గుర్తు చేసుకుందాం- నవ్వుకుందాం

ఇష్టమైన విందు భోజనం ఇట్టే అరిగిపోయినట్లు, 80 పేజీల నవలిక చదవడం అట్టే ముగిసిపోతుంది పాఠకులకు

 కథా రచయితగా బాలసాహితీవేత్తగా ఆర్సీ కృష్ణస్వామి రాజు  ఒక దశాబ్ద కాలంగా విరివిగా రచనలు చేస్తూ, పుస్తకాలు ముద్రిస్తూ దినపత్రికలు, ఆదివారం మ్యాగజైన్స్, వెబ్ పత్రికలలో  ‘ఇందుగలడందులేడనే’ సందేహం రాకుండా ప్రవాహ వేగంతో రచనలు చేస్తున్నారు.

ఇప్పుడు ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ‘మునికిష్టడి మాణిక్యం’ గురించి. బాలల నవలిక ఇది. తానా- మంచి పుస్తకం వారు నిర్వహించిన బాలల నవలల పోటీలో ఎంపిక చేయబడిన అయిదు  నవలలో ఒకటి. (వెల 50 రూపాయలు, పేజీలు 80. ప్రతులకు 94907 46614)

ఈ పుస్తకం చదివితే.. ఎవరి బాల్యం వారికి గుర్తొచ్చి నవ్వుకునేటట్లు చేస్తుంది. ఆర్సీకే రాజు గారి శైలి, ఒరవడి, మాండలిక భాషా పదాలతో పల్లె ప్రజల జీవన వైవిధ్యాన్ని కళ్ళ ముందు ఉంచుతారు. నిపుణుడైన రచయితగా పాత్రలు వాటి సంభాషణలు అందుకు అనుగుణమైన వాతావరణాన్ని నేర్పుగా నిర్వహిస్తారు. రీడబిలిటీ ఉన్న కథలు, నవలలు రాస్తూ పలువురి దృష్టిని ఆకర్షించడమే కాదు, ఎన్నో సంస్థలు విశ్వవిద్యాలయాలతోబాటు ప్రభుత్వ పరంగాను సన్మానాలు, సత్కారాలు, అవార్డులు, నగదుబహుమతులు పొందుతున్న తిరుపతి వాసి. ఆయన పుట్టిన ఊరు పుత్తూరు కేంద్రంగా చేసుకొని శరవేగంగా సమాజం పైకి తన రచనలు వదులుతున్నారు.

‘మునికిష్టడి మాణిక్యం’ నవలికలో కథానాయకుడు అతడే! మరో అయిదుగురు సోపతిగాళ్లతో నడిపిన కథలో చివరలో మాత్రమే తెరపైకి వస్తుంది మాణిక్యం. మాణిక్యం అంటే అతడికి ఇష్టమైన కోడిపుంజు. రోజూ ఉదయం ఆ పుంజు కేకలు వినే అతడు నిద్రలేచి దైనందిన కార్యక్రమాలకు ఉపక్రమించేది. అంతటి ప్రాణ స్నేహితుడు కనబడకుండా పోతే మునికిష్టడు చేతులు కట్టుకుని ఎలా కూర్చోగలడు? అందుకే కలిసి వచ్చిన శ్యామల, మరో పంచ పాండవుల వంటి తన స్నేహితులతో కలిసి ఆ పల్లెలో మాణిక్యం ఉండటానికి అవకాశం ఉన్న ప్రదేశాలన్నీ జల్లెడ పట్టడం ప్రారంభిస్తారు ఆ మిత్ర బృందం.

ఇంతకూ కారణం ఏమిటి? ఎందుకు? ఎలా తప్పిపోయింది మాణిక్యం? అసలు ఉందా? ఫలహారం అయిపోయిందా? అనేది చివరి వరకు ఉత్కంఠతతో కూడిన వెదుకులాటలో ఆ రహస్యం విడిపోయాక పాఠకులు రిలాక్స్ అవుతూ ‘ఓస్! ఇందుకా మాణిక్యం అలిగిపోయింది…’ అని తెలుసుకొని హాయిగా నవ్వుకుంటారు. రాజుగారి రచనా వైలక్షణమంతా  బాల్యోచిత చేష్టలు, పెద్దల రూప స్వభావాలు, వెదుకులాటలో ఎదురయ్యే వ్యక్తుల స్పందన, వారి హావ భావ విన్యాసాలు పాఠకులకు పదేపదే గిలిగింతలు పెడతాయి.

పోస్ట్ ఆఫీస్ అయన ఇంటి ముందు జనం గుంపులు గుంపులుగా గుమికూడి ఉండడానికి కారణం మూడు కాళ్ల కోడి పిల్ల జననం. పల్లె జనం సాధారణంగా అలాంటి విషయాల పట్ల వేగంగా తీవ్రంగా స్పందించటం మామూలే! కొందరు అది త్రిశూలానికి గుర్తుగా భక్తి భావంతో చూస్తే, మరికొందరు అలా పుట్టడం అరిష్టం అంటారు. మన కిష్టడు మాత్రం ‘జన్యు లోపం వల్ల అలా పుడతాయని ఎందుకు తెలుసుకోరు? అనుకుంటూ తన ‘మిషన్’ మీద ముందుకు సాగుతాడు.

పల్లె జనాలు ఎవరైనా ఒక ప్రీతికరమైన మాట చెబితే ముచ్చట పడిపోయి చేతిలో ఏదో ఒక తినుబండారమో కాయో పండో పెట్టి పంపడం ఆనవాయితీ. దినపత్రికలోని వార్తలని ఎవరో ఒకరితో చెప్పకుండా ఉండబట్టలేని రిటైర్డ్ టీచర్ ఒకరు, ప్లేట్లోని ఇడ్లీలను చూసి ఒక పద్యం చెప్పగా చప్పట్లు కొట్టిన మునికృష్టడి చేతిలో రెండు లవంగాలు పెడతాడు.

మునికిష్టడు తెలివైన బాలుడు. దారిలో తనకు ఎదురైన వారిలోని అమాయకత్వం, అజ్ఞానాలకు తన మాటకారితనంతో చక్కని సలహాలు ఇస్తూ సాగిపోతుంటాడు. ‘సోషల్ అయ్యోరు తుక్కుతుక్కుగా కొట్టినాడు’ అని చెప్పిన సుందరం, బడికి ఎందుకు రావడం లేదో కారణం అడిగి, ‘మనం చదివేది మనకోసం, అయ్యోరు కోసం కాదు’ అని చెబుతాడు. అలాగే…  ‘తవ్వాలే కానీ ఈ మట్టిలో ఎన్ని మాణిక్యాలు’ అనుకునే సంఘటనలు కూడా అతడికి ఎదురవుతుంటాయి. మిత్రులు ‘కళ్ళు మూసుకుని నడుద్దాం వెరైటీగా’ అనుకుని దెబ్బల పాలైతే రామక్కవ్వ, ‘కళ్ళు తెరుచుకుని నడిస్తేనే గుంతలో పడుతున్నాం, ఇక మూసుకొని నడిస్తే గోవిందా!’ అంటుంది. దాంతో వాళ్ళు ‘అవ్వ మాట బంగారు బాట’ అనుకుని, ‘యాక్షన్ చేస్తే ఓకే గాని.. ఓవరాక్షన్ కూడదు’ అని మామూలుగా నడక సాగిస్తారు.

మరొక సందర్భంలో శంకరుడు మామిడి పిందెలకేసి తదేకంగా చూస్తుండడంతో.. న్యూటన్ లాగా  చెట్టు కింద పడుకొని ఉంటే, మామిడిపిందె  రాలితే, కొత్త సూత్రం ఏదైనా  కనిపెట్టగలనేమోనని అనుకుంటాడు. అయితే  వాడి నాన్న, పంచె ఎగ్గట్టి దుడ్డుకర్ర తీసుకుని పదహారో  ఎక్కం చెప్పలేడు గానీ సైన్స్ సూత్రాలు కనుక్కుంటాడంట’ అనడం దానికి ముగింపు.

బీట్రూట్ కూర ఇష్టపడని చంద్రడు, అన్నం రక్తపు ముద్దలా కనిపిస్తోందంటే ‘తింటే అంత రక్తం పడుతుందని ఎందుకనుకోవు?’ అని నచ్చ చెబుతాడు.

బెండకాయ కూర పెడితే లెక్కలు బాగా వస్తాయని ఎవరో చెప్పడంతో వారానికి రెండు సార్లు తినబెడుతున్నానని వాళ్ళ అమ్మ చెబుతుంది. తినే తిండి పనిచేయాలిగా! నిదానంగా మంచి మార్కులు తెచ్చుకుంటాడులే, అని శంకరుడు అంటే ఆ పిచ్చిమాతల్లిగింజ నాటిందే మొలకరాదు కదా, దేనికైనా కొన్నాళ్ళు ఎదురు చూడాలి కదా అని సర్ది చెప్పుకొని వాళ్ళకి సేమియా పాయసం చేసి పెడుతుంది. అది తిని “ఇక వెతుకుదాం పదండి, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చిరంజీవి మెగాస్టార్!” అని ఎగురుకుంటూ బయలుదేరుతారు మిత్ర బృందం.

మిత్రులందరికీ ఇంట్లో అక్షింతలు పడిన సందర్భాలను ముచ్చట్లుగా చెప్పుకుంటూ ముందుకు సాగుతుంటారు. వాళ్ళ మాటల సారాంశం.. మంచి జరిగినా చెడు జరిగిన ఇంట్లో వాళ్లకు చెప్పడం మంచిదని గ్రహించడం.

ఏటి నీళ్లలో స్నానం చేసినప్పుడు బాలాజీని జలగ పట్టుకుంటుంది. దానికి శంకరుడు భయపడవద్దని, అది చెడు రక్తాన్ని తాగేయడం వల్ల ఎన్నో చర్మవ్యాధులకు, సాధారణ రక్తప్రసరణ జబ్బులకు ‘లీచ్’ థెరపి గురించి చెప్పి మిత్రులను ఎడ్యుకేట్ చేస్తాడు. చంద్రుడు, అమ్మమ్మ చెప్పిన చిట్కా వైద్యం గుర్తొచ్చి నల్ల రంగన్న అంగడి నుంచి ఉప్పు రాళ్లు తెచ్చి ఉప్పు పట్టి వేయడంతో జలగ మెల్లగా ఊడి పడిపోతుంది. దాంతో అందరూ చొక్కాలెగరేసి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు.

వారి దారిలో… తరువాత మజిలీ శకుంతల అక్క ఇంటిదగ్గర. ఆమె నిమ్మరసం ఇచ్చి అంతా మంచే జరుగుతుందనే అనుకోవాలి. చెడ్డ ఆలోచనలని దూరంగా పెట్టాలి. దేనికైనా మనసే ప్రధానం’ అంటూ కోడి దొరుకుతుందనే నమ్మకాన్ని కలిగి ఉండాలనే పాజిటివ్ నెస్ వారిలో పెంచుతుంది. శకుంతలకు చెల్లెలైన శ్యామల బాధకు పరిష్కారం చెప్పడంతో ఆ పిల్ల తమలపాకులు తలా ఒకటి ఇచ్చి తేనె అందులో పోసి తాగమంటుంది.

టీమ్ లో ఒక ఆడమనిషి ఉంటే మంచిదని భావించిన మునికిష్టడు శ్యామలను తమ టీమ్ లోకి ఆహ్వానం పలుకుతాడు. శ్యామల స్కౌట్ డ్రెస్ షూస్ వేసుకొని టోపీ పెట్టుకుని అక్క ఇచ్చిన విజిల్ వెదురు కర్ర చేతబడుతుంది. దారిలో శ్యామల చెప్పిన కబుర్లు విని మిత్రులు ఆమె అమాయకత్వానికి లోలోపల నవ్వుకుని, నువ్వు అమెరికాలో పుట్టవలసిన దానివంటే ఆ పిల్ల తెగ సిగ్గు పడిపోవడాన్ని చూసి, శ్యామల చూడకుండా చెట్టు వెనక్కి వెళ్లి ‘డబుస్కు డబుస్కు డబుక్స్’ అని డాన్స్ చేసి వస్తారు. చదువుతున్న పాఠకుడు మరొకసారి మనసారా నవ్వుకుంటాడు.

అంతలోనే శ్యామల మరొక సందేహం వెలిబుచ్చుతుంది. అది తనకు కలలు రంగుల్లో రావడంలేదని, అంతేకాకుండా ఆ కలల్లో అందరూ కనిపిస్తారు కానీ నాకు నేను కనిపించను, మీకూ అంతేనా? అని అడుగుతుంది. వాళ్లు కూడా ‘సేమ్ టు సేమ్’ అని చెప్పడంతో శ్యామల ముఖం పున్నమిలా వెలిగింది అంటాడు రచయిత.

అటు తరువాత శ్యామల రైలులో వెళుతున్న వాళ్లకి ‘టాటా, హాయ్’ లు చెబితే వచ్చిన రెస్పాన్స్ మగ పిల్లలు చెబితే, ఒకరూ చేయి ఊపరు. అప్పుడు బాలాజీ గాడు అసూయగా ‘ఇప్పుడు ఆడోళ్ళదేరా రాజ్యం. మగవాడై పుట్టే కంటే అడవిలో మానై పుట్టేది మేలేమో అనే రోజులు వస్తాయేమో?’ అని అంటాడు.

దారిలో చెరుకు తోటలో రామయ్య తాత ఇచ్చిన చెరుకు ముక్కలు తిని, పారే నీళ్లల్లో చేతులు కడుక్కుని సర్రున వెళ్తున్న చేప పిల్లలు చూస్తుండగా బాలాజీ గాడు- ఆ చేప నన్నే చూస్తా ఉందిరా అంటే, శంకరుడు అది జలకన్యై ఉంటుంది నిన్ను ఇష్టపడిందేమో! అని చతుర్లాడతాడు. అక్కడే ఉన్న అత్తిపత్తి ఆకులకు తన చేతులు తగిలి ముడుచుకు పోవడం చూసి, అది తనను చూసి భయపడుతోంది అంటుంది శ్యామల. మునికిష్టడు దాన్ని సిగ్గాకు అంటారంటే, బాలాజీ గాడు దాన్ని అత్తిపత్తి మొక్క అంటారని చెబుతాడు.

రామయ్య తాత వేసిన పొడుపు కథలను వారు విప్పలేక పోతే.. అది సరే మీరు పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నారు? అని అడిగితే, వాళ్ళు చెప్పిన సమాధానాలు మరొకసారి పాఠకుల మొహంలో చిరునవ్వులు పూయిస్తాయి. చివరగా రామయ్య తాత పెద్ద చదువులు చదివితే మీ ఆలోచనల్లో మార్పులు వస్తాయి. చదువుకు మించిన ఆస్తి లేదని, చివరిదాకా వచ్చేది చదివేనని’ చెప్పి అరటి చెట్టును చూపిస్తూ దానిలో పనికిరాని భాగమే లేదని, సంఘానికి కొద్దో గొప్పో ఉపయోగపడినప్పుడే మన పుట్టుకకు సార్థకత అని చెబుతూ తలా ఒక అరటిపండు చేతిలో పెడతాడు.

అంతలో… అటుగా వెళుతున్న ఆర్.ఎం.పి డాక్టర్ ఏదో యుద్ధానికి వెళుతున్నట్లు ఉన్నారే.. అని అరా తీసి, శల్య వైద్యశాల పరిసరాల్లోని చెత్త కుప్పలు దగ్గర వెతకమని సలహా ఇస్తాడు. అంతలో చీకట్లు ముసురుకోవడంతో పిల్ల సైన్యం నిరాశగా వెనుతిరిగే సమయంలో కిష్టడి తల్లి నారాయణమ్మ కూడా అక్కడికి చేరుకుంటుంది.

అప్పుడే మాణిక్యం కిష్టడి కంటపడుతుంది. దాని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడబోతే, అది మూతి తిప్పుకుంటుంది. ‘ఎందుకు ఇంత కోపం? నేనేం  చేశాను?’ అనుకుంటుండగా దాని రెక్కల చప్పుడు విని.. అప్పుడు గుర్తొస్తుంది, మునికిష్టడికి.. పొద్దున్న మాణిక్యానికి చీకట్లో కళ్ళు కనపడక రెక్కలు కొడుతూ తన దుప్పటిపై వాలినప్పుడు.. ఎప్పుడూ మెడ పట్టి దగ్గరకు తీసుకునే తాను, ‘పోయే ఎదవ’ అని దాన్ని పక్కకు తోసేయడం గుర్తుకు వస్తుంది.

అందుకే అలా అలిగి వెళ్లిపోవడం కాబోలు అనుకుని మాణిక్యాన్ని క్షమించమని కోరతాడు. అయినా బెట్టు సడలించని దాని బిరుసుతనాన్ని చూసి తల్లి నారాయణమ్మ, “ఏంది మాణిక్యం? ఊర్లో మా పరువు తీస్తా ఉండావే!” అని నిష్టూరంగా అంటుంది. ఆమె మాటలకు మెత్తబడి శాంతించి, తన కాలుని మునికిష్టడి చేతికి ‘షేక్ హ్యాండ్’ అన్నట్టు ఇస్తుంది. అంతే! దాన్ని తలపై పెట్టుకుని తిరుగుముఖం పడతారు మిత్రబృందం. అప్పుడు మాణిక్యం పల్లకిలో ఊరేగుతున్న రాజకుమారుడిలా ఫీలయినట్లు రచయిత వ్యాఖ్యానిస్తాడు.

ఇక నవలకు ముగింపుగా, తల్లి నారాయణమ్మ, జడలో ఉన్న అరమూర మల్లె దండను మాణిక్యం మెడలో వేస్తుంది. శ్యామల తన జడ రిబ్బన్  వెదురు కర్రకు కట్టి విజయ పతాకంగా దాన్ని ఎగరేస్తుంది.

వారం రోజులు తర్వాత మునికిష్టడు తల్లి, మిత్రబృంద విజయాన్ని పండుగ చేస్తూ అందరికీ వేడి వేడి అన్నంలో కోడిగుడ్ల పులుసు వడ్డిస్తుంది.

ఇష్టమైన విందు భోజనం ఇట్టే అరిగిపోయినట్లు, 80 పేజీల నవలిక చదవడం అట్టే ముగిసిపోతుంది పాఠకులకు. సంతృప్తిగా చిరునవ్వులు ముఖంలో చిందులు వేస్తుండగా, పుస్తకం చదవడం ముగించి కళ్ళు మూసుకుని నవలలోని ఘట్టాలను స్మరించుకుంటారు, చిరు దరహాసాలు ఒలకబోస్తారు.  మంచి పుస్తకం చదివామన్న దానికి అదే గుర్తు కదా!

*

ఆకుల మల్లేశ్వర రావు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు