చిన్నమ్మ

చిన్నమ్మ పనికి  రాక అవాల్టికి నాలుగు రోజులు. ఫోను చేస్తే ఎత్తలేదు.

ఇల్లెక్కడో సరిగ్గా తెలీదు. పని చేసుకోలేక విసుగ్గా వుంది లావణ్యకి.

చివరికి వచ్చింది. జ్వరంవచ్చి, లంఖణాలు చేసిన దానిలా, మొఖం అంతా పీక్కుపోయి. ఏదో గట్టిగా  అనబోయి ఆ మొఖం చూసి ఆగి పోయింది లావణ్య.

“ ఏవిటి జ్వరం వచ్చిందా? ఫోన్  చేసి చెప్పచ్చు కదా!”

చిన్నమ్మ తలవంచుకునే వుంది. కళ్ళ నుండి బొటబొటా నీళ్ళు కారాయి.

“ఇప్పుడు నేనేమన్నాను. తిట్టానా చిన్నమ్మా? అంతలా  ఏడుస్తున్నావ్?”

“ నాకు బతకాలని లేదమ్మా. చచ్చిపోవాలని వుంది? ఏమి జన్మమ్మ నాది? ఏమి పాపం చేసిననమ్మ నేను?”

నోట్లో చీర చెంగు అడ్డం పెట్టుకొని కుములుతూ ఏడుస్తోంది.

“ ఏం చిన్నమ్మా ? అంత కష్టం ఏం  వచ్చింది చెప్పు?”

చిన్నమ్మ దుఖానికి తాను కారణం కాదని అర్ధం చేసుకుంది లావణ్య.

దుఖం దిగ మింగుకొంటూ చిన్నమ్మ  లావణ్య కేసి  చూసిన ఆ  చూపు..

ఆ చూపు, వధశాలకు లాక్కు వెడుతుంటే తన మరణం అర్ధమయి భయంతో గింజుకుంటూ చూసే మేక పిల్ల చూపులా బిత్తర, బిత్తర వుంది.

ఆ చూపు,  ప్రేమించిన వాడి కోసం అందర్నీ కాదని లేచిపోయి  వచ్చిన

ఆడపిల్లని, వ్యభిచారపు కొంపకి అమ్మేసి వెళ్ళిపోతున్న ప్రియుడి కేసి చూసే చూపులా వుంది. పురిటిలోనే చనిపోయిన బిడ్డను ఒళ్ళో పెట్టుకుని ఏడ్చే తల్లి దుఖంలా గుబులు, గుబులుగా వుంది.

ఆ పిల్లని చూస్తే లావణ్య కి భయం వేసింది.

ఒక్క మాటన్నా మాట్లాడకుండా లేచిన చిన్నమ్మ, బాత్రూం లోకి వెళ్ళి  మొఖం కడుక్కుని,  చీరే కొంగుతో గట్టిగా తుడుచుకుంటూ బయటకు  వచ్చి, కొంగు నడుముకు దోపి, జీవం లేని నవ్వు మొఖంతో

“పా, అమ్మ, నీకు నాలుదినాల సంది చాన కష్టం అయి వుండాలే” అంది సింక్ లోని అంట్ల గిన్నలు తోముతూ.

లావణ్యకు తెలుసు.తాను చెప్పాలని అనుకుంటనే తప్పా ఎవరు ఏమడిగినా చిన్నమ్మ మాట్లాడదని. ఇల్లు ఊడుస్తూ వుంటే,

“ ఇవాళ తుడవకులే, నీ పని అయ్యే లోగా దోసెలు వేస్తా, తినేసి  వెడుదువు గాని” అంది .

ఎక్కువ తినదు  చిన్నమ్మ. అదేమిటో ఎంత ఆకలిగా వుందో నాలుగు దోసెలు తిని, టీ తాగి, వెడుతూ “మిమ్మల్ని  మస్తు పరేషాన్ జేసినా గద” అంది చిన్న నవ్వుతో.

లావణ్య నవ్వి, ఏం మాట్లాడలేదు.

“అమ్మ, లేట్ అవుతున్నది. నేను షాప్కి ఇటునుంచి ఇటు కెల్లె, పోత” అని వెళ్లి పోయింది. బట్టల దుకాణంలో కొత్త పని దొరికింది చిన్నమ్మకి.

ఏడాది పిల్లవాడు కొడుకు. వాడిని, వరండాలో పాత చీరెలు పరిచి పడుకోబెట్టి, వాళ్ళ వదినతో పాటూ పనికి వచ్చేది. ఆ కొడుక్కి నవీన్ అని లావణ్యనే  పేరు పెట్టింది. ఇప్పుడు వాడు పదకొండేళ్ళ  వాడు.

వలస కూలీలుగా నగరానికి వచ్చిన అన్నా, వదినలతో పాటూ పని వెతుక్కుంటూ వచ్చిన  చిన్నమ్మ, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయినా, తను మాత్రం నగరంలోనే చంటి పిల్లవాడిని పెట్టుకుని వుండి పోయింది.

అదే బస్తీలో ఇరుగు పొరుగుతో నియ్యత్ గల పిల్ల, నిప్పులాంటిది అని అనిపించుకుంటూ ఇన్నేళ్ళుగా.

పెళ్లి అయిన రెండున్నర ఏళ్లకే చేతికి  ఆరు నెలల కొడుకునిచ్చి, గుండె పోటుతో భర్త చనిపోతే, పంతొమ్మిది ఏళ్లకే దిక్కు తోచక నిలబడింది చిన్నమ్మ.  జరిగింది నిజమని నమ్ముదామనుకునే లోగానే-

‘నీ పిల్లవాడిని ఎవరికన్నా దత్తుకి ఇచ్చి, నీకు రెండో పెళ్లి చేస్తాం’ అని బంధువులు అంటే, తన ఒళ్ళో నిశ్చింతగా  పడుకుని, చిన్ని, చిన్ని  కాళ్ళూ చేతులూ ఆడిస్తూ, తనని ఇష్టంగా కళ్ళు విప్పార్చి  చూస్తూ, పులుకు, పులుకున  నవ్వే, తాను తప్పా, లోకంలో మరెవరూ లేని

ఆ చిన్ని తండ్రిని  ఎవరి చేతుల్లో నైనా పెట్టి , ఎట్లా  తన సుఖం తాను చూసుకో గలను అని అనిపించిన చిన్నమ్మ, ఆ పిల్ల వాడిని పట్టుకొని భోరున ఏడ్చింది.

‘నా బిడ్డని, ఎవరికీ ఇవ్వను, నాకు ఇంకో మగడు వద్దు’ అని ఏడుస్తున్న  చిన్నమ్మకి, ఎవరూ నచ్చచెప్ప లేక పోయారు.

“ ఉప్పూ కారం తినే పెయ్య బిడ్డ. ఇట్ల ఎన్నాల్లుంటవ్. రేపటి దినం ఏమైనా తప్పు జేసినవే అనుకో. లోకం ఏమంటది బిడ్డ’’ అని తల్లి  నచ్చజెప్ప బోయినా చిన్నమ్మ వినలేదు.

బతుకు కోసం, చిన్నమ్మ చేయని పని లేదు. కష్ట జీవి. ఇరుగు పొరుగుకి చేతనైనంత  సాయ పడుతూ, ఎవరితో ఒక్క మాటన్నా అనిపించు కోకుండా, అదిగో,  చిన్నమ్మ లెక్క వుండాలి అని  చుట్టూ వాళ్ళు అనేలా వున్న చిన్నమ్మ గుండె లోపల ఏమి  గాయాలు వున్నాయో ఎవరికీ తెలీదు.

“చిన్నమ్మా. చూసేందుకు బాగుంటావు. వయసా చిన్నదే. ఇంత వరకూ ఎవడూ నిన్ను ఏం  అనలేదా” లావణ్య నవ్వుతూ అడిగింది ఒక రోజు.

“ బయట పనికి బోతే రోజు పులి, మేక ఆట ఆడాల్సిందే కదమ్మా ఆడోల్లు. నేను వెంటనే, వరుస గల్పుత. అన్న, తమ్మి, నాయిన, చిన బాపు గట్ల. అట్లా అన్నా, గదేంది చిన్నమ్మ “ బావ ‘’ అని అనరాదే, అంటారు ” అంటూ  చిన్నమ్మ నవ్వుతోంది.

“ఎంత మన జాగ్రత్తలో మనం వున్న, ఏదో ఒక మాట  అనేటోడు, సందు దొరికేతే సందేన్క సీకట్లకు రమ్మనేటోడు ఎందుకుండడమ్మ? ఏడన్న వుంటరు గసుంటోల్లు. ఆని మాట ఇనలేదని, నన్ను పనిలకేల్లి తీసినోళ్ళు మస్తు మందున్నరు” అంది.

“ఎవరు చిన్నమ్మ, అలాంటప్పుడు నీకు సాయం?”

“ఎవరుంటరమ్మ నాకు నేనే. మా అన్న గాల్లకో, మా  అమ్మకో జెబితే నన్నే తిట్టి వూరికి, ఎన్కకు  రమ్మంటారు. ఆడకి బోతే ఏమున్నది.  కల్వబోవుడు, మట్టి పని తప్ప. మీ అసుంటోల్లు సాయం జేస్తున్నారు గాబట్టే మా పోరగాడు ఇంగ్లీస్ బడికి పోతున్నడు. మా ఊర్లో బడి  ఏడున్నది? నా రెక్కలు నాకున్నయి. నా దైర్నము  నాకున్నది ఎక్కడైనా బతక్క లేనా  అనుకున్న”

చిన్నమ్మ మాటలు వింటే లావణ్యకి ఇంత ధైర్యం ఈ పిల్లకి ఎక్కడి నుండి వచ్చింది అని ఎప్పుడూ అనిపిస్తుంది.

ఇళ్ళలో పని తగ్గించి, రోజు కూలీ పనులకు,  మేస్త్రీ పనికి పోయేది. చిన్నమ్మ. ఎక్కడున్నా కష్ట పడి, తన పనేదో తను చేసుకొని బయట పడేది. ఎప్పటికప్పుడు  కూలీ వాళ్ళు మారుతూ వున్నా, బాగా పని చేసే ఒకరిద్దరు కూలీలను ఏ మేస్త్రీ అయినా సరే  తన జట్టులో అట్టే పెట్టుకుంటాడు. అందుకే  సాధారణంగా, చిన్నమ్మకి పని దొరకక పోవడం అంటూ  వుండేది కాదు ఎక్కువగా.

అట్లా  ఒక దగ్గర కలిసి  పనిచేసే చిన్నమ్మకి, నీలయ్యకి మెల్లిగా  మాటలు కలిసాయి. నెమ్మదైన మంచి వాడు, కష్టం, సుఖం, ప్రేమ చూపించడం తెలిసిన వాడు నీలయ్య.

గట్టిగా,  బండరాయిలా మార్చుకున్న చిన్నమ్మ హృదయం, నీలయ్య సమక్షంలో మెల్లిగా కరగటం ఆమెకు తెలియకుండానే మొదలైంది.

మట్టి మోయాల్సి వచ్చినప్పుడు, చిన్నమ్మకు మరీ బరువనిపించకుండా గంప నింపేవాడు.  మేస్త్రీ తీసుకు రమ్మంటాడు కాబట్టి, దూరం పనికి  వెళ్ళాల్సి వుంటే , చిన్నమ్మ  అడ్డా  దగ్గరికి వస్తే, తన లూనా పైన కూర్చో బెట్టుకు తీసుకు పోయేవాడు.

తిరిగి వెనక్కి దింపేటప్పుడు ఇరానీ చాయ్, నాలుగు సమోసాలు తిని ఎవరి దారిన వాళ్ళు పోయే వాళ్ళు. ఒకొక్క సారి కల్లు తాగేందుకు కూలీలు ఆడ, మగ కలిసి వెళ్ళినా, వాళ్ళు రమ్మని పిలిచినా చిన్నమ్మ  ఎప్పుడో తప్పా, వెళ్ళేది కాదు.

వాళ్ళ మధ్య  స్నేహం మెల్లిగా పెరుగుతూ వుంది. నీలయ్య భార్య వర్నీలో ఇద్దరు పిల్లలను పెంచు కుంటూ, పెద్ద వయసులో వున్న అత్తని చూసుకుంటూ, బీడీ కార్ఖానాలో పని చేస్తూ వుంది.

“నీ పెండ్లాం బిడ్డలను ఈడికే తెచ్చుకుంటే, గీ తిండి, వుండుడు తిప్పలు తప్పేవి కదా?” అంది చిన్నమ్మ.

“ఆడ ఊర్ల ,  రెండు గదుల కమ్ర మా సంతానికే వుంది. చుట్టాలు, పక్కాలు  అందరు గాడనే వుంటరు. గీ పైసలతో, పట్నంల ఏట్ల బతుకుతాం? ఇంటి కిరాయికే నా  సంపాదన అంతా పోతది”  అన్నాడు నీలయ్య.

నీలయ్యకి, చిన్నమ్మ తన మనసుకు దగ్గరైన మనిషి అని అనిపిస్తుంది. ఆమెతో మాట్లాడుతూ ఉంటే మనసు లోపల తెలియని సంతోషం, ఉత్సాహం వచ్చేస్తుంది.
చిన్నమ్మ కష్టం తాను కొంచెం పంచుకుంటే బాగుండునని, ఆమె సుఖంగా ఉంటే బాగుందని అనిపిస్తుంది. తన పెద్దక్క ఒంటరి ఆడదే. ఆమె పడ్డ కష్టాలు చూసాడు నీలయ్య. అందుకే చిన్నమ్మకి తాను చేయగల సాయం ఏదున్నా చేసేందుకు ముందుకు వస్తాడు.

చిన్నమ్మకి అర్థం కావడం లేదు. నీలయ్య తో గడిపే సమయం, ఇంకాస్త ఎక్కువ ఉంటే బాగుండని, రోజు కలిస్తే బాగుండని ఎందుకు అనిపిస్తుందో. కొడుకు కోసం, తనకోసం ఎట్లాగూ వండుకుంటది కాబట్టి నీలయ్య కోసం మరి కొంచెం ఎక్కువ వండి ఎప్పుడైనా తీసుకెళ్లేది.

ఎవరి గూళ్ళకి వాళ్లు వెళ్లాక, ఆ చిన్న ఫోన్ లో వాళ్ళ సంభాషణ సాగేది. ఒకరి కుటుంబాలు గురించి ఒకరు, ఒకరి కష్టాల గురించి మరొకరు మాట్లాడుకుని ఓదార్చుకోవడం, ధైర్యం చెప్పుకోవడమో వాళ్ల రోజువారి దినచర్యలో భాగమైంది.

చిన్నమ్మకి లోకం అందంగా, పచ్చ పచ్చగా ఉంది. తన కష్టం ఇప్పుడు అంత కష్టంగానూ అనిపించడం లేదు. కొడుకు చేసే అల్లరి పనుల్ని విసుక్కోకుండా భరించే ఓర్పు వచ్చింది.

“ అమ్మని కండ్ల దవాఖానుకు తీసుకపోవలె. ఆరు నెలల సంది వాయిదా వేస్తున్న. ఈడకు తెస్తే ఏడబెట్టాల? నీనే వేరే  వాండ్లతోని గదిల వుంటాన్న”

మరో మాట లేకుండా “మా యింటికే తీస్క రారాదు“ అంది చిన్నమ్మ.

తర్జన భర్జనలు అయ్యాక, మరో దారి లేదని అనిపించి, చిన్నమ్మ ఇంటికే తల్లినీ, భార్యను తీసుకు వచ్చాడు నీలయ్య.

ఒక్క రోజు, అనుకున్నోల్లు వారం రోజులు వుండాల్సి వచ్చింది. నీలయ్య భార్య అమాయకపు పిల్ల. మేనరికం అని, వయసు తేడా వున్నా చేసారు నీలయ్యతో పెళ్లి. ఆ పిల్ల అక్కా, అక్కా, అంటూ చిన్నమ్మతో కలిసి పోయింది.

నీలయ్య తల్లికే, అన్ని ఆరాలూ కావాల్సి వచ్చాయి. మగమనిషి లేని ఆ ఇంటికి కొడుకు తమని అంత సులువుగా ఎలా తీసుకువచ్చి పెట్టాడు అని.  వాళ్ళు తిరిగి వెళ్లి పోయేటప్పుడు, నీలయ్య భార్యకి చీరా, జాకెట్టు పెట్టి పంపింది చిన్నమ్మ. నీలయ్య మనసు నిండిపోయింది.

చిన్నమ్మకి   ఏ సాయం కావాలన్నా,  నీలయ్య ఎప్పుడూ తయారుగా వుండేవాడు. ఆ చిన్న ఇరుకు ఇళ్ళ బస్తీలో, ఎవరి ఇంట్లో ఏమి జరిగినా అంతా బజారులోనే వుంటుందన్న సంగతి నీలయ్యకు తెలుసు కాబట్టి, నీలమ్మ తెమ్మని చెప్పిన సరుకులో, వస్తువులో ఆమె ఇంటి ఓనర్ వద్దో, పక్కింటి వాళ్ళ దగ్గరో పెట్టి వెళ్లడమో, ఆమెని ఇంటి బయటే, పలకరించి పోవడమో చేసేవాడు. బస్తీ వాళ్ళకీ, నీలయ్య మెల్లిగా పరిచయం కావడం మొదలైంది. ‘ పోరగాడు మంచోడు’ అన్న పేరూ వచ్చింది.

నీలయ్య ‘మీ బస్తీలోనే ఏదైనా గది దొరికితే వచ్చేస్తా’ నంటే చిన్నమ్మే వద్దనింది. ‘మనం అప్పుడు  ఇట్లా అన్నా  కలుసుకొని, మాట్లాడుకోలేం.’ వద్దంటే, వద్దంది. అదీ నిజమే అనుకున్నాడు నీలయ్య.

ఇద్దరూ కలిసి వెళ్లి, అప్పటి వరకూ చేస్తున్న యింటి  పని అయిపోవచ్చింది. ఇద్దరు మళ్లీ కలిసి పని చేయడానికి కుదరకపోవచ్చు. బతుకు తెరువుకు నీలయ్య మళ్ళా ఎక్కడికన్నా వెళ్లిపోవచ్చు. చిన్నమ్మ కూడా మరెక్కడన్నా పని వెతుక్కోవాల్సి రావచ్చు.

మట్టి తట్ట తీసుకొని, నాలుగో అంతస్తులలో పనిచేస్తున్న నీలయ్య దగ్గరికి వెళ్లిన చిన్నమ్మకి గుబులు, గుబులుగా ఉంది.

“ఇగ రెండు రోజులు అయితే నువ్వు ఏడ ఉంటవో,  నేనేడుంటనో ఎవరికి ఎరుక? నన్ను యాదికుంచుకుంటవా?” అన్నాడు నీలయ్య.

తట్ట కిందకు పెట్టి, నీలయ్య చేతులు పట్టుకొని  నీళ్లు నిండిన కళ్ళతో అతని మొఖం కేసి తేరిపార చూసింది చిన్నమ్మ. ఏమనిపించిందో నీలయ్యకి, మొదటి సారి, చిన్నమ్మ భుజాల చుట్టూ, తన రెండు చేతులు వేసి, గట్టిగా దగ్గరకు లాక్కుని ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు. ఇద్దరి పెదవులకు అంటుకున్న మట్టి గరుకు గరుగా తాకింది.

చిన్నమ్మ నవ్వుతూ ” ఏంటిది ఇది ” అంది.

అతను మరింత గాడంగా, ఆమెను    కవుగిలించు కున్నాడు. చిన్నమ్మకి ఆ దగ్గరి తనం సంతోషం గానూ, ఇష్టంగా వుంది . నీలయ్య  తనకి మరింత దగ్గరి వాడుగా  అనిపించాడు.

“సాయంత్రం నాతో పాటు కల్లు దుక్నంకి  రావచ్చు కదా. జర తాగొచ్చు కదా నా కోసం” అన్నాడు.

వెనక్కి తిరిగి నీలయ్య కేసి  చూసి, నవ్వుతూ మట్టి తట్ట అందుకుని కిందికి దిగిపోయింది చిన్నమ్మ. ఆమెకి తన శరీరం తేలికై, గాలిలో తేలిపోతున్న భావం కలిగింది.

రోజూ తన తో పాటూ పని చేసే కూలీలే కాబట్టి,  చిన్నమ్మకి వాళ్ళతో కలిసి వెళ్ళడం  కొత్తగా  ఏమీ అనిపించలేదు. చిన్నప్పటి నుండీ  ఇంట్లో, ఇరుగు, పొరుగున  తాగేటోళ్ళను, తాగిన తరువాత జరిగే  కొట్లాటలను  చూస్తూనే పెరిగి పెద్దది అయింది. ఎందుకో, పండగల అప్పుడు ఈ ఒక్క సారికే కదా, అని ఎవరు బలవంతం చేసినా   చిన్నమ్మ ఎన్నడూ  తాగలేదు.

అది తాత్కాలికంగా వేసిన  ఒక రేకుల షెడ్డు. తాగుతూ తినేందుకు గుడాలు, పల్లీలు,  బజ్జీలు వేయిస్తున్నారు. ఓ పక్క వేగుతున్న  చేపల, మాసం తునకల  వాసన, మద్యం వాసనతో కలగలసి  అదో రకపు వెగటు వాసన అంతటా. లోనకు అడుగు పెట్టగానే అది ఒక వేరే లోకంలా కనిపించింది చిన్నమ్మకు. నడి  వయసు దాటిన ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు, ఒక ముసలవ్వ ఎవరి మానాన వాళ్ళు ఒంటరిగానే కూర్చుని తాగుతున్నారు. గుంపులుగా, కోలాహలంగా, వంటరిగా, నిశ్శబ్దంగా  కూర్చున్న  మనుష్యులతో, పూటుగా తాగేసి, గట్టి, గట్టిగా తమతో తామే వాదించుకుంటున్న, దుఃఖిస్తున్న మనుష్యులతో అక్కడి వాతావరణం  అత్యంత  సహజంగానూ, కొంచెం కొత్తగానూ వుంది చిన్నమ్మకి.

చిన్నమ్మకి , నీలయ్య కీ  మధ్య వున్నా దగ్గరితనం  దాదాపు అందరూ పసిగట్టిన వాళ్ళే. వాళ్ళ ముందు, వెనుక వాళ్ళ గురించి హాస్యాలు ఆడిన వాళ్ళే వాళ్ళంతా.

“ ఏందో, మీ ఇద్దరి కత అర్ధమే అయిత లేదు“ అంది అనుకోకుండానే  పక్క పక్కనే కూర్చున్న, చిన్నమ్మ, నీలయ్యను చూస్తూ ముసి, ముసిగా నవ్వుతూ  యాదమ్మ.

“కతేంది? కత?” అంది చిన్నమ్మ నవ్వుకుంటూనే. నీలయ్య కూడా చిన్నగా నవ్వాడు.

“ హే, వూకోవే. నువ్వు లింకులు మా లావు బెడతవు. సప్పుడు జేయకు” అంటూ భార్య చేతికి గ్లాసు అందించాడు ఆమె భర్త.

ఒక గంట వాళ్ళతో కూర్చుని, బజ్జీలు తిని, ‘నా కొడుకు ఒక్కడే వుంటడు. నేను ఇంటికి బోత ‘ అని చిన్నమ్మ  బయలు దేరింది.

చిన్నమ్మ ఇంటికి వచ్చేసరికి కొడుకు బియ్యం కడిగి పోయి మీద పెడుతున్నాడు. వాడికి చిన్నప్పుడే ఆ పని నేర్పింది చిన్నమ్మ. ఆమె పని నుండి రావడానికి ఆలస్యం అవుతే వాడికి కష్టం కాకూడదని.

ఇక చేస్తున్న  పని అయిపోయి, వేరే పని వెతుక్కునేలోగా ఇంటికి పోయి వస్తా అన్నాడు నీలయ్య.

“ఇల్లు కురుస్తున్నది. ఆన కాలం వచ్చే లోగా కప్పు జర మంచిగా జేయాలే “

“ ఎన్నడస్తవ్ మల్ల “

“అన్ని సగ బెటక్క వచ్చే దానికి, నెల దినాలన్న పడతది గద, చిన్ని” అన్నడు ఆమె వీపు నిమురుతూ నీలయ్య.

చిన్నమ్మకి దిగులు, దిగులుగా దుఃఖ, దుఖంగా వుంది. అతన్ని పోకుండా తానేమీ ఆపలేదు. అతనికి పోకుండా వుండగల పరిస్థితీ లేదు.

“నిన్ను చూడకుండా వుండుడు కష్టమే చిన్ని నాకు. నిన్ను ఎట్లన్న పెళ్లి జేసుకుంటా. ఎమన్నా గానీ”

ఆ మాటలకి చినమ్మా కళ్ళవెంట నీళ్ళు జలజలా రాలాయి.

అతని చేయి గట్టిగ పట్టుకున్నది.

“గది అయ్యే పనేనా నీలయ్య? నీ పెండ్లం, బిడ్డలు ఏం గావలె? లోకం ఒప్పదు. నువ్వు పోతనంటే నాకు కాళ్ళు చేతులు ఆడతలేవు“ అంది నీలయ్య చేయి గట్టిగా పట్టుకొని.

అతనికి ఆమెను, గుండెలకు హద్దుకొని ఓదార్చాలని వుంది.

పని అయి పోయిన చోటే వాళ్ళు కూర్చుని ఉన్నారు ఇంకా. పని వాళ్ళు అంతా ఒక్కరొక్కరే వెళ్లి పోతున్నారు.

మెల్లిగా చీకటి పడటం మొదలైంది. అయినా అక్కడే కూర్చునేందుకు   అదేమీ క్షేమమైన చోటు కాదు.

“ఏడికన్న బో యి కూసుని, కరువు దీర ముచ్చట పెట్టుకోనికి ఒక తావన్న లేక పాయ మనకి. ఎప్పుడన్నా, మీ  బస్తీలకి వచ్చి, మీ ఇంటికి రాకున్నా, ఈడెంది?  బస్తిలకి అస్తడెంది? అన్నట్లు జూస్తారు కొందరు. నా గదికి నిన్నెట్ల తీస్క బోవాల్నంతే, నాతోని ఇంకొక ఇద్దరు అదే కమరల వుంటరు! ఇగ ఏడికి బోదమే సిన్ని” అని నీలయ్య నవ్వాడు.

ఎటుబోవాలో తెలియని వాళ్ళిద్దరూ, రోడ్డు మీద అట్లా నడుస్తూ పోయారు మాట్లాడుకుంటూ.

ఇక నడవలేక, రోడ్డు పక్కనే వున్నా ఒక బండి దగ్గర వేసిన ప్లాస్టిక్ స్టూల్స్ పై ఒకరికి ఒకరు తగిలేలా కూర్చుని, పొడుగ్గా సాగుతూ,  పెద్దగ రుచి లేని వేడి,వేడి  నూడిల్స్ తిని,  కూల్ డ్రింక్ తాగారు.

అది మోహమో, వాంఛయో, ప్రేమనో, శరీరపు కోరికల పర్యవసానమో వాళ్ళకు తెలీదు. ఆ బంధాన్ని  ఏమని పిలవాలో కూడా తెలీదు. అది ఎట్లా కొనసాగనుందో  కూడా వాళ్ళకి తెలీదు.

ఇక ఒకరిని విడిచి మరొకరు వుండటం కష్టమన్న విషయం మాత్రం వాళ్ళకి అర్ధం అయింది.

నీలయ్య వెళ్ళిపోయాడు. చిన్నమ్మ పని చేస్తూనే వుంది కానీ, ఆమె ధ్యాస మారింది. ప్రతి  రోజూ పొద్దు పోయాక,  రాత్రి ఫోన్ లో  జరిగే వాళ్ళిద్దరి సంభాషణ కోసం ఇద్దరూ ఎదురు చూసే వాళ్ళు.

పెళ్లి చేసుకుందాం,  ఇంట్లో చెప్తాను మన సంగతి అని నీలయ్య  అంటే చిన్నమ్మే,  ఇప్పుడేమీ చెప్పవద్దు అని, మెల్లిగా ఆలోచిద్దాం అని నీలయ్యకి గట్టిగా చెప్పింది. నీలయ్య చెప్పనన్నాడు. ఆమె మనసులో  ఈ బంధాన్ని, నీలయ్య భార్య ఎలా తీసుకుంటుందో అన్న  సంశయం చాలా వుంది.

రెండు, మూడు, వారం రోజులైంది నీలయ్య దగ్గరి నుండి ఫోన్ లేదు.

మోగుతున్నది కానీ ఎత్తడం లేదు. ఏమైనదో  చిన్నమ్మకి అర్ధం కాలేదు.

మరో రెండు రోజులకి ఫోన్ ఎత్తడం చూసి, చిన్నమ్మ గుండె వేగంగా కొట్టుకుంది. హలో అనగానే, అవతలి వైపు నుండి కర్కశమైనగొతుక

“ ఎవలు, ఎవలుగావలె నీకు? ఏమో రోజు ఫోన్లు జేసి సతాయిస్తాన్నావు? మా పరేషాన్ల మేముంటే”  చిన్నమ్మ భయపడి ఫోను పెట్టేసింది.

మళ్ళీ నాలుగు రోజులు ఆగి చేస్తే, ఈ నెంబరు పని చేయుట లేదు  అని వినపడింది.

ఏమి చేయాలో,  నీలయ్య గురించి ఎవర్ని అడగాలో తెలియలేదు చిన్నమ్మకి.

తినాలని అనిపించదు. నిద్ర పట్టదు. పని చేయాలనీ వుండదు. కానీ  చేయక తప్పదు. అన్నీ వదిలేసి నీలయ్యను వెతుక్కుంటూ వెళ్ళాలని అనిపిస్తుంది కానీ  వెళ్ళలేదు. అసలు ఎక్కడున్నాడో తెలీదు. ఏమి సుఖ పడ్డాను, నాకు ఇలాంటి బతుకు ఎందుకు అని లోలోన కుంగి పోయేది. నీలయ్య కోసం మనసు కొట్టుకునేది. చివరికి కొడుకు ధ్యాసా పట్టలేదు.

మూడు నెలల తరువాత, ఏదో కొత్త నెంబరు నుండి నీలయ్య చిన్నమ్మకి ఫోన్ చేసాడు. కూలి పని అయి  ఇంటికి తిరిగి వస్తుంటే.

నీలయ్య మాట వినపడగానే చిన్నమ్మకి దుఖం తన్నుకు వచ్చింది.

“యాడకు బోయినవు? ఏమైనవ్? నన్ను ఇడసబెట్టి? ఒక్క మాటన్న లేకుండ”

చిన్నమ్మ అక్కడే, రోడ్డు మీద ఫుట్ పాట్ పైన దుమ్ములో కూలబడి చిన్నగా ఏడుస్తోంది.

అటుపక్క నీలయ్య ఏడుస్తున్నాడు.

“మూడు నెల్లాయే, చెట్టు నరకడానీకి పోయినప్పుడు కిందబడి  నడుములు ఇరిగినయి. మంచంలోనే వున్నా ఇంకా” అన్నాడు  నీలయ్య.

“నీకు ఎట్ల సెప్పాలె, నాకు ఇట్ల అయిన సంగతి. నువ్వు ఫోన్ చేసిన సంగతి నాకు ఎవలు  చెప్పలే. నేను అసలు కొన్ని దినాలు మన సోయిలోనే లేను. నీకు నాకు సొపతని ఎట్లనో ఇంట్ల మా అమ్మకు, మామలకు తెలిసింది. నా దగ్గరి కెల్లి ఫోను గుంజుకున్నరు. డాక్టర్ మాట్లాద్దన్నడు అనుకుంట”

చిన్నమ్మ కి ఏడుపు ఆగటం లేదు.

“ మా దోస్తు నన్ను సూడనీకి అస్తే, ఆని ఫోన్ల కెల్లి మాట్లాడతాన్న” అన్నాడు నీలయ్య.

“ నిన్ను సూడకుండ ఎట్లయ్య. నేనొస్త నీ తానకి. నువ్వు ఎడనున్నవో కూడ, నాకు ఎర్క లేక పాయె” అంది కన్నీళ్ళు తుడుచుకుంటూ చిన్నమ్మ.

“నువ్వు వస్తే, లోల్లయితది. రాకే సిన్ని. ఇట్లానే ఎన్నడన్నా మాట్లాడు  కుందాం” అన్నాడు దుఖం నిండిన గొంతుతో  నీలయ్య.

అంతలోనే, చేతిలోనే ఆగిపోయిన ఆ చిన్న ఫోను కేసి తదేకంగా చూసింది చిన్నమ్మ .

ఏమి చేతులు  అవి? కష్టం తప్ప సుఖం తెల్వని చేతులు. చాకిరి చేసి, చేసి బండ బారిన చేతులు.

ఈ చేతుల్లో చేయి వేసి నీ కోసం నేనున్నానే సిన్ని  అన్న వాడు, ఆశపెట్టినవాడు, అంతకన్నా, ఏడుపు ఎందుకే  నీకు చిన్ని  అని నవ్వించినవాడు,  ఈ చేతుల్ని దగ్గరికి లాక్కొని ముద్దు పెట్టినోడు, వాని చేతులతో నన్ను దగ్గరకు  లాక్కున్నవాడు  వాడు ఏడకు పోయిండు? వాడికి ఏమైంది?

వాడు నడుములిరిగి, మరి ఇగ లేవలేక, లేవలేక, నా దగ్గరికి రాలేక, నేను వాని తానికి పోలేక, ఏమి పాపపు జన్మ నాది ఎందుకు ఇట్లా బతుకుడు? దగ్గర కొచ్చినోడు, నీకోసం నేనున్ననే సిన్ని అన్నోడు,

ఇట్లా దూరం అయిపోయే?

నేను బతికుండి  కూడా, వానికి ఏం చేయలేక, ఏమి చేతకాని దాని లెక్క ఉన్ననే?  ఏమి బంధం ఇది?

”నేను వస్తారా నీ దగ్గరికి, ఎవరు ఏమన్నా, ఎవరు ఏమనుకున్నా నాకేంది” అని మనసులో అనుకుని, ఆ మాటే గట్టిగా అనలేక

గుండెల్ని మనసు  లోపలే,  కనపడకుండా రెండు చేతులతో కొట్టుకొని, తల కొట్టుకొని నిశ్శబ్దంగా ఏడ్చింది చిన్నమ్మ ఆ రోడ్డు మీదే.

ఒక్క ఊపుతో ఆ ఫుట్పాత్ నుంచి లేచి, ఎక్కడికి పోతున్నాను, ఏమి చేస్తున్నాను అని  తెలియకుండానే, వడి వడిగా దుమ్ము కొట్టుకున్న ఆ ఇరుకు వీధుల గుండా నడిచి, తనకు తెలియకుండానే కల్లు దుకాణంలోకి పోయింది.

బొడ్డులో దోపుకున్న పైసలు, ఎన్ని ఉన్నాయో కూడా చూడలేదు. అవి  ఆ దుకాణం వాడి చేతిలో పెట్టి, లోనికి పోయి కూర్చుంది. ఒక్క దుఃఖం తప్ప, ఆమెలో ఇప్పుడు ఏమీ లేదు. తన చుట్టూ ఏం జరుగుతుందో ఆమెకి ఏమి, సో యి లేదు. ఒకరిద్దరు ఆమెకేసి చిత్రంగా చూసినా  ఏ చూపులు ఆమెను తాకలేదు.

పిల్లవాడు సీసా తెచ్చిపెట్టాడు. గ్లాస్ తెచ్చిపెట్టాడు. తాను తాగుతున్నది ఏమిటో కూడా ఆమెకు తెలియదు. గ్లాస్ లో పోసుకొని పైకెత్తి ఒక్క గుక్కతాగింది. చేదుగా వగరుగా, గొంతులో మంటగా, ఏదో వాసనతో అదేమి నచ్చినట్టు, బాగా లేనట్టు అనిపించినా, లోని బాధను మింగేస్తున్న దానిలా, మళ్లీ, మళ్లీ ఒంపుకొని తాగింది.

నిషా తలకి ఎక్కి ఆమె అక్కడే, కూర్చున్న దగ్గరే మెసలుతూ ఏడ్చింది. తనలో తాను గట్టిగ మాట్లాడుకుంది. ఏమేమో తలపోసుకుంది. తడబడుతూ లేవబో యి, లేవలేక కూలబడింది అక్కడే.

దుకాణం వాళ్లకి ఇట్లాంటివేమీ కొత్త కాదు.

ఆమె అప్పుడప్పుడు  స్నేహితులతో పాటు   రావడం చూసిన అక్కడి పిల్లవాడు చిన్నమ్మ పరిస్థితి చూసి

“అక్క, ఇంక చాలు అక్క, ఇంటికి పో  అక్క”  అన్నాడు జాలిగా.

కళ్ళు తిరుగుతున్నాయి. ఒళ్ళు తూలుతోంది. నేల పైకి కిందికి ఉయ్యాల ఊగుతున్నట్టుగా ఉంది.

అడుగు తీసి అడుగు వేస్తూ, తడబడే అడుగులతో కొంగు నేల మీద

జీరాడుతుండగా ఆమె రోడ్డు మీదకు వచ్చింది. నాలుగు అడుగులు వేసి కొంచెం ముందుకెళ్ళిందో లేదో, ఇక నడవలేక ఆ రోడ్డు పక్క మట్టిలో చెత్తా చెదారం దగ్గర పడి వున్న దగ్గరే కుప్ప కూలి  పడిపోయి.

” ఎవరీ  ఆడది? ఎక్కడికి కెల్లి వచ్చింది? ఏడకి పోవాలి?”

ఎవరో ఎవరినో అడుగుతున్న ప్రశ్నలు లీలగా వినిపిస్తున్నాయి చిన్నమ్మకి. ఆ ప్రశ్నలకు జవాబు చిన్నమ్మ దగ్గర కూడా లేదు.

పైకి లేవలేని ఆశక్తతతో చిన్నగా కదిలిందామె.

ఇక ఏడవటానికి కూడా శక్తి లేకుండా చిన్నగా ఎక్కిళ్ళు పెడుతూ వుంది.

ఎవరో ఆమెను లేపి, మూసివున్నా దుకాణపు షట్టర్ కు ఆనించి కూర్చోబెట్టారు.

మరెవరో, ముఖం మీద కాసిన్ని నీళ్లు కొట్టి, తాగడానికి నీళ్లు అందించారు.

చిన్నమ్మకి తన చుట్టూ, ఏం జరుగుతుందో  ఏమీ అర్థం కాని పరిస్థితి.

ఎక్కడ పోవాలి. ఇల్లు ఎక్కడ అని ఎవరో అడిగే ప్రశ్నకి , బిత్తర చూపులు  చూస్తూ ఉంది.

కల్లుపాక కేసి పోతున్న యాదమ్మ, మరో ఇద్దరు కూలీలు, ఈ గుంపును చూసి అక్కడికి వచ్చారు.

పగిలిపోయిన మనిషిలా ఉన్న చిన్నమ్మను, జుట్టు చెదిరి, చీర కొంగు ఎటో పోయి, బిత్తర, బిత్తరగా చూస్తున్న చిన్నమ్మను చూసి యాదమ్మ కి గుండె ఆగినంత పని అయింది.

“ఏమైందే నీకు ? గిదేం కతే  తల్లి” అంటూ చిన్నమ్మను  చుట్టుకుని ఏడ్చి, మెల్లిగా పైకి లేవనెత్తింది. ఆటో పిలిచి, మరో కూలి సాయంతో కూర్చోబెట్టి ఇంటికి తీసుకెళ్ళింది.

ఆ సన్నటి గల్లీలో యాదమ్మ భుజం మీద చేయి వేసి, తడబడే అడుగులతో, నడుస్తూ ఇంటికి వచ్చిన చిన్నమ్మని ఇరుగుపొరుగు ఆశ్చర్యంగా చూశారు.

బట్టలు దుమ్ము కొట్టుకొని పోయి ఉన్నాయి.

రోడ్డు మీద పడిందేమో, చూడడానికి మురికి కాలవలో నుంచి లేచి వచ్చిన చిన్న కుక్క పిల్లలా ఉంది.

భయంగా, తత్తరపాటు తో  చూస్తూ  వున్న చిన్నమ్మని, తడికచాటు స్నానాల గదిలోకి తీసుకెళ్లి, యాదమ్మ, మరొక పక్కింటి ఆమె కలిసి, స్నానం చేయించి, ఒంటికి ఉతికిన చీర చుట్టారు. ఏమన్నా తినమంటే తినకుండా మెండికేసింది.

చిన్నమ్మ చాలా అలసిపోయి ఉంది. ఇంకా పూర్తిగా మత్తు దిగలేదు. అప్పటిదాకా భయపడి దూర, దూరంగా ఉన్న కొడుకు, తల్లి పిలవగానే వచ్చి పక్కన కూర్చున్నాడు.

ఇంట్లో ఎవరో చచ్చిపోయినట్టే, కొడుకు స్పర్శ తగలగానే చిన్నమ్మ పగిలి, పొగిలి, పొగిలి  ఏడ్చింది.

ఎన్నడో చచ్చిపోయిన, తండ్రిని, అర్ధాంతరంగా ఒక పిల్లవాడిని చేతిలో పెట్టి చచ్చిపోయిన మొగుణ్ణి, కాయ కష్టం తప్ప మరో సుఖం తెలియని బతుకుని, వుండీ లేని పుట్టింటి వాళ్ళను  తలుచుకొని ఏడిచి, ఏడిచి అట్లానే నిద్రపోయింది.

చిన్నమ్మని మొదటి నుండీ చూస్తూనే వున్న ఇరుగు పొరుగు గుక్కబట్టి  ఏడ్చిన చిన్నమ్మ కేసి జాలిగా చూసారు.

పొద్దున మెలకువ వచ్చాక, ఆ రాత్రి తాను ఎక్కడికి పోయింది, ఎట్లా తాగింది ఇంటికి ఎట్లా తిరిగి వచ్చింది లీలగా గుర్తొచ్చింది చిన్నమ్మకి.

నీలయ్య గుర్తుకొచ్చాడు. మళ్లీ హృదయం అతడి కోసం తండ్లాడింది.

ఇంత బతుకు బతికి, ఎన్నడూ తాగని దాన్ని, ఎంతో గౌరవంగా బతికిన దాన్ని, అందరి ముందు తాగి, తల వంపులు తెచ్చుకునే పని చేసుకున్నా కదా బస్తీల  అనే బాధ ఆమెని నలిపేసింది.

ఏమీ తినాలి అనిపించలేదు. పనికి పోవాలని కూడా అనిపించలేదు. ఇంట్లోంచి బయటకు రాలేదు రెండు రోజులు.

మర్నాడు ఇంటి ఓనర్ భార్య, మరో ఇద్దరు ఆడవాళ్లు చిన్నమ్మ దగ్గరకు వచ్చి,

“అంతగనం ఎందుకు బాధపడుతున్నవే? ఏం తప్పు చేసినావ్? జరంత ఎక్కువ తగినవ్?  ఎన్నడూ తాగని దానివి? నీకు ఎంత బాదయిందో?

నీకు ఏమన్పించి గాపని జేసినవో నీకే ఎర్క ”

అని దగ్గర వుండి అన్నం తినిపించారు.

కానీ, చినమ్మకే తల కొట్టేసినట్లు అనిపించింది.

అందరూ ఏం అనుకుని వుంటారో తన గురించి అని తలచుకొని  బాధపడింది.

తన బాధ ఎవరికీ చెప్పుకోవాలి?  మళ్ళీ నీలయ్య తో మాట్లాడేది  ఎట్లా? ఎక్కడున్నాడో? ఎట్లున్నాడో అన్న దిగులు , ఒక సారి చూడాలన్న తపన ఆమెని తినేస్తున్నాయి.

మరో రెండు వారాలు తరువాత, చిన్నమ్మ

” అమ్మ నాకు అప్పు కావాలి” అంది లావణ్య తో.

” నువ్వు నాకు ఇవ్వాల్సిన పాత అప్పు అట్లానే వుంది కదా చిన్నమ్మ ? ఏంటి అంత అవసరం ? “అడిగింది లావణ్య.

అప్పుడు చెప్పింది చిన్నమ్మ.

ఆరోజు తాను ఎందుకు అలా ఉందో. నీలయ్యతో తనకు ఏర్పడిన సావాసం గురించి. నీలయ్య చెట్టు మీద నుండి  పడి నడుమును ఇరగ కొట్టుకున్న విషయం.

చిన్నమ్మ చెప్పినదంతా, లావణ్య ఏమీ వ్యాఖ్యానం చేయకుండా వినింది నిశ్శబ్దంగా.

అన్నేళ్ళ  ఆమె ఒంటరి బతుకులో, కొంచెం ఆనందం నింపిన నీలయ్య అలా కావడం లావణ్యకు కూడా బాధ కలిగించింది.

“నేను ఎట్లన్న అడ్రస్ కొనుక్కొని, నీలయ్యను చూడటానికి పోవాలమ్మా. కొన్ని పైసలు ఆయన వైద్యానికి ఇచ్చి రావాలమ్మా. ఎట్లన్న గాని పోవాలమ్మా” అంది బాధగా చిన్నమ్మ.

లావణ్య మరి ఏమి మాట్లాడలేదు. చిన్నమ్మ అడిగిన పదిహేను వేలు  తీసుకొచ్చి ఆమె చేతుల్లో పెట్టింది.

నాలుగు రోజుల క్రితం వర్ని నుంచి నీలయ్య దూరపు చుట్టం  ఒకడు చిన్నమ్మ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు. నీలయ్య నిన్ను చూడాలి అంటున్నాడు అని. అతనే వర్నిలో నీలయ్య ఉండే వీధి, ఇల్లు గుర్తులు ఇచ్చాడు.

నీలమ్మ  తెల్లవారుజామునే బస్సు ఎక్కి నీలయ్య ఊరికి ప్రయాణం అయింది.

ఇల్లు కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాలేదు.

ఇంటి ముందు సానుపు జల్లుతున్న నీలయ్య భార్య, చిన్నమ్మను చూసి ఆశ్చర్యపోయింది.

మంచంలో బక్క చెక్కి, మాసిపోయిన గడ్డంతోటి, అసలు గుర్తుపట్టడానికి రాని విధంగా నీలయ్య ఉన్నాడు.

ఆ మంచం దగ్గర అదోరకపు ముక్క వాసన. గాలి వెలుతురు అంతగా రాని ఆ ఇంట్లో, ఇంటి వాసాలను చూస్తూ కాలం గడపడం తప్ప నీలయ్య ఇన్నాళ్లుగా చేస్తుంది ఏమి లేదు.

మనిషి మానసికంగా బాగా కుంగిపోయాడు.

ఒకటికి, రెంటికి, తినడానికి, అన్నిటికీ భార్య పైన, తల్లి పైన ఆధారపడాల్సిన స్థితి.

తల్లి, భార్య బీడీలు చుట్టి  సంపాదించేదే, ఆ కుటుంబానికి ఆధారం ఇప్పుడు. బతకడమే కష్టంగా ఉన్న ఆ స్థితిలో నీలయ్యకి సరైన వైద్యం అందించటం వాళ్ళకి ఎంతో కష్టమైన విషయం. ఎందుకీ బతుకు, ఇతరుల పైన ఆధారపడి అని నీలయ్య అనుకోని క్షణం లేదు.

అతని మంచం పక్కన కూర్చుని, చేతులు పట్టుకొని చిన్నమ్మ మెల్ల మెల్లిగా ఏడ్చింది.

నీలయ్య   కళ్ళలోంచి కన్నీళ్లు ధారపాతంగా కారాయి.

కొంచెం దూరంగా నిలబడ్డ నీలయ్య  భార్య, తల్లి వాళ్ళని చూసి ఏమీ అర్థం కాక నిశ్శబ్దంగా నిలబడ్డారు.

అది ఇద్దరు కలిసి కూలి పనికి వెళ్లిన, ఇద్దరు పరిచయస్తుల మధ్య పలకరింపులా లేదు. ఆ దుఖం అనుకోకుండా కలిగిన ఆకస్మిక

దుఃఖంలా లేదు.

ఇంకేదో, ఆ ఇద్దరి హృదయాలకి సంబంధించిన, ఎప్పటి నుండో  గడ్డ కట్టిన దుఃఖమూ అది. కలలు, కోరికలు పగిలిపోయిన  దుఃఖం అది.

అతను ఆ స్థితి నుంచి బతికి బట్టకట్టి, బయటకు వస్తాడన్న నమ్మకం అతనికి, ఆమెకి లేకపోవడం నుంచి, మళ్ళీ తాము కలుసుకోలేమన్న ఎరుక నుండి  వచ్చిన దుఃఖం అది.

చాలాసేపు వాళ్ళిద్దరూ ఒకరి చేతులను,  ఒకరు పట్టుకుని కూర్చున్నారు. పెద్దగా మాట్లాడుకోవడానికి ఏముంది?

ఈ బంధం, ఇంకా వాళ్ళు పేరేమీ పెట్టుకొని బంధం, పేరెందుకు అనుకున్న బంధం అక్కడితో ముగియనున్నట్టుగా వాళ్ళిద్దరికీ ఎందుకో అనిపించింది.

ఆమె అతని తల నిమిరి,  నుదిటి మీద ముద్దు పెట్టి, తాను తెచ్చి పదిహేను  వేల రూపాయలు, అతని మంచం పక్కనపెట్టి, ఒక్క మాట అన్నా మాట్లాడకుండా వెళ్ళిపోయింది.

చిన్నమ్మ ఆ పూట అక్కడే  ఉంటుందేమో అనుకొని, ఇంటి బయట ఉన్న చిన్న వంట గదిలో టీ పెట్టి, వంట చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న నీలయ్య  భార్యకి,  వెళ్ళిపోతున్న చిన్నమ్మ  కొద్ది దూరంలో కనిపించి ఆశ్చర్యపడింది.

సరైన వైద్యం, పోషణ లేక అందుకు ఆర్థిక స్తోమత లేక చితికిపోయిన నీలయ్య కుటుంబం అతడి మరణయాతనను, మరో దారి లేక అట్లా చూస్తూ భరించింది. ఇక మరెంత మాత్రము భరించలేని నీలయ్య, ఒక వర్షపు రాత్రి నిద్రలోనే మరణించాడు.

చిన్నమ్మ తన పని ఎప్పటిలాగే చేసుకుంటుంది. ఎక్కువగా ఎవరితో మాట్లాడాలి అనిపించదు. ఒక్కతే కూర్చుని తనలో తాను  నీలయ్యతో సంభాషిస్తూ ఉంటుంది. ఆ సంభాషణ ఎవరికి వినపడదు.

ఆమె అతనితో ఏం మాట్లాడుతుందో, అతను ఆమెకి ఏమి చెప్తాడో  ఆమెకి తప్ప ఎవరికీ తెలియదు.

నీలయ్య చనిపోయిన వారానికి, ఆ వార్త చిన్నమ్మకి తెలిసినా, ఆమె తనకేమీ తెలియనట్లు, ఆ విషయం తనలోకి ఏమీ ఇంకనట్లు, అది తనకు సంబంధించిన విషయమే కానట్లు  మౌనంగా ఉండిపోయింది.

అతని చావును ఒప్పుకుంటే, ఆమెతో మాట్లాడటానికి అతను ఇక  ఆమెతో ఉండడు.

ఆరోజు పని ముగించుకొని కల్లు దుకాణం మీద నుంచి వస్తున్నప్పుడు మళ్లీ లోపలికి వెళ్దామని ఆమె కనిపించినా, లోనికి వెళ్లలేదు.

ఆమె నీలయ్య మీద ఒట్టు పెట్టుకుంది. తాగి నిన్ను మర్చిపోను నీలయ్య అని.

*

విమల

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మనుషుల్లో ఏర్పడే మమతను చాలా సున్నితంగా చెప్పిన కథ..మానవ సంబంధాల్లో స్త్రీ పురుష సంబంధాలు ఎంత కాంప్లెక్స్ గా ఉండి విడదీయలేనట్లుగా ఉండే పొరలు కొన్నుంటాయి.వాటిని బాగా పట్టుకున్నారు రచయిత్రి..

  • కథా వస్తువు బాగుంది,అందులో సందేహం లేదు.
    పని మనుషులను అర్ధం చేసుకుని తోచిన సాయం చేసే యజమానులు కూడా వుంటారు.కానీ లావణ్య లాంటి విశాల హృదయులు ఎంత మంది వుంటారు? అప్పటికే తీర్చవలసిన అప్పువుండి కూడా చిన్నమ్మ చేతిలో 15 వెలు అప్పుగా పెట్టడం కాస్త అసహజంగా వున్నట్టు నాకు అనిపించింది.
    అయినా..కథ చెప్పిన విధానం బాగుంది.ఇలాంటి జీవితాలకు ఇప్పటికీ కొదవ లేడు మన సమాజంలో.
    కథా రచయిత్రికి అభినందనలు/శుబాకాంక్షలు.
    —–డా.కె.ఎల్.వి.ప్రసాద్.
    సికిందరాబాద్/హన్మకొండ.
    9866252002

  • కొన్ని బంధాలు అంతే విమలా! పేర్లు పెట్టుకోలేనివి, తెలియనివి, ఒకరికొకరు ఏమీ కాని, అన్నీ అయినవి! చాలా కరిగిపోయేలా…వాస్తవికంగా రాసావు. గుండె కరిగిపోయింది. ఆ కరగించేతనం నీ కథనశైలిలో, తమను తాము కూర్చుకున్న పదాలలో ఇమిడి వున్నది.

    ఇక అసలే పూట గడవని బీదబతుకులు మంచాన కూడా పడితే అలాగే ముగిసిపోతాయి – సమానత్వం గురించి కాకిలెక్కలు చూస్తూ మసిపూసి మారేడుకాయచేసే యీ వ్యవస్థలో. సో సారీ ఫర్ చిన్నమ్మ అండ్ వీలయ్యే!

  • చిన్నమ్మ కథలో ఆమె విషాద జీవితం కలిచి వేస్తుంది.
    బిడ్డ పుట్టిన ఆరు నెలల కే భర్త పోవటం, ఎందరు ఎన్ని రకాలుగా చెప్పినా కొడుకును చూసుకుని మరొక పెళ్ళి ఒప్పుకోక పోవటం మన సమాజంలో స్త్రీ కి స్వీయ బంధ నాలో, సంకెళ్ళు నో తెలియదు.
    ‘Man is born free but he is every where in chains’ అని మార్క్స్ ఏంజిల్స్ అన్నారు కానీ, he is కాదు నిజానికి she is every where in chains అనాలి.
    గీతాంజలి గారి ఆరు కథా సంకల నాలు, రెండు నవలలు చదవక పోతే స్త్రీల కు సంబంధించిన మరొక కోణం నా కు తెలిసేది కాదు.
    ఇప్పుడు మీ చిన్నమ్మ కథ కూడా అలాగే ఉంది.
    ఈ కథ పూర్తిగా స్త్రీ హృదయా నికి సంబంధించింది.
    కథ ముగింపులో చిన్నయ్య మరణ వార్త విన్నా క తన ఆలోచనల నుంచి అతన్ని పూర్తి గా ఎందుకు మర్చి పోయిందో నేను అర్థం చేసుకోలే క పోయాను విమల గారు.

  • కథ చాలా బాగుంది. రెండు హృదయాల మధ్య ప్రేమ!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు