ప్రముఖ కవి, విమర్శకుడు, సాహితీ చరిత్రకారుడు- ఉద్యమకారుడు, గొప్ప ఎడిటర్, దార్శనికుడు, అస్తిత్వ ఉద్యమాల మద్దతుదారు.. తెలంగాణ చరిత్ర, ముంగిలి తెలంగాణ సాహిత్య చరిత్ర రచయిత, శ్రీకాకుళ సాహితి, నీలగిరి సాహితి వ్యవస్థాపకుడు, జముకు పత్రిక, బహువచనం సంపాదకుడు. మత్తడి, 1969 తెలంగాణ కవిత్వం సహ సంపాదకుడు.. మరెన్నో సంస్థల స్థాపనలో, సంకలనాలు వెలువడడంలో చోదకశక్తి డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి. ఈ మధ్యే తన నాలుగు దశాబ్దాల సాహిత్య సమాలోచన సదస్సు
జరుపుకున్న ఆయన కొత్త కవిత్వ పుస్తకం ‘తావు’, తెలంగాణ దీర్ఘ కవిత ‘దాలి’ రీప్రింట్ వెలువరించారు. సాహిత్యం కోసం అహర్నిశలు తపించే సుంకిరెడ్డితో స్కైబాబ ఇంటర్వ్యూ.
కవిత్వాన్ని అద్భుతంగా ఎడిట్ చేస్తారు మీరు. బహుశా అంత దార్శనికత, సహనం నేనెవరిలోనూ చూడలేదు. అదెలా అబ్బింది? అందుకు ఎలాంటి సాధన అవసరమైంది?
– ఎం.ఫిల్ లో ఉండగా అనుకుంట- నోరి నర్సింహశాస్త్రిది ఒక వ్యాసం చదివిన. సాహిత్యంలో ఎవరు నిలబడతరు? ఎవరు కనుమరుగు అవుతరు? అనేది ఆ వ్యాస సారాంశం. అప్పటినుంచి ఒక కవితను గాని.. ఒక పుస్తకాన్ని గాని అలా చూడడం అలవాటు చేసుకున్న. సాధన చేసిన. కవితను గాని, కథను గాని ఏ రచన నయినా రెండు అంశాల దృక్కోణం నుంచి చూస్త. ఆ రచన నాటి సామాజిక చలనంలో ఏ అంశాన్ని పట్టుకున్నది? అది అనేకమంది ప్రాతినిధ్య అంశంగా ఉన్నదా? రెండు- ఆ రచనలోని అభివ్యక్తి సమకాలిక అభివ్యక్తికి ఏ విధంగా భిన్నంగా ఉన్నది? కొత్తగా ఏమున్నది? ఈ రెండింటి సమన్వయంతో ఆ రచనను అంచనా కడత.అది కాల ప్రవాహంలో నిలబడతదా? కొట్టుక పోతదా ? అని చూస్త. దీనికి విస్తృత అధ్యయనం ప్రథమ సోపానం. దీనికి ఒక శిఖరాగ్రం మీద నిలబడి నిర్మమకారంగా ఆబ్జెక్టివ్ గా సాహిత్య పరిణామంలోని లోతుల్ని చూసే దార్శనికత అవసరం.
ఉస్మానియా యూనివర్సిటీ రైటర్స్ సర్కిల్ నుండి కవితా సంకలనం తేవాలని ప్రకటన ఇచ్చినం. కొన్ని మంచి కవితలు, ఎక్కువ భాగం బలహీనమైన కవితలు వచ్చినవి. వీటితో సంకలనం వేస్తె కాలం గడిచే కొద్దీ అది ప్రాధాన్యత కోల్పోతుందని అర్ధమయింది. అందుకని ’70-’80 దశాబ్ది కవితా సంకలనం తేవాలని నిర్ణయానికొచ్చిన. అట్లా ’70-’80 ఈ తరం యుద్ధ కవిత వచ్చింది. అప్పట్నుంచి నేను వేసిన, నా ఆధ్వర్యంలో ఏ పుస్తకమూ విఫలం కాలేదు. నేను ఎడిట్ చేసిన కవితలు కాల పరీక్షకు నిలబడినవి.
మీ కవిత్వంలో సూటిదనం ఎక్కువ. అందువల్ల డ్రైనెస్ చోటుచేసుకునే అవకాశముంది కదా…
– ఇప్పటి వరకు వందల కవిత్వ నిర్వచనాలు వచ్చినవి. ఏదీ సర్వసమగ్రం కాదు. నా కవిత్వంలో అనేక నిర్మాణ పద్ధతులున్నవి. సూటిదనం కూడ ఒక నిర్మాణ పధ్ధతి. ‘కవిత్వం శాశ్వత ప్రతిపక్షం’ ‘గ్రంధాలయ సింహాలకు పంజాలుండవు’… ఇట్లాంటి ఏ ఆచ్ఛాదనలు లేని వాచ్యంకాని ప్రజ్వలనాలు.
గురజాడ ‘దేశభక్తి’, శ్రీశ్రీ ‘దేశ చరిత్రలు’ చెరబండరాజు ‘వందేమాతరం’ కవితలు సూటిదనం ఉన్న కవితలు. పైకి చూస్తే ఉత్త స్టేట్ మెంట్స్ లా అనిపించే కవితలు. కవిత్వాంశ కనిపించని కవితలు. కానీ కవిత్వాంశ అంటే ఆనాటి ఒక మానవోద్వేగం పదాల వెనుక, పాదాల వెనుక ఉంటుంది. అప్పటి context లో ఉంటుంది. వీటిలో డ్రైనెస్ ఉందని ఎవరూ అనలేరు. కవిత్వ రహస్యం అర్ధంకాని వారు మాత్రమే అలా అనగలరు.
కవిత్వంలో తత్వాన్ని చెప్పడానికి ఎక్కువ ఇష్టపడతారు కదా..
– కవిత్వం ప్రధానంగా హృదయ సంబంధి. మానవ హృదయ దర్పణం మీద పేరుకపోయిన దుమ్ము ధూళిని తొలగించే హృదయ క్షాళని కవిత్వం. కొన్ని సందర్భాల్లో కవిత్వం మేధో క్షాళని కూడ. అలాంటప్పుడు కవి అనుభూతి మార్గంలో కాకుండా మరో మార్గంలో ఘనీభవించిన మేధస్సును ఛేదించాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో కవి తాత్వికుడవుతాడు. సార్వజనీన అనుభవాన్ని మాత్రమే కాకుండా సార్వజనీన ఆలోచనను ప్రతిబింబిస్తాడు. అలాంటి సందర్భంలో నా కవిత్వం తాత్విక రూపం ధరించింది. అది డ్రైనెస్ కాదు. అదొక కవితా రూపం. అది వేమన మార్గం.
కొందరు పనిగట్టుకొని మిమ్మల్ని కవిగా కాక కార్యకర్తగా ప్రచారం చేస్తూ వచ్చారని అంటారు, మీ దృష్టికి వచ్చిందా? మీరేమంటారు?
– నా అభిప్రాయాలను, దృక్పథాన్నీ (పోస్ట్‌మోడర్నిజం, అస్తిత్వవాదాల మద్దతును) అంగీకరించని వారు దానిని సూటిగా వ్యతిరేకించే లెజిటమసీ లేనివారు ఇలాంటి దుష్ప్రచారం చేసి ఉంటారు. గురజాడ ఆధునికతను అంగీకరించలేని సాంప్రదాయకులు ఆయన దృక్పథాన్ని వ్యతిరేకించే ధైర్యం లేక దొడ్డిదారిలో ఆయనను తగ్గించడానికి ఆయనను అకవి అన్నట్టే ఇది కూడా. అలాంటి దురుద్దేశ పూర్వక ప్రచారాన్ని లేశమాత్రమూ ఖాతరు చేయను.
నేను మార్క్సిజం పరిమితుల్ని ఎత్తి చూపినందుకు, తోవ ఎక్కడ అని ప్రశ్నించినందుకు, పోస్ట్‌మోడర్నిజం గురించి మ్లాట్లాడినందుకు, అస్తిత్వ వాదాలను సమర్ధించినందుకు -వాటిని నేరుగా ఎదుర్కోలేక – ఆ విధంగా ప్రచారం చేసి ఉంటారు.
ఒక ప్రముఖ ‘విప్లవ కవి’ నల్లగొండలో నా సమక్షంలోనే నాకు తాకాలనే ‘పోస్ట్ మోడర్నిజం’ తిట్టుపదం కావాలని శాపనార్థం పెట్టిండు.
ఒక ప్రముఖ సంఘనేత, ఆ సంఘ సభ్యుడొకరు మా యింటికి వచ్చినందుకు ఆయనకు పెద్ద ఉత్తరం రాసిండు. పోస్ట్ మోడర్నిజం, బహువచనం అంటున్న వ్యక్తి ఇంటికి ఎలా వెళ్ళావని. అన్ని సాహిత్య సభలకు హాజరయ్యే ఒక రాయని రచయిత ‘తోవ ఎక్కడ’ అని హేళన చేసిండు. కూచిమంచి జగ్గకవితో పోల్చి అపహాస్యం చేసిండు. జ్వాలాముఖి నాకు పెద్ద ఉత్తరం రాసిండు నీ తోవ సరికాదని. చలసాని ప్రసాద్ ‘పొక్కిలి’ మీద రివ్యూ చేయించిండు కాని ‘మత్తడి’ని రివ్యూ చేయించలేదు ఆ కోపంతోనే.
తెలంగాణ ఉద్యమ సమయంలో కూడ ఆ ధోరణి కొనసాగింది. అట్లా రెండు దశాబ్దాల పాటు నన్ను వేదనకు గురి చేసిండ్రు. కుంగిన. లేచిన. ‘దాలి’ ‘ముంగిలి’ ‘తెలంగాణ చరిత్ర’ ‘తావు’ అందుకు ప్రబల నిదర్శనాలు.
సాహిత్యంలో హత్యా రాజకీయాలు చెల్లవు.
ముంగిలి రాసేదాకా మీరు కవిగానే ప్రసిద్ధులు. ముంగిలి, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సాహిత్య చరిత్ర రాయడం ద్వారా చరిత్రకారులుగా, సాహిత్య చరిత్రకారులుగా ఎక్కువ గుర్తింపు వచ్చింది. మీకు ఏ గుర్తింపు మీద మక్కువ ఎక్కువ?
– ‘ముంగిలి’, ‘తెలంగాణ చరిత్ర’ రచన కేవలం నా చాయిస్ కాదు. కాలం డిమాండ్. ఉద్యమం డిమాండ్.
నా స్వభావంలోని బాధ్యతా తత్వ వ్యక్తీకరణ.. నా నిబద్ధతా వ్యక్తీకరణ.. అవి రెండూ తెలంగాణ అస్తిత్వ నిర్మాణంలో ఉద్యమంలో తమ వంతు పాత్రను నిర్వహించినవి. కె.సి.ఆర్ ‘ముంగిలి’ని ప్రశంసించడం, ‘తెలంగాణ చరిత్ర’ను ఆవిష్కరించడం అందుకు ఒక నిదర్శనం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడ వాటి పాత్ర కొనసాగుతున్నది. లక్షల మంది విద్యార్థులు వాటిని ఫాలో అవుతున్నరు. ఈ గుర్తింపు నాకు గర్వకారణమే.
అయినా నేను కవిత్వంతోనే ఎక్కువ తాదాత్మ్యం చెందుత. ‘దాలి’, ‘తావు’ అందుకు ప్రబల నిదర్శనాలు. కవిత్వం నా ప్రాథమ్యం (priority). కవిత్వంతోనే మొదలైన. కవిత్వంలోనే అస్తమించాలని కోరుకుంట.
సంస్థలు పెట్టడంలో, కవిత్వం ఎడిట్ చేయడంలో, కవులను ప్రోత్సహించడంలో మీరు ఎంతో సహనాన్ని చూపిస్తారు. ఎలా సాధ్యం? అదే సందర్భంలో మీ సహనం పేరు కోసమేననే విమర్శ కూడా ఉంది. ఏమంటారు?
– సహనం కొంత నా స్వభావంలో ఉన్నది. తెచ్చిపెట్టుకున్నది కాదు. కొంత కల్టివేట్ చేసుకున్నది. నా రంగు కారణంగా, రూపం కారణంగా నన్ను బాధించిన సందర్భాలెన్నో. అట్లా ఇతరుల్ని బాధ పెట్టకూడదన్న భావన నా సహనం వెనుకున్న కారణం. ఈ సందర్బంగా రెండు ఉదాహరణల్ని చెప్త- 1. స్కై గురించి నాగేందర్ ఒకసారి గొడవపడుతూ నువ్వు కవివే కాదన్నడు. నేను నాగేందర్ ను మందలించిన. ఎట్లా నిర్ణయిస్తవని. 2. వేముల ఎల్లయ్య కవిత తెస్తే అందరూ పారిపోయేవారు. అది తప్పు అని వారికి వివరించి చెప్పేవాణ్ణి.
నేను నమ్మినదాన్ని సాధ్యమయినంతవరకు విస్తృతం చేయాలనుకుంట. ఇగోయిష్టుగా వ్యవహరించేవాడికే పెద్ద పీట (కనీసం పైకయినా) వేస్తారు. సహనంగా ఉండే వాడికి చిన్న పీట వేస్తారు. ఒక్కోసారి ఏ పీటా వేయరు. అది తెలిసి కూడ, అనుభవించి కూడ సహనంగానే ఉంట.
కవిత్వం ఎడిట్ చేయడం కవుల్ని ప్రోత్సహించడంలో చూపే సహనం పేరు కోసమెట్లానో నాకు అర్ధం కాలేదు ? అందువల్ల నాకు పేరు ఎట్లా వస్తది? ఆ కవులకొస్తది. ఆ సమయాన్ని నా సొంత రచనకు వెచ్చిస్తే నాకు పేరొస్తది.
సంస్థల్ని నిర్వహించడంలో చూపే సహనం పేరు కోసమే నన్నదీ తప్పే. సంస్థలు నిర్వహించడం నాకు వెన్నతో పెట్టిన విద్య. అయినా నేను సంస్థల్ని నిర్వహించడం వదిలేసి చాలా ఏళ్ళయింది. పేరు కోసమే అయితే కొనసాగించే వాడిని కదా?
ఏ సంస్థ ఏర్పాటు, ఏ సంస్థ నడపడం మీకు ఎక్కువ సంతృప్తినిచ్చింది. ఈ క్రమంలో మీకు నచ్చిన సాహిత్యకారులు.. కార్యకర్తలు.. ఉద్యమకారులు?
– నేను (”నేను” అనేది స్వాతిశయం. ఎంతో మంది సహకారం ఉంటే తప్ప ఏ సంస్థా నడవదు. అనేక objective force లను సమన్వయ పరిచే ఒక subjective force మాత్రమే ”నేను”) ‘నడిపించి’న సంస్థల్లో ఉస్మానియా యూనివర్సిటీ రైటర్స్ సర్కిల్, శ్రీకాకుళ సాహితి, నీలగిరి సాహితి ముఖ్యమైనవి. ఈ మూడు నాకు తృప్తినిచ్చినవే. ఎక్కువ సంతృప్తినిచ్చినది ‘నీలగిరి సాహితి’. ఉస్మానియా రైటర్స్ సర్కిల్ లో అప్పటికే ప్రసిద్ధులైన వారు (నందిని సిధారెడ్డి, గుడిహాళం రఘునాధం, నాళేశ్వరం శంకరం, సలంద్ర, కందుకూరి శ్రీరాములు, జింబో, వారాల ఆనంద్, కె.ముత్యం, లక్నారెడ్డి, బోధనం నర్సిరెడ్డి, ఎస్వీ, కిషోర్, మర్రి విజయరావు, స్వామి, … వివిధ దశల్లో సభ్యులు) కాక దీని కాంట్రిబ్యూషన్‌గా వచ్చిన వాళ్ళు గుంటూరు ఏసుపాదం, కె.నరసింహాచారి. వీళ్ళిద్దరూ నాకు ప్రేమపాత్రులు. చారి లవ్‌లీ మాన్, ఏసుపాదం గొప్ప కవి. శ్రీకాకుళ సాహితిలో మహోన్నత వ్యక్తి బివిఎ రామారావు నాయుడు. స్వలాభాపేక్ష లేని నిష్కల్మష హృదయుడు. అట్టాడ అప్పల్నాయుడు గొప్ప కథా రచయిత. నేనిష్టపడే రచయిత. ఛాయారాజ్, బిఎన్.స్వామి, బి.పి.శాస్త్రి, రెడ్డి శాస్త్రి, కెవిఎన్.ఆచార్య అప్పటికే స్థిరపడిన రచయితలూ; ఆ సంస్థ కాంట్రిబ్యూషన్‌లో ఒకరు పిఎస్.నాగరాజు సున్నిత పుష్పం. ఇప్పుడు రాటుదేలి ప్రజాసాహితి సంపాదకుల్లో ఒకడయ్యిండు.
చివరగా నీలగిరి సాహితి. అస్తిత్వ వాద సాహిత్యానికి తెలంగాణలో ఇది తొలిమెట్టు. దళిత, బహుజన (బి.సి), ముస్లిం మైనారిటీ, తెలంగాణ (జలసాధన ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకుని) వాదాలకు ఇది తొలి మజిలీ. బోధనం నర్సిరెడ్డి, పగడాల నాగేందర్, స్కైబాబ, ఎం.వెంకట్, అంబటి వెంకన్న, వేముల ఎల్లయ్య, చిత్రం ప్రసాద్, కె.వెంకట్, సయ్యద్ గఫార్, గౌస్ మొహియుద్దీన్, అలీ ఈ సంస్థ వెలుగులు. వీళ్ళు ఈ సంస్థ ప్రొడక్షన్ అంటె కొందరు కస్సుమంటరు. అయినా వీళ్లందరూ ఒక్కొక రకంగా నాకు ప్రేమ పాత్రులే. కొందరు నన్ను దాటుకుని పోయిన ఉద్దండులు. రాష్ట్రవ్యాప్త ప్రసిద్ధులు. ఆయా వాదాల్లో ట్రెండ్‌సెట్టర్స్. అందుకే ఈ సంస్థ నాకు అత్యంత సంతృప్తినిచ్చింది.
*
Add comment