అన్నాకరేనినా నవలల మొదలుపెడుతూ అనుకుంటాను టాల్ స్టాయ్ ఇలా అంటాడు. సంతోషంగా ఉండే సంసారాల అన్నిటి కథా ఒకటే. కానీ విషాదం నిండిన ఫేమిలీస్ ది ఒక్కొక్క దానిదీ ఒక్కొక్క కథ అని.
ఈ మాట పరమసత్యం. కానీ అలాంటి ద్రష్ట ఐన రచయితే దీనికి పై మాట రాయగలడు అని నేను టాగూర్ ఆదర్శప్రేమ కథ చదివి నప్పుడు అనుకున్నాను. సంతోషం ఉండే కుటుంబాల లో ఉండే కథల్లో కూడా ఉండే ప్రత్యేకత ఏమిటో ఎంతో ఔన్నత్యం తో చెప్పేడు ఆ కథలో టాగూర్.
అసలు ఎప్పుడూ చిన్న అభిప్రాయబేధం లేకుండా, చిన్నచిన్న చిరాకులూ పరాకులూ లేకుండా, కాస్తయినా అసంతృప్తి లేకుండా ఏ జంట ఐనా ఉన్నారూ అంటే అది వాస్తవం అని నమ్మలేం. ఒకవేళ ఉన్నట్టు కనిపిస్తే వాళ్లు ఎక్కడో సంతోషానికి కాస్త ఎడంగా ఉన్నారనే. ఒకరిపట్ల ఒకరు జాగురూకతతో ఉండడం అనే కారణం వల్ల.
అలా కాకుండా పరస్పర ఇష్టం తో పాటే కోపతాపాల ప్రకటనల స్వేచ్ఛ వారి మధ్య ఉంటే వారు హాయిగా ఉన్నట్టే. ఐతే ఈ హాయినుంచి వారు పొందే అదనపు విలువ ఏమిటి? ఇటువంటి స్వేఛ్ఛా యుతమైన అనురాగసాన్నిధ్యం వారిని ఎటు నడిపిస్తుంది అన్న విషయం మీద రాసిన కథ ‘ఆదర్శప్రేమ‘ కథ.
కథ లో ఆదర్శప్రేమ కోసం వెతకాలి. పైకి కనపడదు. అసలు ఆదర్శప్రేమ అన్న మాటే కొంత అసహజంగా ఉంది కదా. కానీ టాగూర్ కథ చిత్రంగా చెప్పుకుంటూ వెడతాడు. చాలా దాచిపెట్టి మనని వెతుక్కునేలా చేస్తాడు. ఎక్కడా ఆదర్శప్రేమా కనపడదు. ఆ మాటా కథలో కనపడదు. కానీ చివరకు ఆ ప్రేమ ఏమిటో అవగాహనకు వస్తుంది.
స్థూలంగా కథ చూస్తే కేవలం ఒక జమీందారు జమీ క్షీణ దశకు వస్తే దాన్ని దాని మేనేజరు అభివృద్ధి చేసి నిలబెట్టడమూ అలాగే జమీందారు కొడుకు కూడా మళ్లీ అదే పరిస్థితి లో ఉంటే మేనేజరు కూతురు తిరిగి అదే పని చెయ్యడమూనూ. ఈ మాత్రమే కథ.
జమీందారు ముకుందబాబు బాంకా గడ్ పరగణా కు అధికారి. అతని మేనేజర్ గౌరీ శంకర్ ఎంతో బుద్ధికుశలుడు. నిజాయితీ పరుడు. అది గ్రహించిన ముకుందబాబు వ్యవహారాలను అతనికే అప్పగించి నిశ్చింతగా ఉన్నాడు. గౌరీ శంకర్ చుట్టూ ఉండే జమీలను కూడా కొని ఇందులో కలుపుకుంటూ వస్తూ దాన్ని బాగా సంపన్నం చేశాడు. తనూ సంపన్నుడయాడు. ముకుందబాబు గౌరీ శంకర్ ఒక్కగానొక్క కూతురిని తన దత్తపుత్రుడికి వివాహం చేసుకుంటానని అడిగాడు. గౌరీ శంకర్ ఎంత ప్రభుభక్తి పరాయణుడైనా తన కంటె తక్కువ కులం కాబట్టి అతనితో వియ్యానికి అంగీకరించలేదు.
పైగా అంబికా చరణుడనే పేద పిల్లవాడిని తీసుకొచ్చి చదువుచెప్పించి అల్లుడిని చేసుకున్నాడు.
ముకుందబాబు దత్తపుత్రుడు వినోదలాల్ కి కూడా గౌరీ శంకరే నయనతార అనే చురుకైన పిల్లని చూసి పెళ్లి చేయించాడు.
కథ నాటికి ముకుందబాబూ లేడు గౌరీశంకరూ లేడు. అంబికా చరణుడు మేనేజరు గా జమీ నడుస్తోంది. వినోదలాల్ సమర్ధుడు కాడు సరికదా స్వంత ఆలోచన లేనివాడు. ఖర్చు మనిషి
గౌరీ శంకర్ కూతురు, అంబికాచరణుడి భార్యా ఐన ఇంద్రాణి జమీందారు ఇంటికి విందుకు వెళ్లడంతో కథ మొదలవుతుంది. ఆమె తండ్రి, భర్తా కూడా చేయించి తనకు కానుక చేసిన నగలు ధరించి ఆ విందుకు వెడుతుంది.
అది జమీందారు భార్య నయవతారకు అసూయకు తద్వారా ఆగ్రహానికి కారణం అవుతుంది ఆమె అందం, గాంభీర్యం కూడా నయనతార ను బాధిస్తాయి. ఏదో వంకతో ఇంద్రాణిని అవమానిస్తుంది.
ఇక్కడ టాగూర్ ఇంద్రాణిని గురించి ఇలా రాస్తాడు.
“ఇంద్రాణి లావణ్యవతి. బంకింబాబు భాషలో సుందరిని మెరుపుతీగతో పోల్చినప్పుటికీ అందులో ఉండే అన్ని లక్షణాలకూ సరిపోదంటాడు. విద్యుత్ ఆమె ముఖం లో నేత్రాలలో శరీరం అంతటా ఉన్నా మెరుపుతీగలో ఉండే చంచలత ఆమెలో లేదంటాడు. ఆమె తనలోని ఉద్వేగాన్ని ప్రజ్వలిస్తున్న అగ్ని ని తన స్వాభావిక సహజగంభీరతతో తనలోనే దాచుకుంది అంటాడు.
అది కూడా అసూయ కు కారణమే. నయనతార ఆమెను దాసీ లాగ చూస్తుంది.
అప్పటికి గంభీరంగా ఉండి ఆమె నియోగించిన పనులు చేసిన ఇంద్రాణి ఇంటికొచ్చి అమితంగా బాధపడుతుంది.
తన అవమానాగ్ని ఎవరికీ తెలియనివ్వకుండా గంభీరంగా ఉంటుంది. కానీ సాయంత్రం భర్త అంబికాచరణుడు రాగానే అంతా అతనికి చెప్పేస్తుంది. టాగూర్ ఇక్కడొకమాట అంటాడు
“భర్తకు ఏమాత్రమూ తెలియనివ్వకూడదు అనుకుంది. కానీ అంతలోనే ప్రతిజ్ఞా భంగమయింది. లోగడ ఎన్నోసార్లు ఈ విధంగా జరిగింది. బయటవారి ముందు ఎంత గంభీరంగా ఉన్నా భర్త ముందు తన ప్రకృతి తేటతెల్లం చేసుకోకుండా ఉండలేదు. అక్కడ తనను తాను మరుగుపరచుకోలేకపోతుంది.”
నిజానికి ఇంద్రాణి అహం దెబ్బతింది. తన తండ్రి సంపాదించి పెట్టిన ఆస్థే కదా ఇదంతా అని వారిని చూసి అనుకుంది. మనసు అవమానభారంతో నలిగిపోయింది. ఈ బాంకాగడ్ జమీందారీ అంతా తన తండ్రి సంపాదించి పెట్టినది కావాలంటే తనకే కొనుక్కో గల స్థోమత ఉంది ఆయనకి. కానీ ఆయన ప్రభుభక్తి అలాంటిది. అంచేత వీళ్లంతా తనపట్ల కృతజ్ఞతతో ఉండాలని ఇంద్రాణి మనసులో ఉంది. కానీ వాళ్ళకి ఆవిషయాలేవీ గుర్తు లేవు సహజంగానే.
ఇలా అతలాకుతలమైన మనోభారాన్ని భర్తముందు దింపుకుంది. అతను ఎంతో యోగ్యుడు. భార్యా, ఉద్యోగమూ తప్ప మరొక ప్రపంచం పట్ల ఆసక్తి లేనివాడు
భార్య అవమానం విని వెంటనే మేనేజరు పదవికి రాజీనామా చేసేస్తానని రాయడానికి సిద్ధమయ్యాడు.
కానీ ఆమెకు మనస్కరించలేదు. అతను ఈ పని మానేసి ప్లీడరు గా కూడా పనిచెయ్యగలడు. కానీ ఆమె మనసు లో జమీందారు పరివారం పట్ల తండ్రిలాగే స్నేహభావం నిలుపుకుని వద్దని ఆపింది.గౌరీ శంకర్ వంటి సమర్ధుడైన మానేజర్ లేకపోతే పరగణా పడిపోతుంది. పైగా తప్పు నయనతారది గానీ వినోదలాల్ ది కాదు కదా అని సద్దిచెప్పింది.
ఎప్పుడైతే భర్తతో చెప్పుకుందో అప్పుడే ఆమె తేలికపడిపోయింది. లోపల ఏర్పడిన అవమాన మనే అహంభావపు కల్మషం కడిగివెయ్యబడింది. భర్త స్పందన వల్ల కూడా ఆమె అనునయించబడింది.
మరికొంతకాలానికి వినోదలాల్ చేసే తెలివితక్కువ పనులవల్ల ఖజానా తరిగి పోవడం మొదలయింది. వినోద్ లాల్ కి మేనేజరంటే భయమే. అంబికాచరణుడు కూడా కట్టడి చెయ్యడం మొదలుపెట్టాడు. జమీ ని రక్షించాలని. అందువల్ల నయనతార మధ్యవర్తులు కలిసి అతన్ని బయటికి వెళ్లిపోయేలా చేస్తారు.వినోదలాల్ కూడా ముఖం చాటేస్తాడు.
ఒక రకంగా ఇది అతనికి అవమానమే. ఇంటికి వచ్చి భార్యతో చెప్పేడు. ఆమె శాంత చిత్తం తో విన్నా తర్వాత క్రోధం తో రగిలిపోయింది. ఇంత సమర్ధత తో పనిచేస్తున్న తనభర్తను అవమానించడం సహించలేకపోయింది.
ఆమె ఈ తీవ్రకోపం చూసి అతని కోపం తగ్గిందట.దైవాఙ్ఞ వల్ల పాపిని రక్షించబోయే స్వరంతో “వినోద్ ఇంకా పసివాడు, దుర్బలుడు ఇతరులమాటలవల్ల అతని మనసు వికలమై ఉంటుంది” అన్నాడు.
ఈ మాట విని ఇంద్రాణి తన రెండుచేతులను భర్త కంఠాన్ని పెనవైచి చాలా సేపటివరకూ ఆవేశంతో హృదయానికి హత్తుకుని ఉండిపోయింది. ఆమె కండ్లలో జ్వలిస్తున్న అగ్నికణాలు చల్లారినై. వాటివెంట జలజలా కన్నీరు కారుతోంది. తన హృదయాధిదేవతను సమస్తఅవమానాలనుంచి రక్షించి తనలో దాచుకోవాలన్నట్టుగా.
అంబికా చరణుడి రాజీనామా నిశ్చయమైపోయింది. రాసి పంపబోయే సమయంలో ఆఫీసునుంచి కోశాధ్యక్షుడు వచ్చి వినోద్ లాల్ చేసిన అప్పుల వల్ల తమ పరగణా చేతులుదాటిపోతోందని వినోదలాల్ నిస్సహాయంగా ఉన్నాడని చెప్పాడు.
ఎలాగైనా పరగణాను రక్షించమని అడిగాడు.
అంబికా చరణ్ ఇదంతా భార్యకు చెప్పాడు ఈ పరిస్థితిలో యజమానిని వదలకూడదు అంది. రాజీనామా వెనక్కి తీసేసుకున్నారు.
కానీ తాకట్టు విడిపించడానికి డబ్బు ఎలా. వినోదలాల్ భార్యను నగలు ఇవ్వమంటే
నయనతార ఇవ్వనంది. “ఇవీ పోతే ఇక తిరిగి నువు సమకూర్చలేవు” అంది
అంబికా చరణ్ ఎంత ప్రయత్నించినా ఏ దారీ దొరకలేదు. ఇంద్రాణి తమ ఆస్తులేవీ వ్యపరచడానికి వీలు లేదని ఒట్టు వేయించుకుంది. పైగా డబ్బు ఎక్కడా దొరక్కపోయేసరకి ప్రతీకారేచ్ఛతో ఆమె ఆనందపడింది.
డబ్బు దొరక్కపోతే నువు మాత్రం ఏం చేస్తావు వదిలెయ్ అంది. భర్త ఆమె కోపానికి నవ్వుకొన్నాడు.
కానీ ఎలాగైనా ఈ బాంకా గడ్ పరగణాను రక్షించాలని తపనపడి నలిగేడు. ఆమెను ఒప్పించాలని చూసి ఒప్పుకోకపోతే మౌనంగా ఉండిపోయాడు. ఆమె అతని తపన గ్రహించింది.
అప్పుడు ఆమె తన నగలన్నీ పళ్లెంలో పోసి మొయ్యలేక మోస్తూ పట్టుకొచ్చి భర్తకు ఇచ్చింది. పరగణా కోసం. ఆమెకి ఆ క్షణంలో ఉదారహృదయుడైన తండ్రి తమను ఆశీర్వదించినట్టనిపించింది.
కథ పూర్తి చేస్తూ టాగూర్ ఇలా రాస్తారు
“బాంకా గడ్ పరగణా మళ్లీ కొన్నారు. వినోదలాల్ కి అప్పగించారు.
ఈ సారి ఆ ఇంటికి విందుకు ఇంద్రాణి ప్రతిఙ్ఞాభంగం చేసుకుని ఆభరణ రహిత గా వెళ్లింది. ఇప్పుడామె మనసులో అవమానపు వేదన లేదు”
కథ ఐపోయింది. చాలా సంక్షిప్తంగా నైనా కథ మొత్తం చెప్పాను. అవసరం కనుక.
ఎంతటివాళ్లకైనా గర్వాలూ అహంభావాలూ తప్పవు. వాటికి విఘాతం కలిగితే కోపాలూ కార్పణ్యాలూ కూడా రాకమానవు. పట్టుదలలూ వచ్చి కూచుంటాయి.
అలాగే ఎంతో విశిష్టవ్యక్తి అనుకునే ఇంద్రాణి కీ అహమూ, అవమానమూ, గాయమూ, ఆపై తీవ్ర కోపమూ ఆయా సందర్భాల్లో వస్తూనే ఉన్నాయి. ఆమె భర్త ఎంతో ఉదాత్తుడు. కానీ భార్యకు అవమానం జరిగితే అంతకన్న ఎక్కువ కోపమే అతనికీ వచ్చింది.వారి దగ్గర మేనేజరు గిరీ వదిలేద్దామనుకున్నాడు.
ఈ కథలో విశేషమేమంటే వారిద్దరికి ఒకరిపట్ల ఒకరికి ఎంతో ప్రేమ. పోనీ ఇలా అందాం. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. అందువల్ల వాళ్ల మనసుల్లోని ముఖ్యంగా ఇంద్రాణి తన మనో వికారాలన్నీ అతనికి చెప్పకుండా ఉండలేదు. అలా అతనికి చెప్పుకుని అతని ఆలింగనంలో సేదదీరి అతను ఓదార్చగానే వాటినుంచి ప్రక్షాళితమౌతుంది. తిరిగి తన ఉన్నతహృదయాన్ని అందుకుంటుంది
అతనికి ఆమె సాంగత్యం మనో నిబ్బరాన్నిస్తుంది. ఆమెతో తన అవమానం గురించి చెప్పుకోగానే అతనికి వచ్చిన కోపం పోయిందని రాస్తాడు టాగూర్. మానావమానాలకు అతను కొంత అతీతంగా ఉండే మనిషే ఐనా ఒక సందర్భంలో అతనికీ కోపం వచ్చింది. ఆమె ప్రవర్తన వల్ల అతని కోపం పోతుంది.
అలాగే ఆమెకు జమీందారు అతని భార్యమీద ఎంత కోపం ఉన్నా, తన భర్తకోరిక పరగణాను నిబెట్టడం కనుక సునాయాసంగా నగలు ఇచ్చేస్తుంది
నాకు ఈ కథావస్తువు లో కొత్తదనం ఏమీ కనిపించలేదు. మామూలు జమీందారు పరగణాల కథే. కానీ టాగూర్ కథలో దాచిపెట్టి చెప్పిన విషయం ఆ దంపతుల మధ్యనున్న ప్రేమ.
వారు ఒకరి ప్రేమలో ఒకరు సేదతీరుతున్నారు. సేద తీరడమంటే తమ మనసులోని మాలిన్యాలు శుద్ధి చేసుకుంటున్నారు. అంతేకాక ఉన్నతమైన లోకహితం వైపు ప్రయాణిస్తున్నారు.
“ఉదారగుణముల్ శిక్షించు ఆచార్యకమ్ము,
అంతశ్శత్రుసమాజమున్ తొలచు దివ్యాస్త్రంబు మహాప్రణయ భావావేశమో గౌతమా” అని సౌందరనందం లో నందుడు బుద్ధుడికి చెప్తాడు.
పై రెండు ఉపమానాలకీ సరిగ్గా సరిపోయే ప్రేమ కథ ఇది. అంతశ్శత్రువులను తొలగించే దివ్యాస్త్రం ట ప్రేమ అంటే. ఇక్కడ అదే కదా జరిగింది.
“సర్వాస్వవస్థాసు యద్విశ్రామో హృదయస్య” అని భవభూతి అన్నదీ ఇలాంటి సుమానుషం గురించే.
అన్ని అవస్థలలోనూ హృదయానికి విశ్రాంతి స్థానం ఇటువంటి రెండు అనురాగభరితహృదయాల ఏకత్వం అని.
ఇటువంటి జంట భార్యాభర్తలే కానక్కరలేదనీ అంతటి అరమరికలు లేని మైత్రి ఉన్నచోట కూడా ఒకరికి ఒకరై తమ మనసులు విప్పుకుని హృదయమాలిన్యాలు ప్రక్షాళనం చేసుకోవచ్చని అనిపింపజేస్తుంది ఈ కథ. ఇంతకన్న ఆదర్శం ఏముంది
అందుకే టాగూర్ కథకి ఆదర్శ ప్రేమ అని పేరు పెట్టాడు. సంతోషంగా ఉండే సంసారాల్లో కూడా వేరే వేరే కథలుంటాయని నిరూపించాడు. ముఖ్యంగా భర్తలు ఇంత ఉన్నతులైతే ఆ భార్యలు ఎంత ఉదారులుగా మారగలరో కూడా.
*
ప్రేమ అందులోనూ ఆదర్శప్రేమ మనలోని ఎన్ని అవగుణాలను పోగొడుతుంది. మనుషులుగా ఎలా నిలబెడుతుంది టాగూర్ చెప్పిన కథని మీరు వెన్నకలిపి గోరుముద్ద చేశారు. ఇంద్రాణి,ఆమె భర్త తమ బలహీనతలను పోగొట్టుకోవటం,బలాలను పెంపొందించుకోవటం కేవలం వారి మధ్య గల ప్రేమ ద్వారానే చేయగలిగారు.అందుకే ప్రేమే కదా దైవం.దైవం ఎప్పుడూ ఆదర్శనీయమే కదా.
థాంక్యూ వెరీమచ్ వసుధా
లక్ష్మీ! సత్యం శివం సుందరం! శివమే సత్యం!సత్యమే శివం! శివమే సుందరం! ఏది సత్యం ! కరుణ,త్యాగం, నిష్ట, ,అసూయ,అహం , ఇష్టం,పట్టు విడుపు, ప్రేమ అన్నీ సత్యమే! సర్వమయం శివం! అన్నీ కలిపినదే సుందరం! అదే ఆదర్శం !అదే ప్రేమ! మీరు చెప్పిన కథలో అన్నీ ఉన్నాయి. చివరికి మిగిలింది ప్రేమ! ఒకరి సాంగత్యం మరొకరికి సాంత్వన, ఒకరి ఎదుట మరొకరు తేటతెల్లమవటం! మీరన్నట్లె అది భార్యాభర్తలే కావల్సిన అవసరంలేదు, అంత సాన్నిహిత్యం, ఆత్మీయత ఉన్న మైత్రీ కావచ్చు.
ఇలా ఎక్కడినుంచి ఎక్కడికో తీసుకువెళ్ళి ఒక సందేశంతో ముగిస్తారు.ఆదర్శ ప్రేమంటె ఏమిటి! కథలో నిక్షేపమైఉన్న ప్రేమను ,ఆదర్శప్రేమను దర్శనంచేయించారు!! చివరికి మంచితనం! ప్రేమే! అవే మీ కథలు, వ్యాసాలు!
థాంక్యూ వెరీమచ్ సుశీల గారూ
చక్కని స్నేహం గల సంస్కారవంతులైన దంపతుల కథ. ఎంతో బావుంది లక్ష్మి గారూ ! మానవ సహజమైన భావోద్వేగాలను అధిగమించి ఒక్క మెట్టెక్కమని ఉద్బోధించిన కథ. ధన్యవాదాలు.
థాంక్యూ వెరీమచ్ గౌరీలక్ష్మి గారూ
ఈ కథాపరిచయం నాకో సత్యాన్ని తెలియజేసింది. అన్ని అవస్థలలోనూ హృదయానికి విశ్రాంతి లభించేది ఇటువంటి రెండు అనురాగభరితహృదయాల ఏకత్వంలోనే అని. ఆలోచించినకొద్దీ అదో అద్భుతమైన వ్యక్తీకరణ అనిపిస్తోంది. ధన్యవాదాలు.
థాంక్యూ శ్రీనివాస్ గారూ