చదివాక ఆమెతో మనకూ స్నేహమే!

మూడు నెలల  క్రితం హెలీన్ హాన్ఫ్  ( Helene Hanff ) పేరు నాకు తెలీదు.

ఆమె రచనల గురించి కూడా అస్సలు తెలీదు. పోయినేడు యూజ్డ్ అండ్ రేర్ పుస్తకం చదివినప్పుడు ఈ పుస్తకాల ప్రపంచంతో ప్రేమలో పడిపోయి పుస్తకాల గురించిన పుస్తకాలు ఏమున్నాయి అని కనుక్కొని  చాలా పుస్తకాలు కొన్నాను.

అదిగో ఆ పరంపరలోనే హెలీన్ హాన్ఫ్ అత్యంత ప్రసిద్ధి, ఆదరణ పొందిన 84 చారింగ్ క్రాస్ రోడ్
అనే పుస్తకం గురించి తెలుసుకున్నాను. అసలు ఆ పుస్తకం ఉత్తరాల రూపంలో రాశారని  తెలియగానే చాలా ఆకర్షణ పుట్టింది. ఎందుకంటే నాకు ఉత్తరాలు ద్వారా కథ చెప్పడం అనేది చాలా చాలా ఇష్టమైన ప్రక్రియ.

అందులో ఇక్కడ కథ కూడా కాదు.

తన జీవితంలో ఒక ఇరవై  సంవత్సరాల పాటు ఒక పుస్తకాల షాపు నడిపే వ్యక్తితో స్నేహమే ఈ కథ.

అట్లాంటిక్ సముద్రానికి  ఒక వైపు న్యూ యార్క్ లో నివసించే హెలీన్ హాన్ఫ్ మరొక వైపు లండన్ లో మార్క్స్ అండ్ కో అనే కంపెనీ లో పనిచేసే ఫ్రాంక్ డోయల్ అనే వ్యక్తితో పుస్తకాల కోసం జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఈ కథని నడిపిస్తాయి.

ఆమెకి ఆ షాపు లో పని చేస్తున్న వ్యక్తులకి మధ్య ఎలాంటి బంధాల్ని నెలకొల్పాయో అన్న సంగతులు పాఠకుడికి కూడా వాళ్ళందరూ చాలా దగ్గర అయ్యేలా చేస్తాయి.

కేంబ్రిడ్జ్ డాన్, సర్ ఆర్థర్ క్విల్లర్-కౌచ్  ఉపన్యాసాల పుస్తకాన్ని ఏదో లైబ్రరీ లో చూసిన హాన్ఫ్ ఆ పుస్తకాన్ని చదివి అందులో పేర్కొన్న అన్ని పుస్తకాలను చదవాలని నిర్ణయించుకుంటుంది.  న్యూయార్క్ సెకండ్ హ్యాండ్ షాపుల్లో అవి దొరకకపోయేసరికి కొంచెం నిరుత్సాహపడుతుంది. 

అజ్ఞాతమైన క్లాసిక్స్ ప్లస్  బ్రిటిష్ సాహిత్య శీర్షికల కోసం, Saturday Review of Literature అనే మ్యాగజైన్ లో ఒక ప్రకటన లో మార్క్స్ & కో పుస్తకాల షాప్ గురించి చూస్తుంది. తనకి కావల్సిన కొన్ని పుస్తకాల కోసం తన ఆర్థిక పరిస్థితి గురించి చెప్తుంది. తను ఆ పుస్తకం కోసం ఎంత ఖర్చు పెట్టగలదో చెబుతూ 1949 లో మొదటి ఉత్తరం రాస్తుంది.

ఫ్రాంక్ డోయెల్ ఆమెకు ఆ పుస్తకం పంపుతూ సమాధానం రాయడం తో మొదలైన ఈ ఖండాంతర స్నేహం విస్తరిస్తుంది.

కేవలం వీరిద్దరి మధ్యే కాకుండా, హన్ఫ్, అతని   ఇతర సిబ్బంది మధ్య కూడా ఎన్నో పుస్తకాల క్రిస్మస్ ప్యాకేజీల, పుట్టినరోజు కానుకల దాకా వెళ్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత బ్రిటన్‌లో ఆహార రేషనింగ్, డోన్  ప్రసంగాలు, యార్క్‌షైర్ పుడ్డింగ్ తయారు చేయడం, బ్రూక్లిన్ డాడ్జర్స్, క్వీన్ ఎలిజబెత్ కోరొనేషన్ ఇలా చాలా అంశాల మీద ఆసక్తికరమైన చర్చలు జరుగుతాయి. చివరికి 1968 లో అపెండిక్స్ ఆపరేషన్ జరిగినప్పుడు విషమించిన పరిస్థితుల వల్ల  ఫ్రాంక్ డోయెల్ మరణించే వరకూ కొనసాగింది.

1949 లో అప్పుడే రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన పిదప ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇంగ్లాండ్ లోని పరిస్థితుల తో మొదలయ్యి 1969 వరకూ సుమారు ఇరవై సంవత్సరాల హెలీన్ హాన్ఫ్- ఫ్రాన్క్ డోయెల్ లో జీవన ప్రస్థానం ఆ లేఖల్లో మనకు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది.

ఆ ఇరవై ఏళ్లలో ఎన్నో సార్లు లండన్ లో ఫ్రాంక్ ని కలిసి మార్క్స్ అండ్  కో చూడాలని ఎంతో అనుకున్నా ఫ్రాంక్ జీవించి వున్నప్పుడు హాన్ఫ్ ఆ పని చెయ్యలేక పోయింది. ఫ్రాంక్ మరణించిన తరువాత ఫ్రాంక్ కుటుంబసభ్యుల, మార్క్స్ అండ్  కో కంపెనీ యాజమాన్యం అనుమతి తీసుకుని ఆ ఉత్తరాలను లండన్ లో ఆ సెకండ్ హాండ్ బుక్ షాపు ఉన్న అడ్రస్ 84, చారింగ్ క్రాస్ రోడ్ పేరు తో పుస్తక రూపం లో ప్రచురిస్తే అది ఒక సంచలనమయ్యింది.

ఎంతటి సంచలనమంటే ఆ పుస్తకాల షాపు ఉన్న స్థలం లో ఇప్పటికీ ఒక శిలా ఫలకం శాశ్వతంగా ఉంటే.. హాన్ఫ్ న్యూయార్క్ లో నివసించిన 305 ఈస్ట్ 72వ స్ట్రీట్ దగ్గర వున్న ఎపార్ట్మెంట్ బిల్డింగ్ కి ఆమె గౌరవార్థం చారింగ్ క్రాస్ హౌస్ అని పేరు పెట్టారు. ప్రధాన ద్వారానికి దగ్గరగా ఇది 84, చారింగ్ క్రాస్ రోడ్ పుస్తక రచయిత్రి ఒకప్పటి నివాసమని ఒక బ్రాంజ్ ప్లేటు మీద ఫలకంలో రాసి వుంది.

లండన్ లో 84, చారింగ్ క్రాస్ రోడ్ అడ్రస్ లో వున్న మార్క్స్ అండ్  కో ఫ్రాంక్ డోయెల్, మార్క్స్ మరణాలతో మూతపడి తరువాత కొన్నేళ్లపాటు మ్యూజిక్ & సీడీ షాప్ గాను, చిన్న షాపింగ్ కాంప్లెక్స్ గాను రూపాంతరం అవుతుంది.  2009 వరకు అందులో ఒక మెడ్ కిచెన్ రెస్టారెంట్ కి నిలయమయింది . ఇప్పటికీ అలాగే చెక్కు చెదరకుండా ఉన్న ఆ ఐదంతస్తుల భవనం లో ఒక బెల్జియన్ రెస్టారెంట్ నడుస్తోంది.

చివరికి హెలీన్ హాన్ఫ్ ఇరవై ఏళ్ల పాటు వాయిదా వేస్తూ వచ్చిన తన లండన్  యాత్ర 1971 జూన్ లో సాధ్యమవుతుంది.

అప్పటికి 84, చారింగ్ క్రాస్ రోడ్ షాప్ ఖాళీ చేసినా ఇంకా మరమత్తు  చేయక పోవడంతో దాన్ని కూడా సందర్శిస్తుంది.  ఆ యాత్రా విశేషాలన్నీ డైరీ రూపంలో 1973 లో ది డచెస్ ఆఫ్ బ్లూమ్స్‌బరీ స్ట్రీట్‌ అనే పుస్తకం లో రికార్డు చేసింది. ఇది మరొక ఫీల్ గుడ్ బుక్. పుస్తక ప్రియులకి, ముఖ్యంగా ఇంగ్లీషు సాహిత్యంతో  పరిచయం వున్న వాళ్ళకి తెగ నచ్చే పుస్తకం. వీటికి సీక్వెల్ లా ఈ రెండు పుస్తకాలు రాయడానికి దారితీసిన  పరిస్థితులు చెప్తుంది.

చిన్న ఆత్మకథ  తరహా లో హాన్ఫ్ రాసిన Q’s Legacy మరొక ఆణిముత్యం. హెలెన్ హాన్ఫ్ పుస్తకాలు చదవటం నా మటుకు నాకు ఒక ఆప్త మిత్రుణ్ణి తయారు చేసుకోవడమే. ఆమెది చాలా చమత్కారం , విజ్ఞానం, వినోదం మేళవించిన రచనాశైలి.

ఈ పుస్తకాలు చదివాక ఫ్రాంక్ కి , వాళ్ళ షాపు లో పని చేసిన వాళ్ళకి ఎలా మంచి స్నేహితురాలు అయిందో,  అలాగే మనకి కూడా హెలెన్  మంచి స్నేహితురాలు అయిపోతుంది.

ఒక playwright గా జీవితంలో స్థిరపడదామనుకుంది.  1950 లలో సినిమా ఇండస్ట్రీ హాలీవుడ్ కి మారినప్పుడు   తను న్యూయార్క్ ని వదలడం ఇష్టం లేక అక్కడే ఉండిపోయి చిన్న పిల్లల కథలు, పత్రికల్లో వ్యాసాలు రాస్తూ వుంది.

ఇరవై ఐదేళ్ళపాటు ఎదుగూ బొదుగూ లేకుండా గడిపినా పుస్తకాల పై వుండే ఇష్టం కేవలం ఉత్తరాల్లో చెప్పుకొచ్చింది.

ఆ పుస్తకంతో ప్రపంచ ప్రఖ్యాతి గడించి ఏన్ బాంక్రాఫ్ట్ , ఆంథోనీ హాప్కిన్స్, జూడీ డెంచ్ ల తారాగణం తో సినిమాగా తీసిన  84 చారింగ్ క్రాస్ రోడ్ పుస్తకం ద్వారానే హాలీవుడ్లో తన కంటూ ఒక స్థానాన్ని సాధించుకుంది హెలీన్ హాన్ఫ్.

ఇక్కడ హాన్ఫ్ గురించి మరొక విషయం చెప్పాలి.

ఉత్తరాలు రాయడం ఆమెకి ఒక వ్యసనమో యేమో గాని తన పాఠకులు రాసిన ప్రతి ఉత్తరానికి జవాబు ఇచ్చేవారు. అందువల్ల ఆ 84 చారింగ్ క్రాస్ రోడ్డు పుస్తకాలకు రాయల్టీ కింద ప్రతి పుస్తకానికి మూడు సెంట్లు వస్తే ఆవిడ ఉత్తరం రాయడం వల్ల 6 సెంట్లు ఖర్చు  చేసే వారట.

ఈ మూడు పుస్తకాలు చదివిన ప్రతి వాళ్లు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా గడిపిన హాన్ఫ్ తో కచ్చితం గా ప్రేమలో పడి తీరతారు. ఒక ట్రయాలజీ గా భావించే  ఈ రచనల తర్వాత మరికొన్ని పుస్తకాలు ప్రచురితమయ్యాయి.

ఆమె  రచనా శైలి , సెన్స్ ఆఫ్ హ్యూమర్ కోసం ఆ పుస్తకాలు కూడా తప్పనిసరిగా చదవాలని ఉంది.

*

జీడిగుంట విజయసారథి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • *84 Charing Cross Road*

    మాన్యులు శ్రీ జీడిగుంట విజయ సారథి గారికి ( పేరు నెంబరు దగ్గర కనబడుతున్నట్టు కాపీ చేశాను. తప్పైతే మన్నించగలరు) ఇంత గొప్ప పుస్తకాన్ని నాకు పరిచయం చేసినందుకు ముందుగా ధన్యవాద పూర్వక నమస్సులు.
    🙏🏼💐

    చాలా,చాలా కాలానికి…, ఎప్పుడో యువకుడిగా ఉన్నప్పుడు, ఏ బాదరబందీలు లేకుండా, జీవితం ఇప్పటిలా నా చుట్టూతా అనుక్షణం చూపుడువేలు సారించి, నా ప్రతీ చర్యని తన కనుసన్నలతో గమనిస్తూ క్షణక్షణం కఠినమైన పరీక్షలకు గురి చేయని కమ్మటి కలలాంటి రోజులప్పుడు.., యథేచ్చగా తిండీ తిప్పలు మరిచి పుస్తకపు ప్రేమలో మునకలేస్తూ, ఆ అమృతాన్ని జుర్రుకుంటూ, భౌతికంగా కళ్ళు అలసిపోతున్నా, పుస్తకాన్ని ముద్దాడిన తృప్తితో తారల్లా కళ్ళు మెరిసిపోయిన కదలని కమ్మటి కాలమప్పుడు………. ఇదిగో, అలాంటి ఆనందంతో, సంతృప్తితో….Helene Hanff రచించిన 84 Charing Cross Road పుస్తకాన్ని నిన్న ఏకబిగిన ఉదయం మొదలుపెట్టి రాత్రి కల్లా పూర్తి చేసేసాను. ఎంత ఆనందమో……చెప్పలేను!

    ఆఫీసులో ఫైల్స్ వస్తున్నాయి, క్లియర్ చేస్తున్నాను. మీటింగులౌతున్నాయి.. అటెండ్ అవుతున్నాను. మళ్ళీ, మళ్ళీ వచ్చి పుస్తకం పట్టుకూచున్నాను. కారులో, దారిలో, డైనింగ్ టేబుల్ పై, చివరికి నీళ్లు చిప్పిల్లిన కళ్లు వత్తుకుంటున్నప్పుడు గుండెలపై……అబ్బా! ఎన్నాళ్టికిలా……..ఆత్మ పులకరించిపోయింది.. ఆ ఖండాంతరపు ప్రేమని పట్టిపట్టి చదువుకుని, అనుభూతించి. ఆమె చెప్పినట్టు…If you happen to pass by 84 Charing Cross Road, kiss it ( Marks & Co.) for me! I owe it so much….నేను పుస్తకాన్ని పదే , పదే ముద్దాడాను…పరోక్షంగా నైనా ఆ చెమ్మ తగులుతుందని!

    నర మాంసం తినే వ్యక్తిగా నటించి ప్రాముఖ్యత పొందిన సర్ ఆంథోనీ హాప్కిన్స్ Anthony Hopkins, అన్నే బాంక్ర్ఫోట్ Anne Bancroft ముఖ్యపాత్రలలో జీవం పోస్తే సెల్యులాయిడ్ మీద కూడా ఈ అజరామరమైన ఖండంతర స్నేహాన్ని రాత్రి ఉత్సుకతతో కళ్ళు విప్పతీసుకు చూసి.., డైలాగ్ టు డైలాగ్ రిలేట్ చేసుకుని విషాదమోహనంతో ఒక ట్రాన్స్ లో ఉండి పోయాను. ఒక పూల తోటలో బండరాయిలా ఆ పుస్తక పరిమళాన్ని పేజీ, పేజీకి పీల్చుకుంటూ.. పీల్చుకుంటూ, ఏ చలనమూ లేకుండా అలాగే నీళ్లు నిండిన కళ్ళతో పుస్తకం ముగింపుకొచ్చేసరికి.. మూగనైపోయాను.

    *84 Charing Cross Road* ఒక కథ కాదు. యదార్థం. వేల మైళ్ళు విడదీయ బడ్డ రెండు సాహిత్యోప జీవులను పెనవేసిన ఒక బ్రతుకు వంతెన. ట్రాన్స్ అట్లాంటిక్ స్నేహం, ఆంటిక్ పుస్తకాలపై అడుగంటని అనురాగం. ఒక మహాసాగరాన్ని దాటి రెండు ఖండాలను కలిపిన సాహిత్యపు స్నేహం…ప్రేమ. సాహిత్యం పైని ప్రేమ! పుస్తకాల పైని ప్రేమ! పుస్తకాలతో మమైకమైన ప్రేమ!!!

    చిన్న సలహా…! ముందు పుస్తకం చదివి సినిమా చూడండి. అంతే!

    మరొక్కసారి…ధన్యవాదాలు.
    🙏🏼💐🙏🏼💐🙏🏼💐

    • ఒక పుస్తకాల పిచ్చోడు తనకి ఇష్టమైన ఒక మంచి పుస్తకం గురించి చెప్పినప్పుడు మరొక పుస్తక ప్రేమికుడు ఆ పుస్తకం చదివి తనలాగే ఆర్ద్రతానంద పారవశ్యంలో మునిగి పోయి ఇలా కదా స్పందించాలని కోరుకునేది. ఎంత అదృష్టం నాది. సాహితీ సమాచార సంచిక వాట్సాప్ గ్రూప్ లో నేను గత వారం సారంగ సంచికలో సమీక్షించిన హెలీన్ హాన్ఫ్ పుస్తకాల రివ్యూ చదివాకా.. 84 Charing Cross Road బుక్కు చదవడమే కాక ఆ సినిమాని చూసి పంచుకున్న తన స్పందన చదివితే నాకు కలిగిన ఆనందాన్ని నేను నిర్వచించలేను. ముఖ్యంగా ఆయన ఉపయోగించిన ఫ్రేజ్ ‘విషాద మోహనం’ ఎంత బాగుందో మాటల్లో చెప్పలేను. బై ద వే, ఆ పుస్తక ప్రేమికుడు చిన్న సలహా కూడా ఇచ్చారు… ముందు పుస్తకం చదివి సినిమా చూడండని… ఇంకెందుకు ఆలస్యం.. గో ఎహెడ్…

      PS: నా పోస్టు ద్వారా హెలీన్ హాన్ఫ్ పుస్తకం కనీసం ఒక్కరి చేత చదివించినా చాలనుకున్నా.. ఒక పుస్తకాలో పిచ్చోడికి ఇంతకన్నా ఆనందం ఏదీ ఉండదు. అందుకే నేను వెరీ హ్యాపీస్…. నా పోస్టు సార్థకమైనట్టే..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు