చాందిని- ఈ ఏడాదే పదవతరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన సాహిత్యం పట్ల ఇష్టాన్ని పెంచుకుంటున్న విద్యార్థిని. వ్యవసాయ కుటుంబ నేపథ్యం. చాందినికి చదువంటే ఎంత బాధ్యతో, తల్లిదండ్రులకు సాయపడటంలోనూ అంతే బాధ్యతగా వుంటుంది. కష్టాల గురించి కన్నీళ్లు గురించి ఎరుక వుంది- చుట్టూ రకరకాల శ్రామిక కుటుంబాలను చూస్తూ ఆలోచనలు చేస్తున్న చాందినికి సృజన ఒక అవసరం. రోజూ- ఫ్యాక్టరీ పనికి, చెరువు పనికి వెళ్తున్న మహిళలను చూస్తుంది. మహిళల సమస్యల పట్ల ఒక అవగాహన ఏర్పరుచుకునే ప్రయత్నంలో మాతృక, భూమిక లాంటి పత్రికలను చదువుతుంది.
చాందిని పుట్టిన వూరు- బుదరాయవలస, విజయనగరం జిల్లా. చదివిన పాఠశాల- గర్భాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, విజయనగరం జిల్లా.
విద్యార్థుల కవిత్వంలో భాగంగా మొదటగా చాందిని కవిత్వం అందిస్తున్నాం.
కవిత 1:
తొలకరి వస్తాదని
*
తొలకరి వస్తాదని
ఎదురు చూసి
తొలకరితోనే పొలంలోకి ప్రవేశించి
నీరు కోసం నానా పాట్లు పడి
నీరును కట్టి
పంట కోసం అప్పులు చేసి
నారును కట్టి ఉడుపులను ఉడిసి
కలుపును తీసి ఎరువులను చల్లి
మందులను చల్లి
తన ప్రాణాన్ని పణంగా పెట్టి
ఎండనకా వాననకా
తిండితిప్పలూలేక
పైరుని రాత్రింబవళ్లు కాపు కాస్తూ
పంట పాడవకుండా చూస్తూ
పసిబిడ్డలా పంటను పోషిస్తూ
తాను ఎముకుల గూడుగా మారి
తోటివారందరిని శక్తివంతులుగా మార్చి
తన జీవన గమనం పైరేనని
కోతలు కోసి
కల్లాలకు గడ్డిని తరలించి
కళ్లాల్లో గడ్డిని దిబ్బలుగా పెట్టి
పైరును నూరుపుడిసి
పైరులోని ధాన్యాన్ని సేరులుగా పొసి
మూటలుగా కట్టి
యజమానికి ఇచ్చి
యజమాని ఏమి ఇవ్వకపోతే
వొట్టి చేతులతో ఇంటికి వచ్చి
పడిన శ్రమకు
ఫలితం లేదని కుమిలిపోతూ
పొద్దునకు
శవంగా మారుతాడు
ప్రజలందరి కోసం
తన ప్రాణాన్ని
త్యాగం చేస్తాడు
అటువంటి
రైతన్నా కృషికి ఫలితం
మన ప్రాణాన్ని
మనమే చంపుకుంటామా?
మన ప్రాణం కోసం
కొంచమైన శ్రమించమా ?
ఇప్పటికైనా
రైతన్న కృషికి తోడ్పడి
నిజమైన మనుషుల్లా బతుకుదాం
************
కవిత 2 :
ఎగరాలి శ్రమ జెండా
*
దోపిడీ జరుగుతుంది
రక్తం చిందించే శ్రామికుడి శ్రమపై
దోపిడీ జరిగింది
చెమటధారలను విడిచి
కష్టమనే పథంలో నడిచి
వెలుగుమార్గాన్ని త్యజించి
శూన్యసముద్రంలో
మునిగిపోతున్నాడు
దోపిడీ జరుగుతుంది
కష్టమే జీవనమనుకునే
ఓ శ్రామికుడా కార్మికుడా
నీపై దోపిడీ జరుగుతుంది
అంధకారమనే చీకట్లను విడిచి
కారుమబ్బులనే అన్యాయాన్ని
తొలగించి
బానిసత్వమనే సంకెళ్లను
. తెంచి
న్యాయమనే వెలుగులోకి
ప్రయాణించాలి
ఇదే నీ యొక్క ధర్మం
బాధ్యత, ఆవశ్యకత
నీ బతుకులో జ్యోతులను వెలిగించి
అందరికీ వెలుగును పంచు
***
విద్యార్థికవి అంతరంగం:
1. నీ మొదటి కవిత ఏది ? ఎందుకు రాయాలనిపించింది?
జవాబు: ‘వేళ’ నా మొదటి కవిత. ఒకరోజు ఎప్పటిలాగే ప్రకృతిని చూసినప్పుడు మనసుకు ఉత్సాహంగా, శాంతిగా అనిపించింది. ఆ ఆనందం మాటల ద్వారా కాకుండా కవిత రూపంలో వచ్చింది.
2. కవిత్వం మీద అభిరుచి ఎలా కలిగింది ?
జవాబులు: భావాలను మామూలు వాక్యాలుగా కాకుండా ఒక క్రమపద్ధతిలో పెడితే బాగుంటుందని, అలా అయితే పదాలు వినసొంపుగా ఉంటాయని రాయాలనిపించింది.
3. కవిత్వం ద్వారా ఏమిటి ఆశిస్తున్నావు ?
జవాబు: కొన్ని కవితల వలన సమకాలీన విషయాలు కొంతమేరకు తెలుస్తున్నాయి.
మన కర్తవ్యాన్ని మనకి గర్తుచేస్తున్నాయి.
వాటి వలన సమాజం గురించి ఎంతోకొంతమేరకు అర్థమౌతుంది.
4. కవిత్వం నీకెలా ఉపయోగపడుతుంది ?
జవాబు: కవిత్వం వలన ఎంతో ఆనందం ఉత్సాహం కలుగుతుంది.
*
పిల్లల కవిత్వానికి ఊతం ఇస్తున్న ఈ శీర్షిక ఫలవంతం కావాలని ఆశిస్తూ తన ఊహలకు రెక్కలు మొలిపించిన చాందినీ కి అభినందనలు