చదువే ఒక ఉద్యమం

క అక్షరం కొన్ని లక్షల మెదళ్ళను కదిలిస్తుంది.
అక్షరం అక్షరం కూడి మనిషిలోని అజ్ఞానాన్ని తొలగించి, జ్ఞానబీజాలని నాటుతుంది.  ఆ అక్షరమే విద్యా. ఆ విద్యని మనిషికి కలిగే అనేక దారిద్రాలను దూరం చేస్తుంది.  విద్య వలన కలిగిన జ్ఞానం మనిషినే కాదు, సమాజాన్ని కూడా మార్చగలదు. ఇదే విషయాన్ని బలంగా సమాజంలోకి తీసుకెళ్లిన వ్యక్తి మహాత్మా జ్యోతిబా ఫూలే,  ఆయన సతీమణి సావిత్రిబాయి.
    సర్వ అనర్థాలకు మూలం విద్యా, విజ్ఞానం లేకపోవడమే అని పూలే సిద్ధాంతీకరించాడు. పూలే జీవించిన కాలంలో ఒక బ్రాహ్మణులు మాత్రమే విద్యనభ్యసించేవారు. తద్వారా వారే ఆదిపత్యం చలాయిస్తుండే వారు. సమాజంలోని ఇతర వర్గాలను ముఖ్యంగా స్త్రీలు, దళిత, బహుజనులను జ్ఞానానికి, చదువుకు తద్వారా అధికారానికి ఆమడ దూరంలో ఉంచి, కులాల వారిగా సమాజాన్ని విభజించి, తన ఆధిపత్యాన్ని బ్రాహ్మణులు నిరంతరంగా వేళ్ళ ఏళ్లు కొనసాగ గలిగారు. వీరి ఆధిపత్యాలపై తిరుగుబాటు జెండా ఎగరేసి దళిత బహుజనుల విముక్తి కోసం క్షేత్రస్థాయిలో పూలే తన అధికార స్వరాన్ని ప్రకటిస్తూ  చేపట్టిన కార్యచరణ మొత్తం భారతదేశపు సామాజిక రంగం పునాదులను కదిపింది. తన జీవితం మొత్తం కుల నిర్మూలనను నిర్మూలించడానికి అందరిలోనూ ఉద్యమ స్ఫూర్తిని నింపిన సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే.
ఎంతో మహోన్నతుడైన మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి గురించి కవితా సంకలనాన్ని తీసుకురావడానికి ఎన్నో సంవత్సరాలు ప్రయాసపడిన వ్యక్తులు వనపట్ల సుబ్బయ్య, డా. సంగిశెట్టి శ్రీనివాస్. ఈ ఇద్దరి  పిలుపుమేరకు అనేకమంది కవులు స్పందించి తమ విలువైన రచనల్ని అందించారు. ఇందులోని కొన్ని కవితలు ఇదివరకే వివిధ పత్రికలలో వచ్చినవే. మంచి కూర్పుతో సరియైన సంపాదకత్వంతో మన ముందుకు తీసుకువచ్చిన పుస్తకమే “ధిక్కార” మహాత్మా పూలే స్ఫూర్తి కవిత్వం.
ఇప్పుడు పుట్టబోయే ప్రతి శిశువుకీ
ఫూలే గురించి చెప్పాలి
అమ్మా అనకముందే వాడి నాలుక మీద
అంబేద్కర్ బీజాక్షరమై పేలాలి.
               _ ప్రసాద మూర్తి.
నాయినా
నాలుగు బాటల కాడ నువ్వు
ఇవాళ ఉత్త విగ్రహానివే కాదు
నాలుగువేల యేండ్ల
ఈ దేశ ఆత్మగౌరవపతాకానివి
నిన్ను అందుకునుడు ఆలస్యమైoదిగాని
నువ్వు ఇక మా ఇండ్లలోనే కాదు
మా గుండెల్లోనూ పదిలమే
    _  డా. పసునూరి రవీందర్.
ఫూలే భౌతికంగా మన మధ్యన లేకపోవచ్చు. చౌరస్తాలలోని విగ్రహం నిలబడి ఉండొచ్చు. కానీ వారి ఆశయాలు ఎప్పటికీ బీసీ, ఎస్సీ, ఎస్టీల  గుండెల్లో నిలిచిపోతూనే ఉంటాయి తరతరాలకు.
మా అమ్మలైనా, అయ్యలైనా
వాళ్ల పేరు వాళ్లు రాయలేక పోతుండ్రు
ఇంకా వేలిముద్రల మూగభాషనే మాట్లాడుతుండ్రు
మా మూలవాసీ!
వస్తూ వస్తూ సావిత్రమ్మను తోడు తీసుక రా
మా అమ్మలకు సంతకమన్నా నేర్పించిపోతది
     _   తగుళ్ల గోపాల్
అప్పటి కాలంలో స్త్రీల కోసం ప్రత్యేకమైన కాలేజీలు లేవు. అయినా కూడా ఫూలే తన భార్య సావిత్రిబాయికి విద్య బోధన చేసి ఆమెను భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా ప్రధానోపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిండు. “ఉదయమిత్ర” గారు చెప్పినట్టు నిషిద్ధ భూమిలో తొలి అడుగు ఆమె / చీకటి పలక మీద / తొలి వెలుగు అక్షరమద్దిన / ఉపాధ్యాయురాలామే. “సి.హెచ్. ఉషారాణి” గారు తన కవితలో పూలు పూలుగా, రెక్కల వానగా / అక్షరాలను వెదజల్లినాడు / తొవ్వతొవ్వంతా  బతుకు తీపి రెక్కలను పరిచినాడు / లోకమంతా అతని ఆదర్శాల హరివిల్లులే. ఆ విధంగా సమాజంలో విద్య వ్యవస్థను పెంపొందించిండు ఫూలే గారు.
అంటరానితనము నవమానపరిచిన
జాతి జనుల మార్చు రాత కొరకు!
శ్రమ నమ్ముకొనుచు సాగినే చరితలో
ఖ్యాతిగల్గ నిలిచే జ్యోతిబాపు!
     _  అంబటి భానుప్రకాశ్.
1855 లో “తృతీయ రత్న”అనే నాటకాన్ని రాసి మహారాష్ట్ర అంతటా ప్రదర్శించి బ్రాహ్మనేతర ఉద్యమాన్ని ముందుకు నడిపి దళిత, బీసీలను మమేకం చేసి వారిలో ఉద్యమ స్ఫూర్తిని రగల్చి గోపాల్ బాబా వాలంగ్కర్ లాంటి వాళ్లను తొలి దళిత జర్నలిస్టులను తయారు చేశాడు. తాను నమ్మిన సిద్ధాంతాన్ని ప్రచారం చేసేందుకు తన తండ్రిని కూడా సైతం ఎదిరించాడు. “అన్నవరం దేవేందర్” అన్నట్టు “గులాంగిరిని ఎలుగెత్తి నిలిపిన ఉద్యమం / మా జ్యోతిరావు పూలే తొలి మహాత్మా” అని ఎంతో ఉన్నతంగా చెప్పారు. “గాజోజు నాగభూషణం” గారు అన్నట్టు “మనుషుల మధ్యన మొలచిన / కులాల కంచెలు కూల్చే యుద్ధంలో / కళాల్ని ఆయుధంగా మలిచిన యోధుడవు”.
“వనపట్ల సుబ్బయ్య” గారు తన కలం నుండి పదునైన పదాలను ఇలా వాడారు “నాలుగు పడగల హైందవ నాగరాజును / నాలుగు దిక్కుల్లో / నిలదీసి నిలేసిన ‘గులాంగిరి’ / కులాధిపత్య శ్రమ దోపిడీపై / ఈటెల లాంటి / అక్షరాల చెర్నాకోలతో బ్రాహ్మణీయ / పునాదుల పెకిలించిన శూద్రుడు”అంటూ ఎంతో ఆర్ధతతో చెప్పారు.
