అప్పుడే వానాకాలం వచ్చేసింది. ఎక్కడో బంగాళాఖాతంలో వాయుగుండం లేచింది. నల్లనిమబ్బులు మాకొండమీదకొచ్చి వాలిపోయినాయి. చినుకుచినుకుగా ప్రారంభమైన వాన, వారం రోజులుపాటూ ఎడతెరిపిలేకుండా ముసురుపట్టుకుంది.
వానాకాలం అంటే గోతాంపట్టస్వామికి చాలా ఇష్టం. వానలో తడుస్తూ పసిపిల్లాడిలా కేరింతలు కొడుతున్నాడు. పురివిప్పిన నెమలిలా నాట్యం చేస్తున్నాడు. అతని శరీరంలోని ప్రతి అణువణువు వాన స్పర్శకు పులకిస్తోంది. ఆయన మనలాగా రోజూ స్నానం చెయ్యడు. వానొచ్చినప్పుడు మాత్రమే స్నానంచేస్తాడు. ఆకలేసినప్పుడు మాత్రమే భిక్షకు వెళ్ళి కడుపునింపుకుంటాడు. నిద్రవస్తే కుప్పతొట్టి పక్కనైనాసరే హాయిగా పడుకొనేస్తాడు. అడివిలోని జంతువుకి ఆయనకి పెద్ద తేడావుండదు.
ఆయన్ని చూస్తే నాకు చాలా విచిత్రంగా వుంటుంది. నిలువెత్తు నల్లనిరాయిని నిలబెట్టినట్టు, ఎత్తుగా, నల్లగా వుంటాడు. రెప్పలు మూసుకుపోయినట్టు నుదిటిమీద మూడు నామాలు దిద్దుకుంటాడు. జుత్తు జడలుకట్టి మోకాళ్ళవరకు వుంటుంది. ఋషులు పెంచుకున్నట్టు గడ్డం పొడవుగా వుంటుంది. మనలాగా గుడ్డలు కట్టుకోడు. గోతాంపట్టని చించి (జనపనార సంచి) దాన్ని నడుముచుట్టూ లుంగీలా కట్టుకుంటాడు.
నాలుగు మాడవీధుల్లోనే కాదు, తిరుమలకొండంతా తిరుగుతూవుంటాడు. కొన్ని రోజులు జపాల్తీర్ధంకి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకుంటూవుంటాడు. ఆయన ఎక్కడ్నుంచి వచ్చాడో, ఏ కులస్తుడో, ఏ భాష మాట్లాడతాడో ఎవరికీ తెలీదు. గోతాంపట్ట కట్టుకుంటాడు కాబట్టి ఆయన్ని అందరూ గోతాంపట్టస్వామీ అనిపిలిచేవారు. నాకు ఊహ తెలిసినప్పట్నుంచి ఆయన్ని చూస్తున్నాను. మొదటిసారిగా ఎప్పుడు చూసానో గుర్తులేదు కాని, ఒకరోజు స్కూల్కివెళుతుంటే వేదపాఠశాలకి ఎదురుగావున్న రాతిమంటపం దగ్గర కనిపించాడు. గుడిలోవున్న నామాలస్వామి నాముందు ప్రత్యక్షమైనట్టు అనిపించి వొళ్ళు జలదరించింది.
ఆ రాతిమంటపాన్ని ఎప్పుడో రాజుల కాలంలోకట్టినారు. కొండకు వచ్చిన యాత్రికులు ఆమండపంలో బసచేసేవారు. ఇప్పుడు అది పాడుపడిపోయింది. ఆ మండపాల్లో ఇప్పుడు సాధువులు, బిక్షగాళ్ళు తలదాచుకుంటున్నారు. ఈ గోతాంపట్టస్వామి కూడా పగలంతా ఊళ్ళోతిరిగి, చీకటి పడేసరికి ఆమండపంలో పడుకునేవాడు.
ఎవరో ఉత్తరాదివాళ్ళు, చూస్తే గుజరాతి బ్రామ్మల్లాగా వున్నారు. వాళ్ళంతా పొలోమని గోతాంపట్టస్వామి దగ్గరకు వెళ్ళిపోయారు. ‘‘జైబోలో మహారాజ్‌కి! జైబోలో మహరాజ్‌కి!!’’ అని అరుస్తున్నారు. చేతులుజోడించి మొక్కుతున్నారు. గోతాంపట్టస్వామిపట్ల చాలాభక్తిప్రపత్తులను ప్రదర్శిస్తున్నారు. వినయవిధేయతలను చూపిస్తున్నారు. స్వామిమెడలో చామంతుల మాలవేసారు. ఆయన పాదాలను వెండిపళ్ళెంలోకి తీసుకుని, నీళ్ళుపోసి కడిగి ఆ నీళ్ళను నెత్తిన చల్లుకున్నారు. అందరూ ఆ స్వామి ముందు సాగిలపడి దండం పెట్టుకున్నారు.
ఆ గోతాంపట్టస్వామి వాళ్ళను నవ్వుతూ పలకరించలేదు. వాళ్ళు సపర్యలు చేస్తుంటే ఆనందించలేదు. వాళ్ళని కనీసం ఆశీర్వదించనుకూడా లేదు.
వాళ్ళు పండ్లు, ఫలహారాలు నైవేద్యం సమర్పించి వెళ్ళిపోయారు. ఈయన వాటిని మాత్రం నవ్వుతూ స్వీకరించాడు. అక్కడున్న బిక్షగాళ్ళకు, సాధువులకి మొత్తం పంచేసాడు. తన కోసం ఒక్క పండును కూడా వుంచుకోలేదు.
అక్కనుంచి లేచి నేరుగా కోమటోళ్ళసత్రం దగ్గరికి వెళ్ళాడు. ఆ సత్రంలో పెళ్ళిజరగినట్టువుంది. అందరూ భోజనాలు చేసిలేచారు. ఎంగిలి విస్తళ్ళు తీసుకొచ్చి గొల్లక్రిష్టయ్య సందుదగ్గరున్న కుప్పతొట్టెలో పడేసారు. ఆ విస్తళ్ళకు వీధికుక్కలు ఎగబడ్డాయి. వాటితోపాటూ ఈ స్వామి కూడా ఆ ఎంగిలి విస్తళ్ళను పంచుకున్నాడు.
అరటిఆకుల్లో మిగిలిపోయిన పప్పన్నం, మజ్జిగ మెతుకులు, లడ్డూతాలూకు బూందీని ఇంకో ఆకులోకి తీసుకుని దాన్ని పరమాన్నంలాగా తిన్నాడు. అలా నా కళ్ళల్లో పడ్డాడు గోతాంపట్టస్వామి.
ఇంకొకరోజు ఏమైందంటే? అది చలికాలం. ఆరోజు గురువారం కావటంతో పొద్దున్నే మూడు గంటలకు లేచి మా జేజితాత ఆవు దగ్గరకెళ్ళి పెద్ద రాగిజెంబు నిండా పాలు పిండి ఇస్తే, గుళ్ళో దేవుడి అభిషేకం కోసం తీసుకెళుతున్నాను. అప్పుడు మాకు ఆవులువుండేవి. గురువారం పిండినపాలు ఒక్క చుక్క కూడా టీ అంగడికి వాడటానికి వీల్లేదు. పిండిన పాలన్నీ అభిషేకానికే పంపించేసేవాళ్ళం.
సన్నగా మంచుపడుతోంది. చలి ఎముకల్ని కొరికేస్తోంది. ఆ చలిలో లేచి చన్నీటి స్నానంచేసి, పాలు తీసుకొని గుడికి బయలుదేరాను. వీధిలైట్లు చిక్కగా మెరుస్తున్నాయి. తీర్థకట్ట వీధిలోనుంచి చెక్కమెట్లమీదనుంచి కిందికిదిగి, గుడిప్రహరీగోడకు ఆనుకునివున్న సందులోకి అడుగుపెట్టాను. అక్కడక్కడ యాత్రికులు పలుచగా తిరుగుతున్నారు.
గుళ్ళో సుప్రభాతసేవ జరుగుతోంది. అర్చకులు సుప్రభాతాన్ని ముక్తకంఠంతో ఆలాపిస్తున్నారు. తిరుమలకొండంతా వున్న మైకుల్లోనుంచి ఆ సుప్రభాతం వినిపిస్తోంది. ఆ పొద్దుటిపూట వాతావరణం చాలాఆహ్లాదకరంగా వుంది. భక్తిభావం నలువైపులా అలుముకునివుంది.
ఆ సందులోనుంచి కోనేటికట్టదగ్గర కుడివైపుకి మలుపుతిరిగి గుడిముందు కొచ్చాను. గుడిముందు చెక్కతేరువుంటుంది. ఆ తేరుని ఇనుపరేకులతో వేసిన షెడ్డులో వుంచారు. ఆ తేరుదగ్గర కొంతమంది బిక్షగాళ్ళు, పరషోళ్ళు పడుకుని నిద్రపోతున్నారు. వాళ్ళమధ్య ఈగోతాంపట్టస్వామి కూడా నిద్రపోతున్నాడు. కాళ్ళని డొక్కలోకి ముడుచుకుని ఆ చలిలో వొళ్ళు మరిచి నిద్రపోతున్నాడు.
ఎవరో బాగా డబ్బున్న వాళ్ళులాగా వున్నారు. సుప్రభాత దర్శనానికి వెళ్ళి అప్పుడే గుళ్ళోనుంచి బయటకు వచ్చారు. ఆడవాళ్ళు పట్టుచీరలు కట్టుకున్నారు. వాళ్ళవొంటిపై బంగారునగలు ధగధగా మెరిసిపోతున్నాయి. మగవాళ్ళు పట్టుపంచెలు కట్టుకున్నారు. పైన షర్టు వేసుకోలేదు. గుళ్ళో అర్చకులు సమర్పించిన పట్టు శాలువా కప్పుకున్నారు. స్వామి దర్శనమైనందుకు చాలా ఆనందంగా వున్నారు. సంతృప్తిగా వున్నారు.
వాళ్ళు అలా నడుచుకుంటూ తేరు దగ్గరకు వచ్చారు. వాళ్ళలో ఒకఅతను గోతాంపట్టస్వామిని గమనించాడు. ఒక్కక్షణం ఆగిచూసాడు. అతనితోపాటూ నడుస్తున్న వాళ్ళుకూడా ఆగిపోయారు. అతను వెళ్ళి తనుకప్పుకున్న పట్టు శాలువాను గోతాంపట్టస్వామికి కప్పాడు. ఒక్కసారిగా నిద్రాభంగం అయినట్టు స్వామి ఉలిక్కిపడి లేచాడు. చిరాకుపడుతూ వొంటిమీద కప్పిన శాలువాను తీసి విసిరేసాడు. మళ్ళీ అటువైపుకి తిరిగి, కాళ్ళని డొక్కలో ముడుచుకుని పడుకున్నాడు. అంతలోనే మత్తుమందు చల్లినట్టు ఆదమరిచి నిద్రపోయాడు.
గోతాంపట్టస్వామికి అటువైపు ఒకఆవు, దూడా, రెండు కుక్కలు, తేరుమీద కొన్ని పావురాళ్ళు నిద్రలో జోగుతున్నాయి. సకలజీవరాసులమీద మంచు సన్నగా కురుస్తోంది.
అప్పుడప్పుడే వసంతకాలం అడుగుపెట్టింది. ఆకులురాల్చేసిన చెట్లు చిగుళ్ళు తొడుగుతున్నాయి. పూలుపూస్తున్నాయి. చుట్టూవున్న కొండలు పచ్చపచ్చగా నవ్వుతున్నాయి. గాలి అడవిలోనుంచీ ఒకపరిమళాన్ని మోసుకొచ్చి అందరికి పంచు తోంది. ప్రకృతి వొంటికి పూసుకునే సుగంధం యొక్క తాలూకు పరిమళం అది.
ఆ పరిమళాన్ని ఆస్వాధిస్తూ, మా స్కూల్ముందున్న రోడ్డుకి అటూ ఇటూ గుబురుగావున్న సంపెంగె చెట్లకిందనుంచి నడుస్తూ స్కూల్‌కి వెళుతున్నాను. అక్కడొకటి, అక్కడొకటి పూలు రాలిపడుతున్నాయి. రోడ్డంతా సంపెంగపూలు పరుచుకుని వున్నాయి.
రోడ్డుమీద రాలుతున్న పూలను ఏరుతూ కనిపించాడు గోతాంపట్టస్వామి. రాలుతున్న పువ్వుని పసిబిడ్డని పట్టుకున్న దోసిట్లోకి పట్టుకుంటున్నాడు. స్కూల్ పిల్లల పాదాలకింద నలిగిపోకుండా ప్రతిపువ్వుని జాగ్రత్తగా కాపాడుతున్నాడు. అలా ఏరుకున్న పువ్వుల్ని స్కూల్‌కి వెలుతున్న ఆడపిల్లలకి ఇస్తున్నాడు. ‘‘నాకు ఇవ్వు స్వామి పూలు! నాకు ఇవ్వు స్వామి పూలు!!’’ అని ఆడపిల్లలంతా ఆయన చుట్టూ ఎగబడి పూలని తీసుకుంటున్నారు. అమ్మాయిల మధ్య ఆయన ఒక పూలచెట్టులా మారిపోయాడు. ఎవరికి కావాలసిన పూలు వాళ్ళు కోసుకుంటున్నారు.
ఒకసారి మండే ఎండల్లో కాళ్ళకి చెప్పులు లేకుండా తారురోడ్డు మీద నడుస్తూ కనిపించాడు గోతాంపట్టస్వామి. అప్పుడు నాలుగు మాడవీధుల్లోనా తారురోడ్డు వుండేది. ఎండకు తారు కరిగిపోయి పొగలు కక్కతావుండేది. అగ్నిగుండం మీద నడిచినట్టు వొట్టికాళ్ళతో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు. పాదాలు బొబ్బలెక్కి పుండ్లుపడేవి. అయినా చెప్పులు వేసుకునేవాడుకాదు. నీడ కోసం గొడుగుపట్టుకునే వాడుకాదు.
ముఖంలో ఎలాంటి బాధవుండేదికాదు. ఆ వేసవికాలం శృంగేరిపీఠాధిపతి వేసవి విడిది చేయటానికి తిరుమలకొండకు వచ్చాడు. ఉత్తరమాడవీధిలో శృంగేరిమఠం వుంది. ఆ మఠంలో దిగాడు. ఆయన ప్రతిరోజు తన బృందంతో నాలుగు మాడవీధుల్లోనా భజన చేసుకుంటూ వెళ్ళి, గుళ్ళో దేవుణ్ణి దర్శనం చేసుకునేవాడు.
ఒకరోజు దేవుణ్ణి దర్శనం చేసుకుని దక్షణమాడవీధిలో భజన చేసుకుంటూ వస్తుంటే, శృంగేరిపీఠాధిపతి ఈ గోతాంపట్టస్వామిని చూసాడు. భగభగామండే ఎండల్లో గోతాంపట్టస్వామి వొట్టికాళ్ళతో నడవడం గమనించాడు. ఎవరో ఆదేశించినట్టు ఆగిపోయాడు. తన బృందం కూడా ఆగిపోయింది. ఆ శృంగేరి పీఠాధిపతికి తను చేస్తున్న తప్పు ఏంటో అర్ధమైంది. తనకి ఎండ తగలకుండా ఒకశిష్యుడు తాటాకుగొడుగు పడుతున్నాడు. కాళ్ళకు పావుకోళ్ళు వేసుకున్నాడు. ఒక్కసారిగా గొడుగుపడుతున్న వాడ్ని పక్కకు వెళ్ళిపొమ్మన్నాడు. పావుకోళ్ళని వదిలేసాడు. గోతాంపట్టస్వామి దగ్గరకెళ్ళి రెండుచేతులు జోడించాడు.
‘‘స్వామి… పవిత్రమైన ఈ తిరుమల కొండమీద పావుకోళ్ళు ధరించాను. నీడకోసం గొడుగుపట్టుకున్నాను. ప్రకృతిలో ప్రతి ఋతువుకి ఒక ధర్మం వుంటుంది. సృష్టిలో ప్రతి జీవరాశి ఆ ధర్మాన్ని పాటించి తీరాలి. అప్పుడే భగవంతునికి దగ్గరవుతాము. నా తప్పుని క్షమించుస్వామి! ఈరోజునుంచి తూచ తప్పకుండా ఋతుధర్మాన్ని పాటిస్తాను’ అని పావుకోళ్ళను, గొడుగుని, విసర్జించాడు.
ఇదేమీ పట్టనట్టు తన లోకంలో తను వున్నాడు గోతాంపట్టస్వామి.
Add comment