గెడ్డలో స్వామి

పెందుర్తి కథలు  -3

..ఫాట్ మని క్రికెట్టు బంతి ఒకటి వొచ్చి స్వామీజీ భుజానికి తగిలింది.

‘ అమ్మ నీ యమ్మ ..’ అనేశాడు అలవాటైన బూతుమాటతో.

భుజమంతా ఎర్రగా ఆయిపోయింది, తెల్లని అతని శరీరం మీద యెర్రని మచ్చ.

తనకు తగిలిన ఆ బాల్ తీసుకొని బయటకి వొచ్చి ఆ గుంటల కేసి కోపంగా చూసాడు, ఏమైనా అంటే బాగోదు అనవసరమైన రగడ, ఈల్ల అమ్మా బాబులతో అనుకోని, ఒక దిక్కుమాలిన నవ్వు మొహం మీదకు తెచ్చుకొని నవ్వి అక్కడ కిరికెటు ఆడుతున్న గుంటలను దగ్గరకు పిలిచాడు.

బాల్ ఇమ్మనట్లు చూసారు గుంటలిద్దరూ.

‘ఇస్తాను గానీ కాసేపు అలా కూర్చొని మాట్లాడుకుందాము, మీ ఇద్దరే క్రికెట్టు ఆడుకుంటున్నారు ఇంకెవరూ లేరా ?’

‘వున్నారు ఆళ్ళు టీవీలో వొచ్చే కిరికెటు మాచి చూస్తున్నారు అన్నారు గుంటలు.

చాలా రోజులనుంచి మాట్లాడేవాళ్ళు లేక తన

హితబోధలు వినేవాళ్ళు లేక స్వామి మనసు చిరాగ్గా వుంది, కాసేపు ఈ గుంటలతో కాలక్షేపం చేస్తే సరి అనుకున్నాడాయన.

ఆ పాక దగ్గర నుంచి చూస్తే రోడ్డు చివరి వరకు గెడ్డ పోరంబోకు స్థలమే, ఆదివారం కదా ఈ గుంటలు క్రికెట్టు ఆడుతున్నారు.

స్వామి చుట్టూ  ఎర్రమట్టి నేల, చెద తొందరగా పట్టేస్తాది ఈ నేలలో, ఈ కమ్మలు, చెక్క అన్నీ చెద తినేస్తాది. తొందరగా ఏదోకటి చేయకపోతే తానూ చెదపట్టేస్తాడు.

అరవై గజాల స్థలంలో ఈ పాక  వేసుకుందుకు ఆ ఊరి ఎమ్మెల్యే తమ కులపోడే అవకాశం ఇచ్చాడు. వాస్తు, జ్యోతిష్యం చెప్పడం వొచ్చు కాబట్టి ఇక్కడేమైనా పని అవుతుందేమో అని టవును  నుంచి వొచ్చి ఇక్కడ దిగబడ్డాడు.

స్వామి వయసు నలభై అయిదు దాటి ఉంటుంది, తెల్లగా బొద్దుగా వున్నాడు. లోపల మండిపోతున్నా మొహం మీద తరుచూ వొచ్చే చెరగని చిరునవ్వు.

‘రండి ఈ గడ్డి మీద కూర్చొని మాట్లాడుకుందాం ‘ అన్నాడు.

గుంటలు కూడా కుర్చున్నారు,

ఇద్దరికీ పద్నాలుగేళ్ళ ఉంటాయి , అందులో ఒకడి పేరు బారికి అప్పల్నాయి డు , మరొకడి పేరు గుబ్బల గిర్నాదు.

గిర్నాదుకు వెటకారం ఎక్కువ. అప్పుకు ఆసక్తి ఎక్కువ.

ముగ్గురూ అక్కడున్న గెడ్డ పక్కన పచ్చికలో కూర్చున్నారు, స్వామి ఉంటున్న కమ్మలపాక పక్క  నుంచి కొండలమీద నుంచి వొచ్చే గెడ్డ నీరు వెళ్తుంది.

‘మీరెక్కడుంటా ర్రా?’ స్వామి అడిగారు .

‘ఆ రైల్వే స్టేషనుకాడ  కర్షకశక్తి నగర్లో ఉంటాము ‘ చెప్పారు గుంటలు.

‘బాగుంది, ఓహో .. అలాగా ‘ అని చె ప్పీసి

స్వామి చేతిలో ని కిరికెటు  బాలు వాళ్లకు చూపిస్తూ ‘ఇదిగో మీకు కొన్ని మంచి విషయాలు చెప్పాలనిపిస్తోంది చెప్పనా?’ అన్నాడు.

‘ చెప్పండి కానీ, ఆఖర్లో మా బాలు మాకు ఇ చ్చీయండి ‘ అన్నాడు అప్పల్నాయిడు.

‘నా దగ్గర క్రికెట్ బేట్లు, టెన్నిస్ బేట్లు, బంతులు చాలా ఉండేవి ‘ అన్నాడు స్వామి.

‘ మీరు ఆడీవోరా ‘ అన్నారు గుంటలు.

‘ లేదురా నాకు వీటిని అమ్మే షాపుండేది ‘

చిత్రం: ఆనంద్

‘ మరి అది వొదిలేసి ఈ గెడ్డ పక్కకు వొచ్చారేంటి ‘ అన్నాడు గిర్నాధ్.

‘ఇప్పుడు కాదురా.. ఎప్పుడో అయిదేళ్ల క్రితమే వొదిలేసాను షాపు, ఆ తర్వాత మనూర్లో ఒక పెద్ద స్వామీజీ దగ్గర శిష్యరికం చేశాను, ఆయనకు ప్రియ శిష్యుడిని నేనే, కానీ అది మిగతావాళ్లకు నచ్చక ఆక్క డ చాలా పెద్ద గొడవలయి పోయాయి, దాంతో  ఇలాగ మీ ఊరొచ్చీసాను.’ అన్నాడు.

గుంటలకు  క్రికెట్టు బంతి చూపిస్తూ ‘ ఇదంతా భూమండలం.. భూమి విలువైనది, సంపద కలది, దానిని ఎవడైతే గౌరవిస్తాడో ఆడు కోటీశ్వరుడు అవుతాడు, ఆరడుగుల నేల చాలు అని అంటాము గాని ఒట్టిదే, మనకు ఎంత నేల ఉంటే అంత గౌరవం, దానికోసం చదువుకోండి, సంపాదించండి, ఊర్లు దాటిపోండి  యేటి అర్ధమయ్యిందా ?మీ లేత టెంకాయలకి  ‘ అన్నాడు .

గుంటలు ఇద్దరూ కళ్ళార్పకుండా స్వామినే చూస్తూ అతను ఆద మరుపులో ఉండగా అతని చేతిలో బాలు తీసుకొని అక్కడనుంచి పరిగెత్తుకు పోయారు.

వెళ్ళేటప్పుడు వాళ్ళు వెనక్కి తిరిగి  పెద్దగా అరుస్తూ నవ్వుతూ, గెంతుకుంటూ  వెళ్లిపోయారు.

వాళ్ళు అరుస్తున్న మాటల్లోంచి ఒక ఆణిముత్యం లాంటి మాట వినిపించింది స్వామికి.

అప్పుడే సూర్యాస్తమయం అవుతోంది, ఆ ఎర్రటి  వెలుగులో స్వామి మొఖం దేదీప్యమానంగా వెలిగిపోసాగింది.

తనకొక మార్గం దొరికినట్లయింది.

*  *  *

కొండల కింద వున్న ఆ ఎర్రమట్టి నేల బంగారమైపోయింది,బంగారం ఆకాశంలోకి వెళ్ళిపోయింది, మనుషులు పాతాళానికి దిగజారిపోయారు. చెట్టూ పుట్టా చేమా అధోగతి పాలైపోయాయి మనుషులు చెరబట్టడం వలన. భూమ్మీద ఎండాకాలం తప్ప మరోకాలం లేనట్టు పోయేకాలం లాగా ఎండలు ఇరగ కాసేస్తున్నాయి.  మనుషులకు అన్ని రకాల పిచ్చి పట్టుకుంది. పిచ్చి వాళ్ళు కాబట్టి ఈ పిచ్చి వున్నదో ఎవడికీ తెల్వకుంటుంది, ఎవడైనా ఎవడికైనా నీకీ పిచ్చి వుంది అంటే ఆడ్ని కరిసీసీ బ కి రీ డం చేస్తున్నారు. అలా కాలం దొర్లిపోతా ఇరవై ఏళ్ళు గడిచి పోయింది..

.* * *

విశాఖపట్నం ఏర్పోర్టులో దిగేటప్పటికీ ఊరంతా ఒకటే ఉక్కపోత, ‘ఎలా వుంటున్నార్రా నాయనా? ఈ ఊర్లో స్టవ్వు మీద నీళ్లే సి కోడిగుడ్డు ఉడకబెట్టినట్లు వుడికిపోతున్నాం ‘ అన్నాడు గుబ్బల గిర్నాధ్.

‘ మనం వున్నా ఊరేనా ఇది ‘ అనిపిస్తోందిరా అన్నాడు అప్పలనా యిడు

ఇద్దరూ ఆ త్రి స్టార్ హోటల్లో  దిగి, కాసేపు పడుకొని లెగిసి, తిన్నాక ఆ సాయంత్రం తాము వెళ్లాల్సిన చోటుకు బయలుదేరారు. కింద హోటల్ వాడు తెప్పించిన కారు , డ్రైవరు సిద్ధంగా వున్నారు.

‘ కర్షకశక్తి నగరుకు పోనీయి వూరికి దూరంగా పదారు కిలోమీటర్ల దూరం లో వుంటాది అది, గూగుల్ మ్యాప్స్ లో కొడుతుంటే కనీసం దాని పేరు చూపించటం లేదు ‘ అన్నాడు గిర్నాదు.

‘ఇంకో లాండు మార్కు చెప్పండి సార్, ‘ అన్నాడు డ్రయివరు.

‘ ఆ వూరు పెందుర్తి రైల్వే స్టేషన్ ని ఆనుకొని వుండేదయ్యా ‘ అన్నాడు అప్ప.

‘ వో అదా, మీరింకేమి చెప్పకండి, అలా కాము గుండండి, నాను దిగబెడీస్తాను. ‘

‘ సరే , మెల్లగా వెళ్లు, ఈ వూరు  వొచ్చి  ఇరవైయేళ్లు అయ్యింది ‘ అన్నాడు గిర్నాధ్.

‘ ఇరవైయేళ్లు తర్వాత వొచ్చేరా ,? ఎంత ఆశ్చర్యం?’

‘ అవునారా  నాయనా  ఇన్నాళ్లు డబ్బులు సంపాదించడానికి దేశాలు పట్టిపోయాం, మా పెద్దలు దివాళా తీసాక, ఈ వూరు దాటిపోయాం ‘ అన్నాడు అప్ప.

‘ వో అదా, మీరింకేమి చెప్పకండి, అలా కాము గుండండి, నాను దిగబెడీ స్తాను. ‘ అన్నాడు డ్రైవరు. వాడు అన్నీ తనకే తెలుసనుకునే డిప్ప అని ఈళ్ళిద్దరికీ అర్ధమయ్యి మరింకేమి మాట్లాడలేదు.

కాసేపు కార్లో మౌనం.

ఊరంతా ఫ్లై ఓవర్లు,  పాచ్చీలు  వేసినట్లు , అలలు అలలుగా రోడ్లు, ఇవికాక ఎక్కడికక్కడ పెద్ద పెద్ద కొండల్లాంటి స్పీయేడు బ్రేకర్లు. అయినా జనం ఈ మాత్రం తక్కువ వేగంతో పోవటం లేదు, వీళ్ళకేమైనా మెంటలా ఇలాంటి పరిస్థితుల్లో బతికేస్తున్నారు అనుకున్నాడు. ‘ఖచ్చితంగా రోజుకొకరు ఈ రోడ్లకు పలహారమైపోవడం ఖాయం ‘ అన్నాడు అప్ప.

ఊరంతా మారిపోయింది, ఒకప్పుడు ఒకటే రోడ్డు దారికి అటూ ఇటూ నీడనిచ్చే పెద్ద పెద్ద చెట్లు, తాటితోపులు, ఎక్కడ చూసినా అపార్టుమెంట్లు.

ఎడం వైపుకి చూస్తున్న గుర్నాధ్ కి  కొంతమంది రోడ్డు మీద తమలో తామే మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వెళ్తున్నారు. బహుశా బ్లూ టూత్ చెవిలో ఉండి ఉంటుందిలే అనుకున్నాడు. మనం మాత్రం అలా చేయకూడదు చూసేవాళ్లకు బాగుండదు,చేత్తో ఫోను మాట్లాడుకుంటూ వెళ్లడమే సుఖం అనుకున్నాడు.

ఈలోగా ఆరులేన్ల రోడ్డు నుంచి  కారు మలుపు తిరిగి ఒక అరవై అడుగుల రోడ్డు బాట పట్టింది.

అంతే  రోడ్డుకు కుడివైపు వున్న దృశ్యం చూసి, అప్ప, గుర్నాదు  ఒక్కసారిగా కెవ్వు మని కేకేసి ..’ ఆపు.. ఆపు ..ఆపు’ అని గట్టిగా అరిచారు. డ్రైవరు గాభరాగా ‘ సార్ ఎందుకు అంత గట్టిగా    అరుస్తారు. నాకసలే గుండెపోటు, షుగరు, బీపీ, మూలశంక అన్నీ వున్నాయి, నాకేమైనా అయితే మా ఫ్యామిలీ గతేటి కాను. ‘ అన్నాడు సిరాగ్గా.

అతని మాటేమీ వినిపించుకోకుండా  ఆగిన ఆ కారులోంచి పరుగు పరుగున ఆ ఆశ్రమం లోకి పరుగు పెట్టారు.

అలా వేగంగా లోపలి వెళ్తున్న వాళ్ళిద్దరినీ ఆశ్రమ సిబ్బంది గట్టిగా పట్టేసుకున్నారు.

‘ మేము.. మేము.. వేరే దేశం నుంచి వస్తున్నాము..  స్వామీజీ ని కలవాలి .. చాలా అర్జెంటు.. అంటే అర్జెంటు  ‘ అన్నారు.

‘ వేరే దేశమా అయితే డాలర్లో ..దీనార్లో తెచ్చి వుంటారు పదండి పదండి’ అని వాళ్ళని తీసుకెళ్లి వి ఐ పి గదిలో కూర్చోపెట్టి, చల్లని నీళ్లు ఇచ్చారు.

కాసేపటికి ఆయాసం తగ్గిన వాళ్ళకి చేతిలో ఒక కర్ర , దానికి ఒక జెండా కట్టుకొని యెర్ర బట్టలేసుకున్న స్వామీజీ వొచ్చారు.

‘ ఎవరు నాయనా మీరు? మీకేం కావాలి? కొర్పొరేటర్ టికెట్టా ? నామినేటేడ్ ? లేక లాండ్ సెట్టిల్ మెంటా ? ఏదైనా సరే దైవకార్యమే, భక్తి శ్రద్ధలతో చేద్దాము ‘ అని నిదానంగా అని అక్కడ పీఠంపై కూర్చున్నారు. కాళ్ళు తీసి ఎదురుగా వున్న ఎత్తైన ఒక పీటపై పెట్టారు.

మీకు వీలయితే ఒంగొని దణ్ణమెట్టుకోండి నాయనలారా అన్నట్టు కాళ్ళు ఎదరకు పెట్టారు.

అదంతా పట్టించుకోకుండా అప్ప, గిర్నాధ్ ఒక్కసారే అందుకొని ‘ మేము స్వామీ చిన్నపుడు ఇక్కడ కిర్కెటు బాలాట ఆడితే మీరు కిరికెటుబాలోపదేశం చేసారు , గుర్తుందా ? ఆ తరువాత మేము ఇక్కడ్నుంచి దేశాలు పట్టిపోయాం, అడ్డమైన ఉద్యాగాలు, వ్యాపారాలు చేసాము, ఒకసారి చిన్నపుడు పెరిగిన వూరు చూద్దామని ఇలా వొస్తుంటే మీ ఆశ్రమం కనపడింది, ఆనాటి అరవై గజాల పాక ఇప్పుడు అరెకరం విస్తీర్ణంలో ఎంత బాగుందో ‘ అన్నారు.

స్వామి చిద్విలాసంగా నవ్వి ఊరుకున్నారు.

‘ఈ వ్యాపారాలన్నీ బోరుకొట్టాయి, మేము కూడా మత వ్యాపారంలోకి వొచ్చేస్తాము మాకో ఫ్రాంచైజీ ఇప్పించండి కాదనకండి ప్లీజ్’ అన్నాడు అప్ప.

‘ నాయనా చిన్నపుడు నా మాట విని బాగుపడిన వాళ్ళుగా చెబుతున్నాను, ఈ వ్యాపారం చాలా బిజీ అయిపొయింది, చూసారుగా దారంతా ఎన్ని చర్చీలు, కూటములు ఉన్నాయో, ఒక వూర్లో ఎన్ని గుళ్ళు ఉన్నాయో, మీ చిన్నపుడు ఇక్కడిలా ఏడ్చి చచ్చిందా? ‘

‘అసలు మీరు ఇంత గొప్పవాళ్ళు ఎలా అయ్యారో వివరంగా చెప్పండి స్వామి’ అన్నాడు గిర్నాధ్.

‘వివరమూ లేదు క్షవరమూ లేదు, మనిషికి  తన దగ్గరున్నది పోతుందని భయం ఎక్కువ, కొందరికి ఆరోగ్యం సంకనాకిపోద్దని భయం,  మరికొందరికి వున్న ఆస్తి ఎక్కడ దాయాలో అని భయం’ అని  ఆగి ఎదురుగా వున్న రాగిచెంబులో నీళ్లు తాగేరు.

గుర్నాదు చెంబు వంక ఆశ్చర్యంగా అనుమానంతో చూస్తుంటే ..’ అలా చూడకు నాయనా అది నీరే , మ రేటి కాదు ‘ అనీసి తిరిగి  ఇందాక ఆపిన విషయాన్ని  తిరిగి చెప్పడం మొదలెట్టారు.

‘లంచాలు బుక్కీవోడికి దొరికిపోతాడనే భయం, అధికారం లో ఉన్నోడికి అది పోతోందని భయం, ఇవేమీ లేని వాడికి వూరికే భయం , వాళ్ళ భయాలే మన అభయం.’ అన్నారు స్వామి గెడ్డం బకురుకుంటూ..’ గెడ్డంలోంచి ఒక పెను స్వామి అరచేతులోకి వొచ్చింది.

అమ్మనీ నా రక్తం తాగేస్తున్నావా అని దాన్నలాగే కుర్చీకేసి అదిమిపెట్టి బొటనవేలి గోరుతో చంపేశారు.  తర్వాత ఎదర  భక్తులున్నారని గ్రహించి నాలుక్కరుచుకుని గంభీరంగా మొహం పెట్టారు.

‘ ఇందులోకి రాకండి ఇది పులి మీద సవారీ..ఇదిగో ఈ పేనులాగే ఒకనాడు చస్తారు  ‘అని జ్ఞానోపదేశం చేసారు.

‘ ఏదైమైనా ఆరోజు మిమ్మల్ని వెళుతూ వెళుతూ నవ్వుతాలకి గెడ్డలో స్వామి ..గెడ్డలో స్వామి అని ఎగతాళి చేస్తూ వెళ్ళాము, కానీ మీరు ఈ రోజు గెడ్డలో స్వామి ఆశ్రమం కట్టి ఇంత గొప్పవాళ్ళు అయ్యారు.మిమ్మల్ని బాధ పెట్టుంటే మమ్మల్ని క్షమించండి  ‘అన్నారు ఏదో కూడా బలుక్కొని మాట్లాడినట్లు.

‘క్షమాపణలు దేనికి నాయనలారా , బాల వాక్కు బ్రహ్మ వాక్కు అన్నారు , గెడ్డలో స్వామీ గా నేను చరిత్రలో నిలిచిపోతాను, నాకోసం రాజకీయనాయకులు లైన్లో వేచి యున్నారు, ఏదైనా వూరు వెళితే ఫ్లైట్ లో వెళతాను, బయటకు బయలు దేరితే చక్కని సుతిమెఎత్తని ఏ సి బండి, హాయైన విశ్రాంతి,రేపు నేను చనిపోయినా…..’ అనగానే తలుపు తీసిన చప్పుడయింది, ముగ్గురూ అటువైపు చూసారు.

ఇంతలో ఆశ్రమ సిబ్బందిలో ఒకడు ఇందాక వీళ్ళను గేటు దగ్గర పట్టుకున్న వాడు వొచ్చాడు, వైట్ అండ్ వైట్ డ్రెస్సు వాడు ‘ స్వామీ భక్తులు తెచ్చిన సూట్ కేసు కార్లో ఉందా? దాన్నేమైనా భద్ర పరచమంటారా ?’ అని చాలా వినయంగా అడిగాడు.

‘ అక్కర్లేదు నాయనా వీళ్ళు ఒకప్పటి మన శిష్యులే .. నా హితోపదేశం కోసం వొచ్చారు , నువ్వు వెళ్ళు అన్నారు.

మళ్ళీ వీళ్ళ వైపు తిరిగి .. ‘ఆ ఏంటిది.. హా.. రేపు నేను చనిపోయినా నేను చెప్పిన గెడ్డలో  స్వామి కథలు, సూక్తులు, సుభాషితాలు పుస్తకాల రూపంలో చిరస్థాయిగా నిలిచిపోతాయి, నాకు ఈ ఆశ్రంలో విగ్రహం ఉంటుంది, నా ఫోటోలు బయట అమ్ముతారు, అదంతా నా తదనంతరం నా ట్రస్టు చూసుకుంటుంది, నాకంత కంటే ఏం కావాలి, నా జన్మ సుఖాంతమయ్యింది  ‘ అని ఇద్దరినీ ఆశీర్వదించి, అయినా వాళ్ళు తన కాళ్లకు దణ్ణం పెట్టకపోవడంతో కళ్ళు వెనక్కు తీసుకొని లేచి

ఏ సి గదిలోకి పోయి తలుపేసుకున్నారు.

అప్ప, గుర్నాధ్ ఆశ్రమం బయటకి మెల్లగా వొచ్చి ఆనాడు తాము క్రికెట్టు ఆడుకున్న స్థలంలో కట్టిన ‘గెడ్డలో స్వామి ఆశ్రమం’ అన్న ఆర్చి చూస్తూ , స్వామి కి ఆ రోజు అలా తాము అరుచుకుంటూ వెళుతూ  పేరు పెట్టిన అదృష్టం తమకే దక్కినందుకు ఆనందిస్తూ పెందుర్తి స్టేషను వైపు వెళ్లిపోయారు, సిగరెట్లు కాల్చుకుందుకు.

*

హరివెంకట రమణ

రచయిత కుదురుగా ఓకే చోట పనిచేస్తే ఎలా ? అందుకే పత్రికా రంగం లో మొదలయ్యి యానిమేషన్ లో పనిచేసి తరువాత యెన్. జీ. ఓ రంగంలో పిల్లల హక్కులు, విద్య,సంరక్షణ అంశాలపై పనిచేస్తున్నాను. చదువేమో తెలుగు, సోషల్ వర్క్ లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్సు.
'బర్మాకేంపు కథలు '( ఈ మధ్యే పుస్తకం గా వొచ్చింది ) ఇంకా స్కూలు అనుభవాలు ' మా బడి కథలు ' గా వొచ్చేయి మరో పదిహేను కథలు పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. పాతికేళ్లుగా వ్యంగ్య రాజకీయ చిత్రకారుడిగా ఫ్రీలాన్సరుగా ఉంటూ మూడు కార్టూను పుస్తకాలు ప్రసవించాను. ( హరి కార్టూన్లు, జగమేమాయ, ఇదీలోకం)

భారత ప్రభుత్వ యువజన అవార్డు 2012 లో అందుకుని, 2022 లో అమెరికా ప్రభుత్వ ఆహ్వానంపై మానవ అక్రమరవాణా అంశంపై అధ్యయన యాత్రకు నెలరోజుల పాటు పర్యటించిన నేను పత్రికల్లో విద్య, బాలల అంశాలపై వ్యాసాలు కూడా రాస్తుంటాను.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు