అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య కీర్తనలు వివిధ ఉత్సవాల్లో పోటీపడి పాడి తన్మయులౌతారు వాగ్గేయకారులు. ఈ కీర్తనలను దేవస్థానాల వారు ప్రత్యేక శ్రద్ధతో ప్రచురించి ప్రాచుర్యం కల్పిస్తారు. ఈ ప్రచురణలు పరిష్కృతమై అందుబాటులో ఉండడంతో విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు పరిశోధన చేస్తారు. పరిశోధనలు అందుబాటులో ఉండడంతో వాటిపై విమర్శ, విశ్లేషణ వెలువడుతుంది. ఇదొక చక్రం. ఇది నిరంతరం కొనసాగుతుంది.
కానీ ఇదే స్థాయిలో కీర్తనలు రాసిన బహుజన కులాల వారి రచనలకు రావాల్సినంత గుర్తింపు రాదు. వందల యేండ్ల క్రితమే రాసి, రాగతాళ యుక్తంగా కైగట్టిన ఈ కీర్తనలు ఇప్పటి తరానికి తెలియదంటే అతి శయోక్తి కాదు. అట్లా దున్న ఇద్దాసు మొదలు నిట్టల ప్రకాశరావు వరకు అతిశూద్రులు, శూద్రులు రాసిన కీర్తనలకు గుర్తింపు లేదు. ఈ కీర్తనలు ఆడియో రికార్డుల రూపంలో కూడా లభ్యంకావు. ప్రచురణ అయినప్పటికీ వాటికి ప్రచారం ఉండదు. ఇట్లా ప్రచారం లేకుండా మరుగునపడ్డ యోగి పుంగవులు దేవన నాగానందము. ఈయన నాగానంద చిద్విలాసము అనే శతకముతో పాటు, వేదాంత కీర్తనలు రాసి 1914లోనే ప్రచురించారు. అచల పరంపరలో ఎంతోమంది శిష్యులకు బయలు, ఎరుక అంశాలను బోధించాడు. ఎన్నో సరళ, సుబోధకమైన కీర్తనలు తన ఆధ్యాత్మికానుభవాన్ని రంగరించి రాసిండు. నాగానందదాసు 1846లో ప్రాంతంలో జన్మించి 1916లో చనిపోయారు. సంగీతంతో పాటు గాత్రంలో కూడా ఈయన దిట్ట. అంతేగాదు కాళహస్తి సంస్థానంలో మల్లయోధుడిగా గౌరవమందుకున్నాడు. అంటే సంగీతం, సాహిత్యం, గాత్రం, మల్లయోధుడిగా, యోగ సాధకుడిగా ఇట్లా పలు రంగాల్లో రాణించాడు.
ఇప్పటి ప్రకాశం జిల్లా (అప్పటి గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా) వేటపాలెం దగ్గరలోని రావూరి పేటలో దేవాంగ కుటుంబంలో దేవర నాగానందము జన్మించారు. ఈయన తండ్రి పేరు వీరయ్య. నాగానందము గురువు కడప జిల్లాకు చెందిన హుసేన్‌దాసు. హుసేన్‌దాసు గురువు సికింద్రాబాద్‌కు చెందిన అన్నావధూత.
‘‘ఇది శ్రీమత్ పరమహంస పరివ్రాజికాచార్యవర్యులగు శ్రీమత్ బృహద్వాసిష్ట శిద్ధాంత నిర్థారుణులయిన శ్రీమత్ పరమ భూమానంద అన్నావధూత సద్గురు స్వాముల వారి పాదారవిందమకరంద పిపన్ మత్త మనోభృంగుడగు శ్రీ హుశేన్‌దాస గురు కరుణాకటాక్ష వీక్షణ విమలీకృతానంద శ్రీ రాజరాజేశ్వరీ వరప్రసాద లబ్ధ కవితా విలాస శ్రీ రావూరి పేట నివాస దేవాంగ వంశోద్భవ దేవన వీరయ్య వరపుత్ర శ్రీ నాగానంద స్వాముల ప్రణీతంబయిన శ్రీ వేదాంత కీర్తనలు’’ అని తన వేదాంత కీర్తనలు గ్రంథ సమాపన గద్యలో పేర్కొన్నాడు. ఇందులో తాను దేవాంగ కులస్థుడు అని రూఢీగా చెప్పడమే గాక తన గురువు హుసేన్‌దాసు, ఆయన గురువు అన్నావధూత గురించి కూడా వివరంగా పేర్కొన్నాడు. అంతేగాదు నాగానందదాసు శ్రీ రాజరాజేశ్వరీ ఉపాసకుడని కూడా అర్థమయితున్నది. తన ఊరు రావూరిపేట ని గురించి కూడా చెప్పుకున్నాడు.
నాగానంద దాసు ‘చిద్విలాస నాగానందము’ అనే శతకముతో పాటు 55 వేదాంత కీర్తనలు, వేదార్థ కందార్థ దరువులకు తన గురువు హుసేన్‌దాసు కీర్తనలు, గురువుకు గురువైన అన్నావధూత జ్ఞానాష్టకము జోడించి 1914లో ప్రచురించారు. ఈ గ్రంథం కొమ్మూరి పుల్లయ్య స్వకీయ ‘‘శ్రీ కన్యకా పరమేశ్వరీ ముద్రాక్షరశాల’’ బాపట్లలో ముద్రిపించారు. ఈ ‘నాగానంద శతకము’నకు ముముక్షైక మోక్ష కంద పద్య శతకము అని కూడా పేరున్నది. అంటే అచల మతంలోని లోతైన విషయాలు గురుబోధ, బయలు, ఎరుక, గురుస్తుతి, కుల వివక్షకు వ్యతిరేకత, రాళ్లను పూజించడాన్ని నిరసించిండు. ఆకులు మేసేటి మేకలు, చెప్పులు నమిలేటి కుక్కలను ఇమేజెస్‌గా తీసుకొని కందపద్యాల్లో ‘‘సత్యానంద నాగానంద’ అనే మకుటంతో 108 పద్యాలను రాసిండు. ఇవన్నియు అచల జ్ఞానాన్ని అందరికీ పంచేందుకు చేసిన రచనలుగా గుర్తించాలి.
గురువులను స్తుతించడం, దూషణ చేసిన వారిని నిందించడం, తొమ్మిది తొర్రల కొంపను మార్మికంగా మనిషి బతుకును, కొండలు యేడు దాటుక, లింగములో లింగము, వేదంబులు జదువుటచే అనే పద్యపాదాలతో ఎఱుక కలిగించాడు. విషయాలను ‘బయలు’ పరిచిండు. ఈ ‘బయలు’ అంశంపైనే పది పద్యాలున్నాయి. ఇవన్నీ కూడా భక్తుల సందేహ నివృత్తి సన్మార్గ దర్శనం, జ్ఞాన బోధలో భాగంగా రాసినవే. ఎరుక జెప్పినవే! చాకలి, కుమ్మరి లాంటి బహుజనులను పద్యాల్లో ప్రస్తావించి బహుజన దృష్టికోణాన్ని ఆవిష్కరించారు. గురు మంత్రాన్ని బోధిస్తూనే ఉపవాసాల వల్ల వచ్చే లాభము శూన్యము అని చెప్పిండు. డబ్బు కన్నా గుణం మిన్నా అని చెబుతూ బంధు మిత్రులు సైతం అవసాన కాలంలో ఆదుకోబోరు అని చెప్పిండు. నాగానంద శతకములోని పద్యాలు చదివితే ఆయన సాహితీ ప్రతిభ తెలుస్తుంది. మచ్చుకు కొన్ని పద్యాలు.
గంగా యమునల మధ్యను
శృంగారంబైన రంగు జూచెటివాడు
ప్పొంగుచు లింగమునంటునె
దుత్సంగంబిడు సత్యానంద నాగనంద
నాదుని బిందును గూర్చుక
వాదంబులు మానిముక్తి వనితెతొనెపుడున్
మోదముజెందే వారికి
సుకసాధనమే సత్యానంద నాగనంద
గురువుల నిందెలు జేసిన
నరునికి నరకంబు గలదు నానావిధముల్
గురిలో గురి నిలిపిన హరి
సరసుడవే సత్యానంద నాగనంద
తొమ్మిది తొర్రల కొంపను
సమ్మతిగా నమ్మి తుదకు చావునుగనరే
కుమ్మరి కుండలరీతిన
సమ్మతివిడు సత్యానంద నాగనంద
కాంతల మేనులు జూచుక
భ్రాంతులు బొందెదరు మిగుల పామరజనముల్
గొంతులు గోసుక జచ్చిరి
శాంతముగను సత్యానంద నాగనంద
గురువుల నెరుగని కుక్కలు
మరుగున జేరొద్దురన్న మహిలో జనముల్
గురువుల నెరిగెటి మరుగున
సరసుడవౌ సత్యానంద నాగనంద
మేరువ శిఖరము నెక్కిన
మేరువలో రంగులన్ని మెరుగై మెరశెన్
మేరువ దాటిన ఖర్మము
చేరదురా సత్యానంద నాగనంద
ఏదారి నెరుగ నెధవలు
సాధారణముగను గురుని సరిసరిగా బహు
వాదాలు జేయు మూర్ఖుడు
సాదెట్లౌ సత్యానంద నాగనంద
రాతికి పూజలు జేసిన
మాయకులకు తిరిగి మళ్లి మాట్లాడేనా
రాయికి మరి మరి పూజలు
సేయకురా సత్యానంద నాగనంద
కుండలి బిందుని గూడిక
ముండల నేకూడుకున్న మోక్షముగలదా
రండల మారణ మేఘన
ఛాండాలౌ సత్యానంద నాగనంద
కొండలు యేడును దాటుక
దండిగ పరిపూర్ణబయలు దరిజేరుకొనే
గండము లేమియులేక
ప్రచండంబౌ సత్యానంద నాగనంద
అంగములో లింగంబును
సంగము జేసేటి వాడు సద్గురుమూర్తౌ
అంగము లింగము దెలియని
దుత్సంగంబిడు సత్యానంద నాగనంద
వేదంబులు జదువుటచే
మోదంబును బొందలేరు ముదమున వినుమా
వాదంబులుడుగ గురుఘన
సాధకుడే సత్యానంద నాగనంద
చక్కని గురుపాదంబుల
నిక్కము నెరనమ్మువాడె నిజగురుడబ్బా
మక్కువలన్నియు విడగురి
చక్కపడును సత్యానంద నాగనంద
గురువుల నెరుగని పశువులు
నరకమునకు బోతురంటి నయముగ వినుమా
గురుడేపన్నగ శయనుకు
సరిలేదుర సత్యానంద నాగనంద
ఎంతటి వారికినైనా
కాంతలనే జూచి జగము కళమించుచుండున్
కాంతను గురిలో వెల్గున
శాంతముగను సత్యానంద నాగనంద
ఎక్కడి పుత్రులు బంధువు
లెక్కడి సతిసోదరంబు లెవరికి వారే
దొక్క బడిపోవు వేళకు
చక్కపడరు సత్యానంద నాగనంద
ఇడా పింగళ నాడుల
రేచకమున గట్టి మనసు రెయిబవలొకటై
జూడ నిర్గుణ బ్రహ్మను
గనువాడిదిరా సత్యానంద నాగనంద
ఆకులు మేసేటి మేకల
జోకను ముక్తులెట్లు పొందగవచ్చున్
యీకెలు దీసిన కోడికి
చాకలు విడె సత్యానంద నాగనంద
చెప్పులు నమలే కుక్కలు
చప్పున మరి చెరుకు సార చవియేమెరుగున్
తప్పుడు వాడికి ముక్తులు
చప్పనరా సత్యానంద నాగనంద
ఆకలికన్నము బెట్టని
కాకుల కెటు ముక్తికలుగు కలియుగమందున్
చాకలి వాడై పుట్టని
చాకింతుర సత్యానంద నాగనంద
దిమ్మరి గుణములు వదలిన
కమ్మరి వాడైన ముక్తి గలయుట నిజమే
నిమ్మతి నిర్గుణధనఘన
సమ్మతిరా సత్యానంద నాగనంద
ఇరువై నాలుగు మించిన
పరతత్వంబొకటె ముక్తి పరమగురులకున్
పరిపరివిధముల గురిగన
సరిగాదుర సత్యానంద నాగనంద
అంత్యము లేనిది బ్రహ్మము
శాంతము చేగన్న వాడు జ్ఞానౌనన్నా
శాంతమువదలక బ్రహ్మను
గనుశాంతుడవే సత్యానంద నాగనంద
రావూరి పేటపురమున
దేవన వీరయ్య పుత్ర దేవర పుత్రై
దేవాయీశ్వరికృపఘన
సేవకుడే సత్యానంద నాగనంద
ఇట్లా చెప్పులు నమిలే కుక్కకు చెరుకు తీపి తెలియదనీ, గురుసేవను మించిన స్వర్గము లేదని తేల్చి చెప్పిండు.
50కి పైగా కీర్తనలు చెప్పిండు. వీటిని వేదాంత కీర్తనలు పేరిట వెలువరించిండు. ఈ కీర్తనల్లో తత్త్వ సారాన్ని పంచిండు. మచ్చుకు రెండు కీర్తనలు.
బిళహరి రాగం – ఆటతాళం
పల్లవి
మహారాజువలె కూర్చున్నాడూ
మా అన్నావధూతను జూడూ
అనుపల్లవి
మహరాజువలె మహా వాఖ్యార్థములు దెలపి
మరుపూ యెరుకలేని మహదేవ దేవూడై ॥మహా॥
చరణములు
యేడు అంతస్తుల మేడలో యేకాంత కూటమైన వీధిలో
మువ్వేటి కావాలె ముక్తికాంతను గూడి
మూడులోకములాకు మూలమై యున్నాడు॥మహా॥
నిత్యద్వైతమైనాడూ నీలజ్యోతిలో నిండీ యున్నాడు
నిత్యద్వైతమై నిఖిలాధారామై
సత్యజ్ఞానానంద సర్వాపరిపూర్ణామై॥మహా॥
ఆదికి మూలామైనాడూ ఆనాదీ నుంటి కొలువైనాడూ
ఆదీకి మూలామై ఆంతర్యభావ్యుడై
ఆది అంత్యమూ లేనీ అవధూత రాయుడై॥మహా॥
భక్తీతో జజ్ఞానామూనందీ రావూరీ పేట పురమందుండీ
ధరలోహుసేన్‌దాసు ధన్యూనీ కృపవడసి
దేవాంగ వంశ దేవన నాగనందామూ
మహారాజువలె గూర్చున్నాడూ మా అన్నావధూతను జూడు॥మహా॥
ఆరభిరాగం – ఆదితాళం
పల్లవి
శ్రీగురు చరణాంబుజములె గతియని చిత్తమూనిల చేదెన్నటికో
అనుపల్లవి
బాగుపరమానందు జెందే త్యాగై యుండేదెన్నటికో॥శ్రీగురు॥
చరణములు
తొమ్మిదికంతల తోలు తిత్తిపై భ్రమయుడిగుండే దెన్నటికో
బ్రంహ్మరంద్రమున బ్రంహ్మ కూటమున భ్రమగలిగుండే దెన్నటికో॥శ్రీగురు॥
యిడ పింగళగని సుషుమ్నాంతమున రaడియక నుండే దెన్నటికో
అండపిండ బ్రహ్మాండము తానై నిండుకనుండే దెన్నటికో॥శ్రీగురు॥
నివారసూకం కవాటమెత్తి సవారి జేశేదెన్నటికో
శివావిశాయని విశోహమస్మిని సిద్దుల జేరే దెన్నటికో॥శ్రీగురు॥
అన్నావధూతను వెన్నెల వెలుగున కన్నుల జూచే దెన్నటికో
మన్నుమిన్ను యొక సున్న జేసుకొని మహప్రభువైయ్యే దెన్నటికో ॥శ్రీగురు॥
ధరలో రావురి పేటలో నాగానందము నెరిగే దెన్నటికో
హరి హరబ్రహ్మల యండజేరుకొని అవల జేరే దెన్నటికో॥శ్రీగురు॥
చిత్తమునిలచే దెన్నటికో
తదితర కందార్థ దరువులు ఈయన కలం నుండి వెలువడ్డాయి. తెలుగు నేల అంతటా అచల సంప్రదాయాన్ని, కుల, మతాలకు అతీతంగా ప్రచారంలో పెట్టిన యోగి పరంపరలో మేటి నాగానందుడు.
నాగానందుడి గురువు ముస్లిం. తన కీర్తనల్లో దాదాపు ప్రతిపాదములో హుసేన్‌దాసుని కీర్తించిండు. గురువుని మించిన స్వర్గము లేదని చెప్పిండు. తన కీర్తనల్లో అచల పరిపూర్ణత్వాన్ని శిష్యులకు బోధించిండు. తన కంద పద్యాల్లో కుల వివక్షను నిరసించిండు. రాళ్లని పూజించడాన్ని నిరసించిండు. జ్ఞాన మార్గాన నడిచిండు. గురుపాదాలకు మించిన దైవం లేదని చెప్పిండు. నాగానందుడు గురువుని మించిన శిష్యుడిగా ఎదిగాడని ‘ఆంధ్రయోగులు’ గ్రంథంలో బిరుదురాజు రామరాజు పేర్కొన్నారు. అంతేగాదు ఈయన 17 జూలై 1916లో ‘సమాధిలో బహ్మనిష్ఠులై కూర్చుండి బ్రహ్మైక్యం పొందినారని’ రాసిండ్రు.
నాగానందుడి కీర్తనలను ఆధునిక కాలంలో ఆయన కూర్చిన బాణిలో పాటలుగా రికార్డు చేసినట్లయితే గానామృతం అందరికీ అందుబాటులోకి వస్తుంది. సాహిత్యంలో శతకాలు, కీర్తనలు, కందార్థ దరువులు, మంగళహారతులు రాసి ఔరా అనిపించిన ఈయన ప్రతిభకు గుర్తింపు, గౌరవం దక్కలేదు. ఇప్పటికైనా ఈయన రచనలకు తెలుగు సాహిత్య చరిత్రలో న్యాయమైన స్థానం దక్కాలి.
వెలుగు లోకి రాని మహానుభావులు ఎందరో ఉన్నారు గుర్తింపు కి నోచుకోక వారి రచనలు ఎవరికి తెలియకుండా అజ్ఞాతంగా ఉండటం శోచనీయం ఇకనైనా అటువంటి వారి రచనలు తెలుగులోకి రావాలని కోరుకుందాం శ్రీనివాస్ గారికి అభినందనలు