ఎంత పెద్ద చెట్టు అయినా చిన్న విత్తనం నుంచే పుడుతుంది. డాక్టర్ ఎం.ప్రగతి రాసిన ప్రతి ఫెయిల్యుర్లో ఓ గెలిచే దారి, A Journey into Chem-search పుస్తకం నాకొక విత్తనంలాగా అనిపించింది. ‘Investigations on DNA Binding and Cleavage Activity of Mono & Dinuclear Transition Mental Complexes’ అనే ప్రగతి రాసిన పరిశోధనా వ్యాసం, ఈ విత్తనానికి మూలమైన వృక్షం. డాక్టరేట్ డిగ్రీ సంపాదించే క్రమంలో ప్రగతి జీవన ప్రయాణం, తన పరిశోధన, అనుభవాలు సూక్ష్మలో మోక్షంలాగా 52 పేజీల చిన్న పుస్తకంగా మనకి అందించారు.
డాక్టరేట్ పొందడం ఒకవిధంగా చాలా కష్టమైన పని. పొద్దస్తమానం అదే ధ్యాసలో వుండి పని చెయ్యాలి. పూర్తిగా మనసుని దానిపైన లగ్నం చేసి పనిచేసుకుంటూ పోవడమే. అయితే, డాక్టరేట్ సాధించడం చాలా సులువైన పనే. ఏమీ చెయ్యకుండా ఉత్తుత్తినే వుండికూడా డాక్టరేట్ తెచ్చుకుని, శాలువాలు కప్పెట్టేసుకుని పేపరుకి ఎక్కిన వాళ్లసంగతి అప్పుడప్పుడూ వింటాం. కార్బన్ వాలన్సీ తెలీకుండా కెమిస్ట్రీలో; వేమన పద్యం ఒక్కటి కూడా రాకుండానే తెలుగులో; ఇండికా గ్రంధం ఎవరు రాశారో తెలీకుండా హిస్టరీలో PhD సంపాయించేయొచ్చు. అలాంటి మార్గాలు వున్నాయిఅని నిజాయితీగా ఒప్పుకోవడానికి మరీ సిగ్గుపడే అవసరంలేదు ఇవాళ!
ఆయా సంఘటనల గురించి పిచ్చాపాటీ ఫేస్బుక్ చర్చలో మాట్లాడుకుంటూ, అసలు థీసిస్ రాయడం ఎంత కష్టమో అనుభవం వున్నవాళ్ళు, దాని మంచిచెడ్డలు రాస్తే బాగుంటుంది అని నేను కాజువల్గా పోష్టు పెట్టాను. స్పందనగా, ప్రగతి ఏకంగా పది ఎపిసోడ్ల సుదీర్ఘ వ్యాసం రాసి, ఎలాగో సమయం చేజిక్కించుకుని ఆ వ్యాస పరంపరని చక్కగా అచ్చులోకి తెచ్చారు. ఆ పుస్తకంలో కనీసం నాలుగు చోట్ల నా పేరు వుండటం అనే వ్యక్తిగత ఆనందాన్ని పక్కన పెడితే, ఏకబిగిన బుక్ రూపంలో చదివాక, చాలా ఆశ్చర్యానికి లోను అయ్యాను. ప్రగతి ఒకటిరెండు సార్లు మా ఇంటికి వచ్చారు. నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తి మాట్లాడుతారు. ఏ సమయంలో అయినా మిక్కిలి అందుబాటులో వుంటారు. ఆమెకన్నా చాలా చిన్నవాడైన ఒక కవిగారు ఆమెని ఏకవచనంలో పలకరించడం నేను ఒకసారి విన్నాను. తానొక డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ అనే విషయం ఆమెకి ఎప్పుడూ గుర్తువుండదు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరితో కలిసిపోతారు. ఇదంతా ఆవిడ మంచితనం. తగ్గించుకొనువారు హెచ్చించబడుదురు. ప్రగతి పట్టుదలకి తగిన అవకాశాలు వుండి వుంటే, ఏ అమెరికాలోనో, జర్మనీలోనో పెద్ద శాస్త్రవేత్త అయివుండే స్థాయి ఆమెది అని ఈ పుస్తకం చదివాక గ్రహింపుకు వచ్చింది.
పిహెచ్డి అందని ద్రాక్షనా? అంటూ తన వ్యాసపరంపర మొదలు పెట్టి, అడ్మిషన్ దారి పడటం, ప్రయోగశాల ప్రవేశం, సమూహంతో కలిసి పరిశోధనలల్లో పాల్గొనడం, థీసిస్, పేపర్ సబ్మిషన్, వైవా మొదలైన అన్ని విషయాల గురించీ చెప్పారు.
ఆధిపత్య కులంలో పుట్టినందుకు వివక్షలు ఏవీ ఎదుర్కోలేదు, జెండర్ పరంగా అమ్మ వైపు నుంచి విద్యావంతులైన మహిళల్లో నేను నాలుగో తరపు వారసురాలిని అంటారు ప్రగతి. కాబట్టి చదువు నల్లెరుమీద నడక కావడంలో ఆశ్చర్యం లేదు. ప్రగతి డాక్టర్ కావాలని కోరుకున్నారు. ఎంసెట్ పరీక్షలో సరైన ర్యాంక్ రాని కారణంగా మెడికల్ డాక్టరు కాలేక పోయారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, జూవాలజీ ప్రధాన అంశాలుగా డిగ్రీ పూర్తీ చేశారు. ఆంధ్రాలో అప్పట్లో సాధారణ మధ్య తరగతి కుటుంబాల్లో హిందీ పరిక్షలు కట్టడం (ఇది ముఖ్యంగా పై సామాజిక వర్గంలో వుండేది) టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకోవడం, డిగ్రీ పూర్తీ కాగానే బీ యిడి చెయ్యడం విద్యార్ధుల తప్పనిసరి కార్యకలాపాలు! ప్రగతి టైప్ షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నారో లేదో తెలీదు. కానీ, వున్నత విద్యని పక్కన పెట్టి టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి బుద్ధిగా టీచరు పోస్టు సంపాయించేసి, బాధ్యతగల తెలుగింటి అమ్మాయిగా పెద్దలను ఆనందింపచేశారు. సర్వీసులో మొదటి ఐదేళ్ళు పూర్తిఅవుతూనే జూనియర్ కాలేజీ అధ్యాపకురాలిగా, ఇంకో ఐదేళ్లకి డిగ్రీ కాలేజీ అధ్యాపకురాలిగా ప్రొమోషన్ సంపాదించారు. 2006 శ్రీ కృష్ణదేవరాయ యునివెర్సిటీ అర్సెట్ నోటిఫికేషన్ ప్రగతి ఎప్పటికైనా సాధించాలని ఆశించిన లక్ష్యాన్ని నెరవేర్చుకునే అవకాశం ఇచ్చింది.
లక్ష్య సాధనలో అనేక కష్టాలు ఎదురు అవుతాయి. ఆయా బాలారిష్టాలు, కష్టాలు గురించి చెబుతూనే వాటిని ఎలా ఎదుర్కున్నారో, ఎవరెవరు సహాయం చేశారో, చదువరిలో ఉత్సాహం కలిగించే రీతిలో ఈ పుస్తకంలో వివరణ ఇచ్చారు.
“అసలు ఏ చదువైనా డిగ్రీ పట్టా తూలూకు ఓ కాయితం ముక్కేనా? అంతకు మించిన అనుభూతులతో కూడిన ప్రయాణం కాదూ?”అంటారు ప్రగతి.
పరిశోధన పరంగా సైన్సు మిగిలిన సబ్జక్ట్స్ కన్నా భిన్నమైనది. ప్రయోగ విధానం ద్వారా జరిగే ఈ పరిశోధనకు కావలసిన ఓపిక ఎవరికైనా అంత తేలికేం కాదు. అలానే కష్టమూ కాదు అనేది ప్రగతి భావన. ఫలితాల్లో విజయాల కంటే ఫైల్యుర్స్ ఎక్కువ ఎదురు పడతాయి. కానీ, ప్రతి పరాజయం నుంచీ గెలిచే దారి వెతుక్కోవచ్చు అని ప్రగతి తన పరిశోధనా క్రమంలో జరిగిన సంఘటనలు చదువుతూ వుంటే మనకు అర్ధం అవుతుంది.
పుస్తకం ద్వారా మొత్తం ప్రయోగాలు చాలా క్లిష్టమైనవి అని తెలిసింది. నేను అర్ధం చేసుకున్న విధానం ప్రకారం, ఉలవ చారు తయారు చేయడానికి, వులవల్ని పదిసార్లు కడగాలి. ఇరవై గంటలు నానబెట్టాలి. ఇరవై విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టాలి. ఇంకా చాలా ప్రాసెస్ చెయ్యాలి. మొత్తం అయినాక రుచికరమైన వంటకం తయారు అవుతుంది. ఉలవచారు ఏడాదికి ఒకసారో, రెండుసార్లో చేస్తే గొప్ప. రసాయన శాస్త్ర పరిశోధన అంటే, ప్రతిరోజూ ఉలవచారు వండటం లాంటిది. ప్రగతి ఎంచుకున్న రసాయన పరిశోధనలో రకరకాల లైగాన్డ్స్, స్పటికాలు తయారు చేయాలి. గంటలు గంటలు వాటర్ బాత్, మాగ్నటిక్ స్టిర్రార్ సహాయంతో వండి వార్చిన తరవాత, కోరిన ప్రోడక్ట్ ఏర్పడనూవచ్చు. ఏర్పడకపోవచ్చు. కానీ, పట్టుదలతో పదే పదే అదేపనిగా కృషి చేస్తే, పరుసువేది పట్టుబడుతుంది అనేది ప్రగతి మనకి పుస్తకం ద్వారా ఇచ్చిన సందేశం.
ఈ కథనంలో స్వచ్చత, నిజాయితీ, ఆర్ద్రత వున్నాయి. అలాగే ఈ రచన వ్యక్తీకరణలో మంచి హాస్యం, హేతుబద్ధత, జీవన తాత్వికతలు కూడా మేళవించి వున్నాయి అంటారు ఈ పుస్తకం గురించి డా.నాగసూరి వేణుగోపాల్.
PhD చేసే క్రమంలో విద్యార్ధులకు బోలెడు సందేహాలు వస్తాయి. వాటిలో కొన్నింటికి సమాధానాలు ఈ పుస్తకంద్వారా దొరుకుతాయి. ఇది కేవలం రసాయనశాస్త్ర విద్యార్థులకే కాకుండా ఇతరులకు కూడా పనికివస్తుంది. ఈ పుస్తకమొక విత్తనం. సారవంతమైన నేల, గాలి, నీరు, ఎరువు పడితే మొలకెత్తి కొత్త పరిశోధనాంశాలను గుత్తులు గుత్తులుగా కాస్తుంది.
*
థ్యాంక్యూ కృష్ణా! చాలా ప్రేమగా రాశారు.
Enjoyed writing this mam
Thank you