదువందల రూపాయలతో జీవితం గడుపుకోవాలిసి రావడం యెంత దుర్భరమైన విషాదం!

రోజులు గడుస్తున్న కొద్దీ ఆమెలో  అశాంతీ,చిరాకు యెక్కువయ్యాయి. ఆ ప్రభావమంతా పనివాళ్లమీద పడుతూ వుండేది.  జనవరి 1930 మైసూర్ మహానగరమంతా చలికి గడ్డకట్టుకు పోతోంది.గౌహర్ జాన్ జబ్బుపడింది .శారీరకమైన అనారోగ్యం కంటే మానసికమైన కుంగుబాటే యెక్కువ.

మూసిన కన్నుతెరవలేనంత జ్వరంతో సంస్థానం వారి ఆసుపత్రిలో చేరింది. పగలూ రాత్రీ,సేవచేశారు ఆమె పనివాళ్లు అయినా లాభం లేకపోయింది.జనవరి 17 ,1930 గౌహర్ జాన్ గౌహర్ జాన్ కష్టాలకు శాశ్వతంగా తెరపడింది.

మొట్టమొదటి గ్రామఫోన్ గాయని, హిందూస్థానీ సంగీతపు మహారాజ్ఞీ, కలకత్తా కోయిల, తన కోసం కన్నీరు చిందించే ఒక్క కన్నైనా లేకుండా యెక్కడో మారుమూల మైసూర్ లో ఒంటరిగా కన్నుమూసింది.

కథ అంతటితో అయిపోలేదు ఆమె చనిపోయిన తర్వాత ఆమె దగ్గర మిగిలిన డబ్బుకోసం, కొంత కాలం ఆమె భర్తగా వ్యవహరించి అన్ని విధాలా ఆమె పతనానికి కారణమైన అబ్బాస్ ,ఆమె తండ్రిగా కోర్టులో సాక్ష్యం చెప్పడానికి రూ9000 డబ్బడిగిన రాబర్ట్ విలియమ్ ఇయోవర్డ్  సంస్థానం వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం మానవ ప్రవృత్తి యెంతగా దిగజారగలదో తెలుపుతుంది. ఆమెతో ఏ సంబంధమూ లేని ఒకతను కూడా తాను గౌహర్ జాన్ భర్తననీ ,ఆమె చనిపోయిన తర్వాత మిగిలిన ఆస్తిపాస్తులకు హక్కుదారుననీ సంస్థానం వారికి ఉత్తరం రాశాడు. వీటినన్నింటినీ మైసూర్ సంస్థానం వారు సమర్థవంతంగా యెదుర్కొని అణచి వేశారు. నిజానికి గౌహర్ జాన్  పోయిన తర్వాత ఆమె తీర్చవలసిన బాకీలు, పనివాళ్లకు చెల్లించవలసిన జీతాలు పోగా మిగిలిన డబ్బు అక్షరాలా 156రూపాయల 13అణాలు.!

ఆమె పోయాక చాలా పత్రికలలో ఆమె గొప్పదనాన్ని కీర్తిస్తూ వ్యాసాలు వచ్చాయి. గౌహర్ జాన్ జీవితం వెలుగులు విరజిమ్ముతూ ఒక్కసారిగా నింగికెగసి రాలిపోయిన తారాజువ్వలాంటిది.ఆమె జీవితం అలా అవ్వడానికి  స్వయంకృతాపరాథం తోపాటు  ఈ పురుషాధిక్య ప్రపంచం ఒక ఒంటరి మహిళను వేటాడి వెంటాడి వేధించడం కూడా ఒక కారణం అనిపిస్తుంది

నెమ్మదిగా ఆమె జ్ఞాపకం చెరిగి పోయింది ప్రజలామెను మరిచిపోయారు. హిందూస్థానీ సంగీతలోకం ఆమెను గుర్తు చేసుకోక పోయినా, గ్రామఫోన్ రికార్డుల మీద ఆమె గొంతు “మైనేమ్ ఈజ్ గోహర్ జాన్ “అని తియ్యగా పలుకుతూనే వుంటుంది.  ప్రపంచంలో యేదో ఒకమూలనుండీ  ఆమె జీవితచరిత్రంతా చదివాక మన బుగ్గల మీదనుండీ వెచ్చగా ఒక కన్నీటి చుక్క జారితే అదే మనం ఆమెకు ఇచ్చే నివాళి.

*

రొంపిచర్ల భార్గవి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • తొలి గ్రామఫోన్ రికార్డు గాయని గౌహర్జాన్ జీవిత చరిత్ర హృదంతంగా రాశారు భార్గవి గారు. చాలా బావుంది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు