చిన్న కథే..పెద్ద చరిత్ర!

కొన్ని నినాదాలు , కొన్ని పాటలు , కొన్ని భావనలు  కాలం  గడుస్తున్న కొద్దీ పాతపడిపోయి , వాటి ప్రాముఖ్యాన్ని కోల్పోతాయి . ఒకప్పుడు అవి  ఇచ్చిన ఉత్తేజాన్నీ , ఆవేశాన్నీ , ఉద్వేగాన్నీఇప్పుడు ఇవ్వవు . తప్పు ఆ పాటలదో . ఆ భావనలదో , ఆ నినాదాలదో  కాదు . అలాగనీ స్పందించకుండా మొరటుగా . శిలాసదృశంగా మిగిలిపోయిన  మనదీ కాదు .

మాదీ స్వతంత్ర దేశం /మాదీ స్వతంత్ర జాతి  అని ఏ టంగుటూరి సూర్యకుమారో గొంతెత్తి పాడుతూ ఉంటే వినడం బావుండేది . ఆ స్వరం తో కోరస్ కలపడం మరింత బావుండేది . పాట వింటున్నప్పుడూ , కోరస్ పాడుతున్నప్పుడూ శరీరం అంత ఒక ఉద్వేగపు చలి చినుకై వణికిపోయేది . వందేమాతరం అన్న ఒక్క నినాదం లోలోపల విస్మృతంగా , అనామకంగా పడి ఉన్న  పోరాట కాంక్షను ప్రజ్వరిల్లజేసేది . కానీ ఇప్పుడు ఆ పాటలు , ఆ మాటలు , ఆ భావనలు  ఇవ్వాల్సినంత ఉద్వేగాన్నీ , ఇవ్వాల్సినంత ఆనందాన్నీ ఇవ్వలేవు . స్వాతంత్య్రం వచ్చిన తోలి రోజులలో వున్న భావనలు వేరు . ఇప్పటి ఆలోచనలు , ఆకాంక్షలు వేరు . వాటి మధ్య హస్తి మశకాంతరం ఉన్నది

1947 భారత దేశ చరిత్రలో ఒక గొప్ప సంవత్సరం . 1947 ఆగస్టు 15 పరాయి దాస్య శృంఖలాల నుండి దేశం విముక్తి చెందిన రోజు . సమస్థ ప్రపంచమూ సుఖ సుషుప్తిలో మునిగివున్న వేళ ఒక్క భారత దేశం మాత్రమే మేలుకుని   తన నూతన ప్రస్థానానికి తొలి , తొలి  అడుగులు వేసిన సమయం . మువ్వన్నెల జెండా వినువీధిలో విలాసంగా ఎగిరిన సమయం . దేశమంతా ఒక ఉత్సాహం . ఒక ఉద్వేగం . ఒక వినూత్న ఆనందం . ఆగస్ట్ 15 ఎలా గడిచిపోయిందో ఎవరికీ తెలియదు .

కాలం ఎవరికోసమైనా ఆగుతుందా ? రెండేళ్లు గడిచాయి . భారత దేశం పోరాడి సాధించుకున్న స్వాతంత్య్ర  స్వరూపం సామాన్య జనానికి కాకపోయినా బుద్ధి జీవులకు స్పష్టంగానే అర్ధమైంది . అది కేవలం రాజకీయ స్వాతంత్య్రం మాత్రమే . సాంఘిక , ఆర్ధిక , భౌతిక , ఆధ్యాత్మిక స్వాతంత్య్రం ఇంకా సాధించవలసే  ఉన్నది . సాధించుకున్న రాజకీయ స్వాతంత్య్ర  స్వరూపం మాత్రం ఎలా ఉంది ?

ఎలా ఉన్నదో  ఒక తెలుగు రచయత ఒక పేజీన్నర నిడివి ఉన్న  చిన్న కథ  లో చెపుతున్నాడు . చిన్న కథే  కనుక ఇక్కడ నేను మొత్తం కథ  ఉటంకిస్తున్నాను చదవండి

స్వాతంత్య్ర  స్వరూపం

ఒకప్పుడు ఒక పిల్ల దేశం , ఇంకో దేశం నించి నానా అవస్థలు పడి స్వాతంత్య్రం సంపాయించింది . ఆ పిల్ల దేశం లో ప్రజలు స్వాతంత్య్రం వచ్చినందుకు గుర్తుగా ఓ స్వతంత్ర విగ్రహం చేయించి రాజధాని నగరం లో ప్రతిష్ఠించుదామని తమ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు . ప్రభుత్వం కూడా ప్రజల ఆలోచన బాగానే వున్నదని ఒప్పుకుని ఒక శిల్పిని పిలిపించింది . ఆ శిల్పి అఖండమైన కళోపాసకుడు . అదివరకు చాలా విగ్రహాలు చేశాడు అతను చేసిన విగ్రహాలు జీవకళ ఉట్టిపడుతూ ఉండేవి . ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం ఆ శిల్పి ఒక సుముహూర్తం లో మంచి చలువ రాయి తో విగ్రహం చేసేందుకు ఉపక్రమించాడు

స్వరాజ్యాన్ని  ప్రజలు పోరాడి తెచ్చుకున్నారు కనుక , స్వతంత్ర విగ్రహం , తమ పోరాటాల చరిత్రను ఎప్పుడూ జ్ఞప్తి చేస్తూ , తమ సుఖవంతమైన స్వతంత్ర భవిష్యత్తును చూపుతూ వుండే ఒక మహావీరుని విగ్రహం  చెక్కమని వాళ్ళు శిల్పికి తీర్మానాలు చేసి పంపారు . శిల్పి అలాగే అని ఒక మహావీరుని విగ్రహం చెక్కడం మొదలుపెట్టాడు

కానీ మొదటినుంచి సామాన్య ప్రజలు పోరాటాలు చేసి స్వాతంత్య్రం సంపాయిస్తే తమ ప్రాబల్యం ఎట్టాగూ మంట  గలుస్తుందని భయపడుతూ వచ్చిన డబ్బు స్వాములు , తమ మీద అధికారం చెలాయిస్తున్న పరాయి దేశం డబ్బు స్వాములతో కలసి గుసగుస లూ     వికావికలూ చేసి  అధికారం తమ హస్త గతం చేసుకున్నారు . ఈ డబ్బు స్వాములు “స్వతంత్ర విగ్రహం , ప్రజలకి నూతనంగా వచ్చిన ప్రభుత్వం యెడల  నమ్రత , విధేయత నేర్పే చిహ్నంగా , అల్లరి ఆగం చేయకూడదని బోధించే గురువులా , ఉండాలి . అందుకని ఓ ప్రశాంత తపస్వి లాగో లేక సన్యాసి లాగో ఉండాలి”  అని శిల్పిని ఆజ్ఞాపించారు . శిల్పి “చిత్తం ” అని మహావీరుడు విగ్రహం చెక్కినంతవరకూ ఆపి , దాన్నే సన్యాసి రూపం లోకి చెక్కసాగాడు

ఆ దేశం లోని డబ్బు స్వాములలోనే ఇంకా కొందరు మహాత్ములు దేశాన్నీ , దాని ఆర్ధిక పరిస్థితిని తమ జేబుల్లోనూ , భోషాణాల్లోనూ ఇరికించుకుని వున్నారు . వాళ్ళకి ఈ సలహాలేవీ నచ్చలేదు . వాళ్ళందరూ కలసి “ఆ విగ్రహం మన విశాలమైన దేశం యొక్క స్వతంత్ర వ్యాపార ప్రతిపత్తిని విస్తరింపచేసేదిగా ఒక గొప్ప ఓడల వర్తకుని రూపం లో ఉండాలి” అని ఆ శిల్పికి కి ఆదేశం పంపారు . ఆ శిల్పి ఆ ఆదేశం వెనుక ఉన్న ఆర్ధిక బలాన్ని ఊహించుకుని “అలాగే బాబూ “అని తను  తయారు చేస్తున్న సన్యాసి విగహాన్నే ఒక గొప్ప వ్యాపారి విగ్రహంగా మార్చడానికి సంసిద్దుడు అయినాడు

కానీ అసలు ప్రభుత్వం లో వుండే పెద్దలు ఇవన్నీ పనికి రావని రెండు మూడు సబ్  కమిటీలు , నాలుగైదు సంఘాలు వేసి వాటిరిపోర్టులన్నీ కలేసి   చదివి , వాటన్నిటినీ తీసివేసిన తరువాత “స్వతంత్ర విగ్రహం ప్రభుత్వం యెడ భక్తినీ , నమ్రతనూ నేర్పేట్టు  ఉండవలసిందే కానీ , అది సన్యాసి లాగు  కాకుండా ప్రజలకి ప్రభుత్వం యెడల భయమూ , భక్తీ , గౌరవమూ , శ్రద్దా నేర్పే సాయుధ సైనికుడి విగ్రహంగా ఉండాలని భావిస్తోంది . నిజమైన ప్రజా శాంతినీ , ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ప్రభుత్వ సైన్యమే . అదీ కాకుండా ప్రజలలో కొందరు ఎల్లప్పుడూ ఆకలనీ , గుడ్డలనీ , అల్లర్లు చేస్తూ ఆర్ధిక సమానత్వం అని లేనిపోని ప్రచారం చేస్తూ , ప్రజల ప్రశాంత జీవనాన్ని భగ్నం చేస్తున్నారు . అటువంటి వాళ్ళకి స్వతంత్ర ప్రభుత్వం లో నైనా వాళ్ళ ఆటలు సాగవని హెచ్చరికలు తెల్పుతూ స్వతంత్ర విగ్రహం ప్రభుత్వ సాయుధ సైనికుడి రూపం లో ఉండాలి ” అని బహిరంగ ప్రకటన ఒకటి చేసి శిల్పికి హుకుం ఇచ్చారు . సైనికుడి విగ్రహం చెక్కమని .  అట్లానే అని శిల్పి తాను చెక్కుతున్న వర్తకుడి రూపాన్నే సాయుధ సైనికుడి రూపం లోకి మార్చుతున్నాడు . ప్రభుత్వ సలహాని డబ్బు స్వాములు హర్షించారు . వ్యాపారస్తులు ఆహ్వానించారు . అటూ , ఇటూ మాట్లాడే పెద్దమనుషులు ఆమోదించారు . ప్రజలు మాత్రం ప్రభుత్వ ధోరణికి ముక్కు మీద వేలేసుకున్నారు

అయితే శిల్పి మాత్రం ఎడతెరపి లేకుండా శ్రమించి స్వాతంత్య్ర  విగ్రహాన్ని తయారుచేశాడు . ఒక సుదినమున స్వతంత్ర విగ్రహాన్ని రాజధానిలో ప్రతిష్టించడానికి తీసుకుని వచ్చారు . అది వరకే తయారు అయిన  శిలావేదిక పై  స్వతంత్ర విగ్రహాన్ని ఉంచారు . ప్రభుత్వ అధ్యక్షుడు  స్వతంత్రాన్ని గురించి ఒక మహోపన్యాసం చేసిన తరువాత స్వతంత్ర విగ్రహానికి ఉన్న  మొఖమల్ గుడ్డని  తొలగించాడు . స్వతంత్ర విగ్రహం ఆధునిక ఆయుధాలతో సాక్షాత్కరించింది . భయంకరమైన దయ్యం రూపం లో

ఇది కథ . చాలా చిన్న కథ  రాసింది శారద  గా ప్రసిద్ధుడు అయిన ఎస్.  నటరాజన్ . ఈ కథ  రాసింది 1948 లో  అంటే స్వాతంత్య్రం వచ్చిన ఒక సంవత్సరం తరువాత . 1947 లోజరిగింది కేవలం అధికారం మార్పిడి మాత్రమేనని  అది కేవలం రాజకీయ స్వాతంత్య్రమేనని  దానిమీద ఎలాంటి భ్రమలు లేవని , అది కాల క్రమం లో ఎలాంటి రూపం తీసుకోగలదో  కూడా ఊహించడం ఈ కథ  ప్రత్యేకత . ఎస్ . నటరాజన్ తమిళనాడుకు చెందిన వాడు . మన తెనాలి లో ఒక హోటల్ లో సర్వర్ గా పని చేస్తూ తెలుగు నేర్చుకుని  శారద  అనే కలం పేరుతొ తెలుగు లో అద్భుతమైన కథలు  రాశాడు . శారద పేరు చెప్పగానే చాలామందికి మంచి చెడు , రక్తస్పర్శ , అపస్వరాలు గుర్తుకు వస్తాయి . శారద  రాసిన చాలా చిన్న కథ  ఇది . అయితేనే ఎన్నదగిన కథ

2019 వ సంవత్సరం తొలి  నాళ్లలో ఈ కథను చదువుతుంటే,  మన స్వాతంత్య్రం నడిచివచ్చిన  దారులన్నీ గుర్తుకువచ్చి మనసు దుఃఖపూరితం అవుతోంది . మనది పేరుకు ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్యమే కానీ మనలని పరిపాలిస్తున్నది  మాత్రం ఒక  ఆయుధం మాత్రమే . గ్రేహౌండ్స్ పేరిట , శాంతిభద్రతలపేరిట, నిర్వాసితుల తరలింపు పేరిట , ఉద్యమాల అణచివేత పేరిట,సంస్కృతీ పరిరక్షణ పేరిట  దేశం లో ఎక్కడో ఒక చోట  ఆయుధం  ఆ మాట నచ్చకపోతే సైన్యం  కలగచేసుకొని రోజు ఒక్కటంటే ఒక్కటైనా ఉన్నదా?  ప్రజలు ఎన్నుకున్న నాయకులే ఆ ప్రజల మధ్యకు ప్రభుత్వం కల్పించే రక్షణ లేకుండా , సొంతంగా తయారుచేసుకున్న బౌన్సర్ల సైన్యం లేకుండా   రాగలరా

మన యుద్ధ విమానాలు , మన మిరాజ్ 2000 లు , మన అణ్వాయుధాలు అన్నీ ప్రజల రక్షణ , స్వాతంత్య్రం కోసమేనా ? మన స్వాతంత్య్రం స్వతంత్రమేనా ? రాజ్యాంగం లో మనం చెప్పుకున్న , సంకల్పం ఇదేనా ? ప్రజల చేత , ప్రజలు కొరకు , ప్రజల వలన ఎన్నకోబడిన ప్రభుత్వం అంటే ఆయుధమేనా ?

ఓ మహాత్మా  ఓ మహర్షీ  ఏమిటీ స్వతంత్ర స్వరూపం?

*

వంశీ కృష్ణ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు