గుల్ఫారం గంగన్న

“కథలపొద్దు” శీర్షికకు mynameissaivamshi@gmail.com కి రచనలు పంపించండి.

గంగన్నకు ఓ యాభై యేండ్లైతే ఉంటయి. గంగన్న చిన్నగున్నప్పుడే అయ్య, అవ్వ సచ్చిపొయిన్లు. కొన్నేండ్లు మేనత్త దెగ్గరే పెరిగిండు. కొంచెం పెద్దగై, ఊహ దెల్శినంక దుబాయి పోయిండు. ఆడ్నే కొన్నేండ్లు పన్జేశి, ఇన్ని పైసలు జమ జేస్కొని ఇంటి మొకం పట్టిండు. చేతులు దుల్పుకోనీకి ఊర్లనే ఒక పిల్లను జూసి పెల్లి జేసింది మేనత్త. భార్య నర్సమ్మ. చిన్నగున్నప్పటి నుంచి గంగన్నను చూస్కుంట పెరిగింది. మనిషిని మంచిగనే అర్థం జేస్కునేది. రెండేండ్లకు ఒక బిడ్డె పుట్టింది. బిడ్డె సదూకునేదాక సదిపించి, మంచి పిల్లగాణ్ని చూసి పెండ్లి జేసిండు. అల్లుడు మంచిగ సదుకున్నోడే. పెండ్లైన రెండేండ్లకు భార్యను అమెరికా తోల్కపోయిండు.

ఇంటికాడ నర్సమ్మకు పానం ఉషారు లేక మంచం మీద పడ్డది. బిడ్డె రానీకె వీలు కాలే. దెగ్గరుండి చూస్కోనికి గంగన్న ఒక్కడే. గంగన్న పెళ్ళి అయిన్నుంచి నర్సమ్మకు భర్త లెక్క, తండ్రి లెక్క బాధ్యత తీస్కున్నడు కానీ, ప్రేమ సూపియ్యలే. అట్లని ఇష్టం లేక కాదు, ప్రేమ లేక కాదు, ఎట్ల సూపియ్యాలో తెల్వక! ఎందుకు తెల్వదీ? ఆ ప్రశ్నకు జవాబేంది? ఏ మనిషికైన కొన్ని అవసరాలుంటయి. అండ్ల తోడు, ప్రేమ. శిన్నగున్నప్పుడు అయ్య, అవ్వ, వయసులున్నప్పుడు దోస్తులు, ప్రేమించిన పిల్ల. పెద్దగయినంక పిల్లలు, కుటుంబం, బాధ్యతలు.. ఇవన్ని వద్దన్నా ఉంటయి. ఈ జీవితం ఎట్ల గడిపితే ముసలితనం అట్ల ఉంటది. మనిషి సంపాయించిన ఆస్తి, పిల్లల్ని చూస్కున్న తీరును బట్టి ముసలితనపు జీవితం ఉంటది. అత్తమామల్ని మెచ్చని కోడలు అస్తే ఆ ముచ్చట వేరే. గంగన్న విషయంల ఇవన్ని కొంచెం కింద మీద అయినయి.

గాయన బాల్యం ఓ విషాదం. ఆ మనిషికి అర్థమయ్యేలోపే వయసు అయిపొయ్యింది. పైసల కోసం దుబాయిల దునియాతో ఉరికిండు కానీ, ఇప్పటివరకు దునియా నుండి ఏం పొందిండు? ఆ మనిషి మీద ఎవలూ ప్రేమ చూపియ్యలే. కావట్టే ఆయన బతుకులకు అచ్చిన మనుషుల మీద ప్రేమ చూపియ్యనికె ఆయనకు తెల్వకపాయె.

నర్సమ్మకు గంగన్న గురించి తెల్సు కావట్టి ఎప్పుడు ఏమనలే. మంచం మీదున్నప్పుడు గూడా గంగన్న గురించి రంధి పెట్టుకుంటుండే. అసుంటి నర్సమ్మ సచ్చిపోయింది. బిడ్డ ఎంటనే అమెరికా నుండి అచ్చింది. నాయనను పట్టుకొని గొడగొడ ఏడ్సింది.

గంగన్న నోట్లకెళ్ళి ఒక మాట తియ్యలే, కన్నెంట నీళ్లు రాలే. జీవితంల ముఖ్యమైనవి పోగొట్టుకునుడు అలవాటైన మనిషి. ఇంకెంత కుంగుతడు? దినాల దాక ఉండి అయ్యను అటే అమెరికాకు పట్కపొత అన్నది బిడ్డె. రాను అన్నడు గంగన్న. అటు మొగడు, ఇటు అయ్య… మధ్యల సతమతమైంది. ‘నువ్ గిట్ల దిమాక్ కరాబు చేస్కోకు. నేను అల్లుడింట్లె ఉంటే మంచిగుండది. నువ్ ఈడ ఉండి అల్లుణ్ని నొప్పించుడు కూడ పద్దతి కాదు. నా మీద ఏం రంధి పెట్టుకోకు’ అని చెప్పి బిడ్డెను అల్లుడితో పంపిచ్చేసిండు.

ఏడైతే మొదలువెట్టిండో ఆడికే అచ్చిండు. అప్పుడు కసురుకొనో, పుసురుకొనో బుక్కెడు బువ్వపెట్టనీకె మేనత్త ఉండే. ఇప్పుడు ఆ దిక్కు కూడ లేకపాయె. ఇంగ తెల్లారి లేసుడు, బుక్కెడు అండుకొని తినుడు, పండుకునుడు. అదే పనయ్యింది గంగన్నకు. కొన్ని దినాలకు ఇసుకు పుట్టింది. ఒకనాడు గల్లీల ఉన్న చాయి హోటళ్ల కూసుంటే వరుసకు బామ్మర్ది అయెటోడొకడు కల్సిండు. దా బావా అనుకుంట తాళ్ళల్లకు పట్కపోయిండు.

గంగన్న ఇప్పటివరకు కల్లు తాగలే. గంగన్న అయ్య, అవ్వ సచ్చిపొయింది ఆల్ల అయ్య కల్లు అలవాటుతోనే. గంగన్న చిన్నగున్నప్పుడు ఇంటికాడుంచి అవ్వ తోట్లకు పోయింది. అయ్య పొద్దుగాల్లనె కడుపు నిండ కల్లు తాగి తోట్లకు పోయిండు. ఆడ అవ్వకు పాముకుట్టి భూమి మీద పడి బురుసులు కక్కుతున్నది. మనిషి మత్తుల ఉన్నడు. ఏం జెయ్యాలో నెత్తికి ఎక్కలే. ఆమెను అట్లనే ఎత్తుకొని తోవపోంటిరాంగ కాలుజారి బాయిల పడ్డడు. ఇద్దరూ సచ్చిపోయిన్లు. ఆ దినం అయ్య కల్లు తాగకుంటే గంగన్న జీవితం ఇంకో తీరు ఉంటుండె. అప్పుడే అనుకున్నడు కల్లు జోలికిపోవద్దని. కానీ ఇప్పుడు ముందట గుల్ఫారం గొబ్బ పొంగుతున్నది. తాగకుంటే నా మీద ఒట్టే అని బామ్మర్ది బలవంతం చేసిండు. ఒక్కసారి జీవితం అంత నెత్తిల గిర్రుమని తిరిగింది. కల్లు గొబ్బ చేతికి అందుకొని గుట్కాగుట్కా మొత్తం ఒకటే దెబ్బకు తాగేసిండు. ఆడున్న బామ్మర్ది ఇదంత చూసి నోరు తెరిసిండు. గంగన్న నెత్తి గుమ్మ్ అంటుంది. బామ్మర్ది గంగన్నను తోల్కపోయి ఇంట్ల పండబెట్టిండు. ఆ దినం సోయి లేకుంట అంతే పన్నడు. తెల్లారి లేసి చూస్తే కడుపుకు తిండి లేకపాయె. నెత్తి నొస్తున్నది. అడిగెటోడు, ఎవడున్నడు?

లేసి, మొకం కడుక్కొని, బువ్వ అండుకున్నడు. ఇంత పచ్చెకారం సర్సుకుని తిన్నడు. పానం కొంచెం నిమ్మలమైంది. నిన్నటి రోజు గురించి ఆలోచిస్తె ఏం లేదు. అట్ల సోయి లేకుండ పడిపోవుడు గంగన్నకు మంచిగనిపిచ్చింది. బతుకు మీద విసుకు పుట్టి, దరిద్రపుగొట్టు మనిషని తిట్టుకునే గంగన్నకు, రోజులో ఏం జరిగిందో గుర్తులేకపోవడం మంచిగనిపిచ్చింది.

అంతే! గుల్ఫారంకు అలవాటు అయ్యిండు. రోజూ తాగుడుకు ఎగవడ్డడు. ఆటమైన రోజు అండుకొని తిన్నడు. కాని రోజు అంతే పన్నడు. పొద్దుగాల్ల లేత్తెనే తాళ్ళల్లకు అడుగేసెటోడు. ఆ ఊర్ల ఇప్పుడున్న పోరగాన్లకి ఆ మనిషి గుల్ఫారం గంగన్న అనే తెల్సు. ఆ మనిషి బతుకుల ఏం చూసిండో ఆ పిల్లలకేం దెల్సు? ఇప్పటివరకు సమాజానికి అనుకూలంగ బతికిన మనిషికి ఏం మిగిలింది? 

గుల్ఫారం గంగన్న అనే బిరుదు! 

కొన్ని బతుకులు గంతే!

*

సినిమానే కారణం

  • హాయ్ మణి! మీ గురించి చెప్పండి.

మాది నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రం. నేను పుట్టి పెరిగింది అక్కడే. మా అమ్మానాన్న రైతులు. పదో తరగతి వరకు ఊళ్లోనే చదివి, ఆ తర్వాత బోధన్‌లో ఇంటర్మీడియట్ చదివాను. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి దాదాసాహెబ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో ఏడాది పాటు డైరెక్షన్ కోర్స్ చేశాను. ఇప్పుడు సినిమారంగంలో పని చేస్తున్నాను.

  • కథలు రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

అందుకు సినిమానే కారణం. సినిమాల కోసం కథలు రాసుకుంటున్న టైంలో నాకొచ్చిన కొన్ని ఆలోచనలు సినిమాలకు సెట్ అవ్వవేమో అనిపించింది. వాటిని కథలుగా రాస్తే బాగుంటుందని అనుకున్నాను. ‘అమ్మకు అరకిలోమీటరు దూరంలో’ అని మొదటి కథ రాశాను. ఆ తర్వాత ఒకే నెలలో మొత్తం 14 కథలు రాశాను. అందులో 13 కథలు మా ఊళ్లో నేను చూసిన అనుభవాలే! వాటిని యథాతథంగా రాశాను. ‘ఒఫేలియా’ అనే కథకు మాత్రం షేక్స్‌ఫియర్ రాసిన ‘హామ్లెట్’ నాటకం స్ఫూర్తి.

  • అన్ని కథలు రాసినా ఇప్పటిదాకా ఎందుకు ప్రచురించలేదు?

సాహిత్యంతో నాకున్న పరిచయం తక్కువ. మా ఊళ్లో లైబ్రరీ ఉంది. చిన్నప్పుడు అక్కడికి వెళ్లి చిన్నపిల్లల కథల పుస్తకాలు చదివేవాణ్ని. అప్పట్లో అక్కడ పెద్దవాళ్ల పుస్తకాలు కూడా ఉండేవి. కానీ అవి చదివితే అర్థమయ్యేవి కావు. అవన్నీ బాగా చదువుకున్నవాళ్ద కోసమే రాశారని అనిపించేది. హైదరాబాద్ వచ్చాకే సాహిత్యం గురించి ఎక్కువ తెలుసుకున్నాను. అందుకే కథలు రాసినా ఎక్కడా ప్రచురించలేదు.

  • ఇటీవల పుస్తకాలు చదువుతున్నావ్ కదా! నీ అనుభవంతో చెప్పు. పుస్తకాలు చదవడమనేది సినిమా రచనకు తోడ్పడుతుందా?

నేను ఇప్పటిదాకా చాలా తక్కువ పుస్తకాలే చదివాను. మొత్తం 20 లోపే. అందులో జి.కళ్యాణరావు గారి ‘అంటరాని వసంతం’ నవల, నాగేంద్ర కాశీ గారి ‘నల్లవంతెన’ కథలు బాగా నచ్చాయి. ఇంకా చాలా చదవాలి. పుస్తకాలు చదవడమనేది సినిమా రచనకు కచ్చితంగా తోడ్పడుతుందనే అనుకుంటున్నాను. సాహిత్యం చదవడం వల్ల చాలా విషయాలు తెలుస్తాయి. కొత్త పాత్రలు, పరిస్థితుల్ని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అది సినిమా రచనకు బాగా సహకరిస్తుంది.

  • ఇంకా ఏమేం రాయాలన్న ఆలోచన ఉంది?

ఇప్పటిదాకా రాసిన కథల్ని త్వరలో పుస్తకంగా తీసుకొస్తాను.

*

మణిరత్నం ఎం. ఎన్.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు