చరిత్ర విసురుతున్న సవాల్

2010ల భారతదేశం 1930ల జర్మనీ కాకుండా కాపాడుతామా లేదా అని చరిత్ర మనను ప్రశ్నిస్తున్నది.     

రవయోశతాబ్ది ప్రపంచ చరిత్ర, ముఖ్యంగా యూరప్ చరిత్ర, ఇటలీ, జర్మనీల చరిత్ర చదువుకున్నవాళ్లు చాలకాలంగా చెపుతున్న మాటే. కొత్త మాటేమీ కాదు. కాకపోతే మరింత మరింత మందికి కొత్తగా, భయభీతావహాలతో అనుభవంలోకి వస్తున్నది. పాలకులు తమ వైఫల్యాలను దాచుకోవడానికి, ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని పక్కదారి పట్టించడానికి కొత్త దారులు వెతికే సమయం ఒకటి ఏ దేశ చరిత్రలోనైనా వస్తుంది. పాలకుల ముసుగులు తొలగిపోతాయి. ప్రజలు ఇచ్చిన అధికారాన్నే పాలకులు ప్రజలకు వ్యతిరేకంగా వాడడం మొదలుపెడతారు. భిన్న స్వరాల మీద ఉక్కుపాదం మోపుతారు. భిన్న స్వరం కూడ కానక్కరలేదు, రాజుగారికి బట్టల్లేవు అని నిజం చెప్పే చిన్న పిల్లల, అమాయకుల కుత్తుకలను కూడ ఉత్తరించడానికి పూనుకుంటారు. ఒక్క మాటా లేని, ఒక్క పాటా లేని, ఒక్క ఆటా లేని నిప్పచ్చరపు ఎడారిగా దేశం మారిపోవాలని ఆదేశిస్తారు. రాజ్యాంగం లేదు, ప్రాథమిక హక్కుల్లేవు, చట్టబద్ధపాలన లేదు, నాగరికతా సహనమూ వద్దేవద్దు. ఒక్కమాటలో కాళోజీ చెప్పినట్టు ఏకీభవించనోని పీకనొక్కు సిద్ధాంతం అది. తాను కళ్లు తెరిచేనాటికి కళ్లతో చూసిన అనుభవం గనుక దానికి ఫాసిజం అని చేర్చాడు కాళోజీ.

అది ఒకసారి 1920లలో ఇటలీలో ఫాసిజంగా, 1930లలో జర్మనీలో నాజీజంగా పుట్టి పెరిగి అంతరించింది గనుక, కోట్లాది మానవ విషాదాలను ప్రపంచానికి చూపింది గనుక ఇక మళ్లీ రాదని కొందరు మేధావులు అమాయకంగా నమ్మారు. దాని గురించి మాట్లాడుకోవడమే అనవసరం అనుకున్నారు. కాని పాలకులకు ఫాసిజం ఒక నిరంతర అవసరం. ఏకీభవించనోని పీకనొక్కడం ఒక అనివార్య సహజ పరిణామ క్రమం. భారత సమాజంలో ఆ యూరపియన్ ఫాసిజానికి సారవంతమైన కులమతాల నేల దొరికింది. మహారాజులందరికీ ఫాసిజపు విత్తనాలు నాటి, రక్తపుటేర్లు పారించి, అబద్ధాలు పండించి రాజనాల వోట్లు రాల్చుకునే రాజమార్గం దొరికింది. భారతీయ ఫాసిజం హిందూ బ్రాహ్మణీయ కుల మత అంతరాల వ్యవస్థలో ఏపుగా విషవృక్షంగా ఎదిగింది. ఎమర్జెన్సీ ప్రకటించి ఇందిరా గాంధీ అమలు చేసిన హక్కుల హననపు ఫాసిజం గాని, సిక్కులను ఊచకోత కోసి రాజీవ్ గాంధీ అమలు చేసిన మతరాజ్యపు ఫాసిజం గాని, ప్రపంచబ్యాంకు – ఇంటర్నేషనల్ మానెటరీ ఫండమెంటలిజపు పునాది మీద పివి నరసింహారావు అమలుచేసిన కార్పొరేట్ ఫాసిజం గాని భారతీయ ఫాసిజం ధరించిన కొత్త రూపాలు.

ఇప్పుడు అంతకు మించిన, మరింత దుర్మార్గమైన కొత్త మహమ్మారిగా ఫాసిజం దేశం మీద పరచుకుంటున్నది.

ఇది ముస్సోలినీ, హిట్లర్ ల ప్రేరణతో వారితో పాటుగానే 1925 విజయదశమి రోజున జమ్మిచెట్టు మీదినుంచి ఆయుధాలు దించింది. దేశప్రజల మీద ఎక్కుపెట్టడానికి వంద సంవత్సరాలుగా ఆ ఆయుధాలు నూరుతున్నది. మనుస్మృతిని, అసమానతను, వివక్షను, హింసను అమలు చేయగల అధికారం కోసం తొమ్మిది దశాబ్దాలపాటు ఎదురుచూస్తున్న ఈ సంఘ పరివార ఫాసిజానికి 2014 తర్వాత కోరలు చాచే అవకాశం వచ్చింది. కనీసం ఆరు దశాబ్దాలుగా ఉత్తర భారతమంతా స్థానిక స్థాయిలో సాగిస్తున్న ముస్లింల ఊచకోతలు, గుజరాత్ లో ప్రయోగాత్మకంగా జరిపిన మూడువేల మంది ముస్లింల హననం వంటి రక్తసిక్త సోపానాల మీద ఈ అధికారం దక్కింది. నాలుగు సంవత్సరాల అధికారంలో అఖ్లాక్ హత్య, జునేద్ హత్య, ముజఫర్ నగర్ ఊచకోత, ఊనా హత్యాకాండ, దేశవ్యాప్తంగా ఆదివాసుల మీద, దళితుల మీద, మహిళల మీద పెచ్చరిల్లిన దాడులు, డా. గోవింద పన్సారే, ప్రొ. ఎం ఎం కల్బుర్గి, గౌరీ లంకేష్ వంటి బుద్ధిజీవుల హత్యలు, విద్యావంతుల మీద, బుద్ధిజీవుల మీద, విశ్వవిద్యాలయాల మీద, ఎక్కడెక్కడ వైవిధ్యభరిత స్వరం వినిపిస్తే అక్కడ ఈ ఫాసిజం తన వేయిపడగలు విప్పింది – ఒక్క మాటలో దేశాన్ని తాము చెప్పినట్టు వినే, తాము చెప్పింది తినే, తాము ఆదేశించేది కట్టే, తాము ప్రతిపాదించిన పుస్తకం చదివే, తాము ఆమోదించిన సినిమా చూసే, తాము ఇచ్చిన నినాదానికి వంతపాడే, తమకన్న భిన్నంగా, వైవిధ్యంతో ఉండేవారెవరూ లేని ఒక నిర్బంధ శిబిరంగా మార్చడం ఈ ఫాసిజపు లక్ష్యం. మనుస్మృతిని మళ్లీ అధికార ధర్మశాస్త్రం చేయడం ఈ ఫాసిజపు లక్ష్యం. ఈ స్వకార్యం సాగించుకుంటూనే సామ్రాజ్యవాద కార్పొరేట్ ప్రయోజనాలను పరిరక్షించే స్వామికార్యం కూడ నెరవేర్చడం ఈ ఫాసిజపు మరొక లక్ష్యం.

ఈ హిందుత్వ – కార్పొరేట్ ప్రయోజనాల సమ్మేళనం అనే విష కషాయ రసాయనాన్ని అర్థం చేసుకోకపోతే ఆగస్ట్ 28న, అంతకుముందు జూన్ 6న దేశవ్యాప్తంగా మేధావుల మీద, రచయితల మీద, ప్రజా ఉద్యమాల సమర్థకుల మీద జరిగిన దాడులను పూర్తిగా అర్థం చేసుకోలేం. వారికీ ప్రధాని మోడీ హత్య కుట్రకూ, భీమా కోరేగాం హింసాకాండకూ సంబంధం అంటగట్టిన అబద్ధపు ఉత్తరాల కుట్రను అర్థం చేసుకోలేం. అంతకుముందు ప్రొ. సాయిబాబా మీద జరిగిన దాడి, అక్రమ శిక్ష, అంతకుముందరి ఆపరేషన్ గ్రీన్ హంట్, అంతకు ముందరి సాల్వా జుడుం అనే అంతర్యుద్ధ కిరాయి హింసా మూక సృష్టి, అంతకుముందు మధ్య భారత అరణ్యాలలో, ఆదివాసుల కాళ్లకింద భూగర్భంలో ఉన్న అపార ఖనిజ నిలువలను దేశదేశాల కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా అప్పగించడానికి మొదలైన కుట్ర – ఇదంతా ఒక షడ్యంత్రం. ఈ విస్తృత షడ్యంత్రంలో భాగమే ఆగస్ట్ 28న దేశవ్యాప్తంగా మేధావుల మీద, ప్రజా ఉద్యమాల సమర్థకుల మీద జరిగిన దాడి.

పుట్టుకతో వచ్చిన అమెరికన్ పౌరసత్వాన్ని వదులుకుని, ప్రతిష్ఠాత్మక ఐఐటి పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యను వదులుకుని శంకర్ గుహ నియోగి ప్రేరణతో ఆదివాసుల మధ్య, గని కార్మికుల మధ్య పని చేస్తూ, న్యాయవాదిగా, న్యాయశాస్త్ర అధ్యాపకురాలిగా ఉన్న సుధా భరద్వాజ్, ముప్పై సంవత్సరాలుగా ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సహాయ సంపాదకుడిగా, బహు గ్రంథ రచయితగా, ప్రధానంగా కశ్మీరీల హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్న హక్కుల కార్యకర్తగా ఉన్న గౌతమ్ నవ్లాఖా, అరవై సంవత్సరాలుగా కవిగా, రచయితగా, అనువాదకుడిగా, మేధావిగా, సాహిత్య పత్రికా సంపాదకుడిగా, వక్తగా, ప్రజాఉద్యమాల బలమైన స్వరంగా ఉన్న వరవరరావు, సంకెళ్ల సవ్వడి వంటి విశేషాదరణ పొందిన జైలు అనుభవాల రచయిత, న్యాయవాది అరుణ్ ఫరేరా, రచయిత, అధ్యాపకుడు వర్నన్ గొంజాల్వెజ్, నాగపూర్ విశ్వవిద్యాలయ ఇంగ్లిష్ అధ్యాపకురాలు ప్రొ. షోమా సేన్, రిపబ్లికన్ పాంథర్స్ అధ్యక్షుడు సుధీర్ ధావ్లే, సుప్రసిద్ధ దళిత న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, ఆదివాసుల మధ్య పనిచేస్తున్న సామాజిక కార్యకర్త మహేశ్ రావత్, జె ఎన్ యు పరిశోధక విద్యార్థి రోనా విల్సన్ – వీళ్లందరూ ఏమి నేరం చేశారని అరెస్టులు? జీవితమంతా ఆదివాసుల కోసమే వెచ్చించిన 85 సంవత్సరాల వృద్ధుడు, క్రైస్తవ ఫాదర్ స్టాన్ స్వామి,  మేనేజ్మెంట్  నిపుణుడు , మార్క్సిజం, అంబేడ్కరిజం ల మీద అర డజను పుస్తకాలతో, వందలాది వ్యాసాలతో ప్రపంచ ప్రసిద్ధుడైన దళిత మేథావి ఆనంద్ తెల్ తుంబ్డే , ముప్పై ఏళ్లుగా అణగారిన వర్గాల న్యాయవాదిగా ఉన్న సుసాన్ అబ్రహాం, ఇరవై ఏళ్లకు పైగా అపారమైన కృషితో అంతర్జాతీయ స్థాయిలో దళిత అధ్యయనాల నిపుణుడిగా ఎదిగిన ప్రొ. కె సత్యనారాయణ, కవి, జర్నలిస్టు, కళాజీవి క్రాంతి టేకుల, కథకుడు, జర్నలిస్టు కె వి కూర్మనాథ్, వరవరరావు కూతుళ్లైన పాపానికి అనల, పవన – ఏం నేరం చేశారని గంటలకొద్దీ వేధింపులు? విలువైన పుస్తకాల, ఫోటోల, వ్యక్తిగత సమాచారాల దొంగతనాలు? పోలీసులు సృష్టించిన, హాస్యాస్పదమైన అబద్ధపు ఉత్తరాలు సాక్ష్యాధారాలు కావు, వాస్తవమేమంటే, వీళ్లందరూ రాజ్య ప్రచారానికి భిన్న స్వరం ప్రకటిస్తున్నారు. ప్రజల స్వరం వినిపిస్తున్నారు. రాజుగారి దేవతావస్త్రాల గుట్టు విప్పుతున్నారు. ఫాసిజానికి ఎంతమాత్రమూ గిట్టనిది అదే.

తమను తాము బుద్ధిజీవులుగా పిలుచుకునే వాళ్ల ముందు ఇవాళ్టి సవాల్ ఇది. భిన్నాభిప్రాయాన్ని సహించని, పీకనొక్కే ఫాసిజానికి భయపడి లొంగిపోదామా, నీ అభిప్రాయంతో నాకు ఏకీభావం లేదు, కాని నీకు నీ అభిప్రాయం చెప్పే హక్కును కాపాడేందుకు నా ప్రాణమైనా ఇస్తాను అనే వోల్టేర్ ప్రజాస్వామిక స్ఫూర్తితో ఈ భిన్నస్వరాలకు సంఘీభావం ప్రకటిద్దామా? 2010ల భారతదేశం 1930ల జర్మనీ కాకుండా కాపాడుతామా లేదా అని చరిత్ర మనను ప్రశ్నిస్తున్నది.

  *

 

ఎన్. వేణుగోపాల్

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కష్మీరీల హక్కులకోసం పోరాడుతున్న‘గౌతమ్ నవాల్ల్ ఖా’ ఏనాడయినా తన జీవితంలో ఒక్కసారయినా 25 ఏళ్లుగా గుడారాల్లో బ్రతుకుతున్న కష్మీరీ హిందువుల గురించి మాట్లాడాడా, వాళ్ల హక్కులకోసం పోరాడాడా? ీకనీసం వాళ్లని పరామర్శించాడా? జాతి నిర్మూలన అంటే అది కాదా? రేసిజం అంటే అది కాదా? ఈ విషయమై ఎవరైనా తెలుగు, లేదా జాతీయ మానవవాద కార్యకర్తలు, మేధావులు, ప్రగతిశీల రచయితలు ఏనాడయినా ఒక్క పదమైనా తెలుగులో వ్రాసారా? లేదా వాళ్ల ప్రతినిధి సుశీల్ పండిట్ తోగాని, మరెవరితోనైనాగాని ఒక్క సారయినా సంభాషించారా, చర్చించారా? జగ్ మోహన్ వెళ్లిపోమంటే 450000 మంది కష్మీరీ హిందువులు లోయ విడిచి వెళ్లిపోయారన్న అత్యంత నీచమైన, బూటకపు ప్రాపంగాడాని చేసి కష్మీరీ పండిట్ల జాతిహననానికి నికృష్టమైన భాష్యం చెప్పిన ఈ హక్కుల ఉద్యమ నాయకుడిని కష్మీర ప్రజల తరఫున పోరాట యోధుడుగా అభివర్ణించడం పాక్షిక సమాచారమే అవుతుందిగాని సమగ్రదృష్టి కానేరదు.

  • “Dissent is the safety valve of democracy… the pressure cooker will burst if you don’t allow the safety valves,” the Supreme Court of India observed, questioning the arrest of the five activists nearly nine months after the violence in Bhima Koregaon.

  • ప్రియమైన శ్రీనివాసుడు గారూ! మీతో మళ్లీ వాగ్వివాదానికి దిగుతున్నానని కోపగించుకోనంటే, దేశం లోని అత్యున్నత న్యాయపీఠం వారన్న మాటలు కింద ఉదాహరిస్తున్నా :

    Chief Justice of India Dipak Misra said on Monday ( 17th September, 2018 ) that the Supreme Court will set up a Special Investigation Team (SIT) if the material relied on by the Maharashtra government to raid and arrest five activists ( poet Varavara Rao, lawyer Sudha Bhardwaj, and activists Arun Ferreira, Vernon Gonsalves and Gautam Navlakha) on August 28 in the Bhima-Koregaon violence case is found to be “cooked up”.

    కష్మీరులు అంటే హిందువులు, ముస్లిం లూ అని మాత్రంగా అర్ధం చేసుకోవటం కంటే వాళ్లందరూ మానవులు, మన సోదరులు అని అనుకుంటూ పెద్దలు బాలగోపాల్ గార్లు లాంటి వాళ్లు చెప్పిన విషయాలను కూడా అర్ధంచేసుకోవడానికి ప్రయత్నిద్దాం ( మరో చోట, మరో సారి )

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు