చలి మాసం, చివరి పూలు కొన్ని

సందేహ మేల?
సలికాలమంటే, సంకుల సమరమే!
కానీ, పందేనికి..
పరువంతో పనేముంది?
చలి పులికి కాపుకాసేది చలిమంటేగా?
-కట్టెలతో కాకపోతే, రగిలే దేహాలతోనేగా!
*
అందరూ అంటారుగానీ
అద్దం అబద్ధమాడదని-
వెనక్కి తిరిగి చూడు,
విడిచిన కౌగిలింతల్లో రెక్కలు విప్పార్చుకున్న
ఈయని గులాబీల బుంగమూతి
వెక్కిరిస్తూ కనువిందు చేస్తుంది.
*
హుక్కు పుటుక్కున
తెగిన మాఘపు రాత్రి,
ఇక
ఉక్కపోతే మిగిలింది
ఒక్క పొద్దున్న పుణ్యమంతా
ఆ సందెకే దక్కేసింది.
*
మరి, దేహం
నీదైనప్పుడు
దాని దాహం
తీర్చాల్సిన బాధ్యత నీది కాదూ?
*
అదేమిటో అంతెత్తున్న ఆకాశం..
ఏ చివర్న చూసినా, నేలకు అర్రులు చాస్తూ..
సముద్రం పిర్ర గిల్లుతూనే ఉంటుంది
ఈ పిచ్చిముండా సముద్రం మరీనూ,
కెరటాల వక్షోజాలతో మిడిసిపడుతూ
బహుళపక్షపు చంద్రున్ని భస్మం చేస్తూంటుంది.
*
విరహపు గాడ్పు తిన్నవారినే..
చలి తీతువ వేడికోలు నొప్పిస్తాయి.
దేహం ఒక మేజువాణి
మోజు తీరదెప్పటికీ?
కాడి లేచేదాకా,
తప్పదు, మోత మోగాల్సిందే!
*
కోర్కెలింకా రాలని శిశిరంలో-
రాతిపై ఆవిరవుతున్న తేమను చూస్తూ..
వసంతంపై బెంగెట్టుకున్న మత్స్యరాజమొకటి
రగులుతున్న ఫాల్గుణం వైపు బిత్తర చూపులు చూస్తోంది.
*
చిత్రం: తిలక్

దేశరాజు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు