గ్రామ్ ఫోన్ రికార్డర్: ఒక నోస్టాల్జియా

మార్వాడి కొట్లో

గల్లాపెట్టంత దర్జాగా

సగానికి కోసిన
భోషాణం పెట్టంత హుందాగా
డ్రాయింగ్రూంలో ఓ పక్కన
కొట్టొచ్చినట్టు కనపడేది
గ్రామఫోన్ రికార్డర్!
చెక్కపెట్టె  ముందంతా మూసిన అరలు
వాటిపై కోటు బొత్తాల్లా బుడిపెలు
ఏనుగు తొండం మీద
శబ్దమందారం విచ్చుకున్నట్లు
పల్చటి ఇత్తడి రేకు హారన్ బాక్సు
పెట్టెపై అమరిన తిరిగే పళ్లెం
దానిపై బురఖా కప్పిన పెళ్లికూతురిలా
ఎర్రటి ముఖమల్ గుడ్డ!
78 ఆర్పీయమ్ మట్టి రికార్డును హత్తుకున్న
హ్యాండ్ క్రాంక్ హేండిల్ని జర్రున తిప్పగానే
బిగసుకున్న స్ప్రింగ్ రీకాయిల్ అవుతూ
గిర్రున గింగిరాలు తిరుగుతుంటే
మట్టిరికార్డు మధ్యన చిల్లు దగ్గర మొదలై
ముల్లు వలయాలు వలయాలుగా
తిరిగి అంచులు చేరుకుంటుంది
స్టయిలస్ సూదిముల్లు రికార్డు మీదికానిస్తే
అలలమీద ఊయలూగే నావలా
శబ్ద తరంగ విన్యాసం…
భళ్ళున బద్ధలైన నిశ్శబ్దం
ఇల్లంతా కల్లాపి జల్లినట్టు
సంగీత స్వర లాహిరి సందడింపు
ఎన్నెన్నో ఒన్స్ మోర్ల  మధ్య
చెక్కపెట్టె గ్రామఫోను
పరదాల్లేని కచేరీ  వేదికయ్యేది
తాత తెచ్చిన తలత్  సూరయ్యాలు
కైసే హై అంటూ పలుకరించేవారు
సూది ముల్లు ఆనించిన మరుక్షణం
గజల్ ప్రకంపనల ప్రమోదంతో
గాంధర్వ గానమై వ్యాపించేవారు
వెండితెర తొలగేటప్పుడు
ఎస్కేప్ కాలేని ఠకీలా వాయిస్తూ
కం సెప్టెంబర్ అంటూ వెస్ట్రన్ వెంచర్స్
ఎ థౌజన్డ్ వయోలిన్స్  ఒక్కసారి నట్టింట్లో
సాగర ఘోషను మోసుకొచ్చేవి
బీజీస్ నుండి ఫ్రాంక్ సినాట్రా దాకా
ఇల్లెప్పుడూ  సౌండ్ అఫ్ మ్యూజిక్కే
పెంపుడు కుక్క పహారాలో హిస్ మాస్టర్ వాయిస్
 పాట శ్వాసకు విశ్వాస మధురిమలద్దేవి
కత్తికి రెండూ వైపులా పదునన్నట్టు
రికార్డుకి రెండూవైపులా పాటలు
కత్తికో వేటు… ప్లేటుకో రేటు
ఈ పీ లు సైతం రెండు వైపులా
పాటలు సింగరించుకొని
 నాలుగంచలా సినీ సరాగాలాడేవి
పాటల తట్ట ఇంటికి రాగానే
ఇల్లు సమూహ సందోహమయేది
గుండె గమ్మత్తుగా గుబాళించిపోయేది
పాటల పిట్ట మా అమ్మ
రికార్డులు తిరగరాస్తూ స్వర సాధనమయ్యేది
మేమంతా శ్రోతలమై పండు వెన్నెలలాంటి
పాటల ప్రహరాలకు సొమ్మసిల్లి పడుకునేవాళ్ళం
హరివిల్లు విచ్చుకునే ముందు
కిరణాన్ని తాకిన వాన చుక్కలా
సూదిముల్లు మట్టి రేణువుల మధ్య
నిక్షిప్తమైన స్వర మర్మాన్ని చవుల విప్పారుస్తూ
మట్టివాసనల మైకం కమ్మేది
అందుకేనేమో  ఇన్నిరకాల సాధనాల మధ్య
గుండెల్లో ఇంకిన
గ్రామఫోన్ జ్ఞాపకాలు
చలువ పందిళ్లల్లుకుంటాయి !
*

ఈమని కృష్ణశాస్త్రి

ఈమని కృష్ణశాస్త్రి ఆకాశవాణి వివిధ కేంద్రాలలో సీనియర్ గ్రేడ్ అనౌన్సరుగా పనిచేసారు. సంగీత కుటుంబం నుంచి వచ్చి ఆకాశవాణిలోను.సినిమాల్లోను కలిపి, 200లకు పైగా పాటలకు సంగీత దర్శకత్వం చేసారు. రేడియోకి ఎన్నో కార్యక్రమాలు చేసారు. స్వయంగా రచించి స్వరపరచిన కార్యక్రమాలకు ఆకాశవాణి వార్షిక పురస్కారాలందుకున్నారు. స్వయంగా గాయకులు కూడా
సంగీత సాహిత్యాలంటే ఎనలేని మక్కువ. పుస్తకం అంటే ప్రాణం.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • గ్రామ ఫోన్ రికార్డర్ ను కళ్ళ ముందుంచారు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు