గోపినీ కురిపించిన కానుగ పూల వాన…

ఇప్పుడు చదువుతుంటే, నేనేనా ఈ కథను రాసింది? అని  నాకే అనిపిస్తుంది.

  మర్చిపోలేని కథ…శీర్షికన గత వారం పసునూరి, అంతకు ముందు లెనిన్ ధనిశెట్టి చెప్పిన పలుకులకు మంచి స్పందన లభించింది. కొత్త తరం కథకులకు ఈ శీర్షిక చాలా ఉపయోగకరంగా ఉందని, మేలైన కథకుల అభిప్రాయాలతో పాటూ, కథకు సంబంధించిన మెళుకువలను వారు స్వయంగా చెప్పడం వలన కథకు సంబంధించిన చాలా విషయాలు తెలుసుకుంటున్నామని చాలా మంది యువకథకులు అంటున్నారు. మీ స్పందనకు ధన్యవాదాలు.

ఆ వరుసలోనే ఒక మంచి కథకుడి గురించి ఆలోచించినపుడు నాకు తట్టిన పేరు గోపినీ కరుణాకర్. తెలుగు కథల్లో నాకు నచ్చిన కథల్లో బారతం బొమ్మలు పై వరుసలో ఉంటుంది. ఒక సారి చదివితే ఎప్పటికీ మర్చిపోలేని కథ బారతం బొమ్మలు. గోపినీ రాసిన దుత్తలో చందమామ, బారతం బొమ్మలు, కానుగపూల వాన…..ఈ మూడు కథలకూ తెలుగు కథా సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. కథలు ఇష్టపడేవారు, కథా రచన ప్రక్రియ నేర్చుకునే వారు తప్పక చదవాల్సిన కథలు పై మూడు.

కథను వాగ్గేయకారుడిలా గానం చేసిన కథకుడు గోపినీ …అని ప్రశంసలు అందుకున్న కథా రచయిత. తెలుగు కథకుల్లో ఈ ప్రశంస అందుకున్న ఒకే ఒక్కరు గోపినీ కరుణాకర్. బారతం బొమ్మలు, దీపం చెప్పిన కథలు, మా తిరపతి కొండ కథలు…మూడు కథ ఇటీవలే వచ్చిన  శ్రీ బాలాజీ టాకీస్ నవల…పాఠకులను ఆకట్టుకుంది. తెలుగులో అంతర్జాతీయ స్థాయి కథకుడు, కథలు ఏవీ అంటే గర్వంగా చూపించే కథల్లో గోపిని కరుణాకర్ కథలు తప్పక ఉంటాయి.

మీరు మర్చిపోలేని కథ…..గురించి చెప్పండి సార్ అని అడిగినపుడు ….కానుగపూల వాన గురించి చెప్పారు.  వరల్డ్ క్లాసిక్ అని ప్రశంసలు ఒకవైపు… పచ్చి బూతు కథ అన్న విమర్శలు అందుకున్న కానుగపూల వాన కథ గురించి గోపినీ కరుణాకర్  స్పందన.

                                                                                   – చందు తులసి

                                                               ***

కానుగపూలవాన!

కథ రాసి ఇరవై ఏళ్ళు అవుతోంది.

ఈ కథ గురించి ఇంకా మాట్లాడుతున్నారు.ఈ కథ వెనుక కథ చెప్పమని అడుగుతున్నారు. నా పేరు

చెపితే ఈ కథనే ప్రస్తావిస్తున్నారు. నా గురించి రాస్తే ఈ కథతో మొదలు పెడుతున్నారు.

ఈ కథ వచ్చినప్పుడు నన్ను ఆకాశానికి ఎత్తినోళ్లు వున్నారు. ఇది ఒక బూతు కథ అని అధఃపాతాళానికి తొక్కినోళ్లు వున్నారు. ఇందులోని శిల్పాన్ని చూసి ఆశ్చర్య పోయినోళ్లు వున్నారు. అద్భుతం అన్న వాళ్ళు వున్నారు. ఒక విభ్రమకు లోనైన వాళ్ళు వున్నారు. కుళ్లుకున్న వాళ్ళు వున్నారు. నా మీద కక్ష కట్టిన వాళ్ళు వున్నారు. శిల్పం కథని మింగేసిందని కత్తులు దూసిన వాళ్ళు వున్నారు.

శైలి మాయ చేస్తుంది. మోహాన్ని కలిగిస్తుంది. పరవశుల్ని చేస్తుంది.పండు వెన్నెల్లో నడిచినట్టు ఉంటుంది అన్నారు.

శైలి ఎంత చెత్త కథనైన చదివిస్తుంది. ఈ కధనశైలి  మందు పెడుతుంది. మత్తెక్కిస్తుంది. మనసుని డొల్ల చేస్తుంది. అన్న వాళ్ళు వున్నారు. ఇంతలా ఈ కథ ఎందుకు పాఠకుల్ని కదిలిస్తోంది?

ఏముంది ఇందులో?ఏ కెమిస్ట్రీ జరిగింది ఈ కథలో?

చదివిన పాఠకుడ్ని పిచ్చోన్ని చేస్తోంది.

ఎందుకు?

వరల్డ్ క్లాసిక్ స్టోరీ అన్నాడు కత్తి మహేష్. కానుగ పూలవాన కథకి ముందు, తరవాత తెలుగు కథ అన్నాడు డాక్టర్ వి.చంద్రశేఖర్ రావు గారు. సంజీవిని విద్య తెలిసిన కథకుడు అన్నారు చినవీర భద్రుడు

గారు. కథా మాంత్రికుడు అన్నారు అభిమానులు.

ఈ కథ నాకు వరమైంది. శాపమైంది.

ఇరవై ఏళ్లుగా ఈ కథ చదివిన వాళ్ళు, మా తిరుపతి గంగజాతరలో అమ్మవారు పూనితే శిగ  మూగినట్టు ఊగిపోతున్నారు. ఇప్పుడు చదువుతుంటే, నేనేనా ఈ కథను రాసింది? అని  నాకే అనిపిస్తుంది. ఈ కథ ఏ క్షణాన పుట్టింది?ఏ ఆలోచన బీజం వేసింది?ఎలా కథ పురుడు పోసుకునింది?

ఇరవై ఏళ్ళ క్రితం ఒకరోజు కథకుడు,కవి,పోలీస్ ఆఫీసర్ సదాశివరావు గారికి ఫోన్ చేస్తే “నువ్వు రేపు రెడీగా ఉండు. సంగీత్ లో మంచి హాలీవుడ్ మూవీ వచ్చింది. నేను టికెట్స్ తెప్పిస్తాను. పోదాము” అన్నాడు.

“ఏం సినిమా సర్?”అని అడిగాను.

“ఫారెస్ట్ గంప్ (ఇప్పుడు అమీరఖాన్ రీమేక్ చేస్తున్న లాల్ సింగ్ చద్దా) ట్యాoహాంక్స్ హీరో. ఆస్కార్  అవార్డు వచ్చింది”అన్నాడు.

సంగీత్ లో సినిమా చూస్తుంటే పరవశానికి లోనైయ్యాను. ఆ స్క్రీన్ ప్లే కి ముగ్దుడ్ని అయ్యాను. నాకు పెద్దగా ఇంగ్లీషు రాకపోయినా ఆ సినిమా బిట్టు, బిట్టు అర్థమైపోయింది. పిచ్చిపిచ్చిగా నచ్చేసింది.

సంగీత్ లో ఓ పదిసార్లు అయినా చూసి ఉంటాను. ఆ సినిమాలో హీరో కేరెక్టర్ చాలా గొప్పగా ఉంటుంది. హీరోయిన్ కేరెక్టర్ అంతే గొప్ప విషాదంగా వుంటుంది. ఆ హీరోయిన్ పాత్ర నన్ను కదిలించింది.

ఆ సినిమాలో హీరోయిన్ బార్లో పాటలు పాడుతూ ఉంటుంది. తన శరీరాన్ని అమ్ముకుంటుంది. మనసుని మాత్రం హీరో కోసం దాచిపెడుతుంది. కదిలిపోయాను. సరిగ్గా అప్పుడు నాకు మా ఎల్లమందలో వుండే మాదిగ లక్ష్మి గుర్తుకు వచ్చింది.

ఆ ఊర్లో మా నాయుళ్లు ఉండేది నగిరి. మాదిగలు ఉండేది దిగువ మాదిగపల్లె. మా ఊర్లో మా నాయుళ్ళకు, రెడ్లుకి ఎప్పుడూ గొడవలు, ఫ్యాక్షన్స్ ఉండేవి.

రెడ్ల వైపు మాలలు, నాయుళ్ల వైపు మాదిగలు నిలబడ్డారు. ఒక రెండు,మూడు తరాల నెత్తురు ఏరులై పారింది. ఆ నెత్తురులో మాలల నెత్తురు, మాదిగల నెత్తురే ఎక్కువుగా పారింది.

మాదిగలు మా పొలాల్లో పని చేసే వాళ్ళు. మా చెరువుల దగ్గర నీరుగట్టే వాళ్ళు వాళ్లే. మా ఇళ్లల్లో జీతగాళ్ళు వాళ్లే. వాళ్ళది మాదిగపల్లె అయినా ఆరుగాలం, మా పొలాల్లో పనిచేస్తూ ఉండేవాళ్ళు.

అలా వాళ్ళతో ఒక బంధం ఏర్పడింది. మా నగిరిలో పెద్ద జీతగాడు తిమ్మయ్య. ఆయన కూతురే ఈ మాదిగ లక్ష్మీ. మహా అందగత్తె. పదహారేళ్ల వయసు సినిమాలో శ్రీదేవిలా మహా ఇదిగా వుండేది. ఆమె పొందుకోసం అర్రులు చాచే వాళ్ళు. ఎంత రెడ్లు అయినా,నాయుళ్లు అయినా,దొరలైనా.

ఆమె సౌందర్యాన్ని కామించి కామించి,అవసరం వున్నప్పుడు లొంగదీసుని, లొంగకపోతే ఆమెకు డబ్బు ఆశని చూపించి లొంగదీసుకుని, ఆమెను మార్కెట్లో వస్తువుని చేశారు. వేశ్యని చేశారు. ఆమె శరీరాన్ని అందరూ ఆబగా పంచుకున్న వాళ్లే, ఆమె మనసుని ఎవరైనా పంచుకొన్న వాళ్ళుఉన్నారా?  పోని ఆమె ఎవరికైనా తన మనసు ఇచ్చిందా? ఆమె మనసులో ప్రేమ ఉందా?

ఇంకిపోయిందా? తెలుసుకోవాలనిపించింది.

అందుకే కానుగపూలవాన కథలో ఆమెకు ఒక ప్రియుడ్ని(అగ్రకులస్థుడైన పెదబ్బను) సృష్టించి, వాళ్ళకు ఒక ఏటి ఒడ్డును సృష్టించి, వాళ్ళదైన ఒక ప్రపంచాన్ని సృష్టించి ఇచ్చాను.

నాకు అప్పుడు పదేళ్లు ఉంటాయి. ఆమెకు ఒక ముప్పై ఏళ్ళు ఉంటాయి. ఒకరోజు మా బావి దగ్గర మా చిన్నాన్న ఆమెతో రొమాన్స్ చేస్తుండగా చూశాను.

అదొక గగుర్పాటు. అలాంటి గగుర్పాటు మళ్ళీ ఫారెస్ట్ గంప్ సినిమాలో హీరోయిన్ ని చూసిన ప్పుడు కలిగింది. ఆ క్షణాన ఈ కానుగపూలవాన కథకి బీజం పడింది. అది మెల్లమెల్లగా ఫామై కథగా రూపుదిద్దుకుంది.

శైలి,శిల్పాన్ని నేను ఎన్నుకోను. ఆ కథే ఎన్నుకుంటుంది. నన్ను రాయడానికి నన్ను ఎన్నుకుంటుంది. పిచ్చుక పొదుగుకి వచ్చినప్పుడు గూడు అల్లుకున్నట్టు, నేను ఆ మూడ్ లో కథని అల్లుకుంటూ పోతాను.

ఒక రాయిలో శిల్పం బయట పడేవరకు సుత్తి తీసుకుని చెక్కుకుంటూ పోయినట్టు, నేను వస్తువులో కథ బయటపడేవరకు ఎన్ని సార్లైనా రాసుకుంటూ, దిద్దుకుంటూ పోతాను.

నాకు ఒక దృక్పధం ఉండదు. సామాజిక సృహ అస్సలు ఉండదు. నేను సమాజాన్ని మార్చడానికి రాయను.

నేను కథ రాస్తాను అంతే..!

మాదిగ లక్ష్మిని మేమిద్దరం చూశాం. ఒకరు నేను. ఇంకొకరు కత్తి మహేష్. ఐదేళ్ల క్రితం మాదిగ  లక్ష్మి చనిపోయిందని మా అమ్మ చెప్పింది. ఐదు నెలల క్రితం కత్తి మహేశు  వెళ్ళిపోయాడు.

                                                                                                                                            -కరణ్ గోపిని

కానుగపూల వాన కథ-ఇక్కడ చదవండి!

గోపిని కరుణాకర్

తెలుగు కథకి రాయలసీమ నించి "కొండంత" దీపం పట్టుకొచ్చినవాడు గోపిని కరుణాకర్. తన భాషతో తన కథనంతో వచనాన్ని వెలిగించిన వాడు.

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • తెలుగు కథ మీద ఇప్పటికీ ఈ పూల వాన కురుస్తూనే ఉంది. పీలేరు దాటే ప్రతిసారీ ఏటి దిక్కు చూపించి ” అదిగదిగో అక్కడే కానగతోపు ఉండేది. గోపీని కథా స్థలం అదే” అని పక్కన ఉన్న వాళ్ళు కానగపూల వాన చదివారో లేదో అని కూడా చూడకుండా ఉత్సాహ పడడం ఒక అలవాటు గా మారిపోయింది. తెలుగు సాహిత్యంలో చిరంజీవి ఈ కథ.

    • అవును..ఆ రోజు మనం మదనపల్లి వెళ్ళేటపుడు నాకూ చూపించి చెప్పారు..
      పూదోట శౌరీలు.

  • అద్భుతమైన కథను
    మళ్ళీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు సార్

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు