మూలం : లియో టాల్‌స్టాయ్ (How Much Land Does a Man Need?)
ఇంగ్లీష్ : లూయిస్ మౌడ్
మీరు నన్ను ‘ఓవర్ గాడు’ అనుకోవచ్చు- ఊహ తెలిసినప్పట్నుంచీ ఏదోటి చదవకుండా గడిచిన రోజు ఒక్కటి కూడా లేదు. అయినా- సాహిత్యంలో కథ రాయాలని గాని అనువాదం చేయాలని గాని ఎప్పుడూ- కనీసం కలలో కూడా- అనుకోలేదు.
అయిదారేళ్ల కిందట ఒక ఇన్వెస్టర్ ‘యూట్యూబ్’ ఛానల్ పెడదామని ప్రపోజల్ తో వచ్చాడు. దానికోసం అనేక ప్రోగ్రామ్స్ తో పాటు, ‘100 Great Shorts’ అని ఒక ప్రోగ్రామ్, ‘ప్రపంచ ప్రేమ కథలు’ అని ఇంకో ప్రోగ్రామ్ నేనే చేయాలని ప్లాన్ చేసుకున్నాను. విజువల్ మీడియంకి సరిపోయే ‘100 బెస్ట్ షార్ట్ స్టోరీస్’ సెలెక్ట్ చేసి. అల్మోస్ట్ ఒక పదిహేను కథలమీద extensive వర్క్ కూడా చేసాను. ఆఫీస్ తీసి, దాదాపు ఒక సంవత్సరం ఆ ప్రాజెక్టు మీద వర్క్ చేసాక ఇన్వెస్టర్ తప్పుకున్నాడు.
మూవర్స్ అండ్ పాకర్స్ వాడు ఆఫీస్ షిఫ్టింగ్లో ఆ ఫైల్సన్నీ ఏ బాక్సుల్లో వేసాడో కూడా తెలీదు. సామానంతా మూడునాలుగు చోట్ల పెట్టాల్సివచ్చింది. మొన్న అనుకోకుండా ఒక పాత హార్డ్ డిస్క్ దొరికితే చూసాను. ‘Russian Chapter – Tolstoy Segment’ అని ఫోల్డర్లో ఉన్న ఈ కథని మళ్ళీ చదివాను. ‘ఇదొక గొప్ప విజువల్ నరేటివ్ కదా, భూమి ఉన్నంత వరకూ దానిమీద మనిషి ఉన్నంతవరకూ Relevant గా ఉండే ‘Timeless Classic’ కదా!’ అనిపించింది. విజువల్ గా తీసుకురావడంలో అప్పుడు నేను ఫెయిలైనా ఇప్పుడు Textual గా చూసుకోవాలన్న కోరిక వెనక మాత్రం ఒక driving force ఉంది.
‘తిన్నావా’ అని నన్ను అడిగే ఆత్మీయులు ఇద్దరో ముగ్గురో. అందులో ఆత్మీయుడు మా ‘స్వరం’ గాడు. వాడికి రాయడం ఇష్టం. నాకు చదవడం ఇష్టం. ఎందుకు అడిగాడో తెలీదు, ఒకరోజు సడెన్గా ఫోన్చేసి అవుటాఫ్ ది బ్ల్యూ ‘నాకోసం కథ రాయవూ’ అన్నాడు బుచ్చిబాబు స్టైల్లో. Exactly అలాగే అడిగాడు. ప్రాంక్ అనుకున్నా. కాని రాసేవరకూ నన్ను వదల్లేదు. సాహిత్యంలో అదే నా మొదటి కథ అదే చివరిది కూడా. చదివిన వాళ్ళంతా చాలా బావుంది అన్నారు గానీ ఎవరూ ప్రింట్ చేసి దాన్ని వాలిడేట్ చేయలేదు.
ఆత్మీయుడి ఆశను తీర్చలేకపోయానని గుర్తొచ్చినప్పుడల్లా మనసు కలుక్కుమనేది. కొన్నివేదనలు కూడా Timeless మరి- టాల్ స్టాయ్ కథల్లాగే. కనీసం అనువాద కథతోనైనా ఆత్మీయనేస్తం ఆశను తీరిస్తే బావుంటుంది కదా అనిపించడం, “సారంగ” కి పంపడం, ఈ అనువాదం ఇలా వెలుగులోకి రావడం చకచకా జరిగిపోయాయి.
Swaram- this is just for you. Miss you forever. బావుండు!
*
చెల్లిని చూడ్టానికి ఆ పల్లెటూరికి వచ్చింది అక్క. అక్కాచెల్లెళ్ళిద్దరూ కూర్చుని టీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు.
అక్కకు సిటీలో ఒక వ్యాపారితో వివాహం జరిగింది. చెల్లి ఒక పల్లెటూరి రైతుని పెళ్ళి చేసుకుంది. నగర జీవితంలోని నాజూకైన సంతోషాల గురించి అక్క గొప్పగా చెప్పడం మొదలుపెట్టింది. వాళ్ళు నగరంలో ఎంత విలాసంగా జీవిస్తున్నారో, ఎంత మంచి బట్టలు కట్టుకుంటున్నారో, పిల్లలు ఎంత చక్కటి డ్రెస్సులు వేసుకుంటున్నారో వివరించింది. వాళ్ళు తినే తిండి, తాగే మందు, చూసే నాటకాలు, విందులూ, వినోదాలూ, విహారయాత్రలు… అన్నీ ఎంత గొప్పగా ఉంటాయో వైనంగా వర్ణించింది.
చెల్లికి కోపం వచ్చింది. వ్యాపారి జీవితం వ్యర్థమని తిడుతూ వాదనకు దిగింది.
‘అక్కా, నా జీవితవిధానాన్ని నీకోసం మార్చుకోను. మేమిక్కడ ముతకగా బతుకుతుండొచ్చు గానీ మాది ఎలాంటి ఆందోళన లేని జీవితం. మీరు మాకంటే మెరుగ్గా జీవిస్తున్నారు, అవసరమైన దానికంటే ఎక్కువే సంపాదిస్తున్నారు. కానీ ఏదోరోజు, మీదగ్గర ఉన్నదంతా మీరు పోగొట్టుకునే అవకాశం ఉంది. ‘లాభనష్టాలు కవల పిల్లలు’ అనే సామెత నువ్వు వినే ఉంటావుగా. ఈరోజు బాగా డబ్బున్నవాళ్ళు రేపు తిండికోసం అలమటిస్తూ అడుక్కోవడం తరచుగా జరిగే విషయమే కదా!’
అంతటితో ఆగలేదు చెల్లి, తమ పల్లెజీవితం ఎంత గొప్పదో చెబుతూ అంది, ‘రైతుజీవితం సుఖప్రదమైనది కాకపోవచ్చు గానీ సుదీర్ఘమైనది. మాది సురక్షితమైన జీవనమార్గం. మీలాగా మేమెప్పటికీ సంపన్నులం కాకపోవచ్చు. కానీ మాకెప్పుటికీ తిండికి మాత్రం లోటుండదు.’
చెల్లి చెప్పిందంతా ఓపిగ్గా విని, చిరునవ్వుతో అన్నది అక్క, ‘తిండి ఉంటే చాలా?! దాన్ని పందులతో దూడలతో పంచుకుంటే సరిపోతుందా! గౌరవం, మర్యాద ఇలాంటి వాటి గురించి అసలు నీకేవైనా తెలుసా? చూడూ, మీ ఆయన బానిసలా ఎంత కష్టపడినా సరే, నువ్వు ఇలాగే పెంటకుప్పలా జీవితాంతం బతికి చచ్చిపోతావు, నీ పిల్లల గతి కూడా అంతే.’
‘అయితే ఏంటి?’ చెల్లి టక్కున అందుకుంది,
‘అవును, మోతుబరి పని మోటు పనే, బాగా కష్టమైన పనే! కానీ అందులో ఒక స్థిరత్వం ఉంది. ఎవరిముందూ సాగిలబడి చేయిచాపాల్సిన అవసరం మాకు లేదు. కానీ సిటీలో పలురకరకాల ప్రలోభాల సైతానులు మిమ్మల్ని చుట్టిముట్టి ఉంటాయి. ఈరోజు అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ రేపు మీ ఆయన్ని యే పేకాటో, మద్యమో, స్త్రీవ్యామోహమో లొంగదీసుకుని ఉన్నదంతా నాశనమయ్యే పరిస్థితి రావచ్చు. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరగట్లేదు చెప్పు?’
ఆ ఇంట్లోనే నెగడు పక్కన కూర్చుని, ఆ అక్కాచెల్లెల్ల మాటలు వింటున్నాడు చెల్లిభర్త పహోమ్.
‘అవును, ఇది పచ్చి నిజం’ అనుకున్నాడు పహోమ్. ‘చిన్నప్పట్నుంచీ క్షణం తీరికలేకుండా భూమి తల్లిని దున్నుకుంటూ బతుకుతున్నాం కాబట్టి మా రైతుల బుర్రల్లో ఇలాంటి చెత్తవిషయాలు దూరడానికి అసలు సమయమే లేదు. మాకున్న ఏకైక సమస్య తగినంత భూమి లేకపోవడమే. నాకే గాని ఇంకొంచం భూమి ఉంటే, నేను ఏ సైతానుకి భయపడను కదా!’ అనుకున్నాడు పహోమ్.
అక్కాచెల్లెళ్ళు టీ తాగేసి, కాసేపు బట్టల గురించి మాట్లాడుకుని, టీ-సరంజామా అంతా సర్దేసి నిద్రకు సిద్ధమయ్యారు.
అదే నెగడు పైకెక్కి దర్జాగా కూర్చుని, అక్కాచెల్లెళ్ళు మాట్లాడుకున్నది, భర్త మనసులో అనుకున్నది మొత్తం విన్నాడు ‘సైతాను’.
రైతుభార్య తన భర్త గర్వపడేలా అతణ్ణి పొగుడుతూ వెనకేసుకు రావడం, భర్త కూడా తనకు ఎక్కువ భూమి ఉంటే సైతానుకి కూడా భయపడనని అనుకోవడం చూసి నవ్వుకున్నాడు ’సైతాను’.
‘అలాగే ఇస్తాను.! నీకు కావాల్సినంత భూమిని ఇస్తాను. నీ జీవితంలో అశాంతి రేపుతాను. ఆ భూమి ద్వారానే నిన్ను నా గుప్పిట్లోకి తీసుకుంటాను.’ అనుకున్నాడు సైతాను.
ఆ ఊరికి దగ్గర్లోనే ఒక మహిళా భూస్వామి నివసిస్తుంది. ఆమెకు సుమారు మూడువందల ఎకరాల పెద్ద ఎస్టేట్ వుంది. ఎస్టేట్ మేనేజర్ గా ఒక ముసలి సైనికుడిని నియమించుకుంది. అతను రైతుల మీద జరిమానాల భారం మోపడం మొదలుపెట్టేవరకు ఆమెకు ఊరి రైతులందరితో మంచి సంబంధాలే ఉండేవి.
ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎస్టేట్ మేనేజర్ తో పహోమ్‌కి మళ్ళీమళ్ళీ ఇబ్బందులు ఎదురయ్యేవి. ఒకసారి పహోమ్ గుర్రం ఆమె జొన్నచేనులోకి చొరబడింది. మరోసారి ఒక ఆవు దారితప్పి ఆమె తోటలోకి దూరింది. ఇంకోసారి దూడలు ఆమె మేతభూముల్లోకి ప్రవేశించాయి. చాలాసార్లు పహోమ్ వాటికి జరిమానాలు కట్టాల్సి వచ్చింది. జరిమానా చెల్లించాక అతను అసంతృప్తితో రంకెలేసుకుంటూ ఇంటికెళ్ళి తన కోపాన్నంతా కుటుంబసభ్యుల మీద తీవ్రంగా చూపించేవాడు.
ఆ వేసవికాలమంతా ఎస్టేట్ మేనేజర్ వల్ల బాగా ఇబ్బంది పడ్డాడు పహోమ్. చివరికి చలికాలం వచ్చి పశువులు కొట్టం లోపలే ఉండాల్సి రావడంతో అతను కాస్త ఆనందించాడు. మేత వేసేటప్పుడు మాత్రం పశువులను పచ్చికమైదానాల్లో మేపలేకపోతున్నందుకు మనసులో బాధపడినా, కనీసం జరిమానాలు కట్టే బాధ తప్పిందని సంతోషించాడు.
చలికాలంలో ఎస్టేట్ ఓనర్ తన భూమిని అమ్మబోతోందనీ, హైవే మీదున్న లాడ్జ్ ఓనర్ దాన్ని కొనడానికి బేరసారాలు జరుపుతున్నాడనీ వార్తలు వినిపించాయి. ఈ విషయం వినగానే రైతులందరు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
‘లాడ్జ్ ఓనర్ భూమిని కొంటే, ఎస్టేట్ మేనేజర్ కంటే ఘోరమైన జరిమానాలతో మనల్ని చంపుకు తింటాడు. మనందరం ఆ ఎస్టేట్ మీదే ఆధారపడి ఉన్నాం.’ అనుకున్నారు రైతులు.
రైతులందరూ కలిసి తమ సంఘం తరపున ఆమె దగ్గరికి వెళ్ళి, భూమిని లాడ్జ్ ఓనర్ కి అమ్మొద్దని బతిమాలారు. అందరం కలిసి ఆ భూమిని మంచి రేటుకి మేమే కొనుక్కుంటామని చెప్పారు. దానికి ఆమె కూడా ఒప్పుకుంది. సంఘం తరుపున భూమిని కొంటే అది రైతులందరికి ఉమ్మడి ఆస్తిగా ఉంటుందనుకుని వాళ్ళు ఎస్టేట్ కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీని గురించి చర్చించడానికి వాళ్ళు రెండుసార్లు మీటింగ్ పెట్టుకున్నారు కానీ సమస్యను పరిష్కరించలేకపోయారు. ‘సైతాను’ వాళ్ళల్లో విభేదాలు కలిగించడంతో అందరూ ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఆ తర్వాత రైతులు ఒక్కొక్కరు విడివిడిగా తమ శక్తిమేరకు భూమిని కొనుక్కోవాలని నిర్ణయించుకున్నారు. ఇంతకుముందు ఒప్పుకున్నట్టే ఈ ప్రతిపాదనకు కూడా ఆమె అంగీకరించింది.
తన పక్కరైతు యాభైఎకరాలు కొంటున్నాడనీ, ఎస్టేట్ ఓనర్ ఇప్పుడు సగం నగదు తీసుకుని, మిగతా సగం సంవత్సరం తర్వాత తీసుకోవడానికి ఒప్పుకుందనీ తెలుసుకున్నాడు పహోమ్. అతను అసూయతో రగిలిపోయాడు.
‘భూమంతా అమ్ముడుపోయేలా ఉంది, నాకు మాత్రం ఏమీ మిగలేలా లేదు.’ అనుకున్నాడు.
ఆ తర్వాత అతను భార్యతో మాట్లాడాడు,
‘చూడు, అందరూ భూమిని కొనుక్కుంటున్నారు, మనమూ కనీసం ఇరవైయ్యెకరాలైనా కొనాలి. ఇలా అత్తెసరుగా బతకడం చాలా కష్టంగా ఉంది. ఆ మేనేజర్ జరిమానాలతో మనల్ని నలిపేస్తున్నాడు.’
భార్యాభర్తలిద్దరూ ఆ భూమిని ఎలా కొనగలమా అని బాగా ఆలోచించారు.
వాళ్ళ దగ్గర వంద రూబుళ్ళ మిగులు డబ్బు ఉంది. ఒక గుఱ్రప్పిల్లను, తేనెటీగల్లో సగభాగాన్ని అమ్మేసారు. ఒక కొడుకుని జీతగాడిగా పంపేందుకు ఒప్పుకుని, జీతం మొత్తాన్ని ముందుగానే తీసుకున్నారు. మిగతా డబ్బును బావమరిది దగ్గర అప్పుగా తీసుకున్నారు. రకరకాల మార్గాల్లో డబ్బు పోగుచేసి భూమిని కొనడానికి కావాల్సిన సగం నగదుని సిద్ధం చేసుకున్నారు.
ఈ ఏర్పాట్లన్నీ అవగానే, పహోమ్ ఎస్టేట్ లో నలభై ఎకరాల భూమిని ఎంచుకున్నాడు. అందులో కొంత అడవి కూడా ఉంది. తరువాత ఓనర్ తో బేరం మొదలుపెట్టాడు. ఇద్దరూ ఒక ఒప్పందానికి వచ్చాక ఆమెకు షేక్ హ్యాండిచ్చి, కొంత డబ్బు అడ్వాన్స్ గా ఇచ్చాడు. ఇద్దరూ సిటీకి వెళ్ళి పేపర్ల మీద సంతకాలు చేసారు. వెంటనే సగం డబ్బు చెల్లించి మిగతా సగం రెండేళ్ళలో ఇస్తానని పత్రం రాసిచ్చాడు.
పహోమ్ ఇప్పుడు తన స్వంత భూమికి యజమాని.
అరువు మీద విత్తనాలు తెచ్చుకుని కొన్న భూమిలో నాటాడు. ఆ యేడాది పంట బాగా పండింది. ఒక్క సంవత్సరంలోనే ఎస్టేట్ ఓనర్ కి ఇవ్వాల్సిన డబ్బూ, బావమరిది దగ్గర తీసుకున్న అప్పూ రెండూ తీర్చేసాడు.
పహోమ్ ఇప్పుడు స్వతంత్ర భూస్వామి.
సొంత భూమిని దున్నుతూ విత్తుతూ, సొంత మైదానాల్లో ఎండుగడ్డిని పెంచుతూ, సొంత అడవిలో చెట్లను నరుకుతూ, సొంత పచ్చికబయళ్ళలో పశువులను మేపుతున్నాడు. ఆ భూమిని దున్నుతున్నప్పుడో, ఆ విరగకాసిన మొక్కజొన్న చేలను చూస్తున్నప్పుడో, ఆ పచ్చిక బయళ్ళని పరీక్షించడానికి వెళ్ళినప్పుడో, పహోమ్ మనసు ఆనందంతో పొంగిపోయేది. అక్కడ పెరిగే గడ్డీ, అక్కడ విరిసే పూలూ వేరే వాటికంటే భిన్నంగా ఉన్నట్టు అతనికి అనిపించేది. గతంలో ఆ పొలం పక్కనుంచి వెళ్తున్నప్పుడు అది ఇతర పొలాల్లా మామూలుగానే కనిపించేది. కానీ ఇప్పుడు అదే పొలం చాలా విశిష్టంగా కనబడుతోంది అతనికి.
పహోమ్ చాలా సంతృప్తిగా బతుకుతున్నాడు. అంతా సవ్యంగానే ఉండేది- అతని పొలాల్లో, పచ్చికలో పొరుగురైతులు అక్రమంగా ప్రవేశించకపోయుంటే! అతను వాళ్ళకు చాలా మర్యాదగా చెప్పి చూసాడు. కానీ వాళ్ళు మారలేదు. ఊళ్ళోని కాపరులు అతని గడ్డిభూముల్లోకి పశువులని తోలేవాళ్ళు. రాత్రి మేతకు వదిలిన గుర్రాలు అతని చేలల్లోకి వస్తుండేవి. పహోమ్ ఎన్నోసార్లు వాటిని తరిమేసి వాటి యాజమానుల్ని క్షమించాడు. చాలాకాలం అతను ఎవరి మీద ఏ కేసూ పెట్టలేదు. కానీ చివరికి ఓపిక నశించి డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు వేసాడు. భూమికొరత వల్లే రైతులకు ఈ సమస్య వచ్చిందనీ, వారిలో దురుద్దేశం ఏమీ లేదనీ అతనికి తెలుసు. అయినా ‘ఇక నేను దీన్ని నిర్లక్ష్యం చేయలేను. వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిందే. లేదంటే వాళ్ళు నా ఆస్తి మొత్తం నాశనం చేస్తారు.’ అనుకున్నాడు.
పహోమ్ కోర్టులో కేసు వేసి రైతులకు రెండుమూడు గుణపాఠాలు నేర్పించాడు. ఇద్దరుముగ్గురు రైతులకు జరిమానాలు విధించబడ్డాయి. కాలక్రమంలో పొరుగురైతులు అతని మీద ద్వేషాన్ని పెంచుకోవడం మొదలుపెట్టారు. అప్పుడప్పుడు కావాలనే అతని పొలాల్లోకి తమ పశువులను వదిలేవాళ్ళు. ఒక రైతు మరీ ముందుకెళ్ళి రాత్రివేళ పహోమ్ అడవిలో ప్రవేశించి బెరడు కోసం ఐదు చిన్నచిన్న నిమ్మ చెట్లను నరికేసాడు. ఒకరోజు పహోమ్ అడవిగుండా వెళ్తూ నేలమీద ఏదో తెల్లగా కనిపించడంతో దగ్గరకెళ్ళి చూస్తే చెట్లను కొట్టేసాక మిగిలిన మోడులు కనిపించాయి.
అలివిమాలిన ఆవేశంతో ఊగిపోయాడు పహోమ్.
‘అక్కడొకటి ఇక్కడొకటి నరికితేనే చేనుకు చేటు, అలాంటిది ఆ మూర్ఖుడు మొత్తం గుంపునే నరికేసాడు. ఇది ఎవడి పనో తెలిస్తే వాడి అంతు చూస్తాను’ అనుకున్నాడు.
ఈ పని ఎవరు చేసుంటారా అని బుర్రబద్దలు కొట్టుకున్నాడు పహోమ్. చివరకు ‘ఇది తప్పకుండా ఆ సైమన్ గాడి పనే- వాడు తప్ప ఇంకెవరు చేయలేరు’ అనే నిర్ణయానికి వచ్చి సైమన్ ఇంటికి వెళ్ళాడు. చుట్టపక్కల తిరిగి గమనించాడు. అక్కడ ఏమీ దొరకనప్పటికీ అతనితో బాగా గొడవపెట్టుకున్నాడు. గొడవ తర్వాత అతనికి అది సైమన్ నిర్వాకమేనన్న నమ్మకం మరింత బలపడింది. సైమన్ మీద కేసు పెట్టాడు. సైమన్ ని కోర్టుకు పిలిచారు. అనేక విచారణ పునర్విచారణల తర్వాత సైమన్ కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషిగా ప్రకటించి వదిలేసారు. దాంతో పహోమ్ మరింత ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఆ కోపాన్ని గ్రామపెద్దల మీదా, జడ్జీల మీదా చూపించాడు.
‘ దొంగలు మీ చేతులను లంచంతో తడిపారు, మీలో నిజాయితీ ఉంటే అలాంటి దొంగను ఇలా స్వేచ్ఛగా వదిలిపెడతారా?’ అన్నాడు.
అలా పహోమ్ జడ్జీలతో, ఊరి పెద్దలతో గొడవపెట్టుకున్నాడు. అతని ఇంటిని కాల్చేస్తామన్న బెదిరింపులు కూడా వినిపించసాగాయి. అంత భూమిని సంపాదించినా సంఘంలో అతని స్థానం అంతకు ముందుకంటే దిగజారిపోయింది.
ఇలాంటి సమయంలో గ్రామస్తులు చాలామంది కొత్త ప్రాంతాలకు వలస వెళ్తున్నారనే వార్త ఒకటి ప్రచారంలోకి వచ్చింది.
‘నా భూమిని వదిలెళ్ళాల్సిన అవసరం నాకు లేదు, ఊళ్ళోంచి కొంతమంది వెళ్ళిపోతే, నాకు ఇంకా ఎక్కువ భూమి దొరుకుతుంది. ఆ భూమిని సొంతం చేసుకుంటే నా ఎస్టేట్ ఇంకొంచం పెరుగుతుంది. అప్పుడు మరింత హాయిగా బతుకుతాను. ప్రస్తుతం నాకు ఇక్కడ ఇబ్బందిగానే అనిపిస్తోంది’ అనుకున్నాడు.
ఒకరోజు పహోమ్ ఇంట్లో కూర్చొని ఉండగా, ఆ ఊరిగుండా వెళుతున్న ఒక అపరిచిత రైతుని చూసి ఇంట్లోకి ఆహ్వానించాడు. ఆరాత్రి అతనికి ఆశ్రయం ఇచ్చి, భోజనం పెట్టాడు. అతనితో మాట్లాడుతూ మీరు ఎక్కణ్ణించి వచ్చారని అడిగాడు. తాను ‘వోల్గా’ నదికి అటువైపునుంచి వచ్చాననీ, అక్కడే పని చేస్తున్నాననీ చెప్పాడు అపరిచితుడు. ఈమాటా ఆమాటా కలిసి అనేక మాటలకు దారితీసాయి.
తానున్న ప్రాంతానికి చాలామంది వలస వెళ్తున్నారనీ, తన ఊరివాళ్ళు కూడా కొంతమంది అక్కడ స్థిరపడిపోయారని, ఆ గ్రామసంఘంలో చేరిన ప్రతివ్యక్తికి ఇరవయ్యైదు ఎకరాల భూమిని ఉచితంగా ఇస్తున్నారని చెప్పాడతను. అది ఎంత సారవంతమైన నేలనో వివరిస్తూ, ఆ ప్రాంతంలో నాటిన ‘రాగులు’ గుర్రమంత ఎత్తు పెరుగుతాయనీ, ఎంత మందంగా ఉంటాయంటే- కేవలం ఐదుకొడవళ్ళ కోతకే ఒక మోపు తయారౌతుందనీ, ఖాళీ చేతులతో అక్కడికి వెళ్ళిన ఒక రైతు ఇప్పుడు పాతిక ఎకరాలూ, ఆరుగుర్రాలూ, రెండు గేదెలతో భూస్వామి అయ్యాడని చెప్పాడు.
పహోమ్ హృదయం కోరికతో కొట్టుమిట్టాడింది. బాగా ఆలోచించాడు.
‘వేరేచోట ఇంతకన్నా బాగా బతకగలిగినప్పుడు, ఇరుకుగొయ్యి లాంటి ఈ బతుకుతో నేనెందుకు ఇబ్బంది పడాలి? ఇక్కడ ఇల్లూ, పొలమూ అమ్మేసి ఆ డబ్బుతో అక్కడ కొత్తగా జీవితం మొదలుపెడతాను. అన్నీ కొత్తగా అమర్చుకుంటాను. కిక్కిరిసినట్టుండే ఈ ఊళ్ళో ఎప్పుడూ ఏదో ఒక చిక్కు ఎదురవుతూనే ఉంది. వెళ్తాను, కానీ ముందు నేనొక్కణ్ణే అక్కడికెళ్ళి అన్నీ స్వయంగా చూసి వివరంగా తెలుసుకుంటాను.’ అనుకున్నాడు.
ఎండాకాలం దగ్గర పడుతుండగా పహోమ్ ప్రయాణం మొదలుపెట్టాడు. స్టీమర్‌లో వోల్గా నదివైపు ప్రయాణించి, సమారా వరకు వెళ్ళాడు. అక్కడి నుంచి మళ్ళీ మూడొందల మైళ్ళు నడిచి ఆఖరికి ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. అపరిచితుడు చెప్పినట్లుగానే అక్కడి పరిస్థితులు అద్భుతంగా ఉన్నాయి. రైతులకు పుష్కలమైన భూమి ఉంది. ప్రతి ఒక్కరికీ ఇరవయ్యైదెకరాల సామూహిక భూమిని సాగుకోసం ఇచ్చారు. అంతేకాదు, డబ్బున్నవాళ్ళు రెండు షిల్లింగులకు ఒక ఎకరా చొప్పున కావాల్సినంత భూమిని స్వంతంగా కొనుక్కోవచ్చు.
అవసరమైన సమాచారం మొత్తం తెలుసుకుని, ఆకురాలే కాలానికి ఇంటికి తిరిగొచ్చి ఆస్తులు అమ్మడం మొదలుపెట్టాడు పహోమ్. తనకున్న భూమినంతా మంచి లాభంతో అమ్మాడు. ఇల్లు, పశువులు అన్నీ అమ్మేసి, గ్రామసంఘలో సభ్యత్వం కూడా రద్దు చేసుకున్నాడు. అన్నీ సిద్ధం చేసుకున్నాక, వసంతకాలం వచ్చే వరకు ఆగి, కుటుంబంతో సహా ఆ ప్రాంతానికి బయలుదేరాడు.
కొత్త ప్రాంతానికి ఊరికి చేరుకున్న వెంటనే పహోమ్ అతని కుటుంబం ఒక పెద్ద గ్రామసంఘంలో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. గ్రామపెద్దలను విందులతో అలరించి అవసరమైన డాక్యుమెంట్లు తీసుకున్నాడు. పహోమ్, అతని కొడుకులకీ కలిపి ఐదువాటాల ఉమ్మడిభూమిని కేటాయించారు, అంటే మొత్తం నూటాఇరవయ్యైదు ఎకరాలు. మొత్తం ఏకచెక్క కాకుండా వేర్వేరు భూముల్లో ఇచ్చారు. సామూహిక పచ్చికబయళ్ళను ఉపయోగించుకునే హక్కు దీనికి అదనం.
పహోమ్ తనకు అవసరమైన ఇళ్ళు, పాకలు కట్టుకున్నాక, పశువులను కొనుగోలు చేసాడు. వొట్టి సంఘపు సాగుభూమినే లెక్కేసినా పాతఊరి కంటే మూడింతలు ఎక్కువ భూమిని సంపాదించుకున్నాడు. పైగా ఇది జొన్నపంటకు అనుకూలమైన మాగాణి. అతని జీవన ప్రమాణాలు పదిరెట్లు పెరిగాయి. విశాలమైన సాగుభూమి, పచ్చికబయళ్ళు ఉండటంతో కావాల్సినన్ని పశువుల మందలను పెంచుకునే అవకాశం కూడా లభించింది.
ముందుగా ఇల్లు సర్దుకునే సందడిలోనూ, ఆ తర్వాత నిర్మాణాల తతంగంలోనూ పడిపోయిన పహోమ్ అన్నింటిని ఆనందంగానే స్వీకరించాడు. ఒకసారి ఆ ప్రాంతానికి అలవాటు పడ్డాక, ఇక్కడ కూడా తగినంత భూమి లేదనుకోవడం మొదలుపెట్టాడు. మొదటి సంవత్సరం అతను గోధుమలు పండించాడు. మంచి దిగుబడి వచ్చింది. గోధుమలు ఇంకా ఎక్కువ సాగుచేయాలనుకున్నాడు కానీ అందుకు తగినంత ఉమ్మడిభూమి అందుబాటులో లేదు. అంతేకాదు, ఇప్పటికే ఉపయోగించిన భూమి తిరిగి వాడేందుకు వీలులేదు. గోధుమలను కొత్తభూమిలో గానీ బీడుభూమిలో గాని పండిస్తారు. ఒకే నేలలో గోధుమలను ఒకటీరెండేళ్ళు మాత్రమే పండిస్తారు. తరువాత కొంతకాలం భూమిని ఖాళీగా ఉంచి మళ్ళీ సహజంగా గడ్డిదుబ్బులు పెరిగే వరకు వదిలేస్తారు. అక్కడ అలాంటి భూమిని కోరుకునేవారు కూడా చాలామందే ఉన్నారు. కానీ అందరికీ సరిపడేంత భూమి లేదు.
నెమ్మదిగా భూమి కోసం ప్రజలు తగాదా పడటం మొదలైంది. డబ్బున్నవాళ్ళు గోధుమల సాగుకోసం ఎక్కువ భూమి కావాలనుకునేవారు. పేదవాళ్ళు తమ భూమిని కౌలుకిచ్చి పన్నులు కట్టుకునేంత డబ్బు సంపాదించాలనుకునేవారు. ఈసారి పెద్ద ఎత్తున గోధుమలు పండించాలని నిర్ణయించుకున్నాడు పహోమ్. ఒక వ్యాపారి నుండి భూమిని కౌలుకి తీసుకుని విస్తారంగా గోధుమలు సాగుచేసాడు. ఈసారి కూడా మంచి పంట వచ్చింది. కానీ అతని పొలం ఊరికి దూరంగా ఉండటం వల్ల పదిమైళ్ళ కంటే ఎక్కువదూరం గోధుమలను రవాణా చేయాల్సి వచ్చేది. కొంతకాలం తర్వాత పహోమ్ ఏం గమనించాడంటే- కొంతమంది ‘రైతు-వ్యాపారులు’ తమ వ్యవసాయ క్షేత్రాల్లోనే ఇల్లుకట్టుకుని అక్కడే ఉంటూ మరింత సంపన్నులవుతున్నారని.
అతను మళ్ళీ ఆలోచించాడు, ‘ఏదైనా బంజరు భూమిని కొని, దాన్లో ఓ ఇల్లు కట్టుకుంటే, ఆ తీరే వేరు. అన్నీ అందంగా ఓకేచోట అమర్చుకోవచ్చు.’ అనుకున్నాడు.
స్వంతంగా బంజరు భూమిని కొనాలన్న ఆలోచన పహోమ్ ని పదేపదే వెంటాడింది.
అతను మరో మూడుసంవత్సరాలు ఇదే పద్దతిలో వ్యవసాయం చేసాడు. అంటే- భూమిని కౌలుకి తీసుకోవడం, గోధుమలు సాగుచేయడం! కాలం అనుకూలించింది. మంచి దిగుబడి వచ్చింది. కొంత డబ్బు వెనకేయగలిగాడు. ఇదే పద్దతిలో అతను సంతృప్తిగా బతికే అవకాశం ఉంది. కానీ ప్రతి సంవత్సరం వేరేవాళ్ళ భూమిని అద్దెకు తీసుకోవడం, దానికోసం ఉరుకులాడ్డం అతనికి పెద్ద సమస్యగా అనిపించసాగింది. మంచి భూమి ఎక్కడున్నా దానికోసం రైతులు పోటీపడేవారు. చురుకుగా, చాకచక్యంగా లేని రైతులకు ఆ ఏడాది ఎటువంటి భూమి దొరికేది కాదు.
మూడో సంవత్సరం పహోమ్ ఒక వ్యాపారితో కలిసి కొంతమంది రైతుల నుండి పచ్చికభూమిని కౌలుకి తీసుకున్నాడు. భూమిని దున్నాక, సరిగ్గా విత్తనాలు నాటే సమయంలో ఒక వివాదం చోటు చేసుకుని రైతులు కోర్టుకెక్కడంతో అంతా గందరగోళంగా మారి అతని శ్రమంతా వృథా అయిపోయింది.
‘ఇదే నా స్వంత భూమి అయితేనా?’ అనుకున్నాడు పహోమ్.
‘నేను స్వతంత్రంగా ఉండాలి. అప్పుడు ఈ అనవసరమైన చికాకులు ఉండవు’ అని మథనపడ్డాడు.
ఆరోజు నుండి కొనుక్కోవడానికి ఎక్కడైనా భూమి దొరుకుతుందేమోనని వెతకడం మొదలుపెట్టాడు. పదమూడువందల ఎకరాలు కొని, ఆర్థిక ఇబ్బందుల వల్ల దాన్ని చౌకగా అమ్మడానికి సిద్ధంగా ఉన్న ఒక రైతు అతనికి దొరికాడు. పహోమ్ అతనితో గీచిగీచి బేరమాడి చివరకు పదిహేనువందల రూబిళ్లకు భూమిని కొనేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. సగం డబ్బు ఇప్పుడూ, మిగతాది తరువాత చెల్లించేలా ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు.
గడువు సమీపిస్తుందనగా, ఒకరోజు ఒక వ్యాపారి పహోమ్ ఇంటి దగ్గర తన గుర్రానికి మేత వేయడానికి ఆగాడు. పహోమ్ అతనితో టీ తాగుతూ మాట్లాడాడు. తాను బష్కీర్ ప్రాంతం నుంచి వస్తున్నానని, అక్కడ కేవలం వెయ్యి రూబిళ్లకే పదమూడువేల ఎకరాల భూమిని కొనుగోలు చేసానని చెప్పాడు ఆ వ్యాపారి.
పహోమ్ ఆశ్చర్యపోయి అతని మీద ప్రశ్నల వర్షం కురిపించాడు.
‘అక్కడ భూమిని పొందాలంటే మనం చేయాల్సిందల్లా అక్కడి నాయకులతో స్నేహం చేయడమే. నేను దాదాపు వంద రూబిళ్ళ విలువైన దుస్తులు, కార్పెట్లు ఇచ్చాను. అదనంగా ఒక టీ డబ్బా కూడా ఇచ్చాను. అలాగే మందు తాగేవారికి వైన్ కూడా ఇచ్చాను. చివరికి రెండు ‘పెన్సు’ల కంటే తక్కువ ధరకు ఎకరా భూమిని కొన్నాను’ అని చెప్పాడు. పహోమ్ కు భూమి దస్తావేజులు చూపిస్తూ ‘ఆ భూమి నదీతీరంలో ఉంది, పైగా మొత్తం గడ్డిభూమి. ఇప్పటి వరకూ వ్యవసాయం చేయని కొత్త నేల’ అన్నాడు,
పహోమ్ ఇంకొన్ని ప్రశ్నలు వేసాడు. వ్యాపారి మరిన్ని విషయాలు వివరించాడు. ‘అక్కడ భూమి చాలా విస్తారంగా ఉంది. సంవత్సరమంతా నడిచినా దాన్ని చుట్టి రాలేము. అదంతా బష్కీర్ ప్రజల భూమి. వాళ్ళు గొర్రెల్లా అమాయకులు. వాళ్ళ దగ్గర దాదాపు ఉచితంగానే భూమిని కొట్టేయచ్చు.’ అన్నాడు.
తక్కువ డబ్బుతో ఎక్కువ భూమిని సొంతం చేసుకోవడానికి ఇది అదృష్టవశాత్తు దొరికిన అవకాశంగా కనిపించింది పహోమ్‌కు. బాగా ఆలోచించాడు.
‘ఇప్పుడు నా దగ్గరున్న వెయ్యి రూబిళ్లతో ఇక్కడ కేవలం పదమూడువందల ఎకరాలు మాత్రమే ఎందుకు కొనాలి? ఆ తర్వాత అప్పుతో ఎందుకు బాధపడాలి? అక్కడికి వెళ్తే, ఇదే డబ్బుకి పదిరెట్లు ఎక్కువ భూమి వస్తుంది కదా.’
ఆ ప్రాంతానికి వెళ్లడం ఎలాగో అతనని అడిగి తెలుసుకున్నాడు. వ్యాపారి వెళ్ళిపోగానే వెంటనే అక్కడికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ఇంటి బాధ్యత భార్యకు వదిలిపెట్టి, పనివాణ్ణి వెంటబెట్టుకుని బయలుదేరాడు. ఒక నగరానికి చేరుకుని, వ్యాపారి సలహా ఇచ్చినట్లుగానే ఒక డబ్బా టీ, కొంత వైన్, ఇంకా కొన్ని బహుమతులు కొన్నాడు. అక్కణ్ణించి మరో మూడువందల మైళ్ళకు పైగా ప్రయాణించి, ఏడవ రోజుకి బష్కీర్ ప్రజలు గుడారాలు వేసుకున్న ప్రాంతానికి చేరుకున్నాడు. అచ్చం వ్యాపారి చెప్పినట్టుగానే ఉంది ఆ ప్రాంతం.
బష్కీర్ ప్రజలు నదితీరంలోని విశాల మైదానాల్లో టెంట్లు వేసుకుని నివసిస్తారు. వాళ్ళు భూమిని దున్నరు. రొట్టెని తినరు. పచ్చని పసిరికతో పెరిగిన పశువుల మీదే ఆధారపడతారు. గుర్రాలనీ పశువులనీ మందలు మందలుగా మైదానాల్లో మేపుతారు. పిల్లగుర్రాలను టెంట్ల వెనుక కట్టేసి ఆడగుర్రాలను తీసుకొచ్చి రోజుకు రెండుసార్లు పాలు పితుకుతారు. ఆడవాళ్ళు ఆ పాలతో ప్రత్యేకమైన ‘కుమిస్’ అనే పుల్లటి ఆల్కహాల్, పన్నీర్ తయారుచేస్తారు. మగవాళ్ళ విషయానికొస్తే- టీ సేవిస్తూ, కుమిస్ తాగుతూ, మాంసం తింటూ, పిల్లనగ్రోవి లాంటి ‘పైప్’ వాయిస్తూ జీవితాన్ని ఆస్వాదించడమే పని. అందరూ కాస్త బలంగానూ, చాలా ఆనందంగానూ ఉంటారు. ఎండాకాలమంతా అసలు ఏ పని చేయకుండా గడుపుతారు. బష్కీర్లు చదువురాని అమాయకులు. వాళ్ళకు రష్యన్ భాష రాదు. స్వభావరీత్యా సహృదయులు.
కొత్త సందర్శకుడిని చూడగానే బష్కీర్లు టెంట్ల నుండి బయటికి వచ్చి పహోమ్ చుట్టూ చేరారు. ఒక అనువాదకుడిని వెతికి పట్టుకున్నారు. తాను భూమి గురించి మాట్లాడేందుకు వచ్చానని చెప్పాడు పహోమ్. వాళ్ళు సంతోషపడినట్టు కనిపించారు. ఉన్నవాటిల్లో ఒక మంచి టెంటులోకి తీసుకెళ్ళి, కార్పెట్ మీదున్న మెత్తటి దిండ్లమీద కూర్చోబెట్టి, పహోమ్ చుట్టూ కూర్చున్నారు. టీ, కుమిస్ ఇచ్చారు. ఒక గొఱ్ఱెను కొట్టి మాంసం వండిపెట్టారు. పహోమ్ తన బగ్గీలోంచి కొన్ని బహుమతులు తెచ్చి బష్కీర్‌లకు బహూకరించాడు. అందరికీ ‘టీ’ పంచిపెట్టాడు. వాళ్ళు చాలా సంతోషించారు. తమలో తాము చాలాసేపు మాట్లాడుకున్నాక అనువాదకుడికి ఏదో చెప్పమని పురమాయించారు. అతను పహోమ్ తో చెప్పాడు.
‘వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారని మీకు చెప్పాలనుకుంటున్నారు. అతిథులకు ఆనందం కలిగించడానికీ, వాళ్ళిచ్చిన బహుమతులకు బదులు చెల్లించడానికీ, మేము చేయగలిగినదంతా చేయడం మా ఆచారం. మీరు మాకు మంచి బహుమతులు ఇచ్చారు. ఇప్పుడు మా దగ్గర ఉన్నవాటిలో మీకు బాగా నచ్చినవేవో చెప్పండి, మేము వాటిని మీకు బహూకరించవచ్చు.’
‘ఇక్కడ నాకు బాగా నచ్చింది మీ భూమి మాత్రమే. మా నేలంతా రద్దీగా మారింది. మా మట్టిలో సారం వొట్టిబోయింది. మీకు చాలా భూమి ఉంది, పైగా మంచి మాగాణి. ఇలాంటి భూమిని నేను ఇంతకుముందెప్పుడు చూడలేదు.’
పహోమ్ చెప్పింది అనువాదకుడు వాళ్ళకి తర్జుమా చేసాడు.
బష్కీర్లు తమలో తాము మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో పహోమ్ కి అర్థంగాకపోయినా వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారనీ, అరుపులు కేకలతో నవ్వుతున్నారనీ గ్రహించగలిగాడు. వాళ్ళు మౌనం దాల్చగానే అనువాదకుడు అందుకున్నాడు.
‘మీ బహుమతులకు బదులుగా మీకు కావలసినంత భూమిని సంతోషంగా ఇస్తామని నేను మీకు చెప్పాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మీకు కావలసినంత భూమిని మీరు కేవలం చేతితో చూపిస్తే చాలు, అదంతా మీదే అవుతుంది.’
బష్కీర్లు కొద్దిసేపు మళ్ళీ ఏదో మాట్లాడుకుంటూ హఠాత్తుగా వాదనకు దిగారు. వాళ్ళు దేని గురించి వాదులాడుకుంటున్నారని పహోమ్ అనువాదకుడిని అడిగాడు.
‘భూమి విషయం మా నాయకుడిని అడగాలనీ, ఆయన లేకుండా నిర్ణయం తీసుకోకూడదని కొందరూ, ఆయన తిరిగొచ్చే వరకు వేచిచూడాల్సిన అవసరం లేదని మరికొందరూ వాదులాడుకుంటున్నారు.’ అన్నాడు.
బష్కీర్లు వాదన కొనసాగిస్తుండగానే ‘నక్క-బొచ్చు’ తో చేసిన పెద్ద టోపీ పెట్టుకుని ఒక వ్యక్తి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దంగా లేచి నిల్చున్నారు.
‘అదిగో, అతనే మా నాయకుడు.’ అన్నాడు అనువాదకుడు.
పహోమ్ వెంటనే తన బగ్గీలోంచి ఒక మంచి చొక్కా, ఐదు పౌండ్ల టీ తీసుకొచ్చి నాయకుడికి ఇచ్చాడు. అతను వాటిని తీసుకుని పీఠమ్మీద కూర్చున్నాడు. బష్కీర్లు వెంటనే అతనికి ఏదో చెప్పడం మొదలుపెట్టారు. నాయకుడు కొద్దిసేపు వాళ్ళు చెప్పేది విని, నిశ్శబ్దంగా ఉండమన్నట్టు తలతో సంకేతం ఇచ్చి, పహోమ్ వైపు తిరిగి రష్యన్ భాషలో మాట్లాడాడు.
‘సరే, అలాగే ఇస్తాం. మీకు నచ్చిన భూమిని ఎంచుకోండి. మా దగ్గర చాలా భూమి ఉంది.’
పహోమ్ ఆలోచించాడు.
‘ఎలాగైనా నేను కావాలనుకున్నంత భూమిని తీసుకోవాలి? అది భద్రంగా ఉండడానికి ఒక దస్తావేజు రాసుకోవాలి. లేదంటే ఇప్పుడు ‘ఇది నీది’ అని చెప్పి, తరువాత దాన్ని వెనక్కి తీసుకోవచ్చు.’
పహోమ్ గొంతెత్తి బిగ్గరగా నాయకుడితో చెప్పాడు,
‘మీ దయార్ధ పలుకులకు ధన్యుణ్ణి. మీ దగ్గర చాలా భూమి ఉన్నా, అందులో నేను అడిగేది కొంచమే. కానీ మీ భూమిలో ఏ భాగం నా సొంతమో ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు దాన్ని కొలిచి నా పేరు మీద రాసివ్వగలరా? జననమరణాలు దైవాధీనాలు. మీరు మంచివాళ్ళు కాబట్టి ఇప్పుడు నాకు ఇస్తున్నారు, కానీ మీ తదనంతరం మీ పిల్లలు ఎప్పుడైనా వెనక్కి తీసుకోవాలనుకోవచ్చు కదా.’
‘మీరు అడిగింది న్యాయమైన కోరికే. మేము భూమిని మీ పేరు మీద రాసిస్తాం.’
‘ఇంతకుముందు ఇక్కడికి ఒక వ్యాపారి వచ్చాడు, మీరు అతనికి కూడా కొంచం భూమిని ఇచ్చారని నేను విన్నాను. దానికి సంబంధించిన పట్టా మీద సంతకం కూడా చేశారట. నాకు కూడా అలాగే పట్టా హక్కు కల్పించండి.’
నాయకుడు విషయం అర్థం చేసుకున్నాడు.
‘సరే, ఆ పని చాలా తేలిగ్గానే అయిపోతుంది. మా దగ్గర దస్తావేజులు రాసేవాడు ఉన్నాడు. మేము మీతో నగరానికి వచ్చి పట్టాపత్రాన్ని సరిగ్గా తయారుచేసి ఇస్తాం.’
‘భూమి ధర ఎంత?’
‘మా ధర ఎప్పుడూ ఒకటే. రోజుకి వెయ్యి రూబిళ్ళు.’
పహోమ్ కి అర్థం కాలేదు.
‘ఒక్క రోజుకా? అదేం లెక్క? మొత్తం ఎన్ని ఎకరాలు?’
‘మేము ఎకరాల్లో లెక్కపెట్టం. రోజు లెక్కనే అమ్ముతాం. మీరు ఒక్కరోజులో కాలినడకన ఎంత భూమి చుట్టి రాగలిగితే అంత మొత్తం మీదే, ధర మాత్రం వెయ్యి రూబిళ్ళు.’
పహోమ్ ఆశ్చర్యపోయాడు.
‘ఒకరోజులో చాలా పెద్ద భూభాగాన్ని చుట్టి రావచ్చు కదా!’
నాయకుడు నవ్వాడు.
‘అప్పుడు అదంతా మీదే! కానీ ఒక షరతు. ఎక్కడ మొదలుపెట్టారో- అక్కడికి- అదేరోజు- తిరిగి రావాలి. రాలేకపోతే మీ డబ్బు పోయినట్టే.’
‘కానీ నేను వెళ్ళిన దారిని మీరు గుర్తుపట్టగలరా?’
‘ఖచ్చితంగా! మనందరం మీకు నచ్చిన ఒక చోటుకి వెళతాం. మేం అక్కడే ఉండిపోతాం, మీరు ఆ చోటు నుంచి నడక ప్రారంభించి చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికే రావాలి. మీతో ఒక ‘పార’ని తీసుకెళ్ళి అవసరమైన చోటుల్లో, అన్ని మలుపుల్లో గుర్తుగా ఒక గుంతను తవ్వి మళ్ళీ అదే మట్టితో పూడ్చేయండి. ఆ తరువాత మేము ఒక గుంత నుండి ఇంకో గుంతకు నాగలి పట్టుకుని తిరుగుతాం. ఎంత పెద్ద ప్రదక్షిణ చేయాలనుకుంటే అంత పెద్దది చేసుకోండి. కానీ మొదలుపెట్టిన చోటుకి తిరిగి సూర్యుడు అస్తమించేలోపు చేరుకోవాలి. అలా చేస్తే మీరు చుట్టివచ్చిన భూమి మొత్తం మీదే!’
పహోమ్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. మరుసటిరోజే నడక మొదలుపెట్టాలన్న నిర్ణయం జరిగింది. తరువాత వాళ్ళు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. కొంచెం కుమిస్ తాగి, కొంత మాంసం తిని మళ్ళీ టీ తాగారు. అప్పటికి రాత్రయ్యింది. బష్కీర్లు పహోమ్ పడుకోవడానికి ఏర్పాట్లు చేసి మెత్తటి పక్షిఈకల పరుపును ఇచ్చారు. పొద్దుపొడవకుండానే బయలుదేరి, సూర్యోదయానికి ముందే అనుకున్న చోటుకి చేరుకుంటామని బష్కీర్లు మాట ఇచ్చి వీడ్కోలు తీసుకున్నారు.
పక్షిఈకల పరుపుపైన పడుకున్నా పహోమ్ కి నిద్రపట్టలేదు. రాత్రంతా భూమి గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు.
‘నేను ఎంత ఎక్కువ భూమిని సొంతం చేసుకోగలనో! ఒకరోజులో నేను తేలిగ్గా ముప్పైయ్యైదు మైళ్ళ వరకు నడవగలను. సూర్యుడు సుదీర్ఘ సమయం ఉండే రోజులివి. ముప్పయ్యైదు మైళ్ళ పరిథి అంటే ఎంత పెద్ద విస్తీర్ణమో కదా! నాసిరకపు నేలను అమ్మేస్తాను, లేదంటే వేరే రైతులకు కౌలుకి ఇస్తాను, నాణ్యమైన భూమిని మాత్రం నేనే సాగుచేసుకుంటాను. రెండు ఎడ్లమందలను కొంటాను. ఇద్దరు కూలీలను పెట్టుకుంటాను. సుమారు నూటయాభై ఎకరాలను సాగుకోసం పెట్టుకుని, మిగిలిన భూమిలో పశువులను మేపుకుంటాను.’
పహోమ్ రాత్రంతా మేల్కొని తెల్లవారుజామున కొద్దిసేపు నిద్రపోయాడు. కళ్ళు మూసుకున్నాక అతనికి ఒక కల వచ్చింది. అతను అదే టెంటులో పడుకుని ఉండగా బయట ఎవరో గట్టిగా నవ్వుతున్న శబ్దం వినిపించింది. ఎవరై ఉంటారా అని ఆశ్చర్యపోతూ బయటికెళ్ళి చూసాడు. అక్కడ బష్కీర్ నాయకుడు గుడారం ముందు కూర్చుని పొట్టపట్టుకుని దొర్లుతున్నట్టుగా నవ్వుతున్నాడు. దగ్గరకు వెళ్ళి ‘మీరు ఎందుకు నవ్వుతున్నారు?’ అని అడగబోయి ఒక్కసారి ఆగి- అతణ్ణి గమనించాడు. అతను బష్కీర్ నాయకుడు కాదు- కొద్దిరోజుల క్రితం తన ఇంటిదగ్గర ఆగి భూమి గురించి చెప్పిన వ్యాపారి! పహోమ్ ఆశ్చర్యంగా వ్యాపారిని చూసి, ‘మీరెప్పుడు వచ్చారిక్కడికి?’ అని అడగబోయి మళ్ళీ పరీక్షగా చూసాడు- అతను వ్యాపారి కూడా కాదు. వోల్గానది అవతల నుంచి తన పాతగ్రామానికి వచ్చిన అపరిచిత రైతు! తర్వాత అతను రైతు కూడా కాదనీ- కొమ్ములు, గోర్లు కలిగిన సైతాను స్వయంగా అక్కడ కూర్చుని నవ్వుతున్నాడని గ్రహించాడు. సైతాను ముందర చొక్కా, ప్యాంటూ వేసుకున్న ఒక మనిషి నేలమీద తలక్రిందులుగా చచ్చిపడున్నాడు. పహోమ్ ఇంకొంచం దగ్గరకి వెళ్ళి ‘ఎవరా మనిషి’ అని పరీక్షగా చూసాడు. ఆ మృతదేహం ఎవరిదో కాదు- తనదే! ఆ భయానక దృశ్యం చూసి పహోమ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచాడు.
‘మనుషులు ఎలాంటి కలలు కంటారో కదా!’ అని తనలోతానే అనుకుంటూ చుట్టూ చూసాడు. తెరిచిన తలుపులోంచి వెలుతురు లోపలికి రావడం గమనించాడు.
‘ముందు వీళ్ళని లేపాలి, వెంటనే బయల్దేరాలి,’ అనుకున్నాడు. గబగబా లేచి, బగ్గీలో పడుకున్న తన పనివాణ్ణి లేపి బండి కట్టమని చెప్పాడు. తర్వాత బష్కీర్లను లేపి, ‘భూమిని కొలవడానికి మనం మైదానానికి వెళ్ళాల్సిన సమయం అవుతోంది,’ అన్నాడు. బష్కీర్లు లేచి ఒకచోట చేరారు. నాయకుడు కూడా వచ్చాడు. వాళ్ళు కుమిస్ తాగడం ప్రారంభించారు. పహోమ్ కి కూడా టీ ఇచ్చారు కానీ అతను తాగలేదు.
‘మనం ఈరోజు వెళ్ళాలంటే ఇప్పుడే వెళ్ళాలి. సమయం దాటిపోతోంది,’ అన్నాడు కంగారుగా.
బష్కీర్లు సిద్ధమవ్వగానే అందరూ కలిసి బయలుదేరారు. కొందరు గుర్రాల మీద ఎక్కారు. మరికొందరు బండ్లల్లో బయలుదేరారు. పారను తీసుకుని తన చిన్నబగ్గీలో పనివాడితో కలిసి వెళ్ళాడు పహోమ్. వాళ్ళు మైదానానికి చేరుకునే సమయానికి అరుణారుణకాంతి అప్పుడే అంతటా వ్యాపించసాగింది. బష్కీర్లందరూ షిఖాన్ అని పిలిచే ఒక కొండపైకి ఎక్కి, బండ్లు, గుర్రాల మీంచి దిగి, ఒకచోట మోపయ్యారు. నాయకుడు పహోమ్ దగ్గరకు వచ్చి, తన చేతిని కొండకిందున్న సువిశాలమైన మైదానం వైపు చాపుతూ అన్నాడు:
‘చూడండి, మీ చూపు ఎంతవరకు చేరగలుగుతుందో ఆ భూమి అంతా మాదే. మీకు నచ్చిన భూభాగాన్ని మీరు తీసుకోవచ్చు.’
పహోమ్ కళ్ళు ఆనందంతో మెరిసాయి. అదంతా అస్సలు సాగులోకి రాని కొత్తభూమి. నేలంతా అరచేతిలా సమతలంగా, గసగసాల విత్తనంలా నల్లగా ఉంది. కందాకాల్లో రకరకాల గడ్డి మొక్కలు ఛాతీ ఎత్తు పెరిగి ఉన్నాయి. నాయకుడు తన నక్క-తోలు టోపీని నేలమీద పెట్టి చెప్పాడు:
‘ఇదే గుర్తు. ఇక్కడినుంచి మొదలుపెట్టి తిరిగి ఇక్కడికే రావాలి. మీరు చుట్టివచ్చిన భూమంతా మీదే!’
పహోమ్ తన దగ్గరున్న డబ్బును తీసి టోపీ మీద పెట్టాడు. తర్వాత పైకొటును తీసేసాడు. చేతులులేని లోకోటు మాత్రమే వొంటిమీద మిగిలింది. ‘నడుంకట్టు’ వొదులుచేసి పొట్టకిందుగా గట్టిగా కట్టుకున్నాడు. లోకోటు రొమ్ముజేబులో చిన్న రొట్టెసంచిని పెట్టుకున్నాడు. నీటి సీసాను నడుంకట్టుకు భిగించాడు. బూట్లను పైవరకు గట్టిగా లాక్కుని సర్దుకున్నాడు. పనివాడి దగ్గర పారను తీసుకుని నడక మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు నిలబడ్డాడు. ఏ దిశలో వెళితే బావుంటుందో కాసేపు ఆలోచించాడు- అన్ని దిక్కులూ ఆకర్షణీయంగానే కనిపించాయి.
‘ఏదేమైనా సరే, ఉదయించే ఆ సూర్యుడి వైపుకే వెళ్తాను’ అని నిర్ణయించుకున్నాడు.
తూర్పు వైపు తిరిగి, వ్యాయామం చేస్తున్నట్టుగా శరీరాన్ని ఒడుపుగా వంచి, చేతులు ఆటూ ఇటూ చాచి, ఆకాశపుటంచున సూర్యుడు ప్రత్యక్షమయ్యే క్షణంకోసం ఎదురు చూస్తున్నాడు.
‘సమయం అస్సలు వృథా చేయకూడదు, చల్లగా ఉన్నప్పుడే ఎక్కువ దూరం నడవాలి.’ అనుకున్నాడు.
తొట్టతొలి కిరణం గగనతలంలో మెరుస్తుండగా పారను భుజానేసుకుని పహోమ్ మైదానంలోకి అడుగుపెట్టాడు.
అటు నెమ్మదిగా కాకుండా, ఇటు వేగంగా కాకుండా మధ్యస్థంగా నడవడం మొదలుపెట్టాడు. ఒక వెయ్యిగజాలు నడిచాక, గుర్తుకోసం చిన్న గుంతను తవ్వి, దాన్ని మట్టితో పూడ్చి, ఎత్తుగా కనిపించేలా గడ్డిదుబ్బులున్న మట్టిబెడ్డలను ఒకదాని మీద ఒకటి పేర్చి ముందుకు కదిలాడు. కొంచం నడకకు అలవాటు పడటంతో శరీరంలో తొట్రుపాటు తగ్గి, వేగం పెరిగింది. కొంత దూరం వెళ్ళాక మరొక గుంతను తవ్వాడు.
పహోమ్ వెనక్కి తిరిగి చూసాడు. వెనకున్న కొండ, దాని మీదున్న జనం, వాళ్ళవెనకున్న బండ్ల చక్రాలు ఉదయకాంతిలో మెరుస్తూ కనిపించాయి. సుమారు ఒక మూడు మైళ్ళు నడిచానని అంచనాకు వచ్చాడు. వాతావరణం వేడెక్కుతోంది. లోపలి కోటును కూడా తీసి భుజమ్మీద వేలాడేసుకుని మళ్ళీ కొద్దిదూరం నడిచాడు. ఇప్పుడిక వేడి బాగా పెరిగింది. సూర్యుని వైపు చూసాడు. అల్పాహారం గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చిందనుకున్నాడు.
‘మొదటి దశ పూర్తయింది, రోజుకు నాలుగు దశలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడే వెనక్కిమర్లడం తొందరపాటు చర్య. ఈ బూట్లు మాత్రం తీసేస్తాను.’ అని తనకు తానే చెప్పుకుని, కింద కూర్చొని, బూట్లు తీసేసి, వాటిని కూడా నడుంపట్టికి కట్టుకుని ముందుకు కదిలాడు. ఇప్పుడు నడక ఇంకొంచం తేలిక అయ్యింది.
‘ఇంకో మూడు మైళ్ళు ముందుకు వెళ్తాను, తర్వాత ఎడమవైపు తిరుగుతాను. ఈ ప్రదేశం అద్భుతంగా ఉంది, దీన్ని వదులుకోవడమంటే దురదృష్టమే. ఎంత ఎక్కువ దూరం నడిస్తే అంత ఎక్కువ నాణ్యంగా కనిపిస్తోంది నేల.’ అనుకున్నాడు.
నేరుగా కొంతసేపు నడిచాక వెనక్కి చూసాడు. ఇప్పుడు కొండ చాలా అస్పష్టంగా కనిపించింది. దాని మీదున్న జనం నల్లని చీమల్లా కనిపించారు. సూర్యకాంతిలో అక్కడేదో మెరిసిపోతున్నట్లుగా అనిపించింది.
‘అయ్యో, ఈ దిశలో చాలా దూరం వచ్చేసాను. వెనక్కి తిరగడానికి ఇదే సమయం. అంతేకాదు, నిరవధికంగా చెమటపడుతోంది. చాలా దాహం వేస్తోంది’ అనుకున్నాడు.
అక్కడ ఆగి, ఒక పెద్ద గుంతను తవ్వి, దానిమీద మట్టిపెడ్డలను పేర్చాడు. తర్వాత సీసా తీసి కొన్ని నీళ్ళు తాగి, చురుగ్గా ఎడమవైపుకి తిరిగాడు.
అతను నడుస్తూ నడుస్తూ ముందుకు సాగిపోతూనే ఉన్నాడు. గడ్డి బాగా పొడవుగా ఉంది. ఎండ చాలా తీవ్రంగా ఉంది. నెమ్మదిగా అలసటకు లోనయ్యాడు. సూర్యుని వైపు చూసి మద్యాహ్నం అయ్యిందని గ్రహించి ‘ఇక ఇప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకోవాలి’ అనుకున్నాడు.
కింద కూర్చొని, కాస్తంత రొట్టె తిని, కొన్ని నీళ్ళు తాగాడు. పడుకోలేదు. పడుకుంటే నిద్రపోయే ప్రమాదం ఉందనిపించింది. కాసేపు కూర్చున్నాక మళ్ళీ నడవడం మొదలుపెట్టాడు. ఆహారం అతనికి బలాన్నివ్వడంతో నడక ముందు తేలికగానే అనిపించింది. కానీ ఇప్పుడు వేడి భయంకరంగా పెరిగింది. అతనికి మగతగా అనిపించింది. అయినా ఆగకుండా సాగిపోతూనే ఉన్నాడు.
‘బాధ ఒక గంట మాత్రమే, బతుకు ఒక జీవితకాలం’ అనుకున్నాడు.
ఈ దిశలో కూడా అతను చాలా దూరం వెళ్ళాడు. ఎడమవైపు తిరగబోతుండగా, చల్లగా తడిగా ఉన్న ఒక లోతట్టు అతని దృష్టిని ఆకర్షించింది.
‘దీన్ని వదిలేయడం అన్యాయం, ఇక్కడ పత్తి బాగా కాస్తుంది’ అనుకున్నాడు.
ఆ చోటు దాటి ముందుకు వెళ్ళి, అవతలవైపు ఒక గుంత తవ్విన తర్వాతే మలుపు తిరిగాడు. మరోసారి కొండవైపు చూసాడు. వేడి అల్లకల్లోలంగా కంపిస్తూ గాలిని మసకబారేలా చేసింది. ఆ మసకలో కొండ మీదున్న జనం కనిపించడం అసాధ్యం.
‘అయ్యయ్యో! నేను రెండు వైపులా చాలా దూరంగా వచ్చేసాను. మూడోవైపు తక్కువ దూరం నడవాలి.’
మూడోదిశలో గబగబా అడుగులు వేసాడు. మళ్ళీ సూర్యుడి వైపు చూసాడు. అప్పుడే పొద్దువాలే వైపు దిగుతున్నాడు సూరీడు. మూడో దిశలో కనీసం మూడు మైళ్ళు కూడా నడవలేదు, చతురస్రం పూర్తి చేసి గమ్యస్థానం చేరుకోవాలంటే ఇంకా పది మైల్లు ప్రయాణించాలి.
‘ఇక చాలు, నా భూమి అసమంగా తయారైనా పర్లేదు, ఇప్పుడు తిన్నగా వెనక్కి పరుగెత్తాలి. అప్పుడే ఎక్కువ దూరం వెళ్ళే అవకాశం ఉంది, అదీగాక ఇప్పటికే నాకు చాలా భూమి సమకూరింది.’ అనుకున్నాడు. తొందరగా ఒక గుంటను తవ్వి వెంటనే నేరుగా కొండవైపు తిరిగాడు.
పహోమ్ కొండదిశగా వెళ్తున్నాడు గానీ ఇప్పుడతను చాలా కష్టంగా నడుస్తున్నాడు. వేడికి పూర్తిగా క్షీణించిపోయాడు. చెప్పులు లేకపోవడంతో పాదాలు కోసుకుపోయాయి. కాళ్ళు బలహీనపడి కదలనంటున్నాయి. కాసేపు విశ్రాంతి తీసుకోవాలనే కోరిక బలంగా ఉంది గానీ అస్తమయానికి ముందే కొండకి చేరుకోవాలంటే విశ్రాంతి అసాధ్యం. సూర్యుడు ఎవరికోసమూ ఆగడు, కొద్దికొద్దిగా కిందికి దిగిపోతూనే ఉన్నాడు.
‘అయ్యో, నేను మరీ ఎక్కువ భూమిని పొందాలని ప్రయత్నించానా? ఆ పొరపాటు చేయకపోతే బాగుండేదేమో! ఒకవేళ నేను ఆలస్యంగా చేరుకుంటే ఎలా?’ అని మథనపడ్డాడు. కొండవైపు, సూర్యుడివైపు చూసాడు. తాను గమ్యానికి ఇంకా చాలా దూరంలో ఉన్నాడు. సూర్యుడు ఆకాశపుటంచుకు చేరుకున్నాడు.
పహోమ్ నడుస్తూనే ఉన్నాడు. కష్టంగా ఉన్నప్పటికీ శక్తిని ఒడిసి పట్టుకుని మరింత వేగంగా కదిలాడు. గమ్యస్థానం ఇంకా చాలాదూరం ఉండటంతో పరుగెత్తడం మొదలుపెట్టాడు. తన కోటు, బూట్లు, టోపీ, సీసాని విసిరేసాడు. పారను మాత్రమే ఉంచుకున్నాడు.
‘ఇప్పుడేం చేయాలి?’ అతను ఆలోచిస్తూనే పరుగెడుతున్నాడు. ‘అత్యాశకుపోయి అంతా చెడగొట్టుకున్నాను. అస్తమయం లోపు నేను అక్కడికి చేరుకోలేను.’
పహోమ్ పరుగెత్తుతూనే ఉన్నాడు. భయం అతడిని ఊపిరాడనీయట్లేదు. చెమటతో తడిసిన బట్టలు శరీరానికి అతుక్కుపోయాయి. నోరు ఎండిపోయింది. ఛాతీ కమ్మరి కుబ్బిలా ఎగిసిపడుతోంది. గుండె సుత్తితో కొడుతున్నట్టుగా గట్టిగా కొట్టుకుంటోంది. కాళ్ళు అతనివి కావేమో అన్నట్టుగా ఎటో లాగేస్తున్నాయి. తీవ్ర ఒత్తిడితో చచ్చిపోతానేమోనని భయంతో వణికిపోయాడు.
మరణభయం పట్టుకున్నా అతను పరుగు ఆపలేకపోయాడు. ‘ఇంత దూరం పరుగెత్తి ఇప్పుడాగిపోతే వాళ్ళు నన్ను మూర్ఖుడిలా చూస్తారు’ అనుకున్నాడు. ఆగాలనే కోరిక ఉన్నా ఆగకుండా పరుగెత్తుతూనే ఉన్నాడు. గమ్యానికి బాగా దగ్గరగా వచ్చేసరికి బష్కీర్లు అరుస్తూ కేకలేస్తూ కనిపించారు. వాళ్ళ అరుపులు అతని హృదయంలో ఇంకా ఎక్కువ ఆతృతను రగిలించాయి. అతడు ఆఖరి శక్తిని కూడదీసుకుని పరుగెత్తాడు.
సూర్యుడు దిగంతపు చివరంచుకి చేరుకున్నాడు. ఆవరించిన పొగమంచుతో భానుడు మరింత పెద్దగా, రక్తవర్ణపు ఎరుపులో కనిపిస్తున్నాడు. ఇప్పుడు… అవును… ఇప్పుడే అస్తమించబోతున్నాడు! సూర్యుడు బాగా కిందకి దిగిపోయాడు. అయితే పహోమ్ కూడా లక్ష్యానికి చాలా దగ్గర్లోనే ఉన్నాడు. కొండమీదున్న జనం అతడిని త్వరగా రమ్మని చేతులు ఊపడం కనిపిస్తోంది. నక్క-బొచ్చు టోపీనీ, దాని మీదున్న డబ్బునీ, పక్కనే కింద కూర్చొని నవ్వుకుంటూన్న నాయకుడినీ పహోమ్ చూడగలిగాడు. ఆక్షణం అతనికి తన కల కూడా జ్ఞాపకం వచ్చింది.
‘భూమి చాలానే ఉంది కానీ, దాని మీద నివసించడానికి దేవుడు నాకు అనుమతినిస్తాడా? నేను నా ప్రాణాన్ని కోల్పోతున్నాను, జీవితాన్ని కోల్పోతున్నాను! నేను గమ్యస్థానాన్ని ఎప్పటికీ చేరుకోలేను!’
మళ్ళీ సూర్యుణ్ణి చూసాడు. భూమిని తాకేసి, ఒకభాగం అప్పటికే కనుమరుగైంది. వణుకుతూనే మిగిలిన బలాన్ని కూడదీసుకుని, శరీరాన్ని ముందుకు వొంచి ఉరికాడు కానీ కాళ్ళు అందుకు అనుగుణంగా కదల్లేకపోయాయి. అతికష్టమ్మీద అతన్ని కిందపడకుండా మాత్రం ఆపగలిగాయి. అతను కొండదగ్గరికి వచ్చేసరికి అకస్మాత్తుగా చీకట్లు అలుముకున్నాయి. పైకి చూసేసరికి- సూర్యుడు పూర్తిగా అస్తమించాడు. గొల్లుమని ఏడ్చాడు పహోమ్.
‘అయ్యో, నా శ్రమ అంతా వృథా అయిందే’ అనుకున్నాడు. ఇక అక్కడే ఆగిపోదామనుకున్నాడు. కానీ బష్కీర్లు ఇంకా గట్టిగా అరుస్తూ పైకి రమ్మని పిలుస్తూండటంతో అతనికి హఠాత్తుగా జ్ఞానోదయమైంది- కింద ఉండటం వల్ల తనకు మాయమైనట్లు కనిపించినా, కొండపైన ఉన్నవాళ్ళకి ఇంకా సూర్యుడు కనిపిస్తున్నాడు! గాఢంగా ఊపిరి పీల్చుకుని మళ్ళీ కొండపైకి పరుగెత్తాడు. అస్తమయ తేజస్సు ఇంకా అక్కడ ప్రకాశిస్తోంది. కొండశిఖరానికి చేరుకుని టోపీని చూసాడు. దాని ముందు కూర్చొని పొట్ట చేతపట్టుకుని నవ్వుతున్నాడు నాయకుడు. మళ్ళీ తన కలను గుర్తు చేసుకున్నాడు. ఒక్కసారిగా అతడు పెనుకేక పెట్టాడు. కాళ్ళు నిస్సత్తువై ఆగిపోయాయి,
శరీరం ముందుకు తూలిపోయి వాలిపోయింది.
పహోమ్ చేతులు టోపీని తాకాయి.
నాయకుడు ఉత్సాహంతో బిగ్గరగా అరిచాడు.
‘ఆహా, వీడెంత గొప్పవాడు! చాలా భూమిని సంపాదించుకున్నాడు!’
పనివాడు పరుగెత్తుకుంటూ వచ్చి పహోమ్ ని లేపేందుకు ప్రయత్నించాడు, అతని నోటిలోంచి రక్తం కారడం గమనించాడు.
పహోమ్ చచ్చిపోయాడు!
బష్కీర్లు ‘అయ్యో పాపం’ అని జాలిని వ్యక్తం చేస్తున్నట్టుగా నాలుకను తాటించి శబ్దం చేసారు.
పనివాడు పారని తీసుకుని అతని దేహాన్ని పడుకోబెట్టేంత పొడవుగా ఒక సమాధిని తవ్వాడు.
అందులో పహోమ్ ని పాతిపెట్టాడు.
తల నుండి కాలి వరకు అతనికి అవసరమైన భూమి ఆరు అడుగులు మాత్రమే!
(స్వరం కోసం)
Add comment