దప్పిక
దూరంగా వేలేసుకుంటూ
ఒకరి నుండి మరొకరిని పట్టి లాగుతుంటాము
కాలం ఒక సుడిగాలి
కొంత కాలానికి ఒక బిందువుకు విసిరేస్తుంది
ఒక నిర్ణయకాలానికి
కప్పినవన్నీ కరిగిపోయి
పసిపాపలమైపోతాము
***
రాలిపోతాయని, వాడిపోతాయని
ఆకులను, పువ్వులను ద్వేషిస్తావు సరే
మోడునైనా ప్రేమించాలి కదా
***
ఎడారి మనుషులం
ఎన్ని వర్షాలైనా మాలో ఇంకిపోతాయి
తీరని దాహమే మమ్మల్ని బ్రతికించేది
మాటలు కెరటాలు మాత్రమే
లోపటి సంద్రాన్ని
ఏవ్వరూ ఏప్పటికీ పలకరించరు
***
నేను దప్పిగొనియున్న ప్రతీసారీ
ఈ లోకం కాస్త చేదునిచ్చిపోతుంది
2
Destiny
అందరమూ భూమిని అంటిపెట్టుకొని తిరుగుతూ
ఒకరికి ఒకరం అనేకసార్లు తారసపడినా
ఎవరిని ఎవరమూ గుర్తుపట్టలేము సరికదా
ఎవరికి వారు ప్రత్యేక ప్రపంచంలో దాక్కుంటాము
ఇక్కడ
బ్రతకడం కేవలం పీల్చి వదిలే ఊపిరి మాత్రమే
***
కుమ్మరొకడు
అందమైన మనసులను మలుస్తుంటే
పగిలిన కుండలను
పూడ్చి పెడుతుంతాడు వేరొకడు
ఇంతలో
మట్టి మట్టిని హత్తుకొని ముద్దాడుతుంది
***
ఒంటరి రాత్రి
చీకటిని దాచలేక అస్తమిస్తాది
వెలుగంటే తెలీనోళ్లు
ఆరిన దీపానికి ప్రార్ధన చేస్తుంటారు
నవ్వు
మాసిన లోపలి గోడలకు
తప్పక పూసుకునే రంగు
***
ఇంకా ఉంటుందనే ఆశతో
కొనసాగే ఈ పరుగుపందెంలో
ఎప్పుడు ముగించినా గెలిచినట్టే.
*
నాలో ఈ కవిత్వం ఎప్పుడు? ఎందుకు?
చదువుకునేటపుడు సరదాగా ఈ కవిత్వాన్ని పరిచయం చేసుకున్నాను, కానీ ఇంకాస్త లోతుగా నన్ను అవరించింది. నా ఒంటరితనానికి తోడయ్యింది. పొడి పొడి అక్షరాల్లో నా లోపల నన్ను నింపే ప్రయత్నమే నా కవిత్వపు ఆరంభం.. కొనసాగింపు.
జీవితం నన్ను నాకు తెలియచెబుతుంటే నాకు నేను చెప్పుకునే అనువాదం ఈ నా కవిత్వం. ఇంకా నేను మిగిలి ఉన్నట్టున్నాను, నాకు నేను ఇంకా బాకీ ఉన్నట్టున్నాను అందుకే ఇంకా ఈ కవిత్వం. ఇది కవిత్వమే కాకపోయినా, నా ఆత్మతో నేను మాట్లాడుకునే భాష, నన్ను పరిచయం చేసుకునే వాక్యం ఈ కవిత్వం.
*
బావుంది
చాలా బావున్నాయి కవితలు
Thank you Sir
Thank you Sir