చలం ‘మైదానం’ పాఠక పరిశీలన

రాజేశ్వరి సమాజ మార్పులో కలిసి పోయింది. అమీర్ కలసిపోలేక పోయాడు. అందుకే అమీరు మరణించాడు.

చనని ఎంత లోతుగా చూస్తే అంత గాఢమైన అంశాలు బయటపడుతాయి. దీనికి కావాల్సింది తవ్విపోసే ఓపిక. అడ్లూరి రఘురామరాజు ‘‘మైదానం లోతుల్లోకి… పోస్ట్ మోడర్న్ పరిశీలన’’ (ఎమెస్కో పబ్లికేషన్స్, విజయవాడ, 2003) అని ఒక తవ్విపోసే పని చేశాడు. పోస్ట్ మోడర్న్ ద్రుక్పథం నుండి చలం ‘మైదానం’ లోని కొన్ని లోతైన అంశాలను ఆవిష్కరించాడు. రచన నుంచి రచయితను వేరు చేసి పఠించే విధానం వల్ల వచ్చే ఫలితాలు భిన్నంగా ఉంటాయి. వాచకం దానికదే ఒక స్వతంత్ర వ్యవస్థ అని నిర్మాణవాదం ప్రకటించింది. వాచకం సంకేతాల వ్యవస్థ అని విశ్లేషించింది. అందుకే రోలా బార్త్స్ ‘రచయత మరణం’ ప్రకటించి నూతన అధ్యయానికి నాంది పలికాడు. అయితే ఆ తరువాత వచ్చిన నిర్మణవాదానంతరవాదులు రచన అస్తిత్వాన్ని, ఆధిపత్యాన్ని తిరస్కరించి పాఠకుడికి ప్రాధాన్యతనిచ్చారు. అదే పాఠక స్పందన విమర్శ (రీడర్ రెస్పాన్స్ క్రిటిసిజం). ఈ పద్ధతి పాఠకులను కూడా విభజించింది. వాచకాన్ని ఊర్కే చదువుతూ వెళ్ళే పాఠకుడు రచనలోని ఖాళీలను పూరించ లేడు. వాచకాన్ని శోధిస్తూ ఖాళీలను పూరిస్తూ పునర్నిర్మించేవాడు ఉత్తమ పాఠకుడు. అందుకే రచయిత అసంపూర్ణంగా వదిలేసిన వాచకాన్ని పాఠకుడు పూర్తి చేస్తాడని ఈ విమర్శా సిద్ధాంతం నమ్ముతుంది.

అడ్లూరి రఘురామరాజు అలా మైదానం రచనలోని ఖాళీలను పూరించే అధ్యయనం చేశాడు. రచయితని పూర్తిగా నిరాకరించడం రఘురామరాజు కిష్టం లేదు. ‘‘అదీ కాక, మనకు వాళ్ళలాగా ఒక వాచకం ఒకే అర్థం అనే ఆచారం లేదు. కాబట్టి, అలాంటి నిబద్ధత, నిర్దిష్టత ఉంది. కాబట్టి వాళ్లు ధిక్కరించి, దానికి ప్రతీకారంగా రచయితపై, రచనపై విధ్వంసానికి పూనుకొని, పాఠకుణ్ణి, భాష్యాన్ని ప్రతిష్టించే తీవ్ర చర్యకు పూనుకోవాల్సి వచ్చింది. మనకు ఇక్కడ యిలాంటి చరిత్ర లేదు కాబట్టి ఒక వాచకం నుంచి రకరకాల భాష్యాలు తీసే సంప్రదాయం మనకుంది కాబట్టి మనం రచయితను ధిక్కరించవలసని అవసరం వాచకాన్ని తగలబెట్టాల్సిన అవసరమూ లేదు. రకరకాల విభిన్నమైన అర్థవంతమైన, భాష్యాలను ప్రతిపాదించవచ్చు’’ అని పే.92లో వివరించాడు. ఈ ఉదారవాద ధోరణే ఆయణ్ణి చలాన్ని రాజేశ్వరితో, రమణ మహర్షిని అమీర్ తో పోల్చడానికి ప్రోత్సహించింది.

‘‘మైదానంలో అమీర్ చూపులకు, రమణ మహర్షి చూపులకు చాలా పోలికలున్నాయి. అమీర్ చూపులు రాజేశ్వరి జీవితంలో తుఫాను రేపి అలజడి స్రుష్టించి కోత్త జీవితానికి నాంది పలికాయి. రమణ మహర్షి చూపులు చలాన్ని జీవితాంతం కట్టేశాయి… కానీ ఈ రెండు సంఘటనలలోని చూపుల తీవ్రతలో, లోతులో తేడాలుండవచ్చు. కానీ, ఈ రెండు సంఘటనలు రాజేశ్వరి జీవితాన్ని, చలం జీవితాన్ని పెద్ద మలుపులు తిప్పాయి’’ (పె.21) అంటాడు. చలాన్ని రచన నుంచి వేరు చేయకపోవటం వల్ల వచ్చిన ఫలితమిది.

నిజమే, అమీర్ మార్పు చెందలేని సమాజ ప్రవ్రుత్తికి సంకేతం. రమణ మహర్షి, మానవుల్లో మార్పు చెందని దైవిక ప్రవ్రుత్తికి సంకేతం. కానీ రాజేశ్వరి మారే ప్రవ్రుత్తి కలది. అందుకే అమీర్ తన అప్రవ్రుత్తి నించి బయట పడలేక ఆత్మహత్య చేసుకున్నాడు. రమణ మహర్షి లోకం నుంచి కనుమరుగయ్యాడు. నమ్ముకున్న రాజేశ్వరి, చలం దారితప్పారు.

అడ్లూరి రఘురామరాజును కూడా ఈ వాచక పఠనం నుంచి తప్పిస్తే కొన్ని వాస్తవిక అంశాలను నిష్కర్షగా పరిశీలించవచ్చు. పోస్ట్ మోడర్నిజం దేన్ని పరిశీలిస్తుందనే అంశాన్ని Linda Hutcheon ఇలా అంటారు ‘‘it questions the very bases of any certainty (history, subjectivity, reference) and of any standards of judgment’’. అన్ని నిర్దిష్ట నిర్ణయ ప్రకటనల్ని పోస్ట్ మోడర్న్ పరిశీలన ప్రశ్నిస్తుంది. అందువల్ల ఈ రచన తీర్పుల్ని పరిశీలించాల్సి వుంది.

ఈ రచన మైదానం నవలని పరిశీలించిన మెథడాలజీ సగం నిర్మాణవాదం, సగం వినిర్మాణవాదంది. నిర్మాణవాదం Presence (ఉపస్థితి) గురించే చర్చిస్తుంది. అంటే, రచనలో చెప్పిన అంశాలాధారంగా ప్రవ్రుత్తుల మధ్య విరుద్ధ సంబంధాలన్ని రచన నియమాలు, సాహిత్య ఆచారాల నేపథ్యంలో విశ్లేషిస్తుంది. అందుకు ద్విధాక్రుత సంబంధాల (బైనరీ రిలేషన్స్) మీద ద్రుష్టి నిలుపుతుంది. చీకటి-వెలుగు, స్త్రీ-పురుషుడు, మాట-లిపి, మంచి-చెడు, నీతి-అవినీతి ఇలా సంబంధాల్ని విశ్లేషిస్తుంది. ఈ రచన కూడా రమణ మహర్షి-చలం, చలం-మైధానం, అమీర్-రాజేశ్వరి, బాల్యం-యవ్వనం వంటి ద్విధాక్రుత సంబంధాల్లోంచి పరిశీలిస్తుంది. అయితే ఈ పద్ధతి వల్ల తగిన ఫలితం రాదని వినిర్మాణవాదం చెప్పింది. వినిర్మాణవాదం కన్పించేదాని కన్న కన్పించనిదాన్ని (అనుపస్థితి) అన్వేషిస్తుంది. అంటే ఉస్థితి కన్న అనుపస్థితి మీద శ్రద్ధ పెడుతుంది. ఉపస్థితిని మాత్రమే చూడ్డం వల్ల అనుపస్థితి కనుమరుగవుతుందని డెరిడా అంటాడు. సత్యమెప్పుడూ రహస్యంగా వుంటుందని అంటాడు. లిండా హచీయన్ కూడా ఇలా అంది. The modernist concept of single and alienated otherness is challenged by the postmodern questioning of binaries that conceal hierarchies (self/other) అంటుంది.

అందుకే ఈ రచనను మైదానంలో చెప్పని బాల్యం గురించి, అమీర్ మరణం గురించి చర్చిస్తుంది. రచనలో చెప్పని అనేక నిగూఢ అంశాల్ని వెలికితీసే పని చేసింది. బాల్యం గురించి ఆసక్తికరమైన చర్చ చేసింది. రాజేశ్వరికి తల్లి లేదని, పెంపుడు తల్లి సూరమ్మ దగ్గర పెరిగిందని సూచించబడింది. ‘పోనీ, అమ్మని తలుచుకో. నిన్ను పెంచి పెద్దదాన్ని చేసి, యేదో మా అందరికి ప్రతిష్ట తెస్తావని…’ (పే. 35) అనే వాక్యాన్ని రఘురామరాజు ప్రస్తావిస్తాడు.

ఇక్కడ గమనించాల్సిన విషయం, పెంచి పెద్దదాన్ని చేసిందంటాడే కానీ ‘కనీ, పెంచింది’ అనడు. అంటే రాజేశ్వరికి కన్నతల్లి వేరు. పెంచిన తల్లి వేరు. ఇంకా దీన్ని సమర్ధించడానికి ‘‘ఆయన్ని ప్రేమిస్తో నేను ఆయన యింట్లో వున్నప్పుడు ఒకసారి యింగ్లండు వెళ్లివచ్చిన ఆయన స్నేహితుణ్ణి తీసుకొచ్చి తనతో భోజనం వడ్డించమన్నారు. ససేమీరా వీల్లేదన్నాను. కారణం- మా పెత్తల్లి సూరమ్మగారికి నా మీద కోపం వస్తుంది (పే. 14) అని ఆ వాక్యాన్ని యిక్కడ విరిచేస్తాడు.

నిజానికి రాజేశ్వరి కన్నతల్లి దగ్గరే పెరిగింది. పైన ఉదహరించిన మాటలు రాజేశ్వరి గతంలో తను ఎంత ప్రాతివత్యం పాటించేదో చెప్పే సందర్భంలోనివి. తన ప్రాతివత్యాన్ని పెత్తల్లి సూరమ్మ, తోడి కోడలు శంకిస్తారని చాలా పట్టుదల ప్రదర్శించింది. ‘‘తోడి కోడలు నన్ను వెలేస్తానని బెదిరిస్తుంది. నవ్వులాటకులాగు’’ (పే.14) అనేది దీనికి రుజువు. అంతేకాదు. అమీర్ రాజేశ్వరి నివసించే గుడిసె పక్కన పారే సెలయేటిని తన తల్లి ఇంట్లో పని మీద బిజిగా తిరిగే దానితో పోలుస్తుంది. ‘‘మా గుడిసె పక్కన చిన్న యేరు. ఎప్పుడూ తొరగా పరిగెత్తుతో వుంటుంది. దాన్ని చూస్తే, ఎవ్వరితో మాట్లాడక ఇంట్లో పని మీద యెప్పుడూ తిరిగే మా అమ్మ జ్నాపకం వచ్చేది (మైదానం, పే.13). ఇక్కడ మా పెత్తల్లి అనలేదు. స్పష్టంగా మా అమ్మ అంది. అందువల్ల ఆమెకు తల్లి ఉందని భావించొచ్చు.

నిజానికి రాజేశ్వరికి తండ్రి లేడు. అమ్మ, అన్నయ్యతో కల్సి మేనమామ ఇంట్లో పెరిగిందని భావించొచ్చు. రాజేశ్వరి, ఆమె మామయ్య లిద్దరూ ఎక్కడా తండ్రి గురించి ప్రస్తావించ లేదు. అమ్మ గురించి ఆలోచించమన్న మామయ్య నాన్న గురించి ఎందుకు ఆలోచించమనలేదు? వాళ్లమ్మ ఆ యింట్లో ఎవ్వరితో మాట్లాడలేదు. ఎందుకు? బహుశా రాజేశ్వరి నాన్న చనిపోయి వుంటాడు. అతనితో ఆమెకు ఎలాంటి తీయని లేదా చేదు జ్నాపకాలు లేకపోయి వుండొచ్చు. లేదా తను పుట్టగానే లేదా పుట్టక ముందో చనిపోయి వుండొచ్చు.

రాజేశ్వరి బాల్యాన్ని ఆమె తల్లి కోణం నుంచి పరిశీలిస్తే తనకు తండ్రి లేని లోటు మొదటి నుంచి కలవర పెడుతుంది. అది ఒక అభద్రతా భావాన్ని కల్గించింది. మామయ్య అన్నయ్య, వరసకు తెలిసిన అతి సమీప మగాళ్ళు, వీరిలో తండ్రి కనిపించే అవకాశం లేదు. తల్లి అనుభవించే ఒంటరి జీవితం బలమైన ముద్ర వేసింది. అన్ని కోల్పోయిన తల్లి స్థితిని తను ఏనాడూ అనుభవించకూడదనే ముద్రను వేసి ఉండవచ్చు. అయితే తను ఆశించిన అనుభవం, భద్రత భర్త నించి లభించడం లేదన్నది అమీర్ కనిపించాక తోచింది. మనస్తత్వ అధ్యయనంలో ఫ్రాయిడ్ చెప్పిన తండ్రి కేంద్రంగా చేసి పరిశీలనకు భిన్నంగా లకాన్ తల్లి కోణం నుంచి పరిశీలన జరగాలని ప్రతిపాదించాడు. అలా జరిగి వుంటే ఈ రచన చేసిన పరిశీలన ఫలితం మరో విధంగా ఉండేది.

అమీర్ రాజేశ్వరిని వదిలి ఎక్కడికెళ్ళినట్టు? అన్ని రోజులు రాజేశ్వరి లేకుండా ఎలా బతగ్గలిగాడనేది చర్చించటం ముందు ముందు జరగాల్సిన అధ్యయనం. అమీర్ రాజేశ్వరిని వదిలేసేది ముందుగానే సూచిస్తాడు. భోజనానికి పిలిచిన రాజేశ్వరితో ‘‘ఇదిగో వస్తున్నా పావురాయిని వదిలేసి’’ అంటాడు. కడుపులో బిడ్డ గురించి పోట్లాడి ఆ తర్వాత వదిలి వెళ్ళిపోతాడు. అమీర్ ఎక్కడుంది మీరాకి తెలుసు. మీరా నిత్యం రాజేశ్వరితో ఉన్నా అమీర్ తో కమ్యూనికేషన్ కలిగి ఉన్నాడన్నది ఊహించవచ్చు. యేటి అవతలి ఊరిలో తోళ్ళ సాహెబ్ కూతురితో సరదాగా ఉండి ఉండొచ్చు. అబార్షన్ తర్వాత వచ్చిన అమీర్ రాజేశ్వరిని మనుపటికన్న అందంగా ఉన్నావంటాడు. అంటే అమీర్ కి కావాల్సింది శరీరం తప్ప రాజేశ్వరి హ్రుదయం కాదు. రాజేశ్వరి లేకుండా బతకలేననే అంత పోసెస్సివ్ నెస్ వదిలేసినప్పుడు లేదు. ఎప్పుడైతే మీరాను కూడా ఆమె ప్రేమిస్తుందని గ్రహించాడో అప్పుడు చచ్చేంత ప్రేమించడం ప్రారంభించాడు. ఇది ప్రేమతో వచ్చునది కాదు. అతడి పూర్వ రాజ్యరహిత లైంగిక సంబంధ స్వభావం కోల్పోవడం వల్ల ఏర్పడింది. దీనికి కారణం అతడు మైదానం వదలి ఆధిపత్య సంబంధాల సామాజిక వ్యవస్థలో కొంత కాలం జీవించటం వల్ల ఆధిపత్య స్వభాన్ని పొందడం. అమీర్ మరో మైదానంలోకి వెళ్ళే అవకాశం లేదు. అందువల్ల పూర్వ అమీర్ కు తర్వాతి అమీర్ కు తేడా ఉందన్నది తెలుస్తుంది.

వాస్తవానికి చర్చంతా రాజేశ్వరి కేంద్రంగా జరిగింది. ప్రతి రచన ఒక కేంద్రం కలిగి ఉంటుంది. ఆధునికానంతరవాదులు కేంద్రాన్ని తిరస్కరించడం పట్ల డెరిడా మంచి వివరణిచ్చాడు. “I didn’t say that there was no center, that we could get along with the centre. I believe that the centre is a function, not a being – reality, but a function. And this function is absolutely indispensible” (Postmodern Poetics) అంటాడు. దీని ప్రకారం రాజేశ్వరి ఒక వ్యక్తి కాదు. ఓ ప్రవ్రుత్తి, అప్రవ్రుత్తి – ప్రవ్రుత్తిల మధ్య జరిగే ఘర్షణలో ప్రవ్రుత్తి మాత్రమే నిలబడుతుంది. అప్రవ్రుత్తి జారిపోతుంది. రాజేశ్వరి సమాజ మార్పులో కలిసి పోయింది. అమీర్ కలసిపోలేక పోయాడు. అందుకే అమీరు మరణించాడు. ఈ అంశాన్ని ఈ రచన ప్రతిభావంతంగా ఆవిష్కరించింది. రాజేశ్వరి అనే సంజ్నని ఒక ప్రవ్రుత్తిగా సంకేతిస్తే, ఈ రచనలోని సంకేతితాంశం ఇచ్చే అర్థం వేరే విధంగా ఉంటుంది.

రాజేశ్వరి, అమీర్ ల మధ్య సంబంధం అసమాన లైంగిక సంబంధాల లోంచి చూడక పోతే అది సరైంది కాదు. స్టీఫెన్ హీత్ ఇలా అంటాడు. “Any discourse which fails to take account of the problem of a sexual difference in its own enunciation and address will be within a patriarchal order, precisely indifferent, a reflection of male dominion”. రాజేశ్వరి అమీర్ ల మధ్య అలాంటి ఆధిపత్య లైంగిక సంబంధం అంతర్లీనంగా ఉంది.

మైదానంలోకి వచ్చినాక వారి మధ్య సమాజ ఆధిపత్య రూపం సన్నగిల్లింది. రాజేశ్వరి జాకెట్ వేసుకోవడమే మరిచిపోయింది. దాన్ని వేసుకోవాలనే ఆలోచనే రాలేదు. ఆధిపత్యం లేదా రాజ్యం ఏ రూపంలోనయినా ఉండొచ్చు. ఫుకో హిస్టరీ ఆఫ్ సెక్సువాలిటీ, పవర్ ల మీద చేసిన విశ్లేషణ దీన్ని నిరూపించింది. ఇద్దరూ బట్టల గురించి ఆలోచించరు. రాజేశ్వరి మీరాను కూడా ప్రేమిస్తోందని అమీర్ ఎప్పుడైతే గ్రహిస్తాడో అప్పుడు ఆమె శరీరం మీద గుడ్డలు కప్పాలనే ఆలోచన చేస్తాడు. ఇది ఆధునిక రాజ్య రూపం. దీనికి రాజేశ్వరి ‘‘నామీద రెండు రవికలు పడేసి, ఈవాళ నించి యివి వేసుకుని వుండు అన్నాడు. దవడ పగిలేట్టు కొట్టినట్టయింది నా మనసు’’ (మైదానం, పే. 96). ఇది రాజ్యం వారి మధ్యకు వచ్చిన తీరును సంకేతిస్తుంది. నిజానికి అమీరే ఒక రాజ్యం. అదే వారి మధ్య దు:ఖాన్ని కల్గించింది. చిన్నచిన్న ఘర్షణలే సంబంధాల వ్యవస్థని మారుస్తాయని ఫోర్టోఘెసి అంటాడు. ఇక్కడ అదే జరిగింది.

పునరావ్రుత్తి (రిపిటీషన్)కి సంబంధించి ఈ రచన చేసిన విశ్లేషణ బావుంది. ప్రతి రచన పూర్వ రచనల కొనసాగింపని టి.ఎస్. ఈలియట్ నుంచీ వస్తున్న భావన. అయితే వడ్డెర చండీదాసు చెప్పినట్టుగానే Gilles Deleuze పునరావ్రుత్తి రెండు రకాలంటాడు. ఒకటి, వాస్తవ జగత్తుకు నఖలు. మరోటి, పూర్తి విరుద్ధమైన కళా ప్రవ్రుత్తి. రెండోది మొదటి దాన్నుంచి విభేదిస్తుంది. జె.హెచ్.మిల్లర్ తన ఫిక్షన్ అండ్ రిపిటీషన్ అనే పుస్తకంలో దీన్ని స్పష్టం చేశాడు. మైదానం పూర్తి విరుద్ధమైన నిరాశ్రిత కళా ప్రవ్రుత్తి. కాబట్టి తార – శశాంక కథకి మైధానానికి సారూప్యత ఉండొచ్చు. కానీ సామీప్యత లేదు. చలం తార – శశాంకల పూర్వ కథ సంప్రదాయంలో లేకున్నా ఈ నవల రాసేవాడు కావచ్చు. అలాంటి సంభావ్యత వుంది. విమర్శ మీద విమర్శ సాహిత్య శాస్త్రాన్ని పరిపుష్ఠం చేస్తుంది. పఠనం మీద పఠనం రచనను ఆస్వాదించి, లోతుల్ని చూసే అవకాశం కల్గిస్తుంది. అడ్లూరి రఘురామరాజు చేసిన పరిశీలనలో తప్పిపోయిన అంశాల్ని పట్టుకొనే ప్రయత్నమే ఇదని భావించడం సరైంది.

(2003లో మైదానం లోతుల్లోకి.. పోస్ట్ మోడర్న్ పరిశీలన అనే పుస్తకం చదివి, రాసిన వ్యాసం)

జిలుకర శ్రీనివాస్

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • జిలుకర శ్రీనివాస్ గారు అనేక సందర్భాలలో మైదానం గురించి చర్చించిన విషయం ఇప్పటికి వ్యాస రూపం దాల్చింది. వారితో కొన్నిసార్లు ఇటువంటి చర్చలలో పాల్గొన్న సాన్నిహిత్యంతో ఒక చిన్న ప్రతిపాదన
    చేయదలచాను. చలం రచించిన మైదానం తెలుగు సాహిత్యంలో నిస్సందేహంగా ప్రసిద్ధ Realistic నవల. పారిశ్రామిక విప్లవం తెచ్చి పెట్టిన ఆధునికత వలన సమాజంలో కలిగే పర్యవసానాల కారణంగా
    Realistic Novel వేళ్ళూనుకుందని Raymond Williams (The English Novel from Dickens to Lawrence) సూత్రీకరించాడు. మరొక సందర్భంలో Realism and the Contemporary Novel (1958) గురించి ప్రస్తావిస్తూ ఇలా అన్నాడు:
    [T]he traces of the older balance still clearly visible, yet belongs, in a high place, in this divided kind, because of elements in the Indian society of the [Realistic] novel. [Emphasis mine].
    ఈ స్పూర్తితో మైదానం నవలా రచనకు ప్రేరేపించిన కారాణాలు లేదా దాని మూలాలను గురించి కూడ (ముఖ్యముగా ఆధునికత, కులము, వలసవాదం, పట్టణికరణ వంటి అంశాలను స్ప్రుశిస్తూ) జిలుకర గారు మరొక వ్యాసంలో చర్చిస్తే బాగుంటుందని కోరుతున్నాను.

  • ‘వృత్తి’ మొదలైన పదాలను ‘వ్రుత్తి’ గా రాసి చూపింటానికి ఏవైనా కారణాలున్నాయా?

    • కవి తాను అనుకున్న భావాన్ని రాస్తే, అది చదివిన పాఠకునికి ఆ వాక్యం ఏ విధంగా అర్ధం అయింది ,అనే విశ్లేషణ చేయడం బాగుంది.
      చాలామంది కవులు తాము రాసిన భావాన్ని పాఠకునికి అర్థం చేపించకపోవడం వలన,కవి ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది పాఠకునికి అర్ధంగాక ప్రశ్నగానే మిగులుతుంది.అలకాకుండా కవి రాసిన పుస్తకానికి చివర్లో పైన మీరు విశ్లేషించిన విధంగా చెప్పడం ద్వారా అది సంపూర్ణం అవుతుంది.
      ( దీన్ని మొదటి సారిగా చదివే పాఠకుడు పై పేజీలోని గజి బిజీ, బిజీ గజి,ని చదివి పాఠకుడే కవియైతే…అనే కథ వస్తువుకు తానే కవి అవుతాడు……)
      (నవ్వుతూ……)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు