కవర్ పెయింటింగ్ అనే పదం కాకుండా ఇప్పుడు పుస్తకప్రచురణల్లో కవర్ డిజైన్ అనే పదం కనపడుతోంది. ఒక పుస్తకం మొదటి అట్ట బొమ్మని స్వయంగా గీయటానికి బదులు సిద్ధంగా ఉన్న ముడిసరుకుతో దాన్ని తయారు చేయటం బహుశా దీనికి కారణం. చిత్రలేఖనంలో వస్తున్న మార్పుకు, తెస్తున్న మార్పుకు ఇది నిదర్శనం.
ఇదలా ఉంచితే-కథలకు ఇప్పుడొస్తున్న చిత్రాల్లో, రచనలోని ఇతివృత్తాన్ని ఏ మాత్రం స్పృశించకుండా, కథాంశానికి ఏ కోశానా సంబంధించని పార్శ్య్వాలను స్పృశిస్తున్నవి కోకొల్లలు. ఈ ఔచిత్యభంగంలో వి-చిత్రం ఏంటంటే ఈ బొమ్మలు ఏ ఇతర కథకైనా చిత్రంగా నప్పుతాయి.
కథలకు గీసిన బొమ్మలు కొన్ని చూడగానే అర్థమవుతాయి. ఇవి రూపప్రధానమయినవి. కంటికి ఎక్కువ పని చెపుతాయి. వెంటనే గుర్తొచ్చేవి చందమామ కథలకు గీయబడ్డ బొమ్మలు. చిత్రలేఖనంలో వీటి స్థానం వీటిదే. మరికొన్ని పరిశీలనగా చూస్తేనే అవగతమవుతాయి. ఇవి భావప్రధానమయినవి. ఇవి మెదడుకు మేత పెడతాయి.
రెండిటికీ రచనే స్ఫూర్తి. సందేహం లేదు.
అయితే, మొదటివి మనసుకన్నా తన చెయ్యి ఎక్కువ ఉపయోగించి చిత్రకారుడు గీసినవి. వీటిలో తరచి చూడటానికి ఎక్కువగా ఏమీ ఉండదు. రెండోవి, రేఖాశిల్పి తన మేధకు పని చెప్పి సృజించినవి. వీటిలో మనోనేత్రాలు తెరచి చూస్తే, చూడటానికి కావాల్సినంత. చవిచూడటానికి సరిపడినంత.
మొదటివి రచనని ఆధారం చేసుకుని నిలబడతాయి. రెండోవి రచనకి ఆధారంగా నిలబడతాయి. ఈ రకం వాటికి ఒక ఉదాహరణ, ఇటీవల వెలువడ్డ ఉణుదుర్తి సుధాకర్ గారి కథల సంపుటి ‘తూరుపు గాలులు’ కు, శ్రీ తల్లావఝ్ఝల శివాజీ గారు గీసిన ముఖచిత్రం. అది కాకుండా లోపలి ప్రతి కథకూ, ఆయన సృష్టించిన చిత్రాలు.
ముఖచిత్రం పై నేను రాసిన విశ్లేషణ, కథల సంపుటి వెనుక ప్రచురితమయింది. అందుకని ఈ వ్యాసంలో శివాజీ గారు కథలకి గీసిన ఇతర బొమ్మలకు నేను పరిమితమవుతాను. ఎన్నుకున్న అంశాలని దృష్టిలో పెట్టుకుని అన్ని బొమ్మల్నీ విశ్లేషించటం, వ్యాసవిస్తృతి దృష్ట్యా సాధ్యం కాదు కనుక, ఒక్కో అంశం గురించి పరిమిత సంఖ్యలో ఉదాహరణలను తీసుకుని వాటిని మాత్రమే విశ్లేషిస్తాను.
కథ తర్వాత కథ:
‘బాహ్య నిక్షేప గణనం’ (Extrapolation) అనేది ఒక గణిత శాస్త్ర పదం. ఈ పదానికి అర్థం, ఒక విషయంలో మనకు ఖచ్చితంగా తెలిసిన సమాచారాన్ని ఆధారం చేసుకుని, ఆ విషయం గురించి మరింత సమాచారం అంచనా వేయడం. ఈ పద్ధతిని ‘ఏడు కానాల వంతెన’ కథకి బొమ్మ గీయటంలో చిత్రకారుడు అనుసరించాడని నా అంచనా. దీనికి కారణాలు.
ఒకటి-రివాల్వర్ పేలిందా లేదా అనేది తెలియచెప్పటానికి బయటికి వచ్చిన బుల్లెట్. రెండు-సగం సూర్యుడి తూర్పు వైపు అంచునుంచి కారుతున్న రక్తబిందువు. మూడు-అదే సమయానికి సిగ్నల్ కోసం గూడ్స్ రైల్ కూతపెట్టింది అని కథలోని వాక్యానికి; గేట్ మాన్ స్పందనకు సూచనగా అతడి చేతిలో ఊగుతున్న ఆకు పచ్చ జెండా.
బొమ్మలో కనపడే ఈ మూడు చర్యలూ, ఒక దానితో ఒకటి పరస్పర సంబంధమున్నవి. వీటికి ముందు ఏకకాలంలో జరిగిన సంఘటనలకు సహజమైన కొనసాగింపులు ఇవి. కథలో చెప్పిందానికి తర్వాత ఏం జరిగి ఉంటుందో తనకు తానుగా ఊహించి చిత్రకారుడు గీసినవి. వీటినే ‘బాహ్య నిక్షేప గణనం’ గా పైన నేను పేర్కొన్నది.
మరో ఉదాహరణ ‘ఒక వీడ్కోలు సాయంత్రం’. మిగిలిన కథల్లో కొన్నిటికి గీసిన బొమ్మల్లానే, ఈ కథకి గీసిన బొమ్మలో కూడా; కథలోని అంశాలు ప్రత్యక్షం కావు. కథలోని పాత్రలు మాత్రం మనకు కనపడతాయి. రచయిత కథ చెప్పటం ఆపుచేసింతర్వాత, కథలో ఏం జరిగిందీ ఊహించి మన కళ్ల ముందు నిలిపే ప్రయత్నం చేస్తాయి.
ఈ కథ ఓ సాయంకాలం మొదలవుతుంది. కెన్, జాన్ కి ఇచ్చిన విందు అర్ధరాత్రికి ముగుస్తుంది. ఇద్దరూ గేట్ ని సమీపిస్తారు. వీళ్ల రాకని గమనించి జట్కా గుర్రం తలాడించి సకిలిస్తుంది. జట్కా సాయిబు ఉలిక్కిపడి నిద్ర లేస్తాడు. రచయిత, తన కథలో మనకు ఇంతవరకే చెప్తాడు.
కాని, కథకి గీసిన బొమ్మలో జట్కా సాయిబు జట్కాని తోలుతుంటాడు. టోపీలు పెట్టుకున్న ఇద్దరు వ్యక్తులు అందులో కూర్చుని ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇది కథకుడు మనకు చెప్పని దృశ్యం. చిత్రకారుడు సృష్టించిన సన్నివేశం. ఈ దృశ్యంలో మనం గమనించాల్సిన విషయం కెన్, జాన్ ఇద్దరూ కునికిపాట్లు పడుతున్నట్లు కూర్చోవటం. వీటికి తోడు, ఇద్దరి టోపీల్లో తేడా, కొంత సామాను, దగ్గరకు చేర్చి క్రిందకు జార్చిన జట్కా సాయిబు కాళ్లు, గుర్రం చెవి; ఇవన్నీ కనపడటం.
కథలో మరో కథ:
కొన్ని కథలకు గీసిన బొమ్మల్లో, పాత్రల రూపాలు నిశ్చలంగా కనపడతాయి. వాటిల్లోంచి మనకేమీ వినపడదు. మరికొన్నింటికి గీసిన బొమ్మల్లో కనపడే పాత్రల చర్యలు కథలో ఒక సన్నివేశాన్ని వివరించడానికి విఫలప్రయత్నం చేస్తాయి. ఇంతా చేస్తే, కథలోని ప్రధానభావం పట్టుకుని అది ప్రతిఫలించేలా చిత్రకారులు గీసిన బొమ్మలు మనకు సకృత్తుగా గాని కనపడవు. ఈ ప్రస్తుత నేపథ్యంలో-
ఇంకొక్క అడుగు ముందుకు వేసి, కథలో అంతర్లీనంగా ఉన్న ఒక భావాన్ని వీక్షకులకు దృశ్యమానం చేయటానికి వీలుగా; కథలోని పాత్రల ప్రవర్తన ఆధారంగా ఏ చిత్రకారుడయినా తనకు తానే కథలో లేని ఒక సన్నివేశాన్ని ఊహించుకుని, దానికి రూపకల్పన చేసి, రచయిత చెప్పదలుచుకున్న భావాన్ని అంతే ప్రతిభావంతంగా, ప్రభావవంతంగా తన బొమ్మలో ప్రతీకాత్మకంగా చూపెడితే?
‘ఇద్దరు మావయ్యల కథ’కు గీసిన బొమ్మ తయారవుతుంది.
బొమ్మలో మనకు ఒక ఏనుగు కనపడుతుంది. కథలో ఎక్కడా ఏనుగు ప్రస్తావన లేదు. ఈ ఏనుగు, పైన చెప్పిన ఇద్దరు మావయ్యల్ని మోస్తూ ముందుకు నడుస్తుంటుంది. కళ్లకి ఉన్న ఇద్దరికీ తాము ముందుకి వెళ్తున్నామన్న భావన. కాని, వెళ్తున్న దారి వాళ్లకు కనపడదు. తాము అనుకున్న దారిలో వెళ్తున్నామో లేదో కూడా తెలీదు. గంతలు విప్పుకుని, ఏనుగుమీదనుంచి క్రిందకు దిగితే కాని అనుకున్నచోటకి చేరామో లేదో అర్థం కాదు. తాము ఒకప్పుడు నమ్ముకున్న భావజాలం పట్ల, మేనల్లుడితో ఇద్దరూ మావయ్యలూ వ్యక్తం చేసిన ప్రస్తుత అభిప్రాయాలని; ఏనుగుకు అన్వయిస్తే, ఏనుగు దేనికో ప్రతీకో బోధపడుతుంది.
మనకు ఎడమవైపున ఏనుగు మీద ఒక వ్యక్తి కూర్చుని లాప్ టాప్ మీద పని చేస్తూ ఉంటాడు. కథలోని ఈ వర్ణనతో సరిపోలే అతడు చిన్నమావయ్య. భుజం మీద తువ్వాలు చిత్రకారుడు తీసుకున్న చొరవ. కుడి వైపున ఇంకో వ్యక్తి కూర్చుని ఉంటాడు. అతడు పెద్దమావయ్య. ఒకళ్లు ఉత్తరం వైపు. మరొకళ్లు దక్షిణం వైపు. బొమ్మలో చిత్రీకరించినట్లు వీళ్లిద్దరూ నిజజీవితంలో కూడా ఉత్తరదక్షిణ ధృవాలు. వాటిలానే ఒకళ్ల పట్ల మరొకరికి చెక్కుచెదరని ఆకర్షణ. ఇద్దరి భావాల మధ్య వైరుధ్యాన్నీ, ఒకరిపట్ల మరొకరికి ఉన్న అనురక్తినీ వాళ్లని కూర్చోపెట్టిన విధానంతో, చిత్రకారుడు మనకు దృశ్యమానం చేస్తాడు.
ఏనుగు పృష్టభాగంపై ఒక నిలువుగీత ఉంటుంది. నిలువుగీతకు ఒక వైపు భాగంపై ఒక మావయ్య, ఇంకో భాగంపై ఇంకో మావయ్య కూర్చుని ఉంటారు. ఇద్దరు మావయ్యలు ఒకే ఏనుగుపై కూర్చున్నా వాళ్లు కూర్చున్న భాగాలు విభిన్నమైనవి. దానికి తగినట్లు బొమ్మకు రెండు రంగులు పూసినట్లుగా కనపడినా మూలవర్ణం ఒకటే. కథ చివరి పేరాలో, మావయ్యలు నమ్ముకున్న విరుద్ధ సిద్ధాంతాలపై, కొడుకుతో తల్లి వ్యక్తపరిచిన అభిప్రాయం ఒక్కసారి చదివితే, ఏనుగు రెండు రంగుల్లో ఉండటానికి-మూలవర్ణం ఒకటే అయి ఉండటానికి వెనుక గూఢార్థం స్ఫురిస్తుంది.
బొమ్మలో వీళ్లిద్దరి కళ్లకు గంతలు ఉంటాయి. ఇవి రచయిత చెప్పకపోయినా చిత్రకారుడు ఉద్దేశపూర్వకంగా గీసినవి. ఇద్దరూ మావయ్యలూ వాళ్లు ఎన్నుకున్న జీవనపథంలో చాలా ముందుకు నడిచారు. నడిచిన దారి గురించి మేనల్లుడి సమక్షంలో విడివిడిగా సింహావలోకనం చేసుకున్నారు. ఆ సింహావలోకన వివరాలని ఈ గంతలకు అన్వయించి ఆలోచిస్తే, ఈ గంతలలోని అంతరార్థం మనకు కళ్లకు కట్టినట్లు బోధపడుతుంది.
మన చూపుకు ఎడమవైపున కుర్చీలో జారగిలబడి ఏనుగు క్రింద ఒక వ్యక్తి కనపడతాడు. కుడి చేతివేళ్ల మధ్యలో ఆరిపోయిన సిగరెట్, తల వంచుకున్న విధానం, చెప్పులో పూర్తిగా ఉన్న ఎడమ పాదం. చెప్పులోంచి సగం పైగా బయటకి లాగబడ్డ ఎడమపాదం. కుడి కాలు మీద ఎడమ కాలు. కొంచెం మెడ ముందుకు వంచి కూర్చున్న భంగిమ. ఇవన్నీ ఆ వ్యక్తి దీర్ఘాలోచనలో నిమగ్నమయి ఉన్నాడన్న విషయాన్ని చెప్పకుండానే చెప్తాయి. ఇతడు కథలోని మేనల్లుడు. ఈ దీర్ఘాలోచన పైన చెప్పిన, మావయ్యలతో తన అనుభవానికి అతడు చేసుకున్న సింహావలోకనం పర్యవసానం. అతడిని చిత్రించిన తీరు అతడిలో కలిగిన సంచలనానికి నిదర్శనం.
అతని వెనుక మరో కుర్చీలో కూర్చున్న స్త్రీ, కథలోని మేనల్లుడి తల్లి. కాళ్లు రెండూ దగ్గరకు చేర్చి స్థిరంగా ఆమె కుర్చీలో కూర్చున్న రీతి, వెనక కూర్చున్న కొడుకు భంగిమకి పూర్తి వ్యతిరేకం. కొడుకుతో ఫోన్ లో మాట్లాడినప్పుడు, తన శేషజీవితం ఎలా గడపాలనుకుంటున్నదో ఆమె అతడికి స్పష్టంగా చెప్తుంది. ఆమె ఏ వస్తువులోకి దీక్షగా చూస్తోందో, అది కొడుకుతో ఆమె చెప్పిన లక్ష్యాన్ని సూచిస్తుంది.
కథలో చెప్పిన కథ:
‘ఏడు కానాల వంతెన’ కథలో, ‘అరుణాకాశపు సాయంత్రాన దూరంగా తూర్పు కనుమల నడుమ అస్తమిస్తున్న సూర్యుడు’ ఉంటాడు. కోట పెదబాబు తదేకంగా అటువైపే చూస్తుంటాడు. ఈ వర్ణనకు అనుగుణంగా బొమ్మలో మనకు సగం సూర్యుడి బొమ్మ తన కాంతి రేఖలతో ఎరుపు రంగులో ప్రస్ఫుటంగా కనపడుతుంది.
పడమట అస్తమిస్తున్న సూర్యుడి బొమ్మని, బొమ్మకి క్రిందా-పైనా-చూస్తున్న మనకు కుడివైపునా; చిత్రకారుడు, ఎక్కడయినా చిత్రీకరించి ఉండవచ్చును. కాని-సూర్యుడు బొమ్మకి కుడివైపున ఉండటం గమనార్హం. దీనికి కారణం-దేశపటాల్లో ఉండే దిక్సూచన ప్రకారం, బొమ్మలో మనకు ఎడమవైపున పడమర. కథలో సూర్యుడిది అస్తమయం కనుక, సూర్యుడు కనపడాల్సింది కూడా పడమర. అలాగే మనకు కనపడతాడు కూడా!
పాత్రల స్వరూప స్వభావాలు:
‘తెగిన నూలు పోగు’ కథకి గీసిన బొమ్మలో ఇద్దరు వ్యక్తులు మనకు కనపడతారు. వాళ్లిద్దరూ సిద్ధయ్య, గురవయ్య. పంచె కట్టుతో నల్లటి దేహంతో ఉంది సిద్ధయ్య. అతడు ఎంత అలిసిపోయేలా జీవితపోరాటం చేశాడనేదీ, ఎడమచేతిలో ఉన్న చేతి కర్రా, కుడి చేత్తో కొడుకు భుజాన్ని గట్టిగా పట్టుకుని అతడు నడిచే భంగిమా చెప్తాయి.
ప్రక్కన చేతులు వెనక్కి కట్టుకుని నడుస్తున్నది గురవయ్య. సిద్ధయ్య ఒంటిమీద పంచె తప్పితే ఏమీ ఉండదు. గురవయ్య ఒంటిమీద పంచెతో పాటు బనీను ఉంటుంది. కాని, అది కూడా ఒక చోట చిరిగి ఉంది. సంవత్సరానికి మూడు నెలల పాటు బట్టలు నేసి పొట్టకూటి కోసం నేసినదంతా ఎగుమతి చేస్తున్న వారి ఒంటి మీద సరైన బట్టలు లేకపోవటం-శ్రమ దోపిడీ ఏ మేరకు ఉంది అనేది అన్యాపదేశంగా తెలుపుతుంది.
సిద్ధయ్య, గురవయ్యల భౌతిక స్వరూపం ఎలా ఉంటుందనేది రచయిత ఎక్కడా కథలో చెప్పలేదు. అయినా బొమ్మలో మనకు వాళ్లిద్దరూ కనపడే వైనం, కథ చెప్పని దానికి చిత్రకారుడు జోడించిన ఊహాగానం.
దీనికి పూర్తి భిన్నంగా, ‘కొంచెం సబ్బు నురగ, ఒక కత్తి గాటు’ కథలో పాత్రలున్నా, ఏ ఒక్కరి ముఖం ముందుభాగం బొమ్మలో ఉండదు. అంతే కాదు. కైలాసానికి బదులు, ఎస్సై కుడిభుజం మీద కూర్చుని, ఒక పక్షి గెడ్డం గీస్తుంటుంది. జాగ్రత్తగా గమనిస్తే, అక్కడ మనకు ఆ పక్షి ముక్కు బదులు మంగలి కత్తి కనపడుతుంటుంది.
‘మాయాదర్పణం’ కథకి గీసిన బొమ్మలో మనకు ప్రస్ఫుటంగా కనపడేది అగ్నిప్రవేశం చేసి మంటల్లో చిక్కుకున్న సీతమ్మవారు. కథలో చెప్పినట్లు ఆమెకు మంటలు తాకపోవడం బొమ్మలో స్పష్టంగా కనపడుతుంది. అది చాలదన్నట్లు, ఎగసిపడుతున్న అగ్నిజ్వాలలు పైకి వచ్చేసరికి ఆమె జడపాయలుగా దర్శనమిస్తాయి. జాగ్రత్తగా బొమ్మని కొంచెం దూరంగా పెట్టుకుని చూస్తే, ఈ అగ్నిజ్వాలలు మొత్తం కలిపి ‘స్త్రీ’ అనే అక్షరరూపాన్ని పోలి ఉంటాయి.
శాస్త్రీయత:
‘వార్తాహరులు’ కథకి గీసిన బొమ్మలో దగ్గరగా ఉన్న టెలిఫోన్ స్తంభం కన్నా దూరంగా ఉన్న టెలిఫోన్ స్తంభం చిన్నదిగా గీయటం, అలాగే వాటికి కలిపిన తీగల మధ్య దూరంలో ఎక్కువతక్కువని చూపెట్టటం; భౌతిక శాస్త్రీయం.
‘ఒక వీడ్కోలు సాయంత్రం’ కథలో విందు పూర్తయి కెన్, జాన్ ఇద్దరూ బయటికొచ్చేసరికి, అర్ధరాత్రి కావస్తుంది. కాని, బొమ్మలో సగం క్రుంకిన సూర్యుడు కనపడతాడు. అర్ధరాత్రి సూర్యుడు ఎక్కడ్నుంచి వచ్చాడు? మనకన్నా ఇంగ్లాండ్ కాలమానం నాలుగున్నర గంటలు వెనక్కి. మనకు రాత్రి పదవుతున్నప్పుడు, అక్కడ సాయంత్రం ఐదున్నర. అందువల్ల, మనకు బొమ్మలో కనపడేది, మన దేశంలో ఆ సమయంలో కనపడకూడని సూర్యుడు కాదు. సుమారుగా అదే సమయానికి, కెన్-జాన్, మాతృదేశం అయిన బ్రిటన్ లో అస్తమిస్తున్న సూర్యుడు.
‘చేప కనుల రాజకుమారి’ కథకి గీసిన బొమ్మలో పడవ ముందు భాగంలో ఒక అందమైన యువతి ముఖం ఉంటుంది. ఆమె ఎడమ చెంప పూర్తిగా, కుడి చెంప పాక్షికంగా మనకు కనపడుతుంది. రచయిత, తన కథలో చెప్పినదాని ప్రకారం, చేపకనుల రాజకుమారివి విశాల నేత్రాలు. ఎంత విశాలమైనవి అంటే చిత్రకారుడు తన బొమ్మలో గీసినంత. రచయిత చెప్పిన దాని ప్రకారం ఆమెది పసిమి ఛాయ. యువతి ముఖంలో ఎడమవైపు ఉన్న పసుపు రంగు రచయిత వర్ణనకు అద్దం పడుతుంది. ఇది కాక చేపకనుల రాజకుమారి అందం గురించి కథలో చాలా వివరణ ఉంటుంది. అవన్నీ బొమ్మలోకి తేవటానికి తనకు ఉన్న స్థలం తక్కువ. అందుకని, ఆ లోటు పూరించడానికి చిత్రకారుడు యువతి ముక్కుకు ఒక ముక్కుపుడక పెట్టి, పెదాలను లేత ఎరుపు రంగులో చూపాడు. ఇది తనకున్న, లేదా తనెన్నుకున్న పరిధిలో యువతి రూపానికి సొబగు తేవటానికి చిత్రకారుడు తీసుకున్న స్వేచ్ఛ.
కథ తరిగిపోయిన రాజరికం వైభవం గురించి. అయినా దాన్ని ఇంకా వదల్లేని వారసుల గురించి. ఈ వారసుడు కథలో నేరుగా మనకి కనపడడు. అయితే చిత్రకారుడు మాత్రం చొరవ తీసుకుని ఈయన్ని నేరుగా మన కళ్లముందుకు తెస్తాడు. ఈయన ఎవరో కాదు. పడవ వెనుక భాగంలో కూర్చున్న వ్యక్తి. ఆయనలో ఇంకా తగ్గని రాజఠీవిని, చేతిలో పూవుతో విలాసంగా ఆయన కూర్చున్న విధానం ప్రతిఫలిస్తుంది.
‘దేవదూతలు’ కథకి గీసిన బొమ్మలో నాగరాజు రూపం; దేవదూత రూపంతో పోల్చుకుంటే అంగుష్టమాత్రం అనిపిస్తుంది. నాగరాజుకు, అక్క దేవదూత రూపంలో కనపడింది, కలలో. ఒక నిజంతో పోల్చుకుంటే కల కేన్వాస్ పరిధి విస్తృతం అవటం వలన చిత్రకారుడు ఈ ఇద్దరి బొమ్మల పరిమాణంలో తారతమ్యం చూపించాడు.
నిగూఢత:
‘చేప కనుల రాజకుమారి’ కథకి గీసిన బొమ్మలో, ఒక పెద్ద పడవ కనపడుతుంది. కథలో ఎక్కడా పడవ గురించిన ప్రస్తావన లేదు. ఇది పూర్తిగా చిత్రకారుడి ఊహ. ఇది ఆగి ఉన్న పడవా? కదుల్తున్న పడవా అన్న అనుమానం అవసరం లేదు. పూర్తిగా ఎత్తిన తెరచాపా, పడవ ముందు భాగంలో దాని క్రింద ఉన్న మూడు గీతలూ పడవ నడుస్తోందన్న విషయాన్ని తెలియపరుస్తాయి. పడవ ఏ వైపు వెళ్తుందో కూడా చెపుతాయి.
పడవలో మూడు సూట్ కేసులూ, రెండు మూటలూ కనపడతాయి. కథ చదివిన వారికి ఇవి పడవలో ఎందుకు ఉన్నాయో సులభంగానే అవగతమవుతుంది.
రచయిత చెప్పిందాని ప్రకారం ‘దివాను బంగళా వైపు ఒక చక్కరు కొడదామా’ అని వాసు మనసు లాగుతుంది. మీనాక్షి తనను సాదరంగా ఆహ్వానిస్తుందో లేదో అన్న సందేహం అతన్ని పీడిస్తుంది. అయినా, అంత పెద్దవాళ్ల ఇంటికి పిలవకుండా వెళ్లటం మర్యాద కాదేమో అనుకుంటాడు.
వాసు మనసులోని ఈ డోలాయమాన పరిస్థితిని, చిత్రకారుడు ఈ క్రింది విధంగా చిత్రీకరిస్తాడు.
ఒడ్డున ఒక వ్యక్తి ఒక పెద్ద రాయి మీద నిలబడి తనవైపుకే వస్తూ తనను దాటిపోబోతున్న పడవను చూస్తూ నిలబడతాడు. పడవ దగ్గరకి ఇతడు పోలేడు. పడవ ఇతని దగ్గరకు రాదు. ఒడ్డున ఉన్న ఇతడూ, పడవలో ఉన్న యువతి; ఇద్దరూ ఒకరినొకరు చూసుకోవటం మాత్రమే చెయ్యగలరు. పడవకూ ఒడ్డుకూ మధ్య అగాధమౌ జలనిధిలాంటి ఒక అంతరం. అది పడవలోని యువతికీ, ఒడ్డున ఉన్న వాసుకీ మధ్య ఉన్న దూరం.
చివరి మాటకు ముందు మాట:
ఇంతా చేస్తే, కొన్ని కథలకు గీసిన చిత్రాల్లో-కొన్ని భాగాలు నా విశ్లేషణకు అందలేదు. క్లుప్తంగా అవి ఇవి.
‘చేప కనుల రాజకుమారి’ కథకు గీసిన బొమ్మలో చిన్న బండరాయిమీద నిలబడి పెద్ద రాయి మీద నిలబడ్డ వ్యక్తి వంకే మెడ నిక్కిస్తూ చూస్తూ ఒక పక్షి కనపడుతుంది. అది దేనికి సంకేతం?
‘తెగిన నూలుపోగు’ కథకి గీసిన బొమ్మలో తోపుడు బండి మీద సరుకు పైన ఒక పక్షి ఉంది. అది కూడా పడమర వైపే చూస్తోంది. ఈ పక్షి దేనికి ప్రతీక?
‘వాళ్లు-మనం, మీరు-మేము’ కథకు గీసిన బొమ్మలో శర్మకి పాదాలెందుకు లేవు?
‘మూడు కోణాలు’ కథలో రెండు కొండలకూ రెండు వేర్వేరు రంగులు, చిత్రకారుడు ఎందుకు వేశాడు?
‘ఒక వీడ్కోలు సాయంత్రం’ కథకి గీసిన బొమ్మలో పడవ మీద ఒక పక్షి కూర్చుని తూర్పు వైపుకు చూస్తూ ఉంటుంది. మరో పక్షి ఎగిరి దాని వైపు వెళ్తూ ఉంటుంది. క్రిందన ఒక మేక పడుకుని ఉంటుంది. ఇవి వేటికి ప్రతీకలు?
‘బూడిద రంగు అద్వైతం’ కథకి గీసిన బొమ్మ కుడి చేతిలో ఒక పాత్ర, ఎడమచేత్తో పట్టుకుని వాసన చూస్తున్నట్టు ఒక ఫోర్కూ ఉంటాయి. కథలో వీటి ప్రస్తావన కనపడదు. వీటి అంతరార్థం?
బొమ్మలో వాసు (‘చేప కనుల రాజకుమారి’) కథలోని తన వయసుకు మించి కనపడతాడు. కథాసమయానికి కుర్రాడయిన వాసు, యువకుడైన తర్వాత నెమరేసుకున్న గతమేమో! బహుశా బొమ్మలోని ఈ సన్నివేశం!
‘వార్తాహరులు’ కథకి గీసిన బొమ్మలో పడుకొని ఉన్న పశువు కన్ను రక్తవర్ణానికి ఎందుకు మారినట్లు? జరుగుతున్న మారణహోమం చూసి మారుమూల ప్రాంతాలు కూడా కోపోద్రిక్తమయ్యాయని చెప్పడానికా?
‘ఒక వీడ్కోలు సాయంత్రం’ కథ ఆరంభంలో రచయిత చెప్పినట్లు జాన్ ఇంగ్లాండు వెళ్లాల్సింది, చెన్నపట్నం మీదుగా స్టీమర్ లో. దీనికి అనుగుణంగానే కథలో ఒక స్టీమర్ కనపడుతుంది. దాంతో పాటు తెడ్డును ఒడ్డుకు ఆనించి ఉన్న పడవ కనపడుతుంది. జట్కా; స్టీమరు, పడవ వైపు వెళ్తుంటుంది. పడవ ప్రస్తావన కథలో లేదు. బహుశా ఈ పడవ, సముద్రగర్భంలో ఆగి ఉన్న స్టీమర్ లోకి ప్రయాణీకుల్ని చేర్చే వాహనం అయి ఉండొచ్చని నా ఊహ!
ముక్తాయింపు:
ఒక ప్రక్రియని ఉపయోగించి సృష్టించిన కళారూపం ఇచ్చిన ప్రేరణతో మరో ప్రక్రియలో ఇంకొక కళారూపాన్ని సృజించటాన్ని Ekphrasis అంటారు. ఒక కళారూపాన్ని, మరొక కళారూపంలో వర్ణించటం అని Macmillan Dictionary ఈ పదానికి అర్థం ఇచ్చింది. వీటిని సమన్వయిస్తే; మూలంగా నిలిచింది కృతి అయితే, అందులోంచి పుట్టుకొచ్చింది అనుకృతి. అనుకృతి జననమే Ekphrasis ప్రక్రియ.
‘ఈమాట’ మే 2018 సంచికలో ప్రచురించబడ్డ నా వ్యాసం ప్రకారం, ఈ ప్రక్రియలో కృతిలో అంతర్లీన భావాన్ని, రూపాన్ని; అనుకృతి ద్వారా పునర్నిర్వచిస్తారు. లేదంటే వర్ణిస్తారు. అనుకృతి తోడ్పాటుతో, చూపరికి/చదువరికి; కృతి, మరింత దగ్గరవుతుంది. అనుకృతి ఏ కళారూపంలో అయినా ఉండొచ్చు. కృతీ, అనుకృతీ ఏ కళాప్రక్రియలో ఉన్నా-పరస్పరాధారితాలుగా ఉండాలి. ఈ ప్రక్రియలో ఒక కథని చదివి గీసిన చిత్రకారుడు ఆ కథని వినిపించటానికి కథకుడుగా మారొచ్చు. చిత్రమే ఒక కథగా అనిపించవచ్చు.
అనుకృతి; అన్నివేళలా సాధికారికంగా, కచ్చితంగా కృతిని పూర్తిగా వివరించలేకపోవచ్చు. అయితే, కృతి ఏ భావసంచయాన్ని ప్రతిఫలించదలుచుకుందో, దానిని అనుకృతి అందించగలగాలి. అనుకృతి తోడవటంతో, కృతి ఇచ్చే అనుభూతి సాంద్రత/స్థాయి పెరగాలి. తద్వారా, కృతి స్థాయి ఇంతకుముందుకన్నా పెరగొచ్చు. స్థాయీవృద్ధికి కారణమైన అనుకృతి, స్రష్ట చూపెట్టిన ప్రతిభాపాటవాలతో; ఒక్కోసారి తనకంటూ ఒక ప్రత్యేక అస్తిత్వాన్ని తెచ్చుకోవచ్చు. కృతిని మరపించేలా ఉండి, తనదే అసలు రూపం అన్న అభిప్రాయం కలిగించొచ్చు.
వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని చూస్తే, ‘తూరుపు గాలులు’ కథల సంపుటికి శివాజీ గారు గీసిన బొమ్మలు Ekphrasis ప్రక్రియకు నూటికి నూరు శాతం నిఖార్సైన ఉదాహరణలు.
*
What an interpretation ! Love it.
ఆ బొమ్మలు కూడా ఇస్తే బాగుండేది.
కృతికీ అనుకృతికీ వ్యాఖ్యా వ్యాపృతికీ వాటి కర్తలు సుధాకర్ శివాజీ చంద్రశేఖర్ గార్లకు జేజేలు.
Interesting observation
బొమ్మలు బాగా నచ్చాయి.
శివాజి గారికి అభినందనలు….