చలికాలంలో చికాగోలో అడుగుపెట్టిన రెండు నెలలో ప్రధాన వ్యాపకం ఉద్యోగం వేట అయినా అది కేవలం రోజుకి 24 గంటలూ అదొక్కటే పని కాదుగా. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్టుగా అమెరికాని “ఆస్వాదించడం” కూడా ఒక పని అయితే, ఇక్కడ ‘మన వాళ్ళు” ఎవరు ఉన్నారా అని స్నేహబంధాల కోసం ఆత్రుత పడడం మరొక పని. ఇక్కడ ‘మన వాళ్ళు’ అంటే కేవలం భారతీయులు లేదా తెలుగు వాళ్ళు అనే విశాల దృక్పథంతో అన్నమాటే కానీ ఈ రోజుల్లో వాడే “మనోడేనా? అనే అర్ధం కాదు. ఇండియాలో ఉండగా నాకూ, మా తమ్ముడికీ కూడా తెలిసిన మిత్రులు ఒకరిద్దరిని ముందే కలుసుకున్నా, అప్పటికే మా తమ్ముడు చికాగోలో రెండేళ్ళ నుంచీ ఉన్నాడు కాబట్టి సహజంగానే వాడి మిత్రులు నాకూ మిత్రులు అయ్యారు. వారిలో శంకర్ ప్లంజేరి, శాస్త్రి & రఘురామ్ ఈమని సోదరులు, బసంత్ పట్నాయక్ అనే ఒరియా అతనూ ముఖ్యులు.
శంకర్ ప్లంజేరి సర్జంట్ & లుండీ అనే ఇంజనీరింగ్ కంపెనీలో పనిచేసేవాడు. ఆ కంపెనీలో మన వాళ్ళు చాలా మంది పనిచేసే వారు. ఆ కంపెనీలోనే చాలా ఏళ్ళ తర్వాత తానా అధ్యక్షుడైన తేళ్ళ తిరుపతయ్యని కూడా అప్పుడే కలుసుకున్నాను. శంకర్ నెల్లూరు వాడు. హాయిగా గలగలలాడుతూ మాట్లాడే స్నేహశీలి. అప్పుడూ, ఇప్పుడూ కూడా. ఇప్పుడు హ్యూస్టన్ లో మా ఇంటికి దగ్గర్లోనే అతని నివాసం అయినా భారత దేశంలో ఆధ్యాత్మిక, సామాజిక సేవలోనే ఎక్కువ కాలం గడుపుతున్నాడు. అతను తర్వాత చికాగో నుంచి కొరియా వెళ్ళి కొన్నేళ్ళు అక్కడే ఉండి, జీవితంలో బాగా పైకి వచ్చిన వాడు. భారత దేశంలో మొదటి సారిగా వేక్సీన్ తయారు చేసిన శాంతా బయోటిక్స్ (కె.ఐ. వరప్రసాద్ రెడ్డి వ్యవస్థాపకుడు) మొదలైన కంపెనీలలో భాగస్వామి అయిన శంకర్ భగవాన్ సత్యసాయి భక్తుడు. అయితే ఇవన్నీ 1975 లో అతనూ, మేమూ ఊహించినవి కాదు. అప్పుడు యువ బ్రహ్మచారులం. ఇన్నేళ్ళ తర్వాత కూడా ఇప్పుడు నేను చేస్తున్న సాహిత్య, సామాజిక కార్యక్రమాలకి శంకరూ, అతని సతీమణి రాజ్యలక్ష్మీ సహకరిస్తూనే ఉంటారు. శంకర్ గురించి ఇంతగా ప్రస్తావించడానికి కారణం ఆ నాడు అతను ఇచ్చిన ఒక సలహా నా జీవితాన్నే మార్చేసింది. అదేమిటో ఈ వ్యాసం ఆఖర్న చెప్తాను.
ఇక ఈమని శాస్త్రీ, రఘరామూ వాళ్ళది తణుకు. కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో నాకు జూనియర్లే కానీ అప్పుడు నాకు వాళ్ళు తెలీదు. వాళ్ళిద్దరూనో, ఒకరో పయొనీర్ ఇంజనీరింగ్ అనే కంపెనీలో పని చేశారు కానీ 1975 మార్చ్ లో నాకు పరిచయం అయేటప్పటికి ఇద్దరూ నిరుద్యోగ పర్వంలో ఉన్నారు. బసంత్ పట్నాయక్ శంకర్ కి బహుశా అయోవా స్టేట్ యూనివర్శిటీలో అతను చదువుకున్న రోజులనాటి స్నేహితుడు. అతను కూడా ఉద్యోగాన్వేషణ లోనే ఉన్నాడు. 1975 మార్చ్ రోజులు అమెరికాలో గడ్డు రోజులు. నిక్సన్ రాజీనామా తర్వాత జెరాల్డ్ ఫోర్డ్ అధ్యక్షుడిగా నిలదొక్కుకుంటున్న రోజులు. వియత్నాం యుధ్దం ఇంకా కొనసాగుతూనే ఉంది కానీ ఆఖరి రోజులు. నిజానికి ఆ తర్వాత నెలే..అంటే ఏప్రిల్ 29, 1975…అంటే నా 30వ పుట్టిన రోజున వియత్నాం యుధ్దం అధికారికంగా ముగిసింది. 1973-74లో అమెరికా స్టాక్ మార్కెట్ కుదేలు అయిపోయింది. ఆ ఆర్ధిక సంక్షోభం నుంచి దేశం ఇంకా కోలుకో లేదు. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్న ఆ సమయంలో నేను అమెరికాలో అడుగుపెట్టాననమాట. అంచేత సోమవారం నుంచీ శుక్రవారం దాకా అందరూ ఉద్యోగాల వేటలో ఉన్నా వారాంతంలో శంకర్ ఎపార్టెమెంట్ లోనో, శాస్త్రి, రఘు వాళ్ళూ ఉండే చోటో మరెక్కడో కలుసుకుని బీర్ తాగుతూ పిజ్జా తింటూ తెలుగు సినిమా కబుర్లూ, రాజకీయాలూ మాట్లాడుకునే వాళ్ళం. పేకాట ఆడేవాళ్ళమో లేదో ఇప్పుడు నాకు గుర్తు లేదు. మా తమ్ముడి మిత్రుల్లో సుంకర గోవర్ధన రావు అనే కుటుంబీకుడి ఇంటికి కూడా తరచు వెళ్ళే వాళ్ళం. అతనూ, అతని భార్యా పిల్లలూ ఎంతో ఆప్యాయంగా ఉండేవారు.
ఆ రోజుల్లో ఒక రోజు మా తమ్ముడికి తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో నుంచి ఒక అహ్వానం వచ్చింది. అది ఆ ఏటి ఉగాది సాంస్కృతిక కార్యక్రమానికి ఆహ్వానం. అందులో “ప్రోగ్రాం తర్వాత విందు భోజనం – బార్-బె-క్యూ కోడి స్పెషల్” అని చూసి ఆశ్చర్యపోయాను. ఈ బార్-బె-క్యూ అనే మాట వినడం నాకు అదే మొదటి సారి. ఒక పక్క బార్ అంటూనే మరొక పక్క చికెన్ ఏమిటీ అని మా తమ్ముడిని అడిగాను. “అది అమెరికాలో చికెన్ వేపుడు కూరలే” అని వాడు నవ్వేశాడు. ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అమెరికాలో తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా జరుగుతాయో మొట్టమొదటి సారి చూశాను. ఆశ్చర్యం ఏమిటంటే ఆ కార్యక్రమం సరిగ్గా నేనూ, మూర్తీ, రావూ బొంబాయి ఐఐటీ లో ఉన్న ఎనిమిదేళ్ళూ ఎలా నిర్వహించేవాళ్ళమో అలాగే ఉగాది పంచాంగ శ్రవణం, కర్నాటక సంగీతం, కూచిపూడి నృత్యాలూ, జానపద గేయాలూ, సినిమా పాటలూ, ఏకపాత్రాభినయనం, ఒకటో, రెండో మాత్రమే సినిమా డాన్స్ లూ…సరిగ్గా అలాగే ఉంది….ఒక్క బార్-బె-క్యూ చికెన్ తప్ప. ఆనాటి కార్యక్రమంలో నేను కలుసుకున్న వారిలో డా. తిరుపతి రెడ్డి, డా. కేశవ కృష్ణ (మా కాకినాడ ఆయనే), తాతా ప్రకాశం గారూ మొదలైన వారితో తర్వాత కాలంలో కూడా పరిచయం కొనసాగింది.
మరీ మూడు పువ్వులూ, ఆరు కాయలూ లాగా కాకుండా, ఆ చికాగో చలికాలంలో, ఉద్యోగం వేటలో కాలక్షేపం చేస్తూ 1975 మార్చ్ నెలాఖర్న ఒకానొక శనివారం సాయంత్రం…నేనూ, మా తమ్ముడూ, శంకరూ, శాస్త్రీ, రఘూ, ఇంకా ఎవరైనా ఉన్నారేమో గుర్తు లేదు కానీ….అందరం కబుర్లు చెప్పుకుంటూ ఉంటే….బసంత్ పట్నాయక్ చికాగో వదిలేసి హ్యూస్త్ణన్ వెళ్ళాడూ అని తెలిసింది. ఎక్కడో, వెయ్యి మైళ్ళ దూరంలో మెక్సికో సరిహద్దులో ఉన్న హ్యూస్టన్ ఎందుకు వెళ్ళాడూ అంటే “ఉద్యోగం కోసం” అని సమాధానం వచ్చింది. అప్పుడు శంకర్ “అవును చిట్టెన్ రాజూ, నువ్వూ అక్కడికి వెళ్ళకూడదూ?” అనగానే “ఎందుకూ?” అని నేను అడగగానే “ఇప్పుడు అమెరికాలో టెక్సస్ ఒకటే బూమింగ్ స్టేట్. అక్కడే ఉద్యోగాలు దొరుకుతాయి” అన్నాడు శంకర్. నాకు ఆ సంగతులు తెలియవు కానీ అప్పటికే చాలా ఏళ్ళ నుంచీ అమెరికాలో ఉన్న మా తమ్ముడూ, శాస్త్రీ, రఘూ అది విని ఆలోచనలో పడ్డారు. శీతాకాలంలో మిగతా దేశం ఆర్ధిక మాంద్యంలో ఉన్నా అమెరికాలో చలి రాష్ట్రాలకి ఎంతో అవసరం అయిన నేచురల్ గేస్, పెట్రోలు సరఫరా చేసే టెక్సస్ రాష్ట్ఱం మటుకు పురోగమిస్తూనే ఉంటుంది. ఈ సంగతి స్ఫురణకి రాగానే శంకర్ మాట విని హ్యూస్టన్ వెళ్ళి చూద్దాం, ఇక్కడ ఉండి చేసే పనేముందీ?” అనేసుకున్నాం అందరం.
ఇక్కడ మొదటి చిక్కు అల్లా మాలో శాస్త్రి ఒక్కడికే కారు ఉంది. నాకు కారూ, లేదు. డ్రైవింగూ రాదు. రఘుకి డ్రైవింగ్ వచ్చు. అంచేత శాస్త్రి కారులో ఆ ఇద్దరూ చికాగో నుంచి హ్యూస్టన్ దాకా సుమారు 1200 మైళ్ళు ఆగకుండా డ్రైవ్ చేస్తే ఇంచుమించు 16 గంటలు పడుతుంది. మామూలుగా అయితే మధ్యలో రాత్రి ఎక్కడో మొటెల్ లో పడుకోడానికి ఆగుతారు కానీ మాలో ఎవరి దగ్గరా అంత డబ్బు లేదు. అంచేత ఏకధాటీగా, ఎక్కడా ఆగకుండా వెళ్ళక తప్పదు. మనకి డ్రైవింగ్ రాదు కాబట్టి ముత్యాల ముగ్గు లో రావు గోపాల రావు చెప్పినట్టు. “హాయిగా ఎనకాల సీట్లో దర్జాగా కూసుని ఎల్లిపోవడమే”. దానికి ఎంతో పెద్ద మనసుతో శాస్త్రీ, రఘూ సంతోషంగా ఒప్పుకున్నారు. ఇక మాలో ఎవరికీ హ్యూస్టన్ లో ఏ ఒక్క మానవుడూ తెలియదు. తీరా అక్కడికి వెళ్ళాక ఎక్కడ ఉంటాం? పోనీ బసంత్ గాడికి ఫోన్ చేసి అడుగుదామా అంటే “అడుక్కుతినే వాడి దగ్గర గీక్కు తినేవాడి” లాగా అక్కడ వాడికే దిక్కు లేదు. మరెలాగా? అంటే “ముందు అక్కడికి వెళ్ళి పోదాం. వెళ్ళాక ఎవడో తలమాసిన వాడు దొరక్క పోతాడా? ఈ లోగా ఎవరికైనా ఉద్యోగం వస్తే సరే సరి” అనేసుకున్నాం. మరి ఎప్పుడు ప్రయాణం? అంటే “మళ్ళీ ఎప్పుడో ఏమిటి. ఆలస్యం, అమృతం, విషం. రేపే బయలు దేరదాం” అని ముహూర్తం పెట్టేసుకున్నాం. ఈ మొత్తం చర్చ అంతా గంటా, గంటన్నర సేపు.
అంతే…ఆ రాత్రికి రాత్రే నేను ఇండియా నుంచి తెచ్చిన పెట్టెని మళ్ళీ అలాగే సద్దేసి, బ్రీఫ్ కేస్ లో నా బయో డేటాలు పాతిక కాపీలు పెట్టేసుకుని, వారం, పది రోజుల ముందు టూవెల్ దొర, బ్రాండో దొర నేను ఒక రోజు చెయ్యని పనికి ఇచ్చిన 15 రోజుల జీతం…250 డాలర్లూ కూడా జాగ్రత్తగా దాచుకుని తయారు అయిపోయాను. మర్నాడు పొద్దున్న శాస్త్రి కారు ఆయిల్ మార్పించి, దూర ప్రయాణానికి రెడీ చేసి రఘుతో మా తమ్ముడి ఎపార్టెమెంట్ కి రాగానే ముగ్గురం 1975 మార్చ్ ఆఖరి ఆదివారం నాడు హ్యూస్టన్ జైత్రయాత్రకి బయలుదేరాం. ఆ విధంగా ఒక చిన్న సలహా ఇచ్చి నా జీవితాన్నే మార్చిన వాడు శంకర్ ప్లంజేరీ…అతనికి ఇప్పటికీ వేనవేల ధన్యవాదాలు.
రెస్ట్ ఈజ్ హిస్టరీ అనను…ఎందుకంటే అప్పుడే అసలు హిస్టరీ మొదలయింది. ముందుంది ముసళ్ళ పండగ…వచ్చే సంచికలో
*
Add comment