1
ఇక్కడ మనుషులు తప్పిపోతుంటారు
అలౌకికంగా
మజిలీల్ని మననం చేసుకొంటూ.
ఎవరైనా సందేహపడితే
నాకేం సంబంధం లేదు.
చిత్త వైకల్యం మా జన్మహక్కు.
బతుకు గాలిపటం ఎగురుతూనే ఉంటుంది
జీవితానుభావాల్ని కూడగట్టుకొని
దేన్నీ విరమించనీయకు
అన్నీ చుట్టుముడుతున్నాయి
ప్రపంచం ముందు నుంచో!
అసలైన
సౌందర్యం కనపడుతుంది.
ఎవర్రా అక్కడ!
మరో దృశ్యానికి
రంగస్థలాన్ని సిద్ధం చేయండి
అక్కడ ప్రేక్షకుడు
వివిధ అవయవాల్ని
సిద్ధం చేసుకుంటున్నాడు.
2
కాలిపోయిన కలలు
కాలిపోయిన కలలన్నీ
కళ్ళ ముందుకొచ్చి
ప్రశ్నిస్తున్నాయ్!
మాట్లాడాల్సిన రోజు
మౌనంగా ఉన్నందుకు.
నా గది ఎంత కన్నీరు త్రాగిందో
నాకు తెలియదు.
దేనికోసమో ఎదురు చూసిన కళ్ళు
వేదన పడ్డ గుండె
కన్నీటి బిందువులను రాలుస్తున్నాయ్!
కాలానికి మరణం లేదు కాబట్టే
కొన్ని నవ్వులు పూస్తూనే ఉంటాయి.
కొన్ని గ్లాసులు గలగల లాడుతూనే ఉంటాయి
ఆ వీధిలో!
జవాబు లేని ప్రశ్నలా
జీవితంతో యుద్ధం చేస్తూ నేను!
అక్కడున్న వాళ్ళకి నేనెవరో తెలియదు
నేనొక రాత్రినని
నాకీ ప్రపంచాన్ని
చూడాలని ఉందని!
*
దేనికోసమో ఎదురు చూసిన కళ్ళు కన్నీటి బిందువులను రాలుస్తున్నాయ్
మార్మికతను అద్దుకున్న కవిత్వం.
Good poems