అది 1963 వ సంవత్సరం. వరంగల్లు మహబూబియా ఉన్నత పాఠశాలలో నేను ఏడవ తరగతి చదువుతున్నప్పటి సంగతి. నేరెళ్ల వేణుమాధవ్ గురించి మొట్టమొదటిసారిగా విన్నదే తడవుగా ఆయన పాపయ్యపేట చమన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తారని తెలుసుకుని వెంటనే ఆయనను చూడాలనే ఆతృతతో ..ఇంకో ఇద్దరు మితృలను తోడు చేసుకుని బడి ఎగ్గొట్టి.. మట్వాడ చమన్ బడికి చేరుకుని.. ఒక మూలకున్న కాంపౌండ్ పిట్టగోడ దగ్గరికి చేరుకుని.. పాఠశాల ఆవరణలోనే ఒక చెట్టుకింద ఏదో ఒక క్లాస్ కు అభినయపూర్వకంగా .. మిమిక్రీ చేస్తున్న ఫక్కీలోనే పాఠం చెబుతున్న వేణుమాధవ్ గారిని చూడ్డం.. అట్లా ఆయన్నుచూస్తూనే ఓ అరగంటసేపు అందరమూ ఉండిపోవడం .. ఒక మధురానుభూతి.. మధుర క్షణాలవి.
అప్పుడనుకోలేదు ఆ మహనీయునితో మున్ముందు నాకు విడదీయరాని ‘ జీవితకాల ఆత్మీయ బంధం ‘ ఏర్పడ్తుందని.
తర్వాత్తర్వాత .. ఎన్నిసార్లు కలిసి నడవడాలో, ఎన్నిసార్లు అనేకానేక ప్రాపంచిక, వ్యావహారిక, వైయక్తిక విషయాలను చర్చించుకోవడం, పంచుకోవడం, అనుభవించడమో. క్రమంగా అయన ఇల్లుకూడా మాఇంటి గల్లీకి ప్రక్కనున్న వాడలోనే ఉండడం వల్ల కావచ్చు వ్యక్తిగత సాన్నిహిత్యం కూడా విడదీయరాని బంధంగా మారింది. దాదాపు నలభై ఏండ్ల దగ్గరితనం ( స్నేహం అన్నది చిన్నమాట ) లో నాకు ఆయనలో కనిపించింది ఏ కల్మశమూ లేని స్వచ్ఛమైన భోళాతనంతో నిండిన పసి( డి )తనం.. సూటిదనం .. నిబద్ధత. ఆయనకు తన వృత్తే శ్వాస.. వృత్తే ధ్యాస.. వృత్తే దైవం.. వృత్తే సర్వస్వం. క్రమంగా వేణుమాధవ్ కుటుంబంలో నేను ఒక సభ్యునిగా మారడం మా అనుబంధానికి చిహ్నం. శ్రీమతి శోభా వేణుమాధవ్ .. వేణుమాధవ్ దంపతులు వాస్తవానికి ఇద్దరు వ్యక్తులు కానేకారు. వాళ్ళు జీవితకాలమంతా ఒకే ‘ ఆత్మ ‘ గా జీవించిన రెండు శరీరాలు. ఆమె ఆయనకు సహచరి.. స్నేహితురాలు.. హితురాలు.. అతని అన్ని కార్యక్రమాలకు మేనేజర్, సలహాదారు, జీవితకాలమంతా ఒక్క క్షణంకూడా విడువకుండా వెంట నడచిన నీడ. సామాజిక స్పృహ మెండుగా ఉన్న సేవాతృష్ణ గల పరమ సాధ్వి ఆమె.
‘ నేరెళ్ల వేణుమాధన్ ట్రస్ట్ ‘ ను స్థాపించి దాంట్లో నాకు కూడా స్థానాన్ని కల్పించడం నాపట్ల ఆ దంపతులకున్న అభిమానానికి చిహ్నమే. వేణుమాధవ్ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం ఒక ప్రముఖ పేద కళాకారు( రిణి )నికి పదివేల రూపాయల బహూకృతినిచ్చి సత్కరించడంతో ఒక సత్ సాంప్రదాయాన్ని ఎన్నో ఏండ్ల క్రితమే ప్రారంభించి ఇప్పటికీ కొనసాగిస్తూ దానికి సమాంతరంగా ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడి పేద కళాకారులకు ‘ ఉచిత ఇండ్ల స్థలాలను ‘ సమకూర్చడం , స్థానిక రోటరీ క్లబ్ ద్వారా ఎందరో లెక్కలేనంతమంది పిల్లలకు, సామాజికులకు, వృద్ధిలోకి రావలసిన మిమిక్రీ కళాకారులకు శిక్షణా తరగతులను, పెద్దవాళ్ళకు యోగా క్లాసులు, సంగీత శిక్షణా తరగతులు.. ఇట్లాంటివి ఎన్నో శోభావేణుమాధవ్ గారు తలమునకలై నిర్వహించడం.. ఇదంతా ఒక అవిశ్రాంత సేవా చర్య. వాళ్ళిద్దరు ఈ తరానికి ఆదర్శం కాగల సామాజిక సేవాతత్పరులైన ‘ పుణ్య దంపతులు ‘ .
కొన్ని విషయాలను అస్సలే రాజీ లేకుండా చెప్పేవారాయన నాతో.
1) ఒక కళాకారునిగా, రచయితగా.. ఏదైనా ప్రత్యేక సృజనాత్మక రంగంలో మనం ఏదైనా పురస్కారానికీ, సామాజిక గుర్తింపుకూ అర్హులమైనప్పుడు తప్పక ఆ గుర్తింపుకోసం అవిశ్రాంతంగా పోరాడాలె. పోరాడి తెచ్చుకోవాలె. సాధించుకోవాలె.. అని.
2) మన గురించి ఏవైనా వేదికలపైన సరియైన రీతిలో ( ప్రత్యేకంగా బయటి ప్రాంతాల్లో ) పరిచయం చేయనప్పుడు .. మనకు మనమే పూర్తిగా ఉచితరీతిలో పరిచయం చేసుకుని ( సిగ్గు పడకుండా ) మన ‘ activity ‘ ని ప్రారంభించాలె. స్వయం ప్రశంసకూడా అప్పుడప్పుడు అవసరమే అని పచ్చినిజాల్ని కూడా చెప్పేవాడు..
3) కళాకారుడెప్పుడైనా ‘ సెల్ఫ్ ప్రమోషన్ ‘ పై తగు శ్రద్ధ చూపించాలె. లేకుంటే గమ్యాన్ని చేరలేకపోవడమో. పథభ్రష్టత పొందడమో జరుగుతుందని హెచ్చరించేవాడు.
4) కొన్ని వేలమంది మిమిక్రీ శిష్యులను తయారు చేసి ‘ మిమిక్రీ’ కి ఒక ‘కళ ‘ స్థాయిని కల్పించి వాళ్ళకు జీవనోపాధిని సమకూర్చి ‘ ఆది గురువై ‘న వేణుమాధవ్ ఆ కళకు సంబంధించి విశ్వవిద్యాలయాలలో ‘ డిప్లొమా ‘ స్థాయి కోర్స్ లను ప్రవేశపెట్టడానికీ, దానికి ఒక సిలబస్ ను తయారు చేసి అకడమిక్ విలువలను ఆపాదింపజేయడానికి ఎంతో శ్రమించారు.
5) అనేవాడు.. మిమిక్రీ అనేది ప్రధానంగా వాచ్య కళ కాబట్టి ఒక్క తెలుగు భాషే కాకుండా జాతీయ స్థాయిలో రాణించాలంటే.. హిందీలో, అంతర్జాతీయ స్థాయిలో ఐతే ఇంగ్లిష్ లో అనర్ఘళంగా మాట్లాడగలిగే ప్రతిభను సాధించాలని .. కాని ఆయన శిష్యులు ఈ విషయంగా ఆయన చెప్పిన ఈ రహస్యాన్ని తెలుసుకున్నట్టు లేరు. ఆయన గతించేవరకు కూడా హిందీలోనూ, ఇంగ్లిష్ లోనూ ఆయనతో సమానంగా గలగలా మాట్లాడగలిగే వారెవరూ లేకపోవడం ఒక లోటే.
మంచి భోజన ప్రియుడాయన. మేమిద్దరమే కార్ లో బయటికి వెళ్తే.. ‘ ఇక్కడ ఆపవయ్యా ‘ అని ఒక స్వీట్ షాప్ ముందు కారాపించుకుని లోపలికి తీసుకుపోయి ‘ మాకు చెరొక అజ్మీరీ కలాకంద్ ‘ ఇవ్వవయ్యా ‘ అని ఆరగించి .. ‘ ఇంట్లో చెప్పకు వెళ్ళిన తర్వాత ‘ అని చిన్న పిల్లాడిలా నవ్వేవాడు ( కొద్దిగా ‘డయాబెటిక్ ‘ ఆయన.)
ఇలా చాలా జ్ఞాపకాలు ఎన్నో.. ఇప్పుడు తలుచుకుంటే కన్నీళ్లు తెప్పించేవి.
నేను రచించిన నా ప్రతి పుస్తక ఆవిష్కరణ సభలోనూ ఆయన అతిథిగా పాల్గొన్నాడు.. నన్నాశీర్వదించాడు. నా పురోగతిని మనస్పూర్తిగా ఆకాంక్షించాడు. వేణుమాధవ్, శోభావేణుమాధవ్ నాకు పితృ , మాతృ సమానులు. నా శ్రేయోభిలాషులు.
నా అదృష్టమేమిటంటే… కొన్ని వేల సభల్లో పాల్గొని లక్షలమందిని రంజింపజేసిన వేణుమాధవ్ నా జీవితకాల కృషిగా నేను వెలువరించిన బృహత్ నవల ‘ కాలనాళిక ‘ ను 13 మే , 2018 న వరంగల్లు లో తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ కడియం శ్రీహరి గారు ఆవిష్కరిస్తే చిట్టచివరిగా ఆ సభలో విశిష్ట అతిథిగా పాల్గొని హృదయపూర్వకంగా నన్ను ఆశీర్వదించడం.
మొన్న మే, 13 వ తేదీన రాత్రి ఎనిమిది గంటలకు బెడ్ పైనున్న ఆయనను ఇంట్లో దర్శించి, కుటుంబ సభ్యులందరితో మాట్లాడి కారెక్కి నేరుగా విమానాశ్రయానికొచ్చి అమెరికా వచ్చాను నేను. అదే కడసారి చూపు వేణుమాధవ్ గారిది.
కొన్ని జ్ఞాపకాలు నిత్య స్ఫోరకాలుగా ఎన్నడూ మాసిపోకుండా హృదయంలో నిలిచిపోతాయి. వేణుమాధవ్ ఒక జ్వలిత స్మృతి. ఆయనతో కొన్ని దశాబ్దాలపాటు స్నేహించడం ఈ జన్మలో నేను చేసుకున్న పుణ్యం.
మనిషి వెళ్లిపోయాడు. కొన్ని చరణ ముద్రలు మిగిలిపోయాయి. ఆ జాడల్లో నడిచి ఆయనవంటి వ్యక్తిత్వాన్ని సాధించడం ఎవరికీ సాధ్యంకాని పని. కాని అవి రాబోయే ‘ మిమిక్రీ’ కళాకారులందరికీ తప్పక స్ఫూర్తిదాయకంగా, ప్రేరకంగా నిలుస్తాయి.
ఆయనకు ఒక మితృనిగా కొన్ని అశ్రువులతో శ్రద్ధాంజలి ఘటించడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయుణ్ణి నేను.
*
నిశ్శబ్దం శబ్ద విస్ఫోటనమై
అతడు శబ్దకంఠుడు
ఒక లిప్తకాలంలో కళ్ళు మూసుకుని
సకల స్వరసముద్రాలను త్రాగుతూ అగస్త్యుడౌతాడు
మరుక్షణం.. మనిషి ఒక్కడే.. శతకోటి శబ్దాలై
శత సహస్ర వాయిద్యాలై,స్వర తుఫానులై ప్రభంజనంగా ప్రత్యక్షమౌతాడు
మనిషి ఒక మాటై, పాటై, బృందగానమై, వాయిద్యాల హోరై
అనుకరణై, అనుసరణై, అనుసృజనై
మనిషి రసపిపాసకు అనువాదమై
ఏ భాషకూ లొంగని ఒక మహా రసానుభూతై విస్తరిస్తాడు-
శ్రోతలు.. వాడు దేశాధ్యక్షుడా, బ్రహ్మ స్వరూపుడా
పాలవాడా, పాకీవాడా, పాన్ డబ్బావాడా.. ఎవడైనా
రసాస్వాద పారవశ్యంలో.. చినుకుల్లో తడుస్తూ పులకిస్తున్న పుడమౌతాడు-
ఏ సంగీత కచేరీకైనా.. ఒక శృతి, ఒక లయ, ఒక వయొలిన్, ఒక మృదంగం
ఒక ఆర్కెస్ట్రా .. ఒక మానవ సమూహం కావాలి
కాని ఇతడు.. ఒకే ఒక్కడు.. ఏకవ్యక్తి.. సంగీత సముద్రమై
గొంతును సంధిస్తే
మాటలు మంత్రాలై సకిలించే గుర్రాలౌతాయి.. పరుగెత్తే విమానాలౌతాయి
ప్రళయించే ఇసుక ఎడారులౌతాయి
గర్జించే ఆకాశ పర్జన్యాలౌతాయి
మెకన్నాస్ గోల్డులు.. బెన్ హర్ లు.. టెన్ కమాండ్ మెంట్స్
పరుగెత్తే రథచక్రాల భీకర గర్జనలౌతాయి-
పృథ్వీరాజ్ కపూర్ లు, మహాత్మా గాంధీలు, రాధాకృష్ణన్ లు
ఎవరైనా అందరూ ఆజ్ఞాబద్ధులై అతని గొంతులో సవినయంగా వినబడ్తారు-
శబ్ద నియంత అతడు
నియంత్రిస్తాడు.. యంత్రిస్తాడు.. మంత్రిస్తాడు
ఏకవ్యక్తి ధ్వని విస్ఫోటకుడై మచ్చు చల్లి మాయలా వ్యాపిస్తాడు
అందరూ మధుర రసపానమత్తులై
తమను, తమ ఉనికిని, తమ సకల స్పృహలను మరిచి
ఒక పారవశ్యోన్మత్తతలో కరిగి ప్రవహిస్తూ అదృశ్యులౌతున్న వేళ
అతను.. శబ్ద సంధానాన్ని విరమించి
పసివానిలా బోసినోటిని తెరిచి.. ఒట్టి చిరునవ్వుతో ముందునిలుస్తాడు వినయంగా
ఏమిటీ.. అంటే.. ఏమీలేదు
ఏదో ఒక తాదాత్మ్య వీచిక తలను నిమిరి వెళ్ళిపోతుంది.. మాతృస్పర్శవలె
అతను.. అలా పాదముద్రలను మనకు ఒక వారసత్వంగా మిగిల్చి
నడచిపోతూంటాడు… ఋషిలా
అతడు వేణుమాధవుడు.. వేణువూ.. మాధవుడూ రెండూ తానే ఐనవాడు.. స్వర మాంత్రికుడు-
( ధ్వన్యనుకరణ సామ్రాట్,కళాప్రపూర్ణ,పద్మశ్రీ శ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ 80 వ జన్మదిన సందర్భంగా..28 డిసెంబర్ 2011 ‘ వరల్డ్ మిమిక్రీ డే’ నాడు అత్యంత ఆత్మీయంగా వేలమంది ఆహూతుల సమక్షంలో నేను సమర్పించిన చిరు అక్షరకానుక )
????????
Sir, మంచి విషయాలు తెలియ జేసినారు
థాంక్యూ సార్. ????????
Veerender Kumar
PhD స్కాలర్
English డిపార్ట్మెంట్
Kakatiya University.