దబ్బుచ్చికి దబ్బుచ్చికి దబ్ దబ్ దబ్బుచ్చికి
దబ్బుచ్చికి దబ్బుచ్చికి దబ్ దబ్ దబ్బుచ్చికి
వాళ్లలా డప్పు కొడుతూనే ఉన్నారు
అతను కాళ్లు లయబద్దంగా ఆడిస్తూ
చేతులు గాల్లోకి విసురుతూ
అలుపు లేకుండా చిందేస్తూనే ఉన్నాడు
తాగిన మత్తో తనోడు పోయిన దుఃఖమో
తెలియదు కాని తడిచిపోతూనే ఉన్నాడు
ఆమె ప్రాణంలో ప్రాణమూ
జీవనంలో జీవితము అయిన అతని కోసం రోదిస్తోంది
నడిచొచ్చిన అడుగుల చప్పుళ్లు నిశ్శబ్దమైపోగా
కళ్లనుండి కారుతున్న జ్ఞాపకాల ధారలలో
రేపటి నడకలకు అడుగుల జాడల్ని వెదుక్కొంటోంది
ఎవరూ తనతో ఉండని రేపటిపై
కురుస్తోన్న భరోసాల జల్లులు
ఎండల్లో ఆవిరైపోతాయని తెలిసినా
ఎదో తెలియని ఒక ఆశాలత పెనవేసుకుంటూనే ఉంటుంది
వాడు నిన్నటిదాకా వెచ్చని రెక్కలకింద
బతుకు భయపు ఆనవాళ్లు లేని
స్వేచ్చావాయువుల్ని పీల్చుకున్నాడు
ఇప్పుడు బరువెక్కిన తన భుజాలపై
వేలాడుతున్న రేపటిలోకి భయం భయంగా చూస్తున్నాడు
పుస్తకాలలో ఎంతవెదికినా దొరకని తాయిలం
ఇక ఎప్పటికీ దొరకదని నిర్ధారణైపోయింది
కారణాలేమైతేనేం
కల్తీమద్యమో, కల్తీ ఎరువులో
తెగిన దారప్పొగుల్లో
అతనలా శ్మశానం కేసి సాగిపోతూనే ఉంటాడు
విశాలమవ్వాల్సిన జీవితపు రాదారులు
ఆవైపే చూపిస్తుంటాయి
అంబేడ్కర్ రాతల సాక్షిగా
అక్షరాలతోసహా అతను మాయమవుతుంటాడు
అభయహస్తాలో పూలజల్లులో
గులాబీరంగులో నవరత్నాలో
ఏవీ ఆ ప్రయాణాన్ని ఆపడంలేదు
విరామం లేని ప్రయాణం కొనసాగుతూనేఉంది.
మాటలు మౌనాన్ని ఆశ్రయిస్తాయి
చేతనానికి అచేతనానికి మధ్య
లోపల ఉండాల్సిందేదో దేహాన్ని విడిచి వెళ్ళిపోతుంది
శరీరం కదులుతున్నంతసేపు
ఎవరెవరో లోపలికి వస్తూ పోతూ ఉంటారు
మృత్యువు తలుపుతట్టిన ప్రతిసారి
అంతుపట్టని రహస్య జీవనమేదో
తన అదృశ్య కవాటాలతో అడ్డుకుంటూనే ఉంటుంది
ఒక్కసారి జీవం చేజారినాక
ఒకే ఒక్క ఆధారం తెగిపోయిన తర్వాత
ప్రయాణమూ దుర్భరమే.
*** **** ****
చిత్రం: రాజశేఖర్ చంద్రం
ఎక్సలెంట్ పోయంన్నా ,సారంగ వెబ్ పత్రికకు మీకు శుభాభినందనలు