మట్టిప్రమిదలమైన మాలో
జ్ఞానచమురు పోసి
జ్యోతులుగా వెలిగించారు
ఇక
వెలుగుతూ
వెలిగించడమే మా పని.
   _  డా. తండా హరీష్ గౌడ్.
134 సంవత్సరాలు అవుతుంది మన నుండి దూరమైన పూలే గారు. ఇంకా కూడా తాను ఏర్పర్చిన సిద్ధాంతాలు మనలో ఇప్పటికి వెలుగొందుతూనే ఉన్నాయి. కుల వ్యవస్థ, మూఢనమ్మకాలను నిర్మూలించడానికి మహాత్మ జ్యోతిరావు పూలే దంపతులు అహర్నిశలు శ్రమించారు. వారు వెలిగించిన ఆ జ్ఞానదీపం ఇప్పటికీ మన దారులకు దారి చూపిస్తూనే ఉంది.
మనిషి మనిషిగా ఎదగాలంటు
భావజాల జాడల్లో నడిచి
సమాజ రుగ్మత రూపును మాపి..
చీకటి తరిమిన మహాత్ముడా ..
అందుకోవయ్య ఈ ఘన నివాళి…
ఎన్నడు మరవదు మానవాళి .
             –  జయప్రకాశ్
 ఫూలేకి కేవలం కుల వ్యవస్థ వ్యతిరేకతే కాదు, సామ్రాజ్యవాద వ్యతిరేకత, కార్మికవర్గ, రైతాంగ పక్షంగా పోరాడే అవగాహన, కార్యాచరణ ఉన్నాయి.గాంధీజీ కంటే ముందే మహాత్మునిగా జన నీరాజనాలందుకున్న జోతీరావు ఫూలే ఆదర్శాలను కొనసాగిద్దాం.
ఈ సంకలనంలో కవులు, కవయిత్రులు, కళాకారులు  కవితలు, పద్యాలు, పాటలు రాశారు. ఒక్కొక్కటి చదువుతుంటే మహనీయుని త్యాగాలు మనల్ని కదిలి వేస్తుంది. ఎన్నో చైతన్యాలను రగిలించే కవితలు కూడా ఇందులో ఉన్నాయి. సంపాదకుల  ఏడు సంవత్సరాల కృషి ఫలితం ఈ సంకలనం. ఒక వ్యక్తి పైన తెలుగులో ఇంతటి సంకలన రావడం బహుశా  ఇదే మొదటిదై ఉంటుంది. ఇందులోని కవితలు ఫూలే ను సంపూర్ణంగా వివిధ రకాల కోణాల్లో దర్శనమిస్తాయి. ఈ కవితా సంపుటి పూర్తిగా తెలంగాణ భాషలో సాగుతుంది.
ఆనాటి బ్రాహ్మణుల ఆధిపత్యంపై ఈటెల్లాంటి మాటలతో, ధిక్కార స్వరాన్ని తమదైన శైలిలో, పంథాలో, నిరసనను తెలియజేస్తూ పూలే ను ఆవాహన చేసుకుని తన ధీరత్వాన్ని, సత్యశోధనను, పోరాటపటిమను గూర్చి రాసిన కవితల హారాన్ని జ్యోతిరావు పూలే మెడలో అలంకరించారు. ఆ మహనీయుడి ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. ఫూలే అందించిన స్ఫూర్తి , పోరాట పటిమ మనమందరం కొనసాగిద్దాం . ఇంత గొప్ప సంకలనాన్ని అందించిన సంపాదకులకు అభినందిస్తూ , ఈ పుస్తకాన్ని వెలువరించడానికి కృషిచేసిన అందరికి  శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను . ఈ పుస్తకం కావాల్సిన వారు 9492765358 / 9849220321 ని సంప్రదించండి.
*

గాజోజి శ్రీనివాస్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు